కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము”!

“ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము”!

“ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము”!

పన్నెండు మంది వేగులవారు వాగ్దాన దేశమంతటా సంచరించారు. అక్కడి నివాసులను గమనించి, ఆ దేశంలో పండే పంటలోని కొంతభాగాన్ని తీసుకురమ్మని మోషే వారిని ఆజ్ఞాపించాడు. ఏ పంట వారి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది? వారు హెబ్రోనుకు కొంతదూరంలో ఒక ద్రాక్షతోటను చూశారు, ఆ తోటలోని ద్రాక్షపండ్లు ఎంత పెద్దగా ఉన్నాయంటే, కేవలం ఒక్క గెలను మోయడానికే ఇద్దరు వేగులవారు కావాల్సివచ్చింది. ఆ పంట ఎంత బాగుందంటే వేగులవారు ఆ సారవంతమైన ప్రాంతానికి “ఎష్కోలు లోయ” లేదా “ద్రాక్షగెల” అని పేరు పెట్టారు.​—⁠సంఖ్యాకాండము 13:​21-24; అధస్సూచి.

పంతొమ్మిదవ శతాబ్దంలో పాలస్తీనాను సందర్శించిన ఒక వ్యక్తి ఇలా నివేదించాడు: “ఎష్కోలు, లేక ద్రాక్ష లోయ, . . . ఇప్పటికీ ద్రాక్ష తోటలతో నిండివుంది, అక్కడ పండే ద్రాక్షలు, పాలస్తీనాలోని అతిపెద్ద మేలిరకపు ద్రాక్షలు.” ఎష్కోలు ద్రాక్షచెట్లు మంచి ఫలాలను ఇచ్చినా, బైబిలు కాలాల్లో, పాలస్తీనాలోని అనేక ప్రాంతాల్లో మంచి ద్రాక్షలు పండేవి. ఫరోలు ద్రాక్షారసాన్ని కనాను నుండి దిగుమతి చేసుకునేవారని ఐగుప్తు గ్రంథాలు సూచిస్తున్నాయి.

“రాళ్లు కలిసివుండే ఇసుకనేలతోపాటు సూర్యరశ్మి ప్రసరించే [పాలస్తీనాలోని] కొండప్రాంతాలు, వేసవిలోని ఉష్ణోగ్రత, శీతాకాలపు వాననీరు వేగంగా పారే విధానం వంటివన్నీ ఆ ప్రాంతానికి ద్రాక్షచెట్ల దేశమనే ప్రత్యేకమైన పేరును తెచ్చిపెట్టాయి” అని ద నాచురల్‌ హిస్టరీ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం వివరిస్తోంది. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో దాదాపు వెయ్యిదాకా ద్రాక్షచెట్లు ఉండేవని యెషయా చెప్పాడు.​—⁠యెషయా 7:​23.

“ద్రాక్షచెట్ల దేశం”

ఇశ్రాయేలు జనాంగం “ద్రాక్షచెట్లు అంజూరపుచెట్ల” దేశంలో నివసిస్తారని మోషే వారికి చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 8:⁠8) బేకర్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బైబిల్‌ ప్లాంట్స్‌ ప్రకారం, “ప్రాచీన పాలస్తీనాలో ద్రాక్షచెట్లు ఎంత అధికంగా ఉండేవంటే దాదాపు త్రవ్వకాలు జరిగిన స్థలాలన్నిటిలో ద్రాక్ష విత్తనాలు దొరికాయి.” వాగ్దానదేశంలోని ద్రాక్షచెట్లు ఎంత ఫలవంతంగా ఉన్నాయంటే, నెబుకద్నెజరు సైన్యాలు యూదాను నాశనం చేసిన సా.శ.పూ. 607 సంవత్సరంలో కూడా ఆ దేశంలో మిగిలివున్న ప్రజలు “బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.”​—⁠యిర్మీయా 40:12; 52:16.

