కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక అందమైన ద్వీపంలో ఉత్తేజకరమైన అభివృద్ధి

ఒక అందమైన ద్వీపంలో ఉత్తేజకరమైన అభివృద్ధి

ఒక అందమైన ద్వీపంలో ఉత్తేజకరమైన అభివృద్ధి

తై వాన్‌ను చూడడానికి వచ్చే సందర్శకులు ఆ ద్వీపంలో విస్తరించివున్న పచ్చదనాన్నిబట్టి ఖచ్చితంగా సమ్మోహితులౌతారు. పచ్చని వరిపొలాలు కోతకాలంలో బంగారు రంగులోకి మారతాయి. దట్టమైన అడవులు పర్వతప్రాంతాలను కప్పుతున్నాయి. జనంతో కిక్కిరిసి ఉన్న నగరాలకు భిన్నంగా పొలాల్లో, పర్వతాల్లో ఉన్న ఆ పచ్చదనం నిజంగా ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. వాస్తవానికి, ఆ ద్వీపాన్ని మొదటిసారిగా చూసిన పాశ్చాత్య దేశస్థుడు, ఆ పచ్చదనాన్ని చూసే దానికి ఇల్హా ఫార్మోసా లేక “అందమైన ద్వీపం” అనే పేరు పెట్టేందుకు ప్రేరేపించబడ్డాడు.

తైవాన్‌, కేవలం 390 కిలోమీటర్ల పొడవు, విశాలంగా ఉన్న చోట 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న అందమైన చిన్న ద్వీపం. ద్వీపంలోని చాలా ప్రాంతాల్లో ఎత్తైన పర్వతాలు విస్తరించి ఉన్నాయి. యు శాన్‌ పర్వతం (మారిసన్‌ పర్వతం) జపాన్‌లోని ఫ్యూజీ పర్వతంకన్నా, న్యూజిలాండ్‌లోని కుక్‌ పర్వతంకన్నా ఎత్తైనది. ద్వీపానికి మధ్యలో ఉన్న ఆ పర్వతాల నుండి సముద్రతీరంవరకు ఉన్న ఇరుకైన కోస్తా మైదానాలు ఇప్పుడు 2.2 కోట్లకన్నా ఎక్కువగావున్న జనాభాతో సందడిగా ఉంటాయి.

కొత్త రకమైన అభివృద్ధి

అయితే, తైవాన్‌లో మరో రకమైన అభివృద్ధి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, అది ఆధ్యాత్మిక అభివృద్ధి. సత్యదేవుడైన యెహోవా గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత యౌవనులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ చూపించే ఉత్సాహంలో ఆ అభివృద్ధి కనిపిస్తుంది. యెహోవా గురించి, ఆయన సంకల్పం గురించి తెలుసుకునేందుకు ఇతరులకు సహాయం చేస్తున్న ఉత్సాహవంతుల సంఖ్య పెరగడాన్ని చూడడం నిజంగా ఉత్తేజాన్నిస్తుంది.

జరుగుతున్న అభివృద్ధివల్ల బ్రాంచి కార్యాలయాన్ని విస్తరించాల్సి వచ్చింది. 1990 డిసెంబరులో విశాలమైన యెహోవాసాక్షుల బ్రాంచికార్యాలయం నిర్మించడం కోసం స్థలం కొన్నారు. గతంలో టైపేలో ఉన్న బ్రాంచి కార్యాలయం, అప్పటికి తైవాన్‌లో ఉన్న 1,777 రాజ్య ప్రచారకుల కార్యకలాపాలను నిర్దేశించేందుకు సరిపోలేదు. అన్ని వయసులకు చెందిన అంతర్జాతీయ, స్థానిక స్వచ్ఛంద సేవకుల అనేక సంవత్సరాల కృషి ఫలితంగా, 1994 ఆగస్టులో, సిన్వూలో చక్కని క్రొత్త బ్రాంచి కార్యాలయ నిర్మాణం పూర్తైంది. ఆ సమయానికల్లా, తైవాన్‌లో దేవుని వాక్యమైన బైబిల్లోని సువార్తను 2,515 మంది ప్రకటిస్తున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత నేడు ఆ సంఖ్య రెండింతలకన్నా ఎక్కువై 5,500ను దాటింది, ప్రతీనెల, వారిలో దాదాపు 25 శాతం మంది పూర్తికాల ప్రకటనా పనిలో పాల్గొంటున్నారు. ఆ సేవలో పాల్గొంటున్నవారిలో అరుణోదయ “మంచు” బిందువుల్లాంటి యువతీ యువకులు ప్రత్యేకంగా గమనించదగినవారు.​—⁠కీర్తన 110:⁠3.

