యెహోవా సంస్థ మంచితనంపై దృష్టి నిలపండి
యెహోవా సంస్థ మంచితనంపై దృష్టి నిలపండి
“నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.”—కీర్తన 65:4.
హెబ్రీ లేఖనాల్లో చర్చించబడిన అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో ప్రాచీన ఇశ్రాయేలులోని దావీదు ఒకరు. కాపరిగా, సంగీతకారునిగా, ప్రవక్తగా, రాజుగావున్న దావీదు యెహోవా దేవునిపై పూర్తి నమ్మకముంచాడు. యెహోవాతో దావీదుకున్న సన్నిహిత సంబంధం, దేవునికి ఒక మందిరం కట్టించాలనే కోరికను ఆయనలో కలిగించింది. అలాంటి మందిరం లేదా దేవాలయం ఇశ్రాయేలులో సత్యారాధనా కేంద్రంగా తయారవుతుంది. ఆ దేవాలయానికి సంబంధించిన ఏర్పాట్లు దేవుని ప్రజలకు ఆనందాన్ని, ఆశీర్వాదాల్ని తెస్తాయని దావీదుకు తెలుసు. కాబట్టే దావీదు ఇలా ఆలపించాడు: “నీ ఆవరణములలో నివసించునట్లు నీవు [యెహోవా] ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.”—కీర్తన 65:4.
2 యెహోవా మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు దావీదు అనుమతించబడలేదు. బదులుగా, ఆ ఆధిక్యత ఆయన కుమారుడైన సొలొమోనుకు ఇవ్వబడింది. తాను ఎంతగానో ఆశించిన ఆ ఆధికత్య వేరొకరికి ఇవ్వబడినందుకు దావీదు సణగలేదు. దేవాలయం నిర్మించబడాలనేదే ఆయనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయం. యెహోవా నుండి తానందుకున్న నిర్మాణ వివరాల్ని సొలొమోనుకు అందజేయడం ద్వారా ఆయన ఆ ప్రణాళికకు హృదయపూర్వకంగా మద్దతిచ్చాడు. అంతేకాక, దావీదు వేలాదిమంది లేవీయులను సేవా విభాగాలుగా వ్యవస్థీకరించి, దేవాలయ నిర్మాణం కోసం పెద్దమొత్తంలో బంగారాన్ని, వెండిని విరాళంగా ఇచ్చాడు.—1 దినవృత్తాంతములు 17:1, 4, 11, 12; 23:3-6; 28:11, 12; 29:1-5.
3 నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులు దేవుని ఆలయంలో సత్యారాధన కోసం చేయబడిన ఏర్పాట్లకు మద్దతిచ్చారు. అదే విధంగా, నేటి యెహోవా సేవకులుగా మనం యెహోవా భూసంబంధ సంస్థలో చేయబడే ఆరాధనా ఏర్పాట్లకు మద్దతిస్తాం. అలా మనం దావీదుకున్న మనోవైఖరి మనకూ ఉందని ప్రదర్శిస్తాము. మనలో ఫిర్యాదు చేసే వైఖరి లేదు. బదులుగా, మనం దేవుని సంస్థలోని మంచితనంపై దృష్టి నిలుపుతాం.
మనం నిజంగా కృతజ్ఞతతో ఉండగల అనేక మంచి విషయాల గురించి మీరు ఆలోచించారా? వాటిలో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.సారథ్యం వహిస్తున్న వారిపట్ల కృతజ్ఞత
4 భూమ్మీది తన యావదాస్తిపై యేసుక్రీస్తు నియమించిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ విషయంలో కృతజ్ఞత కలిగివుండేందుకు మనకు మంచి కారణాలున్నాయి. ఆత్మాభిషిక్త క్రైస్తవుల దాసుని తరగతి సువార్తను ప్రకటించడంలో సారథ్యం వహిస్తూ, ఆరాధన కోసం కూటాలను ఏర్పాటు చేయడమే కాక, 400 కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు ఆధారిత సాహిత్యాలను ప్రచురిస్తోంది. భూవ్యాప్తంగా లక్షలాదిమంది “తగినవేళ” అందించబడే ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని కృతజ్ఞతతో స్వీకరిస్తున్నారు. (మత్తయి 24:45-47) దాని విషయంలో సణిగేందుకు ఖచ్చితంగా ఏ కారణమూ లేదు.
