వారు దేవుడు ఏర్పరచుకున్న జనాంగ సభ్యులుగా జన్మించారు
వారు దేవుడు ఏర్పరచుకున్న జనాంగ సభ్యులుగా జన్మించారు
‘నీ దేవుడైన యెహోవా నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.’—ద్వితీయోపదేశకాండము 7:6.
సా.శ.పూ. 1513లో యెహోవా భూమ్మీది తన సేవకులను తనతో ఒక క్రొత్త సంబంధంలోకి తీసుకున్నాడు. ఆ సంవత్సరంలో, ఆయన ఓ ప్రపంచ ఆధిపత్యాన్ని అవమానపరిచి ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడిపించాడు. ఆ చర్య ద్వారా ఆయన వారికి రక్షకుడు, యజమాని అయ్యాడు. చర్య తీసుకోవడానికి ముందు ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము—నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును.”—నిర్గమకాండము 6:6, 7; 15:1-7, 11.
2 ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు వచ్చిన తర్వాత, వారు యెహోవా దేవునితో ఓ నిబంధనా సంబంధంలోకి ప్రవేశించారు. అప్పటినుండి యెహోవా ఆయావ్యక్తులతో, కుటుంబాలతో లేదా ఆయావంశాలతో వ్యవహరించడానికి బదులు ఆయనకు ఈ భూమ్మీద వ్యవస్థీకృత ప్రజలు ఉంటారు లేదా జనాంగం ఉంటుంది. (నిర్గమకాండము 19:5, 6; 24:7) ఆయన తన ప్రజలకు వారి సంఘజీవనాన్ని నడిపించిన నియమాలను, మరి ప్రాముఖ్యంగా వారి ఆరాధనను నిర్దేశించిన నియమాలను ఇచ్చాడు. మోషే వారికిలా చెప్పాడు: “మనము ఆయనకు మొఱపెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?”—ద్వితీయోపదేశకాండము 4:7, 8.
వారు సాక్షుల జనాంగంలో జన్మించారు
3 శతాబ్దాల తర్వాత, యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా, ఇశ్రాయేలీయులకు వారొక జనాంగంగా ఉండేందుకుగల ప్రాముఖ్యమైన కారణాన్ని గుర్తుచేశాడు. యెషయా వారికిలా చెప్పాడు: “యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను . . . దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము, నేనే యెషయా 43:1, 3, 6, 7, 10, 21.
వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. . . . మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. . . . నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.”—4 యెహోవా నామమునుబట్టి పిలువబడిన ప్రజలుగా ఇశ్రాయేలీయులు జనాంగాల ఎదుట ఆయన సర్వాధిపత్యానికి సాక్షులుగా ఉంటారు. వారు ‘యెహోవా మహిమ నిమిత్తము సృజించబడిన’ ప్రజలుగా ఉండాలి. వారు ‘యెహోవా స్తోత్రమును ప్రచురం’ చేయాలి, విడుదలకు సంబంధించి ఆయన ఆశ్చర్యకార్యాలను వివరిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, వారు యెహోవాకు సాక్ష్యమిచ్చే జనాంగంగా ఉండాలి.
5 ఇశ్రాయేలును యెహోవా ఓ ప్రత్యేక జనాంగంగా చేశాడని రాజైన సొలొమోను సా.శ.పూ. 11వ శతాబ్దంలో సూచించాడు. యెహోవాకు చేసిన ప్రార్థనలో ఆయనిలా అన్నాడు: “నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలోనుండి వారిని ప్రత్యేకించితివి.” (1 రాజులు 8:53) ఇశ్రాయేలీయులు ఆయా వ్యక్తులుగా కూడా యెహోవాతో ప్రత్యేక సంబంధం కలిగివున్నారు. అంతకుపూర్వం మోషే వారితో ఇలా అన్నాడు: “మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు . . . నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠితజనము.” (ద్వితీయోపదేశకాండము 14:1, 2) కాబట్టి యౌవన ఇశ్రాయేలీయులు యెహోవాకు తమ జీవితాలు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. వారు దేవుని సమర్పిత ప్రజల సభ్యులుగా జన్మించారు. (కీర్తన 79:13; 95:7) ప్రతీ క్రొత్త తరానికి యెహోవా నియమాలు ఉపదేశించబడేవి, అందువల్ల వారు, యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కారణంగా ఆ నియమాలకు బద్ధులై ఉండాలి.—ద్వితీయోపదేశకాండము 11:18, 19.
