కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది”

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది”

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది”

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” ​—⁠కీర్తన 119:​97.

నూట పంతొమ్మిదవ కీర్తన రచయిత కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని లక్ష్యపెట్టని అహంకారులైన శత్రువులు ఆయనను అపహసించి, ఆయనపై అపవాదు వేశారు. అధికారులు ఆయనకు విరుద్ధంగా ఆలోచన చేశారు, ఆయనను హింసించారు. దుష్టులు ఆయనను చుట్టుముట్టారు, ఆయనను చంపుతామని కూడా బెదిరించారు. ఇదంతా, దుఃఖంవల్ల లేదా ‘వ్యసనమువల్ల ఆయన ప్రాణము నీరైపోయేలా’ చేసింది. (కీర్తన 119:9, 23, 28, 51, 61, 69, 85, 87, 161) ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ఆ కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”​—⁠కీర్తన 119:​97.

2 ఒక వ్యక్తి ఇలా అడగవచ్చు, “కీర్తనకర్తకు దేవుని ధర్మశాస్త్రమెలా సాంత్వనకు, ఓదార్పుకు మూలంగా ఉండగలదు?” యెహోవాకు తనమీద శ్రద్ధవుందనే నమ్మకమే ఆయనను బలపర్చింది. ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రేమపూర్వక ఏర్పాట్లను తెలిసికొని ఉండడం, కీర్తనకర్త వ్యతిరేకులు ఆయనకు కష్టాలు తెచ్చినా ఆయన సంతోషంగా ఉండేలాచేసింది. యెహోవా తనపట్ల దయగా వ్యవహరించాడని ఆయన గుర్తించాడు. అంతేకాక, దేవుని ధర్మశాస్త్ర నిర్దేశాన్ని అన్వయించుకోవడం కీర్తనకర్తను తన శత్రువులకన్నా జ్ఞానవంతుణ్ణిచేసి ఆయన ప్రాణాలను కూడా కాపాడింది. ధర్మశాస్త్రానికి లోబడివుండడం ఆయనకు శాంతిని, మంచి మనస్సాక్షిని ఇచ్చింది.​—⁠కీర్తన 119:1, 9, 65, 93, 98, 165.

3 నేడు కూడా దేవుని సేవకుల్లో కొందరు విశ్వాస సంబంధమైన తీవ్ర పరీక్షలను ఎదుర్కొంటున్నారు. కీర్తనకర్తలా మనం ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోకపోవచ్చు, కానీ మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నాం. ప్రతీరోజు మనకెదురయ్యే చాలామందికి ఆధ్యాత్మిక విలువలంటే ప్రేమలేదు, వారి లక్ష్యాలు స్వార్థపూరితమైనవి, ఐశ్వర్యాసక్తి సంబంధమైనవేకాక, వారి దృక్పథం అహంకారపూరితంగా, అమర్యాదకరంగా కూడా ఉంటోంది. (2 తిమోతి 3:​1-5) యౌవన క్రైస్తవులు తమ నైతిక యథార్థత విషయంలో ఎల్లప్పుడూ పరీక్షలను ఎదుర్కోవాల్సివస్తోంది. అలాంటి వాతావరణంలో యెహోవాపట్ల, సరైనదానిపట్ల మన ప్రేమను కాపాడుకోవడం కష్టంగా ఉండగలదు. మనల్ని మనమెలా కాపాడుకోవచ్చు?

4 దేవుని ధర్మశాస్త్రాన్ని హృదయపూర్వకంగా చదివి, ధ్యానించేందుకు సమయం కేటాయించడం, తనకెదురైన ఒత్తిళ్లను తట్టుకునేందుకు కీర్తనకర్తకు సహాయం చేసింది. ఆ విధంగా ఆయన దేవుని ధర్మశాస్త్రంపట్ల ప్రేమను పెంపొందించుకున్నాడు. నిజానికి, 119వ కీర్తనలోని దాదాపు ప్రతీవచనం యెహోవా ధర్మశాస్త్రంలోని ఏదోక అంశం గురించి పేర్కొంటోంది. * నేడు క్రైస్తవులు ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రం క్రిందలేరు. (కొలొస్సయులు 2:​13-14) అయితే, ఆ ధర్మశాస్త్రంలో వ్యక్తపర్చబడిన సూత్రాలు ఇప్పటికీ విలువైనవే. ఆ సూత్రాలు కీర్తనకర్తకు ఓదార్పునిచ్చినట్లే, ఆధునిక జీవితంలో ఎదురయ్యే కష్టాలతో వ్యవహరించేందుకు పోరాడుతున్న దేవుని సేవకులకు కూడా ఓదార్పును ఇవ్వగలవు.

