కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోబు—సహనశీలి, యథార్థవంతుడు

యోబు—సహనశీలి, యథార్థవంతుడు

యోబు​—⁠సహనశీలి, యథార్థవంతుడు

“నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు.”​—⁠యోబు 1:⁠8.

ఆయనకు అన్నీ ఉన్నాయి​—⁠ధనం, హోదా, మంచి ఆరోగ్యం, సంతోషభరితమైన కుటుంబం. కానీ వెంటవెంటనే జరిగిన మూడు సంఘటనలు ఆయనను విషాదంలో ముంచెత్తాయి. అనూహ్యంగా ఆయన తన సంపదంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత, హఠాత్తుగా సంభవించిన తుఫాను ఆయన పిల్లలందరినీ పొట్టనబెట్టుకుంది. కొద్దిరోజుల తర్వాత, ఆయనకు బాధాకరమైన వ్యాధిసోకి ఒళ్లంతా బాధాకరమైన కురుపులు వచ్చాయి. ఆయనెవరో కాదు తన పేరుతోవున్న పుస్తకంలోని కీలకమైన వ్యక్తైన యోబు అని మీరు బహుశా గుర్తించవచ్చు.​—⁠యోబు 1, 2 అధ్యాయాలు.

2 ‘పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు’ అని ఆయన మూలుగుతూ బాధపడ్డాడు. (యోబు 3:⁠3; 29:⁠2) విపత్తు ముంచుకొచ్చిప్పుడు ఎవరు మాత్రం తమ పాతరోజుల్ని గుర్తుతెచ్చుకోరు? యోబు విషయం తీసుకుంటే, ఆయన నిజాయితీగా జీవిస్తూ, కష్టాలు తన దరిచేరవన్నట్లే బ్రతికాడు. ప్రముఖులు ఆయనను గౌరవించారు, ఆయన సలహా తీసుకునేవారు. (యోబు 29:​5-11) ఆయన సంపన్నుడైనా, ధనం విషయంలో సరైన దృక్కోణాన్ని కనబరిచాడు. (యోబు 31:​24, 25, 28) విధవరాండ్రు, దీనులైన అనాధలు తనకెదురైనప్పుడు, ఆయన వారికి సహాయం చేశాడు. (యోబు 29:​12-16) ఆయన తన భార్యపట్ల నమ్మకంగా ఉన్నాడు.​—⁠యోబు 31:​1, 9, 11.

3 యోబు దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి, ఆయన నిష్కళంకమైన జీవితం గడిపాడు. “అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు” అని యెహోవా అన్నాడు. (యోబు 1:​1, 8) నైతికంగా యోబు యథార్థంగా జీవించినా, విషాద సంఘటనలు ఆయన ప్రశాంత జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. తాను సంపాదించినదంతా అదృశ్యమైపోగా, ఆయన నిజ వ్యక్తిత్వం తీవ్రమైన బాధతో, నిరాశతో పరీక్షించబడింది.

4 అయితే దేవుని సేవకుల్లో యోబు మాత్రమే వ్యక్తిగత విపత్తును అనుభవించలేదు. నేడు చాలామంది క్రైస్తవులు యోబు ఎదుర్కొన్నలాంటి కష్టాలనే బహుశా ఎదుర్కోవచ్చు. కాబట్టి మనమీ రెండు ప్రశ్నలను పరిశీలించడం మంచిది: మనకు విషాదం ఎదురైనప్పుడు యోబుకు కలిగిన పరీక్షను గుర్తు తెచ్చుకోవడం మనకెలా సహాయం చేస్తుంది? యోబుకు కలిగిన పరీక్ష, బాధపడే ఇతరులపట్ల మరింత తదనుభూతి చూపేందుకు మనకెలా నేర్పించవచ్చు?

విశ్వసనీయతా వివాదాంశం, యథార్థతా పరీక్ష

5 యోబు అసాధారణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దేవుని సేవించడంలో యోబు ఉద్దేశాలను అపవాది ప్రశ్నించడం యోబుకు తెలియదు. పరలోకంలో జరిగిన సభలో యెహోవా యోబు చక్కని లక్షణాలను ప్రస్తావించినప్పుడు, సాతాను ఇలా బదులిచ్చాడు: “నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా?” అలా సాతాను, యోబుకు మాత్రమే కాక, దేవుని ఇతర సేవకులందరికీ స్వార్థపూరిత ఉద్దేశాలున్నాయని వాదించాడు. యెహోవాతో సాతాను ఇలా అన్నాడు: “నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.”​—⁠యోబు 1:​8-11.

