కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చివరకు ఐక్యమైన మా కుటుంబం!

చివరకు ఐక్యమైన మా కుటుంబం!

జీవిత కథ

చివరకు ఐక్యమైన మా కుటుంబం!

సుమికో హిరానో చెప్పినది

నేను అతి శ్రేష్ఠమైన జీవన విధానాన్ని కనుగొన్నాను, నా భర్త కూడా దాన్ని నాతో పంచుకోవాలని ఆశించాను. కానీ అలా జరగడానికి నలభై రెండు సంవత్సరాలు పట్టింది.

నాకు 21 ఏండ్లు ఉన్నప్పుడు, 1951లో కాజుహికో నేను వివాహం చేసుకున్నాం. నాలుగు సంవత్సరాల్లోగా మాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, నా జీవితం అన్ని విధాలా ఆశీర్వదించబడినట్లే అనిపించింది.

యెహోవాసాక్షుల మిషనరీ ఒకామె మా అక్కను కలవడానికి వస్తోందని 1957వ సంవత్సరంలో ఒకరోజు మా అక్క నాతో చెప్పింది. మా అక్క బౌద్ధ మతస్థురాలే అయినా ఆ మిషనరీతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించింది, నన్ను కూడా చేయమని ప్రోత్సహించింది. నేను దానికి ఒప్పుకున్నాను. నేను ప్రొటస్టెంట్‌ చర్చీకి హాజరయ్యేదాన్ని కాబట్టి, యెహోవాసాక్షుల బోధల్లో తప్పులు ఎత్తిచూపించవచ్చని నేను తలంచాను.

బైబిలు గురించి నాకు ఎంత తక్కువగా తెలుసో వెంటనే గ్రహించాను. “యెహోవా ఎవరు?” అని నేను ఆ మిషనరీని అడగాల్సి వచ్చింది. మా చర్చీలో ఆ పేరు ఉపయోగించబడడం నేనెప్పుడూ వినలేదు. ఆ మిషనరీ పేరు డాఫ్నీ కుక్‌ (తర్వాత పెటిట్‌). సర్వశక్తిమంతుడైన దేవుని పేరు యెహోవా అని స్పష్టంగా తెలియజేసే యెషయా 42:8వ వచనాన్ని ఆమె నాకు చూపించింది. డాఫ్నీ నా ప్రశ్నలన్నింటికీ బైబిలునుండే జవాబులు ఇచ్చింది.

నేను అవే ప్రశ్నల్ని మా ఫాదిరీని అడిగాను. ఆయన నాతో ఇలా అన్నాడు: “ప్రశ్నలు అడగడం పాపం. నీకు చెప్పినదాన్ని నమ్ము అంతే.” ప్రశ్నలు అడగడం తప్పని నేను అనుకోకపోయినా, ఆరు నెలలపాటు ప్రతీ ఆదివారం ఉదయం చర్చీకి, మధ్యాహ్నం యెహోవాసాక్షుల కూటాలకు హాజరయ్యేదాన్ని.

మా కాపురంపై అది చూపించిన ప్రభావం

బైబిలునుండి నేను నేర్చుకుంటున్న విషయాలు నన్ను ఎంతో పులకరింపజేశాయి, వాటిని నేను మావారితో పంచుకున్నాను. ప్రతీ అధ్యయనం, కూటం తర్వాత నేను నేర్చుకున్న విషయాలను ఆయనతో చెప్పేదాన్ని. ఫలితంగా, మా మధ్య ముందెన్నడూ లేని అగాధం ఏర్పడింది. నేను యెహోవాసాక్షిగా మారడం ఆయనకు ఇష్టం లేదు. కానీ బైబిలు అధ్యయనం చేయడం నాకు ఎంత సంతృప్తినిచ్చేదంటే నేను అధ్యయనాన్ని, సాక్షులతో సహవసించడాన్ని కొనసాగించాను.