5 అల్ఫీ అనే వృద్ధ యెహోవాసాక్షి, దాసుని తరగతి అందజేసే ప్రచురణల్లోని లేఖనాధారిత ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా అనేక సంవత్సరాలుగా ఓదార్పును, సహాయాన్ని పొందాడు. ఆ తరగతిపట్ల ఉన్న హృదయపూర్వక కృతజ్ఞత ఆయన ఇలా వ్రాసేలా పురికొల్పింది: “యెహోవా సంస్థే లేకపోతే నేను ఏమయ్యేవాడినో?” పీటర్, ఆర్మ్‌గార్ట్ అనే దంపతులు కూడా దశాబ్దాలుగా దేవుని సేవకులుగా ఉన్నారు. “ప్రేమగల, శ్రద్ధచూపించే యెహోవా సంస్థ” ప్రచురించే అన్ని ప్రచురణలపట్ల ఆర్మ్‌గార్ట్ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంది. ఆ ప్రచురణల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నావారికి అంటే బధిరులు, అంధులు వంటివారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి కూడా ఉన్నాయి.
6 ఆ ‘నమ్మకమైన దాసునికి’ ప్రాతినిథ్యం వహించే యెహోవాసాక్షుల పరిపాలక సభలోవున్న ఆత్మాభిషిక్త పురుషుల చిన్నగుంపు, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవచేస్తోంది. ఆ పరిపాలక సభ, భూవ్యాప్తంగా 98,000కన్నా ఎక్కువగా ఉన్న సంఘాల్లోని కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న బ్రాంచి కార్యాలయాల్లో సేవ చేసేందుకు అనుభవజ్ఞులైన యెహోవా సేవకుల్ని నియమిస్తుంది. బైబిల్లో ప్రస్తావించబడిన అర్హతలున్న పురుషులు ఆ సంఘాల్లో పెద్దలుగా, పరిచర్య సేవకులుగా నియమించబడతారు. (1 తిమోతి 3:1-9, 12, 13) ఆ పెద్దలు సారథ్యం వహిస్తూ, తమకు అప్పగించబడిన దేవుని మందపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ కనబరుస్తారు. ఆ మందలో భాగంగా ఉండి, “సహోదరులు” అందరి మధ్య ఉండే ప్రేమ, ఐక్యత చవిచూడడం ఎంతటి ఆశీర్వాదమో కదా!—1 పేతురు 2:17; 5:2, 3.
7 పెద్దలనుండి పొందే ప్రేమపూర్వక ఆధ్యాత్మిక నిర్దేశంపట్ల ఫిర్యాదులు చేసే బదులు ఆయావ్యక్తులు
తరచూ తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. ఉదాహరణకు, క్రైస్తవ భార్యగావున్న, 30వ పడిలో ఉన్న బీర్జిట్‌నే తీసుకోండి. ఆమె కౌమారప్రాయంలో ఉన్నప్పుడు చెడు సాంగత్యంలో పడి, పాపం చేసేంతగా తప్పిపోయింది. అయితే, పెద్దలు ఇచ్చిన స్పష్టమైన బైబిలు ఉపదేశం, తోటి విశ్వాసుల మద్దతు హానికరంగా మారగల ఆ పరిస్థితి నుండి బయటపడేందుకు ఆమెకు సహాయం చేసింది. ఇప్పుడు బీర్జిట్ ఎమనుకుంటోంది? ఆమె ఇలా చెబుతోంది: “అద్భుతమైన యెహోవా సంస్థలో ఇంకా భాగంగా ఉన్నందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని.” 17 ఏళ్ల ఆండ్రీయాస్ ఇలా అంటున్నాడు: “ఇది నిజంగా యెహోవా సంస్థే, ఇది ప్రపంచంలో అత్యుత్తమ సంస్థ.” యెహోవా భూసంబంధ సంస్థలోని మంచితనంపట్ల మనం కృతజ్ఞత కలిగివుండవద్దా?సారథ్యం వహిస్తున్నవారు అపరిపూర్ణులు
8 నిజమే, సత్యారాధనలో సారథ్యం వహించేందుకు నియమించబడినవారు అపరిపూర్ణులు. వారందరూ పొరపాట్లు చేస్తారు, వారిలో కొందరు ఎంతోకాలంగా తమలో ఉన్న బలహీనతల్ని అదుపుచేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకని మనం ఆందోళనపడాలా? లేదు. ప్రాచీన ఇశ్రాయేలులో గొప్ప బాధ్యతలు అప్పగించబడిన వ్యక్తులు కూడా గంభీరమైన పాపాలు చేశారు. ఉదాహరణకు, దావీదు ఇంకా యువకునిగా ఉన్నప్పుడే, కలవరపడుతున్న రాజైన సౌలును శాంతింపజేయడానికి ఆయన దగ్గర సంగీతకారునిగా పనిచేయాలని కోరబడ్డాడు. ఆ తర్వాత, సౌలు తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు, దావీదు తన ప్రాణాలు దక్కించుకోవడానికి అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది.—1 సమూయేలు 16:14-23; 18:10-12; 19:18; 20:32, 33; 22:1-5.
