కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు భయపడండి —సంతోషంగా ఉండండి

యెహోవాకు భయపడండి —సంతోషంగా ఉండండి

యెహోవాకు భయపడండి—⁠సంతోషంగా ఉండండి

“యెహోవాయందు భయభక్తులుగలవాడు . . . ధన్యుడు.”​—⁠కీర్తన 112:⁠1.

ధన్యతను లేదా సంతోషాన్ని సులభంగా సంపాదించుకోలేం. సరైన నిర్ణయాలు తీసుకోవడంపై, సరైనది చేయడంపై, తప్పు చేయకుండా ఉండడంపై నిజమైన సంతోషం ఆధారపడివుంటుంది. మన సృష్టికర్తయైన యెహోవా, మనమెలా శ్రేష్ఠమైన జీవితాన్ని ఆనందించవచ్చో బోధించేందుకు మనకు తన వాక్యమైన బైబిలును ఇచ్చాడు. యెహోవా నిర్దేశం కోసం వేడుకొని, దానిని అనుసరిస్తూ దేవుని భయం కనబరిస్తే మనం నిజమైన సంతుష్టిని, సంతోషాన్ని అనుభవించవచ్చు.​—⁠కీర్తన 23:1; సామెతలు 14:​26.

2 ఈ ఆర్టికల్‌లో మనం, యథార్థమైన దేవుని భయం తప్పుచేసే శోధనను అధిగమించి సరైనది చేసేలా ఒక వ్యక్తికి ఎలా ధైర్యాన్నిస్తుందో చూపించే బైబిల్లోని ఉదాహరణలను, ఆధునిక ఉదాహరణలను పరిశీలిస్తాం. రాజైన దావీదు సరిదిద్దుకోవలసి వచ్చినట్లే, తప్పుడు మార్గాన్ని సరిదిద్దుకునేందుకు మనల్ని పురికొల్పడం ద్వారా దేవుని భయం మనకెలా సంతోషాన్ని తీసుకురాగలదో మనం చూస్తాం. యెహోవా భయమనేది తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించగల అమూల్యమైన వారసత్వమని కూడా మనం చూస్తాం. అవును, దేవుని వాక్యం మనకిలా హామీ ఇస్తోంది: “యెహోవాయందు భయభక్తులుగలవాడు . . . ధన్యుడు.”​—⁠కీర్తన 112:⁠1.

కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందడం

3 ముందరి ఆర్టికల్‌లో పరిశీలించిన ప్రకారం, దావీదు మూడు ప్రత్యేక సందర్భాల్లో సరైన దేవుని భయం చూపించలేకపోవడంవల్ల పాపం చేశాడు. అయినప్పటికీ యెహోవా ఇచ్చిన క్రమశిక్షణకు స్పందించడం, ఆయన నిజానికి దైవభయంగల వ్యక్తని చూపించింది. దేవునిపట్ల ఆయనకున్న పూజ్యభావం, గౌరవం ఆయన తన తప్పు ఒప్పుకొని, తన మార్గాన్ని సరిదిద్దుకొని యెహోవాతో మంచి సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకునేందుకు ఆయనను పురికొల్పాయి. ఆయన దోషాలు ఆయనకు, ఇతరులకు బాధలు తీసుకొచ్చినా, ఆయన చూపించిన యథార్థమైన పశ్చాత్తాపం యెహోవా నిరంతర మద్దతును, ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. దావీదు ఉదాహరణ, నేడు ఘోరమైన పాపంలో బహుశా చిక్కుకోగల క్రైస్తవుల్లో ధైర్యాన్ని నింపుతుంది.