ఎంపికచేసుకునే స్వేచ్ఛ
6 ఇశ్రాయేలీయులు సమర్పిత జనాంగంలో జన్మించినప్పటికీ, దేవుణ్ణి సేవించేందుకు ప్రతీవ్యక్తి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. వారు వాగ్దానదేశంలోకి ప్రవేశించకముందు మోషే వారితో ఇలా అన్నాడు: “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.” (ద్వితీయోపదేశకాండము 30:19, 20) కాబట్టి, ఇశ్రాయేలీయులు యెహోవాను ప్రేమించేందుకు, ఆయన మాట వినేందుకు, ఆయనను హత్తుకునేందుకు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. ఇశ్రాయేలీయులకు ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నందున, తమ నిర్ణయాల పర్యవసానాల్ని భరించే బాధ్యత కూడా వారికి ఉంది.—ద్వితీయోపదేశకాండము 30:16-18.
7 విశ్వాస్యతకు, అవిశ్వాస్యతకు లభించే పర్యవసానాల విషయంలో న్యాయాధిపతుల కాలం ఓ మంచి ఉదాహరణను అందిస్తోంది. ఆ కాలం ఆరంభమవడానికి కొద్దికాలం ముందు, ఇశ్రాయేలీయులు యెహోషువ మంచి మాదిరిని అనుసరించి ఆశీర్వదించబడ్డారు. “యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.” అయితే, యెహోషువ మరణించిన కొద్దికాలం తర్వాత, “యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి[రి].” (న్యాయాధిపతులు 2:7, 10, 11) అనుభవం లేని ఆ కుర్రతరం, యెహోవా దేవుడు గతంలో ఏ ప్రజల కోసం ఆశ్చర్యకార్యాలు చేశాడో ఆ సమర్పిత ప్రజల సభ్యులుగా తమ వారసత్వాన్ని కాపాడుకోలేదు.—కీర్తన 78:3-7, 10, 11.
తమ సమర్పణకు అనుగుణంగా జీవించడం
8 జనాంగ సమర్పణకు అనుగుణంగా జీవించే అవకాశాలను యెహోవా తన ప్రజలకిచ్చాడు. ఉదాహరణకు, ధర్మశాస్త్రం బలులు లేదా అర్పణలు అర్పించే విధానాన్ని సూచించింది, వాటిలో కొన్ని అనివార్యమైతే హెబ్రీయులు 8:3) అలాంటి అర్పణల్లో దహనబలులు, నైవేద్యము, సమాధాన బలులు స్వేచ్ఛార్పణలు అంటే యెహోవా అనుగ్రహం పొందేందుకు, కృతజ్ఞతలు వ్యక్తపర్చేందుకు ఆయనకు అర్పించే అర్పణలు ఉండేవి.—లేవీయకాండము 7:11-13.