యౌవనుల్లో కనిపిస్తున్న ఆధ్యాత్మిక అభివృద్ధి

ఆసక్తిగా సువార్త ప్రకటిస్తున్నవారిలో చాలామంది పిన్నవయస్కులే. కొందరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉదాహరణకు, ఉత్తర తైవాన్‌లోని ఒక పట్టణంలో, ఒక వివాహిత జంట దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు హాజరయ్యేందుకు మొదటిసారిగా ఆహ్వానించబడింది, బైబిలు సత్యాలు ఇతరులకు ఎలా బోధించాలో యెహోవాసాక్షులు ఆ పాఠశాలలో నేర్చుకుంటారు. వాజ్వాన్‌ అనే చిన్నబ్బాయి అనేకమంది పెద్దవారికన్నా ఎంతో నైపుణ్యంగా వేదిక నుండి బైబిలును చదవడాన్ని చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు హాజరైన ఇతర కూటాల్లో, పాఠశాలకు వెళ్లడం ప్రారంభించని పిల్లలు కూడా చక్కని వ్యాఖ్యానాలు చేయడం వారినెంతో ఆకట్టుకుంది. రాజ్య మందిరంలోని చిన్నపిల్లల చక్కని ప్రవర్తనను ఆ దంపతులు మెచ్చుకున్నారు.

ఈ ప్రముఖ బౌద్ధ, టావోయి దేశంలో ఆ చిన్నారులు బైబిలు విద్య మీద ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నారు? ఎందుకంటే, వారి క్రైస్తవ తల్లిదండ్రులు బైబిలు సూత్రాలను అన్వయించుకుని, యెహోవాతో తమకున్న సంబంధం ఆధారంగా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని నిర్మించుకున్నారు. వాజ్వాన్‌ తల్లిదండ్రులు కుటుంబ బైబిలు అధ్యయనాన్ని, క్షేత్ర పరిచర్యను ఆనందకరంగా చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి, వాజ్వాన్‌ అన్న, అక్కలు ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్న సాక్షులుగా ఉన్నారు. ఇటీవల వాజ్వాన్‌కు ప్రకటనా పనిలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వబడినప్పుడు, ఆ నెలలో వాజ్వాన్‌ అప్పటికే కుటుంబీకులందరూ కలిసి అందించిన పత్రికలకన్నా ఎక్కువ పత్రికలను అందించాడని వాళ్లమ్మ చెప్పింది. ఆయనకు సత్యం గురించి మాట్లాడడం, కూటాల్లో వ్యాఖ్యానించడం, తాను నేర్చుకున్న విషయాలు ఇతరులకు చెప్పడం ఇష్టమని స్పష్టమౌతోంది.

ఆ చిన్నారులు పెద్దవారవుతున్నప్పుడు

ఆ చిన్నారులు పెద్దవారయ్యేకొద్దీ ఎలా తయారవుతున్నారు? ఎదిగాక కూడా చాలామంది యెహోవాపట్ల, పరిచర్యపట్ల నిజమైన ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. హ్వాపిన్‌ అనే విద్యార్థి ఉదాహరణనే తీసుకోండి. ఒకరోజు వాళ్ళ లెక్చరర్‌, ఒక మతానికి చెందినవారు రక్తాన్ని అంగీకరించరని, అయితే వారెవరో తనకు తెలియదని విద్యార్థులతో చెప్పాడు. తరగతి ముగిసిన తర్వాత, ఆయన పేర్కొన్నవారు యెహోవాసాక్షులని చెప్పడమే కాక, వారు అలాంటి వైఖరిని అవలంబించడానికిగల కారణాన్ని కూడా ఆ యౌవనస్థురాలు తన లెక్చరర్‌కి వివరించింది.

మరో లెక్చరర్‌ సుఖ వ్యాధుల గురించిన ఒక వీడియో చూపించింది. ఆ వీడియోలో 1 కొరింథీయులు 6:⁠9 పేర్కొనబడింది, అయితే బైబిలు సలింగ సంయోగాన్ని ఖండించడంలేదని ఆమె వాదించింది. మళ్ళీ, ఆ విషయాన్ని గురించి దేవుని దృక్పథమేమిటో హ్వాపిన్‌ తన లెక్చరర్‌కి వివరించగలిగింది.

షుషా అనే తోటి విద్యార్థి, కుటుంబంలో జరిగే హింసపై నివేదికను తయారుచేస్తున్నప్పుడు, హ్వాపిన్‌ తేజరిల్లు! జనవరి 8, 2002లో, “హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం” అనే ముఖశీర్షికగల పత్రికను ఆమెకు ఇచ్చి, దానిలో ఆ అంశంమీద బైబిలు ఆధారిత సమాచారం ఎంతో ఉందని వివరించింది. కొంతకాలానికి షుషా బాప్తిస్మం పొందని ప్రచారకురాలైంది. ఇప్పుడు వారిద్దరూ ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నారు.

పాఠశాలకు వెళ్తున్న అనేకమంది క్రైస్తవులు, బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవించే ప్రజలుగా గుర్తింపు పొందడం కష్టమని భావిస్తున్నారు. ప్రత్యేకంగా చిన్న మారుమూల పట్టణాల్లో అలా గుర్తింపు పొందడం కష్టం. జీహావ్‌ తన విశ్వాసం, ప్రకటనా పని కారణంగా తోటివారి నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనిలా చెబుతున్నాడు: “నేనెంతగా నిరుత్సాహం చెందానంటే పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు నా తోటి విద్యార్థులను కలుసుకోవాలంటేనే నాకు భయమేసేది. కొన్నిసార్లు దాదాపు పదిమంది విద్యార్థులు మూకుమ్మడిగా నన్ను హేళన చేసేవారు!” ఒకరోజు, తరగతిలో తన మతం గురించి ప్రసంగించమని ఒక లెక్చరర్‌ జీహావ్‌కు చెప్పాడు. “నా ప్రసంగాన్ని ఆదికాండము 1వ అధ్యాయంతో మొదలుపెట్టి, ఆ తర్వాత, ఈ భూమిని, దానిలోని సమస్తాన్ని ఎవరు సృష్టించారు? మానవుడు ఉనికిలోకి ఎలా వచ్చాడు? వంటి ప్రశ్నలను చర్చించాలనుకున్నాను. నేను లేఖనాలను చదివిన వెంటనే, నాకు మూఢనమ్మకాలు ఉన్నాయంటూ కొందరు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అయితే నేను మాట్లాడడం కొనసాగించి నా ప్రసంగాన్ని ముగించాను. ఆ తర్వాత, మన పని గురించి, మన విశ్వాసం గురించి నా తోటి విద్యార్థుల్లో కొందరితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఇప్పుడు, వారు నన్ను పరిచర్యలో చూసినప్పుడు నవ్వడంలేదు!”

జీహావ్‌ ఇంకా ఇలా చెబుతున్నాడు: “నా తల్లిదండ్రులు సాక్షులు కాబట్టి, మేము ప్రతీరోజు ఉదయం దినవచనాన్ని చర్చిస్తాం. మేము బైబిలు అధ్యయనం కూడా చేస్తాం, కూటాలకు క్రమంగా హాజరవుతాం. అందుకే, ఉత్తేజకరమైన బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు, ఇప్పటికీ నన్ను హేళన చేయాలనుకునేవారిని నేను ఎదుర్కోగలను.”

టిన్మా, బాలికల సాంకేతిక పాఠశాలలో చదువుకుంటోంది. ఒకసారి తన తోటి విద్యార్థినులు కొందరు, బాలల పాఠశాలకు చెందిన అబ్బాయిలతోపాటు పిక్నిక్‌కు రమ్మని ఆమెను అడిగారు. అలా వెళ్లడంవల్ల వచ్చే నైతిక ప్రమాదాన్ని గుర్తించి, ఆమె దానికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు * (ఆంగ్లం) అనే పుస్తకంలోని చక్కని సమాచారాన్ని ఆమె తన తోటి విద్యార్థినులతో ఎన్నిసార్లు చర్చించినా వాళ్ళు తరచూ అలాగే ఆహ్వానించారు. ఆమె పాతకాలం అమ్మాయి అని ఆమె తోటి విద్యార్థినులు ఆమెను అపహసించారు. అయితే వారిలో ఒక అమ్మాయి గర్భవతియై, గర్భస్రావం చేయించుకున్నప్పుడు, బైబిలు సూత్రాలు అనుసరించడం ఎంత జ్ఞానయుక్తమో స్పష్టమైంది. టిన్మా ఇలా అంటోంది: “దేవుని నిర్దేశానికి అనుగుణంగా ప్రవర్తించడంవల్ల నాకు స్వచ్ఛమైన మనస్సాక్షి ఉంది. దాని ఫలితంగా నాకు హృదయానందం, ప్రగాఢ సంతృప్తి లభించాయి.”

అభివృద్ధికి అడ్డంకులను అధిగమించడం

టిన్మా సన్నిహిత స్నేహితుల్లో రావాన్‌ కూడా ఉంది. ఆమె తన చిన్నతనంలో, క్రైస్తవ కూటాలకు వెళ్లడం, క్షేత్ర పరిచర్యలో పాల్గొనడం అలసట కలిగించేవని అనుకునేది. అయితే, తన సంఘంలోనివారు చూపించే నిజమైన ప్రేమకూ, తన తోటి విద్యార్థుల పైపై స్నేహానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి ఆమె, తాను తన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించింది. రావాన్‌ తన తోటి విద్యార్థులకు ప్రకటించడం ప్రారంభించింది, తాను ఏమి చేయాలో కొంతకాలానికి మరింత స్పష్టంగా అర్థమైంది. ఆమె సహాయ పయినీరు సేవ చేయడం ప్రారంభించి పరిచర్యలో 50 కన్నా ఎక్కువ గంటలు వెచ్చించింది. ఆ తర్వాత క్రమ పయినీరు సేవ చేయడం ప్రారంభించి పరిచర్యలో 70 కన్నా ఎక్కువ గంటలు వెచ్చించింది. రావాన్‌ ఇలా అంటోంది: “నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. ఆయన నన్ను ఎన్నడూ విడువలేదు. ఆయనను నిరాశపర్చే పనులు చేసినా ఆయన నన్ను ప్రేమించాడు. మా అమ్మతోపాటు సంఘంలోని ఇతరులు కూడా అలాంటి ప్రేమపూర్వక వైఖరినే కనపరిచారు. నేను ఇప్పుడు ఐదు బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నాను కాబట్టి, నేను ఎంతో సంతృప్తికరమైన పనిలో పాల్గొంటున్నానని అనిపిస్తోంది.”

ఒక గ్రామీణ ఉన్నత పాఠశాలలో, సాక్షులైన ఇద్దరు అబ్బాయిలకు జానపద నాట్య పోటీల్లో తమ పాఠశాలకు ప్రాతినిధ్యం వహించే నియామకం లభించింది. ఆ పోటీ ఎలాంటిదో తెలుసుకున్న తర్వాత, దానిలో భాగం వహించడం తమ క్రైస్తవ మనస్సాక్షికి వ్యతిరేకమైందని ఆ యౌవన సాక్షులకు అనిపించింది. వారు తమ అభిప్రాయాన్ని వివరించి, తమను మినహాయించాల్సిందిగా కోరడానికి ప్రయత్నించినప్పుడు వారి మనవి తిరస్కరించబడింది. బదులుగా, వారికి నిమామకం ఇవ్వబడింది కాబట్టి వారు తప్పకుండా వెళ్లాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. ఆ యౌవన సాక్షులు, రాజీపడడం ఇష్టంలేక తమ సమస్యను వివరిస్తూ విద్యాశాఖ వెబ్‌సైట్‌కు ఒక ఉత్తరం వ్రాశారు. ఆ యువకులకు వ్యక్తిగతంగా జవాబు రాకపోయినా, అలాంటి పోటీల్లో పాల్గొనమని ఎవరినీ బలవంతపెట్టొద్దని ఆ పాఠశాలకు కొంతకాలానికి నిర్దేశం అందింది. తమకు లభించిన బైబిలు శిక్షణ, తమ మనస్సాక్షిని మలచడమేకాక సరైనదాని పక్షాన నిలబడడానికి తమకు బలాన్ని కూడా ఇచ్చిందనే విషయాన్ని గ్రహించిన ఆ ఇద్దరు యువకులు ఎంత సంతోషించివుంటారో కదా!

అంగవైకల్యాలు ఉన్నవారు కూడా ఇతరులతో బైబిలు నిరీక్షణను పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తారు. మిన్యూకు పుట్టినప్పటి నుండి పక్షవాతం ఉంది. ఆమె తన చేతులను ఉపయోగించలేదు కాబట్టి బైబిల్లోని పేజీలను తన నాలుకతో త్రిప్పి తాను చదవాలనుకుంటున్న వచనాన్ని కనుగొంటుంది. ఆమె రాజ్యమందిరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో తన నియామక ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు, ఎత్తు తక్కువగావున్న ఒక పరుపు మీద పడుకుంటుంది, గృహస్థురాలు ఒక చిన్న స్టూలు మీద కూర్చుని ఆమె కోసం మైకు పట్టుకుంటుంది. ఆ ప్రసంగాలను సిద్ధపడడానికి మిన్యూ చేసే కృషిని చూడడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో!

మిన్యూ రాజ్య ప్రచారకురాలు కావాలనుకున్నప్పుడు, ఆమెకు సహాయం చేయడానికి సంఘంలోని కొందరు సహోదరీలు టెలిఫోను సాక్ష్యం ఎలా ఇవ్వాలో తెలుసుకున్నారు. ఆమె తన నాలుకతో టెలిఫోను నంబర్లను డయల్‌ చేస్తున్నప్పుడు సహోదరీలు ఆమె మాట్లాడిన నంబర్లను నమోదు చేయడంలో సహాయం చేస్తారు. ఆమె ఆ పనిని ఎంతగా ఇష్టపడుతుందంటే ఆమె సహాయ పయినీరుగా మారి, ప్రతీ నెల, ఫోనులో ఇతరులతో దేవుని రాజ్యం గురించి 50 నుండి 60 గంటలవరకు మాట్లాడుతోంది. బైబిలు సాహిత్యాలను స్వీకరించి పునర్దర్శనాలకు ఒప్పుకున్న కొందరిని ఆమె కనుగొంది. అలా కలుసుకున్నవారిలో ముగ్గురితో ఆమె ఇప్పుడు బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తోంది.

తైవాన్‌లోని యెహోవాసాక్షుల 78 సంఘాల్లోని ఉత్తేజాన్నిచ్చే మంచుబిందువుల్లాంటి ఆ యువతీ యువకులు ప్రాణరక్షక రాజ్యసువార్తను ఆ కిక్కిరిసిన ద్వీపంలో ఉన్న కోట్లాదిమందికి ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెరవేరుతున్న ఈ బైబిలు ప్రవచనంలో ఇది చిన్న భాగం మాత్రమే: “యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీ యొద్దకు వచ్చెదరు.” (కీర్తన 110:⁠3) ఈ యౌవనస్థులు తమతోటి పనివారైన వృద్ధ ప్రచారకులకు ఎంత ప్రోత్సాహాన్నిస్తున్నారో కదా, అన్నింటికన్నా ప్రాముఖ్యంగా వారు తమ పరలోక తండ్రియైన యెహోవా దేవునికి ఎంత ఆనందం కలిగిస్తున్నారో కదా!​—⁠సామెతలు 27:11.

[అధస్సూచి]

^ పేరా 16 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

మరిన్ని రాజ్యమందిరాలు అవసరం

తైవాన్‌లో ప్రచారకుల సంఖ్య పెరగడంతో సరిపడినన్ని రాజ్యమందిరాలు లభించడం చాలా కష్టమవుతోంది. ఎందుకు? ఎందుకంటే, కొన్ని మారుమూల ప్రాంతాల్లో తప్ప, మిగతా ప్రాంతాల్లో రాజ్యమందిరాల నిర్మాణానికి అనుకూలమైన స్థలం దాదాపు ఎక్కడా లేదు. అదీగాక, స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రదేశిక నియమాలు కూడా కఠినంగా ఉన్నాయి. పెద్ద పట్టణాల్లో, నగరాల్లో ఏకైక ప్రత్యామ్నాయం ఏమిటంటే, కార్యాలయాల కోసం రూపొందించబడిన భవనాలను కొని వాటిని రాజ్యమందిరాలుగా మార్చడం. అయినా, అనేక కార్యాలయాల పైకప్పుల ఎత్తు చాలా తక్కువగా ఉండడం, నిర్వహణ ఖర్చులు, భద్రతా ఏర్పాట్లు అధికంగా ఉండడం, లేక ఇతర విషయాల కారణంగా అవి రాజ్యమందిరాలుగా ఉపయోగించడానికి అనువుగా లేవు.

అయినా, ఇటీవలి సంవత్సరాల్లో తైవాన్‌లోని యెహోవాసాక్షులు ఎన్నో క్రొత్త రాజ్యమందిరాలను సంపాదించుకోగలిగారు. స్వచ్ఛంద విరాళాల ద్వారా ఖర్చులను భరించేందుకు, అవసరమైన నిర్మాణ నైపుణ్యాలను నేర్చుకునేందుకు సాక్షులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి క్రొత్త స్థలాల కోసం అన్వేషణ కొనసాగుతోంది.