ఇశ్రాయేలు వ్యవసాయదారులు ద్రాక్షారసాన్ని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాలంటే వారు తమ ద్రాక్షచెట్లపట్ల చక్కని శ్రద్ధ తీసుకోవాలి. ఒక సాధారణ ఇశ్రాయేలు ద్రాక్షతోటమాలి “శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను” నాటే ముందు ఎలా కొండప్రక్కనున్న పొలాన్ని త్రవ్వి, పెద్ద రాళ్లను ఏరుతాడో యెషయా పుస్తకం వివరిస్తోంది. ఆయన నేల నుండి ఏరిన రాళ్లను ఉపయోగించి ఆ తర్వాత రాతిగోడను నిర్మించవచ్చు. అతని ద్రాక్షతోటను పశువులు తొక్కకుండా ఉండేందుకు, నక్కలు, అడవి పందులు, దొంగల నుండి దానికి కొంత రక్షణ కల్పించడానికి ఆ గోడ సహాయం చేస్తుంది. ఆయన ద్రాక్షతొట్టి తొలిపించి, ఒక చిన్న బురుజును కూడా నిర్మించవచ్చు, ద్రాక్షచెట్లకు అధిక సంరక్షణ అవసరమైన కోత కాలంలో ఆ బురుజు చల్లని నివాసస్థలంగా పనిచేయవచ్చు. ఈ ప్రాథమిక పనులన్నీ పూర్తైన తర్వాత ఆయన మంచి ద్రాక్ష కాపుకోసం ఎదురుచూడవచ్చు.​—⁠యెషయా 5:​1, 2. *

మంచి కాపు కాసేలా చూసేందుకు వ్యవసాయదారుడు తీసుకునే చర్యల్లో భాగంగా, అతడు దిగుబడిని పెంచేలా క్రమంగా ద్రాక్షచెట్లను కత్తిరిస్తాడు, కలుపు మొక్కలు, ముండ్లపొదలు, ముండ్లు పెరగకుండా ఉండేందుకు నేలను పారతో త్రవ్వుతాడు. వసంత రుతువులో వర్షాలు సరిగ్గా కురవకపోతే అతడు వేసవి నెలల్లో ద్రాక్షతోటకు నీళ్లుపెట్టవచ్చు.​—⁠యెషయా 5:6; 18:5; 27:​2-4.

వేసవి చివర్లో వచ్చే ద్రాక్ష కోతకాలం ప్రజలు ఎంతో సంతోషించే సమయంగా ఉండేది. (యెషయా 16:​10) మూడు కీర్తనల పైవిలాసములో “గిత్తీత్‌ అను రాగముమీద” అనే పదబంధం ఉంది. (కీర్తనలు 8, 81, 84) సంగీతానికి సంబంధించి అస్పష్టమైన భావంగల ఈ వాక్యం సెప్టాజింట్‌ వర్షన్‌లో “ద్రాక్షతొట్లని” అనువదించబడింది, ద్రాక్షల కోతకాలంలో ఇశ్రాయేలీయులు ఆ కీర్తనలను పాడేవారని అది సూచిస్తుండవచ్చు. ఇశ్రాయేలీయులు ద్రాక్షలను ఎక్కువగా ద్రాక్షారసాన్ని తయారుచేయడానికే ఉపయోగించినా, వారు తాజా ద్రాక్షలను తినేవారు లేక వాటిని ఎండబెట్టి ఎండు ద్రాక్షలుగా చేసుకునేవారు. వాటిని ద్రాక్షపండ్ల అడలుగా తయారుచేసుకోవచ్చు.​—⁠2 సమూయేలు 6:18; 1 దినవృత్తాంతములు 16:⁠3.

