కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధలు అనుభవించే వారిని యెహోవా విడిపిస్తాడు

బాధలు అనుభవించే వారిని యెహోవా విడిపిస్తాడు

బాధలు అనుభవించే వారిని యెహోవా విడిపిస్తాడు

“నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.”​—⁠కీర్తన 34:​19.

కాకో * అనే యౌవనురాలు 20కన్నా ఎక్కువ సంవత్సరాలుగా ఒక యెహోవాసాక్షిగా ఉంది. ఆమె కొంతకాలం క్రమ పయినీరుగా అంటే పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా సేవ చేసింది. ఆమె ఆ ఆధిక్యతను ఎంతో అమూల్యంగా పరిగణించింది. అయితే, కాకో కొద్దికాలం క్రితం నిరాశతో, ఒంటరితనంతో కృంగిపోయింది. “నేను ఏడవడం తప్ప మరేమీ చేయలేకపోయాను” అని ఆమె చెబుతోంది. ప్రతికూల ఆలోచనా విధానంతో పోరాడేందుకు కాకో వ్యక్తిగత అధ్యయనం కోసం మరింత సమయాన్ని వెచ్చించింది. “అయినప్పటికీ, నేను నా ఆలోచనా విధానాన్ని మార్చుకోలేకపోయాను, చనిపోవాలనుకునేంతగా నేను కృంగిపోయాను” అని ఆమె అంటోంది.

2 మీరు కూడా అలాంటి నిరాశా భావాలతో పోరాడారా? ఒక యెహోవాసాక్షిగా మీరు సంతోషించేందుకు చాలా కారణాలున్నాయి, ఎందుకంటే దైవభక్తి ‘యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినది.’ (1 తిమోతి 4:⁠8) ప్రస్తుతం మీరు ఆధ్యాత్మిక పరదైసులో జీవిస్తున్నారు! అయితే, బాధలన్నిటి నుండి మీరు రక్షించబడ్డారని దానర్థమా? ఎంతమాత్రం కాదు! బైబిలు ఇలా చెబుతోంది: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు.” (కీర్తన 34:​19) అందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ‘లోకమంతయు దుష్టుడైన’ అపవాదియగు సాతాను అధీనంలో ఉంది. (1 యోహాను 5:​19) కాబట్టి, మనమందరం ఏదోక రీతిలో అపవాది పరిపాలనా ప్రభావాల్ని ఎదుర్కొంటాం.​—⁠ఎఫెసీయులు 6:​12.

బాధల పర్యవసానాలు

3 ఎంతోకాలం కొనసాగే బాధలు మన దృక్కోణాన్ని చీకటిమయంగా మార్చేయగలవు. (సామెతలు 15:⁠15) నీతిమంతుడైన యోబునే తీసుకోండి. తీవ్రమైన విషమ పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు యోబు ఇలా అన్నాడు: “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.” (యోబు 14:⁠1) యోబు ఆనందం కనుమరుగైంది. యెహోవా తనను విడిచిపెట్టాడని కూడా ఆయన కొద్దికాలం అనుకున్నాడు. (యోబు 29:​1-5) దేవుని సేవకుల్లో యోబు మాత్రమే తీవ్ర బాధను అనుభవించలేదు. సంతానం లేని కారణంగా హన్నా “బహుదుఃఖాక్రాంతురాలు” అయ్యిందని బైబిలు మనకు చెబుతోంది. (1 సమూయేలు 1:​9-​11) కుటుంబ పరిస్థితినిబట్టి తీవ్రంగా కలవరపడిన రిబ్కా ఇలా అంది: “నా ప్రాణము విసికినది.” (ఆదికాండము 27:​46) దావీదు తన తప్పులను మననం చేసుకున్నప్పుడు ఇలా అన్నాడు: “దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.” (కీర్తన 38:⁠6) ఆ కొన్ని ఉదాహరణలు, క్రైస్తవపూర్వ కాలాల్లోని దైవభయంగల స్త్రీపురుషులు తమను తీవ్రంగా కృంగదీసిన పరిస్థితులను సహించారని స్పష్టం చేస్తున్నాయి.