కూటాలున్న రోజుల్లో, ఇంటినుండి వెళ్ళే ముందు కాజుహికోకు ఇష్టమైన వంటలు చేసేదాన్ని, కానీ ఆయన హోటల్‌లో భోజనం చేయడం మొదలుపెట్టాడు. కూటాల తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి, ఆయన చాలా చిరాకుగా ఉండి నాతో మాట్లాడేవాడు కాదు. రెండు మూడు రోజులకు ఆయన తిరిగి మామూలు స్థితికి చేరుకునేవాడు, కానీ అప్పటికల్లా మరో కూటానికి వెళ్లే రోజు వచ్చేది.

నేను అధ్యయనం కొనసాగిస్తున్న సమయంలోనే టీబీవల్ల అనారోగ్యం పాలయ్యాను, అప్పటికే ఆ వ్యాధితో మావారి కుటుంబీకుల్లో చాలామంది మరణించారు. కాజుహికో చాలా కంగారుపడిపోయాడు, నాకు నయమైన తర్వాత నాకిష్టమైన ఏ పనినైనా చేయనిస్తానని వాగ్దానం చేశాడు. వారపు కూటాలకు హాజరయ్యేందుకు దయచేసి అడ్డుచెప్పవద్దని మాత్రమే నేను కోరాను. ఆయన దానికి ఒప్పుకున్నాడు.

నేను కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది, ఈలోపు నేను బైబిలును క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. సాక్షుల బోధల్లో బైబిలుకు విరుద్ధమైనవి ఏవైనా ఉన్నాయేమో వెతికాను, అలాంటిది ఒక్కటి దొరికినా నా అధ్యయనాన్ని ఆపేద్దామని నేను అనుకున్నాను. కానీ నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. బదులుగా, ప్రొటస్టెంట్‌ చర్చీ బోధల్లోని తప్పులు స్పష్టమయ్యాయి. యెహోవా ప్రేమను, న్యాయాన్ని, ఆయన నియమాలకు అనుగుణంగా జీవించడంలోని ప్రయోజనాన్ని నేను గ్రహించాను.

నేను కోలుకున్న తర్వాత, మావారు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని, నేను కూటాలకు వెళ్లడాన్ని వ్యతిరేకించలేదు. నేను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి, 1958 మే నెలలో యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాను. నా కుటుంబం కూడా నాతో కలిసి సత్యదేవుణ్ణి ఆరాధించాలని నేనెంతగానో ఆశించాను.

నా పిల్లలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడం

కూటాలకు, ప్రకటనా పనికి మా అబ్బాయిలు ఎప్పుడూ నాతోపాటు వచ్చేవారు, అయితే వారు బైబిలు జ్ఞానాన్ని పెంచుకుంటున్నారని గ్రహించేందుకు కొన్ని సంఘటనలు దోహదపడ్డాయి. ఒకరోజు ఆరేండ్ల మా మసాహికో ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఒక పెద్ద శబ్దంతోపాటు ఎవరో అరవడం నాకు వినిపించింది. మా అబ్బాయిని కారు గుద్దేసిందని అరుస్తూ పొరుగింటావిడ మా ఇంట్లోకి దూసుకువచ్చింది. మా బాబు చనిపోయాడా? నేను బయటికి పరిగెడుతూ, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాను. తక్కుతుక్కైన సైకిలు చూసి నాలో వణుకు పుట్టింది, అయితే, కొన్ని గాయాలు మాత్రమే తగిలిన మసాహికో నావైపు నడిచి రావడాన్ని చూశాను. వాడు వచ్చి నన్ను కౌగిలించుకుంటూ, “అమ్మా, యెహోవాయే నాకు సహాయం చేశాడు కదా” అని అన్నాడు. వాణ్ణి ప్రాణాలతో చూసి, వాడి నోటినుండి అంత చక్కని మాటలు విన్నప్పుడు ఆనందంతో కన్నీరు కార్చాను.

