కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉగాండాలో విభిన్న ప్రజలమధ్య జరుగుతున్న అభివృద్ధి

ఉగాండాలో విభిన్న ప్రజలమధ్య జరుగుతున్న అభివృద్ధి

ఉగాండాలో విభిన్న ప్రజలమధ్య జరుగుతున్న అభివృద్ధి

తూర్పు ఆఫ్రికాలోని గ్రేట్‌ రిఫ్ట్‌ వాలీ అని పిలువబడే తూర్పు, పశ్చిమ లోయల మధ్య, భూమధ్యరేఖకు ఇరుప్రక్కల వ్యాపించివున్న ఉగాండా దేశం అసాధారణమైన అందాలతో అలరారుతుంది. ఈ దేశంలో వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఏపుగా పెరిగిన మొక్కలు, ఆకర్షణీయమైన జంతువులు ఉన్నాయి. ఈ దేశం ఎత్తైన గ్రేట్‌ ఆఫ్రికన్‌ పీఠభూమి మీద ఉండడంతో, ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం ఉండడమే కాక, వేలాది కిలోమీటర్లవరకు విస్తరించివున్న కొండలతో అందమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి.

కొన్ని దేశాల్లో మాత్రమే, తక్కువ విస్తీర్ణంలోనే, మంచు కొండలతోపాటు ఉష్ణమండల ప్రాంతాలు కనిపిస్తాయి, కానీ ఉగాండాలో అలాంటి ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. పశ్చిమాన మంచుతో కప్పబడిన మూన్‌, రువాంజారీ పర్వత శిఖరాల దగ్గరనుండి తూర్పు దిక్కున వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల వరకు ఈ దేశం విస్తరించివుంది. మీరు ఈ దేశ మైదానాల్లో ఏనుగుల్ని, గేదెల్ని, సింహాలను చూడవచ్చు. ఈ దేశంలో ఉన్న పర్వతాలు, దట్టమైన అడవులు గొరిల్లాలకు, చింపాంజీలకే కాక, 1,000 కన్నా ఎక్కువగా ఉన్న పక్షి జాతులకు కూడా నివాసస్థలాలుగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని అనేక ప్రాంతాలు అనావృష్టితో, కరవుతో పీడించబడుతున్నా, ఉగాండా మాత్రం అనేక నదులతో, ప్రపంచంలోని రెండవ అతి పెద్ద మంచి నీటి సరస్సైన విక్టోరియాతోపాటు ఇతర సరస్సులతో ఆశీర్వదించబడింది. విక్టోరియా సరస్సుకు ఉత్తరాన ఉన్న కాలువ నైలు నదిలో కలుస్తుంది. బ్రిటీష్‌ రాజనీతిజ్ఞుడైన విన్‌స్టన్‌ చర్చిల్‌, ఈ దేశాన్ని “ఆఫ్రికా ముత్యం” అని పిలవడంలో ఆశ్చర్యం లేదు!

నేడు ఆ “ముత్యం” మెరుస్తోంది

అయితే, ఉగాండా ప్రధాన ఆకర్షణ, స్నేహపూరితులైన, అతిథులను ఆదరించే విభిన్న రకాల ప్రజలే. ప్రముఖ “క్రైస్తవ” దేశమైన ఉగాండాను అనేక జాతులు, సంస్కృతులు సమ్మిళితమైవున్న ప్రాంతంగా వర్ణించవచ్చు. ఆ జాతులను, సంస్కృతులను వారి ఆచారాలనుబట్టి, దుస్తులనుబట్టి ఇప్పటికీ గుర్తించవచ్చు.

ఇటీవల, ఉగాండావాసుల్లో అంతకంతకు చాలామంది, భూవ్యాప్తంగా శాశ్వత శాంతి నెలకొనే సమయం గురించి బైబిల్లో ఉన్న సువార్తకు స్పందిస్తున్నారు. (కీర్తన 37:11; ప్రకటన 21:⁠4) గ్రేట్‌ బ్రిటన్‌ దేశమంత పరిమాణంలో ఉన్న ఈ దేశంలో అందరికీ ఆ సందేశాన్ని అందించడం కష్టమే.

