మీరు ఎంత సంతోషంగా ఉన్నారు?
మీరు ఎంత సంతోషంగా ఉన్నారు?
మిమ్మల్ని మీరు నిజంగానే ఇలా ప్రశ్నించుకోవచ్చు ‘నేను ఎంత సంతోషంగా ఉన్నాను?’ మీరు, మరితరులు ఆ ప్రశ్నకు ఎలా ప్రతిస్పందిస్తారో తెలుసుకోవడానికి సమాజ శాస్త్రజ్ఞులు విశ్వప్రయత్నం చేస్తున్నారు, అయితే వారి పని ఏమంత సులువైంది కాదు. ఒక వ్యక్తి సంతోషాన్ని అంచనా వేయడమంటే, ఒక పురుషునికి తన భార్యపట్ల ఉన్న ప్రేమను లేదా కుటుంబంలో ఎవరైనా చనిపోతే కలిగే దుఃఖాన్ని అంచనా వేయడంతో పోల్చవచ్చు. భావావేశాలను ఖచ్చితంగా బేరీజు వేయడం కష్టం. అయితే, మానవుల్లో సంతోషంగా ఉండే సామర్థ్యం ఉందనే ప్రాథమిక సత్యాన్ని శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటారు.
మానవులకు సంతోషంగా ఉండే సహజ సామర్థ్యం ఉన్నా, గంభీరమైన సమస్యలు మానవజాతికి తీవ్ర దుఃఖాన్ని కలిగించాయి. ఈ ఉదాహరణను గమనించండి: కొన్ని నగరాల్లో ఎయిడ్స్ వ్యాధికి బలైనవారితో శ్మశానాలు నిండిపోయాయి. చనిపోతున్నవారిని పాతిపెట్టడానికి అధికారులు పాత సమాధుల్ని మళ్ళీ తవ్విస్తున్నారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, శవపేటికల తయారీ ప్రధాన జీవనోపాధిగా ఉంది. మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ, తీవ్ర అనారోగ్యంవల్ల బాధపడుతున్నవారికి, ఆప్తులను లేక స్నేహితులను మరణంలో కోల్పోయినవారికి సంతోషం ఎంతగానో కొరవడిందని గమనించే వుంటారు.
మరింత సుసంపన్న దేశాల మాటేమిటి? పరిస్థితుల్లో అనూహ్య మార్పులు జరిగినప్పుడు దానికి సిద్ధంగా లేనివారు హఠాత్తుగా ఆర్థిక భద్రతను కోల్పోవచ్చు. అమెరికాలో, అనేకమంది వృద్ధులకు రావాల్సిన పెన్షన్ రాకపోవడంతో తిరిగి ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచూ ఆస్పత్రి ఖర్చులు కుటుంబం పొదుపు చేసుకున్న డబ్బంతటినీ హరించివేస్తాయి. ఒక న్యాయ సలహాదారుడు ఇలా అంటున్నాడు: “పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన వైద్య సంబంధిత ఖర్చులతో, ఆరోగ్య సమస్యలతో వారు తరచూ నా దగ్గరకు ఆర్థిక సలహాల కోసం వస్తారు, వారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. అనేక సందర్భాల్లో వారితో నేను ‘మీరు మీ ఇల్లు అమ్మేయాలి’ అని చెప్పాల్సొస్తుంది.” మరి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేని వారి మాటేమిటి? దుఃఖం వారిని కూడా ప్రభావితం చేస్తుందా?
కొందరు వ్యక్తులు ప్రఖ్యాత సంగీత రచయితయైన రిచర్డ్ రోడ్జర్స్‌లాంటివారు. ఆయన గురించి ఇలా చెప్పబడింది: “ఆయనలా అనేకులకు ఎంతో సంతోషాన్ని పంచిపెట్టినవాళ్లు చాలా కొద్దిమందే.” ఆయన పాటలు ఎంతోమందిని సంతోషపెట్టినా, ఆయన మాత్రం దీర్ఘకాలిక మానసిక కృంగుదలతో బాధపడ్డాడు. అనేకులు ఆకాంక్షించే లక్ష్యాలను అంటే డబ్బును, కీర్తిని ఆయన ఆర్జించాడు, అయితే, అవి ఆయనకు సంతోషాన్నిచ్చాయా? ఒక జీవితచరిత్రకారుడు ఇలా అన్నాడు: “[రోడ్జర్స్] తన వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు, విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు, తన సహచరునితో కలిసి రెండు పులిట్జర్ ప్రైజులను (సంగీతకారులకు ఇచ్చే బహుమానం) అందుకున్నాడు. అయితే, ఆయన జీవితం చాలామట్టుకు దుఃఖంతో మనోవ్యథతో గడిచింది.”
సంతోషం కోసం ధనాన్ని ఆశ్రయించడం తరచూ మోసపూరితమైనదని మీరీపాటికే గ్రహించి ఉంటారు. కెనడాలోని టొరంటోకు చెందిన ద గ్లోబ్ ఎండ్ మెయిల్ వార్తాపత్రిక కోసం పనిచేసే పెట్టుబడుల విలేఖరి, చాలామంది ఐశ్వర్యవంతులు అనుభవించే “ఏకాంతం, శూన్యభావం”
గురించి వర్ణించాడు. ఒక ఆర్థిక సలహాదారుని ప్రకారం, ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలపై డబ్బుని నీళ్లలా ఖర్చుచేస్తూ, వారికి ఖరీదైన బహుమతులు కొనిస్తూ ఉంటే, “భవిష్యత్తులో కష్టాల కోసం బాటవేస్తున్నట్లే అవుతుంది.”సంతోషించడానికి నిజమైన ఆధారమేమైనా ఉందా?
పూలు పూసే మొక్క చక్కగా ఎదగాలంటే, మంచి నేల, నీరు, అనుకూల వాతావరణం అవసరం. అదేవిధంగా, సంతోషానికి కొన్ని కారకాలు దోహదపడతాయని పరిశోధకులు గ్రహించారు. వాటిలో కొన్ని, మంచి ఆరోగ్యం, సంతృప్తికరమైన వృత్తి, తగినంత ఆహారం, ఇల్లు, బట్టలు, సృజనాత్మక కోరికలు తీరడం, నిజమైన స్నేహితులు.
ఒక వ్యక్తి సంతోషంగా ఉండేందుకు ఆ కారకాలు ఎంతగానో దోహదపడతాయనే విషయాన్ని బహుశా మీరు అంగీకరిస్తారు. కానీ, వాటన్నింటికన్నా ముఖ్యమైన కారకం మరొకటి ఉంది. అదేమిటంటే, యెహోవా అనే పేరుగల ‘సంతోషంగా ఉండే దేవుని’ గురించిన జ్ఞానం. (1 తిమోతి 1:8, NW) ఆ జ్ఞానం ఎలా సహాయపడుతుంది? యెహోవా మన సృష్టికర్త, ఆయనే మనకు సంతోషంగా ఉండగలిగే సామర్థ్యాన్నిచ్చాడు. కాబట్టి, మనల్ని నిజంగా ఏది సంతోషపెట్టగలదో యెహోవాకే తెలుసు. ఏ ప్రాంతంలోనివారినైనా, లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా ఆయన నిరంతర సంతోషమయ జీవితానికి ఎలా నడిపిస్తాడో తర్వాతి శీర్షిక వివరిస్తుంది.
[4వ పేజీలోని చిత్రం]
పూలు పూసే మొక్కలాగే సంతోషం కూడా పెరగాలంటే, అనుకూలమైన పరిస్థితులు అవసరం
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Gideon Mendel/CORBIS