6 అదొక ప్రాముఖ్యమైన వివాదాంశం. యెహోవా సర్వాధిపత్య నిర్వహణా తీరును సాతాను ప్రశ్నించాడు. ప్రేమతో ఈ విశ్వాన్ని పరిపాలించడం దేవునికి అసలు సాధ్యమౌతుందా? లేక సాతాను వాదించినట్లుగా, చివరకు స్వార్థమే జయిస్తుందా? యెహోవా తన సేవకుడైన యోబు యథార్థత, విశ్వసనీయతపై నమ్మకంతో ఆయనను పరీక్షించేందుకు అపవాదిని అనుమతించాడు. కాబట్టి యోబు ఒకదాని తర్వాత మరొకటి ఎదుర్కొన్న విపత్తులన్నీ సాతాను మూలంగానే కలిగాయి. సాతాను తాను చేసిన తొలి దాడుల్లో విఫలమైనప్పుడు, అతడు యోబును బాధాకరమైన వ్యాధితో మొత్తాడు. “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని అపవాది ఆరోపించాడు.​—⁠యోబు 2:⁠4.

7 నేడు చాలామంది క్రైస్తవులు యోబు అనుభవించినంత విస్తారమైన బాధలను అనుభవించకపోయినా, వివిధరకాల శ్రమలు మాత్రం వారిని బాధిస్తాయి. చాలామంది హింసను లేదా కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్య లేదా అనారోగ్యం తీవ్ర ఇబ్బంది కలిగించవచ్చు. కొందరు తమ విశ్వాసం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. అయితే మనం అనుభవించే ప్రతీ విషాదాన్ని సాతానే స్వయంగా కలిగిస్తున్నాడని అనుకోకూడదు. నిజానికి మనమెదుర్కొనే కొన్ని సమస్యలు మన సొంత తప్పులవల్ల లేదా వారసత్వ శారీరక పరిస్థితులవల్ల కలగవచ్చు. (గలతీయులు 6:⁠7) మనమందరం వృద్ధాప్య ఇబ్బందులకు, ప్రకృతి విపత్తులకు లోనవుతాం. ప్రస్తుత కాలంలో యెహోవా తన సేవకులను ఆ బాధల నుండి అద్భుతరీతిలో కాపాడడని బైబిలు స్పష్టం చేస్తోంది.​—⁠ప్రసంగి 9:​11.

8 అయితే సాతాను మన విశ్వాసాన్ని బలహీనపర్చేందుకు మనమనుభవించే శ్రమలను ఉపయోగించుకోవచ్చు. “సాతాను యొక్క దూతగా” ఉన్న “శరీరములో ఒక ముల్లు” తనను బాధిస్తూ ‘నలగగొడుతున్నదని’ అపొస్తలుడైన పౌలు పేర్కొన్నాడు. (2 కొరింథీయులు 12:⁠7) అది చూపు మందగించడం వంటి శారీరక సమస్య లేక మరేదైనా పౌలు ఆనందాన్ని, యథార్థతను నీరుగార్చేందుకు సాతాను ఆ సమస్యను, తత్ఫలితంగా కలిగే నిరుత్సాహాన్ని ఉపయోగించగలడని పౌలు అర్థం చేసుకున్నాడు. (సామెతలు 24:​10) నేడు, దేవుని సేవకులను ఏదోవిధంగా హింసించేందుకు సాతాను కుటుంబ సభ్యులను, తోటివిద్యార్థులను లేదా నిరంకుశ ప్రభుత్వాలను సహితం పురికొల్పవచ్చు.

