కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

“పరలోకమునుండి దిగివచ్చినవాడే అనగా మనుష్యకుమారుడే తప్ప . . . పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని నీకొదేముతో అన్నప్పుడు, యేసు మాటల భావమేమిటి?​—యోహాను 3:​13.

యేసు ఆ మాటలు అన్నప్పుడు భూమ్మీదే ఉన్నాడు, ఆయనింకా ఆరోహణమవలేదు లేదా పరలోకానికి తిరిగి వెళ్లలేదు. అయితే, యేసు గురించి మనకు తెలిసిన విషయాలు, ఆ మాటల సందర్భం ఆయన మాటల భావాన్ని గ్రహించేందుకు మనకు సహాయం చేయగలవు.

యేసు ‘పరలోకమునుండి దిగివచ్చాడు’ అంటే అంతకు ముందు ఆయన తన తండ్రితోపాటు ఆత్మ సామ్రాజ్యంలో జీవించాడని అర్థం, అయితే నిర్ణయకాలంలో ఆ తండ్రి తన కుమారుని జీవాన్ని మరియ గర్భానికి మార్చడంతో యేసు భూమ్మీద మానవునిగా జన్మించాడు. (లూకా 1:​30-​35; గలతీయులు 4:4; హెబ్రీయులు 2:​9, 14, 17) తన మరణం తర్వాత, యేసు ఆత్మప్రాణిగా పునరుత్థానం చేయబడి యెహోవా సన్నిధిలో ఉండేందుకు తిరిగివెళ్తాడు. అందుకే, తాను మరణించే కొద్ది సమయం ముందు యేసు ఇలా ప్రార్థించగలిగాడు: “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.”​—⁠యోహాను 17:5; రోమీయులు 6:​4, 8; హెబ్రీయులు 9:​24; 1 పేతురు 3:​18.

పరిసయ్యుడును, ఇశ్రాయేలులో బోధకుడైన నీకొదేముతో యేసు ఆ మాటలు పలికినప్పుడు ఆయనింకా పరలోకానికి తిరిగి వెళ్లలేదు. నిజానికి, ఏ మానవుడూ మరణించి, ఆత్మ సామ్రాజ్యానికి అంటే పరలోకానికి ఆరోహణమవలేదు. దేవుని ప్రవక్తగా బాప్తిస్మమిచ్చు యోహాను సాటిలేనివాడని యేసే స్వయంగా అన్నా, “పరలోకరాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు” అని కూడా చెప్పాడు. (మత్తయి 11:​11) విశ్వాసపాత్రుడైన రాజైన దావీదు సహితం మరణించి, ఇంకా తన సమాధిలోనే ఉన్నాడని అపొస్తలుడైన పేతురు వివరించాడు; దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. (అపొస్తలుల కార్యములు 2:​29, 34) యేసుకన్నా ముందు మరణించిన దావీదు, బాప్తిస్మమిచ్చు యోహాను, ఇతర విశ్వాసుల వంటివారు పరలోకానికి వెళ్లకపోవడానికి ఒక కారణం ఉంది. మానవులు పరలోక జీవం కోసం పునరుత్థానం చేయబడే మార్గాన్ని లేదా నిరీక్షణను యేసు ప్రతిష్టించకముందే వారు మరణించారు. యేసు, ముందుగా పరలోకంలో ప్రవేశించి ‘నూతనమైన, జీవముగల మార్గమును . . . ప్రతిష్టించాడు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.​—⁠హెబ్రీయులు 6:​19, 20; 9:​24; 10:​19.

యేసు అప్పటికింకా మరణించి, పునరుత్థానం చేయబడలేదు కాబట్టి, “పరలోకమునుండి దిగివచ్చినవాడే, తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని నీకొదేముతో అన్నప్పుడు ఆయన మాటల భావమేమిటి? (యోహాను 3:​13) నీకొదేముతో యేసు చర్చిస్తున్న మాటలను లేదా సందర్భాన్ని పరిశీలించండి.

యూదుల ఆ అధికారి రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ఆయనతో ఇలా అన్నాడు: “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను 3:⁠3) దానికి స్పందిస్తూ నీకొదేము ‘అదెలా జరుగుతుంది? మనుష్యుడు రెండవసారి ఎలా జన్మించగలడు?’ అని అడిగాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని గూర్చిన ఆ దైవిక బోధను ఆయన అర్థం చేసుకోలేదు. మరి దాని గురించి ఆయన మరోవిధంగా నేర్చుకునే అవకాశముందా? లేదు, మానవ పరిజ్ఞానం నుండి నేర్చుకొనే అవకాశమే లేదు; ఏ మనిషీ దాని గురించి బోధించలేడు, ఎందుకంటే, ఎవరూ పరలోకానికి వెళ్లలేదు. కాబట్టి, ఆ రాజ్యంలోకి ప్రవేశించడాన్ని గురించి ఎవరూ వివరించలేరు. యేసు మాత్రమే అలా వివరించగలడు. ఆయన పరలోకం నుండి దిగివచ్చాడు కాబట్టి, అలాంటి విషయాలను నీకొదేముకు, ఇతరులకు బోధించగల అర్హత ఆయనకు మాత్రమే ఉంది.

కాబట్టి, ఈ వచనానికి సంబంధించిన ప్రశ్న దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం గురించిన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఉదాహరిస్తోంది. ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నట్లు కనిపించినంత మాత్రాన ఆ లేఖనం గురించి సందేహించడం న్యాయం కాదు. బైబిల్లో ఒకచోట చెప్పబడిన విషయాన్ని ఇతర లేఖనాల వెలుగులో పరిశీలించడమే కాక, అది వాటితో పొందికగావుందో లేదో కూడా చూడాలి. అంతేకాక, ఆ లేఖన సందర్భం అంటే పరిస్థితి లేదా చర్చాంశం, మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న వచనానికి సమంజసమైన, న్యాయసమ్మతమైన అర్థాన్ని కనుగొనేందుకు సహాయపడగలదు.