కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సణగడం మానండి’

‘సణగడం మానండి’

‘సణగడం మానండి’

‘సణుగులను మాని, సమస్త కార్యములను చేయుడి.’​—⁠ఫిలిప్పీయులు 2:⁠14.

అపొస్తలుడైన పౌలు, మొదటి శతాబ్దంలోని ఫిలిప్పీ క్రైస్తవ సంఘానికి వ్రాసిన తన ప్రేరేపిత లేఖలో వారినెంతో మెచ్చుకున్నాడు. ఆ నగరంలోని తన తోటి విశ్వాసుల ఉదారమైన, ఉత్సాహపూరిత స్వభావాన్ని ఆయన మెచ్చుకున్నాడు, వారి సత్క్రియలపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయినప్పటికీ, ‘సణుగులను మాని, సమస్త కార్యములను చేయుడి’ అని పౌలు వారికి గుర్తుచేశాడు. (ఫిలిప్పీయులు 2:​14) అపొస్తలుడు వారినెందుకు అలా హెచ్చరించాడు?

2 సణగడం దేనికి నడిపిస్తుందో పౌలుకు తెలుసు. సణగడం హానికరమైందని ఆయన కొన్ని సంవత్సరాల క్రితం కొరింథులోని సంఘానికి గుర్తుచేశాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, వారు పదేపదే యెహోవాకు కోపం కలిగించారని పౌలు పేర్కొన్నాడు. ఎలా? చెడ్డవాటిని ఆశించడం, విగ్రహారాధన, వ్యభిచారం, యెహోవాను శోధించడం, సణగడం వంటివాటితో వారు యెహోవాకు కోపం కలిగించారు. ఆ దృష్టాంతాల నుండి నేర్చుకోమని పౌలు కొరింథీయులను ప్రోత్సహించాడు. ఆయనిలా వ్రాశాడు: “మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి.”​—⁠1 కొరింథీయులు 10:​6-​11.

3 యెహోవా నేటి సేవకులుగా ఫిలిప్పీలోని సంఘం కనబరచిన స్వభావాన్నే మనమూ కనబరుస్తాం. మనకు సత్క్రియలపట్ల ఆసక్తి ఉండడమే కాక, మన మధ్య ప్రేమ కూడా ఉంది. (యోహాను 13:​34, 35) అయితే, సణగడంవల్ల గతంలో దేవుని ప్రజలకు జరిగిన హాని దృష్ట్యా, మనమీ ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం మంచిది: ‘సణుగులను మాని, సమస్త కార్యములను చేయుడి.’ మనం ముందుగా లేఖనాల్లో అలా సణిగినవారి ఉదాహరణలను పరిశీలిద్దాం. ఆ తర్వాత, నేడు సణగడంవల్ల కలిగే హానిని నివారించేందుకు మనం తీసుకోగల కొన్ని చర్యలను చర్చిద్దాం.

యెహోవాకు విరోధంగా సణిగిన ఓ చెడ్డ సమాజం

4 ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యవాసంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించి బైబిల్లో ఉపయోగించబడిన హీబ్రూ పదానికి ‘సణగడం, గొణగడం, ఫిర్యాదు చేయడం, కొరకొరలాడడం’ అనే అర్థాలున్నాయి. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు తమ పరిస్థితినిబట్టి అసంతృప్తి చెంది సణిగారు. ఉదాహరణకు, ఐగుప్తు దాసత్వం నుండి విడుదలైన కొన్ని వారాలకే “ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణి[గింది].” ఇశ్రాయేలీయులు ఆహారం విషయంలో ఇలా ఫిర్యాదు చేశారు: “మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతిమి? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు [మీరు] ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడనుండి తోడుకొని వచ్చితిరి.”​—⁠నిర్గమకాండము 16:​1-3.

