కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా, యెహోవాను సేవించడాన్ని ఎంచుకోండి

యౌవనులారా, యెహోవాను సేవించడాన్ని ఎంచుకోండి

యౌవనులారా, యెహోవాను సేవించడాన్ని ఎంచుకోండి

‘మీరు ఎవని సేవించెదరో కోరుకొనుడి.’​—⁠యెహోషువ 24:​15.

“క్రీస్తును తెలుసుకొనే సామర్థ్యమున్నప్పుడే [పిల్లలను] క్రైస్తవులుగా మారనివ్వండి.” టెర్టూలియన్‌ అనే రచయిత సా.శ. రెండవ శతాబ్దం చివర్లో ఆ మాటలను వ్రాశాడు. ఆయన తన కాలంలోని మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యంలో వేళ్లూనుకుంటున్న పసిపిల్లల బాప్తిస్మపు ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నాడు. టెర్టూలియన్‌ అభిప్రాయానికి, బైబిలుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, అగస్టీన్‌ అనే చర్చీ ఫాదర్‌ బాప్తిస్మం తొలిపాపపు కళంకాన్ని తొలగిస్తుందని, బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయే పసిపిల్లలు నరకాగ్ని శిక్షకు గురవుతారని వాదించాడు. ఆ నమ్మకం పిల్లలు పుట్టిన తర్వాత సాధ్యమైనంత త్వరగా వారికి బాప్తిస్మమిచ్చే ఆచారాన్ని ప్రోత్సహించింది.

2 క్రైస్తవమత సామ్రాజ్యంలోని ప్రముఖ చర్చీలు అనేకం ఇంకా పసిపిల్లలకు బాప్తిస్మమిస్తూనే ఉన్నాయి. అంతేకాక, చరిత్రంతటిలో, క్రైస్తవ దేశాలని చెప్పుకుంటున్న దేశాల మత నాయకులు, పరిపాలకులు తాము జయించిన ‘అన్యులకు’ నిర్బంధంగా బాప్తిస్మమివ్వడాన్ని ఆచరించేవారు. అయితే పసిపిల్లల బాప్తిస్మానికి, వయోజనుల నిర్బంధ బాప్తిస్మానికి బైబిలు ఆధారం లేదు.

నేడు అనాలోచిత సమర్పణ లేదు

3 తల్లిదండ్రుల్లో కేవలం ఒక్కరే నమ్మకమైన క్రైస్తవ వ్యక్తిగావున్నా, వారి పిల్లల్ని దేవుడు పవిత్రులుగా పరిగణిస్తాడని బైబిలు చూపిస్తోంది. (1 కొరింథీయులు 7:​14) యెహోవా వారిని పవిత్రులుగా పరిగణించినంత మాత్రాన వారాయన సమర్పిత సేవకులు అవుతారా? లేదు. అయితే, యెహోవాకు సమర్పించుకున్న తల్లిదండ్రులు పెంచిన పిల్లలు, స్వచ్ఛందంగా యెహోవాకు సమర్పించుకునేందుకు శిక్షణ పొందుతారు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. . . . నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును; నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును; నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.”​—⁠సామెతలు 6:​20-​23.

4 క్రైస్తవ తల్లిదండ్రుల నిర్దేశాన్ని అనుసరించేందుకు యౌవనులు ఇష్టపడితే వారికది కాపుదలనిస్తుంది. సొలొమోను ఇంకా ఇలా చెప్పాడు: “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.” “నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.” (సామెతలు 10:⁠1; 23:​19) అవును, తల్లిదండ్రుల శిక్షణనుండి ప్రయోజనం పొందాలంటే, పిల్లలైన మీరు సలహాను, హితవును, శిక్షణను ఇష్టపూర్వకంగా అంగీకరించాలి. మీరు జ్ఞానులుగా జన్మించలేదు, అయితే మీరు ‘జ్ఞానము తెచ్చుకొని,’ స్వచ్ఛందంగా ‘జీవమార్గాన్ని’ అనుసరించవచ్చు.

మానసిక నియంత్రణ అంటే ఏమిటి?