9 ఇతర ఇశ్రాయేలీయులు దావీదుకు నమ్మకద్రోహం చేశారు. ఉదాహరణకు, దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు సౌలు బంధువైన అబ్నేరును హతమార్చాడు. అబ్షాలోము రాజ్యాధికారం కోసం తన తండ్రియైన దావీదుకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. దావీదుకు నమ్మకమైన మంత్రిగావున్న అహీతోపెలు ఆయనకు నమ్మకద్రోహం చేశాడు. (2 సమూయేలు 3:22-30; 15:1-17, 31; 16:15, 21) అయినప్పటికీ, దావీదు ఆగ్రహంతో ఫిర్యాదులు చేసేవానిగా మారలేదు లేదా సత్యారాధన నుండి వైదొలగలేదు. వాస్తవానికి, దావీదు దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. కష్టాలు దావీదును యెహోవాకు మరింత సన్నిహితంచేసి, సౌలు కారణంగా అతని దగ్గరి నుండి పారిపోయినప్పుడు తనకున్న మంచి వైఖరిని కాపాడుకునేలా పురికొల్పాయి. ఆ సమయంలో దావీదు ఇలా ఆలపించాడు: “నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.”—కీర్తన 57:1.
10 దేవుని సంస్థలో నేడు నమ్మకద్రోహం జరుగుతుందని ఫిర్యాదు చేసేందుకు మనకు ఏ కారణం లేదు. యెహోవా, ఆయన దేవదూతలు, లేదా ఆధ్యాత్మిక కాపరుల్లో ఎవ్వరూ క్రైస్తవ సంఘంలో నమ్మకద్రోహులను, దుష్టులను సహించరు. అయితే, మనందరికీ మన స్వంత మానవ అపరిపూర్ణతేకాక, దేవుని ఇతర సేవకుల అపరిపూర్ణత కూడా ఎదురౌతుంది.
11 యెహోవాను ఎంతో కాలం ఆరాధించిన గెర్టూట్ అనే సహోదరి యౌవనురాలిగా ఉన్నప్పుడు, ఆమె మోసగత్తె అనీ, పూర్తికాల రాజ్య ప్రచారకురాలు కాదు అని తప్పుగా నిందించబడింది. ఆమెలా స్పందించింది? తనను అలా నిందించినందుకు ఆమె సణిగిందా? లేదు. ఆమె మరణానికి కొన్నిరోజుల ముందు అంటే, 2003లో తనకు 91 ఏళ్ళు ఉన్నప్పుడు, తన జీవితంలో ఎదురైన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా వివరించింది: “నా జీవితమంతటిలో ఎదురైన అలాంటి అనుభవాలు, మానవులు పొరపాట్లు చేసినా, యెహోవా తన గొప్ప పనిని నిర్దేశిస్తాడు, ఆ పనిలో అపరిపూర్ణ మానవుల్ని ఉపయోగిస్తాడు అనే పాఠాన్ని నాకు నేర్పాయి.” దేవుని ఇతర సేవకుల అపరిపూర్ణతలు ఎదురైనప్పుడు గెర్టూట్ హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించింది.