5 నిజానికి, యెహోవా ఇశ్రాయేలీయులకు అరణ్యంలో అవసరమైన ఆహారాన్ని, నీటిని ప్రేమతో సమకూర్చి వారిని పోషించాడు. ఆహారకొరతవల్ల ఇశ్రాయేలీయులు అరణ్యంలో మరణించే ప్రమాదమే లేదు. అయితే, వారు అసంతృప్తితో కూడిన స్వభావంతో, తమ పరిస్థితుల్ని భూతద్దంలో చూసుకొని సణగడం మొదలుపెట్టారు. వారు మోషే అహరోనులకు విరోధంగా ఫిర్యాదు చేసినా, నిజానికి వారు తనమీదే అసంతృప్తితో ఉన్నట్లు యెహోవా దృష్టించాడు. మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదు.”​—⁠నిర్గమకాండము 16:​4-8.

6 ఇంకెంతో కాలం కాకముందే, ఇశ్రాయేలీయులు మళ్ళీ సణిగారు. వాగ్దాన దేశాన్ని వేగు చూసేందుకు మోషే 12 మందిని పంపాడు. వారిలో పదిమంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. దాని ఫలితమేమిటి? “ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వసమాజము​—⁠అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి [కనాను] ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.”​—⁠సంఖ్యాకాండము 14:​1-3.

7 ఇశ్రాయేలీయుల దృక్పథం ఎంత మారిపోయిందో కదా! ఐగుప్తునుండి విడిపించబడి, ఎర్ర సముద్రంగుండా విడుదల పొందినందుకు వారు మొదట్లో యెహోవాకు కృతజ్ఞతతో స్తుతిగీతాలు పాడారు. (నిర్గమకాండము 15:​1-21) అయితే, అరణ్యంలో ఎదురైన ఇబ్బందులవల్ల, కనానీయుల భయంవల్ల దేవుని ప్రజల్లో కృతజ్ఞతకు బదులుగా అసంతృప్తితో కూడిన స్వభావం చోటుచేసుకుంది. తమకు లభించిన స్వేచ్ఛ విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించే బదులు, తమకేదో కొదవైందనే తప్పుడు అభిప్రాయంతో వారాయనను నిందించారు. కాబట్టి, సణగడమంటే యెహోవా ఏర్పాట్లపట్ల సరైన కృతజ్ఞత లేకపోవడమనే అర్థం. అందుకే ఆయనిలా అనడంలో ఆశ్చర్యం లేదు: “నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను?”​—⁠సంఖ్యాకాండము 14:⁠27; 21:⁠5.

మొదటి శతాబ్దంలో సణగడం

8 సణగడం గురించి ముందు పేర్కొనబడిన ఉదాహరణలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగ్రక్కడానికి సంబంధించినవి. అయితే, యేసుక్రీస్తు సా.శ. 32లో పర్ణశాలల పండుగ సందర్భంగా యెరూషలేములో ఉన్నప్పుడు “జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను.” (యోహాను 7:​12, 13, 32) కొందరు ఆయన మంచివాడని, మరికొందరు ఆయన మంచివాడుకాడని వారిలోవారు గుసగుసలాడుకున్నారు.

9 మరో సందర్భంలో, యేసు ఆయన శిష్యులు లేవీయుడు లేదా సుంకరియైన మత్తయి ఇంట్లో అతిథులుగా ఉన్నారు. “పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి​—⁠సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారు? అని ఆయన శిష్యులమీద సణిగిరి.” (లూకా 5:​27-30) కొంతకాలం తర్వాత గలిలయలో, “నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనిరి.” యేసు అనుచరుల్లో కొందరు కూడా ఆయన పలికిన మాటలకు అభ్యంతరపడి సణిగారు.​—⁠యోహాను 6:​41, 60, 61.

10 సా.శ. 33 పెంతెకొస్తు తర్వాతి రోజుల్లో జరిగిన సణుగుడుకు సంబంధించిన సంఘటనవల్ల మేలు జరిగింది. ఆ సమయంలో, ఇశ్రాయేలేతర ప్రాంతాల నుండి వచ్చి క్రొత్తగా శిష్యులైన వారిలో చాలామంది యూదయలోని తోటి విశ్వాసుల ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నారు, అయితే ఆహారం పంచిపెట్టే విషయంలో సమస్యలు తలెత్తాయి. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 6:⁠1.