5 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను [‘మానసిక నియంత్రణలోను,’ NW] వారిని పెంచుడి.”​—⁠ఎఫెసీయులు 6:1-4.

6 తల్లిదండ్రులు తమ పిల్లలను ‘యెహోవాయొక్క శిక్షలోను మానసిక నియంత్రణలోను పెంచేటప్పుడు’ వారిపై అనుచిత ఒత్తిడితెస్తారా? లేదు, అలా చేయరు. తల్లిదండ్రులు తాము సరైందని, నైతికంగా ప్రయోజనకరమైనదని తలంచేవాటిని తమ పిల్లలకు బోధించడాన్ని ఎవరు విమర్శించగలరు? తమ పిల్లలకు దేవుడు లేడని బోధించే నాస్తికులు విమర్శించబడడం లేదు. అనేక మతస్థులు తమ పిల్లల్ని తమ సొంత మతవిశ్వాసంలో పెంచడాన్ని తమ కర్తవ్యంగా భావిస్తారు, కానీ వారలా పెంచడానికి ప్రయత్నించడం అరుదుగా విమర్శించబడుతుంది. అదే విధంగా, ప్రాథమిక సత్యాలు, నైతిక సూత్రాల గురించిన యెహోవా ఆలోచనను స్వీకరించేలా యెహోవాసాక్షులు తమ పిల్లల్ని పెంచినప్పుడు వారు తమ పిల్లల మనసులను మార్చివేస్తున్నారని ఇతరులు నిందించకూడదు.

7థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ ప్రకారం, ఎఫెసీయులు 6:4లో ‘మానసిక నియంత్రణ’ అని అనువదించబడిన ఆదిమ గ్రీకు పదం ‘మనసును సరిచేయడానికి, తప్పుదిద్దేందుకు, ఆధ్యాత్మిక దృక్పథాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నించే’ ప్రక్రియను సూచిస్తుంది. ఒక యౌవనుడు తన తోటివారి ఒత్తిడివల్ల, తన తోటివారిలాగే ఉండాలనే కోరికవల్ల తల్లిదండ్రుల శిక్షణను తృణీకరిస్తే అప్పుడేమిటి? వారిపై అనుచిత ఒత్తిడి తీసుకువచ్చేదెవరని అనవచ్చు, తల్లిదండ్రులా లేక ఆ యౌవనస్థుని తోటివారా? ఒకవేళ తోటివారు మాదకద్రవ్యాలు తీసుకోమని, అతిగా త్రాగమని లేదా లైంగిక దుర్నీతికి పాల్పడమని ఆ యౌవనస్థునిపై ఒత్తిడి తెస్తుంటే, తమ పిల్లవాని ఆలోచనను సరిచేసి అలాంటి ప్రమాదకర ప్రవర్తనా పర్యవసానాలను గ్రహించేలా అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించినందుకు తల్లిదండ్రులు విమర్శించబడాలా?

8 అపొస్తలుడైన పౌలు యౌవనస్థుడైన తిమోతికి ఇలా వ్రాశాడు: “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమోతి 3:⁠14) తిమోతి చిన్నతనం నుండే ఆయన తల్లి, అమ్మమ్మ పరిశుద్ధ లేఖనాల జ్ఞానం ఆధారంగా దేవునిపై ఆయన విశ్వాసానికి గట్టి పునాదివేశారు. (అపొస్తలుల కార్యములు 16:1; 2 తిమోతి 1:⁠5) ఆ తర్వాత, వారు క్రైస్తవులైనప్పుడు విశ్వసించమని తిమోతిని బలవంతపెట్టలేదు గానీ, లేఖన జ్ఞానంపై ఆధారపడిన చక్కని తర్కం ద్వారా ఆయన ‘రూఢియని తెలుసుకునేందుకు’ సహాయం చేశారు.