12 ఎంతో యథార్థంగా ఉండే, భక్తిగల క్రైస్తవులు సహితం అపరిపూర్ణులే కాబట్టి, నియమించబడిన ఒక సేవకుడు పొరపాటు చేసినప్పుడు మనం ‘సణుగులును ఫిలిప్పీయులు 2:14) మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోని కొందరి చెడు మాదిరిని, మనమనుకరించడం ఎంత విచారకరంగా ఉంటుందో కదా! శిష్యుడై యూదా చెప్పిన ప్రకారం, ఆ రోజుల్లోని అబద్ధ బోధకులు “ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు” వచ్చారు. అంతేకాక, ఆ తప్పిదస్థులు “సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునైయున్నారు.” (యూదా 8, 15) సణుగుతూ ఫిర్యాదులు చేసేవారి విధానాన్ని మనం విసర్జించి, ‘నమ్మకమైన దాసుని’ ద్వారా లభించే మంచి విషయాలపై మన దృష్టిని నిలుపుదాం. యెహోవా సంస్థ మంచితనాన్ని అమూల్యంగా ఎంచుతూ, ‘సణుగులును మాని, సమస్త కార్యములను’ చేద్దాం.
మాని, సమస్త కార్యములను’ చేయడంలో కొనసాగుదాం. (‘ఇది కఠినమైన మాట’
13 మొదటి శతాబ్దంలోని కొందరు, నియమిత సేవకులకు వ్యతిరేకంగా సణిగితే, మరికొందరు యేసు బోధలకు వ్యతిరేకంగా సణిగారు. యోహాను 6:47-69లో వ్రాయబడినట్లుగా యేసు ఇలా అన్నాడు: “నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు.” “ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ‘యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడు?’ అని చెప్పుకొనిరి.” “తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని” యేసుకు తెలుసు. అంతేకాక, “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.” అయితే శిష్యులందరూ సణగలేదు. “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని యేసు తన 12 మంది అపొస్తలులను అడినప్పుడు ఏమి జరిగిందో గమనించండి. అపొస్తలుడైన పేతురు ఇలా జవాబిచ్చాడు: “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము.”
14 ఈ కాలాల్లో, దేవుని ప్రజల్లో చాలా తక్కువమంది క్రైస్తవ బోధకు సంబంధించి ఏదోక అంశాన్నిబట్టి అసంతృప్తి చెంది, యెహోవా భూసంబంధ సంస్థకు వ్యతిరేకంగా సణిగారు. అలా ఎందుకు జరుగుతుంది? అలా సణగడానికి తరచూ దేవుని కార్యవిధానాన్ని అర్థం చేసుకోకపోవడమే కారణం. సృష్టికర్త తన ప్రజలకు సత్యాన్ని అంచెలంచెలుగా వెల్లడిచేస్తాడు. కాబట్టి, ఆయా సమయాల్లో లేఖనాల గురించిన మన అవగాహన తప్పక శుద్ధీకరించబడుతుంది. అలాంటి శుద్ధీకరణలనుబట్టి యెహోవా ప్రజలు చాలామంది ఎంతో సంతోషిస్తారు. ‘అధికంగా నీతిమంతులైన’ కొందరు మాత్రమే ఆ మార్పులను ఇష్టపడరు. (ప్రసంగి 7:16) అహంకారం కారణంగా అలా ఇష్టపడని కొందరు స్వతంత్రంగా ఆలోచించడమనే ఉరిలో పడిపోతారు. కారణమేదైనా, ఆ విధమైన సణగడం ప్రమాదకరం, ఎందుకంటే అది మనల్ని మళ్లీ లోకంలోకి, దాని మార్గాల్లోకి ఈడ్చుకెళ్లగలదు.
15 ఉదాహరణకు, ఎమ్మానుయేల్ అనే సాక్షి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందించిన ప్రచురణల్లో తాను చదివిన కొన్ని అంశాలను విమర్శించాడు. (మత్తయి 24:45) ఆయన మన క్రైస్తవ ప్రచురణలను చదవడం మానేసి, తాను యెహోవాసాక్షిగా ఉండడానికి ఇష్టపడట్లేదని స్థానిక సంఘ పెద్దలకు తెలియజేసాడు. అయితే, యెహోవా సంస్థ బోధించే విషయాలు సత్యమని ఎమ్మానుయేల్ కొంతకాలానికి గ్రహించాడు. ఆయన సాక్షులను కలుసుకొని తన తప్పు ఒప్పుకుని, యెహోవాసాక్షుల్లోకి తిరిగి చేర్చుకోబడ్డాడు. దానివల్ల, ఆయన తన ఆనందాన్ని తిరిగి పొందాడు.