4 జోన్యా విషయమే తీసుకోండి. * జోన్యా పూర్తికాల సువార్తికురాలిగా సేవచేస్తున్నా, చెడు సహవాసం చేసి క్రైస్తవ విరుద్ధ ప్రవర్తనకు పాల్పడింది, ఫలితంగా ఆమె క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడాల్సి వచ్చింది. చివరకు తన తప్పు తెలుసుకున్న జోన్యా యెహోవాతో తన సంబంధాన్ని సరిదిద్దుకునేందుకు అవసరమైనవన్నీ చేసింది. కొద్దికాలానికి ఆమె తిరిగి సంఘంలోకి చేర్చుకోబడింది. ఈ సమయమంతటిలో జోన్యా యెహోవా సేవచేయాలనే తన అభిలాషను ఎన్నడూ వదులుకోలేదు. చివరకు ఆమె మళ్లీ పూర్తికాల పయినీరు పరిచర్యలో ప్రవేశించింది. ఆ తర్వాత, ఆమె ఆదర్శవంతుడైన ఒక క్రైస్తవ పెద్దను పెళ్ళి చేసుకుని, ఆయనతోపాటు ఇప్పుడు సంఘంలో సంతోషంగా సేవచేస్తోంది. జోన్యా తాత్కాలికంగా క్రైస్తవ మార్గం నుండి తొలగిపోయినందుకు బాధపడుతున్నా, సంఘంలోకి తిరిగి వచ్చేలా దేవుని భయం తనకు సహాయం చేసినందుకు ఆమె సంతోషంగా ఉంది.

పాపం చేయడంకన్నా శ్రమ అనుభవించడమే మేలు

5 ఘోరమైన పాపం చేయకుండా దేవుని భయం ఒక వ్యక్తికి తోడ్పడడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దావీదు విషయంలో అదే జరిగింది. ఒక సందర్భంలో దావీదును వెంటాడుతున్న సౌలు మూడువేలమంది సైనికులతో ఒక గుహలో ప్రవేశించాడు, దావీదు ఆయన జనులు కూడా ఆ గుహలోనే ఉన్నారు. సౌలును హతమార్చమని దావీదు జనులు దావీదును తొందరపెట్టారు. యెహోవా దావీదు చేతికి ప్రమాదకర శత్రువును అప్పగించడం లేదా? చప్పుడవకుండా దావీదు సౌలును సమీపించి, అతని పైవస్త్రపు చెంగును కత్తిరించాడు. దావీదు దేవునికి భయపడ్డాడు కాబట్టి, హానికరంకాని ఆ పనికూడా ఆయన మనస్సాక్షిని బాధించింది. కోపంతోవున్న తన జనులను అడ్డగించి వారితో ఇట్లన్నాడు: “యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను.” *​—⁠1 సమూయేలు 24:​1-7.

6 మరో సందర్భంలో, సౌలు అతని దండు రాత్రి విడిది చేసినప్పుడు, అతనికి ఆ సైనికులందరికి ‘యెహోవా గాఢనిద్ర కలిగించాడు.’ దావీదు, సాహసియైన ఆయన అల్లుడు అబీషై ఆ దండు మధ్యలోకి మెల్లగా ప్రవేశించి సరిగ్గా సౌలు పడుకున్న చోటుకు చేరుకున్నారు. అబీషై సౌలును అక్కడికక్కడే చంపాలనుకున్నాడు. కానీ దావీదు అబీషైని వారిస్తూ ఇలా అన్నాడు: “యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?”​—⁠1 సమూయేలు 26:​9, 12.

7 రెండుసార్లు తనకు అవకాశమొచ్చినా దావీదు సౌలును ఎందుకు చంపలేదు? ఎందుకంటే ఆయన సౌలుకన్నా యెహోవాకే ఎక్కువ భయపడ్డాడు. దేవునిపట్ల సరైన భయం ఉండడంవల్ల, దావీదు పాపం చేయడంకన్నా అవసరమైతే శ్రమ అనుభవించడానికే సిద్ధపడ్డాడు. (హెబ్రీయులు 11:​24) యెహోవాకు తనపట్ల, తన ప్రజలపట్ల శ్రద్ధవుందనే పూర్తి నమ్మకం ఆయనకు ఉంది. దేవునికి విధేయులుగా ఉండి ఆయనపై నమ్మకముంచడం సంతోషాన్ని, అనేక ఆశీర్వాదాల్ని తెస్తుందని, దానికి భిన్నంగా దేవుణ్ణి అలక్ష్యం చేస్తే తాను దేవుని అనుగ్రహం కోల్పోతానని దావీదుకు తెలుసు. (కీర్తన 65:⁠4) అంతేకాక, దేవుడు దావీదును రాజుగా చేస్తాననే తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని, తన నిర్ణయకాలంలో తన పద్ధతిలో సౌలును తొలగిస్తాడని కూడా ఆయనకు తెలుసు.​—⁠1 సమూయేలు 26:​10.

దేవునికి భయపడడం సంతోషాన్నిస్తుంది

8 క్రైస్తవులుగా మనం అపహాస్యాన్ని, హింసను, ఇతర పరీక్షలను ఎదుర్కోవచ్చు. (మత్తయి 24:⁠9; 2 పేతురు 3:⁠3) కొన్నిసార్లు మనం తోటి ఆరాధకుల నుండి కూడా కష్టాలు ఎదుర్కోవచ్చు. అయితే, యెహోవా అన్నీ చూస్తున్నాడని, మన ప్రార్థనలు వింటున్నాడని సరైన సమయంలో తన చిత్తానుసారంగా అన్నీ సరిదిద్దుతాడని మనకు తెలుసు. (రోమీయులు 12:17-21; హెబ్రీయులు 4:​16) కాబట్టి, మన వ్యతిరేకులకు భయపడే బదులు మనం దేవునికి భయపడి మన విడుదల కోసం ఆయనవైపు చూస్తాం. దావీదులా మనమే స్వయంగా పగతీర్చుకోం లేదా శ్రమను తప్పించుకునేందుకు నీతి సూత్రాల విషయంలో రాజీపడం. చివరికి అది సంతోషాన్నిస్తుంది. ఎలా?

9 ఆఫ్రికాలో చాలాకాలం సేవచేసిన ఒక మిషనరీ ఇలా వివరిస్తున్నాడు: “తమ క్రైస్తవ తటస్థత కారణంగా రాజకీయ పార్టీ కార్డులు కొనడానికి నిరాకరించిన ఒక తల్లి, ఆమె యౌవన కుమార్తె ఉంచిన మాదిరి నాకు గుర్తొస్తుంది. ఒక గుంపు ప్రజలు వారిమీదపడి క్రూరంగా కొట్టి ఆ తర్వాత ఇంటికి పొమ్మని చెప్పారు. వారలా వెళ్తున్నప్పుడు, ఇదంతా ఎందుకు జరిగిందో అర్థంకాక ఏడుస్తున్న తన కూతుర్ని ఓదార్చేందుకు తల్లి ప్రయత్నించింది. ఆ క్షణంలో వారు ఆనందించలేదు, కానీ వారి మనస్సాక్షి నిర్మలంగా ఉంది. ఆ తర్వాత, వారు తాము దేవునికి విధేయులుగా ఉన్నందుకు చాలా సంతోషించారు. వారొకవేళ ఆ పార్టీ కార్డులు కొనివుంటే, ఆ గుంపు ప్రజలు ఎంతో సంతోషించేవారే. ఆ మనుష్యులు వారికి శీతల పానీయాలు ఇచ్చి వారి చుట్టూ డ్యాన్సు వేస్తూ ఇంటిదాకా వచ్చివుండేవారు. అయితే తాము రాజీపడినట్లు ఆ తల్లీకూతుళ్లకు తెలిస్తే వారు ఎంతో బాధపడేవారు.” ఆ భయంకరమైన బాధనుండి దేవుని భయం వారిని తప్పించింది.

10 జీవానికున్న పవిత్రతను గౌరవించడానికి సంబంధించిన పరీక్షలు ఎదురైనప్పుడు కూడా దైవభయం కనబర్చడంవల్ల సంతోషం కలుగుతుంది. మేరీ మూడవ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు వైద్యుడు ఆమెను గర్భస్రావం చేయించుకొమ్మని బలవంతపెట్టాడు. “మీ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మీకు ఏ సమయంలోనైనా ప్రమాదం ఏర్పడి 24 గంటల్లోనే మీరు చనిపోవచ్చు. ఆ తర్వాత బిడ్డకూడా మరణిస్తుంది. ఏదేమైనా బిడ్డ సాధారణ శిశువుగా జన్మిస్తుందన్న గ్యారంటీ ఏమీలేదు” అని ఆయన చెప్పాడు. మేరీ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తోంది, అయితే అప్పటికి ఆమె ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. “అయినాసరే నేను యెహోవాను సేవించడానికే నిర్ణయించుకుని, ఏమి జరిగినా సరే ఆయనకే లోబడాలని నేను నిర్ణయించుకున్నాను” అని మేరీ చెబుతోంది.​—⁠నిర్గమకాండము 21:​22, 23.

11 మేరీ గర్భిణిగా ఉన్న సమయంలో బైబిలు అధ్యయనంలో, తన కుటుంబంపట్ల శ్రద్ధ చూపించే పనిలో నిమగ్నమైంది. చివరికామె బాబుకు జన్మనిచ్చింది. “మొదటి రెండు కాన్పులకన్నా ఈ సారి కాస్త ఎక్కువ కష్టమైంది, అయినా పెద్ద ఇబ్బందేమీ కలుగలేదు” అని మేరీ వివరిస్తోంది. దేవునికి భయపడడం మేరీకి నిర్మలమైన మనస్సాక్షిని ఇవ్వడమే కాక, ఆ తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకునేందుకు దోహదపడింది. ఆ బాబు పెద్దవాడైనప్పుడు, ఆయన కూడా యెహోవాకు భయపడడాన్ని నేర్చుకున్నాడు. ఆయనిప్పుడు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానిలో సేవచేస్తున్నాడు.

‘యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకోండి’

12 యెహోవాపట్ల దావీదుకున్న భయం తప్పుచేయకుండా మాత్రమే ఆయనను అడ్డగించలేదు. అది కష్ట పరిస్థితుల్లో నిర్ణయాత్మకంగా, జ్ఞానయుక్తంగా చర్య తీసుకునేందుకు కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. సంవత్సరం నాలుగు నెలలపాటు, దావీదు ఆయన జనులు సౌలుకు దూరంగా ఫిలిష్తీయ గ్రామమైన సిక్లగులో ఆశ్రయం పొందారు. (1 సమూయేలు 27:​5-7) ఒకానొక సందర్భంలో పురుషులు ఊర్లో లేని సమయంలో అమాలేకీయులు దండెత్తివచ్చి ఆ గ్రామాన్ని తగులబెట్టి, వారి భార్యల్ని, పిల్లల్ని, పశువుల మందల్ని తీసుకెళ్లారు. తిరిగివచ్చి జరిగింది చూసి దావీదు, ఆయన జనులు ఏడ్చారు. ఆ దుఃఖం కొంతసేపటికి కోపంగా మారి దావీదును రాళ్లతో కొట్టి చంపుదామని ఆయన జనులు చెప్పుకున్నారు. దావీదు కృంగిపోయినా, నిరాశపడలేదు. (సామెతలు 24:​10) దేవునిపట్ల ఆయనకున్న భయం యెహోవాకు ప్రార్థించేలా ఆయనను పురికొల్పడంతో ఆయన ‘యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొన్నాడు.’ దేవుని సహాయంతో దావీదు ఆయన జనులు అమాలేకీయులను జయించి సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నారు.​—⁠1 సమూయేలు 30:1-20.

13 నేడు దేవుని సేవకులు కూడా యెహోవాపై నమ్మకంతో నిర్ణయాత్మక చర్య తీసుకునే ధైర్యం అవసరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. క్రిస్టీనా ఉదాహరణే తీసుకోండి. ఆమె చిన్నప్పుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసింది. పియానో వాయిద్య బృందంలో సభ్యురాలు కావాలనుకొని ఆమె ఆ మేరకు మంచి అభివృద్ధి సాధించింది. అంతేకాక, ప్రకటనా పనిపట్ల తనకున్న బిడియంవల్ల, బాప్తిస్మంతోపాటు వచ్చే బాధ్యతల్ని అంగీకరించేందుకు ఆమె భయపడింది. క్రిస్టీనా దేవుని వాక్య అధ్యయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు, దాని శక్తిని గ్రహించనారంభించింది. ఆమె యెహోవాపట్ల భయమంటే ఏమిటో తెలుసుకొని, తన సేవకులు తనను పూర్ణహృదయంతో, మనసుతో, ఆత్మతో, బలంతో ప్రేమించాలని యెహోవా కోరుతున్నాడని ఆమె గ్రహించింది. (మార్కు 12:​30) యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునేందుకు అది ఆమెను పురికొల్పింది.

14 ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించేందుకు సహాయం చేయమని క్రిస్టీనా యెహోవాకు ప్రార్థించింది. “పియానో వాయిద్య బృంద సభ్యురాలి జీవితమంటే ఎప్పుడూ ప్రయాణాలు చేస్తుండడం, సంవత్సరానికి దాదాపు 400 పాటకచ్చేరీల్లో వాయించే ఒప్పందం చేసుకోవడం ఉంటాయని నాకు తెలుసు. అందువల్ల నన్నునేను పోషించుకోవడానికి టీచర్‌ ఉద్యోగం చేస్తూ, పూర్తికాల పరిచారకురాలిగా సేవచేసేందుకు నిర్ణయించుకున్నాను” అని క్రిస్టీనా వివరిస్తోంది. అప్పటికే క్రిస్టీనా, తన దేశంలోకెల్లా అత్యుత్తమ పాటకచ్చేరీ హాలులో తన మొదటి ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకుంది. “నా మొదటి ప్రదర్శనే నా చివరి ప్రదర్శనైంది” అని ఆమె చెబుతోంది. ఆ తర్వాత క్రిస్టీనా ఒక క్రైస్తవ పెద్దను వివాహం చేసుకుంది. వారిప్పుడు యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లోని ఒకదానిలో సేవచేస్తున్నారు. సరైన నిర్ణయాలు తీసుకునేలా యెహోవా తనకు బలాన్నిచ్చినందుకు, దానివల్ల ఆమె ఇప్పుడు తన సమయాన్ని, శక్తిని ఆయన సేవలో వినియోగించగలుగుతున్నందుకు ఆమె సంతోషిస్తోంది.

అమూల్యమైన వారసత్వం

15 “పిల్లలారా, మీరువచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను” అని దావీదు వ్రాశాడు. (కీర్తన 34:​11) తండ్రిగా దావీదు తన పిల్లలకు అమూల్యమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు, అంటే యథార్థమైన, సమతూకమైన, మేలైన యెహోవా భయాన్ని నేర్పేందుకు నిర్ణయించుకున్నాడు. దావీదు తన మాటల ద్వారా, క్రియల ద్వారా, యెహోవాను క్రూరమైన, భయంకరమైన వ్యక్తిగా, తన నియమాలను ఉల్లంఘించేవారిని వెంటనే తప్పులుపట్టే దేవునిగా వర్ణించలేదుగానీ, ప్రేమగలవానిగా, శ్రద్ధగలవానిగా తన భూసంబంధ పిల్లలను క్షమించే తండ్రిగా వర్ణించాడు. దావీదు “తన పొరపాటులను కనుగొనగలవాడెవడు?” అని అడిగి, ఆ తర్వాత, యెహోవా తదేకంగా మన తప్పులు వెదకడనే తన నమ్మకాన్ని వెల్లడిచేస్తూ ఇంకా ఇలా అన్నాడు: “నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము.” తాను శాయశక్తులా ప్రయత్నించినప్పుడు తన మాటలు, తలంపులు యెహోవాకు ఆమోదయోగ్యం కాగలవని దావీదు నమ్మాడు.​—⁠కీర్తన 19:​12, 14.

16 నేటి తల్లిదండ్రులకు దావీదు ఒక మాదిరిగా ఉన్నాడు. యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానిలో తన తమ్ముడితో కలిసి సేవచేస్తున్న రాల్ఫ్‌ ఇలా చెబుతున్నాడు: “సత్యంలో ఉండడం ఆనందకరమని తలంచేలా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. మా చిన్నతనంలో, సంఘ కార్యకలాపాల గురించి మాట్లాడుకునేటప్పుడు మమ్మల్ని కూడా చేర్చేవారు, అలా సత్యంపట్ల వారు చూపించిన ఉత్సాహాన్నే మేమూ చూపించాం. యెహోవా సేవలో మేము మేలైన పనులు చేయగలమనే నమ్మకం మాలో కలిగేలా వారు మమ్మల్ని పెంచారు. నిజానికి, మా కుటుంబం రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న దేశంలో నివసిస్తూ కొత్త సంఘాలు స్థాపించడంలో సహాయం చేసింది.

17 “మా తల్లిదండ్రులకు యెహోవా నిజమైన వ్యక్తిగా, ఎంతో దయాపరునిగా, మంచివానిగా ఉన్నాడన్న వాస్తవమే మమ్మల్ని సరైన మార్గంలో పెట్టిందిగానీ, కఠినమైన నియమాలు కాదు. వారు యెహోవాను మరింత తెలుసుకొని ఆయనను సంతోషపెట్టేందుకు కృషిచేశారు, మేము దేవునిపట్ల వారికున్న నిజమైన భయం నుండి, ప్రేమ నుండి ఎంతో తెలుసుకున్నాం. మేము ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా, యెహోవా మమ్మల్ని ఇక ఏ మాత్రం ప్రేమించడం లేదన్న భావం కలిగించలేదు; లేదా వారు కోపంతో మాపై అనవసర ఆంక్షలు విధించలేదు. ఎక్కువ సమయం వారు మాతో ప్రశాంతంగా మాట్లాడేవారు, అమ్మయితే కొన్నిసార్లు కన్నీళ్లతో, మా హృదయాన్ని స్పర్శించేందుకు ప్రయత్నించేది. వారి ప్రయత్నాలు ఫలించాయి. మా తల్లిదండ్రుల మాటలనుండి, క్రియలనుండి యెహోవాకు భయపడడం శ్రేష్ఠమని, ఆయన సాక్షుల్లో ఒకరిగా ఉండడం భారం కాదుగానీ, సంతోషానందాలు తెస్తుందని తెలుసుకున్నాం.”—1 యోహాను 5:3.

18 “దావీదు రచించిన చివరి మాటలు” ఇలా ఉన్నాయి: ‘మనుష్యులను ఏలు నొకడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలినప్పుడు, అది ఉదయకాలపు సూర్యోదయ కాంతివలె ఉండును.’ (2 సమూయేలు 23:1, 3, 4) దావీదు కుమారుడు, రాజ్యానికి వారసుడైన సొలొమోను ఆ మాటలు ఎంత జ్ఞానవంతమైనవో గ్రహించాడనేది స్పష్టం, ఎందుకంటే ఆయన తనకు ‘వివేకముగల హృదయము, మంచిచెడ్డలు వివేచించే’ సామర్థ్యం తనకు అనుగ్రహించమని యెహోవాను వేడుకున్నాడు. (1 రాజులు 3:9) యెహోవాపట్ల భయం జ్ఞానాన్ని, సంతోషాన్ని ఇస్తాయని సొలొమోను గుర్తించాడు. ఆ తర్వాత ఆయన ప్రసంగి పుస్తకాన్ని ఈ సారాంశంతో ముగించాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.” (ప్రసంగి 12:13, 14) మనం ఆ హితవును లక్ష్యపెట్టినప్పుడు, ‘యెహోవాయందు భయభక్తులతో ఉండడంవల్ల, వినయంతో’ ఉండడంవల్ల జ్ఞానం, సంతోషం మాత్రమే కాక, “ఐశ్వర్యమును ఘనతయు జీవము” కూడా లభిస్తాయని తెలుసుకుంటాం.—సామెతలు 22:4.

19 సరైన దేవుని భయం యెహోవా నిజ సేవకుల జీవితాల్లో సానుకూల పాత్ర పోషిస్తుందని బైబిలు ఉదాహరణల నుండి, ఆధునిక అనుభవాల నుండి మనం చూశాం. అలాంటి భయం మన పరలోకపు తండ్రికి అయిష్టమైనది చేయకుండా మనల్ని ఆపడమే కాక, మన శత్రువులను ఎదుర్కొనే ధైర్యాన్ని, మనకొచ్చే పరీక్షల్ని, బాధల్ని సహించే బలాన్ని కూడా మనకిస్తుంది. కాబట్టి యౌవనులమైనా, వృద్ధులమైనా మనమందరం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, మనం తెలుసుకున్నవి ధ్యానించడానికి, క్రమంగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ యెహోవాకు సన్నిహితమవడానికి పట్టుదలతో కృషిచేద్దాం. అలా చేయడం ద్వారా, మనం ‘దేవుని గూర్చిన విజ్ఞానమునే’ కాక, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట” అంటే ఏమిటో కూడా గ్రహిస్తాం.—సామెతలు 2:1-5.

[అధస్సూచీలు]

^ పేరా 7 పేరు మార్చబడింది.

^ పేరా 9 కీర్తనలు 57 మరియు 142లను కూర్చేందుకు దావీదును ప్రేరేపించిన అనుభవాల్లో బహుశా ఇదొకటి కావచ్చు.

మీరు వివరించగలరా?

దేవుని భయం

•ఘోరమైన పాపం నుండి తేరుకునేలా ఒక వ్యక్తికి ఎలా సహాయం చేయగలదు?

•పరీక్షల్లో, హింసలో సంతోషాన్నెలా ఇవ్వగలదు?

•దేవుని చిత్తం నెరవేర్చేలా మనల్నెలా బలపరచగలదు?

•మన పిల్లలకెలా అమూల్యమైన వారసత్వంగా ఉండగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవా భయం ఏమి తీసుకురాగలదు?

3. తన పాపాల నుండి తేరుకునేందుకు దావీదుకు ఏది సహాయం చేసింది?

4. సంతోషాన్ని తిరిగి పొందేందుకు దేవుని భయం ఒక వ్యక్తికి ఎలా సహాయం చేయగలదు?

5, 6. సౌలు ప్రాణం తీయకుండా దావీదు రెండుసార్లు ఎలా, ఎందుకు ఆపాడో వివరించండి.

7. పాపం చేయకుండా దావీదును ఏమి అడ్డగించింది?

8. ఒత్తిడిలో ఉన్నప్పుడు దావీదు ప్రవర్తనా తీరు ఎలా మాదిరికరంగా ఉంది?

9. హింస ఉన్నప్పటికీ దేవుని భయంవల్ల సంతోషమే కలుగుతుందనడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

10, 11. ఒక స్త్రీ దేవునికి భయపడడంవల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?

12. దేవుని భయం దావీదుకు ఎలా ధైర్యాన్నిచ్చింది?

13, 14. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దేవుని భయం ఒక క్రైస్తవురాలికి ఎలా సహాయం చేసింది?

15. దావీదు తన పిల్లలకు ఏమి ఇవ్వాలని ఇష్టపడ్డాడు, ఆయన దానినెలా ఇచ్చాడు?

16, 17. తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవా భయాన్ని ఎలా నేర్పించవచ్చు?

18. సత్య దేవునికి భయపడడంవల్ల మనకెలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

19. “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట” అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు మనకేది సహాయం చేస్తుంది?

[26వ పేజీలోని చిత్రం]

యెహోవాపట్ల భయం సౌలును చంపకుండా దావీదును ఆపింది

[29వ పేజీలోని చిత్రాలు]

దేవుని భయమనేది తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించగల అమూల్యమైన వారసత్వం