ఎంచుకునేందుకు యెహోవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు

9 యెహోవా తన సృష్టిప్రాణులను తన చిత్తాన్ని తప్ప మరేదీ చేయలేని విధంగా ప్రోగ్రామ్‌ చేయబడిన మరమనుషులుగా సృష్టించగలిగేవాడే. బదులుగా ఆయన వారికి స్వేచ్ఛాచిత్తమిచ్చి వారిని ఘనపరిచాడు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చే ప్రజలనే మన దేవుడు కోరుతున్నాడు. తన ప్రాణుల్లో యౌవనస్థులైనా, వృద్ధులైనా తనపట్ల ప్రేమతో తనను సేవిస్తే ఆయన సంతోషిస్తాడు. దేవుని చిత్తానికి ప్రేమపూర్వకంగా లోబడినవారిలో ఉత్తమ ఉదాహరణ ఆయన అద్వితీయ కుమారునిదే, ఆయన గురించి యెహోవా ఇలా చెప్పాడు: “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్తయి 3:​17) ఈ ప్రథమ కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.”​—⁠కీర్తన 40:⁠8; హెబ్రీయులు 10:​9, 10.

10 తన కుమారుని నిర్దేశంలో తనను సేవించేవారు తన చిత్తంపట్ల అలాంటి ఇష్టపూర్వక విధేయతనే కనబర్చాలని యెహోవా కోరుతున్నాడు. కీర్తనకర్త ప్రవచనార్థకంగా ఇలా ఆలపించాడు: “యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీ యొద్దకు వచ్చెదరు.” (కీర్తన 110:⁠3) పరలోక, భూలోక భాగాలతోపాటు యెహోవా సంస్థ మొత్తం దేవుని చిత్తానికి ప్రేమపూర్వకంగా లోబడడం మీదే ఆధారపడి పనిచేస్తుంది.

11 కాబట్టి మీ తల్లిదండ్రులు గానీ సంఘంలోని క్రైస్తవ పెద్దలు గానీ బాప్తిస్మం తీసుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేయరని యౌవనస్థులైన మీరు అర్థం చేసుకోవాలి. యెహోవాను సేవించాలనే కోరిక మీలో నుండే రావాలి. ప్రాచీనకాల యెహోషువ ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: ‘యెహోవాను నిష్కపటముగాను సత్యముగాను సేవించుడి. నేడు మీరు ఎవని సేవించెదరో కోరుకొనుడి.’ (యెహోషువ 24:​14-​22) అదేవిధంగా, మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకొని ఆయన చిత్తం చేసేందుకు మీ జీవితాల్ని అంకితం చేయడాన్ని మీరే సొంతగా ఎంచుకోవాలి.

మీ బాధ్యతను అంగీకరించడం

12 యౌవనస్థులైన మిమ్మల్ని మీ తల్లిదండ్రుల విశ్వాస్యత ఏ మాత్రం కాపాడలేని సమయం వస్తుంది. (1 కొరింథీయులు 7:​14) శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.” (యాకోబు 4:​17) పిల్లలు తమ తల్లిదండ్రుల నిమిత్తం ఎలా దేవుణ్ణి సేవించలేరో అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల నిమిత్తం దేవుణ్ణి సేవించలేరు. (యెహెజ్కేలు 18:​20) యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి మీరు తెలుసుకున్నారా? మీరు తెలుసుకున్న వాటిని అర్థం చేసుకొని ఆయనతో వ్యక్తిగత సంబంధమేర్పరచుకునే వయసు మీకుందా? దేవుణ్ణి సేవించేందుకు నిర్ణయించుకొనే సామర్థ్యం మీలో ఉందని దేవుడు పరిగణిస్తాడని అనుకోవడం సహేతుకం కాదా?

13 మీరు దైవభక్తిగల తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి, క్రైస్తవ కూటాలకు హాజరవుతూ, రాజ్య సువార్తను కూడా ప్రకటిస్తూ ఇంకా బాప్తిస్మం తీసుకోని యౌవనునిగా ఉన్నారా? అలాగైతే, మిమ్మల్నిమీరు నిజాయితీగా ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? నా తల్లిదండ్రులు ఆశిస్తున్న కారణంగా నేను కూటాలకు హాజరౌతూ, ప్రకటనాపనిలో భాగం వహిస్తున్నానా లేక యెహోవాను సంతోషపెట్టాలనే కారణంతోనా?’ “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో” మీకైమీరు రూఢీపరుచుకున్నారా?​—⁠రోమీయులు 12:⁠2.

