కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దాన్ని ఆదాచేయలేరు కాబట్టి సద్వినియోగం చేసుకోండి

దాన్ని ఆదాచేయలేరు కాబట్టి సద్వినియోగం చేసుకోండి

దాన్ని ఆదాచేయలేరు కాబట్టి సద్వినియోగం చేసుకోండి

సమయం డబ్బులాంటిది అనేది తరచూ ఉపయోగించబడే ఒక నానుడి. నిజం చెప్పాలంటే, సమయానికీ, డబ్బుకు లేక ఇతర భౌతిక వస్తువులకు మధ్య చాలా తేడా ఉంది. మీరు డబ్బును, ఆహారాన్ని, ఇంధనాన్ని, ఇతర వస్తువుల్ని భద్రపర్చుకున్నట్లు సమయాన్ని భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి ఆదాచేసుకోలేరు. సమయాన్ని ఉపయోగించకుండా దానిని ఆదాచేసేందుకు చేసే ఎలాంటి ప్రయత్నమైనా వ్యర్థమే. మీరు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయి, మిగతా సమయంలో ఏమీ చేయకుండా సమయాన్ని ఆదాచేయడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది? ఆ రోజు ముగిసేసరికి మీరు ఉపయోగించని గంటలన్నీ వృథా అయిపోతాయి.

సమయాన్ని వేగంగా ప్రవహించే పెద్ద నదితో పోల్చవచ్చు. అది ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. మీరు దాన్ని ఆపలేరు, అలాగే ప్రవహిస్తున్న ప్రతీ నీటిబొట్టుని ఉపయోగించలేరు. శతాబ్దాల క్రితం, ప్రజలు నదీ తీరాల్లో టర్బైన్‌లను లేదా నీటిచక్రాలను నిర్మించడం ప్రారంభించారు. వాటి సహాయంతో, వారు ప్రవహించే నీటి నుండి వచ్చే శక్తిని ఉపయోగించి తిరుగటి రాళ్లను, రంపపు మరలను, పంపులను, యాంత్రిక సమ్మెటలను నడిపేవారు. అదేవిధంగా, మీరు సమయాన్ని ఆదాచేయలేరు కానీ దాన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే, అలా చేయాలంటే, మీ సమయాన్ని దోచుకొనే రెండు ముఖ్యమైన కారకాల్ని మీరు అధిగమించాల్సి ఉంటుంది. మొదటిది, పనులు వాయిదా వేయడం, దానిలాంటిదే మరొకటి, అనవసర వస్తువులను ఉంచుకోవడం. మనం ముందుగా పనులు వాయిదా వేయడమనే విషయాన్ని పరిశీలిద్దాం.

పనులు వాయిదా వేయకండి

మీరు నేడు చేయగలిగే పనుల్ని రేపటికి ఎన్నడూ వాయిదా వేయకండి అని ఒక సుపరిచిత లోకోక్తి చెబుతోంది. అయితే, కొందరు దాన్ని మార్చి ఇలా అనాలనుకుంటారు, మీరు వచ్చేవారం వరకు వాయిదా వేయగల పనులను ఎన్నడూ రేపటికి వాయిదా వేయకండి. కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునేందుకు వాయిదా వేయడమనే సులువైన మార్గాన్ని వారు ఎంచుకుంటారు. “వాయిదా వేయడం” అంటే “పనులను అలవాటు ప్రకారం, కావాలని వాయిదా వేయడం; చేయాల్సిన పనులను కావాలని వాయిదా వేయడం” అని అర్థం. పనులు వాయిదా వేసేవారికి అదొక అలవాటుగా మారుతుంది. ఒత్తిడి పెరిగేకొద్దీ అతను ఆ పనిని వాయిదా వేసి, మళ్ళీ తనపై ఒత్తిడి పెరిగేంతవరకు తనకు క్రొత్తగా దొరికిన “ఖాళీ సమయంలో” ఎంతో ఉల్లాసంగా గడుపుతాడు.

