పట్టుదలతో కొనసాగితే ఆనందం లభిస్తుంది
జీవిత కథ
పట్టుదలతో కొనసాగితే ఆనందం లభిస్తుంది
మారియో రోషా డిసోజా చెప్పినది
“రోషాగారు ఆపరేషన్ తర్వాత బ్రతికి బయటపడే అవకాశంలేదు.” ఒక డాక్టర్ నా భవిష్యత్తు గురించి అలా నిరాశాపూరితంగా మాట్లాడినా, నేడు, దాదాపు 20 సంవత్సరాల తర్వాత, నేనింకా బ్రతికి ఉండడమే కాక, యెహోవాసాక్షుల పూర్తికాల ప్రచారకునిగా సేవచేస్తున్నాను. ఈ సంవత్సరాలన్నింటిలో పట్టుదలతో కొనసాగేందుకు నాకు ఏమి సహాయం చేసింది?
ఈశాన్య బ్రెజిల్‌లోని బహాయా రాష్ట్రంలో ఉన్న సాంటు ఎస్టావాన్ అనే పల్లెటూరు దగ్గరున్న ఒక వ్యవసాయ క్షేత్రంలో నా బాల్యం గడిచింది. నాకు ఏడేండ్లు ఉన్నప్పుడు వ్యవసాయ పనిలో మా నాన్నకు చేయూతనివ్వడం ప్రారంభించాను. ప్రతీరోజు, పాఠశాల ముగిసిన తర్వాత ఆయన నాకు ఏదైనా ఒక పని ఇచ్చేవాడు. కొంతకాలం తర్వాత, మా నాన్న వ్యాపార పనిమీద రాష్ట్ర రాజధానియైన సాల్వెడార్‌కు వెళ్లినప్పుడల్లా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన బాధ్యతలు నాకు అప్పజెప్పేవాడు.
కరెంటు, నీటి సరఫరా, నేడు సౌలభ్యంగా ఉన్న సౌకర్యాలేవీ మా కాలంలో లేవు, అయినా మేము సంతోషంగానే ఉన్నాం. నేను గాలిపటం ఎగరేసేవాణ్ణి లేదా నా స్నేహితులతో కలిసి నేను తయారుచేసుకున్న చెక్క బొమ్మ కార్లతో ఆడుకునేవాణ్ణి. నేను మతసంబంధమైన ఊరేగింపుల్లో సన్నాయివంటి వాద్యాలను వాయించేవాణ్ణి. స్థానిక చర్చిలోని గాయకబృందంలో సభ్యునిగా ఉండేవాణ్ణి, అక్కడే నేను ఈస్టోర్యా సాగ్రాడా (పవిత్ర చరిత్ర) అనే పేరుగల పుస్తకం చూశాను, అది నాలో బైబిలుపట్ల ఆసక్తిని రేకెత్తించింది.
1932లో, నాకు 20 ఏండ్లున్నప్పుడు, తీవ్ర కరవు బ్రెజిల్ ఈశాన్య భాగాన్ని ఎంతోకాలం పీడించింది. మా పశువులు చనిపోయాయి, పంటలు పండలేదు కాబట్టి నేను సాల్వెడార్‌కు తరలివెళ్లాను, నాకక్కడ ట్రామ్ డ్రైవర్ పని దొరికింది. ఆ తర్వాత నేను ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నాతో ఉండేందుకు నా కుటుంబాన్ని తీసుకువచ్చాను. 1944లో మా నాన్న మరణించారు, మా అమ్మను, ఎనిమిదిమంది చెల్లెళ్లను, ముగ్గురు తమ్ముళ్ళను చూసుకునే బాధ్యత నామీదికి వచ్చింది.