4 మరి క్రైస్తవుల మాటేమిటి? “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి” అని థెస్సలోనీకయులకు చెప్పవలసి ఉన్నట్లు అపొస్తలుడైన పౌలు గ్రహించాడు. (1 థెస్సలొనీకయులు 5:​14) ఇక్కడ “ధైర్యము చెడినవారు” అని అనువదించబడిన గ్రీకు పదం “జీవితంలోని ఒత్తిళ్లవల్ల తాత్కాలికంగా కృంగిన” వారిని సూచించగలదని ఒక గ్రంథం పేర్కొంటోంది. థెస్సలోనీక సంఘంలోని కొందరు ఆత్మాభిషిక్త క్రైస్తవులు కృంగుదలకు గురయ్యారని పౌలు మాటలు సూచిస్తున్నాయి. నేడు కూడా క్రైస్తవుల్లో కృంగుదలకు గురైనవారున్నారు. వారెందుకు కృంగుదలకు గురయ్యారు? మనం మూడు సాధారణ కారణాలను పరిశీలిద్దాం.

మన పాపాపు స్వభావం మనల్ని కృంగదీయవచ్చు

5 భ్రష్టుపట్టి ‘సిగ్గులేనివారిగా’ ఉన్నవారికి భిన్నంగా, నిజ క్రైస్తవులు తమ పాపపు స్థితినిబట్టి నొచ్చుకుంటారు. (ఎఫెసీయులు 4:​19) వారు పౌలు భావించినట్లే భావిస్తుండవచ్చు, ఆయనిలా వ్రాశాడు: “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” ఆ తర్వాత ఆయన “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను?” అని వాపోయాడు.​—⁠రోమీయులు 7:​22-​24.

6 పౌలుకు అనిపించినట్లే మీకూ ఎప్పుడైనా అనిపించిందా? మీ అపరిపూర్ణతల గురించి మీకు బాగా తెలిసివుండడం తప్పు కాదు, ఎందుకంటే అది మీకు పాపపు గంభీరతను నొక్కిచెప్పడమే కాక, చెడును ద్వేషించాలనే మీ నిర్ణయాన్ని మరింత బలపరుస్తుంది. అయితే, మీ లోపాల విషయంలో మీరు ఎల్లప్పుడూ కృంగిన పరిస్థితిలో ఉండనక్కర్లేదు. పౌలు బాధతో వ్రాసిన ఆ మాటలకు, ఈ మాటల్ని కూడా జతచేస్తున్నాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 7:​25) అవును, యేసు చిందించిన రక్తం వారసత్వంగా వచ్చిన పాపం నుండి తనను రక్షిస్తుందని పౌలు నమ్మాడు.​—⁠రోమీయులు 5:​18.

7 మీరొకవేళ మీ పాప స్వభావాన్నిబట్టి బాధపడుతుంటే, అపొస్తలుడైన యోహాను వ్రాసిన ఈ మాటల నుండి మీరు ఓదార్పు పొందండి: “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:​1, 2) మీ పాపపు స్వభావాలనుబట్టి మీరు కృంగినట్లయితే, యేసు పరిపూర్ణుల కోసం మరణించలేదుగాని, పాపుల కోసమే మరణించాడనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అవును, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”​—⁠రోమీయులు 3:​23.

8 గతంలో మీరొకవేళ ఘోరమైన పాపం చేసివుంటే అప్పుడేమిటి? నిస్సందేహంగా మీరు దానిని ప్రార్థనలో చాలామార్లు యెహోవాకు ప్రస్తావించి ఉండవచ్చు. క్రైస్తవ పెద్దలనుండి ఆధ్యాత్మిక సహాయం పొందారు. (యాకోబు 5:​14, 15) మీరు నిజంగా పశ్చాత్తాపపడ్డారు కాబట్టే, ఇంకా సంఘంలో ఉన్నారు. లేదా దేవుని సంస్థను కొంతకాలం విడిచిపెట్టారు, అయితే, ఆ తర్వాత మీరు పశ్చాత్తాపపడి, దేవుని ఎదుట పవిత్ర స్థానాన్ని తిరిగి పొందారు. ఈ రెండింటిలో మీరు ఏ పరిస్థితి ఎదుర్కొన్నా, గతంలో మీరు చేసిన పాపం గుర్తుకువస్తూ అది మిమ్మల్ని కృంగదీయవచ్చు. అదే జరిగితే, నిజంగా పశ్చాత్తాపపడినవారిని యెహోవా “బహుగా క్షమించును” అనే విషయాన్ని మరచిపోకండి. (యెషయా 55:⁠7) అంతేకాక, మీరు పూర్తిగా దోషులన్నట్లు భావించాలని ఆయన కోరుకోవడం లేదు. మీరలా భావించాలనేది కేవలం సాతాను ఉద్దేశమే. (2 కొరింథీయులు 2:​7, 10, 11) శిక్షార్హుడైన అపవాది నాశనం చేయబడతాడు, అయితే మీరు కూడా తనలాగే నాశనపాత్రులన్నట్లు భావించాలని అతడు కోరుకుంటాడు. (ప్రకటన 20:​10) మీ విశ్వాసాన్ని నాశనం చేసే ఈ పన్నాగంలో సాతానును విజయం సాధించనివ్వకండి. (ఎఫెసీయులు 6:​11) బదులుగా, మీరు ఇతర విషయాల్లో చేసినట్లే, ఈ విషయంలో కూడా ‘స్థిరంగా వానిని ఎదిరించండి.’​—⁠1 పేతురు 5:⁠9.