స్థానిక వ్యక్తి ఒకరు 1955లో విక్టోరియా సరస్సులో మొట్టమొదటి యెహోవా సమర్పిత సాక్షిగా బాప్తిస్మం తీసుకోవడంతో చిన్నగా ఆరంభమైన ఆ “ఒంటరియైనవాడు” చివరకు 1992లో వేయిమందిగా ఎదిగారు. 1955 నుండి ఆ అభివృద్ధి కొనసాగుతూనేవుంది. అది ప్రోత్సాహకరమైన దేవుని ఈ మాటలకు అనుగుణంగా ఉంది: “యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.”​—⁠యెషయా 60:​22.

భాషా అవరోధాలను అధిగమించడం

ఈ దేశ అధికారిక భాష ఆంగ్లం, ప్రత్యేకంగా విద్యలో దాని వాడుక ఎక్కువగా ఉంది, అయినా ఆ భాష అనేకమంది ఉగాండావాసుల మాతృభాష కాదు. కాబట్టి ప్రజలకు సువార్త ప్రకటించే ప్రయత్నంలో, యెహోవాసాక్షులు ఇతర ముఖ్య భాషలపై కూడా దృష్టి నిలిపారు. అలా దృష్టినిలపడం అవసరమైంది. ఎందుకంటే, ఆ దేశపు 2.5 కోట్ల జనాభాలో, 80 శాతం కన్నా ఎక్కువమంది పల్లెల్లో లేక చిన్న పట్టణాల్లో జీవిస్తున్నారు. ఆ ప్రజలు అనుదిన సంభాషణ కోసం ఎక్కువగా తమ మాతృభాషను ఉపయోగిస్తారు. ఆ భాషా గుంపులను చేరుకొని వారి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి ఎంతో కృషి చేయడం అవసరం.

అయితే, ప్రజలకు వారి సొంత భాషల్లో ప్రకటించడం ద్వారా, వివిధ భాషల్లో బైబిలు సాహిత్యాన్ని సిద్ధం చేయడం ద్వారా యెహోవాసాక్షులు ఆ అవసరాలను తీర్చడానికి ప్రయత్నించారు. ఆ దేశ రాజధాని కంపాలాలో ఉన్న బ్రాంచి కార్యాలయంలో అనువాద బృందాలు నాలుగు భాషా గుంపులకు సహాయం చేస్తున్నాయి, అవి అచోలే, లుకోంజో, లుగాండా, రున్యాన్కోరే. అంతేకాక, దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్వహించబడిన క్రైస్తవ సమావేశాలకు చాలామంది హాజరయ్యారు, అలా హాజరైనవారి సంఖ్య ఉగాండాలోని యెహోవాసాక్షుల సంఖ్యకు రెండింతలకన్నా ఎక్కువ. వివిధ భాషా గుంపులను చేరుకోవడానికి చేయబడుతున్న ప్రయత్నాలు ఆధ్యాత్మిక అభివృద్ధి వేగంగా జరగడానికి దోహదపడుతోందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. అయితే అలాంటి అభివృద్ధికి ఇదొక్కటే కారణం కాదు.

పయినీర్లు పనికి నాయకత్వం వహిస్తున్నారు

సంవత్సరంలో ఒకసారి దాదాపు మూడు నెలలపాటు చేసే ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు సంఘాలు సంతోషంగా మద్దతిస్తున్నాయి, ఆ నెలల్లో మారుమూల ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడుతోంది. (అపొస్తలుల కార్యములు 16:⁠9) ఉత్సాహవంతులైన చాలామంది యువ పయినీర్లు లేక పూర్తికాల పరిచారకులు ఈ పనికి నాయకత్వం వహిస్తున్నారు. కొన్నిసార్లు వారు, సువార్త ఇంతకుముందెన్నడూ ప్రకటించబడని మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారు.

