కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషానికి నడిపించే నమ్మదగిన మార్గనిర్దేశం

సంతోషానికి నడిపించే నమ్మదగిన మార్గనిర్దేశం

సంతోషానికి నడిపించే నమ్మదగిన మార్గనిర్దేశం

“సంతోషం పొందడానికి ప్రయత్నించడం” ప్రతీ మానవునికీ ఉన్న హక్కు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను రూపొందించినవారు అలా భావించారు. కానీ, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించడం దానిని సాధించినట్లు కాదు. చాలామంది యౌవనులు వినోదరంగంలో, క్రీడారంగంలో నిలదొక్కుకునే అవకాశాల కోసం ప్రయత్నిస్తారు, అయితే వారు అంతగా ఆశించిన విజయాన్ని నిజంగా ఎంతమంది సాధించారు? విజయవంతమైన సంగీతకారునిగా తయారయ్యేందుకు పడాల్సిన కష్టాలను గుర్తెరిగిన ఒక ప్రఖ్యాత గాయకుడు ఇలా అన్నాడు “మీరు బహుశా విజయం సాధించకపోవచ్చు.”

సంతోషాన్ని పొందడానికి చేసే ప్రయత్నం విషయంలో మీకూ అలాగే అనిపిస్తే, మీరు నిరుత్సాహానికి గురవకుండా ఉండేందుకు మంచి కారణాలున్నాయి. మీరు సంతోషం కోసం సరైన విధంగా ప్రయత్నిస్తే దాన్ని తప్పకుండా పొందుతారు. అలా అని మనమెందుకు అనవచ్చు? ముందటి శీర్షిక ‘సంతోషంగా ఉండే దేవుడు’ అయిన యెహోవా గురించి ప్రస్తావించింది. (1 తిమోతి 1:⁠8, NW) మీ సంతోషాన్వేషణ మిమ్మల్ని నిరాశకు గురిచేయకుండా ఉండేందుకు దేవుడు బైబిల్లో మార్గనిర్దేశాన్ని అందించాడు. దుఃఖాన్ని తీసుకువచ్చే సర్వసాధారణ కారణాల్ని అధిగమించేందుకు యెహోవా మీకు సహాయం చేయగలడు. ఉదాహరణకు, మీ ప్రియమైనవారు చనిపోయినప్పుడు ఆయన మీకు అందించే ఓదార్పును పరిశీలించండి.

ప్రియమైనవారు చనిపోయినప్పుడు

మరణం గురించి చెప్పుకోదగ్గ మంచి విషయమేదైనా ఉందా? మరణం తల్లిదండ్రుల్ని పిల్లల నుండి, పిల్లల్ని తల్లిదండ్రుల నుండి వేరుచేస్తుంది. ఆప్తమిత్రుల్ని విడదీస్తుంది, సమైక్య సమాజాల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తుంది. మరణం సంభవిస్తే సంతోషంగా ఉండే కుటుంబం దుఃఖంలో మునిగిపోవచ్చు.

మరణం విషాదకరమైనదని మీకెవ్వరూ చెప్పనవసరం లేదు. కానీ, కొందరు ఆ వాస్తవాన్ని నిరాకరించి మరణాన్ని ఒక ఆశీర్వాదంగా చిత్రీకరిస్తారు. ఆగస్టు 2005లో మెక్సికో సింధుశాఖపై కత్రీనా హరికేన్‌ విరుచుకుపడినప్పుడు ఏమి జరిగిందో గమనించండి. తుఫానుకు బలైన ఒక వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్నప్పుడు మతగురువు ఇలా అన్నాడు: “ఆయన కత్రీనావల్ల మరణించలేదు. దేవుడు ఆయనను పరలోకానికి తీసుకువెళ్లాడు.” మరో సందర్భంలో, సదుద్దేశంగల ఆస్పత్రి క్లర్కు, దిగులుపడొద్దని తల్లిని కోల్పోయిన కూతురితో చెప్పాడు, ఎందుకంటే దేవుడు వాళ్ల అమ్మను పరలోకానికి తీసుకువెళ్లాడని ఆయన అన్నాడు. ఆ కూతురు ఇలా విలపించింది: “ఎందుకు, ఎందుకు ఆయన నా నుంచి మా అమ్మను తీసుకెళ్లాల్సొచ్చింది?”

