కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కీర్తనల పంచమ స్కంధములోని ముఖ్యాంశాలు

కీర్తనల పంచమ స్కంధములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

కీర్తనల పంచమ స్కంధములోని ముఖ్యాంశాలు

ధనవంతులు ఇలా అనవచ్చు: “మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు. మా కొట్లు నింపబడి, . . . మా గొఱ్ఱెలు వేలకొలదిగా [ఉన్నాయి].” అంతేగాక వారింకా ఇలా అనవచ్చు: “ఇట్టి స్థితిగలవారు ధన్యులు.” అయితే దానికి భిన్నంగా కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.” (కీర్తన 144:​12-15) ఎందుకు? ఎందుకంటే యెహోవా సంతోషంగల దేవుడు, ఆయనను ఆరాధించేవారు సంతోషంగా ఉంటారు. (1 తిమోతి 1:⁠8, NW) దైవిక ప్రేరణతో వ్రాయబడిన 107 నుండి 150 వరకున్న కీర్తనలతో రూపొందే చివరి స్కంధములో ఈ సత్యం స్పష్టం చేయబడింది.

కీర్తనల పంచమ స్కంధము యెహోవా ప్రేమపూర్వక దయ, సత్యసంధత, మంచితనం వంటి లక్షణాలతోపాటు ఆయన సర్వోత్కృష్ట లక్షణాలను కూడా ఉన్నతపరుస్తుంది. దేవుని వ్యక్తిత్వం గురించి మనం ఎంతగా తెలుసుకుంటే, మనం ఆయనను ప్రేమించడానికి, ఆయనకు భయపడడానికి అంతగా పురికొల్పబడతాం. ఇది, మన సంతోషానికి దోహదపడుతుంది. కీర్తనల పంచమ స్కంధములో మనం ఎంత విలువైన సందేశాన్ని కనుగొంటామో కదా!​—⁠హెబ్రీయులు 4:​12.

యెహోవా ప్రేమపూర్వక దయనుబట్టి సంతోషంగా ఉండడం

(కీర్తన 107:1-119:​176)

బబులోను చెర నుండి తిరిగివస్తున్న యూదులు ఇలా ఆలపిస్తున్నారు: “ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక!” (కీర్తన 107:​8, 15, 21, 31) దేవుణ్ణి స్తుతిస్తూ దావీదు ఇలా పాడుతున్నాడు: “నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.” (కీర్తన 108:⁠4) తర్వాతి కీర్తనలో ఆయనిలా ప్రార్థిస్తున్నాడు: “యెహోవా నాదేవా . . . నాకు సహాయము చేయుము; నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.” (కీర్తన 109:​18, 19, 26) 110వ కీర్తన మెస్సీయ పరిపాలన గురించి ప్రవచనార్థకంగా తెలియజేస్తోంది. “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము” అని కీర్తన 111:⁠10 చెబుతోంది. తర్వాతి కీర్తన ప్రకారం, ‘యెహోవాయందు భయభక్తులుగలవారు ధన్యులు.’​—⁠కీర్తన 112:⁠1.

113 నుండి 118 కీర్తనలు హల్లేల్‌ కీర్తనలని పిలువబడుతున్నాయి, ఎందుకంటే వాటిలో “అల్లెలూయా” లేక “యెహోవాను స్తుతించుడి” అనే మాటలు తరచూ ఉపయోగించబడ్డాయి. గతంలో మౌఖిక సంప్రదాయంగా ఉన్నవాటిని ఆ తర్వాత వ్రాతరూపంలో పెట్టిన, మూడవ శతాబ్దపు గ్రంథమైన మిష్నా చెబుతున్నదాని ప్రకారం, ఈ పాటలు పస్కా సమయంలో, యూదుల మూడు వార్షిక పండుగల సమయంలో పాడబడేవి. కీర్తనలన్నిటిలోకి, బైబిల్లోని అధ్యాయాలన్నిటిలోకి పెద్దదైన 119వ కీర్తన, వెల్లడిచేయబడిన యెహోవా వాక్యాన్ని లేక సందేశాన్ని ఉన్నతపరుస్తుంది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

109:23​—⁠“సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను” అన్నప్పుడు దావీదు ఉద్దేశమేమిటి? దావీదు తన మరణం సమీపించిందని కావ్యరూపంలో చెబుతున్నాడు.​—⁠కీర్తన 102:​11.

