బొచ్చు చొక్కా, ఆధ్యాత్మికత
బొచ్చు చొక్కా, ఆధ్యాత్మికత
ఫ్రాన్స్ రాజైన లూయిస్ IX, బొచ్చు చొక్కా వేసుకునేవాడు. సర్ థామస్ మోర్ యౌవనంలో న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు, బొచ్చు చొక్కా వేసుకోవడంవల్ల నెలల తరబడి ప్రతీరోజు 19 లేదా 20 గంటలు మెలకువగా ఉండగలిగేవాడు. ఆయన దాదాపు తన జీవితమంతా ఆ చొక్కాను వేసుకున్నాడని చెప్పబడుతుంది. క్యాంటర్‌బరీ ఆర్చ్ బిషప్ అయిన థామస్ బెకెట్, క్యాంటర్‌బరీ కెథడ్రెల్‌లో హత్యచేయబడినప్పుడు, ఎవరూ ఊహించని విధంగా ఆయన అంగీ లోపల బొచ్చుతో చేసిన చొక్కా, లోదుస్తులు వేసుకుని ఉన్నట్లు వెల్లడైంది. ఈ చారిత్రాత్మక వ్యక్తుల్లో ఉన్న సారూప్యత ఏమిటి? వారు బొచ్చు చొక్కా వేసుకోవడం ద్వారా తమ శరీరాన్ని హింసించుకొని తమ కోరికలను, వాంఛలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించారు.
మేక బొచ్చుతో తయారుచేయబడిన ఈ బొచ్చు చొక్కా గరుకుగా ఉండేది. శరీరానికి చిరాకు పుట్టించడానికి, గుచ్చుకుంటూ ఎంతో అసౌకర్యాన్ని కల్గించడానికి దాన్ని వేసుకునేవారు. ఆ చొక్కా పేలు పట్టే స్థలంగా కూడా మారుతుంది. థామస్ బెకెట్ బొచ్చు చొక్కాతోపాటు బొచ్చుతో చేసిన లోదుస్తులను “పేలు పట్టేంతవరకు” వేసుకునేవాడని చెప్పబడుతుంది. 16వ శతాబ్దం తర్వాత, కొన్ని సందర్భాల్లో మేకబొచ్చుకు బదులు, మొనదేలిన సన్నతీగెలను ఒంటికి గుచ్చుకునే చొక్కాలా వేసుకునేవారు. అలా తయారుచేసిన చొక్కాను వేసుకోవడం మరింత అసౌకర్యంగా ఉండేది.
ఒక నిఘంటువు చెబుతున్న ప్రకారం బొచ్చు చొక్కా వేసుకోవడంలోగల ఉద్దేశం, కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగించబడిన ఇతర పద్ధతుల్లాగే “దేవుణ్ణి మరింత సంతోషపెట్టే జీవన విధానాన్ని వృద్ధిచేసుకోవడాన్ని ప్రోత్సహించేలా పాపపు కోరికలను అణచుకోవడమే.” సన్యాసులు మాత్రమే కాక మంచి హోదాలో ఉన్నవారితోపాటు సాధారణ ప్రజలు కూడా ఆ బొచ్చు చొక్కాను వేసుకునేవారు. నేడుకూడా కొన్ని మతవర్గాలు బొచ్చు చొక్కా వేసుకునే ఆచారాన్ని పాటిస్తున్నాయి.
ఒక వ్యక్తి బొచ్చు చొక్కా వేసుకున్నంత మాత్రాన లేదా భౌతిక అవసరాలు లేకుండా చేసుకున్నంత మాత్రాన ఆధ్యాత్మిక వ్యక్తి కాగలడా? కాలేడు, ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అలాంటి ఆచారాలమీద ఆధారపడిలేదు. నిజానికి, అపొస్తలుడైన పౌలు అలాంటి ‘దేహశిక్షను’ ఖండించాడు. (కొలొస్సయులు 2:23) * బదులుగా, నిజమైన ఆధ్యాత్మికత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి దాన్ని జీవితంలో అన్వయించుకొని ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా వస్తుంది.
[అధస్సూచి]
^ పేరా 5 ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారంకోసం తేజరిల్లు!, నవంబరు 8, 1997 “బైబిలు ఉద్దేశం: జ్ఞానానికి సన్యాసమే కీలకమా?” అనే శీర్షికను చూడండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
పైన లూయిస్ IX రాజు, పైన: Great Men and Famous Women అనే పుస్తకం నుండి; థామస్ బెకెట్, మధ్యలో: Ridpath’s History of the World (Vol. IV) అనే పుస్తకం నుండి; సర్ థామస్ మోర్, క్రింద: Heroes of the Reformation, 1904 అనే పుస్తకం నుండి.