మరణించినవారి విషయంలో అలాంటి తప్పుడు నమ్మకాలు ఆప్తుల్ని కోల్పోయిన వారిని ఓదార్చడంలో తరచూ విఫలమౌతాయి. ఎందుకు? ఎందుకంటే అలాంటి నమ్మకాలు మరణం గురించిన సత్యాన్ని తెలియజేయవు. అంతకన్నా ఘోరమైన విషయమేమిటంటే, భీతిగొలిపే బాధాకరమైన పద్ధతుల్లో తమ ప్రియమైనవారిని, కుటుంబాల నుండి, స్నేహితుల నుండి దోచుకునేవాడిగా అవి దేవుణ్ణి చిత్రీకరిస్తాయి. అవి ఓదార్పునిచ్చే బదులు, మరణమనే విషాదకరమైన నాటకంలో దేవుడు దుష్టవ్యక్తిగా కనబడేలా చేశాయి. అయితే, దేవుని వాక్యం మరణం గురించిన సత్యాన్ని తెలియజేస్తుంది.

బైబిలు మరణాన్ని శత్రువు అని పిలుస్తోంది. అది మరణాన్ని మానవజాతిపై ఏలిన రాజుతో పోల్చింది. (రోమీయులు 5:⁠17; 1 కొరింథీయులు 15:​26) మరణమనే శత్రువు ఎంత బలమైనదంటే దాన్ని ఏ మానవుడూ ఎదిరించలేడు, చనిపోయే ప్రతీ ప్రియమైన వ్యక్తీ మరణానికి బలైపోయిన అసంఖ్యాకుల్లో ఒకరవుతారు. ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు మనలో చోటుచేసుకునే వ్యథను, నిస్సహాయతను బైబిలు సరిగ్గా వివరిస్తోంది. అలాంటి భావాలు సహజమైనవేనని అది ధృవీకరిస్తోంది. అయితే, దేవుడు మన ప్రియమైనవారిని పరలోకానికి తీసుకువెళ్లడానికి మరణమనే శత్రువుని ఉపయోగిస్తాడా? ఆ ప్రశ్నకు బైబిల్నే సమాధానం చెప్పనివ్వండి.

ప్రసంగి 9:​5, 10 ఇలా చెబుతోంది: “అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు. . . . నీవు పోవు పాతాళమునందు [“షియోల్‌లో,” NW] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” షియోల్‌ అంటే ఏమిటి? అది మానవులు చనిపోయిన తర్వాత చేరుకునే మానవజాతి సామాన్య సమాధి. సమాధుల్లో మృతులు పూర్తిగా నిష్క్రియులుగా ఉంటారు, వారిలో చలనం, స్పర్శ, ఏ విధమైన ఆలోచనలూ ఉండవు. వారు గాఢనిద్రలో ఉన్నట్టుగానే ఉంటారు. * కాబట్టి, దేవుడు మరణించిన మన ప్రియమైనవారిని తనతో ఉండడానికి పరలోకానికి తీసుకువెళ్లడని బైబిలు స్పష్టం చేస్తోంది. మరణపు పరిణామాలు వారిని సమాధుల్లో నిర్జీవంగా ఉంచాయి.