9ప్రకటన 12:⁠10లో సాతాను “మన సహోదరులమీద” అంటే అభిషిక్త క్రైస్తవులమీద “నేరము మోపువాడు” అని పిలువబడ్డాడు. దేవుని ఎదుట అతడు వారిమీద ‘రాత్రింబగళ్లు నేరము మోపుతున్నాడు.’ యెహోవా మిమ్మల్ని నిందించి, దోషులుగా చూడకపోయినా, మిమ్మల్ని మీరు నిందించుకుంటూ, దోషులమని భావించడం అబద్ధారోపకుడైన సాతానుకు సంతోషం కలిగిస్తుందని గ్రహించేందుకు ఆ లేఖనాన్ని ధ్యానించడం మీకు సహాయం చేస్తుంది. (1 యోహాను 3:​19-​22) మీ పొరపాట్ల విషయంలో ఇక లాభం లేదన్నంతగా మీరెందుకు ఆందోళన చెందాలి? దేవునితో మీకున్న సంబంధాన్ని నాశనం చేసేందుకు సాతానును అనుమతించకండి. యెహోవా “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” దేవుడనే వాస్తవాన్ని మీరు అశ్రద్ధచేసేలా ప్రభావితం చేయడానికి అపవాదికి ఎన్నటికీ అవకాశమివ్వకండి.​—⁠నిర్గమకాండము 34:⁠6.

మన పరిమితులు మనల్ని నిరుత్సాహపరచవచ్చు

10 దేవునికి తాముచేసే సేవను తమకున్న పరిమితులు ప్రభావితం చేయడాన్నిబట్టి కొందరు క్రైస్తవులు నిరుత్సాహపడవచ్చు. మీ విషయంలో అదే జరుగుతోందా? బహుశా తీవ్ర అనారోగ్యం, వయసు పైబడడం, లేదా ఇతర పరిస్థితులవల్ల మీరు గతంలో గడిపినట్లు ఎక్కువ సమయం పరిచర్యలో గడపలేకపోతుండవచ్చు. నిజమే, క్రైస్తవులు దేవుని సేవకోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు. (ఎఫెసీయులు 5:​15, 16) అయితే, నిజంగానే మీకున్న పరిమితులవల్ల, మీరు పరిచర్యలో ఎక్కువ సమయం గడపలేకపోయి, అది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంటే, అప్పుడేమిటి?

11 బద్ధకస్థుల్లా కాక, “విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా” ఉండాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీయులు 6:​11) అలాంటి వ్యక్తుల మంచి మాదిరులను పరిశీలించి, వారి విశ్వాసాన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడే మనం వారిని పోలి నడుచుకోవచ్చు. కానీ, ఇతరులతో పోల్చుకుని పనికిరానివారమని భావించడంవల్ల, మనం చేసే ఏ పనీ తృప్తికరంగా లేదనే నిర్థారణకు రావడంవల్ల మనకు మేలు కలుగదు. కాబట్టి, పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనం అన్వయించుకోవాలి: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”​—⁠గలతీయులు 6:⁠4.