5 మోషే ధర్మశాస్త్రంలోని కేవలం మూడు అంశాలనుండి మనమెలాంటి ప్రోత్సాహం పొందగలమో చూద్దాం: విశ్రాంతిదిన ఏర్పాటు, పరిగె ఏరుకునే ఏర్పాటు, లోభత్వానికి విరుద్ధంగా ఆజ్ఞ. వీటిలో ప్రతీదానిలో, మనకాలాల్లో ఎదురయ్యే కష్టాలను, ఒత్తిళ్లను తట్టుకునేందుకు, ఆ ఆజ్ఞల్లో ఇమిడివున్న సూత్రాలను అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తాం.

మన ఆధ్యాత్మిక అవసరతను తీర్చుకోవడం

6 మానవాళి అనేక ప్రాముఖ్యమైన అవసరాలతో సృష్టించబడింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారపానీయాలు, వసతి చాలా ప్రాముఖ్యం. అయితే, మనిషి తన ‘ఆధ్యాత్మిక అవసరతలపట్ల’ కూడా శ్రద్ధవహించాలి. అలా శ్రద్ధవహించకపోతే ఆయనకు నిజమైన సంతోషం ఉండదు. (మత్తయి 5:⁠3, NW) ఈ అంతరంగ అవసరతను తీర్చుకోవడం యెహోవా ఎంత ప్రధానమైనదిగా పరిగణించాడంటే, తన ప్రజలు ఆధ్యాత్మిక విషయాలపట్ల శ్రద్ధవహించేలా వారంలో ఒకరోజంతా తమ సాధారణ కార్యకలాపాలను ఆపుజేయాలని ఆజ్ఞాపించాడు.

7 విశ్రాంతిదిన ఏర్పాటు ఆధ్యాత్మిక విషయాలకున్న ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. అరణ్యములో మన్నా అందించే ఏర్పాటుకు సంబంధించి బైబిల్లో “విశ్రాంతిదినము” అనే మాట మొదటిసారిగా ప్రస్తావించబడింది. ఈ అద్భుతమైన ఆహారాన్ని ఆరురోజులు కూర్చుకోవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది. ఆరవరోజున వారు “రెండు దినముల ఆహారము” కూర్చుకోవాలి, ఎందుకంటే ఏడవరోజు వారికేమీ ఇవ్వబడదు. ఏడవరోజు “యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము,” ఆ రోజున ఎవరూ బయలు వెళ్లకూడదు. (నిర్గమకాండము 16:​13-30) విశ్రాంతిదినమున ఏ పనీ చేయకూడదని పది ఆజ్ఞల్లో ఒకటి ఆదేశించింది. అది పరిశుద్ధ దినం. దాన్ని పాటించకపోతే మరణశిక్ష విధించబడుతుంది.​—⁠నిర్గమకాండము 20:8-11; సంఖ్యాకాండము 15:32-36.

8 విశ్రాంతిదిన నియమం తన ప్రజల భౌతిక, ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల యెహోవాకున్న శ్రద్ధను చూపించింది. “విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను” అని యేసు చెప్పాడు. (మార్కు 2:​27) అది ఇశ్రాయేలీయులు విశ్రాంతి తీసుకునేందుకు అనుమతించడమే కాక, తమ సృష్టికర్తకు సన్నిహితమై ఆయనపట్ల తమ ప్రేమను చూపించేందుకూ అవకాశమిచ్చింది. (ద్వితీయోపదేశకాండము 5:​12) అది పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలకు మాత్రమే కేటాయించబడిన దినం. వాటిలో కుటుంబ ఆరాధన, ప్రార్థన, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ఉన్నాయి. ఇశ్రాయేలీయులు తమ పూర్తి సమయాన్ని, శక్తిని భౌతిక కార్యాలకు వినియోగించకుండా ఆ ఏర్పాటు వారిని కాపాడింది. యెహోవాతో తమ సంబంధం తమ జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయమని విశ్రాంతిదినం వారికి గుర్తుచేసింది. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని యేసు చెప్పినప్పుడు మార్పులేని ఆ సూత్రాన్ని మళ్లీ చెప్పాడు.​—⁠మత్తయి 4:⁠4.