ఆ సత్యాన్ని యేసు తన స్నేహితుడైన లాజరు మరణించిన తర్వాత ధృవీకరించాడు. యేసు, మరణాన్ని నిద్రతో పోల్చాడు. ఒకవేళ లాజరు సర్వశక్తిమంతుడైన దేవునితో ఉండడానికి పరలోకానికి వెళ్లి ఉంటే, చివరకు మళ్లీ చనిపోయేందుకు ఈ భూమ్మీదికి ఆయనను యేసు తిరిగి రప్పించడం నిర్దయగా ప్రవర్తించినట్లవుతుంది. ఆ సమాధి దగ్గర యేసు బిగ్గరగా ఇలా అన్నాడని ప్రేరేపిత వృత్తాంతం చెబుతోంది: “లాజరూ, బయటికి రమ్ము!” బైబిలు ఇంకా ఇలా అంటోంది: ‘చనిపోయినవాడు వెలుపలికి వచ్చెను.’ లాజరు మళ్లీ జీవించాడు. లాజరు భూమిని వదిలి వెళ్లలేదని యేసుకు తెలుసు. ఆయన తన సమాధిలో నిర్జీవంగా ఉన్నాడు.​—⁠యోహాను 11:​11-14, 34, 38-44.

బైబిల్లో నమోదు చేయబడిన ఈ వృత్తాంతం, మానవుల్ని భూమినుండి పరలోకానికి తీసుకువెళ్లడానికి దేవుడు మరణాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించడని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుడు మన దుఃఖానికి కారణం కాదని తెలుసుకున్నాం కాబట్టి మనం ఆయనకు సన్నిహితమవ్వవచ్చు. మరణమనే శత్రువు కారణంగా మనకు కలిగే వ్యథను, నష్టాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో కూడా మనం ఉండవచ్చు. అంతేగాక, మరణించినవారి స్థితి గురించిన బైబిలు సత్యం, వారు నరకాగ్నిలో లేదా పాపవిమోచనాలోకంలో బాధననుభవించరనీ, బదులుగా వారు సమాధిలో నిర్జీవంగా ఉన్నారని రుజువుచేస్తోంది. కాబట్టి, మన ప్రియమైనవారి గురించిన జ్ఞాపకాలు దేవునిపై ద్వేషంతో లేక వారెక్కడ ఉన్నారనే భయంతో మలినం కానవసరంలేదు. అంతేకాదు, యెహోవా బైబిల్లో మరింత ఓదార్పును అందిస్తున్నాడు.

నిరీక్షణ సంతోషానికి నడిపిస్తుంది

మనం చర్చించిన లేఖనాలు సంతోషానికి నిరీక్షణ కీలకమని చూపిస్తున్నాయి. బైబిల్లో ఉపయోగించబడిన “నిరీక్షణ” అనే పదానికి, మేలు జరుగుతుందనే నమ్మకంతో ఎదురుచూడడం అనే అర్థముంది. మన ప్రస్తుత సంతోషానికి నిరీక్షణ ఎలా దోహదపడగలదో తెలుసుకోవడానికి యేసు లాజరును పునరుత్థానం చేసిన వృత్తాంతాన్ని గురించి మనం మరింత చర్చిద్దాం.

యేసు ఆ అద్భుతాన్ని చేయడానికి కనీసం రెండు కారణాలున్నాయి. ఒకటేమిటంటే, మార్తా మరియల, దుఃఖాక్రాంతులైన స్నేహితుల వ్యథను తొలగించడానికి అలా చేశాడు. వారు తమ ప్రియమైన వ్యక్తి సాంగత్యాన్ని తిరిగి ఆస్వాదించగలుగుతారు. కానీ, యేసు మార్తతో మరో ప్రాముఖ్యమైన కారణాన్ని పేర్కొన్నాడు: “నీవు నమ్మినయెడల దేవుని మహిమచూతువని నేను నీతో చెప్పలేదా?” (యోహాను 11:​40) జె. బి. ఫిలిప్స్‌, అనువదించిన ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మోడర్న్‌ ఇంగ్లీష్‌ బైబిలు, ఆ చివరి మాటలు “దేవుడు చేయగలిగిన కార్యాల మహిమ” అని అనువదిస్తోంది. యేసు లాజరును తిరిగి బ్రతికించడం ద్వారా యెహోవా దేవుడు భవిష్యత్తులో ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో ముందే చూపించాడు. “దేవుడు చేయగలిగిన కార్యాల మహిమ” గురించిన మరిన్ని వివరాల్ని పరిశీలించండి.