బాప్తిస్మం తీసుకోవడాన్ని వాయిదా వేయడమెందుకు?

14 “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి?” అని సువార్తికుడైన ఫిలిప్పును ప్రశ్నించిన ఐతియోపీయుడు యేసే మెస్సీయ అని అప్పుడే తెలుసుకున్నాడు. ఇక అప్పటినుండి క్రైస్తవ సంఘ సభ్యునిగా యెహోవా సేవ చేస్తానని బహిరంగముగా ఒప్పుకునేందుకు ఆలస్యం చేయకూడదని గ్రహించేందుకు తగిన జ్ఞానం ఆ ఐతియోపీయునికి ఉంది, అది ఆయనకెంతో ఆనందాన్నిచ్చింది. (అపొస్తలుల కార్యములు 8:​26-​39) అదేవిధంగా లూదియ అనే స్త్రీ, తన ‘హృదయం తెరవబడినప్పుడు, ఆమె పౌలు చెప్పిన మాటల్లో లక్ష్యముంచి’ వెంటనే ఆమె, ఆమె ఇంటివారు ‘బాప్తిస్మం తీసుకున్నారు.’ (అపొస్తలుల కార్యములు 16:​14, 15) అలాగే పౌలు, సీల ఫిలిప్పీలోని చెరసాల అధిపతికి ‘యెహోవా వాక్యము బోధించినప్పుడు’ “వెంటనే అతడును, అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.” (అపొస్తలుల కార్యములు 16:​25-​34) కాబట్టి, మీకు యెహోవా గురించిన, ఆయన సంకల్పాల గురించిన ప్రాథమిక జ్ఞానం, ఆయన చిత్తం చేయాలనే యథార్థమైన అభిలాష ఉండి, సంఘంలో మంచి పేరు కలిగి, క్రమంగా కూటాలకు హాజరవుతూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే బాప్తిస్మం తీసుకోవడాన్ని మీరు వాయిదా వేయడమెందుకు?​—⁠మత్తయి 28:​19, 20.

15 పొరపాటున మీరేదైనా తప్పుచేస్తే మిమ్మల్ని జవాబుదారుల్ని చేస్తారనే భయంతో మీరు ఈ ప్రాముఖ్యమైన చర్య తీసుకునేందుకు వెనకాడుతున్నారా? అలాగైతే, దీని గురించి ఆలోచించండి: ఏదో ఒక రోజు ప్రమాదం జరగవచ్చనే భయంతో మీరు డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు పెట్టడానికి నిరాకరిస్తారా? ఖచ్చితంగా మీరలా చేయరు! అలాగే, అర్హులైనప్పుడు బాప్తిస్మం తీసుకునేందుకు మీరు వెనకాడకూడదు. నిజానికి, మీరు మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని, ఆయన చిత్తం చేయడానికి ఒప్పుకున్నట్లయితే, తప్పుచేయడాన్ని నివారించేందుకు మీ శాయశక్తులా ప్రయత్నించేలా మీరు పురికొల్పబడతారు. (ఫిలిప్పీయులు 4:​13) యౌవనులారా, బాప్తిస్మాన్ని వాయిదా వేయడం ద్వారా మీరు జవాబుదారులుగా ఎంచబడరని దయచేసి ఊహించకండి. మీరు బాధ్యతగల వయసుకు చేరుకున్నప్పుడు, బాప్తిస్మం తీసుకున్నా, తీసుకోకపోయినా మీ ప్రవర్తననుబట్టి మీరు యెహోవాకు జవాబుదారులే.​—⁠రోమీయులు 14:​11, 12.

16 తాము యౌవనులుగా ఉన్నప్పుడే బాప్తిస్మం తీసుకోవాలనే నిర్ణయం తమకెంతో సహాయం చేసిందని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సాక్షులు భావిస్తున్నారు. ఉదాహరణకు, పశ్చిమ ఐరోపాలోని 23 ఏళ్ల సాక్షినే తీసుకోండి. 13 ఏళ్లప్పుడు బాప్తిస్మం తీసుకోవడం తాను ‘యౌవనేచ్ఛలతో’ కొట్టుకొనిపోకుండా జాగ్రత్తపడేలా తనను ప్రేరేపించిందని ఆయన గుర్తుచేసుకుంటున్నాడు. (2 తిమోతి 2:​22) చిన్నప్పటినుండే పూర్తికాల పరిచారకునిగా సేవచేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. నేడు, ఆయన యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సంతోషంగా సేవచేస్తున్నాడు. మీతోపాటు, యెహోవాను సేవించాలని ఎంచుకునే యౌవనస్థులందరికీ మెండైన ఆశీర్వాదాలు వేచివున్నాయి.