12 తీవ్ర ఆరోగ్య సమస్యలవల్ల ఎక్కువ చేయలేకపోతున్నా ఆనందించడానికి క్రైస్తవులకు మంచి కారణముంది. బైబిలు మనకిలా హామీ ఇస్తోంది: “మీరు చేసిన కార్యమును . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:​10) మీ అధీనంలోలేని పరిస్థితులవల్ల మీరు ఒకప్పుడు చేసినంతగా దేవుని సేవ ఇప్పుడు చేయడం మీకు కష్టంగా ఉండవచ్చు. అయితే, యెహోవా సహాయంతో మీరు క్రైస్తవ పరిచర్యకు సంబంధించిన కొన్ని అంశాల్లో అంటే, ఫోన్‌ ద్వారా సాక్ష్యమివ్వడం లేదా ఉత్తరాలు వ్రాయడంవంటి వాటిలో మరింత ఎక్కువగా పాల్గొనవచ్చు. యెహోవా దేవుడు, మీరు పూర్ణాత్మతో చేసే సేవనుబట్టి, తనపట్ల, తోటి మానవులపట్ల మీరు చూపే ప్రేమనుబట్టి మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడని మీరు నమ్మవచ్చు.​—⁠మత్తయి 22:​36-40.

“అపాయకరమైన కాలములు” మనల్ని బాధపెట్టవచ్చు

13 మనం దేవుని నీతియుక్తమైన నూతనలోకంలోని జీవితం కోసం ఎదురుచూస్తున్నా, మనమిప్పుడు ‘అపాయకరమైన కాలములలో’ జీవిస్తున్నాం. (2 తిమోతి 3:⁠1) ఈ కష్టభరిత ఘటనలు, మన విడుదల సమీపించిందని సూచిస్తున్నాయనే విషయాన్నిబట్టి మనం ఓదార్పు పొందుతాం. అయినప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, మీరు నిరుద్యోగులైతే అప్పుడేమిటి? ఉద్యోగాల కొరత ఉండవచ్చు, అలా నెలలు గడిచేకొద్దీ, యెహోవా మీ దీనావస్థను చూస్తున్నాడా, మీ ప్రార్థనలను ఆలకిస్తున్నాడా అనే సందేహాలు మీకు రావచ్చు. లేదా మీరు వివక్షకు లేదా ఇతర అన్యాయాలకు గురై ఉండవచ్చు. వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు చదివినాసరే నీతిమంతుడైన లోతుకు అనిపించినట్లే మీకూ అనిపించవచ్చు, తన చుట్టూ ఉన్న ప్రజల దుష్కామ ప్రవర్తననుబట్టి ఆయన ‘బహుగా బాధపడ్డాడు.’​—⁠2 పేతురు 2:⁠7.

14 అంత్యదినాలకు సంబంధించి మనం అలక్ష్యం చేయలేని ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. చాలామంది ‘అనురాగరహితులు’గా ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:⁠3) చాలా కుటుంబాల్లో కుటుంబ అనురాగం ఎంతో కొరవడుతోంది. నిజానికి, “ప్రజలు చాలావరకు సొంత కుటుంబ సభ్యులచేత చంపబడే, శారీరకంగా హింసించబడే, మానసికంగా లేదా లైంగికంగా అత్యాచారానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సాక్ష్యాధారాలు సూచిస్తున్నాయి. ప్రజలు ఎక్కడ ప్రేమించబడాలో, ఎక్కడ సురక్షిత భావంతో ఉండాలో ఆ స్థలమే కొంతమంది వయోజనులకు, పిల్లలకు అత్యంత ప్రమాదకమైన స్థలంగా ఉంది” అని ఫ్యామిలీ వాయిలెన్స్‌ అనే పుస్తకం చెబుతోంది. అనుచిత గృహ వాతావరణంలో పెరిగినవారు ఆ తర్వాతి సంవత్సరాల్లో తీవ్ర చింతలకు, నిరాశలకు గురికావచ్చు. మీరు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంటే అప్పుడేమిటి?

15 కీర్తనకర్తయైన దావీదు ఇలా పాడాడు: “నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:​10) ఏ మానవ తల్లిదండ్రుల ప్రేమకన్నా యెహోవా ప్రేమ మరెంతో ఉన్నతమైనదని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! తల్లిదండ్రుల తిరస్కారం, క్రూర ప్రవర్తన, విడిచిపెట్టడం ఎంతో బాధ కలిగించినా, అది యెహోవా మీపట్ల చూపించే శ్రద్ధను ఏ మాత్రం తొలగించలేదు. (రోమీయులు 8:​38, 39) దేవుడు తాను ప్రేమించేవారిని ఆకర్షిస్తాడనే విషయం మర్చిపోవద్దు. (యోహాను 3:16; 6:​44) మనుష్యులు మీతో ఎలా వ్యవహరించినా, మీ పరలోక తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు!