కొన్ని సందర్భాల్లో, మన మానసిక లేదా శారీరక పరిస్థితులవల్ల కొంత పనిని లేక మొత్తం పనిని వాయిదా వేయాల్సి వస్తుంది. అంతేకాక, రోజూవారీ జీవితం నుండి ప్రతీ ఒక్కరికీ అప్పుడప్పుడూ తీరిక అవసరమే. దేవుని కుమారునికి కూడా అలాంటి విశ్రాంతి అవసరమయ్యింది. యేసు పరిచర్యలో పూర్తిగా నిమగ్నమై ఉండేవాడు, అయితే తన కోసం తన శిష్యులకోసం తీరిక దొరికేలా చూసేవాడు. (మార్కు 6:​31, 32) అలాంటి విశ్రాంతి ప్రయోజనకరం. అయితే, పనులు వాయిదా వేయడమనేది దానికి చాలా భిన్నమైనది; అది తరచూ హానికరం. ఒక ఉదాహరణ పరిశీలించండి.

ఒక టీనేజ్‌ విద్యార్థి మూడు వారాల గడువులో లెక్కల పరీక్షకు సిద్ధపడాలి. ఆమె చాలా పుస్తకాలను, నోట్సును మళ్ళీ చదువుకోవాలి. ఆమె ఒత్తిడికి గురౌతుంది. అయితే, పరీక్షల కోసం సిద్ధపడడాన్ని వాయిదా వేయడం సులువుగా అనిపించి, దాన్ని వాయిదా వేస్తుంది. చదివే బదులు ఆమె టీవీ చూస్తుంది. పరీక్ష పాస్‌ అయ్యేందుకు అవసరమైన సిద్ధపాటును ఆమె రోజుల తరబడి వాయిదా వేస్తుంది. ఇక పరీక్ష వ్రాయాల్సిన ముందు రోజు రాత్రంతా కూర్చొని ఒకేసారి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టేబుల్‌ ముందు కూర్చొని తను చదవాల్సిన పుస్తకాలను, నోట్స్‌లను చదవడం మొదలుపెడుతుంది.

గంటలు గడిచిపోతాయి. మిగతా కుటుంబీకులంతా నిద్రిస్తుంటే ఆమె మాత్రం వేరే దారిలేక సమీకరణలు, కోటిజ్యాలను, వర్గాలను కంఠతాః పట్టే కష్టమైన, ఎంతో దీర్ఘమైన పనిలో నిమగ్నమౌతుంది. మరుసటి రోజు స్కూల్లో, అలసిపోయిన మెదడుతో ప్రశ్నలకు జవాబులు వ్రాయడానికి తంటాలు పడుతుంది. పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చి, ఆ సంవత్సరం ఆమె ఫెయిలవుతుంది. ఆమె ఆ పాఠ్య పుస్తకాలన్నీ మళ్ళీ చదవాలి, ఆమె పైతరగతికి ప్రమోట్‌ చేయబడదు.

పనులు వాయిదా వేయడం వల్ల ఆ విద్యార్థి ఎంతో నష్టపోయింది. ప్రజలు, ఆమెకు ఎదురైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోకుండా ఉండేందుకు వారికి ఒక బైబిలు సూత్రం సహాయం చేయగలదు. “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 5:⁠15) ఆధ్యాత్మిక విషయాలపట్ల శ్రద్ధ వహించడానికి క్రైస్తవులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రైస్తవులను పౌలు ప్రోత్సహించాడు, అయితే ఆ సూత్రం జీవితంలోని అనేక ప్రాముఖ్య కార్యకలాపాల్లో సహాయం చేయగలదు. ఒక పని ఎప్పుడు చేయాలో సాధారణంగా మనమే నిర్ణయించుకోవచ్చు కాబట్టి, “అత్యంత అనుకూలమైన” సమయంలో దాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను చవిచూడడమే కాక, ఆ పనిని త్వరగా ముగించగలుగుతాము కూడా. ఆ లేఖనం చూపిస్తున్నట్లుగా అది “జ్ఞానుల” లక్షణం.