మరికొన్ని స్వేచ్ఛార్పణలు. (9 అలాంటి స్వేచ్ఛార్పణలు యెహోవాను సంతోషపర్చాయి. దహనబలి, నైవేద్యము “యెహోవాకు ఇంపైన సువాసనగల” అర్పణలుగా పరిగణించబడ్డాయి. (లేవీయకాండము 1:9; 2:2) సమాధాన బలియర్పణలో, జంతు రక్తం, క్రొవ్వు యెహోవాకు అర్పించి, ఆయా మాంసభాగాల్ని యాజకులు, అర్పించిన వ్యక్తి తినాలి. ఆ విధంగా, అది యెహోవాతో సమాధానకర సంబంధాన్ని సూచించే చిహ్నార్థక భోజనంగా ఉండేది. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను.” (లేవీయకాండము 19:5) ఇశ్రాయేలీయులందరూ పుట్టుకతోనే యెహోవాకు సమర్పించుకున్న వారిగావున్నా, ఎవరైతే స్వేచ్ఛార్పణలు అర్పించడం ద్వారా తమ సమర్పణకు అనుగుణంగా జీవించారో వారు ‘అంగీకరించబడి’ మెండుగా ఆశీర్వదించబడ్డారు.—మలాకీ 3:10.
10 అయితే, సమర్పిత ఇశ్రాయేలు జనాంగం తరచూ యెహోవాపట్ల అపనమ్మకంగా ఉన్నట్లు నిరూపించుకుంది. యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా వారికిలా చెప్పాడు: “దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు, నీ బలులచేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతపెట్టలేదు.” (యెషయా 43:23) అంతేకాక, ఇష్టపూర్వకంగా ప్రేమతో అర్పించని అర్పణలకు యెహోవా దృష్టిలో ఏ విలువా ఉండదు. ఉదాహరణకు, యెషయా చనిపోయి దాదాపు 300 సంవత్సరాలైన తర్వాత, మలాకీ ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులు లోపమున్న జంతువుల్ని అర్పించారు. అందుకే మలాకీ వారితో ఇలా అన్నాడు: “మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. . . . దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.”—మలాకీ 1:10, 13; ఆమోసు 5:22.
సమర్పిత జనాంగంగా తృణీకరించబడ్డారు
11 ఇశ్రాయేలీయులు యెహోవా సమర్పిత జనాంగంగా తయారైన సమయంలో ఆయన వారికిలా వాగ్దానం చేశాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.” (నిర్గమకాండము 19:5, 6) వారినుండే వాగ్దత్త మెస్సీయ రావడమే కాక, దేవుని రాజ్య ప్రభుత్వంలో సభ్యులయ్యే మొదటి అవకాశం వారికివ్వబడింది. (ఆదికాండము 22:17, 18; 49:10; 2 సమూయేలు 7:12, 16; లూకా 1:31-33; రోమీయులు 9:4, 5) అయితే ఇశ్రాయేలు జనాంగంలోని అధికశాతం తమ సమర్పణకు తగినట్లు ప్రవర్తించలేదు. (మత్తయి 22:14) వారు మెస్సీయను తిరస్కరించి చివరకు ఆయనను హత్యచేశారు.—అపొస్తలుల కార్యములు 7:51-53.
12 యేసు తాను మరణించడానికి కొద్దిరోజుల ముందు యూదా మతనాయకులతో ఇలా అన్నాడు: “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” (మత్తయి 21:42, 43) యెహోవా తనకు సమర్పించుకున్న జనముగా వారిని తిరస్కరించాడని ఉదాహరిస్తూ, యేసు ఇలా అన్నాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.”—మత్తయి 23:37, 38.
సమర్పించుకున్న ఓ క్రొత్త జనాంగం
13 ప్రవక్తయైన యిర్మీయా కాలంలో, తన ప్రజల గురించిన ఓ క్రొత్త విషయాన్ని యెహోవా ప్రవచించాడు: మనమిలా చదువుతాం: “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు.”—యిర్మీయా 31:31-34.
