కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక”

“పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక”

“పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక”

“క్యాథలిక్‌ విశ్వాసం నాలుగు అంతిమ విషయాలను పేర్కొంటోంది: మరణం, తీర్పు, నరకం, పరలోకం.”​—⁠క్యాథాలిసిజమ్‌, జార్జ్‌ బ్రాంటిల్‌ సంపాదకీయం.

మానవులకు ఉద్దేశించబడిన ఈ నాలుగింటిలో భూమి ప్రస్తావన లేదనే విషయాన్ని గమనించండి. అది అంత ఆశ్చర్యాన్ని కలిగించదు, ఎందుకంటే, అనేక ఇతర మతాల్లాగే క్యాథలిక్‌ చర్చీ కూడా భూమి ఒకరోజు నాశనం చేయబడుతుందనే నమ్ముతుంది. డిక్స్యోనేర్‌ డా టేయోలజీ క్యాథోలిక్‌ అనే నిఘంటువు, “లోకాంతం” అనే శీర్షిక క్రింద ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది: “ప్రస్తుత లోకం, దేవుడు సృష్టించినప్పుడు ఉన్నట్లుగానీ, నేడున్నట్లుగానీ ఎల్లప్పటికీ ఉండదు అని క్యాథలిక్‌ చర్చీ విశ్వసిస్తుంది, బోధిస్తోంది.” ఇటీవల, క్యాథలిక్‌ కేటకిజమ్‌ [ప్రశ్నోత్తరాల రూపంలో ఉండే బోధనా కార్యక్రమం] ఆ సిద్ధాంతాన్ని ఇలా వివరించింది: “మన లోకం . . . భవిష్యత్తులో ఖచ్చితంగా కనుమరుగైపోతుంది.” మరి మన గ్రహం కనుమరుగైపోతే, భూపరదైసు గురించిన బైబిలు వాగ్దానాల మాటేమిటి?

భూమ్మీద పరదైసు స్థాపించబడుతుందని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. ఉదాహరణకు, ప్రవక్తయైన యెషయా భూమిని, దానిలోని నివాసులను ఈ విధంగా వర్ణించాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెషయా 65:​21, 22) దేవుడు ఎవరికైతే ఈ వాగ్దానాలు చేశాడో ఆ యూదులు, తమ వాగ్దానదేశం, నిజానికి భూమంతా ఏదో ఒకరోజు మానవుల నిత్యాశీర్వాదాల కోసం పరదైసుగా మారబోతోందనే నమ్మకంతో ఉండేవారు.

ఈ నమ్మకాన్ని 37వ కీర్తన ధృవీకరిస్తోంది. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:​11) ఇశ్రాయేలు జనాంగం వాగ్దానదేశంలో కేవలం తాత్కాలికంగా పునఃస్థాపించబడడం గురించే ఈ లేఖనం మాట్లాడడం లేదు. అదే కీర్తన నిర్దిష్టంగా ఇలా చెబుతోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:​29) * భూమిపై నిత్య జీవితం “నీతిమంతులకు” ప్రతిఫలంగా ఇవ్వబడుతుందని ఈ కీర్తన చెబుతుందన్న విషయాన్ని గమనించండి. ఈ లేఖనం గురించి ఒక ఫ్రెంచి బైబిల్లో వ్రాయబడిన వ్యాఖ్యానం ప్రకారం, బైబిలు అనువాదాల్లో “నీతిమంతులు” అనే పదానికి ఇవ్వబడిన భావానికన్నా మరింత విస్తృతార్థం ఉంది; దీనిలో దురదృష్టవంతులు, యావే (యెహోవా) నిమిత్తం బాధించబడేవారు లేదా హింసించబడేవారు, దేవునికి విధేయత చూపించే వినయహృదయులు కూడా ఇమిడివున్నారు.

భూమ్మీదా లేక పరలోకంలోనా?

కొండమీది ప్రసంగంలో యేసు, పైన ఉల్లేఖించబడిన లేఖనాలను గుర్తుచేసే ఒక వాగ్దానాన్ని చేశాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (మత్తయి 5:⁠5) మళ్ళీ ఏదో ఒకరోజు, భూమి విశ్వాసుల కోసం నిత్యాశీర్వాదంగా మారనుంది. అయితే, యేసు తన అపొస్తలుల కోసం “[తన] తండ్రి యింట” స్థలం సిద్ధపరుస్తున్నాననీ, వారు తనతోపాటు పరలోకంలో ఉంటారనీ వారికి స్పష్టం చేశాడు. (యోహాను 14:1​, 2; లూకా 12:⁠32; 1 పేతురు 1:​3) మరి భూమ్మీద ఆశీర్వాదాల గురించిన వాగ్దానాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అవి మన కాలానికి సంబంధించినవేనా, అవి ఎవరికి వర్తిస్తాయి?

కొండమీది ప్రసంగంలో యేసు ప్రస్తావించిన “భూలోకము”తోపాటు 37వ కీర్తనలో ప్రస్తావించబడిన భూమి కూడా కేవలం సూచనార్థకమైనదేనని వివిధ బైబిలు విద్వాంసులు అంటున్నారు. ఈ లేఖనాలు “సూచనార్థక పరలోకం, చర్చీ” గురించి మాట్లాడుతున్నాయని తాను గ్రహించినట్లు ఎఫ్‌. విగురూ బైబిల్‌ డి గ్లెయిర్‌లోని తన వ్యాఖ్యానాల్లో వివరించాడు. ఫ్రెంచ్‌ బైబిలు పరిశోధకుడైన ఎమ్‌. లాగ్రాంజ్‌ ప్రకారం ఈ ఆశీర్వాదం “సాత్వికులు ఈ ప్రస్తుత విధానంలోకానీ లేదా మరింత పరిపూర్ణ పరిస్థితుల్లోగానీ వారు నివసించే భూమిని స్వతంత్రించుకోవడం గురించిన వాగ్దానం కాదు. వారికి లభించే ప్రాంతం ఏదైనా, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్న వాగ్దానమే.” మరో బైబిలు పరిశోధకుని ప్రకారం “పరలోకాన్ని సూచించడానికి భూసంబంధమైన విషయాలు సూచనార్థకంగా ఉపయోగించబడ్డాయి.” ఇంకొందరి అభిప్రాయాల ప్రకారం “వాగ్దానదేశమైన కనాను సూచనార్థకంగా ఉపయోగించబడింది, అది పైనున్న స్వస్థలానికి అంటే సాత్వికులకు వారసత్వంగా లభిస్తుందని హామీ చేయబడిన దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. 37వ కీర్తనతోపాటు వేరే లేఖనాల్లో ప్రస్తావించబడిన భూలోకానికి కూడా అదే భావం ఉంది.” అయితే, దేవుని వాగ్దానాల్లో భౌతిక భూమికి స్థానమే లేదనే ముగింపుకు మనం వెంటనే రావాలా?

భూమి కోసం ఒక శాశ్వత సంకల్పం

మానవులు ఈ భూమ్మీద జీవించాలనే సంకల్పంతోనే దేవుడు ప్రారంభంలో దాన్ని సృష్టించాడు. “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు” అని కీర్తనకర్త వ్రాశాడు. (కీర్తన 115:​16) కాబట్టి, దేవుని ఆదిసంకల్పం ప్రకారం, మానవులు భూమ్మీదే నివసించాలి కానీ పరలోకంలో కాదు. యెహోవా మొదటి మానవ దంపతులకు ఏదెను తోటను విస్తరించి భూమినంతా నింపే పనిని అప్పగించాడు. (ఆదికాండము 1:​28) ఆ సంకల్పం తాత్కాలికమైంది కాదు. భూమి నిరంతరం నిలుస్తుందనే హామీని యెహోవా తన వాక్యంలో నొక్కిచెప్పాడు: “తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.”​—⁠ప్రసంగి 1:​4; 1 దినవృత్తాంతములు 16:⁠30; యెషయా 45:​18.

దేవుడు సర్వోన్నతుడు కాబట్టి, ఆయన వాగ్దానాలు ఎన్నడూ మరుగునపడిపోవు, అవి నెరవేరేలా ఆయన చూస్తాడు. ప్రకృతిలోని నీటి చక్రాన్ని దృష్టాంతంగా ఉపయోగిస్తూ, దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరతాయని బైబిలు వివరిస్తోంది: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి . . . అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును [దేవుని వచనమును] ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని [“సంతోషకరమైనదాని,” NW]నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:​10, 11) దేవుడు మానవులకు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నెరవేరడానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ అవి మరుగునపడిపోవు. ఆయన పలికిన వాటన్నింటినీ నెరవేర్చాకే అవి ఆయన దగ్గరకు “మరలి” వెళ్తాయి.

మానవుల కోసం భూమిని సృష్టించేందుకు యెహోవా నిజంగానే ‘సంతోషించాడు.’ ఆయన తాను చేసినదంతా “చాలామంచిదిగ” ఉందని ఆరవ సృష్టి దినం ముగిసేసరికి ప్రకటించాడు. (ఆదికాండము 1:​31) భూమి నిరంతరం నిలిచివుండే పరదైసుగా మారడం దేవుని సంకల్పంలో భాగమే కానీ అది ఇంకా నెరవేరలేదు. అయితే, దేవుని వాగ్దానాలు ‘నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలవు.’ మానవులు శాంతి భద్రతలతో పరిపూర్ణ జీవితం ఉన్న భూమిపై నిరంతరం జీవించడానికి సంబంధించిన వాగ్దానాలన్నీ నెరవేరతాయి.​—⁠కీర్తన 135:6; యెషయా 46:​10.

దేవుని సంకల్పం తప్పక నెరవేరుతుంది

మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు చేసిన పాపంవల్ల, భూమిని పరదైసుగా మార్చాలనే దేవుని ఆదిసంకల్పానికి తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. వారు అవిధేయులైన తర్వాత తోటలోనుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆ విధంగా, పరదైసు భూమిపై పరిపూర్ణ మానవులు జీవించాలనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో పాలుపంచుకునే ఆధిక్యతను వారు కోల్పోయారు. అయినా, దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఏర్పాట్లు చేశాడు. ఎలా?​—⁠ఆదికాండము 3:​17-19, 23.

ఏదెను తోటలో వారి పరిస్థితి, మంచి స్థలంలో ఇల్లు కట్టడం ప్రారంభించే ఒక వ్యక్తి లాంటిదే. ఆయన పునాది వేయగానే, ఎవరో వచ్చి ఆయన వేసిన పునాదిని కూల్చారు. ఆ వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపేసే బదులు ఆ ఇల్లు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటాడు. ఆ అదనపు పనికోసం కాస్త ఎక్కువ ఖర్చైనంత మాత్రాన ఆయన ప్రారంభించిన పని జ్ఞానయుక్తమైందా కాదా అనే సందేహం రాదు.

అదేవిధంగా, దేవుడు కూడా తన సంకల్పం నెరవేరేలా చూసేందుకు ఏర్పాట్లు చేశాడు. మన మొదటి తల్లిదండ్రులు పాపం చేసిన వెంటనే, దేవుడు ఆ నష్టాన్ని పూరించే ఒక “సంతానము” గురించిన నిరీక్షణను వారి సంతతికి వెల్లడిచేశాడు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా భూమ్మీదికి వచ్చి, మానవులను తిరిగి కొనడానికి తన ప్రాణాన్ని బలి ఇచ్చిన దేవుని కుమారుడైన యేసే ఆ సంతానపు ప్రథమ భాగమని రుజువైంది. (గలతీయులు 3:⁠16; మత్తయి 20:​28) పరలోకానికి పునరుత్థానం చేయబడిన తర్వాత యేసు రాజ్యానికి రాజవుతాడు. తనతో కలిసి రాజ్యంలో సహపరిపాలకులుగా ఉండేందుకు పరలోకానికి పునరుత్థానం చేయబడే ఎన్నుకోబడిన విశ్వాసులతోపాటు భూమిని స్వాస్థ్యంగా పొందే సాత్వికుడు ప్రధానంగా యేసుక్రీస్తే. (కీర్తన 2:​6-9) దేవుని ఆదిసంకల్పాన్ని నెరవేర్చి, భూమిని పరదైసుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం సకాలంలో భూవ్యవహారాలన్నింటినీ తన అధీనంలోని తీసుకుంటుంది. లెక్కలేనన్ని కోట్లమంది సాత్వికులు యేసు, ఆయన సహపరిపాలకుల పరిపాలననుండి ప్రయోజనం పొందుతారనే భావంలో “భూమిని స్వతంత్రించుకుంటారు.”​—⁠ఆదికాండము 3:⁠15; దానియేలు 2:⁠44; అపొస్తలుల కార్యములు 2:​32, 33; ప్రకటన 20:​5, 6.

“పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును”

పరలోక సంబంధమైన, భూసంబంధమైన రక్షణలు అపొస్తలుడైన యోహాను చూసిన దర్శనంలో ప్రస్తావించబడ్డాయి. క్రీస్తు నమ్మకమైన శిష్యులనుండి ఎన్నుకోబడినవారు రాజులుగా పరలోక సింహాసనాలపై కూర్చుండడాన్ని ఆయన చూశాడు. క్రీస్తు సహచరులైన “వారు భూలోకమందు ఏలుదురని” బైబిలు ప్రత్యేకంగా చెబుతోంది. (ప్రకటన 5:⁠9) దేవుని సంకల్ప నెరవేర్పులోని ఈ రెండు అంశాలను గమనించండి​—⁠యేసు, ఆయన సహవారసులు భాగంగా ఉన్న పరలోక రాజ్య నిర్దేశంలో భూమి పునఃస్థాపించబడడం. దేవుని ఆదిసంకల్పానికి అనుగుణంగా భూపరదైసు చివరకు పునఃస్థాపించబడేందుకు ఈ దైవిక ఏర్పాట్లన్నీ దోహదపడతాయి.

యేసు తన మాదిరి ప్రార్థనలో, దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరేందుకు ప్రార్థించాలని తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్తయి 6:⁠9) భూమి కనుమరుగైపోతే లేదా అది కేవలం పరలోకానికి సూచనగా ఉంటే ఆ మాటలకు అర్థముంటుందా? అలాగే, నీతిమంతులందరూ పరలోకానికి వెళ్తే ఈ మాటలకు అర్థముంటుందా? సృష్టి వృత్తాంతం నుండి ప్రకటన గ్రంథములోని దర్శనాల వరకు ఉన్న లేఖనాల్లో, భూమిపట్ల దేవుని సంకల్పమేమిటో స్పష్టంగా తెలియజేయబడింది. ఈ భూమి దేవుడు సంకల్పించినట్లుగానే పరదైసుగా మారుతుంది. దేవుడు తాను నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్న చిత్తం ఇదే. భూమ్మీద నివసిస్తున్న విశ్వాసులు ఆ చిత్తం నెరవేరాలని ప్రార్థిస్తారు.

భూమ్మీద మానవులు నిరంతరం జీవించాలనే మన సృష్టికర్త, “మార్పులేని” దేవుడు ప్రారంభంలో సంకల్పించాడు. (మలాకీ 3:​6; యోహాను 17:3; యాకోబు 1:​17) కావలికోట అనే ఈ పత్రిక శతాబ్దంకన్నా ఎక్కువ కాలంగా దైవ సంకల్ప నెరవేర్పులోని ఈ రెండు అంశాలను వివరిస్తోంది. కాబట్టే, లేఖనాల్లో కనిపించే భూమి పునఃస్థాపించబడడానికి సంబంధించిన వాగ్దానాలను అర్థం చేసుకోవచ్చు. యెహోవాసాక్షులతో చర్చించడం ద్వారా లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలను సంప్రదించడం ద్వారా మీరు ఈ విషయాల్ని గురించి మరింత తెలుసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.

[అధస్సూచి]

^ పేరా 5 అనేక బైబిలు అనువాదాలు ఎరెట్స్‌ అనే హెబ్రీ పదాన్ని “భూమి”కి బదులుగా “నేల” అని అనువదించాయి, అయితే, కీర్తన 37:​11, 29లోని ఎరెట్స్‌ అనే పదానికి, ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడిన నేల అని మాత్రమే అర్థం ఉందని అనుకోవడానికి ఎలాంటి కారణమూ లేదు. విలియమ్‌ విల్సన్‌ వ్రాసిన ఓల్డ్‌ టెస్టమెంట్‌ వర్డ్‌ స్టడీస్‌ అనే పుస్తకం ఎరెట్స్‌ అనే పదాన్ని ఇలా నిర్వచిస్తోంది, “విస్తృతార్థంలో, అది నివసించేందుకు అనుకూల, అననుకూల స్థలాలున్న భూమి; ఆ పదం పరిమితార్థంలో భూమి ఉపరితలంపై కొంతభాగాన్ని, నేలను లేదా దేశాన్ని సూచించేందుకు ఉపయోగించబడింది.” కాబట్టి, ఆ హెబ్రీ పదానికున్న ప్రాథమిక అర్థం మన గ్రహం లేదా భూగోళం, భూమి.​—⁠కావలికోట (ఆంగ్లం), జనవరి 1, 1986 31వ పేజీ చూడండి.

[4వ పేజీలోని చిత్రం]

భవిష్యత్తులో భూమ్మీద పరదైసు స్థాపించబడుతుందని బైబిలు స్పష్టంగా చెబుతోంది

[7వ పేజీలోని చిత్రం]

భూమి కనుమరుగైపోతే ప్రభువు ప్రార్థనలోని మాటలకు అర్థముంటుందా?