నిరుత్సాహం నుండి తేరుకునేందుకు ఆచరణాత్మక చర్యలు

16 నిరుత్సాహాన్ని అధిగమించడానికి మీరు ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు నిర్మాణాత్మక క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పట్టిక వేసుకోండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రత్యేకంగా నిరుత్సాహం మిమ్మల్ని ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడు దానిని ధ్యానించండి. కీర్తనకర్త ఇలా పాడాడు: “‘నా కాలు జారెను’ అని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” (కీర్తన 94:​18, 19) క్రమంగా బైబిలు చదవడం, ఆదరించే మాటలతో, బలపర్చే ఆలోచనలతో మీ మనసును నింపుకోవడానికి సహాయం చేస్తుంది.

17 ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. మీ అంతరంగ భావాల్ని మాటల్లో పూర్తిగా వ్యక్తం చేయలేకపోయినా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో యెహోవాకు తెలుసు. (రోమీయులు 8:​26, 27) “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని కీర్తనకర్త హామీ ఇచ్చాడు.​—⁠కీర్తన 55:​22.

18 వైద్య సంబంధిత మానసిక కృంగుదల కారణంగా కొందరు నిరాశతో బాధపడుతుండవచ్చు. * మీరు కూడా అలాంటి రుగ్మతతో బాధపడుతుంటే, దేవుని నూతనలోకం గురించి, “‘నాకు దేహములో బాగులేదు’ అని అందులో నివసించు వాడెవడును అనని” కాలం గురించి ధ్యానించడానికి ప్రయత్నించండి. (యెషయా 33:​24) మీరు తాత్కాలికంగా కాక, దీర్ఘకాలికంగా మానసిక కృంగుదలకు గురౌతుంటే నిపుణుల సహాయం తీసుకోవడం జ్ఞానయుక్తం. (మత్తయి 9:​12) మీ శారీరక ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవడం కూడా ప్రాముఖ్యమే. పౌష్ఠికాహారం, కొంత వ్యాయామం మీకు మేలు చేయవచ్చు. తగిన విశ్రాంతి తీసుకునేందుకు చర్యలు తీసుకోండి. అర్థరాత్రిదాక టీవి చూస్తూ ఉండిపోకండి, మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బలహీనపరిచే వినోద కార్యకలాపాల్లో పాల్గొనకండి. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా దేవుణ్ణి సంతోషపరిచే కార్యాల్లో నిమగ్నమై ఉండండి! యెహోవా “కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయు” సమయమిది కాకపోయినా సహించేందుకు ఆయన మీకు సహాయం చేస్తాడు.​—⁠ప్రకటన 21:4; 1 కొరింథీయులు 10:​13.

‘దేవుని బలిష్టమైన చేతిక్రింద’ జీవించడం

19 నీతిమంతుడు ఎన్ని ఆపదలు ఎదుర్కొన్నా “వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును” అని బైబిలు అభయమిస్తోంది. (కీర్తన 34:​19) దేవుడు ఎలా విడిపిస్తాడు? తన “శరీరములో ఒక ముల్లు” నుండి విడిపించమని అపొస్తలుడైన పౌలు పదే పదే ప్రార్థించినప్పుడు, “బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది” అని యెహోవా ఆయనతో అన్నాడు. (2 కొరింథీయులు 12:​7-9) యెహోవా పౌలుకు ఏమి వాగ్దానం చేశాడు, ఆయన మీకు ఏమి వాగ్దానం చేస్తున్నాడు? వెంటనే నయమవుతుందని కాదుగానీ, సహించేందుకు శక్తినిస్తానని ఆయన వాగ్దానం చేశాడు.