ఇశ్రాయేలు ద్రాక్షావల్లి

బైబిలు అనేకసార్లు దేవుని ప్రజలను ద్రాక్షావల్లిగా లేక ద్రాక్షచెట్టుగా వర్ణిస్తోంది, ద్రాక్షావల్లి ఇశ్రాయేలీయులకు ప్రాముఖ్యమైనది కాబట్టి అది సరైన రూపకాలంకారంగా ఉపయోగించబడింది. ఆసాపు, 80వ కీర్తనలో ఇశ్రాయేలు జనాంగాన్ని కనానులో యెహోవా నాటిన ద్రాక్షావల్లితో పోల్చాడు. ఇశ్రాయేలు ద్రాక్షావల్లి వేళ్లూని బలంగా పెరిగే విధంగా నేల సిద్ధం చేయబడింది. అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ దాన్ని కాపాడే గోడలు కూలాయి. ఆ జనాంగం యెహోవా మీద నమ్మకముంచడం మానేసింది, ఆ కారణంగా ఆయన తన రక్షణను దానినుండి ఉపసంహరించాడు. ద్రాక్షతోటను కొల్లగొట్టే అడవిపందుల్లాగే, శత్రు జనాంగాలు ఇశ్రాయేలు సంపదను కొల్లగొట్టడం ప్రారంభించాయి. ఆ జనాంగం తన పూర్వ మహిమను తిరిగిపొందేలా సహాయం చేయమని ఆసాపు యెహోవాకు ప్రార్థించాడు. “ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము” అని ఆయన వేడుకున్నాడు.​—⁠కీర్తన 80:​8-15.

యెషయా “ఇశ్రాయేలు వంశాన్ని” ద్రాక్షతోటతో పోల్చాడు, ఆ తోట మెల్లగా “కారుద్రాక్షలు” లేక కుళ్లిన పండ్లను ఫలించడం మొదలుపెట్టింది. (యెషయా 5:​2, 7) కారుద్రాక్షలు, పండించిన ద్రాక్షలకన్నా చిన్నగా ఉంటాయి, దానిలో గుజ్జు చాలా తక్కువగా ఉంటుంది, పండులో విత్తనమే పెద్దగా ఉంటుంది. కారుద్రాక్షలు ద్రాక్షారసం తయారుచేయడానికి గానీ, తినడానికి గానీ పనికిరావు, నీతి బదులు దుర్నీతిని ఫలించిన మతభ్రష్ట జనాంగానికి అది సరైన చిహ్నం. అలాంటి పనికిమాలిన ఫలాన్ని ఫలించడం ద్రాక్షావల్లి వ్యవసాయదారుని తప్పుకాదు. ఆ జనంగాన్ని ఫలవంతం చేసేందుకు యెహోవా తాను చేయగలిగినదంతా చేశాడు. “నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను?” అని ఆయన అడిగాడు.​—⁠యెషయా 5:⁠4.

ఇశ్రాయేలు ద్రాక్షావల్లి ఫలవంతంగా లేదు కాబట్టి, తన ప్రజల చుట్టూ తాను నిర్మించిన రక్షణ గోడను పడగొడతానని ఆయన వారిని హెచ్చరించాడు. ఆయన ఇక తన అలంకారార్థ ద్రాక్షావల్లి కొమ్మలను కత్తిరించడు లేక దాని నేలను పారతో త్రవ్వడు. వసంత రుతువులో కురిసే వర్షాలపై పంట ఆధారపడుతుంది, ఇక ఆ వర్షాలు కురవవు, ముండ్లు, కలుపుమొక్కలు ద్రాక్షతోటంతా పెరుగుతాయి.​—⁠యెషయా 5:​5, 6.

ఇశ్రాయేలు మతభ్రష్టత కారణంగా వారి అక్షరార్థ ద్రాక్షతోటలు కూడా వాడిపోతాయని మోషే ప్రవచించాడు. “ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.” (ద్వితీయోపదేశకాండము 28:​39) ఒక పురుగు చెట్టు ప్రధాన కాండం తొలిచి లోపలి భాగం తినేస్తే రెండురోజులకే ద్రాక్షావల్లి వాడిపోవచ్చు.​—⁠యెషయా 24:⁠7.