9 మనం ఈ సమస్యలను విజయవంతంగా ఎలా ఎదుర్కోవచ్చు? వాటిని యెహోవాపట్ల మన ప్రేమ, ఆయన సర్వాధిపత్యంపట్ల మన విధేయత చంచలమైనవి కావని చూపించేందుకు లభించిన అవకాశంగా దృష్టించడం ద్వారానే. (యాకోబు 1:​2-4) మన సమస్యకు కారణమేదైనా, దేవునిపట్ల విశ్వసనీయంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో అర్థం చేసుకోవడం మన ఆధ్యాత్మిక సమతుల్యతను కాపాడుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.” (1 పేతురు 4:​12) అలాగే పౌలు ఇలా వివరించాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:​12) సాతాను, యోబు యథార్థతను ప్రశ్నించినట్లే యెహోవాసాక్షుల యథార్థతను ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నిజానికి, సాతాను ఈ అంత్యదినాల్లో దేవుని ప్రజలపై తన దాడులను ముమ్మరం చేశాడని బైబిలు సూచిస్తోంది.​—⁠ప్రకటన 12:​9, 17.

అపార్థం, తప్పుడు సలహాలు

10 యోబు ఎదుర్కొన్న అననుకూలతను మనమూ అనుభవించాల్సిన అవసరం లేదు. తనకు ఆ విపత్తులు ఎందుకు కలిగాయో ఆయనకు తెలియదు. “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను” అని యోబు తప్పుగా తలంచాడు. (యోబు 1:​21) దేవుడే తనకు ఆ కష్టం కలిగించాడనే అభిప్రాయాన్ని యోబులో కలిగించేందుకు బహుశా సాతానే ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించివుండవచ్చు.

11 యోబు, తన భార్య చెప్పినట్లుగా దేవుణ్ణి దూషించేందుకు నిరాకరించినా, ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. (యోబు 2:​9, 10) ‘తనకన్నా దుష్టులే చక్కగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తున్నారని’ ఆయన అన్నాడు. (యోబు 21:​7-9) ‘దేవుడు నన్నెందుకు శిక్షిస్తున్నాడు?’ అని ఆయన అనుకొని ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో చనిపోవాలని కోరుకున్నాడు. “నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలు” అని ఆయన వాపోయాడు.​—⁠యోబు 14:​13.

12 యోబుతో “కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును” ఆయన ముగ్గురు స్నేహితులు ఆయనను సందర్శించారు. (యోబు 2:​11) అయితే వారు “బాధకే కర్తలుగా” తయారయ్యారు. (యోబు 16:⁠2) యోబు తన సమస్యల గోడు చెప్పుకోగల స్నేహితుల నుండి ప్రయోజనం పొందవచ్చు, కానీ ఆ ముగ్గురు యోబును మరింత తికమకపెట్టి ఆయనలోని నిరుత్సాహ భావాలను మరింత తీవ్రం చేశారు.​—⁠యోబు 19:⁠2; 26:⁠2.

13 అందువల్ల, యోబు తననిలా ప్రశ్నించుకొని ఉండవచ్చు: ‘నాకే ఇలా ఎందుకు జరగాలి? ఈ కష్టాలన్నీ కలిగేందుకు నేనేం పాపం చేశాను?’ ఆయన స్నేహితులు పూర్తిగా తప్పుదోవ పట్టించే వివరణలు ఇచ్చారు. యోబు ఏదో ఘోరమైన పాపంచేసి ఆ బాధను స్వయంగా తనమీదికి తెచ్చుకున్నాడని వారు భావించారు. “నిరపరాధియైన యొకడు ఎప్పుడైన నశించెనా” అని ఎలీఫజు అడిగి, ఆ తర్వాత ఇలా అన్నాడు: “నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు.”​—⁠యోబు 4:​7, 8.

14 నిజమే, మనం ఆత్మానుసారంగా కాక శరీరానుసారంగా విత్తితే సమస్యలు తలెత్తవచ్చు. (గలతీయులు 6:​7, 8) కానీ ఈ విధానంలో మన ప్రవర్తన ఎలావున్నా సమస్యలు ఎదురుకావచ్చు. అంతేకాక, నిరపరాధులకు ఏ విపత్తూ కలగదని చెప్పడానికి మాత్రం వీల్లేదు. “పాపులలో చేరక ప్రత్యేకముగా” ఉన్న యేసుక్రీస్తు హింసాకొయ్యపై బాధాకరమైన మరణాన్ని అనుభవించాడు, అపొస్తలుడైన యాకోబు హతసాక్షిగా మరణించాడు. (హెబ్రీయులు 7:26; అపొస్తలుల కార్యములు 12:​1, 2) ఎలీఫజు, అతని ఇద్దరు స్నేహితుల తప్పుడు తర్కం, యోబు తనకున్న మంచి పేరు గురించి, నిర్దోషత్వం గురించి వాదించేందుకు నడిపించింది. అయినప్పటికీ, యోబు ఆ బాధలకు అర్హుడనే వారి మూర్ఖ ఆరోపణలు దేవుని న్యాయంపట్ల ఆయన దృక్కోణాన్ని ప్రభావితం చేసివుండవచ్చు.​—⁠యోబు 34:⁠5; 35:⁠2.

