బారూకు యిర్మీయాకు నమ్మకమైన కార్యదర్శి
బారూకు యిర్మీయాకు నమ్మకమైన కార్యదర్శి
“నేరీయా కుమారుడైన బారూకు” మీకు తెలుసా? (యిర్మీయా 36:4) ఆయన బైబిల్లో నాలుగుసార్లు మాత్రమే పేర్కొనబడినప్పటికీ, యిర్మీయాకు వ్యక్తిగత కార్యదర్శిగా, సన్నిహిత స్నేహితునిగా బైబిలు పాఠకులకు సుపరిచితుడే. వారిద్దరూ కలిసి యూదా రాజ్యపు అల్లకల్లోలమైన చివరి 18 సంవత్సరాలను, సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును భయంకరంగా నాశనం చేయడాన్ని, ఆ తర్వాత ఐగుప్తుకు చెరగా తీసుకువెళ్లబడడాన్ని చూశారు.
“లేఖికుడైన నరియాహు [నేరీయా హీబ్రూ పేరు] కుమారుడైన బెరెక్యాహుకు [బారూకు హీబ్రూ పేరు] చెందిన” అనే వాక్యం ఉన్న సా.శ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన రెండు మట్టి ముద్రలు * ఇటీవలి సంవత్సరాల్లో దొరికినప్పుడు, బైబిల్లో పేర్కొనబడిన ఆ వ్యక్తి విషయంలో విద్వాంసుల ఆసక్తి పెరిగింది. బారూకు ఎవరు? ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆయనేమి చదువుకున్నాడు, ఆయన హోదా ఏమిటి? యిర్మీయాకు తోడుగా స్థిరంగా నిలబడడాన్నిబట్టి ఆయన గురించి మనకు ఏమి తెలుస్తోంది? ఆయన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? అందుబాటులో ఉన్న బైబిల్లోని సమాచారాన్ని, చారిత్రక సమాచారాన్ని పరిశోధించడం ద్వారా వాటికి జవాబులను కనుగొందాం.
నేపథ్యం, హోదా
బారూకు యూదాలోని ఒక ప్రముఖ లేఖికుల కుటుంబానికి చెందినవాడని నేడు చాలామంది విద్వాంసులు నమ్ముతున్నారు. తాము ఆ నిర్ధారణకు రావడానికి తోడ్పడిన అనేక కారణాలను వారు వివరిస్తున్నారు. ఉదాహరణకు, బైబిలు వృత్తాంతములో, బారూకుకు “కార్యదర్శి” లేక “లేఖికుడు” అనే ప్రత్యేక బిరుదులు కొన్ని అనువాదాల్లో ఉపయోగించబడ్డాయి. ఆయన సహోదరుడు శెరాయా, సిద్కియా రాజు ఆస్థానంలో ఒక ప్రాముఖ్యమైన అధికారిగా పనిచేశాడని కూడా లేఖనాలు పేర్కొంటున్నాయి.—యిర్మీయా 36:32; 51:59.
పురావస్తుశాస్త్రజ్ఞుడు ఫిలిప్ జె. కింగ్, యిర్మీయా కాలంనాటి లేఖికుల గురించి ఇలా రాశాడు: “లేఖికుల వృత్తికి చెందినవారు సా.శ.పూ. ఏడవ శతాబ్దం చివర్లో, ఆరవ శతాబ్దం ప్రారంభంలో యూదాలో ప్రముఖులుగా పేరుపొందారు . . . ఆ బిరుదు ఉన్నతాధికారులకు ఇవ్వబడేది.”
అంతేకాక, మనం క్షుణ్ణంగా పరిశీలించబోయే యిర్మీయా 36వ అధ్యాయంలోని వృత్తాంతం, బారూకుకు రాజు సలహాదారులను కలుసుకునేందుకు, భోజనశాలను ఉపయోగించుకునేందుకు, లేక అధికారియైన గెమర్యా సమావేశ గదికి వెళ్లేందుకు అనుమతి ఉండేదనే అభిప్రాయం కలిగిస్తుంది. బైబిలు విద్వాంసుడైన జేమ్స్ మ్యూలాన్బర్గ్ ఇలా తర్కిస్తున్నాడు: “ఆ లేఖికుని సమావేశ గదిలో ప్రవేశించడానికి బారూకుకు అనుమతి ఉండేది, ఎందుకంటే అక్కడికి వెళ్లే హక్కు ఆయనకుంది, అంతేకాక, గ్రంథాన్ని బహిరంగంగా చదివే ప్రాముఖ్య సందర్భంలో సమావేశమయ్యే అధికారులలో ఆయన కూడా ఒకడు. ఆయన తన తోటి అధికారులతో ఉన్నాడు.”