11 ఇలా సణిగినవారు, అరణ్యంలోని ఇశ్రాయేలీయుల వంటివారు కాదు. గ్రీకుభాష మాట్లాడే యూదులు స్వార్థంతో తమ స్వంత పరిస్థితి గురించిన అసంతృప్తిని వ్యక్తంచేయలేదు. కొందరు విధవరాండ్ర అవసరాలపట్ల శ్రద్ధ చూపించే విషయంలో విఫలమవడాన్ని వారు అపొస్తలుల దృష్టికి తీసుకువచ్చారు. పైగా, ఆ సణిగినవారు సమస్యల్ని సృష్టించలేదు, యెహోవాకు విరోధంగా వారు బహిరంగంగా ఫిర్యాదు చేయలేదు. వారు అపొస్తలులకు ఫిర్యాదు చేశారు, వారి ఫిర్యాదు న్యాయమైనది కాబట్టి, అపొస్తలులు వెంటనే చర్య తీసుకునే ఏర్పాటు చేశారు. నేటి క్రైస్తవ పెద్దలకు ఆ అపొస్తలులు ఎంత చక్కని మాదిరినుంచారో కదా! ఈ ఆధ్యాత్మిక కాపరులు ‘దరిద్రుల మొఱ్ఱ వినని’ వారిగా ఉండకుండా జాగ్రత్త వహిస్తారు.​—⁠సామెతలు 21:⁠13; అపొస్తలుల కార్యములు 6:​2-6.

సణగడం యొక్క నాశనకర ప్రభావం విషయంలో జాగ్రత్తగా ఉండండి

12 మనం పరిశీలించిన అనేక లేఖనాధారిత ఉదాహరణలు, సణగడం గతంలో దేవుని ప్రజలకెంతో హాని కలిగించిందని చూపించాయి. కాబట్టి, సణగడం యొక్క నాశనకర ప్రభావం గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది. చాలారకాల లోహాలకు సహజంగా తుప్పుపట్టే గుణం ఉంటుంది. ఆ తుప్పు మరకలను తొలిదశలో నిర్లక్ష్యం చేస్తే ఆ లోహం పనికిరానంతగా తుప్పుపట్టి పాడవుతుంది. చాలా వాహనాలు యాంత్రిక లోపంవల్ల కాదుగానీ నడపడానికి సురక్షితం కానంతగా తుప్పుపట్టడంవల్లే పనికిరాకుండా పోతున్నాయి. మనమీ ఉదాహరణను సణగడానికి ఎలా అన్వయించవచ్చు?

13 కొన్నిరకాల లోహాలకు తుప్పుపట్టే గుణమున్నట్లే, అపరిపూర్ణ మానవులకు ఫిర్యాదు చేసే స్వభావం ఉంటుంది. ఆ స్వభావపు ఛాయల్ని కనిపెట్టేందుకు మనం అప్రమత్తంగా ఉండాలి. గాలిలోని తేమ, ఉప్పు తుప్పుపట్టడాన్ని అధికం చేసినట్లే, మనకెదురయ్యే కష్టాలు మనమెక్కువ సణిగేలా చేస్తాయి. ఒత్తిడి చిన్న చికాకును పెద్ద ఫిర్యాదుగా మార్చగలదు. ఈ విధానపు అంత్యదినాల్లోని పరిస్థితులు మరింత దిగజారుతుండగా ఫిర్యాదు చేసేందుకుగల కారణాలు అధికమవచ్చు. (2 తిమోతి 3:​1-5) కాబట్టి, యెహోవా సేవకులు ఒకరిపై ఒకరు సణగడం ఆరంభించవచ్చు. ఒకరికున్న బలహీనతలు, సామర్థ్యాలు, సేవాధిక్యతలనుబట్టి అసంతృప్తి చెందడం వంటి చిన్న విషయమే సణిగేందుకు కారణం కావచ్చు.