శ్రమను ఎదుర్కొన్నప్పుడు సహాయాన్ని కనుగొనడం

15 దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠమేమైనా ఉందా? విషాదాలు, అనారోగ్యం లేదా హింస చాలా అన్యాయమని అనిపించవచ్చు. ఇతర ప్రజలు అలాంటి అనేక సమస్యలను తప్పించుకుంటున్నట్లుగా కనిపించవచ్చు. (కీర్తన 73:​3-12) కొన్నిసార్లు మనల్ని మనం ఈ ప్రాథమిక ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘ఏమి జరిగినా దేవునిపట్ల నాకున్న ప్రేమ ఆయనను సేవించడానికి నన్ను పురికొల్పుతుందా? యెహోవాను “నిందించువారితో [ఆయన] ధైర్యముగా మాటలా[డాలని]” నేను కోరుకుంటున్నానా?’ (సామెతలు 27:​11; మత్తయి 22:​37) ఇతరుల అనాలోచిత వ్యాఖ్యలు మనం మన పరలోకపు తండ్రిని సందేహించేలా చేసేందుకు ఎన్నటికీ అనుమతించకూడదు. దీర్ఘకాలిక వ్యాధితో చాలా సంవత్సరాలపాటు బాధపడిన నమ్మకమైన క్రైస్తవుడు ఒకసారి ఇలా అన్నాడు: “యెహోవా దేనిని అనుమతించినా నేను దానిని సహిస్తాను. నాకవసరమైన బలాన్ని ఆయనిస్తాడని నాకు తెలుసు. అన్ని సందర్భాల్లో ఆయన నన్నలా బలపరిచాడు.”

16 సాతాను తంత్రాలకు సంబంధించి యోబుకు లేని అవగాహన మనకుంది. అతని దుష్ట పన్నాగాలను “మనము ఎరుగనివారముకాము.” (2 కొరింథీయులు 2:​11) అంతేకాక, మనం ప్రయోజనం పొందగల విస్తారమైన జ్ఞానం మనకు అందుబాటులో ఉంది. అన్నిరకాల కష్టాలను సహించిన నమ్మకమైన స్త్రీపురుషుల వృత్తాంతాల్ని మనం బైబిల్లో చూస్తాం. చాలామంది క్రైస్తవులకన్నా ఎక్కువ బాధలు అనుభవించిన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమీయులు 15:⁠4) ఐరోపాలో, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తన విశ్వాసం నిమిత్తం ఖైదు చేయబడిన ఒక సాక్షి బైబిలు కోసం తన మూడురోజుల ఆహారాన్ని వదులుకున్నాడు. “అలా బైబిలును పొందడం ఎంతో ప్రతిఫలదాయకంగా రుజువైంది. శారీరకంగా ఆకలి అనిపించినా, ఆ కష్టకాలాల్లో మా శ్రమలప్పుడు నన్ను, ఇతరులను ప్రోత్సహించేందుకు సహాయపడిన ఆధ్యాత్మిక ఆహారాన్ని నేను పొందాను. ఆ బైబిలు ఇప్పటికీ నా దగ్గరవుంది” అని ఆయన చెబుతున్నాడు.