మరోరోజు, పరిచర్యలో మేము కలిసిన ఒక వృద్ధుడు, “ఆ పిల్లవాడ్ని అలా వీధుల వెంబడి తీసుకువెళ్తున్నావు, అసలు నువ్వు ఏమి చేస్తున్నావో నీకు తెలుసా? వాణ్ణి చూస్తే నాకు జాలేస్తుంది” అంటూ అరిచాడు. నేను జవాబిచ్చేలోపే మా ఎనిమిదేళ్ల టొమొయోషీ ఇలా అన్నాడు: “తాతగారు, ప్రకటించాలని మా అమ్మ నన్ను బలవంతపెట్టలేదు. నేను యెహోవాను సేవించాలని అనుకుంటున్నాను కాబట్టే ప్రకటిస్తున్నాను.” మాట పెగలక ఆ వృద్ధుడు అలా చూస్తూ ఉండిపోయాడు.

మా అబ్బాయిలు ఆధ్యాత్మికంగా తండ్రిలేనివాళ్ళు. స్వయంగా నేనే ఇంకా ఎంతో నేర్చుకోవాల్సివున్నా వారికి బైబిలు సత్యాలు నేర్పించే బాధ్యత నాపై పడింది. నేను వ్యక్తిగతంగా ప్రేమ, విశ్వాసం, ఉత్సాహం వంటి గుణాలను పెంపొందించుకొని వారికి మాదిరినుంచడానికి ప్రయత్నించాను. మా పిల్లల ఎదురుగా నేను ప్రతీరోజు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేసేదాన్ని. ప్రకటనా పనిలో నాకు ఎదురైన అనుభవాలను వారికి చెప్పేదాన్ని. అది వారిని ప్రోత్సహించింది. కొంతకాలం తర్వాత, వారు పయినీర్లుగా లేదా యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులుగా తయారవడానికిగల కారణమేమిటో చెప్పమని ఇంటర్వ్యూలో అడగబడినప్పుడు, వారు “మా అమ్మ పయినీరుగా సేవించడంలో ఎంతో సంతోషాన్ని అనుభవించింది, మేము కూడా సంతోషంగా ఉండాలనుకున్నాం” అని జవాబిచ్చారు.

వాళ్ళ నాన్న గురించీ, లేదా సంఘంలో ఎవరి గురించీ చులకనగా మాట్లాడకుండా ఉండడానికి నేనెంతో జాగ్రత్తపడ్డాను. ప్రతికూలంగా మాట్లాడడం నా పిల్లలపై హానికరమైన ప్రభావం చూపిస్తుందని గ్రహించాను. ఎందుకంటే, నేను చులకనగా మాట్లాడిన వారిపట్లేకాక వారు నాపై కూడా గౌరవం కోల్పోయే అవకాశం ఉంది.

ప్రగతి సాధించేందుకు అవరోధాలను అధిగమించడం

మావారి ఉద్యోగరీత్యా మా కుటుంబం 1963లో తైవాన్‌కు తరలివెళ్లాల్సి వచ్చింది. నేనక్కడ జపనీయుల సమాజంలో ప్రకటిస్తే సమస్యలను సృష్టించడానికి కారకురాలినవుతానని మా ఆయన నాతో చెప్పాడు. అలా జరిగితే మమ్మల్ని తిరిగి జపాన్‌కు పంపించేస్తారు, దానివల్ల ఆయన పనిచేసే సంస్థకు సమస్యలు ఎదురౌతాయి. మా ఆయన మమ్మల్ని సాక్షులనుండి దూరం చేయాలనుకున్నాడు.

తైవాన్‌లోని సాక్షులు మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. అక్కడి సంఘంలో కూటాలన్నీ చైనీస్‌ భాషలో నిర్వహించబడేవి. జపనీయులకు బదులు స్థానికులకు సాక్ష్యమిచ్చేందుకు నేను చైనీస్‌ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నా భర్త ప్రస్తావించిన సమస్యలను అధిగమించవచ్చని అనుకున్నాను.