110:​1, 2​—⁠“[దావీదుకు] ప్రభువు” అయిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నప్పుడు ఏమి చేశాడు? యేసు తాను పునరుత్థానం చేయబడిన తర్వాత పరలోకానికి ఆరోహణమై, రాజుగా పరిపాలన ఆరంభించడానికి 1914 వరకు దేవుని కుడిపార్శ్వమున వేచివున్నాడు. ఆ సమయంలో, యేసు తన అభిషిక్త అనుచరులకు వారి ప్రకటనాపనిలో, శిష్యులను చేసేపనిలో నిర్దేశాన్నివ్వడమే కాక, వారు తన రాజ్యంలో తనతోపాటు పరిపాలించడానికి వారిని సిద్ధం చేస్తూ వారిపై పరిపాలించాడు.​—⁠మత్తయి 24:​14; 28:​18-20; లూకా 22:​28-30.

110:4​—⁠ఏ విషయం గురించి ‘యెహోవా ప్రమాణం చేశాడు’? ఈ ప్రమాణం, యేసుక్రీస్తు రాజుగా, ప్రధానయాజకునిగా సేవ చేయడం గురించి యెహోవా ఆయనతో చేసిన నిబంధన.​—⁠లూకా 22:​29.

113:3​—⁠యెహోవా నామము “సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు” ఎలా స్తుతించబడాలి? ఇందులో, ప్రతీరోజు కొంతమంది వ్యక్తులు దేవుణ్ణి ఆరాధించడంకంటే ఎక్కువే ఇమిడివుంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పటి నుండి పశ్చిమాన అస్తమించేవరకు, సూర్యుని కిరణాలు భూగోళాన్నంతటినీ కాంతిమయం చేస్తాయి. అలాగే, యెహోవా భూవ్యాప్తంగా స్తుతించబడాలి. సంస్థీకృత కృషి లేకుండా దీన్ని సాధించడం కుదరదు. యెహోవాసాక్షులమైన మనకు దేవుణ్ణి స్తుతించే, రాజ్య ప్రకటనా పనిలో ఆసక్తిగా భాగం వహించే అమూల్యమైన ఆధిక్యత ఉంది.

116:15​—⁠“యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి” ఎంత “విలువగలది”? యెహోవా ఆరాధకులు ఆయనకు ఎంత విలువైనవారంటే, ఒక గుంపుగా వారి మరణాన్ని ఆయన అనుమతించలేనంత అమూల్యమైనదిగా పరిగణిస్తాడు. అలా జరగడానికి ఒకవేళ యెహోవా అనుమతిస్తే, ఆయన శత్రువులు ఆయనకంటే శక్తిగలవారన్నట్లు అవుతుంది. అంతేగాక, ఒకవేళ అలా జరిగితే, నూతనలోకానికి పునాదిగా భూమిపై ఎవరూ మిగిలివుండరు.

119:71​—⁠శ్రమనొందడం వల్ల కలిగే మేలు ఏమిటి? శ్రమ మనం యెహోవాపై మరింత పూర్తిగా ఆధారపడడాన్ని, ఆయనకు మరింత హృదయపూర్వకంగా ప్రార్థించడాన్ని, బైబిలు అధ్యయనం చేయడంలోనూ అది చెబుతున్నదాన్ని అన్వయించుకోవడంలోనూ మరింత శ్రద్ధ కలిగివుండడాన్ని మనకు బోధిస్తుంది. అంతేగాక, శ్రమకు మనం ప్రతిస్పందించే విధానం మన వ్యక్తిత్వంలో ఉన్న లోపాలను వెల్లడిచేస్తుంది, దానితో మనం వాటిని సరిచేసుకోవచ్చు. శ్రమ మనల్ని శుద్ధి చేయడానికి అనుమతిస్తే అది మనల్ని బాధపెట్టదు.