కోర్పస్ ఆఫ్ వెస్ట్ సెమిటిక్ స్టాంప్ సీల్స్ అనే ప్రచురణ, బారూకు హోదా గురించి మరో తర్కాన్ని వివరిస్తోంది: “బెరెక్యాహు మట్టి ముద్రలు ఇతర ఉన్నతాధికారుల అనేక మట్టిముద్రలతోపాటు కనిపించాయి కాబట్టి, బారాకు/బెరెక్యాహు ఇతర అధికారులు పనిచేస్తున్న అధికార వ్యవస్థలోనే పనిచేశాడని అనుకోవడం సరైనదే.” యెరూషలేము నాశనానికి ముందటి అసాధారణమైన సంవత్సరాల్లో, ఉన్నతాధికారులైన బారూకు, ఆయన సహోదరుడైన శెరాయా నమ్మకస్థుడైన యిర్మీయా ప్రవక్తను సమర్థించివుండవచ్చని అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది.
యిర్మీయాకు బహిరంగ సమర్థన
కాలక్రమానుసారంగా, బారూకు పేరు యిర్మీయా 36వ అధ్యాయంలో, అంటే “యెహోయాకీము నాలుగవ సంవత్సరమున,” లేక దాదాపు సా.శ.పూ. 625లో మొదటిసారిగా యిర్మీయా 23 సంవత్సరాలు సేవచేశాడు.—యిర్మీయా 25:1-3; 36:1, 4.
పేర్కొనబడింది. అప్పటికి, ప్రవక్తగాఆ సమయంలో యెహోవా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములనుగూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.” ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.”—యిర్మీయా 36:2-4.
బారూకు ఎందుకు పిలిపించబడ్డాడు? యిర్మీయా ఆయనతో ఇలా అన్నాడు: “నేను యెహోవా మందిరములోనికి రాకుండ నిర్బంధింపబడితిని.” (యిర్మీయా 36:5) యెహోవా అంతకుముందు యిర్మీయా ద్వారా వినిపించిన సందేశాలు అధికారులకు కోపం తెప్పించి ఉండవచ్చు కాబట్టి, యెహోవా సందేశం చదవబడే ఆలయ ప్రాంతానికి రాకుండా యిర్మీయా నిషేధించబడినట్లు స్పష్టమౌతోంది. (యిర్మీయా 26:1-9) బారూకు ఖచ్చితంగా నిజాయితీగల యెహోవా ఆరాధకుడు కాబట్టి, ఆయన “ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు” చేశాడు.—యిర్మీయా 36:8.
గత 23 కంటే ఎక్కువ సంవత్సరాల్లో ఇవ్వబడిన హెచ్చరికలను రాయడానికి సమయం పడుతుంది, అంతేకాక, బహుశా, యిర్మీయా సరైన సమయం కోసం కూడా వేచివున్నాడు. అయితే సా.శ.పూ. 624 నవంబరులో లేక డిసెంబరులో బారూకు ధైర్యంగా ‘యెహోవా మందిరములోని లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదిలో ప్రజలందరు వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములోనుండి చదివి వినిపించెను.’—యిర్మీయా 36:8-10.
గెమర్యా కుమారుడైన మీకాయా తన తండ్రికి, అనేకమంది ప్రధానులకు జరిగింది చెప్పినప్పుడు, వారు ఆ గ్రంథాన్ని రెండవసారి బిగ్గరగా చదవడానికి బారూకును ఆహ్వానించారు. “వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొని—మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటిని రాజునకు తెలియజెప్పెదము . . . నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పిరి” అని ఆ వృత్తాంతం వివరిస్తోంది.—యిర్మీయా 36:11-19.
యిర్మీయా చెప్పినదాని ప్రకారంగా బారూకు గంథ్రాన్ని రాశాడని యెహోయాకీము రాజు తెలుసుకున్నప్పుడు, ఆయన కోపంగా దానిని చాకుతో కోసి, కుంపటిలో వేశాడు, ఆ తర్వాత యిర్మీయా, బారూకులను పట్టుకోవాల్సిందిగా తన మనుష్యులను ఆజ్ఞాపించాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, వారిద్దరు దాగివున్నప్పుడు అలాంటి మరో గ్రంథాన్ని రాశారు.—యిర్మీయా 36:21-32.
ఆ నియామకంలో ఎలాంటి అపాయాలు ఇమిడివున్నాయో బారూకు ఖచ్చితంగా గ్రహించివుంటాడు. కొద్ది సంవత్సరాల క్రితం యిర్మీయా ఎదుర్కొన్న అపాయాలు ఆయనకు తెలిసేవుంటాయి. “యిర్మీయా చెప్పిన మాటల రీతిని” ప్రవచించి, యెహోయాకీము రాజు ద్వారా చంపబడ్డ ఊరియాకు పట్టిన గతి గురించి కూడా ఆయనకు తెలిసేవుండవచ్చు. అయినా, యిర్మీయా తన నియామకాన్ని చేపట్టేందుకు సహాయం చేయడానికి బారూకు తనకున్న వృత్తి నైపుణ్యాలను, ప్రభుత్వ అధికారులతో తనకున్న పరిచయాలను ఉపయోగించడానికి సంసిద్ధతను చూపించాడు.—యిర్మీయా 26:1-9, 20-24.
“గొప్పవాటిని” వెదకవద్దు
బారూకు మొదటి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు సంక్షోభభరిత సమయాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన తన బాధ ఇలా వ్యక్తం చేశాడు: “కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను.” ఈ క్లిష్టపరిస్థితికి కారణమేమిటి?—యిర్మీయా 45:1-3.
దానికి ఎలాంటి సూటియైన జవాబు ఇవ్వబడలేదు. అయితే, బారూకు పరిస్థితిని ఊహించడానికి ప్రయత్నించండి. ఇశ్రాయేలు, యూదా ప్రజలకు 23 సంవత్సరాలు ఇవ్వబడిన హెచ్చరికల గురించి ఆయన మాట్లాడడం వారి మతభ్రష్టతను, యెహోవాను వారు తిరస్కరించడాన్ని ఎంతో స్పష్టం చేసివుండవచ్చు. యెరూషలేమును, యూదాను నాశనం చేసి 70 సంవత్సరాలు వారిని బబులోను చెరలో ఉంచడాన్ని గురించిన తీర్పును యెహోవా ఆ సంవత్సరమే వెల్లడిచేసివుండవచ్చు, అంతేకాక ఆ విషయాలు గ్రంథంలో కూడా చేర్చబడివుండవచ్చు, అవి బారూకును కలవరపెట్టివుండవచ్చు. (యిర్మీయా 25:1-11) అంతేకాక, ఈ నిర్ణాయకమైన సమయంలో యిర్మీయాను గట్టిగా సమర్థించడంవల్ల తాను తన హోదా, ఉద్యోగం కోల్పోయే అపాయం కూడా ఉంది.
ఏదేమైనా, బారూకు రాబోయే తీర్పును గుర్తుంచుకునేందుకు సహాయం చేయడానికి యెహోవా స్వయంగా జోక్యం చేసుకున్నాడు. “నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, యిర్మీయా 45:4, 5.
నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను” అని యెహోవా చెప్పాడు. ఆ తర్వాత ఆయన బారూకుకు ఇలా హితబోధ చేశాడు: “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు.”—ఆ ‘గొప్ప విషయాలు’ ఏమిటో యెహోవా పేర్కొనలేదు, అయితే అవి స్వార్థపూరితమైన లక్ష్యాలో, హోదా లేక వస్తు సంపదో బారూకుకు తెలిసేవుండవచ్చు. వాస్తవిక దృక్పథంతో ఉండమని, భవిష్యత్తులో ఏమి పొంచివుందో గుర్తుంచుకోమని యెహోవా ఆయనకు హితబోధ చేశాడు: “నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను.” బారూకు ఎక్కడికి వెళ్లినా ఆయన అమూల్యంగా పరిగణించే తన ప్రాణం కాపాడబడుతుంది.—యిర్మీయా 45:5.
సా.శ.పూ. 625నుండి 624 మధ్యకాలంలో జరిగిన ఈ సంఘటనలను యిర్మీయా 36, 45 అధ్యాయాల్లో వర్ణించిన తర్వాత సా.శ.పూ. 607లో యెరూషలేము, యూదాలను బబులోనీయులు నాశనం చేయడానికి కొన్నినెలల ముందటివరకు బైబిలు ఆయన గురించి పేర్కొనడంలేదు. సా.శ.పూ. 607లో ఏమి జరిగింది?
బారూకు యిర్మీయాను మళ్లీ సమర్థించాడు
బబులోనీయులు యెరూషలేమును ముట్టడించడాన్ని గురించిన బైబిలు వృత్తాంతంలో బారూకు పేరు మళ్లీ కనిపిస్తుంది. పునఃస్థాపన జరుగుతుందనడానికి సూచనగా తన తండ్రి తోబుట్టువు కుమారునికి చెందిన అనాతోతులోవున్న భూమిని కొనమని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించినప్పుడు యిర్మీయా “చెరసాల ప్రాకారములో ఉంచబడి” ఉన్నాడు. చట్టసంబంధమైన చర్యలు తీసుకోవడంలో సహాయం చేయడానికి బారూకు అప్పుడు పిలిపించబడ్డాడు.—యిర్మీయా 32:1, 2, 5-7.
యిర్మీయా ఇలా వివరించాడు: “నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని . . . బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి[తిని].” ఆ క్రయపత్రాలను జాగ్రత్తగా ఉంచేందుకు వాటిని మట్టికుండలో దాచిపెట్టమని ఆయన ఆ తర్వాత బారూకుకు ఆజ్ఞాపించాడు. యిర్మీయా తాను క్రయపత్రాలను ‘వ్రాసితిని’ అని చెప్పినప్పుడు, ఆయన నిజానికి లేఖికుని వృత్తిలో ఉన్న బారూకుతో వ్రాయించివుండవచ్చని కొందరు విద్వాంసులు భావిస్తున్నారు.—యిర్మీయా 32:10-14; 36:4, 17, 18; 45:1.
బారూకు, యిర్మీయా ఆ కాలపు చట్టసంబంధమైన పద్ధతులను అనుసరించారు. ఆ పద్ధతుల్లో రెండు క్రయపత్రాలను చేయించడం ఒకటి. కోర్పస్ ఆఫ్ వెస్ట్ సెమిటిక్ స్టాంప్ సీల్స్ అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “మొదటి క్రయపత్రం చుట్టబడి మట్టి ముద్రతో ముద్రవేయబడుతుంది కాబట్టి అది ‘ముద్రవేయబడిన క్రయపత్రం’ అని పిలవబడేది; దానిలో మౌలిక ఒప్పంద పత్రం ఉండేది. . . . రెండవది, ‘బహిరంగ క్రయపత్రం,’ అది చుట్టబడి ముద్రవేయబడిన పత్రానికి నకలు, దానిని చదివేందుకు ఉపయోగించేవారు. అలా మౌలిక పత్రం, నకలు పత్రం అనే రెండు పత్రాలు ఉండేవి, ఆ పత్రాలు రెండు వేర్వేరు పపైరస్ షీట్లమీద వ్రాయబడేవి.” అపట్లో దస్తావేజులను మట్టిపాత్రల్లో భద్రపరిచేవారని పురావస్తు పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి.
చివరకు, బబులోనీయులు యెరూషలేమును స్వాధీనం చేసుకొని, దానిని దహించారు, కొంతమంది బీదవారిని తప్ప మిగతా అందరినీ వారు చెరగా తీసుకువెళ్లారు. నెబుకద్నెజరు గెదల్యాను అధిపతిగా నియమించాడు. ఆయన రెండు నెలల తర్వాత హత్యచేయబడ్డాడు. యిర్మీయా దైవప్రేరేపణతో ఇచ్చిన సలహాకు వ్యతిరేకంగా, మిగిలివున్న యూదులు ఐగుప్తుకు వెళ్లాలనుకున్నారు, ఈ సందర్భంలోనే బారూకు మళ్లీ ప్రస్తావించబడ్డాడు.—యిర్మీయా 39:2, 8; 40:5; 41:1, 2; 42:13-17.
యూదా నాయకులు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు అబద్ధము పలుకుచున్నావు—ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మును చంపుటకును, బబులోనునకు చెర పట్టుకొని పోవుటకును, కల్దీయుల చేతికి మమ్మును అప్పగింపవలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు.” (యిర్మీయా 43:2, 3) బారూకు యిర్మీయా మీద చెప్పుకోదగ్గ ప్రభావం చూపించాడని యూదా నాయకులు నమ్మారని వారి ఆరోపణ వెల్లడిచేస్తున్నట్లు అనిపిస్తుంది. బారూకు తన హోదానుబట్టి లేక యిర్మీయాతో తనకున్న దీర్ఘకాల స్నేహాన్నిబట్టి తాను ఆ ప్రవక్తకు లేఖికునిగా మాత్రమే ఉన్నాననే విషయాన్ని మరచిపోయి అతిగా ప్రవర్తిస్తున్నాడని వారు నమ్మరా? బహుశా వారలా నమ్మివుండవచ్చు, యూదా నాయకులు ఏమి నమ్మినా, ఆ సందేశమైతే యెహోవా నుండే వచ్చింది.
దైవిక హెచ్చరికలు లభించినా మిగతా యూదులు యెరూషలేమును వదిలి వెళ్లారు, తమతోపాటు “ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి[రి].” యిర్మీయా ఇలా నమోదుచేశాడు: ‘యెహోవా మాట వినకుండా వారు ఐగుప్తుదేశములో ప్రవేశించి, తహపనేసుకు వచ్చిరి’, అది సీనాయి సరిహద్దులో ఉన్న తూర్పు నైలు పీఠభూమిలోని సరిహద్దు నగరం. ఆ తర్వాత బారూకు పేరు బైబిల్లో పేర్కొనబడలేదు.—యిర్మీయా 43:5-7.
బారూకు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
బారూకు నుండి మనం అనేక అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రాముఖ్యమైన ఒక పాఠం ఏమిటంటే, ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా యెహోవా సేవలో తన వృత్తి నైపుణ్యాలను, పరిచయాలను ఉపయోగించడానికి ఆయన సిద్ధంగా ఉండడం. నేడు యెహోవాసాక్షుల్లో అనేకమంది స్త్రీపురుషులు బెతెల్ సేవ, నిర్మాణ పని వంటివాటిలో తమ నైపుణ్యాలను ఉపయోగించడానికి సంసిద్ధత చూపించడం ద్వారా అలాంటి స్వభావాన్నే కనపరుస్తారు. బారూకులాంటి ఈ స్వభావాన్ని మీరు ఎలా చూపించవచ్చు?
యూదా చివరి రోజుల్లో వ్యక్తిగతమైన ‘గొప్ప విషయాలకు’ సమయంలేదని బారూకుకు గుర్తుచేయబడినప్పుడు ఆయన సానుకూలంగా ప్రతిస్పందించినట్లు స్పష్టమౌతోంది, ఎందుకంటే, ఆయన ప్రాణం కాపాడబడింది. మనం కూడా ఈ విధాన అంత్యదినాల్లో జీవిస్తున్నాం కాబట్టి ఆ హితబోధను మనం అన్వయించుకోవడం సరైనదే. మన ప్రాణం కాపాడబడుతుంది అనే వాగ్దానాన్ని యెహోవా మనకు కూడా ఇస్తున్నాడు. అలాంటి జ్ఞాపికలకు మనం కూడా బారూకులాగే ప్రతిస్పందించగలమా?
ఈ కథ నుండి మనం అన్వయించుకోదగ్గ ఒక పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. యిర్మీయా, హనమేలు బంధువులు అయినప్పటికీ, వారి వ్యాపార వ్యవహారాల్లో అవసరమైన చట్టబద్ధమైన పద్ధతులను పాటించేందుకు బారూకు వారికి సహాయం చేశాడు. తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో వ్యాపార వ్యవహారాలు జరిపే క్రైస్తవులకు అది లేఖనాధారమైన ఉదాహరణగా ఉంది. వ్యాపార ఒప్పందాలను రాతపూర్వకంగా ఉంచుకోవడమనే ఈ ఉదాహరణను అనుసరించడం లేఖనాధారమైనది, ఆచరణాత్మకమైనది, ప్రేమపూర్వకమైనది.
బారూకు గురించిన ప్రస్తావన బైబిల్లో కేవలం కొన్ని లేఖనాల్లోనే కనిపించినా, ఆయన నేడు క్రైస్తవులందరూ అనుకరించదగ్గ వ్యక్తి. యిర్మీయాకు నమ్మకస్థుడైన ఈ కార్యదర్శి చక్కని మాదిరిని మీరు అనుకరిస్తారా?
[అధస్సూచి]
^ పేరా 3 మట్టి ముద్రలను, ప్రాముఖ్యమైన దస్తావేజులకు కట్టబడే దారాన్ని సీలు చేయడానికి ఉపయోగించేవారు. దస్తావేజు యజమాని పేరు లేక దానిని పంపించిన వ్యక్తి పేరు మట్టి ముద్రల మీద ముద్రవేయబడేది.
[16వ పేజీలోని చిత్రం]
బారూకు మట్టిముద్రలు
[చిత్రసౌజన్యం]
మట్టిముద్రలు: Courtesy of Israel Museum, Jerusalem