17 లేఖనాల ఓదార్పుతోపాటు, సమస్యలను తాళుకునేందుకు ప్రయోజనకరమైన నిర్దేశాన్నిచ్చే అనేక బైబిలు అధ్యయన ఉపకరణాలు కూడా మనకున్నాయి. వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, మీరు ఎదుర్కొన్నటువంటి పరీక్షనే ఎదుర్కొన్న తోటి క్రైస్తవుని అనుభవాన్ని మీరు కనుగొనవచ్చు. (1 పేతురు 5:⁠9) అలాగే మీ పరిస్థితుల్ని అర్థం చేసుకునే పెద్దలతో లేదా ఇతర పరిణతిగల క్రైస్తవులతో చర్చించడం కూడా సహాయకరంగా ఉండవచ్చు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, ప్రార్థన ద్వారా యెహోవాపై, ఆయన పరిశుద్ధాత్మ సహాయంపై మీరు ఆధారపడవచ్చు. సాతాను ‘నలగగొట్టడాన్ని’ పౌలు ఎలా ఎదుర్కొన్నాడు? దేవుని శక్తిపై ఆధారపడడాన్ని నేర్చుకోవడం ద్వారానే. (2 కొరింథీయులు 12:​9, 10) “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని ఆయన వ్రాశాడు.​—⁠ఫిలిప్పీయులు 4:​13.

18 కాబట్టి సహాయం అందుబాటులో ఉంది, దాని కోసం అడిగేందుకు మీరెన్నటికీ వెనకాడకూడదు. “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు” అని సామెత చెబుతోంది. (సామెతలు 24:​10) కలపఇంటిని చెదలు పాడుచేసినట్లే, నిరుత్సాహం క్రైస్తవుని యథార్థతను బలహీనపర్చగలదు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు, యెహోవా తోటి దేవుని సేవకుల ద్వారా మనకు మద్దతిస్తాడు. యేసు బంధించబడిన రాత్రి దేవదూత కనబడి ఆయనను బలపరిచాడు. (లూకా 22:​43) పౌలు ఖైదీగా రోముకు ప్రయాణమై వెళ్తూ, అప్పీయా సంతపేట, త్రిసత్రముల దగ్గర సహోదరులను కలుసుకున్నప్పుడు ఆయన “దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొస్తలుల కార్యములు 28:​15) ఒక జర్మన్‌ సాక్షి, బిడియపడుతున్న టీనేజర్‌గా రావన్స్‌బ్రూక్‌ సామూహిక నిర్బంధ శిబిరానికి వచ్చినప్పుడు తనకు అందిన సహాయాన్ని ఇప్పటికీ గుర్తుతెచ్చుకుంటోంది. “తోటి క్రైస్తవ సాక్షి వెంటనే నా దగ్గరకొచ్చి, ఆప్యాయంగా స్వాగతం పలికింది. మరో నమ్మకమైన సహోదరి నన్ను అక్కున చేర్చుకుంది, ఆమె నాకు ఆధ్యాత్మిక తల్లి అయ్యింది” అని ఆమె గుర్తు చేసుకుంటోంది.

‘నమ్మకంగా ఉండండి’

19 యోబు “యథార్థవర్తనుడు” అని యెహోవా వర్ణించాడు. (యోబు 2:⁠3) నిరుత్సాహమున్నా, తానెందుకు బాధపడుతున్నాడో అర్థం కాకపోయినా, ముఖ్య వివాదమైన విశ్వసనీయత విషయంలో యోబు ఎన్నడూ తడబడలేదు. యోబు తన జీవితాశయాన్ని విడిచిపెట్టేందుకు ఒప్పుకోలేదు. ఆయనిలా నొక్కిచెప్పాడు: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.”​—⁠యోబు 27:⁠5.

20 శోధనలు, వ్యతిరేకత లేదా ఆపద వంటి ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మన యథార్థతను కాపాడుకునేందుకు అలాంటి దృఢనిశ్చయమే మనకూ సహాయం చేస్తుంది. స్ముర్న సంఘానికి యేసు ఇలా చెప్పాడు: “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ [కష్టం, వ్యధ లేదా వ్యతిరేకత] కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.”​—⁠ప్రకటన 2:​9, 10.