20 అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:​6, 7) ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు కష్టాలు ఎదుర్కొంటున్నా ఆయన మీకు సహకరిస్తాడు. విశ్వాసులైన క్రైస్తవులు ‘దేవుని బలిష్టమైన చేతిక్రింద’ ఉన్నారని గుర్తుంచుకోండి. మనం యెహోవాను సేవిస్తున్నప్పుడు, కష్టాలను సహించేందుకు ఆయన మనకు శక్తినిస్తాడు. మనం ఆయనకు విశ్వాసంగా ఉంటే, ఏ విషయమూ మనకు శాశ్వత ఆధ్యాత్మిక హాని చేయలేదు. కాబట్టి, మనం వాగ్దానం చేయబడిన నూతనలోకంలో నిత్యజీవితాన్ని ఆస్వాదించడమే కాక, బాధలను అనుభవించే వారిని ఆయన శాశ్వతంగా విడిపించే రోజును చూసేలా యెహోవాపట్ల మన యథార్థతను కాపాడుకుందాం!

[అధస్సూచీలు]

^ పేరా 3 పేరు మార్చబడింది.

^ పేరా 25 వైద్య సంబంధిత కృంగుదలలో నిరుత్సాహంతోపాటు దీర్ఘకాలం కొనసాగే తీవ్ర కృంగుదల కూడా ఉంటుందని నిర్ధారించబడింది. అదనపు సమాచారం కోసం కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 15, 1988, 25-29 పేజీలు; నవంబరు 15, 1988, 21-4 పేజీలు; కావలికోట సెప్టెంబరు 1, 1996 30-1 పేజీలు చూడండి.

మీరు గుర్తుతెచ్చుకుంటారా?

యెహోవా సేవకులు సహితం బాధలు ఎందుకు అనుభవిస్తారు?

దేవుని ప్రజల్ని నిరుత్సాహపరిచే కొన్ని కారణాలేమిటి?

మన బాధలను సహించేందుకు యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

మనం ఏ విధంగా ‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద’ ఉన్నాము?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. నమ్మకమైన ఓ క్రైస్తవురాలు ఏ సమస్యను ఎదుర్కొంది, మనం కూడా అలాంటి భావాలకే ఎందుకు లోనుకావచ్చు?

3. తీవ్ర కృంగుదలను అనుభవించిన దేవుని సేవకుల గురించిన బైబిలు ఉదాహరణలను పేర్కొనండి.

4. నేటి క్రైస్తవుల్లో “ధైర్యము చెడినవారు” ఉండడంలో ఎందుకు ఆశ్చర్యం లేదు?

5, 6. రోమీయులు 7:22-25 నుండి మనం ఎలాంటి ఓదార్పును పొందవచ్చు?

7. తన పాపపు స్వభావాలనుబట్టి బాధపడకుండా ఉండేందుకు ఒక  వ్యక్తికి ఏది సహాయం చేయవచ్చు?

8, 9. స్వీయ దోషారోపణా తలంపులకు మనమెందుకు తావివ్వకూడదు?

10. ఏయే విధాలుగా మన పరిమితులు మనల్ని నిరుత్సాహపరచవచ్చు?

11. గలతీయులు 6:4లో వ్రాయబడిన పౌలు ఉపదేశం మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది?

12. యెహోవాకు మనం చేసే సేవలో ఎందుకు ఆనందించవచ్చు?

13, 14. (ఎ) ఈ “అపాయకరమైన కాలములు” మనల్ని ఏయే విధాలుగా బాధపెట్టవచ్చు? (బి) అనురాగరాహిత్యం నేడు ఎలా స్పష్టంగా కనిపిస్తోంది?

15. ఏ మానవుని ప్రేమకన్నా యెహోవా ప్రేమ ఎలా ఉన్నతమైంది?

16, 17. నిరుత్సాహ భావాలు కలిగినప్పుడు తన ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఏమి చేయవచ్చు?

18. మానసిక కృంగుదలతో బాధపడుతున్న వ్యక్తి ఎలాంటి ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవచ్చు?

19. బాధ అనుభవించేవారికి యెహోవా ఏమి వాగ్దానం చేస్తున్నాడు?

20. మనకు కష్టాలు ఎదురైనప్పటికీ, 1 పేతురు 5:​6, 7లో మనకు ఏమి హామీ ఇవ్వబడింది?

[25వ పేజీలోని చిత్రాలు]

కష్టాలున్నప్పటికీ యెహోవా ప్రజలు సంతోషించేందుకు కారణాలున్నాయి

[28వ పేజీలోని చిత్రం]

యెహోవాను పూర్ణ హృదయంతో సేవచేయడానికి ఫోన్‌లో సాక్ష్యమివ్వడం ఒక మార్గం