119:96​—⁠‘సకల సంపూర్ణతకు పరిమితి ఉంది’ అంటే ఏమిటి? కీర్తనకర్త పరిపూర్ణత గురించి మానవ దృక్కోణం నుండి మాట్లాడుతున్నాడు. పరిపూర్ణతకు సంబంధించిన మానవుని ఆలోచన పరిమితమైనదని ఆయన మనసులో ఉండివుండవచ్చు. దానికి భిన్నంగా, దేవుని ఆజ్ఞకు అలాంటి పరిమితి ఏమీ లేదు. దాని నిర్దేశం జీవితంలోని అన్ని అంశాలకు వర్తిస్తుంది. ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లో ఇలా ఉంది: “నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికి ఒక హద్దు ఉంది.”

119:164​—⁠“దినమునకు ఏడు మారులు” దేవుణ్ణి స్తుతించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏడు తరచూ సంపూర్ణతను సూచిస్తుంది. కాబట్టి, యెహోవా స్తుతిని పొందడానికి అర్హుడని కీర్తనకర్త చెబుతున్నాడు.

మనకు పాఠాలు:

107:​27-31. అర్మగిద్దోను వచ్చినప్పుడు లోకంలోని జ్ఞానులు ‘ఎటూతోచక ఉంటారు.’ (ప్రకటన 16:​14, 15) వారి జ్ఞానం నాశనం నుండి ఎవరినీ కాపాడలేదు. రక్షణ కోసం యెహోవాను ఆశ్రయించేవారు మాత్రమే సజీవంగా ఉండి ‘ఆయన కృపనుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.’

109:​30, 31; 110:⁠5. కత్తి పట్టుకొనివుండే సైనికుని కుడిచెయ్యికి సాధారణంగా డాలువల్ల కాపుదల ఉండదు, ఎందుకంటే డాలును ఎడమచేత్తో పట్టుకుంటారు. సూచనార్థకంగా, యెహోవా తన సేవకుల పక్షాన పోరాడడానికి వారి “కుడిప్రక్కన” ఉంటాడు. అలా ఆయన వారికి కాపుదల, సహాయం అందజేస్తాడు, ఆయనకు ‘మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి’ మనకు ఒక చక్కని కారణం.

113:​4-9. యెహోవా ఎంత ఉన్నతంగా ఉన్నాడంటే, ‘ఆకాశాన్ని’ కూడా ఆయన వంగి చూడాలి. అయినప్పటికీ, ఆయన దరిద్రులపట్ల, బీదలపట్ల, గొడ్రాళ్ళపట్ల కనికరం కలిగివున్నాడు. సర్వోన్నత ప్రభువైన యెహోవా వినయం గలవాడు, తన ఆరాధకులు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుతున్నాడు.​—⁠యాకోబు 4:⁠6.

114:​3-7. యెహోవా ఎఱ్ఱసముద్రం దగ్గర, యొర్దాను నది దగ్గర, సీనాయి పర్వతం దగ్గర తన ప్రజల కోసం చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసుకోవడం మనల్ని లోతుగా ప్రభావితం చేయాలి. “భూమి” ప్రాతినిధ్యం వహిస్తున్న మానవజాతి, ప్రభువునుబట్టి, సూచనార్థకంగా ‘వణకాలి’ అంటే సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాలి.

119:​97-101. దేవుని వాక్యం నుండి జ్ఞానాన్ని, అంతర్దృష్టిని, అవగాహనను సంపాదించుకోవడం మనల్ని ఆధ్యాత్మిక హాని నుండి కాపాడుతుంది.