ఆ యౌవన విద్యార్థి లెక్కల పరీక్ష కోసం చదువుకోవడానికి “అత్యంత అనుకూలమైన సమయం” ఏది? బహుశా ప్రతీరోజు సాయంత్రం ఇంచుమించు 15 నిమిషాలు వెచ్చించి ఆమె క్రమంగా ఆ సమాచారాన్ని చదువుకోవచ్చు. అలా చేస్తే, పరీక్షకు ముందు రోజు రాత్రి, నిద్రపోవాల్సిన సమయంలో గంటల తరబడి చదవాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురవ్వదు. పరీక్ష రోజున ఆమె చురుకుగా, పూర్తిగా సిద్ధపడి ఉంటుంది, మంచి మార్కులు తెచ్చుకుంటుంది.

కాబట్టి, మీకొక పని ఇవ్వబడినప్పుడు, దానికి “అత్యంత అనుకూలమైన సమయం” ఏదో నిర్ణయించుకుని దాన్ని చేయండి. అప్పుడే మీరు పనులు వాయిదా వేసే ఉరిని, దాని పర్యవసానాలను తప్పించుకుంటారు. చక్కగా పూర్తి చేసిన పని మీకు సంతృప్తిని కూడా ఇస్తుంది. క్రైస్తవ సంఘంలోని నియామకాల్లాంటివి అంటే ఇతరుల్ని ప్రభావితం చేసే పనులు మీరు చేస్తుంటే అలా చేయడం చాలా ప్రాముఖ్యం.

అనవసరమైనవాటిని తొలగించండి

ముందు ప్రస్తావించబడినట్లుగా, మన విలువైన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొనేందుకు అధిగమించాల్సిన రెండవ కారకం అనవసరమైనవాటిని ఉంచుకోవడం. వస్తువుల్ని ఉపయోగించడానికి, వాటిని సర్దుకోవడానికి, శుభ్రం చేయడానికి, భద్రపర్చుకోవడానికి, వాటిని చూసుకోవడానికి సమయం పడుతుందని మనందరికీ తెలుసు. వస్తువులు ఎంత ఎక్కువగా ఉంటే వాటికి అంత ఎక్కువ సమయం వెచ్చించాలి. ఖాళీ స్థలాలున్న అనవసర సామగ్రిలేని గదికన్నా సామానుతో నిండివున్న గదిలో లేదా ఇంట్లో పని చేయడం చిరాకుగా ఉంటుంది, దానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక, గదిలో సామాను పెరిగే కొద్దీ, మీకు కావాల్సిన వస్తువు వెతుక్కోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.

ప్రజలు శుభ్రం చేయడానికి వెచ్చించే సమయంలో దాదాపు సగంవరకు “వస్తువుల్ని తీయడానికి, గదిలో అటూ ఇటూ తిరగడానికి, చిందరవందరగా పడివున్న వస్తువులు కాళ్ళకు అడ్డుపడకుండా తొలగించడానికి” వృథా అవుతుందని హౌస్‌కీపింగ్‌ నిపుణులు చెబుతున్నారు. జీవితంలోని ఇతర విషయాల్లో కూడా అలాంటి పరిస్థితే ఉండవచ్చు. కాబట్టి, మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటే మీ పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించండి. అనవసర వస్తువులు స్థలాన్ని ఆక్రమించుకున్నాయా, మీరు గదిలో తిరగడానికి అడ్డుగా ఉన్నాయా, అన్నింటికి మించి అవి మీ సమయాన్ని వృథా చేస్తున్నాయా? అలాగైతే, అనవసరమైనవాటిని తొలగించండి.