పశ్చిమ ఉగాండాలోని బుషెన్యి అనే చిన్న పట్టణంలో, ఇద్దరు సాక్షులు మూడు నెలలు ప్రత్యేక పయినీర్లుగా సేవ చేసేందుకు నియమించబడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రచారకురాలితో కలిసి వారు ప్రకటించారు, క్రైస్తవ కూటాలను వ్యవస్థీకరించారు. ఒక నెలలోపే, ఆ ఇద్దరు పయినీర్లు 40 మందితో క్రమంగా బైబిలు చర్చలను నిర్వహించడం ప్రారంభించారు, వారిలో 17 మంది యెహోవాసాక్షుల కూటాలకు హాజరవడం మొదలుపెట్టారు. ఆ పయినీర్లు ఇలా వివరిస్తున్నారు: “దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? * అనే బ్రోషుర్‌ను మేము ఎవరికైతే ఇచ్చామో, వారిలో కొంతమంది, కొన్ని రోజుల తర్వాత, బ్రోషుర్‌లో ఉన్న ప్రశ్నలకు చాలా పేజీల్లో తాము వ్రాసిన జవాబులతో మా ఇంటికి వచ్చారు. తాము వ్రాసిన జవాబులు సరైనవో కావో వారు తెలుసుకోవాలనుకున్నారు.” ఈ రోజు, ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి ఒక సొంత రాజ్యమందిరం ఉంది.

రాజ్య సువార్త ఇంతకుముందెన్నడూ ప్రకటించబడని పశ్చిమ ఉగాండాలోని ఒక ప్రాంతానికి ఇద్దరు పయినీర్లు వెళ్లారు. వారు ఇలా వ్రాశారు: “ప్రజలు బైబిలు సత్యం కోసం నిజంగా దప్పిగొనివున్నారు. మేము ఇక్కడున్న మూడు నెలల్లో 86 బైబిలు అధ్యయనాలను ప్రారంభించి, నిర్వహించగలిగాం.” అనతికాలంలోనే, ఆ ప్రాంతంలో సాక్షుల గుంపొకటి అధికారికంగా స్థాపించబడింది.

క్షేత్రంలో ఉన్న ఇతర ఉత్సాహవంతులైన పనివారు

ఈ దేశంలో ఉన్న ఉత్సాహవంతులైన పయినీర్లలో కొందరు ఎన్నో సంవత్సరాలుగా సేవచేస్తున్నారు. ప్యాట్రిక్‌ అనే వ్యక్తి యెహోవాసాక్షి కాకముందు, ఉగాండా పాలకుడైన ఈదీ ఆమీన్‌ వైమానిక దళానికి సంబంధించిన గాయకుల బృందంలో సన్నాయిని వాయించేవాడు. ప్యాట్రిక్‌ 1983లో, బాప్తిస్మం తీసుకున్న ఆరు నెలల తర్వాత పూర్తికాల పరిచారకుడయ్యాడు. ఈ రోజు, ఆయన ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేస్తూ సంఘాలను సందర్శిస్తూ, ప్రోత్సహిస్తున్నాడు.

మార్గరెట్‌ 1962లో బాప్తిస్మం తీసుకుంది. ఆమె 70వ పడిలో ఉండి, తుంటి నొప్పివల్ల ఎక్కువగా తిరగలేని స్థితిలోవున్నా తన పొరుగువారితో బైబిలు ఆధారిత నిరీక్షణను పంచుకునేందుకు ప్రతీనెల దాదాపు 70 గంటలు వెచ్చిస్తోంది. ఆమె తన ఇంటి బయటున్న బల్లమీద సాహిత్యాలను ప్రదర్శిస్తుంది, దార్లో వెళ్తున్నవారు ఎవరైనా శాంతియుత నూతనలోకం గురించిన సువార్త వినడానికి ఇష్టపడితే వారితో సంభాషణ ప్రారంభిస్తుంది.

తూర్పు ఉగాండాకు చెందిన సైమన్‌ అనే వ్యవసాయదారుడు 16 సంవత్సరాలు సత్యం కోసం అన్వేషించాడు, 1995లో యెహోవాసాక్షులు ప్రచురించిన కొన్ని సాహిత్యాలు ఆయనకు లభించాయి. ఆయన వాటిని చదివిన తర్వాత దేవుని రాజ్యం గురించి, భూమిపట్ల దేవుని అద్భుతమైన సంకల్పం గురించి ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక ఆయనలో కలిగింది. ఆయన నివసిస్తున్న కాములి పల్లెలో సాక్షులెవ్వరూ లేరు, కాబట్టి సైమన్‌ వారిని వెదకడానికి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోవున్న కంపాలాకు ప్రయాణం చేశాడు. ఆయన నివసిస్తున్న పల్లెలో ఇప్పుడు ఒక సంఘం ఉంది.

