“గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును”
“గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును”
“ఉపదేశముమీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవి యొగ్గుము” అని సామెతలు 23:12 పేర్కొంటోంది. ఈ లేఖనంలో పేర్కొనబడిన “ఉపదేశము”లో లేక నైతిక శిక్షణలో స్వయం క్రమశిక్షణే కాక ఇతరుల నుండి మనకు లభించే గద్దింపు కూడా ఇమిడివుంది. మనం అలా ఇతరులకు ఉపదేశించాలంటే లేదా వారిని క్రమశిక్షణలో పెట్టాలంటే వారికి ఎలాంటి దిద్దుబాటు అవసరమో, దానిని ఎలా ఇవ్వాలో మనం తెలుసుకోవాలి. కాబట్టి, ఇతరులను క్రమశిక్షణలో పెట్టడానికి నమ్మదగిన మూలం నుండి “తెలివిగల మాటలు” చాలా అవసరం.
బైబిలు పుస్తకమైన సామెతలు తెలివిగల మాటలకు ఒక శ్రేష్ఠమైన మూలం. దానిలోని సామెతలు “జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును . . . నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును” నమోదుచేయబడ్డాయి. (సామెతలు 1:1-3) మనం వాటికి ‘చెవియొగ్గడం’ జ్ఞానయుక్తం. సామెతలు 15వ అధ్యాయం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి, నాలుకను ఉపయోగించడానికి, జ్ఞానాన్ని పంచడానికి సంబంధించిన ఆధారపడదగిన నిర్దేశాన్నిస్తోంది. ఆ అధ్యాయం నుండి కొన్ని లేఖనాలను పరిశీలిద్దాం.
ఏది “క్రోధమును చల్లార్చును”?
మాట్లాడే మాటలు కోపాన్ని లేక క్రోధాన్ని ఎలా రేపుతాయో ప్రాచీన ఇశ్రాయేలు రాజు ఇలా పేర్కొంటున్నాడు: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) బలమైన భావోద్రేకాన్ని లేక అసంతృప్తివల్ల కలిగే ప్రతిస్పందనను వివరించడానికి “కోపము” అనే పదం ఉపయోగించబడుతుంది. “అదుపులో ఉంచుకోవడానికి చాలా కష్టంగా ఉండే రౌద్రరసం” అని “క్రోధము” నిర్వచించబడింది. ఎదుటి వ్యక్తికి కలిగే కోపంతో వ్యవహరించడానికే కాక మన కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవడానికి ఈ సామెత మనకెలా సహాయం చేయవచ్చు?
బాధ కలిగించే కఠినమైన మాటలు చెడు పరిస్థితిని మరింత విషమించేలా చేయవచ్చు. మరోవైపు, మృదువైన జవాబు సాధారణంగా ప్రశాంతతను కలిగించవచ్చు. కానీ, కోపంగా ఉన్న వ్యక్తికి మృదువైన జవాబివ్వడం ఎల్లప్పుడూ సులభంకాదు. అయితే, ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తే అలా చెప్పడం మనకు సులభమవుతుంది. “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 19:11) తనకు ధైర్యంలేదు కాబట్టి లేక ఇతరుల అవధానాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి కోపం వచ్చిందా? మనమన్న మాటలనుబట్టి లేక చేసిన పనులనుబట్టి ఆయనకు కోపం వచ్చివుండకపోవచ్చు. క్రైస్తవ పరిచర్యలో గృహస్థులు కోపంగా ప్రతిస్పందించారంటే, వారికి మన నమ్మకాల గురించి తప్పుడు సమాచారం అందిన కారణంగా లేక ఏదో ఒక తప్పుడు అభిప్రాయం ద్వారా తప్పుదారి పట్టించబడిన కారణంగా అలా సాధారణంగా ప్రతిస్పందించివుండవచ్చు కదా? మనం దానిని వ్యక్తిగత దాడిగా పరిగణించి, వారికి కఠినంగా జవాబివ్వాలా? ఒక వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో మనం వెంటనే గ్రహించలేకపోయినా, బాధ కలిగించే మాటలతో ప్రతిస్పందించడం మనకు స్వయం క్రమశిక్షణలేదని సూచిస్తుంది. మనం అలా ప్రతిస్పందించకూడదు.
మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం విషయంలో కూడా మృదువైన జవాబివ్వాలనే సలహా అమూల్యమైనది. మన భావోద్రేకాలను వినేవారికి అభ్యంతరం కలిగించని రీతుల్లో వ్యక్తం చేయడానికి నేర్చుకోవడం ద్వారా మనం అలాంటి సలహాను అన్వయించుకోవచ్చు. కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తున్నప్పుడు, వారితో కఠినంగా మాట్లాడే బదులు లేక అగౌరవపరిచే పదాలను ఉపయోగించి వారిని అవమానించే బదులు మన భావాలను ప్రశాంతంగా వ్యక్తం చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. ఆగ్రహంతో మాట్లాడడం సాధారణంగా ఎదుటివ్యక్తిని ప్రతీకారం తీర్చుకొనేలా పురికొల్పవచ్చు. ఒక వ్యక్తికి మన భావాలను సాత్వికంగా చెప్పడం అంత నిందించే విధంగా ఉండదు, అది తన ప్రవర్తనను మార్చుకోవడానికి ఆయనను పురికొల్పవచ్చు.
‘జ్ఞానుల నాలుక మనోహరంగా పలుకును’
స్వయం క్రమశిక్షణ మనం మాట్లాడే తీరునే కాక, మనం మాట్లాడే మాటలను కూడా ప్రభావితం చేస్తుంది. “జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 15:2) ఇతరులకు సహాయం చేయాలనే కోరికతో మనం దేవుని సంకల్పం గురించి, ఆయన అద్భుతమైన ఏర్పాట్ల గురించి వారితో మాట్లాడినప్పుడు మనం ‘జ్ఞానాంశములను మనోహరంగా’ ఉపయోగించడంలేదా? బుద్ధిహీనునికి జ్ఞానంలేదు కాబట్టి, అతడు అలా చేయడు.
నాలుక ఉపయోగించే విషయంలో మరింత నిర్దేశాన్నిచ్చే ముందు, సామెతల రచయితయైన సొలొమోను ఆలోచన రేకెత్తించే తారతమ్యాన్ని వివరిస్తున్నాడు. “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.” (సామెతలు 15:3) మనం దీనినిబట్టి ఆనందించవచ్చు ఎందుకంటే మనకు ఇలా హామీ ఇవ్వబడింది: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:9) మనం మంచిని చేస్తున్నామో లేదో దేవునికి తెలుసు. ఆయన చెడును అభ్యసించేవారిని కూడా గమనించి వారిని జవాబుదారులుగా పరిగణిస్తాడు.
సొలొమోను ఇలా చెప్పడం ద్వారా మృదువైన నాలుకకున్న విలువను మరింత నొక్కిచెబుతున్నాడు: “సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.” (సామెతలు 15:4) “జీవవృక్షము” అనే పదబంధం స్వస్థతను, బలపర్చే లక్షణాలను సూచిస్తోంది. (ప్రకటన 22:2) జ్ఞానియైన వ్యక్తి పలికే సాత్వికమైన మాటలు, వినేవారి మనసులను ఉత్తేజపరుస్తాయి. వారు మంచి లక్షణాలను కనపరచేందుకు పురికొల్పుతాయి. దానికి విరుద్ధంగా, మోసకరమైన లేక కుటిలమైన నాలుక వినేవారి మనసులను నలగగొట్టుతుంది.
