కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ప్రార్థన ఆలకించే” దేవుణ్ణి ఎలా సమీపించవచ్చు?

“ప్రార్థన ఆలకించే” దేవుణ్ణి ఎలా సమీపించవచ్చు?

“ప్రార్థన ఆలకించే” దేవుణ్ణి ఎలా సమీపించవచ్చు?

“ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.”​—⁠కీర్తన 65:⁠2.

భూమ్మీదున్న సమస్త జీవరాశుల్లో మానవులకు మాత్రమే సృష్టికర్తను ఆరాధించే సామర్థ్యముంది. మానవులు మాత్రమే తమకు ఆధ్యాత్మిక అవసరత ఉన్నట్లు భావించడమే కాక, ఆ అవసరతను తీర్చుకోవాలని కూడా కోరుకుంటారు. ఇది మన పరలోకపు తండ్రితో వ్యక్తిగత సంబంధం కలిగివుండే అద్భుతమైన అవకాశాన్నిస్తుంది.

2 సృష్టికర్తను సమీపించే సామర్థ్యంతో దేవుడు మానవులను సృష్టించాడు. ఆదాము హవ్వలు పాపరహితులుగా సృష్టించబడ్డారు. అందుకే వారు ఒక పిల్లవాడు ధైర్యంగా తన తండ్రి దగ్గరకు వెళ్లినట్లే వారు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. అయితే, వారు పాపం చేయడంవల్ల ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నారు. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులై ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకున్నారు. (ఆదికాండము 3:​8-13, 17-24) అంటే ఆదాము అపరిపూర్ణ సంతానం ఇక ఎన్నడూ దేవునితో సంభాషించలేదని దానర్థమా? కాదు, వారు తనను సమీపించేందుకు యెహోవా ఇప్పటికీ అనుమతిస్తున్నాడు, అయితే వారు కొన్ని షరతులకు కట్టుబడాలి. ఆ షరతులు ఏమిటి?

దేవుని సమీపించేందుకు అవసరమైన షరతులు

3 ఆదాముకు పుట్టిన ఇద్దరు కుమారులు ఇమిడివున్న ఒక సంఘటన, దేవుడు తనను సమీపించేందుకు అపరిపూర్ణ మానవుల నుండి ఏమి కోరుతున్నాడో గ్రహించేందుకు మనకు సహాయం చేస్తుంది. బలులు అర్పించడం ద్వారా కయీను, హేబెలు దేవుణ్ణి సమీపించేందుకు ప్రయత్నించారు. హేబెలు బలి అంగీకరించబడి కయీను బలి తిరస్కరించబడింది. (ఆదికాండము 4:​3-5) ఎందుకు అలా జరిగింది? హెబ్రీయులు 11:4 ఇలా చెబుతోంది: “విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను.” కాబట్టి, దేవుణ్ణి సమీపించాలంటే విశ్వాసం అవసరమనేది స్పష్టం. కయీనుతో యెహోవా పలికిన ఈ మాటల్లో మరో అవసరత కనబడుతుంది: “నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా?” అవును, కయీను సత్క్రియ చేస్తే, దేవుడు అతని బలిని అంగీకరించేవాడు. కానీ, కయీను దేవుని హితవును తిరస్కరించి హేబెలును హతమార్చాడు, ఫలితంగా అతను దేశదిమ్మరి అయ్యాడు. (ఆదికాండము 4:​7-12) అలా మానవ చరిత్రారంభంలోనే సత్క్రియలతోపాటు విశ్వాసంతో దేవుణ్ణి సమీపించడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పబడింది.