9 దేవుని ప్రజలు అక్షరార్థ 24 గంటల విశ్రాంతిదినాన్ని ఇంకెంతమాత్రం పాటించవలసిన అవసరం లేదు. అయితే ఆ విశ్రాంతిదిన ఏర్పాటు ఆసక్తికరమైన చారిత్రక విషయం మాత్రమే కాదు. (కొలొస్సయులు 2:​16) మనం కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రథమస్థానమివ్వాలని అది మనకు గుర్తుచేయడం లేదా? వస్తుసంబంధ పనులకు లేదా వినోదాలకు ఆధ్యాత్మిక విషయాలకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. (హెబ్రీయులు 4:⁠9, 10) కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవచ్చు: “నా జీవితంలో నేను దేనికి ప్రథమస్థానం ఇస్తున్నాను? అధ్యయనానికి, ప్రార్థనకు, క్రైస్తవ కూటాలకు హాజరవడానికి, రాజ్యసువార్తను పంచుకోవడానికి ప్రథమస్థానమిస్తున్నానా? లేక వాటి స్థానాన్ని ఇతర విషయాలు ఆక్రమిస్తున్నాయా?” మనం మన జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమస్థానమిస్తే మన జీవితావసరాలకు కొదువలేకుండా ఉంటుందని యెహోవా అభయమిస్తున్నాడు.​—⁠మత్తయి 6:​24-33.

10 బైబిలును, సంబంధిత ప్రచురణలను అధ్యయనం చేసేందుకే కాక, వాటి సందేశాన్ని లోతుగా ఆలోచించేందుకు మనం వెచ్చించే సమయం యెహోవాకు దగ్గరయ్యేందుకు మనకు సహాయం చేయగలదు. (యాకోబు 4:⁠8) క్రమంగా బైబిలును చదివేందుకు సమయం కేటాయించడాన్ని దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆరంభించిన సూజెన్‌ మొదట్లో అదంత ఆసక్తిదాయకంగా ఉండేదికాదని అంగీకరిస్తోంది. అది చాలా భారంగా ఉండేది. అయితే ఆమె దానిని చదివేకొద్ది దానిపట్ల ఆమెకు ఇష్టం పెరిగింది. ఇప్పుడు, ఏదైనా కారణంచేత వ్యక్తిగత పఠనం చేయలేకపోతే, ఆమె బాధపడుతుంది. ఆమె ఇలా చెబుతోంది: “యెహోవాను ఒక తండ్రిగా తెలుసుకునేందుకు అధ్యయనం నాకు సహాయం చేసింది. నేనాయనను నమ్మగలను, ఆయనపై ఆధారపడగలను, ధైర్యంగా నేనాయనకు ప్రార్థించగలను. యెహోవా తన సేవకులనెంతగా ప్రేమిస్తున్నాడో, వ్యక్తిగతంగా నా పట్ల ఆయనెంత శ్రద్ధ చూపిస్తున్నాడో, నాకెలా సహాయం చేశాడో చూడడం నిజంగా అద్భుతం.” ఆధ్యాత్మిక విషయాలకు క్రమంగా శ్రద్ధనివ్వడం ద్వారా మనం కూడా ఎంత గొప్ప ఆనందాన్ని పొందగలమో కదా!

పరిగె ఏరుకునే ఏర్పాటు విషయంలో దేవుని నియమం

11 మోషే ధర్మశాస్త్రంలో, తన ప్రజల సంక్షేమంపట్ల దేవుని శ్రద్ధను ప్రతిబింబించిన రెండవ అంశం పరిగె ఏరుకునే హక్కు. ఇశ్రాయేలీయ రైతు తన పొలంలో పంట కోసినప్పుడు, కోత పనివాళ్లు పొలంలో విడిచిపెట్టిన దానిని బీదలు కూర్చుకునేందుకు అనుమతించాలని యెహోవా ఆజ్ఞాపించాడు. రైతులు తమ పొలం అంచుల్లో ఉన్న పంటను పూర్తిగా కోయకూడదు లేదా రాలిపోయిన ద్రాక్షలను లేదా ఒలీవపండ్లను కూర్చుకోకూడదు. అనుకోకుండా పొలంలో మర్చిపోయిన పనలను తిరిగి తీసుకోకూడదు. బీదలపట్ల, పరదేశులపట్ల, అనాధలపట్ల, విధవరాండ్రపట్ల అది ఒక ప్రేమపూర్వక ఏర్పాటు. నిజమే, పరిగె ఏరుకునేందుకు వారు కష్టపడాల్సివచ్చినా, ఆ పనివల్ల వారు భిక్షమెత్తుకునే పరిస్థితిని తప్పించుకునేవారు.​—⁠లేవీయకాండము 19:9, 10; ద్వితీయోపదేశకాండము 24:19-22; కీర్తన 37:​25.

