కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు’

‘మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు’

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”

‘మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు’

మనుష్యుల్లో భయాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే ఆ సందర్భం ఏర్పాటు చేయబడింది. బబులోను పట్టణానికి బహుశా దగ్గర్లో ఉన్న దూరా మైదానంలో ఓ పెద్ద బంగారు ప్రతిమ నిలబెట్టబడింది. అది, ఉన్నతాధికారులందరూ హాజరయ్యే ప్రత్యేక సందర్భంలో ప్రతిష్ఠించబడుతుంది, ఆ సందర్భంలో వివిధరకాల సంగీత వాద్యముల ధ్వని వినబడగానే హాజరైన ఆ అధికారులందరూ దాని ఎదుట సాగిలపడాలి. ఆ ప్రతిమను ఆరాధించనివారు మండుతున్న అగ్నిగుండములో పడవేయబడతారని బబులోను రాజైన నెబుకద్నెజరు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను ధిక్కరించేందుకు ఎవరు సాహసించగలరు?

చూస్తున్నవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, దైవభయంగల షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు యెహోవా ఆరాధకులు దానికి సాగిలపడలేదు. అలా చేయడం, తమ దేవుడైన యెహోవాపట్ల సంపూర్ణ భక్తిని ప్రదర్శించకపోవడమే అవుతుందని వారికి తెలుసు. (ద్వితీయోపదేశకాండము 5:​8-10) అంతటి స్థిర వైఖరికిగల కారణాన్ని వివరించమని గట్టిగా అడిగినప్పుడు వారు ధైర్యంగా నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.”​—⁠దానియేలు 3:⁠17, 18.

ఆ ముగ్గురు హెబ్రీయులు మండుతున్న అగ్నిగుండములో పడవేయబడినప్పుడు, వారి ప్రాణాలు దక్కాలంటే ఏదో అద్భుతమే జరగాలి. దేవుడు తన విశ్వసనీయ సేవకులను కాపాడడానికి ఒక దూతను పంపించాడు. అయితే వాళ్ళప్పటికే యెహోవాకు అవిధేయత చూపించడానికి బదులు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. * దాదాపు ఆరు శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు అపొస్తలులు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని యూదా న్యాయస్థానం ముందు ఇలా తెలియజేశారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”​—⁠అపొస్తలుల కార్యములు 5:​29.

మనకు ప్రాముఖ్యమైన పాఠాలు

షద్రకు, మేషాకు, అబేద్నెగోలు విశ్వాసానికి, విధేయతకు, విశ్వసనీయతకు చక్కని మాదిరిగా ఉన్నారు. ఈ ముగ్గురు హెబ్రీయులు యెహోవాపై విశ్వాసం ఉంచారు. అబద్ధ ఆరాధనలో లేదా బబులోను రాజ్యంపట్ల భక్తి ప్రదర్శించే ఎలాంటి క్రియల్లో పాల్గొనేందుకైనా వారి లేఖన శిక్షిత మనస్సాక్షి ఒప్పుకోలేదు. అదేవిధంగా, ప్రస్తుతకాల క్రైస్తవులు కూడా సత్య దేవునిపై విశ్వాసముంచుతారు. వారు బైబిలు శిక్షిత మనస్సాక్షి చేత నిర్దేశించబడుతూ, దేవుని నియమాలను, సూత్రాలను ఉల్లంఘించే ఎలాంటి అబద్ధ ఆరాధనలోనైనా, ఆచారాల్లోనైనా పాల్గొనేందుకు నిరాకరిస్తారు.

విశ్వసనీయులైన ఈ ముగ్గురు హెబ్రీయులు యెహోవాపై నమ్మకముంచి, బబులోను సామ్రాజ్యం వారికందించే గుర్తింపు, హోదా, గౌరవం వంటివాటిలో దేనికోసమైనా యెహోవాపట్ల వారు చూపించే విధేయతను పణంగా పెట్టలేదు. దేవునితో తమ సంబంధాన్ని పాడుచేసుకొనే బదులు బాధననుభవించి మరణించడానికే ఆ యౌవనులు సుముఖత చూపించారు. వారికి ముందు జీవించిన మోషేలానే “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవా[రిగా]” ఉన్నారు. (హెబ్రీయులు 11:​27) యెహోవా వారిని మరణం నుండి రక్షించినా, రక్షించకపోయినా ఆ ముగ్గురు తమ జీవితాలను కాపాడుకోవడానికి రాజీపడే బదులు తమ యథార్థతను కాపాడుకోవడానికే నిశ్చయించుకున్నారు. పౌలు వీరి ఉదాహరణ గురించే పరోక్షంగా మాట్లాడుతూ “అగ్నిబలమును చల్లార్చి[న]” విశ్వాసులు అని ప్రస్తావించాడనేది స్పష్టం. (హెబ్రీయులు 11:​34) మన కాలంలో కూడా యథార్థతా పరీక్షలను ఎదుర్కొంటున్న యెహోవా సేవకులు అలాంటి విశ్వాసాన్ని, విధేయతను కనబరుస్తున్నారు.

షద్రకు, మేషాకు, అబేద్నెగోల అనుభవం నుండి, దేవుడు తనపట్ల విశ్వసనీయంగా ఉండేవారికి ప్రతిఫలమిస్తాడని కూడా మనం తెలుసుకుంటాం. “యెహోవా . . . తన భక్తులను విడువడు” అని కీర్తనకర్త పాడాడు. (కీర్తన 37:​28) ఆ ముగ్గురు హెబ్రీయులను కాపాడినట్లే నేడు దేవుడు మనల్నికూడా అద్భుతంగా కాపాడతాడని మనం ఎదురుచూడలేం. అయితే, ఎలాంటి కష్టం వచ్చినా మన పరలోక తండ్రి మనకు సహాయం చేస్తాడని మనం నమ్మవచ్చు. దేవుడు ఆ సమస్యను తొలగించవచ్చు, దాన్ని సహించడానికి శక్తిని ఇవ్వవచ్చు, లేదా మరణం వరకు మనం మన యథార్థతను కాపాడుకుంటే మనల్ని పునరుత్థానం చేయవచ్చు. (కీర్తన 37:10, 11, 29; యోహాను 5:​28, 29) మన యథార్థత పరీక్షించబడి, దేవునికే లోబడాలని మనం నిర్ణయించుకున్న ప్రతీసారి మన విశ్వాసం, విధేయత, విశ్వసనీయత వెల్లడౌతాయి.

[అధస్సూచి]

^ పేరా 5 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2006 (ఆంగ్లం), జూలై/ఆగస్టు చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీకు తెలుసా?

● ఆముగ్గురు హెబ్రీయులు ఈ యథార్థతా పరీక్షను ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ వయసు సుమారు 30 సంవత్సరాలు.

● ఆఅగ్నిగుండం సాధ్యమైనంత ఎక్కువగా వేడి చేయబడింది.​—⁠దానియేలు 3:⁠19.