“నిజమైన ద్రాక్షావల్లి”

యెహోవా అక్షరార్థ ఇశ్రాయేలును ద్రాక్షావల్లితో పోల్చినట్లే, యేసు కూడా అలాంటి రూపకాలంకారాన్నే ఉపయోగించాడు. యేసు తన శిష్యులతో గడిపిన చివరి భోజన సమయంలో, వారితో ఇలా అన్నాడు: “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.” (యోహాను 15:⁠1) యేసు తన శిష్యులను ద్రాక్షావల్లి తీగలతో లేక కొమ్మలతో పోల్చాడు. అక్షరార్థ ద్రాక్షావల్లి కొమ్మలు ప్రధాన కాండం నుండి శక్తిని పొందినట్లే, క్రీస్తు శిష్యులు కూడా ఆయనతో ఏకమై ఉండాలి. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” అని యేసు చెప్పాడు. (యోహాను 15:⁠5) ఫలం కోసం వ్యవసాయదారులు ద్రాక్షావల్లిని సాగుచేస్తారు, తన ప్రజలు ఆధ్యాత్మిక ఫలాల్ని ఫలించాలని యెహోవా ఆశిస్తున్నాడు. అది ద్రాక్షావల్లి వ్యవసాయదారుడైన దేవునికి సంతృప్తినిస్తుంది, ఆయనను ఘనపరుస్తుంది.​—⁠యోహాను 15:⁠8.

అక్షరార్థ ద్రాక్షావల్లి విషయంలో, ఫలసమృద్ధి తీగలను లేక కొమ్మలను కత్తిరించడంపై, శుద్ధి చేయడంపై ఆధారపడుతుంది. యేసు అలాంటి రెండు సందర్భాల గురించి పేర్కొన్నాడు. అధిక ఫలాలను పొందేందుకు ద్రాక్షతోటమాలి ఏడాదికి రెండుసార్లు ద్రాక్షావల్లి కొమ్మలను కత్తిరించవచ్చు. శీతాకాలంలో ద్రాక్షావల్లి అనేక కొమ్మలు కత్తిరించబడవచ్చు. వ్యవసాయదారుడు మునుపటి సంవత్సరంలో పెరిగిన అనేక కొమ్మలను తీసివేస్తాడు. ఆయన బహుశా కాండం మీద మూడు నాలుగు ప్రధాన కొమ్మలను మిగల్చవచ్చు, అలాగే ఆ కొమ్మలమీద ఒకటి రెండు రెమ్మలను మిగల్చవచ్చు. ఈ లేతరెమ్మలు, మునుపటి సంవత్సరపు లేతరెమ్మల్లాగే ఉంటాయి, తర్వాతి వేసవిలో అవి పండ్లు కాసే కొమ్మలుగా మారుతాయి. ద్రాక్షతోటమాలి కొమ్మలను కత్తిరించడం పూర్తి చేసిన తర్వాత, చివరకు కత్తిరించిన కొమ్మలను కాల్చేస్తాడు.

కొమ్మలను ఎక్కువగా కత్తిరించడాన్ని యేసు ఇలా వర్ణించాడు: “ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.” (యోహాను 15:⁠6) ఈ సమయానికి ద్రాక్షావల్లి, కొమ్మలు లేనట్లు కనిపించవచ్చు, వసంత రుతువులో మరోసారి కొన్ని కొమ్మలు కత్తిరించబడతాయి.

“నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును” అని యేసు చెప్పాడు. (యోహాను 15:⁠2) ద్రాక్షావల్లి చెప్పుకోదగిన రీతిలో పెరిగి, చిన్న ద్రాక్షగెలలు స్పష్టంగా కనిపించిన తర్వాత జరిగే కొమ్మలను కత్తిరించే పనిని అది సూచిస్తుండవచ్చు. ద్రాక్షతోటమాలి పండ్లు కాస్తున్న కొమ్మను, కాయని కొమ్మను గుర్తించడానికి ప్రతీ క్రొత్త కొమ్మను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ద్రాక్షావల్లిమీద పండ్లు కాయని కొమ్మలను అలాగే ఉండనిస్తే అవి కాండం నుండి పోషణలను, నీళ్లను గ్రహిస్తూనే ఉంటాయి. కాబట్టి, ఫలించే కొమ్మలకు మాత్రమే పోషణ అందేలా ఫలించని ఈ కొమ్మలను వ్యవసాయదారుడు కత్తిరిస్తాడు.