ట్రామ్ డ్రైవర్ నుండి సువార్తికునిగా మారడం
సాల్వెడార్‌కు వచ్చిన తర్వాత నేను మొదట చేసిన పనుల్లో బైబిలు కొనడం ఒకటి. కొన్ని సంవత్సరాలు బాప్టిస్ట్ చర్చికి హాజరైన తర్వాత, నేనూ నా తోటి ట్రామ్ డ్రైవర్ అయిన డూర్వాల్ స్నేహితులమయ్యాం. డూర్వాల్, నేను తరచూ బైబిలు గురించి ఎంతోసేపు చర్చించుకునేవాళ్లం. ఒకరోజు ఆయన నాకు మృతులు ఎక్కడ ఉన్నారు? * అనే చిన్న పుస్తకం ఇచ్చాడు. మానవునికి అమర్త్యమైన ఆత్మ ఉందని నేను నమ్మినా ఆ పుస్తకంలో ఉదాహరించబడిన బైబిలు లేఖనాలను చూడాలనే జిజ్ఞాస నాలో కలిగింది. బైబిలు, ఆత్మ అమర్త్యమైనది కాదని ధృవీకరిస్తుందని తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను.—ప్రసంగి 9:5, 10.
నా ఆసక్తిని గమనించి ఆంటోన్యూ ఆండ్రాడీ అనే యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకుణ్ణి మా ఇంటికి వెళ్లమని డూర్వాల్ కోరాడు. ఆంటోన్యూ మా ఇంటికి మూడవసారి వచ్చిన తర్వాత, ఇతరులకు బైబిలు బోధించడానికి తనతోపాటు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించాడు. మొదటి రెండిళ్లలో ఆయన మాట్లాడిన తర్వాత, “ఇప్పుడు నీవు మాట్లాడాలి” అని ఆయన నాకు చెప్పాడు. నాకు భయమేసింది, అయితే ఆనందకరంగా, ఒక కుటుంబం నేను చెప్పింది శ్రద్ధగా విని నేనిచ్చిన రెండు పుస్తకాలను తీసుకుంది. బైబిలు సత్యంపట్ల ఆసక్తిగలవారినెవరినైనా కలిస్తే నాలో ఇప్పటికీ అదే ఆనందం కలుగుతుంది.
1943 ఏప్రిల్ 19న, ఆ సంవత్సరపు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ రోజున నేను సాల్వెడార్ దగ్గరున్న అట్లాంటిక్ మహాసముద్రంలో బాప్తిస్మం తీసుకున్నాను. అనుభవజ్ఞులైన క్రైస్తవ పురుషులు లేరు కాబట్టి, సహోదరుడు ఆండ్రాడీ ఇంట్లో కలుసుకొనే సాక్షి గుంపుకు సహాయం చేసే నియామకం నాకు లభించింది, సాల్వెడార్ పట్టణ పైభాగాన్ని, క్రిందిభాగాన్ని కలిపే ఇరుకైన వీధుల్లో ఒకదానిలో ఆయన ఇళ్లు ఉండేది.
ప్రారంభంలో ఎదురైన వ్యతిరేకత
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో (1939-45) మన క్రైస్తవ కార్యకలాపాలకు అనుకూల ప్రతిస్పందన ఉండేదికాదు. మన ప్రచురణల్లో చాలాభాగం అమెరికా నుండి వచ్చేవి కాబట్టి మేము ఉత్తర అమెరికా గూఢచారులమని కొందరు అధికారులు అనుమానించారు. ఆ కారణంగా అరెస్టులు, విచారణలు సర్వసాధారణమయ్యాయి. ఒక సాక్షి క్షేత్రపరిచర్య నుండి ఇంటికి రాలేదంటే ఆయన నిర్బంధించబడ్డాడనే నిర్ధారణకు వచ్చి ఆయనను విడిపించడానికి మేము పోలీస్ స్టేషన్‌కు వెళ్లేవారం.
1943 ఆగస్టులో, మేము మా మొదటి సమావేశాన్ని వ్యవస్థీకరించుకోవడంలో సహాయం చేయడానికి అడాల్ఫ్ మెస్మార్ అనే జర్మన్ సాక్షి సాల్వెడార్‌కు వచ్చాడు. సమావేశం జరుపుకునేందుకు అధికారుల నుండి అనుమతి లభించిన తర్వాత “నూతనలోకంలో స్వేచ్ఛ” అనే బహిరంగ ప్రసంగం గురించి స్థానిక పత్రికల్లో ప్రకటనలిచ్చాం, షాప్ కిటికీలమీద, ట్రామ్‌ల ఇరు ప్రక్కల పోస్టర్లను అంటించాం. అయితే సమావేశపు రెండవ రోజున, సమావేశం కోసం మాకివ్వబడిన అనుమతి రద్దుచేయబడిందని ఒక పోలీసు అధికారి మాకు చెప్పాడు. మా సమావేశాన్ని ఆపుచేయమని సాల్వెడార్ ఆర్చ్ బిషప్, పోలీసు ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే, చివరకు, తర్వాతి సంవత్సరం ఏప్రిల్‌లో, మేము గతంలో ప్రకటించిన బహిరంగ ప్రసంగం ఇచ్చేందుకు అనుమతి లభించింది.