14 మన కోపానికి ఏది కారణమైనప్పటికీ, ఫిర్యాదు చేసే స్వభావాన్ని మనం అదుపులో పెట్టుకోకపోతే అది మనలో అసంతృప్తితో కూడిన స్వభావాన్ని పురికొల్పి, మనల్ని ఎల్లప్పుడూ సణిగేవారిగా మారుస్తుంది. అవును, ఆధ్యాత్మికంగా సణగడం యొక్క నాశనకర ప్రభావం మనల్ని పూర్తిగా భ్రష్టుపట్టించగలదు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో తమ జీవితం గురించి సణిగినప్పుడు, వారు యెహోవాను నిందించేంత వరకు వెళ్లారు. (నిర్గమకాండము 16:⁠8) అలా మనకెన్నటికీ జరగకుండుగాక!

15 తుప్పును నివారించే పెయింటు వేయడం, అక్కడక్కడ పట్టిన తుప్పును వెంటనే తొలగించడం ద్వారా లోహానికున్న తుప్పుపట్టే గుణాన్ని తగ్గించవచ్చు. అదే విధంగా, ఫిర్యాదు చేసే స్వభావం మనలో ఉన్నట్లు మనం కనుగొంటే, దానిని సరిదిద్దడానికి సత్వరమే ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేసినట్లయితే దానిని అదుపులో పెట్టుకోవచ్చు. ఎలా?

విషయాల్ని యెహోవా దృక్కోణం నుండి చూడండి

16 సణగడం మనపై, మన కష్టాలపై మనస్సును కేంద్రీకరింపజేసి, యెహోవాసాక్షులుగా మనమానందించే ఆశీర్వాదాలను వెనక్కి నెట్టేస్తుంది. ఫిర్యాదు చేసే స్వభావాన్ని అధిగమించేందుకు, ఆ ఆశీర్వాదాల్ని మన మదిలో ప్రధానంగా ఉంచుకోవాలి. ఉదాహరణకు, మనలో ప్రతీ ఒక్కరికి యెహోవా వ్యక్తిగత నామాన్ని ధరించే అద్భుతమైన ఆధిక్యత ఉంది. (యెషయా 43:​10) మనమాయనతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు, ఏ సమయంలోనైనా మనం ‘ప్రార్థన ఆలకించువానితో’ మాట్లాడవచ్చు. (కీర్తన 65:2; యాకోబు 4:⁠8) విశ్వసర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశాన్ని అర్థం చేసుకుని, దేవునిపట్ల యథార్థతను కాపాడుకోవడం మన ఆధిక్యతని గుర్తుంచుకున్నాం కాబట్టే, మన జీవితానికి నిజమైన అర్థం ఉంది. (సామెతలు 27:​11) రాజ్య సువార్తను ప్రకటించడంలో మనం క్రమంగా భాగం వహించవచ్చు. (మత్తయి 24:​14) యేసుక్రీస్తు విమోచన క్రయధనంపై విశ్వాసముంచడం మనం స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగివుండేందుకు సహాయం చేస్తుంది. (యోహాను 3:​16) మనమేమి సహించాల్సివచ్చినా, ఈ ఆశీర్వాదాల్ని మనం అనుభవించవచ్చు.

17 మనం విషయాల్ని మన దృక్కోణం నుండి కాక, యెహోవా దృక్కోణం నుండి చూసేందుకు ప్రయత్నిద్దాం. “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము” అని కీర్తనకర్తయైన దావీదు పాడాడు. (కీర్తన 25:⁠4) మనకు ఫిర్యాదు చేసే సముచితమైన కారణమే గనుక ఉంటే, అది యెహోవా దృష్టికి రాకుండా పోదు. ఆయన దానిని వెంటనే సరిచేయగలడు. అయితే ఆ కష్టపరిస్థితి కొనసాగేందుకు ఆయన కొన్నిసార్లు ఎందుకు అనుమతిస్తాడు? బహుశా మనం ఓర్పు, సహనం, విశ్వాసం, దీర్ఘశాంతం వంటి మంచి లక్షణాల్ని వృద్ధి చేసుకునేలా మనకు సహాయం చేయడానికి అనుమతించివుండవచ్చు.​—⁠యాకోబు 1:​2-4.