21 సాతాను పరిపాలించే ఈ లోకంలో, మన సహనం, యథార్థత పరీక్షించబడతాయి. అయినప్పటికీ, మనం భవిష్యత్తు కోసం నిరీక్షిస్తుండగా భయపడాల్సిన అవసరం లేదని యేసు మనకు అభయమిస్తున్నాడు. మనం నమ్మకస్థులుగా నిరూపించుకోవడమే ప్రాముఖ్యమైన విషయం. ‘శ్రమ క్షణమాత్రముంటుంది,’ అయితే “మహిమ” లేదా యెహోవా మనకు వాగ్దానం చేస్తున్న ప్రతిఫలం ‘అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేస్తుంది’ అని పౌలు అన్నాడు. (2 కొరింథీయులు 4:​17, 18) యోబు తన పరీక్షకు ముందూ, ఆ తర్వాతా అనుభవించిన అనేక సంతోష సంవత్సరాలతో పోలిస్తే ఆయనపడ్డ శ్రమలు తాత్కాలికమే.​—⁠యోబు 42:​16.

22 కానీ, మన జీవితంలో ఎదురౌతున్న పరీక్షలకు ముగింపే లేదన్నట్లుగా, మన బాధలు భరించలేనివన్నట్లుగా అనిపించే సమయాలుండవచ్చు. తర్వాతి ఆర్టికల్‌లో సహనం విషయంలో యోబు అనుభవం మనకెలా అదనపు పాఠాలు నేర్పించగలదో పరిశీలిస్తాం. కష్టాలు ఎదుర్కొంటున్న ఇతరులను మనం బలపర్చగల మార్గాల కోసం కూడా మనం చూస్తాం.

మీరెలా జవాబిస్తారు?

యోబు యథార్థత విషయంలో సాతాను ఏ ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని లేవదీశాడు?

కష్టాలు మనల్నెందుకు అమితంగా ఆశ్చర్యపర్చకూడదు?

కష్టాలను సహించడానికి యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యోబు ఎలాంటి అనుకోని విషాద సంఘటనల్ని ఎదుర్కొన్నాడు? (బి) ఆ విషాద సంఘటనలు సంభవించకముందు యోబు జీవితమెలా ఉండేదో వివరించండి?

3. యెహోవా యోబును ఎలా దృష్టించాడు?

4. యోబుకు కలిగిన పరీక్షను పరిశీలించడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది?

5. సాతాను వాదన ప్రకారం, యోబు దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నాడు?

6. ఏ ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని సాతాను లేవనెత్తాడు?

7. దేవుని సేవకులు నేడు ఏయే విధాలుగా యోబు ఎదుర్కొన్నలాంటి పరీక్షలనే ఎదుర్కొంటున్నారు?

8. మనమనుభవించే శ్రమలను ఉపయోగించుకునేందుకు సాతాను ఎలా ప్రయత్నించవచ్చు?

9. కష్టం లేదా హింస మనల్ని ఎందుకు అతిగా ఆశ్చర్యపర్చకూడదు?

10. యోబు ఏ అననుకూలతను ఎదుర్కొన్నాడు?

11. తనకు కలిగిన విపత్తులకు యోబు ఎలా స్పందించాడో వివరించండి.

12, 13. యోబు ముగ్గురు స్నేహితుల వ్యాఖ్యలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

14. అనుచిత ప్రవర్తనను బాధతో మనమెందుకు వెంటనే ముడిపెట్టకూడదు?

15. బాధ ఎదురైనప్పుడు ఏ విధమైన ఆలోచన మనకు సహాయం చేస్తుంది?

16. కష్టాలు అనుభవిస్తున్నవారికి దేవుని వాక్యమెలా సహాయమందిస్తుంది?

17. కష్టాలను సహించేందుకు ఏ దైవిక ఏర్పాట్లు మనకు సహాయం చేయగలవు?

18. తోటి క్రైస్తవులు ఎలా అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఇవ్వగలరు?

19. సాతాను ప్రయత్నాలను నిరోధించేందుకు యోబుకు ఏది సహాయం చేసింది?

20. సహనం ఎందుకు అమూల్యమైనది?

21, 22. శ్రమను సహిస్తున్నప్పుడు, ఎలాంటి జ్ఞానాన్నిబట్టి మనం ఓదార్చబడవచ్చు?

[23వ పేజీలోని చిత్రాలు]

పరిశోధించడం, పరిణతిగల క్రైస్తవులతో మాట్లాడడం, యెహోవాకు పూర్ణహృదయంతో ప్రార్థించడం సహించడానికి మనకు సహాయం చేస్తాయి