క్రమశిక్షణను స్వీకరించడం, ‘తెలివిని వెదజల్లడం’
జ్ఞానియైన రాజు ఇంకా ఇలా చెబుతున్నాడు: “మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.” (సామెతలు 15:5) గద్దింపు ఇవ్వనట్లయితే ఎవరైనా ఎలా ‘గద్దింపుకు లోబడగలరు’? అవసరమైనప్పుడు సరిదిద్ది, క్రమశిక్షణలో పెట్టాలని ఈ లేఖనం సూచించడంలేదా? ఒక కుటుంబంలో పిల్లలను క్రమశిక్షణలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులది, ప్రత్యేకంగా ఆ బాధ్యత తండ్రిది, దానిని స్వీకరించడం పిల్లల బాధ్యత. (ఎఫెసీయులు 6:1-3) అయితే, యెహోవా సేవకులందరూ ఏదో ఒక విధమైన క్రమశిక్షణను పొందుతారు. “[యెహోవా] తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును” అని హెబ్రీయులు 12:5 చెబుతోంది. మనం క్రమశిక్షణకు ప్రతిస్పందించే తీరు మనం జ్ఞానులమా మూర్ఖులమా అనేది వెల్లడిచేస్తుంది.
సొలొమోను మరో వ్యత్యాసాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు: “జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు.” (సామెతలు 15:7) జ్ఞానాన్ని అందించడం విత్తనాలను వెదజల్లడంలాంటిది. ప్రాచీన కాలంలో, ఒక వ్యవసాయదారుడు ఒకే స్థలంలో తన విత్తనాలన్నీ చల్లేవాడు కాదు. అయితే ఆయన పొలమంతటా కొద్దికొద్దిగా విత్తనాలను చల్లేవాడు. జ్ఞానాన్ని అందించే విషయంలో కూడా అలాగే చేయాలి. ఉదాహరణకు, మనం పరిచర్యలో ఎవరినైనా కలుసుకున్నప్పుడు, మనకు బైబిలు గురించి తెలిసిన విషయాలన్నీ ఒకేసారి వారికి చెప్పడం జ్ఞానయుక్తంకాదు. దానికిబదులు, జ్ఞానవంతుడైన వ్యక్తి క్రమశిక్షణతో మాటలాడతాడు. ఆయన తాను చెప్పే విషయాలను వింటున్న వ్యక్తి ప్రతిస్పందనను పరిగణలోకి తీసుకొని, ప్రతీసారి కేవలం ఒక బైబిలు సత్యం గురించి మాత్రమే క్రమంగా నొక్కిచెప్పి దానిమీద చర్చ కొనసాగించినప్పుడు, ఆయన జ్ఞానాన్ని ‘వెదజల్లుతాడు.’ మన మాదిరికర్తయైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అలాగే చేశాడు.—యోహాను 4:7-26.
జ్ఞానం అందించడంలో ఉపదేశాత్మకమైన, ప్రయోజనకరమైన అంశాలను చెప్పడం ఇమిడివుంది. మనం సమాచారాన్ని అందించే, ప్రోత్సహించే మాటలు మాట్లాడడానికి ధ్యానించడం అవసరం. కాబట్టి, “మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు.” (సామెతలు 15:28, ఈజీ-టు-రీడ్ వర్షన్) మన మాటలు దారిలో ఉన్నవాటినన్నింటినీ నాశనంచేసే, పిలవకుండా వచ్చే నీటిప్రవాహంలా ఉండకుండా నేలను తడిపే ప్రయోజనకరమైన చిరుజల్లులా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!
‘ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి’
యెహోవా గురించిన, ఆయన సంకల్పం గురించిన జ్ఞానాన్ని వెదజల్లి, “స్తుతియాగము”గా ఆయనకు “జిహ్వాఫలము” అర్పించడం నిజంగా జ్ఞానయుక్తం. (హెబ్రీయులు 13:15) అయితే అలాంటి అర్పణ యెహోవాకు ఆమోదకరంగా ఉండాలంటే మనం ‘సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా’ ఉండాలి. (1 పేతురు 1:14-16) రెండు విభిన్నమైన సామెతలను ఉపయోగించడం ద్వారా సొలొమోను ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని మనకు బలంగా నొక్కిచెబుతున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.”—సామెతలు 15:8, 9.