యోహాను 5:⁠28, 29లో యేసు ఇలా అన్నాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు . . . బయటికి వచ్చెదరు.” అంటే షియోల్‌లో ఉన్న మన ప్రియమైనవారితో సహా మృతులందరూ తిరిగి బ్రతికించబడతారు. ఆ గొప్ప సంఘటన గురించి అపొస్తలుల కార్యములు 24:⁠14 మరింత వెల్లడిచేస్తోంది, అదిలా చెబుతోంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” అంటే, “అనీతిమంతులకు” లేదా యెహోవా ఎవరో తెలియక ఆయనను సేవించని అనేకమందికి కూడా భవిష్యత్తులో దేవుని అనుగ్రహం సంపాదించుకొనే అవకాశం లభిస్తుంది.

పునరుత్థానం ఎక్కడ జరుగుతుంది? కీర్తన 37:⁠29 ఇలా అంటోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” దానర్థమేమిటో ఒక్కసారి ఊహించుకోండి! మరణం వల్ల విడిపోయిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మళ్లీ ఈ భూమిపై కలుసుకుంటారు. ఎవరి సాంగత్యాన్నైతే మీరొకప్పుడు ఎంతో విలువైందిగా పరిగణించారో, వారితో కలిసి గడిపే సంతోషమయ సమయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోవడం సమంజసమే.

మీరు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

మీకు సమస్యలున్నా, యెహోవా మీ సంతోషాన్ని ఏ రెండు విధాలుగా అధికం చేయగలడో పరిశీలించాం. ఒకటేమిటంటే, ఆయన బైబిలు ద్వారా మీరు సమస్యలను విజయవంతంగా ఎదుర్కోవడానికి సహాయం చేసే జ్ఞానాన్ని, నిర్దేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరణం వల్ల వచ్చే వ్యథను తట్టుకోవడానికే కాక ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలతో వ్యవహరించేందుకు కూడా బైబిలు ఉపదేశం మనకు సహాయం చేస్తుంది. సమాజంలోని అన్యాయాన్ని రాజకీయ సంక్షోభాన్ని సహించడానికి అది మీకు శక్తినివ్వగలదు. మీరు దాని నిర్దేశాన్ని జీవితంలో అన్వయించుకుంటే, మరితర వ్యక్తిగత సమస్యలతో వ్యవహరించడానికి అది మీకు సహాయం చేయగలదు.

రెండవదిగా, బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా మానవ సమాజం అందించేవాటన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన నిరీక్షణను మీరు పొందుతారు. మన స్నేహితులు, కుటుంబ సభ్యులు పునరుత్థానం చేయబడడమనేది బైబిలు బోధించే నిరీక్షణలో భాగంగా ఉంది. ప్రకటన 21:​3, 4 మరిన్ని వివరాలు ఇస్తుంది: “దేవుడు తానే వారి [మానవజాతి] దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” అంటే, మీ జీవితంలో దుఃఖాన్ని తీసుకొచ్చే ఎలాంటి కారణమైనా త్వరలోనే శాశ్వతంగా గతించిపోతుంది. బైబిలు వాగ్దానాలు తప్పక నెరవేరతాయి, వాటి నెరవేర్పును మీరు ఆస్వాదించవచ్చు. భవిష్యత్తులో మంచి కాలాలు రాబోతున్నాయని తెలుసుకోవడమే మనకు ఉపశమనాన్నిస్తుంది. మరణం తర్వాత మీరు నిరంతరం బాధననుభవించరని తెలుసుకోవడం మీరు సంతోషించేందుకు ఒక కారణం.

ఉదాహరణకు, చాలా సంవత్సరాల క్రితం తన భర్త క్యాన్సర్‌వల్ల ఎంతో బాధననుభవించి చనిపోవడాన్ని మారియ కళ్లారా చూసింది. ఆ దుఃఖం నుండి తేరుకోకముందే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె, ఆమె ముగ్గురు కూతుళ్లు తమ సొంత ఇంటిని వదిలివెళ్లాల్సి వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత, తనకు కూడా క్యాన్సర్‌ ఉందని మారియకు తెలిసింది. ఆమె రెండు పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకుంది, ప్రతీరోజు తీవ్రమైన నొప్పిని భరిస్తుంది. ఈ సమస్యలున్నప్పటికీ, ఆమె ఎంత ఆశావహ దృక్పథంతో ఉందంటే, అది ఇతరుల్ని ప్రోత్సహించేలా ఆమెను పురికొల్పుతుంది. ఆమె తన సంతోషాన్ని ఎలా కాపాడుకుంటోంది?