తైవాన్‌లోని సాక్షులతో మా స్నేహం మమ్మల్ని బలపరిచింది. హార్వే, క్యాథీ లోగన్‌ అనే మిషనరీ దంపతులు మాకెంతగానో సహాయం చేశారు. సహోదరుడు లోగన్‌ మా అబ్బాయిలకు ఆధ్యాత్మిక తండ్రి అయ్యారు. యెహోవాను సేవించడం ఆనందంలేని, కట్టుదిట్టమైన జీవితం కాదని ఆయన వారికి చూపించాడు. మేము తైవాన్‌లో ఉండగానే మా అబ్బాయిలు యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నారని నేను అనుకుంటున్నాను.

టొమొయోషీ, మసాహికోలు అమెరికన్‌ స్కూలుకు వెళ్లేవారు, అక్కడ వారు ఇంగ్లీష్‌, చైనీస్‌ భాషలు నేర్చుకున్నారు. అక్కడి విద్యాభ్యాసం వారు భవిష్యత్తులో సత్యదేవుడైన యెహోవాకు పరిచారకులుగా సేవచేసేందుకు వారిని సిద్ధం చేసింది. మాకు కష్టకరంగా మారగల సమయాన్ని నిత్య ఆశీర్వాదకరమైనదిగా మార్చినందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. తైవాన్‌లో మరపురాని విధంగా గడిపిన మూడున్నర సంవత్సరాల తర్వాత మేము జపాన్‌కు తిరిగి వచ్చాం.

అప్పటికి మా అబ్బాయిలు టీనేజర్లయ్యారు, స్వేచ్ఛను కోరుకోవడం మొదలుపెట్టారు. వారితో ఎన్నో గంటలు లేఖనాధారిత సూత్రాల గురించి తర్కిస్తూ గడిపేదాన్ని, ఆ కష్టకరమైన కాలాన్ని ఎదుర్కోవడానికి యెహోవా వారికి సహాయం చేశాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత టొమొయోషీ పయినీరు సేవ ప్రారంభించాడు. పయినీరు సేవ చేసిన మొదటి కొన్ని సంవత్సరాల్లో నలుగురు వ్యక్తులు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునేందుకు సహాయం చేయగలిగాడు. మసాహికో కూడా తన అన్నయ్యనే అనుసరించి మాధ్యమిక విద్య ముగించిన వెంటనే పయినీరు సేవ ప్రారంభించాడు. పయినీరు సేవ చేసిన మొదటి నాలుగు సంవత్సరాల్లో నలుగురు యౌవనులు సాక్షులయ్యేందుకు సహాయం చేశాడు.

యెహోవా మా పిల్లల్ని మరింతగా ఆశీర్వదించాడు. బైబిలు సత్యాలు తెలుసుకోవడానికి నేను సహాయం చేసిన ఒక స్త్రీ భర్తతో టొమొయోషీ అధ్యయనం చేశాడు. వారి ఇద్దరు అమ్మాయిలు కూడా సాక్షులయ్యారు. ఆ తర్వాత, వారి పెద్ద అమ్మాయి నొబుకోను టొమొయోషీ పెళ్లి చేసుకున్నాడు, చిన్న అమ్మాయి మసాకోను మసాహికో పెళ్ళి చేసుకున్నాడు. టొమొయోషీ, నొబుకోలు ప్రస్తుతం న్యూయార్క్‌లోని, బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్నారు. మసాహికో, మసాకోలు పరాగ్వేలో మిషనరీలుగా సేవచేస్తున్నారు.