12 పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన నియమం, బీదలకోసం రైతులు ఎంత పంట వదిలిపెట్టాలో స్పష్టంగా నిర్దేశించలేదు. తమ పొలాల అంచుల్లో ఎంత పంట కోయకుండా వదిలిపెట్టాలనేది వారి ఇష్టానికే వదిలివేయబడింది. ఈ విధంగా, ఆ ఏర్పాటు వారికి ఉదారతను నేర్పించింది. “బీదను కనికరించువాడు ఆయనను [సృష్టికర్తను] ఘనపరచువాడు” కాబట్టి, అది పంట అనుగ్రహించిన దేవునిపట్ల తమ కృతజ్ఞతను ప్రదర్శించే అవకాశాన్ని రైతులకు ఇచ్చింది. (సామెతలు 14:​31) అలాచేసిన వారిలో బోయజు ఒకరు. ఆయన దయతో, తన పొలాల్లో పరిగె ఏరుకున్న విధవరాలైన రూతు సరిపడా ధాన్యం ఏరుకునేలా చూశాడు. బోయజు చూపించిన ఉదారతనుబట్టి యెహోవా ఆయనను అధికంగా ఆశీర్వదించాడు.​—⁠రూతు 2:​15, 16; 4:21, 22; సామెతలు 19:​17.

13 పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన నియమానికి ఆధారమైన సూత్రం మారలేదు. తన సేవకులు ప్రత్యేకంగా బీదలపట్ల ఉదారంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. మనమెంత ఉదారంగా ఉంటామో, అంత ఎక్కువ ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. యేసు ఇలా చెప్పాడు: “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును.”​—⁠లూకా 6:​38.

14 “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయాలని అపొస్తలుడైన పౌలు సిఫారసు చేశాడు. (గలతీయులు 6:​10) తోటి విశ్వాసులు తమ విశ్వాస పరీక్షలను ఎదుర్కొన్నప్పుడెల్లా వారికి ఆధ్యాత్మిక సహాయం అందే విషయంలో మనం ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. అయితే, వారికి ఆచరణాత్మక సహాయం అవసరమా? ఉదాహరణకు రాజ్యమందిరానికి వచ్చే విషయంలో లేదా సరుకులు కొనే విషయంలో వారికి సహాయం అవసరమా? తమను సందర్శించి ప్రోత్సహించడాన్ని లేదా చేయూతనివ్వడాన్ని ఇష్టపడే వృద్ధులు, రోగులు లేదా ఇల్లువదిలి వెళ్లలేనివారు మీ సంఘంలో ఉన్నారా? అలాంటి అవసరాలను పసిగట్టే ప్రయత్నం మనం చేసినప్పుడు, అలాంటి అవసరంలోవున్నవారి ప్రార్థనలకు జవాబిచ్చేందుకు యెహోవా మనల్ని బహుశా ఉపయోగించుకోవచ్చు. మనం ఒకరిపట్ల ఒకరం శ్రద్ధచూపడం క్రైస్తవ బాధ్యత అయినప్పటికీ, అలా చేయడం శ్రద్ధచూపించేవారికి సహితం సహాయం చేస్తుంది. తోటి ఆరాధకులపట్ల నిజమైన ప్రేమ చూపించడం గొప్ప ఆనందాన్ని ప్రగాఢమైన సంతృప్తిని తీసుకువస్తుంది, దానివల్ల యెహోవా ఆమోదాన్ని పొందుతాం.​—⁠సామెతలు 15:​29.