119:​105. దేవుని వాక్యం మన పాదములకు దీపములా ఉంది, అదెలాగంటే ప్రస్తుత సమస్యలతో వ్యవహరించడానికి అది మనకు సహాయం చేయగలదు. అది సూచనార్థకంగా మన త్రోవకు వెలుగుగా కూడా ఉంటుంది, ఎందుకంటే అది భవిష్యత్తుపట్ల దేవుని సంకల్పాన్ని మనకు ముందే తెలియజేస్తుంది.

కష్టాలున్నా సంతోషంగా ఉండడం

(కీర్తన 120:1-145:​21)

మనం క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవచ్చు, కష్టాలను ఎలా తప్పించుకుని సజీవంగా ఉండవచ్చు? 120 నుండి 134 కీర్తనలు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. మనం సహాయం కోసం యెహోవా వైపు చూడడం ద్వారా కష్టాలను తప్పించుకుని సజీవంగా ఉండవచ్చు, మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు. యాత్రకీర్తనలు అని పిలువబడే ఈ కీర్తనలను, ఇశ్రాయేలీయులు తమ వార్షిక పండుగల కోసం యెరూషలేముకు ప్రయాణించేటప్పుడు పాడివుండవచ్చు.

135, 136 కీర్తనలు యెహోవాను నిస్సహాయమైన విగ్రహాలకు భిన్నంగా, తన చిత్తానుసారం చేసేవానిగా వర్ణిస్తున్నాయి. 136వ కీర్తన ప్రతిస్పందనగా పాడడం కోసం కూర్చబడింది, ప్రతీ వచనంలోని చివరి భాగం, మొదటి భాగానికి ప్రతిస్పందనగా పాడబడుతుంది. తర్వాతి కీర్తన, యెహోవాను సీయోనులో ఆరాధించాలని కోరుకుంటున్న బబులోనులోవున్న యూదుల హృదయవిదారక స్థితి గురించి చెబుతుంది. 138 నుండి 145 కీర్తనలు దావీదు వ్రాసినవి. ఆయన ‘తన పూర్ణహృదయముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని’ కోరుకున్నాడు. ఎందుకు? “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి” అని ఆయన చెబుతున్నాడు. (కీర్తన 138:⁠1; 139:​14) తర్వాతి ఐదు కీర్తనల్లో, దావీదు చెడ్డవారి నుండి కాపుదల కోసం, నీతియుక్తమైన గద్దింపుల కోసం, హింసించేవారి నుండి విడుదల కోసం, ప్రవర్తనలో నిర్దేశం కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన యెహోవా ప్రజల సంతోషాన్ని నొక్కిచెబుతున్నాడు. (కీర్తన 144:​15) దావీదు దేవుని గొప్పతనాన్ని, మంచితనాన్ని సమీక్షించిన తర్వాత ఇలా ప్రకటిస్తున్నాడు: “నా నోరు యెహోవాను స్తోత్రము చేయును; శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.”​—⁠కీర్తన 145:​21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

122:⁠3​—⁠యెరూషలేము ‘బాగుగా కట్టబడిన పట్టణము’ అంటే అర్థమేమిటి? ప్రాచీనకాల పట్టణాల్లోలాగే యెరూషలేములోని ఇళ్లు కూడా దగ్గరదగ్గరగా కట్టబడ్డాయి. ఆ పట్టణం ఒకచోట కూర్చినట్టుగా ఉండి, రక్షించుకునేందుకు సులభంగా ఉండేది. అంతేకాక, ఇళ్లు దగ్గరదగ్గరగా ఉండడంవల్ల పట్టణవాసులు సహాయం, కాపుదల కోసం పరస్పరం ఆధారపడేందుకు వీలుండేది. ఇది 12 గోత్రాల ఇశ్రాయేలీయులు ఆరాధనకై ఒకచోట సమకూడినప్పుడు వారిలోని ఆధ్యాత్మిక ఐక్యతను సూచిస్తుంది.