17 మన కార్యకలాపాలన్నింటిలో యెహోవా చిత్తాన్ని పరిగణలోకి తీసుకునే జీవనానికి సమర్పణ, బాప్తిస్మం ఆరంభాన్ని సూచిస్తాయి. మన సమర్పణను నెరవేర్చడంలో ‘సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం’ ఇమిడివుంది. మనమెలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు? వ్యర్థమైన పనులకోసం వెచ్చించే సమయాన్ని మనమిప్పుడు ప్రాముఖ్యమైన బైబిలు అధ్యయనానికి, క్రమంగా కూటాలకు హాజరవడానికి, “రాజ్యసువార్తను” ప్రకటించడంలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొనేందుకు ఉపయోగించడం ద్వారానే. (ఎఫెసీయులు 5:​15, 16; మత్తయి 24:​14) యెహోవాకు మనం చేసుకున్న సమర్పణ, ఆయన చిత్తం చేయాలనే మన అభిలాష, మనం ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునే విధానం, మన ఆహారపానీయాల అలవాట్లు, మనం వినే సంగీతం వంటి జీవితపు రంగాలన్నింటిపైనా మేలైన ప్రభావం చూపిస్తాయి. మీరు నిరంతరం ఆస్వాదించగల కాలాక్షేపాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? ‘యెహోవా చిత్తపు’ పరిధిలో ఉంటూ వినోదాన్ని ఆస్వాదించే అనేక ప్రయోజనాత్మక పద్ధతులున్నాయని, సంతోషంగా ఉన్న వేలాదిమంది యౌవన సాక్షులు మీకు చెబుతారు.​—⁠ఎఫెసీయులు 5:​17-19.

“మేము మీతోకూడ వత్తుము”

18 సా.శ.పూ. 1513 నుండి సా.శ. 33 పెంతెకొస్తు వరకు యెహోవాకు ఈ భూమ్మీద వ్యవస్థీకృత ప్రజలున్నారు. తనను ఆరాధిస్తూ, తనకు సాక్షులుగా ఉండేందుకు ఆయన వారిని ఎన్నుకున్నాడు. (యెషయా 43:​12) యౌవన ఇశ్రాయేలీయులు ఆ జనాంగంలో జన్మించారు. పెంతెకొస్తు నుండి యెహోవాకు ‘తన నామముకొరకు’ భూమ్మీద ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అనే ఓ క్రొత్త “జనము” ఏర్పర్చబడ్డారు. (1 పేతురు 2:​9, 10; అపొస్తలుల కార్యములు 15:​14; గలతీయులు 6:​16) క్రీస్తు “సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము” పవిత్రపరచుకున్నాడని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (తీతు 2:​14) యౌవనస్థులైన మీరు ఆ ప్రజలు ఎవరో సొంతగా గ్రహించవచ్చు. నేడు “సత్యము నాచరించు నీతిగల జనముగా” ఉండి, బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవిస్తూ, యెహోవాకు నమ్మకమైన సాక్షులుగా ఆయన రాజ్యమే మానవాళి ఏకైక నిరీక్షణ అని ఎవరు ప్రకటిస్తున్నారు? (యెషయా 26:​2-4) క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలను, ఇతర మతాల్ని చూసి, వారి ప్రవర్తనను, దేవుని నిజ సేవకులనుండి బైబిలు కోరే ప్రవర్తనను పోల్చిచూడండి.