15 క్రైస్తవులు నిస్వార్థ దృక్పథాన్ని చూపించే మరో ప్రాముఖ్యమైన విధానమేమిటంటే, దేవుని సంకల్పాల గురించి చెప్పేందుకు తమ సమయాన్ని, శక్తిని ఉపయోగించడం. (మత్తయి 28:​19, 20) యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకునే స్థితికి వచ్చేలా మరో వ్యక్తికి సహాయం చేసే ఎవరికైనా సరే యేసు పలికిన ఈ మాటల సత్యం తెలుసు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”​—⁠అపొస్తలుల కార్యములు 20:​35.

లోభత్వం విషయంలో జాగ్రత్తగా ఉండడం

16 ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో మనం పరిశీలించబోయే మూడవ అంశం పదవ ఆజ్ఞకు సంబంధించినది, అది లోభత్వాన్ని నిషేధించింది. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.” (నిర్గమకాండము 20:​17) ఏ మానవుడూ హృదయాల్ని చదవలేడు కాబట్టి, అలాంటి ఆజ్ఞను మానవులెవ్వరూ జారీ చేయలేరు. అయితే, ఆ ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని మానవ న్యాయంకన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లింది. అది, హృదయాలోచనలు చదవగల యెహోవాకు ప్రతీ ఇశ్రాయేలీయుణ్ణి నేరుగా జవాబుదారులను చేసింది. (1 సమూయేలు 16:⁠7) అంతేకాక, ఆ ఆజ్ఞ అనేక నిషిద్ధ కార్యాల మూలకారణాలపై దృష్టినిలిపింది.​—⁠యాకోబు 1:14.

17 లోభత్వానికి విరుద్ధంగా ఇవ్వబడిన నియమం ఐశ్వర్యాసక్తికి, దురాశకు గురికాకుండా ఉండేందుకు, తమ జీవన పరిస్థితిని గురించి సణగకుండా ఉండేందుకు దేవుని ప్రజలను ప్రోత్సహించింది. అలాగే అది దొంగతనానికి లేదా లైంగిక దుర్నీతికి పాల్పడే శోధననుండి కూడా వారిని కాపాడింది. మనం అభిమానించే వస్తుసంపదలున్న లేదా కొన్ని విషయాల్లో మనకన్నా మరింతగా వర్ధిల్లుతున్న ప్రజలు ఎప్పుడూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మన ఆలోచనను అదుపులో పెట్టుకోనట్లయితే, మనం అసంతోషానికి గురై ఇతరులపట్ల ఈర్ష్యను పెంచుకుంటాం. లోభత్వం “భ్రష్ట మనస్సును” కనబరుస్తుందని బైబిలు చెబుతోంది. మనలో లోభత్వం లేకుండా ఉండడమే మనకు మేలు చేస్తుంది.​—⁠రోమీయులు 1:​28-30.

18 నేటి లోకంలో ప్రబలివున్న దృక్పథం ఐశ్వర్యాసక్తిని, పోటీని ప్రోత్సహిస్తోంది. వాణిజ్యం, వ్యాపార ప్రకటనల ద్వారా క్రొత్త ఉత్పత్తుల కోసం కోరికలను అధికంచేసి, అవి మనదగ్గర లేకుంటే సంతోషంగా ఉండలేమనే తలంపును తరచూ కలుగజేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి దృక్పథాన్నే యెహోవా నియమం ఖండించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితంలో ముందుకెళ్లి సంపద సమకూర్చుకోవాలనే కోరిక కూడా అలాంటిదే. అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”​—⁠1 తిమోతి 6:​9, 10.

19 దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు ఐశ్వర్యాసక్తివల్ల రాగల ప్రమాదాలను గుర్తించి, వాటిని తప్పించుకుంటారు. ఉదాహరణకు, కీర్తనకర్త యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము. వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.” (కీర్తన 119:​36, 72) ఈ మాటల సత్యాన్ని నమ్మడం, ఐశ్వర్యాసక్తిని, దురాశను, మన జీవన పరిస్థితినిబట్టి అసంతృప్తిపడడం వంటి ఉరులను తప్పించుకునేందుకు అవసరమైన సమతూకాన్ని కాపాడుకునేలా మనకు సహాయం చేస్తుంది. వస్తు సంపదను సమకూర్చుకోవడం కాదుగానీ, “దేవభక్తి” కలిగివుండడమే గొప్పలాభసాధనకు కీలకం.​—⁠1 తిమోతి 6:⁠6.