జీవమార్గాన్ని విడిచిపెట్టేవారు గద్దింపును ఎలా దృష్టిస్తారు, వారు ఎలాంటి పర్యవసానాలను అనుభవిస్తారు? (మత్తయి 7:13, 14) “మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.” (సామెతలు 15:10) చెడు క్రియలు చేస్తున్న కొందరు, క్రైస్తవ సంఘంలోని బాధ్యతగలవారు ఇచ్చే దిద్దుబాటు సలహాను అంగీకరించి, యథార్థంగా పశ్చాత్తాపపడే బదులు, నీతి మార్గాన్ని విడిచిపెట్టేందుకు నిర్ణయించుకుంటారు. అది ఎంతటి మూర్ఖత్వమో కదా!
ఒక వ్యక్తి గద్దింపును అంగీకరిస్తున్నట్లు నటించి దానిని నిజంగా ద్వేషిస్తున్నట్లయితే అప్పుడేమిటి? అది కూడా జ్ఞానయుక్తం కాదు. “పాతాళమును [“షియోల్,” NW] అగాధకూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?” అని ఇశ్రాయేలు రాజు అన్నాడు. (సామెతలు 15:11) సూచనార్థకంగా, సజీవుడైన దేవునికి మరణించినవారి స్థలమైన షియోల్‌కన్నా దూరమైన స్థలం వేరేదేదీ లేదు. అయినా, అది ఆయనకు కనబడుతుంది. అక్కడున్న వారందరి గుర్తింపు, వ్యక్తిత్వం ఆయనకు తెలుసు, ఆయన వారిని పునరుత్థానం చేయగలడు. (కీర్తన 139:8; యోహాను 5:28, 29) అలాంటప్పుడు, వ్యక్తుల హృదయాల్లో ఏముందో తెలుసుకోవడం ఆయనకెంత సులభమో కదా! “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 4:13) నటించడంవల్ల మానవులను మోసగించవచ్చేమో గానీ దేవుణ్ణి మోసగించలేం.
క్రమశిక్షణను తిరస్కరించేవారు గద్దింపునే కాక గద్దింపును ఇచ్చే వ్యక్తిని కూడా ద్వేషిస్తారు. “అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు” అని సొలొమోను చెప్పాడు. ఆ విషయాన్ని నొక్కి చెప్పడానికి అలాంటి మరో తలంపును ఆయన పేర్కొన్నాడు: “వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.” (సామెతలు 15:12) అలాంటి వ్యక్తి తన మార్గాన్ని సరిచేసుకుంటాడనే నమ్మకం చాలా తక్కువే కదా!
ఆశావహ దృక్పథం
“హృదయం” అనే మాట గురించిన ప్రస్తావన, సొలొమోను వ్రాసిన తర్వాతి మూడు సామెతలను కలుపుతుంది. మన భావోద్వేగాలు మన ముఖంపై చూపించే ప్రభావాన్ని వివరిస్తూ జ్ఞానవంతుడైన రాజు ఇలా చెబుతున్నాడు: “సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.”—సామెతలు 15:13.
ఏది మనోదుఃఖాన్ని కలిగించవచ్చు? “ఒకని హృదయములోని విచారము దాని [బాధతో] క్రుంగజేయును” అని బైబిలు పేర్కొంటోంది. (సామెతలు 12:25) జీవితంలోని ప్రతికూల విషయాలు మనల్ని క్రుంగదీయకుండా ఉండేందుకు మనం ఏమి చేయవచ్చు? మన అదుపులో అంతగాలేని పరిస్థితుల గురించే ఎల్లప్పుడూ ఆలోచించే బదులు యెహోవా మనకు ఇప్పుడు అనుగ్రహించిన విస్తారమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాల గురించి, ఆయన భవిష్యత్తులో మనకు అనుగ్రహించబోయే ఆశీర్వాదాల గురించి ఆలోచించవచ్చు. అది మనల్ని ఆయనకు సన్నిహితులను చేస్తుంది. అవును, మనం “సంతోషంగా ఉండే దేవునికి” సన్నిహితులమవడం మన విచార హృదయాలకు ఖచ్చితంగా ఆనందాన్నిస్తుంది.—1 తిమోతి 1:11, NW.