19 యౌవనులతోసహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, యెహోవాసాక్షుల అభిషిక్త శేషమే ‘నీతిగల జనముగా’ ఉన్నారని నమ్ముతున్నారు. వారు ఈ ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో ఇలా అంటున్నారు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము.” (జెకర్యా 8:​23) యౌవనులైన మీరు దేవుని ప్రజలమధ్య ఉండేందుకు నిర్ణయించుకొని, ‘జీవమును’ అంటే యెహోవా నూతనలోకంలో నిత్యజీవాన్ని ఎంచుకుంటారని మేము నిరీక్షిస్తూ, దాని కోసం ప్రార్థిస్తున్నాం.​—⁠ద్వితీయోపదేశకాండము 30:​15-20; 2 పేతురు 3:​11-13.

పునఃసమీక్ష

మానసిక నియంత్రణలో ఏమి ఇమిడివుంది?

యెహోవాకు ఎలాంటి సేవ ఆమోదయోగ్యమైనది?

సమర్పిత తల్లిదండ్రులు పెంచిన పిల్లలందరి ఎదుట ఏ ఎంపిక ఉంది?

బాప్తిస్మాన్ని ఎందుకు అనవసరంగా వాయిదా వేయకూడదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. క్రైస్తవమత సామ్రాజ్యంలో ఎలాంటి తప్పుడు బాప్తిస్మాలు ఆచరణలో ఉన్నాయి?

3, 4. సమర్పించుకున్న తల్లిదండ్రుల పిల్లలు స్వచ్ఛందంగా సమర్పించుకునేందుకు వారికేది సహాయం చేయగలదు?

5. ఇటు పిల్లలకు అటు తండ్రులకు పౌలు ఏ ఉపదేశాన్నిచ్చాడు?

6, 7. యెహోవా ‘మానసిక నియంత్రణలో’ పిల్లలను పెంచడంలో ఏమి ఇమిడివుంది, అలా చేయడం తల్లిదండ్రులు తమ పిల్లలపై అనుచిత ఒత్తిడి తీసుకురావడమని ఎందుకు అనలేము?

8. తిమోతి ‘రూఢియని తెలుసుకోవడంలో’ ఏమి ఇమిడివుంది?

9. (ఎ) యెహోవా తన సృష్టిప్రాణులను ఎలా ఘనపరిచాడు, దానికి కారణమేమిటి? (బి) దేవుని అద్వితీయ కుమారుడు తన స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా ఉపయోగించాడు?

10. యెహోవాను ఆమోదయోగ్యంగా సేవించేందుకు ఆధారమేమిటి?

11. సమర్పిత తల్లిదండ్రులు పెంచిన యౌవనస్థుల ఎదుట ఏ ఎంపిక ఉంది?

12. (ఎ) తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇవ్వగలిగినా, వారికోసం తల్లిదండ్రులు ఏమి చేయలేరు? (బి) ఒక యౌవనస్థుడు తాను చేసుకునే ఎంపికల విషయంలో యెహోవా ఎదుట ఎప్పుడు బాధ్యుడౌతాడు?

13. బాప్తిస్మం తీసుకోని యౌవనస్థులు ఏలాంటి ప్రశ్నలు వేసుకోవాలి?

14. బాప్తిస్మాన్ని అనవసరంగా ఆలస్యం చేయకూడదని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?

15, 16. (ఎ) కొందరు యౌవనులు బాప్తిస్మం తీసుకోకుండా ఏ తప్పుడు తర్కం వారిని అడ్డగించవచ్చు? (బి) సమర్పణ, బాప్తిస్మం యౌవనస్థులను ఎలా కాపాడగలదు?

17. ఏ రంగాల్లో ‘యెహోవా చిత్తమేమిటో’ గ్రహించడంలో కొనసాగడం అవసరం?

18. యౌవనులు తమనుతాము ఏమని ప్రశ్నించుకోవాలి?

19. భూవ్యాప్తంగా లక్షలాదిమంది ఏమి నమ్ముతున్నారు?

[26వ పేజీలోని చిత్రాలు]

మీరు ఎవరు చెప్పేది వింటారు?

[28వ పేజీలోని చిత్రం]

సమర్పణ, బాప్తిస్మం మిమ్మల్ని ఎలా కాపాడగలవు?

[29వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం తీసుకోకుండా ఏది మిమ్మల్ని అడ్డగిస్తుంది?