చివరకు, యేసు ఈ శుద్ధీకరణ ప్రక్రియను సూచిస్తున్నాడు. “ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను [ఆయన] తీసివేయును” అని ఆయన వివరించాడు. (యోహాను 15:⁠2) ఫలించని కొమ్మలను ఒకసారి తీసివేసిన తర్వాత, ద్రాక్షతోటమాలి ఫలించే ప్రతి కొమ్మను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఫలించే కొమ్మ మొదలు దగ్గర కత్తిరించాల్సిన చిన్నచిన్న క్రొత్త మొలకలు ఆయన గుర్తించకుండా ఉండడు. వాటిని పెరగనిస్తే, ద్రాక్షపండ్లకు ఎంతో అవసరమైన తేమను అందించే రసాన్ని అవి ద్రాక్షావల్లి నుండి గ్రహిస్తాయి. చిన్న ద్రాక్షలకు చక్కగా సూర్యరశ్మి తగిలే విధంగా కొన్ని పెద్ద ఆకులు కూడా అలాగే కత్తిరించబడవచ్చు. ఆ పనులన్నీ, ఫలాన్నిచ్చే కొమ్మలు సమృద్ధిగా ఫలించేందుకు దోహదపడతాయి.

“బహుగా ఫలించండి”

“నిజమైన ద్రాక్షావల్లి”కి ఉన్న అలంకారార్థ కొమ్మలు అభిషిక్త క్రైస్తవులకు ప్రతీకగా ఉన్నాయి. అయినా “వేరే గొఱ్ఱెలు” కూడా తాము ఫలవంతమైన క్రీస్తు శిష్యులని తమనుతాము నిరూపించుకోవాలి. (యోహాను 10:​16) వారు కూడా “బహుగా ఫలించి” తమ పరలోక తండ్రిని మహిమపరచవచ్చు. (యోహాను 15:​5, 8) మన రక్షణ క్రీస్తుతో ఏకమై ఉండడం మీద, మంచి ఆధ్యాత్మిక ఫలాలను ఫలించడం మీద ఆధారపడివుందని నిజమైన ద్రాక్షావల్లి గురించిన యేసు ఉపమానం మనకు గుర్తుచేస్తోంది. యేసు ఇలా చెప్పాడు: “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు.”​—⁠యోహాను 15:​10.

దేశం మళ్లీ ‘సమాధానసూచకమైన ద్రాక్షచెట్లు ఫలమిస్తుందని, భూమి పండుతుందని’ దేవుడు జెకర్యా దినాల్లో నమ్మకస్థులైన ఇశ్రాయేలీయుల శేషానికి వాగ్దానం చేశాడు. (జెకర్యా 8:​12) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని ప్రజలు అనుభవించే శాంతిని వర్ణించడానికి కూడా ద్రాక్షావల్లి ఉపయోగించబడింది. మీకా ఇలా ప్రవచించాడు: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.”​—⁠మీకా 4:⁠4.

[అధస్సూచి]

^ పేరా 7 ఎన్‌సైక్లోపీడియా జుడైకా ప్రకారం, ఇశ్రాయేలు వ్యవసాయదారులు సొరక్‌గా పేరుగాంచిన ముదురు ఎరుపురంగు ద్రాక్షలను ఫలించే ద్రాక్షచెట్లను ఇష్టపడేవారు, యెషయా 5:⁠2లో ఆ రకం ద్రాక్షచెట్ల గురించే పేర్కొనబడివుండవచ్చు. ఆ ద్రాక్షలు తియ్యని ఎర్రని ద్రాక్షారసాన్ని ఉత్పత్తి చేసేవి.

[18వ పేజీలోని చిత్రం]

ఇటీవల ఎండిపోయిన ద్రాక్షావల్లి

[18వ పేజీలోని చిత్రం]

శీతాకాలంలో ద్రాక్షావల్లి కొమ్మలను కత్తిరించడం

[18వ పేజీలోని చిత్రం]

కత్తిరించిన కొమ్మలను కాల్చడం