4 మనం దేవుణ్ణి సమీపించాలంటే మన స్వంత పాపపు స్థితిని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. మానవులందరూ పాపులే, ఒక వ్యక్తి దేవుణ్ణి సమీపించకుండా పాపం అడ్డగిస్తుంది. ఇశ్రాయేలీయుల గురించి ప్రవక్తయైన యిర్మీయా ఇలా వ్రాశాడు: “మేము . . . ద్రోహులము . . . మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.” (విలాపవాక్యములు 3:​42, 44) మానవులు పాపులైనప్పటికీ, విశ్వాసంతో, సరైన హృదయ స్వభావంతో, ఆయన ఆజ్ఞలు గైకొంటూ తనను సమీపించే వారి ప్రార్థనలను అంగీకరించేందుకు తానిష్టపడతానని దేవుడు మానవ చరిత్రంతటిలో చూపించాడు. (కీర్తన 119:​145) అలాంటి వ్యక్తులు ఎవరు, వారి ప్రార్థనల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5 అలాంటి వ్యక్తుల్లో ఒకరు అబ్రాహాము. తనను సమీపించడానికి అబ్రాహాము చేసిన ప్రయత్నాలను దేవుడు అంగీకరించాడు, అందుకే దేవుడు ఆయనను ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు. (యెషయా 41:⁠8) అబ్రాహాము దేవుణ్ణి సమీపించిన తీరునుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఈ నమ్మకస్థుడైన పితరుడు వారసుని విషయంలో యెహోవాను ఇలా అడిగాడు: “ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే”? (ఆదికాండము 15:​2, 3; 17:​18) మరో సందర్భంలో, ఆయన సొదొమ గొమొర్రాల్లోని దుష్టులకు వ్యతిరేకంగా దేవుడు తీర్పుతీర్చినప్పుడు ఎవరు రక్షించబడతారనే విషయంలో తన చింతను వ్యక్తం చేశాడు. (ఆదికాండము 18:​23-33) అలాగే అబ్రాహాము ఇతరుల కోసం విన్నపాలు చేశాడు. (ఆదికాండము 20:​7, 17) హేబెలు చేసినట్లే, అబ్రాహాము కొన్ని సందర్భాల్లో యెహోవాకు బలి అర్పిస్తూ దేవుణ్ణి సమీపించాడు.​—⁠ఆదికాండము 22:​9-14.

6 ఈ సందర్భాలన్నింటిలో, అబ్రాహాము దేవునితో ధైర్యంగా మాట్లాడాడు. అయితే ఆయన ధైర్యంతోపాటు సృష్టికర్త ఎదుట తనస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని వినయంతో మాట్లాడాడు. ఆయన వినయపూర్వకంగా పలికిన మాటల్ని ఆదికాండము 18:27లో గమనించండి: “ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.” అనుకరించడానికి అదెంత చక్కని వైఖరో కదా!

7 వివిధ విషయాల గురించి పితరులు ప్రార్థించారు, వారి ప్రార్థనలను కూడా యెహోవా విన్నాడు. యాకోబు ఒక ప్రమాణం రూపంలో ప్రార్థించాడు. దేవుని మద్దతు కోసం అడిగిన తర్వాత ఆయన నిజాయితీగా ఇలా వాగ్దానం చేశాడు: “నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను.” (ఆదికాండము 28:​20-22) ఆ తర్వాత, యాకోబు తన అన్నను కలుసుకునేముందు, రక్షణ కోసం యెహోవాను వేడుకుంటూ ఆయనిలా అన్నాడు: “నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము . . . అతనికి భయపడుచున్నాను.” (ఆదికాండము 32:​9-12) పితరుడైన యోబు కుటుంబ సభ్యుల కోసం బలులు అర్పిస్తూ వారి తరఫున యెహోవాను సమీపించాడు. యోబు ముగ్గురు స్నేహితులు తమ మాటలనుబట్టి పాపం చేసినప్పుడు, యోబు వారి కోసం ప్రార్థించినప్పుడు, “యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.” (యోబు 1:⁠5; 42:​7-9) ఈ వృత్తాంతాలు మనం యెహోవాకు ఏ విషయాల గురించి ప్రార్థించవచ్చో గుర్తించేందుకు సహాయం చేస్తాయి. అలాగే సరైన రీతిలో తనను సమీపించేవారి ప్రార్థనలను అంగీకరించేందుకు యెహోవా సిద్ధంగా ఉన్నాడని కూడా మనం గ్రహిస్తాం.