“మేమిక్కడే స్థిరంగా ఉంటాం”

ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లాగే, ఉగాండాలోని చాలామంది ఒక మతగుంపుకు సరైన ఆరాధనా స్థలం ఉండాలని ఆశిస్తారు. యెహోవాసాక్షుల కొన్ని సంఘాలకు అది పరిష్కరించలేని సమస్యగా అనిపించింది, ఎందుకంటే సరైన రాజ్యమందిరాన్ని నిర్మించడానికి వారి దగ్గర ఆర్థిక వనరులు లేవు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యమందిరాలు నిర్మించే కార్యక్రమం 1999వ సంవత్సరపు చివరి భాగంలో వేగవంతం చేయబడినప్పుడు సహోదరులు వ్యక్తంచేసిన కృతజ్ఞతను మాటల్లో చెప్పడం కష్టం. ఆ తర్వాతి ఐదు సంవత్సరాల్లో 40 క్రొత్త రాజ్యమందిరాల నిర్మించబడ్డాయి. నేడు దాదాపు సంఘాలన్నిటికీ సొంత రాజ్యమందిరాలున్నాయి, అవి నిరాడంబరంగా ఉన్నా చక్కగా ఉన్నాయి. అలాంటి నిర్మాణ కార్యక్రమాలు “మేమిక్కడే స్థిరంగా ఉంటాం” అనే సందేశాన్ని స్థానిక సముదాయాలకు తెలియజేశాయి. ఇది అభివృద్ధికి దోహదపడింది.

ఉత్తర ఉగాండాలోని ఒక చిన్న సంఘం దట్టంగా పెరిగిన మామిడి చెట్ల క్రింద కూటాలు జరుపుకునేది. ఒక చిన్న స్థలం సంపాదించుకున్న తర్వాత పని వేగంగా ముందుకుసాగింది. నిర్మాణ బృందంలోని సహోదరులు స్థానిక సాక్షులతో కలిసి రాజ్యమందిర నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ పనినిచూసి ఆ ప్రాంతంలోని ప్రముఖ మాజీ రాజకీయవేత్త ఎంతో ప్రభావితుడయ్యాడు. రాజ్యమందిరం పూర్తయ్యేంతవరకు తమ కూటాలను తన గ్యారేజీలో జరుపుకునేందుకు ఆయన ఇష్టంగా ముందుకొచ్చాడు. నిర్మాణ స్వచ్ఛంద సేవకులలోని ఒకరితో బైబిలు అధ్యయనం చేయడానికి కూడా ఆయన అంగీకరించాడు. ఆయన ఇప్పుడు ఆ అందమైన క్రొత్త రాజ్యమందిరంలో యెహోవాను ఆరాధించేందుకు ఇష్టపడే ఉత్సాహవంతుడైన బాప్తిస్మం తీసుకున్న ప్రచారకుడు!

ఆ దేశంలోని ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక రాజ్యమందిర నిర్మాణ ప్రణాళికలో పనిచేస్తున్న సహోదరులలో కనిపించిన స్నేహ స్వభావం, ప్రేమ, సహకారాన్నిబట్టి ఒక స్థానిక తాపీ మేస్త్రీ ఎంతగా కదిలించబడ్డాడంటే ఆ పనికి తానుకూడా చేయూతనివ్వడానికి ముందుకువచ్చాడు. అంతేకాక ఆ నిర్మాణం ముగింపుకు వచ్చేసరికి, మరుసటిరోజు ఉదయం జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాజ్యమందిరాన్ని సహోదరులు ఉపయోగించుకొనేందుకు వీలుగా ఆయన రాత్రంతా పనిచేశాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు మాత్రమే, మాట్లలోనే కాక చేతల్లో కూడా ఒకరినొకరు నిజంగా ప్రేమిస్తున్నారు.”