123:2​—⁠దాసుల కన్నుల గురించిన ఉదాహరణలోని విషయమేమిటి? దాసులు, దాసీలు తమ యజమాని లేక యజమానురాలి చేతితట్టు చూడడానికి రెండు కారణాలున్నాయి: అతని లేక ఆమె ఇష్టాలేమిటో తెలుసుకోవడానికి, లేక కాపుదలను, జీవితావసరాలను పొందడానికి. అలాగే, మనం కూడా యెహోవా చిత్తాన్ని గ్రహించి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఆయనవైపు చూస్తాము.

131:​1-3​—⁠“చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు” దావీదు ఎలా ‘తన ప్రాణమును నిమ్మళపరచుకొని సముదాయించుకున్నాడు’? తల్లిపాలు త్రాగడం మానేసిన బిడ్డ ఎలాగైతే తన తల్లి చేతుల్లో ఓదార్పును, సంతృప్తిని పొందుతుందో అలా దావీదు “చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు” తన ప్రాణమును నిమ్మళపరచుకోవడం, సముదాయించుకోవడం నేర్చుకున్నాడు. ఎలా? హృదయంలో అహంకారంగా ఉండకుండా, కన్నులను తనకు అందనివాటి మీద ఉంచకుండా, గొప్పవాటిని అనుసరించకుండా ఉండడం ద్వారా ఆయనలా నేర్చుకున్నాడు. ఉన్నతస్థానాన్ని ఆశించే బదులు దావీదు సాధారణంగా తన పరిమితులను గుర్తించి, వినయం చూపించాడు. మనం, ప్రాముఖ్యంగా సంఘంలో ఆధిక్యతలు కావాలని కోరుకుంటున్నప్పుడు, ఆయన దృక్పథాన్ని అనుకరించడం జ్ఞానయుక్తమైనది.

మనకు పాఠాలు:

120:​1, 2, 6, 7. అపనిందలు వేయడం, తీవ్రంగా విమర్శించడం వంటివి ఇతరులకు భరించలేని బాధను కలిగిస్తాయి. మనం “కోరునది సమాధానమే” అని చూపించడానికి, మన నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక మార్గం.

120:​3, 4. “మోసకరమైన నాలుక” ఉన్న ఎవరినైనా మనం భరించాలంటే, యెహోవా తగిన కాలంలో పరిస్థితులను చక్కబరుస్తాడని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందవచ్చు. అపవాదకులు ‘బలాఢ్యుని’ చేతుల్లో విపత్తును ఎదుర్కొంటారు. వారు “తంగేడునిప్పులతో కూడిన బాణములు” సూచిస్తున్న యెహోవా ఉగ్రతా తీర్పును తప్పక ఎదుర్కొంటారు.

127:​1, 2. మనం మన ప్రయత్నాలన్నిటిలో నడిపింపు కోసం యెహోవా వైపు చూడాలి.

133:​1, 3. యెహోవా ప్రజల ఐక్యత ప్రశాంతమైనది, ఆరోగ్యదాయకమైనది, ఉత్తేజకరమైనది. మనం తప్పులుపట్టడం, కీచులాడడం, ఫిర్యాదుచేయడం వంటివి చేయడం ద్వారా దాన్ని పాడుచేయకూడదు.

137:1, 5, 6. పరవాసంలో ఉన్న యెహోవా ఆరాధకులు, ఆ సమయంలో దేవుని సంస్థ యొక్క భూభాగంగా ఉన్న సీయోనుపట్ల తమ యథార్థతను కాపాడుకోవాలని భావించారు. మన విషయమేమిటి? నేడు యెహోవా ఉపయోగించుకుంటున్న సంస్థను మనం యథార్థంగా అంటిపెట్టుకుని ఉంటున్నామా?