14 యేసు సా.శ. 33లో చనిపోయి ఆ తర్వాత తాను చిందించిన రక్తంయొక్క విలువను తన తండ్రికి సమర్పించినప్పుడు ఈ క్రొత్త నిబంధనకు పునాది వేయబడింది. (లూకా 22:20; హెబ్రీయులు 9:15, 24-26) అయితే, సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడడంతో ఆ క్రొత్త జనాంగం ‘దేవుని ఇశ్రాయేలుగా’ జన్మించి, క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. (గలతీయులు 6:16; రోమీయులు 2:28, 29; 9:6; 11:) అభిషిక్త క్రైస్తవులకు వ్రాస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా ప్రకటించాడు: “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.” ( 25, 261 పేతురు 2:9, 10) యెహోవాకు సహజ ఇశ్రాయేలుకు మధ్యగల ప్రత్యేక సంబంధం ముగిసింది. సా.శ. 33లో యెహోవా అనుగ్రహం భూసంబంధ ఇశ్రాయేలు నుండి ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు అంటే మెస్సీయ రాజ్య ‘ఫలాలు ఫలించే జనమైన’ క్రైస్తవ సంఘానికి మార్చబడింది.—మత్తయి 21:43.
వ్యక్తిగత సమర్పణ
15 సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, యూదుడే గానీ, అన్యుడే గానీ ప్రతీవ్యక్తి వ్యక్తిగతంగా దేవునికి సమర్పించుకొని “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మం తీసుకోవాలి. * (మత్తయి 28:19) పెంతెకొస్తునాడు అపొస్తలుడైన పేతురు స్పందించిన యూదులకు, యూదామత ప్రవిష్టులకు ఇలా చెప్పాడు: “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” (అపొస్తలుల కార్యములు 2:38) అలాంటి యూదులు, యూదామత ప్రవిష్టులు తమ బాప్తిస్మాన్ని తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నామనే కాక, యెహోవా తమ పాపాల్ని యేసు మూలంగా క్షమిస్తాడని అంగీకరించామని కూడా సూచించాలి. వారాయనను యెహోవా ప్రధానయాజకునిగా, తమ నాయకునిగా, క్రైస్తవ సంఘ శిరస్సుగా గుర్తించాలి.—కొలొస్సయులు 1:13, 14, 18.
16 చాలా సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.” (అపొస్తలుల కార్యములు 26:20) పౌలు యేసే క్రీస్తనీ, మెస్సీయ అనీ ప్రజలకు అంటే యూదులకు, అన్యులకు నమ్మకం కలిగించిన తర్వాత, వారు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకొనేందుకు సహాయం చేశాడు. (అపొస్తలుల కార్యములు 16:14, 15, 31-33; 17:2-4; 18:8) దేవునితట్టు తిరగడం ద్వారా అలాంటి క్రొత్త శిష్యులు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యులయ్యారు.
17 నేడు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెందిన మిగిలిన సభ్యులు ముద్రించబడే పని ముగింపుకొచ్చింది. అది పూర్తైనప్పుడు, “మహాశ్రమల” నాశనపు వాయువులను పట్టుకొనివున్న ‘నలుగురు దేవదూతలకు’ వాటిని విడిచిపెట్టే అధికారమివ్వబడుతుంది. ఈలోగా, భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణగల ‘గొప్పసమూహాన్ని’ సమకూర్చే పని వేగంగా జరుగుతోంది. ఈ “వేరేగొఱ్ఱెలు,” “గొఱ్ఱెపిల్ల రక్తములో” విశ్వాసముంచి యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకోవడాన్ని ఇష్టపూర్వకంగా ఎంచుకుంటారు. (ప్రకటన 7:1-4, 9-15; 22:17; యోహాను 10:16; మత్తయి 28:19, 20) వారిలో చాలామంది క్రైస్తవ తల్లిదండ్రుల పెంపకంలో పెద్దవారైన యౌవనులు ఉన్నారు. మీరు అలాంటి యౌవనుల్లో ఒకరైతే, తర్వాతి ఆర్టికల్‌ను చదివేందుకు ఇష్టపడతారు.
[అధస్సూచి]
^ పేరా 23 కావలికోట మే 15, 2003, 30-1 పేజీలు చూడండి.