16 యెహోవా ప్రజల కొన్ని బోధలకు సంబంధించి సందేహాలున్న కారణంగా మనం సణిగేందుకు శోధించబడితే అప్పుడేమిటి? అలాంటి సమయంలో, మనం తొందరపడకుండా ఉందాం. ‘నమ్మకమైన దాసుడు’ కొంతకాలమైన తర్వాత మన ప్రశ్నలకు జవాబులిచ్చే లేదా మన సందేహాల్ని తీర్చే సమాచారాన్ని ప్రచురించవచ్చు. క్రైస్తవ పెద్దల సహాయం తీసుకోవడం జ్ఞానయుక్తం. (యూదా 22, 23) ప్రార్థన, వ్యక్తిగత అధ్యయనం, ఆధ్యాత్మిక దృక్కోణంగల తోటి విశ్వాసులతో సహవసించడం, మన సందేహాలను తీర్చుకునేందుకే కాక, యెహోవా ఉపయోగిస్తున్న సమాచార మాధ్యమం ద్వారా నేర్చుకున్న విశ్వాసాన్ని బలపర్చే బైబిలు సత్యాలపట్ల మన కృతజ్ఞతను అధికం చేసుకోవడానికి కూడా సహాయం చేయగలవు.
సానుకూల దృక్పథాన్ని కాపాడుకోండి
17 నిజమే, అపరిపూర్ణ మానవుల్లో పాపం చేసే ప్రవృత్తి సహజంగానే ఉంటుంది, కానీ కొందరిలో అనవసరంగా ఫిర్యాదులు చేసే ప్రవృత్తి బలంగా ఉండవచ్చు. (ఆదికాండము 8:21; రోమీయులు 5:12) అయితే, మనం సణిగే అలవాటున్న వారిగా మారితే, యెహోవాతో దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడేసుకుంటాం. కాబట్టి, సణిగే ప్రవృత్తి ఏమైనా మనలో ఉంటే దానిని మనం నియంత్రించుకోవాలి.
18 సంఘంలోని విషయాల గురించి సణిగే బదులు మనం సానుకూల దృక్పథాన్ని కాపాడుకుంటూ, మనల్ని చురుకుగా, సంతోషంగా, భక్తిపరులుగా, సమతుల్యంగల వారిగా, విశ్వాసం విషయంలో లోపంలేనివారిగా ఉంచే దినచర్యను అనుసరించాలి. (1 కొరింథీయులు 15:58; తీతు 2:1-5) తన సంస్థలో జరిగే ప్రతీది యెహోవా అధీనంలో ఉంది, మొదటి శతాబ్దంలోలాగే, నేడు యేసుకు ప్రతీ సంఘంలో జరిగే విషయాలు తెలుసు. (ప్రకటన 1:10) దేవుని కోసం, సంఘ శిరస్సు అయిన క్రీస్తు కోసం ఓపికగా కనిపెట్టుకొని ఉండండి. సరిదిద్దాల్సిన వాటిని సరిదిద్దేందుకు బాధ్యతగల కాపరులు ఉపయోగించబడవచ్చు.—కీర్తన 43:5; కొలొస్సయులు 1:18; తీతు 1:5.
19 త్వరలోనే ఈ విధానం అంతమై, మెస్సీయ రాజ్యం మానవ వ్యవహారాలను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటుంది. అప్పటివరకు మనలో ప్రతీ ఒక్కరం సానుకూల దృక్పథాన్ని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా! ఇది మన తోటి విశ్వాసుల తప్పులపై దృష్టినిలిపే బదులు, వారికున్న మంచిగుణాలను గుర్తించేందుకు మనకు సహాయం చేస్తుంది. వారి వ్యక్తిత్వంలో ఉన్న మంచి విషయాలపై దృష్టి నిలపడం మనల్ని సంతోషపరుస్తుంది. అలా చేయడంవల్ల మనం, సణిగి మానసికంగా అలసిపోయే బదులు, ఆధ్యాత్మికంగా ప్రోత్సహించబడతాం, బలపడతాం.