138:⁠2. యెహోవా ‘తన నామమంతటికంటె తానిచ్చిన వాక్యమును గొప్పచేస్తాడు’ అంటే ఆయన తన నామమున వాగ్దానం చేసిన దానంతటి నెరవేర్పు మనకున్న ఆశలన్నిటినీ మించినదై ఉంటుంది. నిజంగా మన కోసం ఘనమైన ఉత్తరాపేక్షలు వేచివున్నాయి.

139:​1-6, 15, 16. యెహోవాకు, మనం మాట్లాడకముందే మన కార్యకలాపాలు, మన తలంపులు, మన మాటలు తెలుసు. మనం పిండంగా ఏర్పడినప్పుడే, ఇంకా మన శరీర భాగాలు పూర్తిగా ఏర్పడకముందే మనం ఆయనకు తెలుసు. వ్యక్తులుగా మన గురించి దేవునికి తెలిసినది మనం అర్థం చేసుకోలేనంత ‘అగోచరమైనది.’ యెహోవా మనం ఎదుర్కొంటున్న కష్టపరిస్థితిని చూడడమే కాక, అది మనపై చూపించే ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా!

139:​7-12. మనం వెళ్ళే ఏ స్థలమైనా దేవుడు మనల్ని బలపర్చడానికి చేరుకోలేనంత సుదూరమైనది కాదు.

139:​17, 18. యెహోవాను గురించిన జ్ఞానము మనకు మనోహరమైనదిగా ఉందా? (సామెతలు 2:​10) అలాగైతే, మనం అక్షయమైన ఆనందపు ఊటను కనుగొన్నట్లే. యెహోవా తలంపులు “యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి.” ఆయన గురించి తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఎంతో ఉంటుంది.

139:​23, 24. మనలో ‘యెహోవాకు ఆయాసకరమైనది’ ఏమైనా ఉందేమో అంటే అనుచిత తలంపులు, కోరికలు, ఆశలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించాలని, వాటిని తొలగించుకోవడానికి మనకు సహాయం చేయాలని మనం కోరుకుంటాం.

143:​4-7. తీవ్రమైన కష్టాలను సహితం మనం ఎలా సహించవచ్చు? దానికి కీలకాన్ని కీర్తనకర్త మనకు చెబుతున్నాడు: యెహోవా కార్యాల గురించి ధ్యానిస్తూ, ఆయన చేసేవాటిపట్ల శ్రద్ధ కలిగివుండి, సహాయం కోసం ఆయనకు ప్రార్థించాలి.

“యెహోవాను స్తుతించుడి!”

మొదటి నాలుగు స్కంధములలో ప్రతీ కీర్తన యెహోవాను స్తుతించడంతో ముగుస్తుంది. (కీర్తన 41:​13;72:​19, 20; 89:​52; 106:​48) చివరి స్కంధము కూడా దీనికి మినహాయింపేమీ కాదు. కీర్తన 150:6 ఇలా చెబుతోంది: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి.” అది దేవుని నూతనలోకంలో తప్పక నెరవేరుతుంది.

ఆ ఆశీర్వాదకరమైన సమయం కోసం మనం ఎదురుచూస్తుండగా, నిజమైన దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన నామాన్ని స్తుతించడానికి మనకు తగినంత కారణం ఉంది. మనకు యెహోవా తెలిసినందుకు, ఆయనతో మంచి సంబంధాన్ని కలిగివున్నందుకు, మనకు లభిస్తున్న ఆనందం గురించి ఆలోచిస్తే, ఆయనను కృతజ్ఞతాపూర్వక హృదయంతో స్తుతించడానికి మనం పురికొల్పబడమా?

[15వ పేజీలోని చిత్రం]

యెహోవా అద్భుతకార్యాలు భక్తిపూర్వక భయం కలిగిస్తాయి

[16వ పేజీలోని చిత్రం]

యెహోవా తలంపులు “యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి”