కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం

నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం

నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం

అది 1810, డిసెంబరు 18. అప్పటికి చీకటిపడుతోంది. అల్లకల్లోలంగావున్న సముద్రంలో, స్కాట్లాండ్‌లోని ఆగ్నేయ తీరానికి కొంతదూరంలో బ్రిటీష్‌ నౌకాదళానికి చెందిన హెచ్‌ఎమ్‌ఎస్‌ పల్లాస్‌ ఓడ దిశతప్పింది. మరింత చీకటి పడుతుండడంవల్ల, మంచు దట్టంగా కురుస్తుండడంవల్ల మార్గం కనిపించడంలేదు, ఓడను సురక్షితంగా దరికి చేర్చడానికి అవసరమయ్యే దీపస్తంభాల నుండి వచ్చే సంకేతాలను కనిపెట్టడం నావికాబృందానికి అంతకంతకూ కష్టమవుతోంది. వారు చివరకు కాంతిని చూసి తమ ఓడను ఆ దిశలో నడిపించినప్పుడు వారు చవిచూసిన ఉపశమనాన్ని ఊహించండి! అయితే బాధాకరంగా అది దరికి చేరవేసే కాంతికాదు. అది వాస్తవానికి తీరం దగ్గర పనివారు వేసుకున్న మంటల కాంతి. పల్లాస్‌ ఓడ రాతిని ఢీకొని పూర్తిగా బద్దలైపోయింది. పదకొండు మంది నావికులు మునిగిపోయారు. అది ఎంతటి విషాద ఘటనో కదా!

పల్లాస్‌ ఓడ విషయంలో, ఒక తప్పిదం దుర్ఘటనకు దారితీసింది. అయితే, ఇతర సందర్భాల్లో నావికులు మోసకరమైన దీపస్తంభాల కాంతులవల్ల దానికన్నా పెద్ద అపాయాన్ని ఎదుర్కొన్నారు. వ్రెక్స్‌, వ్రెకర్స్‌ అండ్‌ రెస్క్యూవర్స్‌ అనే పుస్తకం ప్రకారం, ఓడలు రాతి తీరాలను ఢీకొనేలా తప్పుదోవపట్టించి దానిలోని వస్తువులు కొల్లగొట్టేందుకు అలాంటి కాంతులు ఉద్దేశపూర్వకంగా పెట్టబడేవి.

‘మిమ్మల్ని రక్షణకు నడిపించగల పరిశుద్ధ లేఖనాలు’

జ్ఞానం కోసం మీరు చేసే అన్వేషణలో ఆ నావికులకు ఎదురైనటువంటి సమస్యలే మీకూ ఎదురవుతాయి. మీరు తప్పుదోవపట్టించే సమాచారాన్ని అనుసరించవచ్చు, అంతేకాక ఉద్దేశపూర్వకంగా చేసే మోసానికి మీరు బలికావచ్చు. ఆ రెండు మార్గాలు విపత్తుకు దారితీయవచ్చు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏమి చేయవచ్చు? మీరు జ్ఞానం పొందుతున్న మూలం సరైనదో కాదో, నమ్మదగినదో కాదో చూసుకోండి. ఈ పత్రిక, 125 కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి, దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు, జ్ఞానం సంపాదించుకునేందుకు సహాయపడే అత్యంత నమ్మదగిన ఏకైక మూలమని సమర్థిస్తోంది. దానికి కారణమేమిటంటే, “మిమ్మల్ని జ్ఞానవంతులను చేసి రక్షణకు నడిపించే పరిశుద్ధ లేఖనాలు” దానిలో ఉన్నాయి.​—⁠2 తిమోతి 3:​14-17, న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌.

బైబిలు నమ్మదగిన మార్గదర్శక దీపమనే నమ్మకం మీకు కలగడానికి మీరు దాని ప్రామాణికతను పరిశోధించడం న్యాయమే. (కీర్తన 119:105; సామెతలు 14:​15) బైబిలు నిజంగా దేవునిచే ప్రేరేపించబడిందనే నమ్మకం కలిగించడంలో లక్షలాదిమందికి సహాయం చేసిన సమాచారాన్ని సంపాదించుకోవడానికి ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి. ఉదాహరణకు, సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషుర్‌ను చదవండి. * బైబిలు ఖచ్చితమైనది, ప్రామాణికమైనది, ప్రేరేపితమైనది అని చూపించే అధిక సమాచారం ఆ బ్రోషుర్‌లో ఉంది.

ప్రాథమిక సత్యాలు

అయితే, ఈ “పరిశుద్ధలేఖనాల్లో” ఉన్న కొన్ని ప్రాథమిక సత్యాలేమిటి? క్రింది ఉదాహరణలను పరిశీలించండి.

సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు, సృష్టికర్త ఒక్కడే. (ఆదికాండము 1:⁠1) “[దేవుడు] సమస్తమును సృష్టించి” మనకు జీవాన్నిచ్చాడు కాబట్టే మనం ఉనికిలో ఉన్నాం. (ప్రకటన 4:​10) అందుకే, మన ఆరాధన పొందేందుకు ఆయనే అర్హుడు. పరిపూర్ణ జ్ఞానానికి సృష్టికర్తనే ప్రాథమిక మూలం. (కీర్తన 36:9; యెషయా 30:20, 21; 48:​17, 18) ఆయనకు వ్యక్తిగతంగా ఒక పేరుంది, మనం దానిని ఉపయోగించాలని ఆయన కోరుతున్నాడు. (నిర్గమకాండము 3:​15) హీబ్రూ అక్షరాల్లో వ్రాయబడి YHWHగా లిప్యంతరీకరించబడిన ఆ పేరు, బైబిల్లో దాదాపు 7,000సార్లు కనిపిస్తుంది. శతాబ్దాల నుండి అది తెలుగులో “యెహోవా”గా వాడుకలో ఉంది.​—⁠కీర్తన 83:​18.

పరదైసు పరిస్థితుల్లో ఈ భూమ్మీదే నిరంతరం జీవించేందుకు యెహోవా స్త్రీపురుషులను సృష్టించాడు. ఆయన తన ఆధ్యాత్మిక గుణాలను ప్రతిబింబించే గుణాలను మానవులకు అనుగ్రహించాడు. భూమ్మీద అంతులేని సంతృప్తికరమైన మానవ జీవితాన్ని ఆస్వాదించేందుకు ఆయన వారికి ప్రతిభాసామర్థ్యాలను ఇచ్చాడు. (ఆదికాండము 1:​26-28) భూమి స్త్రీపురుషులకు ఒక రకమైన పరీక్షా స్థలంగా ఉండాలని, పరలోకంలో ఆత్మ సంబంధ జీవితానికి మానవులను సిద్ధపరిచే స్థలంగా ఉండాలని, పరలోకంలో మాత్రమే వారు దేవునితో సంబంధాన్ని ఆనందించగలరని ఆయన భూమి విషయంలో ఎన్నడూ సంకల్పించలేదు.

దేవుడు మానవులను సృష్టించినప్పుడు వారిలో చెడు అనేదేలేదు. దేవుని సృష్టిలో కొందరు, అంటే మానవులే కాక అత్మ సంబంధ ప్రాణులు కూడా తమ స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడే చెడు అనేది ఉనికిలోకి వచ్చింది. (ద్వితీయోపదేశకాండము 32:⁠5) మన మొదటి తల్లిదండ్రులు మంచిచెడులను స్వయంగా నిర్ణయించుకునే హక్కును చేజిక్కించుకున్నారు. (ఆదికాండము 2:17; 3:​1-5) అది మానవ కుటుంబానికి మరణం తెచ్చిపెట్టింది. (ఆదికాండము 3:19; రోమీయులు 5:​12) తిరుగుబాటు ద్వారా లేవదీయబడిన వివాదాలను పరిష్కరించడానికి దుష్టత్వాన్ని తాత్కాలికంగా అనుమతించాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. అయితే భూమిపట్ల, మానవ కుటుంబంపట్ల ఆయన సంకల్పం మారలేదు. (యెషయా 45:​18) భవిష్యత్తలో, శుభ్రపరచబడిన భూమ్మీద, పరదైసు పరిస్థితుల్లో, స్త్రీపురుషులు నిరంతరం జీవిస్తారు.​—⁠మత్తయి 6:9; ప్రకటన 21:​1-5.

యేసుక్రీస్తు సర్వశక్తిగల దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు స్వయంగా తన అనుచరులకు ఇలా ప్రార్థించమని బోధించాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:⁠9) తాను దేవునితో సమానుడనని ఎన్నడూ చెప్పుకోలేదు. దానికిబదులు ఆయన ఇలా చెప్పాడు: “తండ్రి నాకంటె గొప్పవాడు.”​—⁠యోహాను 14:​28.

దేవుని సంకల్పం నెరవేర్చడంలో యేసు ప్రముఖ పాత్ర పోషిస్తాడు. “[ఆయన]యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు . . . ఈ లోకమునకు వెలుగుగా” దేవుడు ఆయనను పంపించాడు. (యోహాను 12:​46) అపొస్తలుడైన పేతురు ప్రకారం, “మరి ఎవనివలనను రక్షణ కలుగదు.” (అపొస్తలుల కార్యములు 4:​12) మన రక్షణ క్రీస్తు అమూల్యమైన రక్తం మీద ఆధారపడివుంది కాబట్టి ఆయన చెప్పిన మాటలు సత్యం. (1 పేతురు 1:​18, 19) మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు మానవ కుటుంబంలోకి ప్రవేశపెట్టిన పాపం నుండి మానవజాతిని విమోచించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించాడు. (మత్తయి 20:28; 1 తిమోతి 2:⁠6) అంతేకాక, దేవుడు తన చిత్తాన్ని, సంకల్పాన్ని వెల్లడిచేయడానికి యేసును ఉపయోగించుకున్నాడు.​—⁠యోహాను 8:12, 32, 46, 47; 14:6; అపొస్తలుల కార్యములు 26:​23.

యేసుక్రీస్తుతోపాటు, మానవజాతి నుండి ఎన్నుకోబడినవారితో పరలోకరాజ్యాన్ని లేక ప్రభుత్వాన్ని దేవుడు స్థాపించాడు. పదేపదే ప్రస్తావించబడిన దేవుని రాజ్యం గురించిన ఈ సందేశం బైబిలు అంతటా కనిపిస్తుంది. తన చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమ్మీద కూడా నెరవేరేలా చూసే పనిని దేవుడు ఈ ప్రభుత్వానికి అప్పగించాడు. (మత్తయి 6:⁠9) మానవజాతి నుండి ఏ వ్యక్తైనా పరలోకానికి వెళ్లడం దేవుని ఆదిసంకల్పంలో భాగంకాదు. వారు ఈ భూమ్మీదే నివసించాలనేది ఆయన సంకల్పం. అయితే మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు ఒక క్రొత్త విషయాన్ని సంకల్పించాడు. క్రీస్తుతోపాటు పరలోక ప్రభుత్వంలో ‘రాజులుగా’ పరిపాలించడానికి “ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను” ప్రజలను ఎన్నుకొనే ఏర్పాటు చేశాడు. (ప్రకటన 5:​9, 10) మానవకుటుంబానికి ఎంతో దుఃఖాన్ని, బాధను తీసుకువచ్చిన అన్ని రకాల మానవ పరిపాలనలను ఆ రాజ్య ప్రభుత్వం త్వరలో “పగులగొట్టి నిర్మూలము చేయును.”​—⁠దానియేలు 2:​44.

మానవుల్లోని ఏ భాగమూ అమర్త్యమైనది కాదు. ఈ ప్రాథమిక బైబిలు సత్యం మానవుని గురించి అతని జీవిత ఉత్తరాపేక్షల గురించి ఎంతో స్పష్టం చేస్తుంది. మరణించినవారి పరిస్థితి గురించి ప్రజలను కలవరపెట్టిన అపార్థాలను, అసత్యాలను కూడా అది తొలగిస్తుంది.

బైబిలు పుస్తకమైన ప్రసంగి 9:​5, 10 మనకు ఇలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . నీవు పోవు పాతాళమునందు [“షియోల్‌లో,” NW]పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” మీరు ఆ వచనానికున్న భావం అర్థం చేసుకున్నారా? మానవుల్లోని ఏ భాగం కూడా మరణం తర్వాత సజీవంగా ఉండదు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడు ‘నేలకు తిరిగి చేరుకుంటాడు.’​—⁠ఆదికాండము 3:​19.

మరణించినవారు పునరుత్థానం ద్వారా జీవానికి తిరిగి తీసుకురాబడవచ్చు. దుష్టత్వాన్ని తాత్కాలికంగా ఉండేందుకు దేవుడు అనుమతించిన కాలం ముగిసిన తర్వాత, “సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:​14) ఆ పునరుత్థానం, మానవకుటుంబం కోసం దేవుడు మొదట్లో సంకల్పించినటువంటి పరదైసు భూమ్మీద ప్రజలను తిరిగి జీవింపజేస్తుంది.