అంతేకాక, బైబిల్లో ఉన్న సందేశం ఓదార్పుకు, ఆనందానికి శ్రేష్ఠమైన మూలం. “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు” వ్యక్తి సంతోషంగా ఉంటాడని కీర్తనకర్త ప్రకటించాడు. (కీర్తన 1:1, 2) మనం మనోదుఃఖాన్ని అనుభవిస్తున్నప్పటికీ బైబిలును చదివి దానిలోని విషయాలను ధ్యానించడం ద్వారా మనం ప్రోత్సహించబడతాం. దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య కూడా ఉంది. “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు” అనే హామీ మనకు ఇవ్వబడింది.—కీర్తన 126:5.
“బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 15:14) జ్ఞానవంతుడైన వ్యక్తి ఇచ్చే సలహాకూ, మూర్ఖుడు ఇచ్చే సలహాకూ మధ్య కొట్టొచ్చినట్లు కనిపించే వ్యత్యాసాన్ని ఈ సామెత మన దృష్టికి తీసుకువస్తుంది. బుద్ధిమంతుడు సలహా ఇచ్చే ముందు జ్ఞానం కోసం పరిశోధిస్తాడు. ఆయన జాగ్రత్తగా విని అవసరమైన వాస్తవాలను తెలుసుకుంటాడు. ఆ పరిస్థితికి అన్వయించే నియమాలను, సూత్రాలను ధృవీకరించుకోవడానికి లేఖనాలను పరిశోధిస్తాడు. ఆయన సలహా దేవుని వాక్యంమీద బలంగా ఆధారపడుతుంది. అయితే, మూర్ఖుడు పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా తనకు తోచిన విధంగా వాగుతాడు. కాబట్టి, మనం సలహా అడగాలనుకుంటున్నప్పుడు, మనం వినాలనుకుంటున్న విషయాలే చెప్పేవారి దగ్గరికి వెళ్లే బదులు జ్ఞానవంతులైన, పరిపక్వతగల వ్యక్తుల దగ్గరికి వెళ్లడం జ్ఞానయుక్తం. సలహా ఇచ్చే ముందు ‘జ్ఞానము కోసం వెదికే’ ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈవులు’ క్రైస్తవ సంఘంలో ఉండడం ఎంత మంచిదో కదా!—ఎఫెసీయులు 4:8.
తర్వాతి సామెత, ఆశావహ దృక్పథంతో ఉండడంవల్ల కలిగే అత్యుత్తమ ప్రయోజనం గురించి పేర్కొంటోంది. ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “బాధపడువాని దినములన్నియు శ్రమకరములు. సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.” (సామెతలు 15:15) జీవితంలో సంతోష సమయాలు, కష్టాలు, ఆనందాలు, కన్నీళ్లు అనేవి ఉంటాయి. మనం కేవలం ప్రతికూల విషయాల గురించే ఆలోచిస్తే దుఃఖం మన ఆలోచనలను ముంచెత్తి మన దినాలను నిరాశపూరితంగా చేస్తుంది. అయితే, వ్యక్తిగత ఆశీర్వాదాల గురించి, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే, జీవితంలో బాధాకరమైన విషయాలకు మనం ప్రాముఖ్యతనివ్వం, తద్వారా మనం అంతరంగ ఆనందాన్ని చవిచూస్తాం. ఆశావహ దృక్పథంవల్ల మనం “నిత్యము విందు” ఆస్వాదించగలుగుతాం.
కాబట్టి, మనం క్రమశిక్షణపట్ల ఎంతో గౌరవాన్ని కలిగివుందాం. అది మన భావోద్రేకాలను, సంభాషణను, క్రియలనే కాక మన దృక్పథాన్ని కూడా ప్రభావితం చేయనిద్దాం.
[13వ పేజీలోని చిత్రం]
“మృదువైన మాట క్రోధమును చల్లార్చును”
[15వ పేజీలోని చిత్రం]
పిల్లలను క్రమశిక్షణలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులది
[15వ పేజీలోని చిత్రం]
“జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును”