కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

కీర్తన 72:⁠12 ప్రవచించినట్లుగా యేసు ‘దరిద్రులను’ ఎలా ‘విడిపిస్తాడు’?

క్రీస్తు పరిపాలనా సమయంలో, అవినీతి లేకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. సాధారణంగా యుద్ధాలు పేదరికానికి కారణమవుతాయి, కానీ క్రీస్తు భూమిపై సంపూర్ణ శాంతిని తీసుకువస్తాడు. ప్రజలపట్ల కనికరం చూపిస్తాడు, అందరినీ ఐక్యపరుస్తాడు, మానవజాతికి సమృద్ధిగా ఆహారం ఉండేలా చూస్తాడు. (కీర్తన 72:​4-16)​—⁠5/1, 7వ పేజీ.

క్రైస్తవులుగా మనం మన ‘ధైర్యాన్ని’ ఎలా కనబరచవచ్చు? (1 తిమోతి 3:​13; ఫిలేమోను 8; హెబ్రీయులు 4:​16)

ఆసక్తితో ఇతరులకు ధైర్యంగా ప్రకటించడం ద్వారా, బోధించడం ద్వారా అలాగే సూటిగా, ప్రభావవంతంగా సలహాలనివ్వడం ద్వారా, దేవుడు మన ప్రార్థనలను విని, ప్రతిస్పందిస్తాడనే నమ్మకంతో ప్రార్థనలో మన హృదయాలను దేవుని ఎదుట కుమ్మరించడం ద్వారా మనమలా ధైర్యాన్ని కనబరచవచ్చు.​—⁠5/15, 14-16 పేజీలు.

ధర్మశాస్త్రం ప్రకారం, కొన్ని సహజమైన లైంగిక క్రియలు ఒక వ్యక్తిని ఎందుకు “అపవిత్రము” చేస్తాయి?

వీర్యస్ఖలనానికి, ఋతుస్రావానికి, శిశు జననానికి సంబంధించిన అపవిత్రత గురించిన నియమాలు పారిశుధ్యాన్ని, ఆరోగ్యదాయకమైన జీవనశైలిని పురికొల్పడమేకాక, రక్తానికున్న పవిత్రతను, పాపాల ప్రాయశ్చిత్త అవసరతను కూడా నొక్కిచెప్పాయి.​—⁠6/1, 31వ పేజీ.

ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే, కీర్తనల పుస్తకాన్ని పరిశీలించడం ఎందుకు ప్రయోజనకరం?

దేవునితో మంచి సంబంధం ఏర్పరచుకోవడంవల్ల సంతోషంగా ఉండవచ్చని కీర్తన రచయితలకు తెలుసు. (కీర్తన 112:⁠1) “యెహోవా తమకు దేవుడుగాగల జనుల”లో ఉండడంవల్ల కలిగే సంతోషాన్ని ఏ విధమైన మానవ సంబంధాలు, సంపదలు, విజయాలు తీసుకురాలేవని వారు నొక్కిచెప్పారు. (కీర్తన 144:​15)​—⁠6/15, 12వ పేజీ.

ఇశ్రాయేలీయులకు యెహోవాతో ఎలాంటి ప్రత్యేకమైన సంబంధం ఉంది?

సా.శ.పూ. 1513లో యెహోవా ఇశ్రాయేలీయులను తనతో ఒక క్రొత్త సంబంధంలోకి, ఒక నిబంధనలోకి తీసుకున్నాడు. (నిర్గమకాండము 19:​5, 6; 24:⁠7) అప్పటినుండి, ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకున్న జనాంగంగా ఆయన సమర్పిత ప్రజలుగా జన్మించారు. అయినప్పటికీ, దేవుని సేవచేయడానికి ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి.​—⁠7/1, 21-2 పేజీలు.

మనం ఎందుకు ‘సణుగులను మాని, సమస్త కార్యములను చేయాలి’? (ఫిలిప్పీయులు 2:⁠14)

అనేక లేఖనాధారిత ఉదాహరణలు, సణగడం దేవుని ప్రజలకెంతో హాని కలిగించిందని చూపించాయి. కాబట్టి, సణగడం యొక్క నాశనకర ప్రభావం గురించి నేడు మనం తీవ్రంగా ఆలోచించాలి. అపరిపూర్ణ మానవులకు ఫిర్యాదు చేసే స్వభావం ఉంటుంది, ఆ స్వభావపు ఛాయల్ని కనిపెట్టేందుకు మనం అప్రమత్తంగా ఉండాలి.​—⁠7/15, 16-17 పేజీలు.

సామెతలు 8:22-31లో వర్ణించబడిన జ్ఞానం గూఢార్థపు జ్ఞానం కాదని మనకెలా తెలుసు?

ఆ జ్ఞానం, యెహోవా కార్యాల్లో ప్రథమమైనదానిగా ‘కలుగజేయబడింది’ లేదా సృష్టించబడింది. యెహోవా ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ జ్ఞానవంతునిగానే ఉన్నాడు. ఆయన జ్ఞానం సృష్టించబడలేదు. సామెతలు 8:​22-31లోని జ్ఞానం, సృష్టికర్తయైన యెహోవాయొద్ద “ప్రధానశిల్పిగా” ఉందని తెలియజేస్తుంది. అది సృష్టిలో దేవునితో సన్నిహితంగా పనిచేసి యేసుగా వచ్చిన ఆత్మప్రాణికి అన్వయిస్తుంది. (కొలొస్సయులు 1:​17; ప్రకటన 3:​14)​—⁠8/1, 31వ పేజీ.