మావారిలో క్రమంగా వచ్చిన మార్పులు

ఆ సంవత్సరాలన్నింటిలో మావారు మా విశ్వాసంపట్ల ఉదాసీనత చూపించేవారు, కానీ ఆయన మారుతున్నట్లుగా మాకు కొన్ని సూచనలు కనిపించాయి. ఇతరులు నన్ను వ్యతిరేకించినప్పుడు, ఆయన నా నమ్మకాల్ని సమర్థించేవారు, నిజానికి తనకు తెలియకుండానే ఆయన బైబిలు సత్యాలను సమర్థించేవారు! అవసరంలో ఉన్న సాక్షులకు ఆయన వస్తుపరంగా సహాయం చేసేవారు. మసాహికో వివాహ సమయంలో ఆయన ఇచ్చిన చిన్న ప్రసంగంలో ఇలా అన్నారు: “ప్రజలకు సరైనవిధంగా జీవించడాన్ని నేర్పించడమనేది అన్నింటికన్నా శ్రేష్ఠమైన పని, అది ఎంతో కష్టమైనది కూడా. ఆ కష్టమైన పనినే మా అబ్బాయిలు, వారి భార్యలు తమ జీవితగమనంగా ఎంచుకున్నారు. దయచేసి వారికి సహాయం చేయండి.” యెహోవాను సేవించడంలో ఆయన ఖచ్చితంగా మాతో కలుస్తాడని భావించడానికి అలాంటివన్నీ దోహదపడ్డాయి.

ఆయన తోటి సాక్షులతో సహవసించేందుకు వీలుగా నేను వారిని మా ఇంటికి ఆహ్వానించేదాన్ని. నేను ఆయనను క్రైస్తవ కూటాలకు, సమావేశాలకే కాక క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి కూడా ఆహ్వానించేదాన్ని. ఆయనకు పనినుండి తీరిక దొరికినప్పుడు వాటికి హాజరయ్యేవాడు, అయితే ఇష్టపూర్వకంగా మాత్రం కాదు. ఆయన బైబిలు అధ్యయనం చేయడానికి బహుశా అంగీకరించవచ్చని నాకు ఎన్నోసార్లు అనిపించేది, అందుకే నేను క్రైస్తవ పెద్దలను ఇంటికి ఆహ్వానించేదాన్ని. కానీ ఆయన అధ్యయనం చేయడానికి నిరాకరించేవాడు. ఏమి పొరపాటు జరిగిందా అని నేను ఆలోచించాను.

అపొస్తలుడైన పేతురు మాటలు నాకు గుర్తుకువచ్చాయి: “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతురు 3:⁠1) నేను ఆ ఉపదేశాన్ని అనుసరించడంలో కొన్నిసార్లు తప్పిపోయానని గ్రహించాను. దానికి పూర్తి అనుగుణంగా నడుచుకోవడానికి నేను నా ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకోవాలని అనుకున్నాను.

మరింత ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదగాలనే లక్ష్యంతో నేను 1970లో పయినీరు సేవ ప్రారంభించాను. పది సంవత్సరాలు గడిచాయి, ఆ తర్వాత 20 సంవత్సరాలు గడిచాయి. అయినా మావారిలో ఆధ్యాత్మికపరంగా ఏ మార్పూ కనిపించలేదు. ఒక బైబిలు విద్యార్థి ఓసారి నాతో ఇలా అంది, “మీ భర్తకే సహాయం చేయలేనప్పుడు ఇతరులకు సహాయం చేయడం మీకు చాలా కష్టమనిపిస్తుండవచ్చు కదా.” ఆ మాటలు నన్ను నిరుత్సాహపరిచాయి, కానీ నేను పట్టు విడువలేదు.

1980ల చివరి భాగంలో మా తల్లిదండ్రులు తమ జీవిత చరమాంకానికి చేరుకున్నారు. వారిని చూసుకోవడంతోపాటు నాకున్న ఇతర బాధ్యతలను నిర్వర్తించడం అలసట కలిగించేదిగా, ఒత్తిడితో కూడినదిగా ఉండేది. యెహోవాపట్ల నాకున్న విశ్వాసాన్ని వాళ్లందరూ ఎన్నో సంవత్సరాలు వ్యతిరేకించారు, కానీ నేను, నాకు సాధ్యమైనంతగా వారికి ప్రేమ చూపించడానికి ప్రయత్నించాను. 96 ఏళ్ళ మా అమ్మ చనిపోయేముందు నాతో ఇలా అంది, “సుమికో, ఒకవేళ నేను పునరుత్థానం చేయబడితే నేను మీ మతంలో చేరతాను.” నా ప్రయత్నాలు వ్యర్థం కాలేదని నేను గ్రహించాను.