ధర్మశాస్త్రం ప్రకారం

8 ఐగుప్తునుండి యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల చేసిన తర్వాత, ఆయన వారికి ధర్మశాస్త్రమిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం నియమిత యాజకత్వం ద్వారా దేవునికి ప్రార్థించే విధానాన్ని వివరించింది. కొందరు లేవీయులు ప్రజల తరఫున ప్రార్థించేందుకు నియమించబడ్డారు. జాతీయ ప్రాముఖ్యతగల విషయాలు తలెత్తినప్పుడు, వాటి గురించి ప్రజల ప్రతినిధుల్లో ఒకరు అంటే కొన్నిసార్లు రాజు గానీ, ప్రవక్త గానీ ఆ విషయం గురించి దేవునికి ప్రార్థించేవారు. (1 సమూయేలు 8:​21, 22; 14:​36-41; యిర్మీయా 42:​1-3) ఉదాహరణకు, ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో రాజైన సొలొమోను హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించాడు. దానికి జవాబుగా యెహోవా, ఆ ఆలయాన్ని తన తేజస్సుతో నింపి, ఇలా చెప్పడం ద్వారా తాను సొలొమోను ప్రార్థనను అంగీకరిస్తున్నట్లు సూచించాడు: ‘ఈ స్థలమందు చేయబడు ప్రార్థనను నా చెవులు ఆలకించును.’​—⁠2 దినవృత్తాంతములు 6:12-7:⁠3; 7:​15.

9 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, తనను దేవాలయంలో అంగీకారమైన విధంగా సమీపించేందుకు ఒక నియమాన్ని చేర్చాడు. ఆ నియమమేమిటి? ప్రతీరోజు ఉదయం, సాయంకాలం జంతు బలులు అర్పించడంతోపాటు, ప్రధానయాజకుడు యెహోవాకు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయాలి. ఆ తర్వాత, పాపపరిహారార్థపు రోజున తప్ప మిగతారోజుల్లో ఉపయాజకులు కూడా ఈ సేవను కొనసాగించారు. యాజకులు గౌరవప్రదంగా ఆ పవిత్ర సేవను చేయకపోతే, యెహోవా వారి పరిచర్యను ఇష్టపడడు.​—⁠నిర్గమకాండము 30:​7, 8; 2 దినవృత్తాంతములు 13:​11.

10 ప్రాచీన ఇశ్రాయేలులో, దేవుణ్ణి సమీపించడం కేవలం నియమిత ప్రతినిధుల ద్వారానే సాధ్యమయ్యేదా? లేదు, వ్యక్తిగత ప్రార్థనలను కూడా అంగీకరించేందుకు యెహోవా ఇష్టపడ్డాడని లేఖనాలు చూపిస్తున్నాయి. ఆలయంలో ప్రతిష్ఠాపనా ప్రార్థనలో సొలొమోను యెహోవాను ఇలా వేడుకున్నాడు: “ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను . . . ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకిం[చాలి].” (2 దినవృత్తాంతములు 6:​29, 30) బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రియైన జెకర్యా, ఆలయంలో ధూపము వేస్తున్నప్పుడు, యాజకులుకాని యెహోవా ఆరాధకులు అనేకమంది “వెలుపల” ప్రార్థన చేస్తున్నారని లూకా వృత్తాంతం మనకు చెబుతోంది. బంగారు వేదికపై యెహోవాకు ధూపం వేసే సమయంలో ఆలయం వెలుపల ప్రజలు సమకూడి ప్రార్థించడం వాడుకగా ఉన్నట్లు స్పష్టమౌతోంది.​—⁠లూకా 1:​8-10.

11 కాబట్టి, సరైన రీతిలో యెహోవాను సమీపించినప్పుడు, జనాంగానికి ప్రాతినిధ్యం వహించినవారి విన్నపాలతోపాటు ఆయనను వ్యక్తిగతంగా సమీపించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల విజ్ఞాపనలు ఆయన సంతోషంగా అంగీకరించాడు. నేడు మనం ఆ ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించడం లేదు. అయినప్పటికీ, ప్రాచీనకాల ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సమీపించిన విధాలనుండి ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు.