20 యెహోవా భూసంబంధమైన సంస్థతో సహవసిస్తున్న కారణంగా మనకు లభించే అనేక ఆశీర్వాదాలను గుర్తుంచుకునేందుకు కూడా సానుకూల దృక్పథం మనకు సహాయం చేస్తుంది. విశ్వసర్వాధిపతిపట్ల విశ్వసనీయంగా ఉన్న సంస్థ ఇదొక్కటే. ఆ వాస్తవం గురించి, అద్వితీయ సత్యదేవుడైన యెహోవాను ఆరాధించే ఆధిక్యత గురించి మీరేమనుకుంటున్నారు? “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము” అని పాడిన దావీదుకున్న దృక్పథమే మీకూ ఉండును గాక!—కీర్తన 65:2, 4.
మీరు గుర్తుతెచ్చుకోగలరా?
• సంఘంలో సారథ్యం వహిస్తున్న వారిపట్ల మనమెందుకు కృతజ్ఞతతో ఉండాలి?
• బాధ్యతలున్న సహోదరులు పొరపాట్లు చేసినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉండాలి?
• లేఖనాల అవగాహనా విషయంలో వచ్చే శుద్ధీకరణలను మనమెలా దృష్టించాలి?
• సందేహాల్ని తీర్చుకునేందుకు ఒక క్రైస్తవునికి ఏది సహాయం చేయగలదు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు దేవుని ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (బి) దేవాలయ నిర్మాణానికి దావీదు ఎలాంటి మద్దతిచ్చాడు?
3. సత్యారాధనా ఏర్పాట్లపట్ల దేవుని సేవకులకు ఎలాంటి మనోవైఖరి ఉంది?
4, 5. (ఎ) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” తనకప్పగించిన పనిని ఎలా నెరవేరుస్తున్నాడు? (బి) తమకు లభిస్తున్న ఆధ్యాత్మిక ఆహారంపట్ల కొందరు సాక్షుల అభిప్రాయాలు ఎలావున్నాయి?
6, 7. (ఎ) భూవ్యాప్తంగా ఉన్న సంఘాల కార్యకలాపాలు ఎలా పర్యవేక్షించబడుతున్నాయి? (బి) యెహోవా భూసంబంధమైన సంస్థ గురించి కొందరు తమ అభిప్రాయాలను ఎలా వ్యక్తంచేశారు?
8, 9. దావీదు సమకాలీనుల్లో కొందరెలా ప్రవర్తించారు, అలాంటి ప్రవర్తనకు దావీదు ఎలా స్పందించాడు?
10, 11. యౌవనురాలిగా ఉన్నప్పుడు గెర్టూట్ అనే క్రైస్తవురాలికి ఎలాంటి అనుభవం ఎదురైంది, తోటి విశ్వాసుల అపరిపూర్ణతల గురించి ఆమె చెప్పింది?
12. (ఎ) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కొందరు ఎలాంటి చెడు మాదిరినుంచారు? (బి) మనం దేనిపై దృష్టి నిలపాలి?
13. యేస్తుక్రీస్తు బోధించిన కొన్ని బోధలకు కొందరెలా స్పందించారు?
14, 15. (ఎ) క్రైస్తవ బోధల్లోని కొన్నింటి విషయంలో కొందరెందుకు అసంతృప్తి చెందుతారు? (బి) ఎమ్మానుయేల్ అనే వ్యక్తి విషయంలో జరిగిన దానినుండి మనమేమి నేర్చుకోవచ్చు?
16. కొన్ని క్రైస్తవ బోధల విషయంలో మన సందేహాల్ని తీర్చుకునేందుకు ఏవి మనకు సహాయం చేయగలవు?
17, 18. సణిగే బదులు మనలో ఎలాంటి దృక్పథం ఉండాలి, ఎందుకు?
19. మానవ వ్యవహారాలను రాజ్యం పూర్తిగా తన అధీనంలోకి తీసుకొనేంతవరకు మనం దేనిపై దృష్టి నిలపాలి?
20. సానుకూల దృక్పథం మనమెలాంటి ఆశీర్వాదాలు అనుభవించేందుకు సహాయం చేస్తుంది?
[20వ పేజీలోని చిత్రం]
దావీదు మందిరానికి సంబంధించిన వివరాలను సొలొమోనుకు ఇచ్చి, సత్యారాధనకు హృదయపూర్వక మద్దతునిచ్చాడు
[23వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ పెద్దలు సంతోషంగా ఆధ్యాత్మిక సహాయం చేస్తారు