మారియ ఇలా చెబుతోంది: “నాకు ఒక సమస్య ఎదురైనప్పుడు, నా గురించే ఎక్కువగా ఆలోచించకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ‘నాకే ఎందుకిలా జరగాలి? నేనెందుకు ఇలా బాధననుభవించాలి? నేనెందుకు అనారోగ్యం పాలవ్వాలి?’ వంటి ప్రశ్నలను నా మదిలోకి రానివ్వను. ప్రతికూల ఆలోచన నన్ను బలహీనపరుస్తుంది. నేను నా శక్తిని యెహోవాను సేవించడానికీ, ఇతరులకు సహాయపడడానికీ ఉపయోగిస్తాను. అది నాకు సంతోషాన్నిస్తుంది.”

మారియకున్న నిరీక్షణ ఆమెకెలా సహాయం చేస్తోంది? యెహోవా మానవజాతి నుండి అనారోగ్యాన్ని, ఇతర సమస్యలను తీసివేసే భవిష్యత్తు నిరీక్షణను ఆమె తన మనసులో ఉంచుకుంటుంది. ఆమె చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు, అక్కడున్న నిరాశాపరులైన ఇతర క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులతో ఆమె తన నిరీక్షణను పంచుకుంటుంది. మారియకు నిరీక్షణ ఎంత ప్రాముఖ్యం? ఆమె ఇలా అంటోంది: “నిరీక్షణ ఆత్మకు లంగరులా ఉంటుందని హెబ్రీయులు 6:⁠19లో పౌలు వర్ణించిన బైబిల్లోని మాటల గురించి నేను తరచూ ఆలోచిస్తుంటాను. ఆ లంగరు లేకపోతే మనం తుఫానులో చిక్కుకున్న నావలా కొట్టుకొనిపోతాం. కానీ మనం అలా లంగరువేయబడితే, తుఫానులాంటి సమస్యలు ఎదురైనా మనం సురక్షితంగా ఉంటాం.” మారియ సంతోషంగా ఉండడానికి, ‘అబద్ధమాడనేరని దేవుడు వాగ్దానం చేసిన నిత్యజీవ నిరీక్షణ’ సహాయం చేస్తోంది. అది మీకూ సహాయం చేయగలదు.​—⁠తీతు 1:​1-2.

మీకు సమస్యలున్నా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా మీరు నిజమైన సంతోషాన్ని పొందగలరు. కానీ, బైబిలును అధ్యయనం చేయడం ఎంతమేరకు ప్రయోజనం చేకూరుస్తుందో అని మీరు సందేహించవచ్చు. మీరు నిజంగా సంతోషాన్ని పొందాలంటే, మీరు తెలుసుకోవాల్సిన లేఖనాధారిత జవాబుల్ని చూపించడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. యెహోవా వాగ్దానం చేసిన నిరీక్షణ నెరవేరడం కోసం మీరు ఎదురుచూస్తుండగా, “ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును” అని వర్ణించబడినవారిలో మీరూ ఒకరిగా ఉండగలరు.​—⁠యెషయా 35:​9-10.

[అధస్సూచి]

^ పేరా 9 “నొప్పి లేదా సంతోషం అనేవి, శిక్ష లేదా ప్రతిఫలం అనేవి” లేని స్థలం షియోల్‌ అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (2003) వర్ణిస్తోంది.

[5వ పేజీలోని చిత్రం]

బైబిలు సత్యం మాత్రమే దుఃఖాన్ని తగ్గించగలదు

[7వ పేజీలోని చిత్రం]

పునరుత్థానం గురించిన బైబిలు నిరీక్షణ సంతోషానికి దోహదపడగలదు