మా తల్లిదండ్రులకు నేను చేసిన సేవలన్నింటినీ మావారు గమనించారు. తన కృతజ్ఞత చూపించడానికి ఆయన క్రమంగా కూటాలకు హాజరవడం మొదలుపెట్టారు. ఆయన చాలా ఏళ్ళవరకు అలా కూటాలకు హాజరయ్యారు కానీ నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదు. ఆయనను సంతోషపెట్టేందుకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయన స్నేహితుల్ని, చివరకు ఆయన విదేశీ వ్యాపార సహచరులను భోజనాలకు ఆహ్వానించేదాన్ని. ఆయనతో కలిసి ఉల్లాస కార్యకలాపాల్లో పాల్గొనేదాన్ని. పయినీరు సేవా గంటలు 70కి తగ్గించబడినప్పుడు నాకు దొరికిన ఆ ఖాళీ సమయాన్ని ఆయనతోనే గడిపేదాన్ని.

రిటైరైన తర్వాత వచ్చిన మార్పు

నా భర్త 1993లో రిటైరయ్యారు. ఇప్పుడైనా బైబిలు అధ్యయనం చేయడానికి ఆయనకు సమయం దొరుకుతుందని నేను అనుకున్నాను. అయితే, ఇప్పుడు సమయం ఉంది కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం నిజమైన దైవభక్తి కాదని ఆయన అన్నారు. బదులుగా, తన హృదయం తనను కదిలించినప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తాననీ, అంతవరకూ తనను బలవంతపెట్టవద్దనీ ఆయన నాకు చెప్పారు.

ఒకరోజు కాజుహికో నాతో మాట్లాడుతూ, ఇప్పుడైనా నా కోసం నీ శేష జీవితాన్ని గడుపుతావా అని నన్ను అడిగారు. ఆ మాటలు నన్ను బాధపెట్టాయి, ఎందుకంటే నేను ఆయనను వివాహం చేసుకున్నప్పటినుండి ఆయన కోసం చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాను. ఆయనను సంతోషపెట్టడానికి నా శాయశక్తులా కృషిచేశాను, అయినా నేను ఆయనకన్నా యెహోవా కోసమే ఎక్కువగా జీవిస్తున్నానని ఆయన భావించారు. దాని గురించి కాసేపు ఆలోచించిన తర్వాత, నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నానని ఆయనకు చెప్పాను. కానీ, నేను చేసేదానిలో ఒకవేళ తాను కూడా పాలుపంచుకుంటే, మేమిద్దరం కలిసి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనీ, అది కొన్నేళ్లు మాత్రమే నిలిచే బంధం కాదు, నిరంతరం నిలిచివుంటుందనీ చెప్పాను. చాలా రోజులవరకు మావారు ఏమీ మాట్లాడలేదు. చివరకు ఆయనిలా అడిగారు: “మరైతే నువ్వు నాతో బైబిలు అధ్యయనం చేస్తావా?” ఆ మాటలు జ్ఞాపకమొచ్చినప్పుడల్లా నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది.

నా భర్తతో అధ్యయనం చేయమని ముందుగా ఒక క్రైస్తవ పెద్దను అడిగాను. కానీ ఆయన, “నేను నీతో తప్ప మరెవరితోనూ అధ్యయనం చేయను” అని అన్నారు. మేము ప్రతీరోజు బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాం. నేను చైనీస్‌ భాషా సంఘంలో ఉన్నాను, అంతేకాక మావారు కూడా చైనీస్‌ భాషను అనర్గళంగా మాట్లాడగలరు కాబట్టి మేము అదే భాషలో అధ్యయనం చేసేవాళ్ళం. మేమిద్దరం కలిసి ఏడాదికన్నా తక్కువ గడువులో బైబిలంతటినీ చదివాం.