క్రైస్తవ ఏర్పాటు ప్రకారం

12 మనమిప్పుడు క్రైస్తవ ఏర్పాటు ప్రకారం జీవిస్తున్నాం. దేవుని ప్రజల కోసం యాజకులు ప్రార్థించేందుకు లేదా ఆలయమున్న దిక్కుకు తిరిగి దేవునికి ప్రార్థించేందుకు భౌతికసంబంధ ఆలయమేదీ నేడు ఉనికిలో లేదు. అయినప్పటికీ, మనం తనను సమీపించేలా యెహోవాకు ఒక ఏర్పాటు చేశాడు. అదేమిటి? సా.శ. 29లో క్రీస్తు అభిషేకించబడి ప్రధానయాజకునిగా నియమించబడినప్పుడు, ఒక ఆధ్యాత్మిక ఆలయం పనిచేయడం ఆరంభించింది. * ఈ ఆధ్యాత్మిక ఆలయం, యేసుక్రీస్తు పరిహారార్థ బలి ఆధారంగా చేసే ఆరాధనలో యెహోవాను సమీపించే ఒక క్రొత్త ఏర్పాటు.​—⁠హెబ్రీయులు 9:​11, 12.

13 యెరూషలేము దేవాలయంలోని అనేక అంశాలు, ప్రార్థనకు సంబంధించిన అంశాలతోపాటు ఆధ్యాత్మిక ఆలయంలోని ఏర్పాట్లకు చక్కని చిత్రీకరణగా ఉన్నాయి. (హెబ్రీయులు 9:​1-10) ఉదాహరణకు, ఆలయంలోని పరిశుద్ధ స్థలంలోవున్న ధూపవేదికపై ఉదయం, సాయంకాలం వేయబడే ధూపం దేనికి ప్రతీకగా ఉంది? ప్రకటన గ్రంథము ప్రకారం అవి “పరిశుద్ధుల ప్రార్థనలు.” (ప్రకటన 5:⁠8; 8:​3, 4) దావీదు ఇలా వ్రాసేందుకు ప్రేరేపించబడ్డాడు: “నా ప్రార్థన ధూపమువలె . . . నీ దృష్టికి అంగీకారములగును గాక.” (కీర్తన 141:⁠2) కాబట్టి, క్రైస్తవ ఏర్పాటులో ఆ పరిమళ ధూపం అంగీకృత ప్రార్థనలకు, యెహోవా స్తుతులకు ప్రతీకగా ఉండడం సముచితమే.​—⁠1 థెస్సలొనీకయులు 3:​9.

14 ఈ ఆధ్యాత్మిక ఆలయంలో ఎవరు దేవుణ్ణి సమీపించవచ్చు? భౌతిక ఆలయంలో యాజకులకు, లేవీయులకు లోపలి ఆవరణలో సేవచేసే ఆధిక్యత ఉన్నా, యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలిగారు. పరలోక నిరీక్షణగల అభిషిక్త క్రైస్తవులు తాము దేవునికి ప్రార్థనలు, స్తుతులు చెల్లించేందుకు దోహదపడే లోపలి ఆవరణ, పరిశుద్ధ స్థలం ఛాయగావున్న ప్రత్యేక ఆధ్యాత్మిక స్థితిని ఆస్వాదిస్తున్నారు.

15 మరి భూనిరీక్షణగల “వేరే గొఱ్ఱెల” మాటేమిటి? (యోహాను 10:​16) “అంత్యదినములలో” యెహోవాను ఆరాధించేందుకు అనేక జనాంగాల ప్రజలు వస్తారని ప్రవక్తయైన యెషయా సూచించాడు. (యెషయా 2:​2, 3) “అన్యులు” లేదా పరదేశులు యెహోవా పక్షాన చేరతారని కూడా ఆయన వ్రాశాడు. వారు చేరడాన్ని తాను అంగీకరిస్తానని సూచిస్తూ దేవుడు ఇలా చెప్పాడు: “నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను.” (యెషయా 56:​6, 7) ఆ ఆధ్యాత్మిక ఆలయం వెలుపలి ఆవరణలో నిలబడి “రాత్రింబగళ్లు” దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించడానికి సమకూడే “ప్రతి జనములోనుండి” వచ్చిన “గొప్పసమూహము” గురించి మాట్లాడుతూ ప్రకటన 7:​9-15 మరిన్ని వివరాలను అందిస్తోంది. దేవుడు తమ ప్రార్థనలు వింటాడనే పూర్తి నమ్మకంతో నేడు దేవుని సేవకులందరూ ధైర్యంగా ఆయనను సమీపించవచ్చనే తలంపు ఎంత ఓదార్పుకరమో కదా!