ప్రతీదినం జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించండి

అలాంటి ప్రాథమిక సత్యాల గురించిన జ్ఞానం మీకు ఎలా సహాయం చేయగలదో మీరు గ్రహించగలిగారా? ఈ అపాయకరమైన, అల్లకల్లోల కాలాల్లో అలాంటి జ్ఞానం, అపవాదియైన సాతాను వ్యాప్తిచేస్తున్న “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన” వాటినుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అతడు “వెలుగు దూత” వేషం వేసుకున్నాడు, అతని ప్రతినిథులు “నీతి పరిచారకుల” వేషం వేసుకున్నారు. (1 తిమోతి 6:20; 2 కొరింథీయులు 11:​13-15) ఖచ్చితమైన బైబిలు పరిజ్ఞానం “యెహోవా వాక్యమును నిరాకరించిన” లౌకిక ‘జ్ఞానుల, వివేకుల’ తత్త్వాలమీద ఆధారపడిన నామకార్థ జ్ఞానం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.​—⁠మత్తయి 11:25; యిర్మీయా 8:⁠9.

అపొస్తలుడైన యోహాను కాలంలో ఎన్నో మోసకరమైన బోధలు తత్త్వాలు ఉన్నాయి కాబట్టి, ప్రతీదానిని నమ్మవద్దని, తాము విన్న విషయాలు ‘దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమని’ ఆయన మొదటి శతాబ్దపు క్రైస్తవులను హెచ్చరించాడు. (1 యోహాను 4:⁠1) ఈ ఉపమానాన్ని పరిశీలించండి. మీ జీవితంమీద ఎంతో ప్రభావం చూపించగల ఒక సందేశం మీరు పొందినట్లయితే అది కేవలం నమ్మదగిన మూలం నుండి వచ్చినట్లు కనిపించినందుకు మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా దానిని అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. మీరు చర్య తీసుకునే ముందు దాని మూలం తెలుసుకుంటారు, మీరు దానిలోని విషయాలను పరిశీలిస్తారు.

దేవుడు ప్రాథమిక సత్యాలుగల ప్రేరేపిత లిఖిత వృత్తాంతం అందజేయడం ద్వారా మీరు ఖచ్చితంగా అలా పరిశీలించే అవకాశం కల్పించాడు, అంటే మీరు అనుసరించే మార్గనిర్దేశక కాంతి, లేక దీపస్తంభాల కాంతి సరైనదో కాదో ‘పరీక్షించడానికి’ అవకాశం కల్పించాడు. (1 థెస్సలొనీకయులు 5:​21) తాము నేర్చుకుంటున్న విషయాలు వాస్తవానికి సత్యమైనవో కావో నిర్ధారించుకోవడానికి “ప్రతిదినమును లేఖనములు పరిశోధించి”నందుకు శ్రేష్ఠబుద్ధిగలవారైన మొదటి శతాబ్దపు వ్యక్తులు ప్రశంసించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 17:​11) మీరు కూడా అలాగే చేయవచ్చు. “చీకటిగల చోటున వెలుగిచ్చు దీపం”లాగా బైబిలు మిమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చడానికి అనుమతించండి. (2 పేతురు 1:​19-21) మీరు అలా చేస్తే, నిజమైన జ్ఞానం సంపాదించుకునేందుకు సహాయం చేసే ‘దేవుని గూర్చిన విజ్ఞానము మీకు లభిస్తుంది.’​—⁠సామెతలు 2:⁠5.

[అధస్సూచి]

^ పేరా 6 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[4వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం దీపంలాంటిది

[5వ పేజీలోని చిత్రం]

దేవుని పేరేమిటి?

[5వ పేజీలోని చిత్రం]

మానవజాతి భవిష్యత్తు ఏమిటి?

[6వ పేజీలోని చిత్రం]

యేసు సర్వశక్తిగల దేవుడా?

[6వ పేజీలోని చిత్రం]

మృతులు ఎక్కడున్నారు?

[7వ పేజీలోని చిత్రం]

బైబిల్లో బోధించబడిన ప్రాథమిక సత్యాల్లో, మృతుల పునరుత్థానం ఒకటి