పునఃసమీక్ష
•యౌవన ఇశ్రాయేలీయులు యెహోవాకు వ్యక్తిగతంగా సమర్పించుకోవలసిన అవసరం ఎందుకు లేదు?
•ఇశ్రాయేలీయులు తాము చేసుకున్న సమర్పణకు తగినవిధంగా జీవిస్తున్నామని ఎలా చూపించుకోవచ్చు?
•యెహోవా తన సమర్పిత జనాంగంగా ఇశ్రాయేలును ఎందుకు తిరస్కరించాడు, దాని స్థానం ఎవరికి ఇవ్వబడింది?
•సా.శ. 33 పెంతెకొస్తు దగ్గరనుండి ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యులయ్యేందుకు యూదులు, అన్యులు ఏమిచేయవలసి ఉండిరి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. యెహోవా తన ప్రజల పక్షాన ఏ గొప్పకార్యాలు జరిగించాడు, ఇశ్రాయేలీయులు దేవునితో ఏ సంబంధంలోకి ప్రవేశించారు?
3, 4. ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా ఉనికిలో ఉండడానికి ఓ ప్రాముఖ్యమైన కారణమేమిటి?
5. ఇశ్రాయేలు ఏ విధంగా దేవునికి సమర్పించుకున్న జనాంగం?
6. ఇశ్రాయేలీయులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం చేసుకోవాలి?
7. యెహోషువ తరంవారు మరణించిన తర్వాత ఏమి జరిగింది?
8, 9. (ఎ) ఇశ్రాయేలీయులు యెహోవాకు తమ సమర్పణను ప్రదర్శించేలా ఏ ఏర్పాటు వారిని అనుమతించింది? (బి) స్వేచ్ఛార్పణలు అర్పించినవారు ఏమి పొందారు?
10. యెషయా, మలాకీ కాలంలో యెహోవా తన అయిష్టతను ఎలా వ్యక్తపరిచాడు?
11. ఇశ్రాయేలుకు ఎలాంటి అవకాశమివ్వబడింది?
12. యెహోవా సమర్పిత జనాంగంగా ఇశ్రాయేలు తిరస్కరించబడిందని యేసు పలికిన ఏ మాటలు సూచిస్తున్నాయి?
13. యిర్మీయా కాలంలో యెహోవా ఏ ప్రవచనార్థక మాటలు చెప్పాడు?
14. ఎప్పుడు, దేని ఆధారంగా యెహోవా క్రొత్త సమర్పిత జనాంగం ఉనికిలోకి వచ్చింది? ఆ క్రొత్త జనాంగాన్ని నిర్వచించండి?
15. ఎలాంటి బాప్తిస్మం తీసుకోవాలని సా.శ. 33 పెంతెకొస్తునాడు పేతురు తన శ్రోతలను ప్రోత్సహించాడు?
16. పౌలు కాలంలో, సరైన మనోవైఖరిగల యూదులు, అన్యులు ఎలా ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో భాగమయ్యారు?
17. ముద్రించబడే ఏ పని ముగింపుకొచ్చింది, ఇంకా ఏ పని వేగంగా జరుగుతోంది?
[21వ పేజీలోని చిత్రం]
యౌవన ఇశ్రాయేలీయులు దేవుడు ఎంచుకున్న జనాంగ సభ్యులుగా జన్మించారు
[23వ పేజీలోని చిత్రం]
ప్రతీ ఇశ్రాయేలీయుడు దేవుని సేవించాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి
[23వ పేజీలోని చిత్రం]
స్వేచ్ఛార్పణలు ఇశ్రాయేలీయులకు యెహోవాపట్ల తమ ప్రేమను ప్రదర్శించే అవకాశాన్నిచ్చాయి
[25వ పేజీలోని చిత్రం]
సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, క్రీస్తు అనుచరులు దేవునికి వ్యక్తిగతంగా సమర్పించుకొని, దానిని బాప్తిస్మం ద్వారా సూచించాలి