ఎలాంటి ప్రార్థనలు అంగీకరించబడతాయి?

16 తొలి క్రైస్తవులు ప్రార్థనాపూర్వక ప్రజలుగా ఉన్నారు. వారు ఎలాంటి విషయాల గురించి ప్రార్థించారు? సంస్థాగత బాధ్యతలకోసం పురుషులను ఎంచుకునే విషయంలో క్రైస్తవ పెద్దలు నిర్దేశం కోసం ప్రార్థించారు. (అపొస్తలుల కార్యములు 1:​24, 25; 6:​5, 6) తోటి విశ్వాసుల కోసం ఎపఫ్రా ప్రార్థించాడు. (కొలొస్సయులు 4:​12) పేతురు చెరసాలలో వేయబడినప్పుడు యెరూషలేము సంఘ సభ్యులు ఆయన కోసం ప్రార్థించారు. (అపొస్తలుల కార్యములు 12:⁠5) వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు తమకు ధైర్యం ఇమ్మని దేవుణ్ణి అడుగుతూ తొలి క్రైస్తవులు ఇలా ప్రార్థించారు: “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.” (అపొస్తలుల కార్యములు 4:​23-30) పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు జ్ఞానం కోసం దేవుణ్ణి ప్రార్థించమని శిష్యుడైన యాకోబు క్రైస్తవులను ప్రోత్సహించాడు. (యాకోబు 1:⁠5) యెహోవాకు మీరుచేసే విన్నపాల్లో అలాంటి అంశాలను చేరుస్తారా?

17 దేవుడు అన్ని ప్రార్థనలూ అంగీకరించడు. అలాంటప్పుడు మన ప్రార్థనలు అంగీకరించబడతాయనే నమ్మకంతో మనమెలా ప్రార్థించవచ్చు? పూర్వం దేవుడు నమ్మకస్థులైనవారి ప్రార్థనలు ఆలకించాడు, వారు నిజాయితీతో, సరైన హృదయ దృక్పథంతో ఆయనను సమీపించారు. వారు విశ్వాసంతోపాటు సత్క్రియలనూ ప్రదర్శించారు. నేడు ఆ విధంగా తనను సమీపించేవారి ప్రార్థనలను యెహోవా వింటాడని మనం నమ్మవచ్చు.

18 మరో నియమం కూడా ఉంది. అపొస్తలుడైన పౌలు దానినిలా వివరిస్తున్నాడు: “ఆయన ద్వారానే మనము . . . ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.” “ఆయన ద్వారానే” అని వ్రాసినప్పుడు పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు గురించే. (ఎఫెసీయులు 2:​13, 18) అవును, యేసు ద్వారా మాత్రమే మనం తండ్రిని ధైర్యంగా సమీపించవచ్చు.​—⁠యోహాను 14:⁠6; 15:​16; 16:​23, 24.