20 ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఆధారమైన సూత్రాలు, యెహోవా మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఎంత విలువైనవిగా ఉన్నాయో, మన కష్టభరిత కాలాల్లోనూ అంతే విలువైనవిగా ఉన్నాయి. ఆ సూత్రాలను మన జీవితంలో ఎంత ఎక్కువగా అన్వయించుకుంటామో అంత ఎక్కువగా వాటిని అర్థం చేసుకుంటాం, మనమెంత ఎక్కువగా వాటిని ప్రేమిస్తామో అంత ఎక్కువ సంతోషంగా ఉంటాం. ధర్మశాస్త్రం మనకెన్నో విలువైన పాఠాలను దాచివుంచింది, ఆ పాఠాలకున్న విలువ బైబిల్లో పేర్కొనబడిన వ్యక్తుల జీవితాలు, అనుభవాల ద్వారా అందజేయబడింది. వాటిలో కొన్ని తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

[అధస్సూచి]

^ పేరా 6 ఈ కీర్తనలోని 176 వచనాల్లో 4 వచనాలు తప్ప మిగతావన్నీ యెహోవా ఆజ్ఞలను, న్యాయవిధులను, ధర్మశాస్త్రాన్ని, ఉపదేశమార్గాలను, కట్టడలను, శాసనములను, వాక్యములను, మార్గములను లేదా మాటను ప్రస్తావిస్తున్నాయి.

మీరెలా జవాబిస్తారు?

•నూట పంతొమ్మిదవ కీర్తన రచయిత యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమించాడు?

•విశ్రాంతిదిన ఏర్పాటునుండి క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు?

•పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన దేవుని నియమానికి ఎలాంటి శాశ్వత విలువుంది?

•లోభత్వానికి విరుద్ధంగా ఇవ్వబడిన ఆజ్ఞ మనల్ని ఎలా కాపాడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) నూట పంతొమ్మిదవ కీర్తన ప్రేరేపిత రచయిత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు? (బి) ఆయనెలా స్పందించాడు, ఎందుకు?

3. నేడు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం క్రైస్తవులకు ఎందుకు కష్టంగా ఉంది?

4. దేవుని ధర్మశాస్త్రంపట్ల కీర్తనకర్త తన కృతజ్ఞతనెలా చూపించాడు, క్రైస్తవులు కూడా అలాగే చేయాలా?

5. మోషే ధర్మశాస్త్రంలోని ఏ అంశాలను మనం పరిశీలించబోతున్నాం?

6. ప్రజలందరికీ ఎలాంటి ప్రాథమిక అవసరాలున్నాయి?

7, 8. (ఎ) విశ్రాంతిదినానికీ, ఇతర దినాలకూ మధ్య దేవుడు ఎలాంటి వ్యత్యాసం పెట్టాడు? (బి) విశ్రాంతిదినం ఏ ఉద్దేశాన్ని నెరవేర్చింది?

9. విశ్రాంతిదిన ఏర్పాటు క్రైస్తవులకు ఎలాంటి పాఠాన్ని బోధిస్తోంది?

10. ఆధ్యాత్మిక విషయాలకు సమయం కేటాయించడంవల్ల మనమెలా ప్రయోజనం పొందగలం?

11. పరిగె ఏరుకునే ఏర్పాటు ఎలా పనిచేసింది?

12. పరిగె ఏరుకునే ఏర్పాటు రైతులకు ఎలాంటి అవకాశమిచ్చింది?

13. పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన ప్రాచీనకాల నియమం మనకేమి బోధిస్తోంది?

14, 15. ఉదారతను మనమెలా ప్రదర్శించవచ్చు, అందువల్ల మనకూ మనం సహాయం చేసేవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగవచ్చు?

16, 17. పదవ ఆజ్ఞ దేనిని నిషేధించింది, ఎందుకు?

18. నేడు లోకంలో ఎలాంటి దృక్పథం ప్రబలంగా ఉంది, అది ఎలాంటి హానికర ప్రభావాలను ఉత్పన్నం చేయగలదు?

19, 20. (ఎ) యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఏవి నిజంగా విలువైనవిగా ఉంటాయి? (బి) తర్వాతి ఆర్టికల్‌ అంశమేమిటి?

[21వ పేజీలోని చిత్రం]

విశ్రాంతిదిన నియమం దేనిని నొక్కిచెప్పింది?

[23వ పేజీలోని చిత్రం]

పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన నియమం మనకేమి బోధిస్తోంది?