సమస్యలున్నా మరింత ప్రగతి సాధ్యమైంది

ఉగాండాలోని క్రొత్త క్షేత్రాల్లో ప్రకటనా పని జరుగుతుండడంవల్ల, సాక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, అనేకమంది ఆసక్తిగలవారు సంఘాలతో సహవసిస్తున్నారు. అయితే ఉగాండాలోకి వెల్లువలా పెద్ద సంఖ్యలో వచ్చిన శరణార్థులమీద దృష్టినిలపడం అత్యవసరమయింది. పొరుగు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధం యెహోవా ప్రజలను కూడా ప్రభావితం చేసింది. శరణార్థుల శిబిరాల్లో ఉన్న సాక్షులు యెహోవామీద అసాధారణ నమ్మకాన్ని ప్రదర్శించారు. సమీప దేశస్థుడైన ఒక మాజీ ఉన్నతాధికారి ఆ దేశంలో సాక్షులపై నిషేధం ఉన్నప్పుడు, సాక్షులను హింసించడంలో ఒకప్పుడు భాగం వహించాడు, తాను గడిపిన సౌకర్యవంతమైన జీవితాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. ఒక శరణార్థ శిబిరంలో బైబిలు అధ్యయనం చేసి, సాక్షి అయిన తర్వాత ఆయన ఇలా అన్నాడు: “ఈ ప్రపంచంలోని ఐశ్వర్యం, ఉన్నత హోదా నిజంగా విలువైనవి కావు. నేనిప్పుడు బీదరికాన్ని, అనారోగ్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ నా జీవితం ఇంతకుముందుకన్నా ఎంతో బాగుంది. నాకు యెహోవా గురించి తెలుసు, ఆయనకు ప్రార్థించే మంచి అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞుణ్ణి. భవిష్యత్తు విషయంలో నాకు దృఢమైన నిరీక్షణ ఉండడమే కాక, నేడు మనం సమస్యలను ఎదుర్కోవడానికిగల కారణమేమిటో కూడా నాకు తెలుసు. నేను మునుపెన్నడూ చవిచూడని మనశ్శాంతిని ఇప్పుడు అనుభవిస్తున్నాను.”

మీరు ఉగాండాలో సారవంతమైన నేలలో సాయంత్రం ఒక కర్ర నాటితే ఉదయానికల్లా దానికి వేళ్లు వస్తాయనే ఓ సామెత ఉంది. ఆ దేశంలో జరుగుతున్న ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆ దేశపు ఆధ్యాత్మిక నేల కూడా ఎంతో సారవంతమైనదని సూచిస్తోంది. ఉగాండాలోని వివిధ జాతులకు చెందిన అనేకమంది తన రాజ్యం గురించి తెలుసుకోవడానికి సమయాన్ని అనుమతించినందుకు మనం యెహోవా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు ఆ రాజ్యానికి ఉన్న విలువను “అమూల్యమైన యొక ముత్యము”తో పోల్చాడు. ఉగాండాలో అంతకంతకు అనేకమంది దాని విలువను అర్థం చేసుకుంటున్నారు.​—⁠మత్తయి 13:​45, 46.

[అధస్సూచి]

^ పేరా 13 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[8వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సూడాన్‌

ఉగాండా

నైలు నది

కాములి

టొరొరో

కంపాలా

బుషెన్యి

విక్టోరియా సరస్సు

కెన్యా

టాంజానియా

రువాండా

[9వ పేజీలోని చిత్రం]

ఉగాండాలో ఉన్న అనేక ఉత్సాహవంతులైన పరిచారకుల్లో ముగ్గురు

[10వ పేజీలోని చిత్రం]

ప్యాట్రిక్‌

[10వ పేజీలోని చిత్రం]

మార్గరెట్‌

[10వ పేజీలోని చిత్రం]

సైమన్‌

[10వ పేజీలోని చిత్రం]

టొరొరోలో జరిగిన జిల్లా సమావేశం

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

నేపథ్యం: © Uganda Tourist Board