కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞానం కోసం అన్వేషణ

జ్ఞానం కోసం అన్వేషణ

జ్ఞానం కోసం అన్వేషణ

“జ్ఞానంకన్నా అజ్ఞానం శ్రేష్ఠమైనదికాదు” అని ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త అయిన ఎన్రికో ఫెర్మి భార్యయైన లారా ఫెర్మి పేర్కొంది. కొందరు దానితో ఏకీభవించకపోవచ్చు, మీకు తెలియని విషయం మీకు ఎన్నడూ హానికరంకాదని వారు వాదించవచ్చు. అయితే, ఆమె మాటలు విజ్ఞానశాస్త్ర పరిశోధన రంగానికే కాక జీవితంలోని ఇతర రంగాలకు కూడా వర్తిస్తాయని చాలామంది ఏకీభవిస్తారు. అజ్ఞానం, అంటే సత్యం గురించి తెలియకపోవడం, శతాబ్దాలుగా చాలామంది మేధాసంబంధమైన, నైతిక, ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టుమిట్టాడేలా చేసింది.​—⁠ఎఫెసీయులు 4:​18.

అందుకే మేధావులు జ్ఞానం కోసం అన్వేషిస్తారు. మనం ఉనికిలో ఎందుకున్నాం, మనకు భవిష్యత్తులో ఏమి సంభవిస్తుంది వంటి విషయాలు వారు తెలుసుకోవాలనుకుంటారు. వారు ఆ అన్వేషణలో భాగంగా అనేక మార్గాలను ప్రయత్నించారు. మనం వాటిలో కొన్నింటిని క్లుప్తంగా పరిశీలిద్దాం.

మతపరమైన మార్గంలో జ్ఞానం లభిస్తుందా?

బౌద్ధమత సిద్ధాంతం ప్రకారం, బౌద్ధమత స్థాపకుడైన సిద్ధార్థ గౌతముడు మానవులు అనుభవిస్తున్న బాధనుబట్టి, మరణాన్నిబట్టి ఎంతో కలవరపడ్డాడు. “సత్యమార్గాన్ని” అన్వేషించడంలో తనకు సహాయం చేయమని ఆయన హిందూ మతబోధకులను కోరాడు. కొంతమంది బోధకులు తపస్సు చేయమని, తీవ్ర వైరాగ్యాన్ని పాటించమని ఆయనకు సిఫారసు చేశారు. చివరకు గౌతముడు, తీవ్ర వ్యక్తిగత ధ్యాన ప్రక్రియను, నిజమైన జ్ఞానోదయం కలిగే మార్గంగా ఎంచుకున్నాడు.

ఇతరులు జ్ఞానం కోసం అన్వేషిస్తున్నప్పుడు మనసుపై ప్రభావం చూపించే మాదకద్రవ్యాలను ఉపయోగించారు. ఉదాహరణకు, నేడు, నేటివ్‌ అమెరికన్‌ చర్చి సభ్యులు భ్రాంతికారక పదార్థమున్న నాగజెముడు జాతికి చెందిన, పేయోటి అని పిలువబడే మొక్కను “మర్మ జ్ఞానాన్ని వెల్లడిచేసేదిగా” వర్ణిస్తారు.

పద్దెనిమిదవ శతాబ్దపు ఫ్రెంచ్‌ తత్త్వవేత్త జాన్‌-జాక్‌ రూసో, నిజాయితీగా పరిశోధన చేసే ఏ వ్యక్తైనా దేవుని నుండి వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చని నమ్మాడు. ఎలా పొందవచ్చు? “దేవుడు హృదయానికి చెప్పే విషయాలను” వినడం ద్వారా పొందవచ్చు. అప్పుడు, వివిధ విషయాల గురించి మీకున్న అభిప్రాయాలు, అంటే మీ భావోద్రేకాలు, మీ మనస్సాక్షి మీకిచ్చే సంకేతాలు “సంక్లిష్టంగా ఉన్న అనేక మానవ అభిప్రాయాల మధ్య అత్యంత నమ్మకమైన మార్గదర్శకాలుగా” పనిచేస్తాయని రూసో చెప్పాడు.​—⁠హిస్టరీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఫిలాసఫీ.

తర్కశక్తి ద్వారా లభిస్తుందా?

చాలామంది రూసో సమకాలీనులు అలాంటి మతసంబంధమైన ఆలోచనా విధానంతో తీవ్రంగా విభేదించారు. ఉదాహరణకు, తోటి ఫ్రెంచ్‌ వ్యక్తియైన వొల్తేర్‌, మతం ప్రజలకు జ్ఞానం కలిగించే బదులు యూరప్‌ను అజ్ఞానంలోకి, మూఢవిశ్వాసంలోకి, అసహనంలోకి నెట్టివేయడంలో ప్రధాన పాత్ర పోషించిందని భావించాడు, కొందరు చరిత్రకారులు ఆ కాలాన్ని అంధకార యుగం అని పిలుస్తారు.

వొల్తేర్‌, జ్ఞానోదయం అని పేరుపొందిన యూరప్‌కు చెందిన హేతువాద ఉద్యమంలో చేరాడు. దాని అనుచరులు మానవ తర్కం, విజ్ఞానశాస్త్ర పరిశోధన నిజమైన జ్ఞానానికి కీలకాలు అని ప్రాచీన గ్రీకులు నమ్మిన సిద్ధాంతాలను తమ ఉద్యమంలో చేర్చుకున్నారు. మానవ తర్కం మాత్రమే మానవజాతిని “అంతకంతకూ జ్ఞానోదయం పొందే శతాబ్దంవైపుకు” నడిపిస్తుందని అది “మునుపటి శతాబ్దాలన్నీ అంధకారంలో ఉన్నట్లు కనిపించేలా చేస్తుందని” హేతువాద ఉద్యమానికి చెందిన మరో సభ్యుడైన బర్నార్డ్‌ డా ఫాంట్నెల్‌ భావించాడు.​—⁠ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.

జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి అనే అంశంమీద ఉన్న పరిస్పర విరుద్ధమైన అనేక సిద్ధాంతాల్లో ఇవి కొన్ని మాత్రమే. సత్యాన్వేషణ కోసం మనం పరిశీలించగల “నమ్మకమైన మార్గదర్శకం” నిజంగా ఏదైనా ఉందా? జ్ఞానం సంపాదించుకోవడానికి నమ్మదగిన మూలం గురించి తర్వాతి ఆర్టికల్‌ ఏమి చెబుతుందో పరిశీలించండి.

[3వ పేజీలోని చిత్రాలు]

గౌతమ (బుద్ధ), రూసో, వొల్తేర్‌ జ్ఞానం సంపాదించుకోవడానికి వివిధ మార్గాలను ప్రయత్నించారు