ఆ రోజుల్లో, చైనీస్‌ భాషా సంఘంలోని ఒక పెద్ద, ఆయన భార్య మా ఇద్దరిపై శ్రద్ధ చూపించారు. వారు మా పిల్లలకన్నా వయసులో చిన్నవారైనా మాకు నిజమైన స్నేహితులయ్యారు. అనేక ఇతర సాక్షులు కూడా మావారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మాకు ఆతిథ్యాన్నిచ్చి, కాజుహికోతో తమ స్వంత తండ్రితో మాట్లాడినట్లే మాట్లాడేవారు. అది ఆయనను ఎంతో సంతోషపరిచేది.

ఒకరోజు, సంఘంలోని ఒకరి వివాహ ఆహ్వాన పత్రిక మా ఇంటికి మావారి పేరుమీద వచ్చింది. అలా ఆయనను కుటుంబ శిరస్సుగా గుర్తించడం ఆయన హృదయాన్ని స్పృశించింది, దానికి హాజరవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కొంతకాలంలోనే ఆయన సాక్షులకు దగ్గరయ్యాడు, ఒక క్రైస్తవ పెద్దతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాడు. బైబిలు అధ్యయనం, కూటాలకు హాజరవడం, సంఘం చూపించిన ప్రేమ ఆయన ఆధ్యాత్మికంగా మంచి ప్రగతిని సాధించేందుకు తోడ్పడ్డాయి.

చివరకు ఐక్యమైన కుటుంబం

యెహోవాకు తాను చేసుకున్న సమర్పణను సూచిస్తూ మావారు 2000 డిసెంబరులో బాప్తిస్మం తీసుకున్నారు. ఈ ఆధునికదిన “అద్భుతాన్ని” చూడడానికి మా కొడుకులు కోడళ్ళు చాలా దూరంనుండి వచ్చారు. ఇది జరగడానికి 42 సంవత్సరాలు పట్టింది, అయితే చివరకు మేమిప్పుడు ఐక్యమైన కుటుంబంగా ఉన్నాం.

ఇప్పుడు ప్రతీ ఉదయం మేమిద్దరం కలిసి దినవచనాన్ని చర్చించి, బైబిలు చదువుతాం. ప్రతీరోజు మేము ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకోవడంలో ఆనందిస్తాం, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాం. మావారు ఇప్పుడు సంఘంలో పరిచర్య సేవకునిగా సేవచేస్తున్నారు, ఇటీవలి చైనీస్‌ భాషలో బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం ఇచ్చారు. మమ్మల్ని ఒకటి చేసినందుకు యెహోవాకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన కుటుంబస్థులతో, స్నేహితులతో కలిసి యెహోవా నామాన్ని, సర్వాధిపత్యాన్ని ఎల్లప్పుడూ సమర్థించే సమయం కోసం నేను ఎదురుచూస్తున్నాను.

[13వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

చైనా

డెమోక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా

రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా

జపాన్‌ సముద్రము

జపాన్‌

టోక్యో

తూర్పు చైనా సముద్రం

తైవాన్‌

టేయ్‌పేయ్‌

[12వ పేజీలోని చిత్రం]

నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు, 1958లో మా కుటుంబంతో

[13వ పేజీలోని చిత్రాలు]

టోక్యో నుండి టేయ్‌పేయ్‌ వచ్చిన హార్వే, క్యాథీ లోగన్‌లాంటి స్నేహితులు మమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించారు

[15వ పేజీలోని చిత్రం]

నేడు మా కుటుంబం సత్యారాధనలో ఐక్యమయ్యింది