18 ఫిర్యాదు చేయకుండా ఇబ్బందుల్ని సహించడం, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు మనకు సహాయం చేయడమే కాక, మన ప్రవర్తనను గమనించేవారిని కూడా ఆకట్టుకోవచ్చు. యెహోవాసాక్షుల గుంపొకటి 2003లో, హంగరీలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు జర్మనీ నుండి బస్సులో ప్రయాణించారు. ఆ బస్సు డ్రైవరు సాక్షికాదు, యెహోవాసాక్షులతో పది రోజులు గడపడాన్ని ఆయన నిజంగా ఇష్టపడలేదు. అయితే, ఆ ప్రయాణం ముగిసేసరికి ఆయన తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఎందుకు?

19 ఆ ప్రయాణ మార్గంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఆ సాక్షులెప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నేను తీసుకెళ్ళిన ప్రయాణీకుల్లో వీరే శ్రేష్ఠమైన గుంపని ఆ డ్రైవరు అన్నాడు. వాస్తవానికి, ఆయన ఈ సారి సాక్షులు తన ఇంటిని సందర్శించినప్పుడు, వారిని లోపలికి ఆహ్వానించి, వారు చెప్పేది శ్రద్ధగా వింటానని వాగ్దానం చేశాడు. ‘సణుగులును మాని సమస్త కార్యములను చేయడం’ ద్వారా ఆ ప్రయాణికులు ఆయననెంతగా ఆకట్టుకున్నారో కదా!

క్షమించడం ఐక్యతను పురికొల్పుతుంది

20 తోటి విశ్వాసిమీద మనకు ఫిర్యాదు ఉంటే అప్పుడేమిటి? అది గంభీరమైన విషయమైతే, మత్తయి 18:​15-17లో వ్రాయబడినట్లుగా, యేసు మాటల్లో కనబడే సూత్రాలను మనం అన్వయించుకోవాలి. ఫిర్యాదులు చాలావరకు చిన్నవిగానే ఉంటాయి కాబట్టి, అన్ని సందర్భాల్లో ఆ సూత్రాలను అన్వయించాల్సిన అవసరం ఉండదు. ఆ పరిస్థితిని, క్షమించేందుకు లభించిన అవకాశంగా ఎందుకు పరిగణించకూడదు? పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:​13, 14) క్షమించేంత విశాల హృదయం మనకుందా? మన గురించి ఫిర్యాదు చేసేందుకు యెహోవాకు కారణము లేదంటారా? అయినప్పటికీ, ఆయన పదేపదే కరుణను చూపిస్తూ, క్షమిస్తున్నాడు.

21 మన బాధ ఏదైనప్పటికీ సణగడం, విషయాన్ని చక్కబెట్టదు. “సణగడం” అనే అర్థమున్న హెబ్రీ పదం “కొరకొరలాడడం” అనే అర్థాన్ని కూడా ఇవ్వగలదు. ఎప్పుడూ కొరకొరలాడే లేదా కోపంగా గొణిగే వ్యక్తితో ఉండడానికి మనకు ఇబ్బందిగా ఉంటుంది, అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే విధంగా, మనం సణిగినప్పుడు, లేదా కొరకొరలాడినప్పుడు వాటిని వినే ఇతరులు కూడా అలాగే భావించవచ్చు. నిజానికి, వారికెంత ఇబ్బందిగా ఉండొచ్చంటే, వారు మనకు దూరంగా ఉండేందుకే ఇష్టపడవచ్చు. కొరకొరలాడడం ఒకరి దృష్టిని ఆకర్షించవచ్చు కానీ, ఖచ్చితంగా ఎవరినీ సంపాదించుకోలేం.

22 యెహోవా ప్రజలు విలువైనదిగా పరిగణించే ఐక్యతను క్షమాగుణం పురికొల్పుతుంది. (కీర్తన 133:​1-3) ఐరోపాలోని ఒక దేశంలోని 17 ఏళ్ళ ఓ క్యాథలిక్‌ అమ్మాయి యెహోవాసాక్షులపట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచేందుకు వారి బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం వ్రాసింది. అందులో ఆమె ఇలా వ్రాసింది: “నాకు తెలిసినంతవరకు ద్వేషం, దురాశ, అసహనం, స్వార్థం, అనైక్యతచేత విభాగించబడని సభ్యులున్న సంస్థ ఇదొక్కటే.”

23 సత్య దేవుడైన యెహోవా ఆరాధకులుగా మనకు లభించే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నింటిపట్ల మనకున్న కృతజ్ఞత, ఐక్యతను పురికొల్పేందుకు, వ్యక్తిగత విషయాల్లో ఇతరులకు విరోధంగా సణగకుండా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. తర్వాతి ఆర్టికల్‌, మరింత హానికరమైన రీతిలో సణగకుండా ఉండేందుకు, అంటే యెహోవా సంస్థలోని భూసంబంధ భాగానికి విరోధంగా సణగకుండా ఉండేందుకు దైవిక లక్షణాలు మనకు ఎలా సహాయం చేస్తాయో చూపిస్తుంది.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

సణగడంలో ఏమి ఇమిడివుంది?

సణగడంవల్ల కలిగే పరిణామాలను ఎలా ఉదాహరించవచ్చు?

సణిగే స్వభావాన్ని అధిగమించేందుకు మనకేది సహాయం చేయగలదు?

క్షమించేందుకు సిద్ధంగా ఉండడం సణగకుండా ఉండేలా మనకెలా సహాయం చేయగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఫిలిప్పీ, కొరింథు సంఘాల్లోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఎలాంటి ఉపదేశమిచ్చాడు, ఎందుకు?

3. సణగడం అనే అంశం గురించి నేడు మనమెందుకు శ్రద్ధగా పరిశీలించాలి?

4. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏ విధంగా సణిగారు?

5. ఇశ్రాయేలీయులు ఫిర్యాదు చేసినప్పుడు, వారు నిజానికి ఎవరికి విరోధంగా సణిగారు?

6, 7. సంఖ్యాకాండము 14:​1-3లో చూపించబడినట్లుగా, ఇశ్రాయేలీయుల వైఖరి ఎలా మారిపోయింది?

8, 9. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో సణిగినవారి ఉదాహరణలను పేర్కొనండి.

10, 11. గ్రీకుభాష మాట్లాడే యూదులు ఎందుకు సణిగారు, ఆ ఫిర్యాదుతో వ్యవహరించిన విధానం నుండి క్రైస్తవ పెద్దలెలా ప్రయోజనం పొందవచ్చు?

12, 13. (ఎ) సణగడంవల్ల కలిగే పరిణామాలను ఉదాహరించండి. (బి) సణిగేందుకు ఒక వ్యక్తిని ఏది ప్రేరేపించవచ్చు?

14, 15. ఫిర్యాదు చేసే స్వభావాన్ని మనం ఊరికే ఎందుకు వదిలేయకూడదు?

16. ఫిర్యాదుచేసే స్వభావాన్ని ఎలా అధిగమించవచ్చు?

17. మనకు ఫిర్యాదు చేసే సముచితమైన కారణమున్నా, విషయాల్ని యెహోవా దృక్కోణం నుండి చూసేందుకు మనమెందుకు ప్రయత్నించాలి?

18, 19. ఫిర్యాదు చేయకుండా ఇబ్బందులను సహించడం ద్వారా లభించగల సత్ఫలితాలను ఉదాహరించండి.

20. మనం ఒకరికొకరం ఎందుకు క్షమించుకోవాలి?

21. సణగడాన్ని వినేవారు ఎలా ప్రభావితులు కావచ్చు?

22. యెహోవాసాక్షుల గురించి ఓ అమ్మాయి ఏమి వ్రాసింది?

23. తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం?

[14వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయులు నిజానికి యెహోవాకు విరోధంగా సణిగారు

[17వ పేజీలోని చిత్రం]

విషయాల్ని మీరు యెహోవా దృష్టించినట్లే దృష్టిస్తారా?

[18వ పేజీలోని చిత్రాలు]

క్షమించడం క్రైస్తవ ఐక్యతను పురికొల్పుతుంది