అనవసర వస్తువుల్ని తొలగించడం సులభం కాకపోవచ్చు. అవసరం లేకపోయినా మనకు ఇష్టమైన వస్తువుల్ని పడేయడం, మంచి స్నేహితుణ్ణి వదులుకున్నంత దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి ఒక వస్తువును ఉంచాలో పడేయాలో మీరు ఎలా నిర్ణయించుకోవచ్చు? కొందరు ఒక నియమాన్ని పాటిస్తారు. మీరు ఒక వస్తువును సంవత్సరం వరకు ఉపయోగించకపోతే దాన్ని పడేయండి. ఒక సంవత్సరం గడిచినా దాన్ని పడేయడానికి మీకు మనసొప్పకపోతే అప్పుడేమిటి? దాన్ని మరో ఆరు నెలల వరకు అటకపై పెట్టండి. మీరు దాన్ని మళ్ళీ చూసి, సంవత్సరమున్నర గడిచినా మీరు దాన్ని ఉపయోగించలేదని గ్రహించినప్పుడు దాన్ని పడేయడం మీకు సులువౌతుంది. ఏదేమైనా, మీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, అనవసర వస్తువులను తొలగించి, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే.

అనవసరమైనవి ఒక వ్యక్తి ఇంటికి లేదా ఉద్యోగ స్థలానికి మాత్రమే పరిమితం కాదు. దేవుని “వాక్యమును అణచివేసి,” సువార్త విషయంలో ఒక వ్యక్తిని ‘నిష్ఫలుడిని’ చేసే “ఐహికవిచారమును ధనమోసము” గురించి యేసు చెప్పాడు. (మత్తయి 13:​22) ఒక వ్యక్తి జీవితం అనేక అనవసర కార్యకలాపాలతో, లక్ష్యాలతో ఎంతగా నిండిపోవచ్చంటే, అన్నింటికన్నా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక దినచర్యను, సమతూకాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సమయాన్ని కనుగొనడానికి ఆయనకు కష్టమౌతుంది. పర్యవసానంగా ఆయన ఆధ్యాత్మికంగా నష్టపోవడమేకాక, నిజంగా సంతృప్తినిచ్చే, ఉల్లాసకరమైన పనులు చేయడానికి కావల్సినంత సమయం దొరికే దేవుని వాగ్దత్త నూతనలోకంలో ప్రవేశించే ఉత్తరాపేక్షను చివరకు పూర్తిగా చేజార్చుకునే అవకాశం ఉంది.​—⁠యెషయా 65:17-24; 2 పేతురు 3:​13.

మీరు ఖచ్చితంగా చేయాలనుకునే పనులకు అంటే మీ ఉద్యోగానికి, ఇంటికి, వాహనానికి, వ్యాపకాలకు, విహారయాత్రలకు, వ్యాయామానికి, పార్టీలకు, లేదా ఇతర కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించడానికి మీరు ఎల్లప్పుడూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అలాగైతే, ఆధ్యాత్మిక విషయాలకు మరింత సమయాన్ని కేటాయించగలిగేలా అనవసరమైనవాటిని ఎలా తగ్గించవచ్చో ఆలోచించడానికి ఇప్పుడే అనువైన సమయంకావచ్చు.

కాలమైనా, కెరటమైనా ఎవ్వరికోసమూ ఆగవు అని మరో సుపరిచిత సామెత చెబుతోంది. నిజంగానే, సమయం నీటి ప్రవాహంలా ఆగకుండా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దాన్ని ఎవరూ వెనక్కి తిప్పలేరు లేదా ఆదాచేయలేరు, ఒకసారి చేజారిపోయిందంటే అది శాశ్వతంగా పోయినట్లే. అయితే, కొన్ని సరళమైన బైబిలు సూత్రాలను పాటించి కొన్ని ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మన శాశ్వత ప్రయోజనం కోసం అవసరమైన “శ్రేష్ఠమైన కార్యములను” చేయడానికి, “దేవునికి మహిమయు స్తోత్రమును కలుగ”జేయడానికి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠9.

[8, 9వ పేజీలోని చిత్రం]

వేగంగా ప్రవహించే నీటిని ఉపయోగించినట్లే సమయాన్ని కూడా మంచి కార్యాలకు ఉపయోగించవచ్చు

[9వ పేజీలోని చిత్రం]

ఆమె పరీక్షకు చదువుకోవడానికి ఏది “అత్యంత అనుకూలమైన సమయం?”

[10వ పేజీలోని చిత్రం]

అనవసర వస్తువులతో నిండివున్న గదిలో పని చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది, చిరాకుగా ఉంటుంది