సాధించాల్సిన లక్ష్యం
1946లో, సావోపౌలో నగరంలో నిర్వహించబడే ఆనందభరిత దేశాల దైవపరిపాలనా సమావేశానికి
హాజరవ్వాల్సిందిగా నేను ఆహ్వానించబడ్డాను. సాల్వెడార్‌కు చెందిన ఒక వర్తకపు ఓడ నాయకుడు, మేము ఓడ పైభాగంలో నిద్రపోయేలాగైతే మాలో కొంతమందిని ఓడలో ప్రయాణించడానికి అనుమతించాడు. మాకు తుఫాను ఎదురైనా, ఆ సమయంలో మేమందరం సీసిక్‌నెస్‌తో (సముద్ర ప్రయాణంవల్ల కలిగే అనారోగ్యం) బాధపడినా, మేము నాలుగు రోజుల తర్వాత రియో డి జనైరో నగరానికి క్షేమంగా చేరుకున్నాం. మేము రైలులో బయల్దేరే ముందు కొన్ని రోజులు తమ గృహాల్లో విశ్రాంతి తీసుకోమని రియో నగరంలోని సాక్షులు మమ్మల్ని ఆహ్వానించారు. మా రైలు సావోపౌలోకు చేరుకున్నప్పుడు “యెహోవాసాక్షులకు స్వాగతం” అనే సందేశంగల బేనర్లు ధరించిన ఒక చిన్న గుంపు మమ్మల్ని ఆహ్వానించింది.సాల్వెడార్‌కు చేరుకున్న కొంతకాలం తర్వాత, పయినీరవ్వాలనే నా కోరిక గురించి అమెరికాకు చెందిన హెర్రీ బ్లాక్ అనే మిషనరీతో మాట్లాడాను, యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులు పయినీర్లని పిలవబడతారు. నాకున్న కుటుంబ బాధ్యతలను గుర్తుచేసి, ఓపికపట్టమని ఆయన నాకు సలహా ఇచ్చాడు. చివరకు 1952 జూన్‌కల్లా నా తమ్ముళ్లు, చెల్లెళ్లు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు, సాల్వెడార్‌కు దక్షిణాన తీరంవెంబడి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈల్యావూస్ నగరంలోని చిన్న సంఘంలో పయినీరుగా నియమించబడ్డాను.
ఉదారమైన ఏర్పాటు
ఆ తర్వాతి ఏడాది, నేను సాక్షులులేని మారుమూల ప్రాంతమైన జెక్యా అనే పెద్ద పట్టణానికి నియమించబడ్డాను. నేను కలుసుకున్న మొదటి వ్యక్తి, స్థానిక ఫాదిరి. ఆ పట్టణం తనదని, అక్కడ ప్రకటించవద్దని ఆయన నాకు చెప్పాడు. ఆయన “అబద్ధ ప్రవక్త” రాక గురించి చర్చి సభ్యులను హెచ్చరించి నా కార్యకలాపాలను గమనించడానికి పట్టణమంతా గూఢచారులను పెట్టాడు. అయినా, ఆ రోజు నేను 90 కన్నా ఎక్కువ బైబిలు సాహిత్యాలను అందించడమే కాక నాలుగు బైబిలు అధ్యయనాలను కూడా ప్రారంభించాను. రెండు సంవత్సరాల తర్వాత, 36 మంది సాక్షులున్న జెక్యా సంఘం సొంత రాజ్యమందిరం నిర్మించుకుంది! ఈ రోజు ఆ పట్టణంలో ఎనిమిది సంఘాలున్నాయి, దాదాపు 700మంది సాక్షులున్నారు.