19 ముందు పేర్కొన్నట్లుగా, ఇశ్రాయేలీయుల యాజకులు అర్పించే ధూపం దేవుని నమ్మకమైన సేవకుల అంగీకృత ప్రార్థనలను సూచించింది. అయితే, ఇశ్రాయేలీయులు అర్పించిన ధూపార్పణలను యెహోవా కొన్నిసార్లు అసహ్యించుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఒకప్రక్క ధూపంవేస్తూ అదే సమయంలో విగ్రహాలకు సాగిలపడినప్పుడు ఆయనలా అసహ్యించుకున్నాడు. (యెహెజ్కేలు 8:​10, 11) అలాగే నేడుకూడా, యెహోవాను సేవిస్తున్నామని చెప్పుకుంటూ, అదే సమయంలో ఆయన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి ప్రార్థనలను ఆయనకు అసహ్యమైన వాసనగా ఉంటాయి. (సామెతలు 15:⁠8) కాబట్టి, మన ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసనగా ఉండేలా మన జీవితపు అన్ని రంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కొనసాగుదాం. యెహోవా తన నీతి మార్గాలను అనుసరించేవారి ప్రార్థనలను ఇష్టపడతాడు. (యోహాను 9:​31) అయితే, కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలివున్నాయి. మనమెలా ప్రార్థించాలి? వేటికోసం ప్రార్థించాలి? దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు? వీటిని మరితర ప్రశ్నల్ని మన తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

మీరు వివరించగలరా?

•అపరిపూర్ణ మానవులు దేవుణ్ణి అంగీకృతంగా ఎలా సమీపించవచ్చు?

•మన ప్రార్థనల్లో, పితరులను మనమెలా అనుకరించవచ్చు?

•తొలి క్రైస్తవుల ప్రార్థనల నుండి మనమేమి నేర్చుకుంటాం?

•మన ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసనగా ఎప్పుడు ఉంటాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. భూమ్మీది ఇతర ప్రాణులకు, మానవులకు మధ్య ఏ వ్యత్యాసం ఉంది, ఇది ఎలాంటి అవకాశాన్నిస్తుంది?

2. సృష్టికర్తతో మానవుని సంబంధంపై పాపం ఎలాంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది?

3. పాపులైన మానవులు దేవుణ్ణి ఎలా సమీపించాలి, దీనిని ఏ ఉదాహరణ వివరిస్తోంది?

4. దేవుణ్ణి సమీపించే విషయంలో మనమేమి గుర్తించాలి?

5, 6. అబ్రాహాము దేవుణ్ణి సమీపించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

7. పితరులు ఏయే విషయాల గురించి యెహోవాకు ప్రార్థించారు?

8. ధర్మశాస్త్రం ప్రకారం, ప్రజా సంబంధ విషయాలు యెహోవాకు ఎలా ప్రార్థన చేయబడేది?

9. దేవాలయంలో యెహోవాను సరైన రీతిలో సమీపించేందుకు ఏమిచేయాలి?

10, 11. ఆయావ్యక్తుల ప్రార్థనలను యెహోవా అంగీకరించాడనేందుకు మనకు ఎలాంటి రుజువుంది?

12. క్రైస్తవులు యెహోవాను సమీపించేందుకు ఏ ఏర్పాటు పనిచేయడం ఆరంభించింది?

13. ప్రార్థనకు సంబంధించి యెరూషలేము దేవాలయానికి ఆధ్యాత్మిక దేవాలయానికి మధ్య ఉన్న ఒక సారూప్యం ఏమిటి?

14, 15. (ఎ) అభిషిక్త క్రైస్తవులు, (బి) “వేరే గొఱ్ఱెలు” యెహోవాను సమీపించడం గురించి ఏమి చెప్పవచ్చు?

16. ప్రార్థన విషయంలో తొలి క్రైస్తవుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

17. యెహోవా ఎవరి ప్రార్థనలు అంగీకరిస్తాడు?

18. క్రైస్తవుల ప్రార్థనలు ఆలకించబడాలంటే, వారు ఏ నియమాన్ని పాటించాలి?

19. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలులో ధూపార్పణము ఎప్పుడు యెహోవాకు అసహ్యంగా తయారైంది? (బి) మన ప్రార్థనలు యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండేలా మనమెలా చూసుకోవచ్చు?

[23వ పేజీలోని చిత్రం]

దేవుడు ఎందుకు హేబెలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించాడు?

[24వ పేజీలోని చిత్రం]

‘నేను ధూళియు బూడిదనైయున్నాను’

[25వ పేజీలోని చిత్రం]

“పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను”

[26వ పేజీలోని చిత్రం]

మీ ప్రార్థనలు యెహోవాకు ఇంపైన సువాసనగా ఉన్నాయా?