నేను జెక్యా పట్టణంలో ఉన్న తొలి నెలల్లో, పట్టణ శివార్లలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని ఉండేవాణ్ణి. ఆ తర్వాత నేను జెక్యాలో ఉన్న అతి శ్రేష్టమైన హోటళ్ళలో ఒకటైన హోటల్ సుడాయిస్టా యజమానియైన మీగెల్ వాజ్ డీ ఓలీవెరాను కలుసుకున్నాను. మీగెల్ బైబిలు అధ్యయనానికి అంగీకరించి, నేను తన హోటల్‌లో ఉన్న ఒక గదికి నా వసతిని మార్చుకోవలసిందిగా ఆయన బలవంతపెట్టాడు. మీగెల్, ఆయన భార్య ఆ తర్వాత సాక్షులయ్యారు.
జెక్యా పట్టణంలో నేను గడిపిన రోజులకు సంబంధించిన మరో తీపి జ్ఞాపకం, లూయిజ్ కోట్రిన్ అనే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునితో నేను గడిపిన సమయం, ఆయనతో నేను బైబిలు అధ్యయనం చేశాను. పోర్చుగీస్ భాషలో, గణితశాస్త్రంలో నేను నా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. నేను ప్రాథమిక విద్యను మాత్రమే అభ్యసించాను కాబట్టి నేను ఆ ఆహ్వానాన్ని వెంటనే స్వీకరించాను. ప్రతీవారం లూయిజ్‌తో బైబిలు అధ్యయనం చేసిన తర్వాత, ఆయన నాకు నేర్పించిన పాఠాలు, కొంతకాలం తర్వాత యెహోవా సంస్థ నుండి నేను పొందిన అదనపు నియామకాల కోసం ముందుగా సిద్ధపడేందుకు సహాయం చేశాయి.
క్రొత్త సవాలును ఎదుర్కోవడం
1956లో, ప్రాంతీయ పైవిచారణకర్తగా శిక్షణ పొందేందుకు ఆహ్వానిస్తూ అప్పట్లో రియో డి జనైరోలో ఉన్న మన బ్రాంచి కార్యాలయం నుండి ఒక ఉత్తరం అందింది, యెహోవాసాక్షుల ప్రయాణ పరిచారకులు అలా పిలవబడతారు. మరో ఎనిమిదిమంది కూడా హాజరైన ఆ శిక్షణా తరగతి ఒక నెలకన్నా కొంచెం ఎక్కువకాలం నిర్వహించబడింది. ఆ తరగతి ముగింపుకు వస్తున్నప్పుడు నేను సావోపౌలో రాష్ట్రానికి నియమించబడ్డాను, అది నన్ను కలవరపరిచింది. నన్ను నేనిలా ప్రశ్నించుకున్నాను: ‘నల్లజాతి వ్యక్తినైన నేను, అక్కడ ఆ ఇటలీ దేశస్థులందరి మధ్య ఏమి చేయగలను? వారు నన్ను స్వీకరిస్తారా?’ *
సంటు అమారు జిల్లాలో నేను సందర్శించిన మొదటి సంఘపు రాజ్యమందిరం తోటి సాక్షులతో ఆసక్తిగలవారితో నిండివుండడం చూసి నేను ప్రోత్సహించబడ్డాను. ఆ వారాంతం, సంఘంలో ఉన్న మొత్తం 97మంది నాతో కలిసి పరిచర్యలో పాల్గొన్నప్పుడు నా భయాలు వట్టివనే నమ్మకం కలిగింది. ‘వారు నిజంగా నా సహోదరులు’ అని నేను అనుకున్నాను. ఆ ప్రియ సహోదరసహోదరీల ఆప్యాయతే, పట్టుదలతో నేను ప్రయాణ పరిచర్యలో కొనసాగే ధైర్యాన్నిచ్చింది.
గాడిదలు, గుర్రాలు, యాంట్ ఈటర్‌లు
గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలను, సాక్షుల చిన్న గుంపులను చేరుకోవడానికి చేయాల్సిన దూర ప్రయాణాలు, తొలిరోజుల్లో ప్రయాణ పైవిచారణకర్తలు ఎదుర్కొన్న గొప్ప సవాళ్లలో ఒకటి. ఆ ప్రాంతాల్లో ప్రజా రవాణా సురక్షితంగా ఉండేది కాదు లేక ఆ సౌకర్యాలు అసలు ఉండేవే కావు, దాదాపు రోడ్లన్నీ దుమ్ముపట్టి ఇరుకుగా ఉండేవి.
ప్రాంతీయ పైవిచారణకర్త ఉపయోగించుకోవడం కోసం గాడిదను లేక గుర్రాన్ని కొనడం ద్వారా కొన్ని సర్క్యూట్‌లు ఆ సమస్యను పరిష్కరించాయి. అనేక సోమవారాలు నేను నా గుర్రానికి జీను తొడిగి నా సామాను దానికి తగిలించి, దాదాపు 12 గంటలు స్వారీ చేసి తర్వాతి సంఘానికి చేరుకునేవాణ్ణి. సాంటా ఫా డూ సుల్ నగరంలో సాక్షుల దగ్గర డొరడూ (గోల్డీ) అనే గాడిద ఉండేది, గ్రామీణ ప్రాంతంలో ఉన్న అధ్యయన గుంపులకు వెళ్లే దారి దానికి తెలుసు. డొరడూ, వ్యవసాయ క్షేత్రపు ద్వారాల దగ్గర ఆగి, నేను వాటిని తెరిచేంతవరకు ఓపికతో వేచివుండేది. సందర్శనం పూర్తైన తర్వాత నేనూ డొరడూ తర్వాతి గుంపు సందర్శనానికి వెళ్లేవాళ్లం.
సమాచారం చేరవేయడానికి ఆధారపడదగిన మార్గాలు లేకపోవడం కూడా ప్రాంతీయ సేవను సవాలుతో కూడినదిగా చేసింది. ఉదాహరణకు, మాటో గ్రొస్సో రాష్ట్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో కలుసుకునే చిన్న సాక్షుల గుంపును సందర్శించడానికి నేను అరగువాయా నదిని పడవలో దాటి, ఆ తర్వాత అడవి గుండా దాదాపు 25 కిలోమీటర్లు గుర్రం మీద లేక గాడిద మీద స్వారీ చేయాల్సివచ్చేది. ఒక సందర్భంలో నా సందర్శనం గురించి తెలియజేయడానికి ఆ గుంపుకు ఉత్తరం వ్రాశాను, అయితే ఆ ఉత్తరం వారికి అందలేదు, కాబట్టి నేను నది దాటేసరికి నది ఒడ్డున నా కోసం ఎవరూ ఎదురుచూడడంలేదు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది కాబట్టి, ఒక చిన్న రెస్టారెంటు యజమానిని నా సామాను చూసుకోమని కోరి, బ్రీఫ్‌కేస్ మాత్రమే తీసుకుని నడవడం ప్రారంభించాను.
కొంతసేపటికి, చీకటిపడింది. నేను చీకట్లో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు ఒక యాంట్‌ఈటర్ (చీమలను తినే ఒక జంతువు) బుసకొట్టింది. యాంట్‌ఈటర్ ఒక వ్యక్తి మీద పడి తన బలమైన ముంజేతులతో అతడిని చంపగలదని నేను విన్నాను. కాబట్టి పొదల్లో ఏదైనా శబ్దం చేసినప్పుడు నా బ్రీఫ్‌కేసును రక్షణగా నా ముందు పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేశాను. ఎన్నో గంటలు నడిచిన తర్వాత నేను ఒక చిన్న నీటి ప్రవాహం దగ్గరకు చేరుకున్నాను. విచారకరంగా, ఆవలి ఒడ్డుమీద ముండ్లతీగల కంచె ఉండడం ఆ చీకటిలో నేను చూడలేదు. ఒక గంతులో నేను ఆ ప్రవాహాన్ని దాటగలిగాను, అయితే నేను ఆ కంచెమీద పడి, నన్ను నేనే గాయపరచుకున్నాను!
చివరకు, నేను వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నప్పుడు అరుస్తున్న కుక్కల శబ్దం నన్ను స్వాగతించింది. గొర్రెల దొంగలు రాత్రిపూట దాడి చేయడం ఆ కాలంలో సాధారణ విషయం కాబట్టి, తలుపులు తెరుచుకున్న వెంటనే నేను ఎవరినో వారికి త్వరగా చెప్పాను. చినిగి, రక్తసిక్తంగా ఉన్న
బట్టలతో నేను దయనీయ స్థితిలో ఉన్నట్లు కనిపించివుండవచ్చు, అయితే సహోదరులు నన్ను చూడగలిగినందుకు ఆనందించారు.నాకు కష్టాలు ఎదురైనా అవి సంతోషకరమైన రోజులు. గుర్రంమీద, కాలినడకన దూర ప్రయాణాలు చేయడం, కొన్నిసార్లు చెట్లనీడలో విశ్రాంతి తీసుకోవడం, పక్షుల కిలకిలరావాలను వినడం, ఆ నిర్మానుష్యమైన రోడ్లమీద నక్కలు అటూ ఇటూ తిరగడాన్ని చూడడం వంటివాటిని నేను ఆనందించాను. నా సందర్శనాలు ప్రజలకు నిజంగా సహాయం చేశాయని తెలుసుకోవడం కూడా నాకు ఆనందాన్నిచ్చింది. అనేకమంది తమ కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి నాకు ఉత్తరాలు వ్రాశారు. మేము సమావేశాల్లో కలుసుకున్నప్పుడు ఇతరులు వ్యక్తిగతంగా నాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకొని ఆధ్యాత్మిక ప్రగతి సాధించడాన్ని చూడడం నాకెంత ఆనందాన్నిచ్చిందో!
చివరకు సహాయకారి
ప్రయాణ సేవలో నేను గడిపిన ఆ సంవత్సరాల్లో నేను ఎక్కువకాలం ఒంటరిగానే ఉన్నాను, అలా ఉండడం “నా శైలముగా, నా కోట”గా యెహోవా మీద ఆధారపడడానికి నాకు నేర్పించింది. (కీర్తన 18:2) అంతేకాక, అవివాహితునిగా ఉండడంవల్ల రాజ్య సంబంధ విషయాలకు అవిభాగిత శ్రద్ధ చూపించేందుకు వీలైందని నేను గుర్తించాను.
అయితే, 1978లో నేను జూల్యా టకహాషీ అనే పయినీరు సహోదరిని కలిశాను. రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవచేయడానికి ఆమె సావోపౌలో నగరంలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రిలో నర్సుగా తాను చేస్తున్న మంచి ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమెకు పరిచయస్థులైన క్రైస్తవ పెద్దలు ఆమె ఆధ్యాత్మిక లక్షణాల గురించి, పయినీరుగా ఆమెకున్న సామర్థ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మీరు ఊహించగలిగినట్లే, అనేక సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలనే నా నిర్ణయం కొంతమందిని ఆశ్చర్యపరచింది. నా ఆప్తమిత్రుడు ఒకడు దానిని నమ్మలేకపోయాడు, నేను నిజంగా వివాహం చేసుకుంటే తాను 270 కిలోల మాంసం ఇస్తానని నాకు వాగ్దానం చేశాడు. 1978 జూలై 1న జరిగిన మా వివాహ విందులో మేము ఆ మాంసాన్ని రోస్టు చేసి ఆరగించాం.
అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టుదలతో కొనసాగడం
జూల్యా ప్రయాణసేవలో నాతో పనిచేసింది, ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలు దక్షిణ, ఆగ్నేయ బ్రెజిల్‌లో ఉన్న సంఘాలను మేమిద్దరం కలిసి సందర్శించాం. ఆ కాలంలోనే నాకు గుండెకు సంబంధించిన సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రకటనా పనిలో గృహస్థులతో మాట్లాడుతున్నప్పుడు నేను రెండుసార్లు స్పృహ తప్పాను. నాకున్న పరిమితుల దృష్ట్యా, సావోపౌలో రాష్ట్రంలోని బిరిగ్వి నగరంలో ప్రత్యేక పయినీర్లుగా సేవచేసే నియామకాన్ని మేము స్వీకరించాం.
ఈ సమయంలో బిరిగ్వి సంఘంలోని సాక్షులు, దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొయానియా నగరంలో ఉన్న డాక్టర్‌కు చూపించేందుకు కార్లో తీసుకువెళ్లడానికి ముందుకువచ్చారు. నా పరిస్థితి కుదుటపడిన తర్వాత పేస్‌మేకర్‌ను (గుండె కొట్టుకోవడాన్ని ప్రేరేపించే విద్యుత్ పరికరం) అమర్చడానికి నాకు ఆపరేషన్ జరిగింది. అది జరిగి దాదాపు 20 సంవత్సరాలైంది. మరో రెండు గుండె ఆపరేషన్‌లు నాకు జరిగినా, నేను శిష్యులను చేసే పనిలో ఇంకా క్రియాశీలంగానే ఉన్నాను. విశ్వసనీయులైన ఇతర అనేకమంది క్రైస్తవ భార్యల్లాగే, జూల్యా కూడా నన్ను ఎల్లప్పుడూ బలపర్చింది, ప్రోత్సహించింది.
అనారోగ్య కారణాలవల్ల నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను, కొన్నిసార్లు అది నాకు నిరుత్సాహాన్ని కలిగించినా, నేను ఇప్పటికీ పయినీరింగు చేయగలుగుతున్నాను. ఈ పాత వ్యవస్థలో జీవితం పూల పల్లకిగా ఉంటుందని యెహోవా ఎన్నడూ వాగ్దానం చేయలేదని నేను గుర్తుచేసుకుంటాను. అపొస్తలుడైన పౌలు, ప్రాచీన కాలానికి చెందిన మరితర నమ్మకమైన క్రైస్తవులు వంటివారే పట్టుదలను కనపరచాల్సివచ్చినప్పుడు, పరిస్థితులు మనకెందుకు వేరుగా ఉంటాయి?—అపొస్తలుల కార్యములు 14:22.
ఇటీవల, 1930లలో నేను సంపాదించిన మొదటి బైబిలు నాకు కనిపించింది. దానిలోని లోపలి పేజీల్లో 350 అని నేను వ్రాసుకున్నాను, నేను 1943లో క్రైస్తవ కూటాలకు హాజరవడం మొదలుపెట్టినప్పుడు బ్రెజిల్‌లో అంతమంది రాజ్య ప్రచారకులు ఉండేవారు. బ్రెజిల్‌లో ఇప్పుడు 6,00,000 కన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులు ఉన్నారనేది నమ్మశక్యంగాలేదు. ఆ అభివృద్ధిలో చిన్న పాత్ర నిర్వహించడం ఎంత గొప్ప ఆధిక్యతో! నేను పట్టుదలతో కొనసాగినందుకు యెహోవా నన్ను నిజంగా ఆశీర్వదించాడు. కీర్తనకర్తలానే నేను కూడా ఇలా చెప్పగలను: “యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతిమి.”—కీర్తన 126:3.
[అధస్సూచీలు]
^ పేరా 9 యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించబడడంలేదు.
^ పేరా 23 ఇటలీకి చెందిన దాదాపు 10,00,000మంది వలసదారులు 1870 నుండి 1920 మధ్యకాలంలో సావోపౌలో రాష్ట్రంలో స్థిరపడ్డారు.
[9వ పేజీలోని చిత్రం]
సాల్వెడార్ నగరంలో జరిగిన మొదటి సమావేశపు బహిరంగ ప్రసంగం గురించి ప్రకటిస్తున్న సాక్షులు, 1943
[10వ పేజీలోని చిత్రం]
సావోపౌలో నగరంలో జరిగిన ఆనందభరిత దేశాల సమావేశానికి వస్తున్న సాక్షులు, 1946
[10, 11వ పేజీలోని చిత్రాలు]
1950ల చివరి భాగంలో ప్రయాణ సేవలో ఉన్నప్పుడు
[12వ పేజీలోని చిత్రం]
నా భార్య జూల్యాతో