ప్రియమైనవారి యథార్థత నుండి ప్రయోజనం పొందడం
జీవిత కథ
ప్రియమైనవారి యథార్థత నుండి ప్రయోజనం పొందడం
క్యాథ్లీన్ కూక్ చెప్పినది
మాఅమ్మమ్మ మేరీ ఎలన్ థామ్సన్, 1911లో, స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో పట్టణంలో ఉన్న బంధువులను చూడడానికి వెళ్లినప్పుడు బైబిలు విద్యార్థుల ప్రముఖ సభ్యుడైన ఛార్లెస్ తేజ్ రస్సెల్ ఇచ్చిన ఉపన్యాసానికి హాజరైంది, ఆ బైబిలు విద్యార్థులు తర్వాత యెహోవాసాక్షులుగా పిలవబడ్డారు. అమ్మమ్మ తాను విన్నదాన్నిబట్టి ఎంతో పులకరించిపోయింది. ఆమె దక్షిణాఫ్రికాకు తిరిగివచ్చినప్పుడు స్థానిక బైబిలు విద్యార్థులను కలుసుకుంది. దక్షిణాఫ్రికాలో 1914 ఏప్రిల్‌లో జరిగిన బైబిలు విద్యార్థుల మొదటి సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న 16మందిలో ఆమె కూడా ఉంది. మా అమ్మ ఎదత్‌కు అప్పుడు ఆరేళ్లు.
సహోదరుడు రస్సెల్ 1916లో మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బైబిలు విద్యార్థుల్లో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. డర్బన్‌లోని యథార్థవంతుల సంఖ్య 60 నుండి దాదాపు 12కు తగ్గింది. మా నాయనమ్మ ఇనాబోర్గ్, ఆ తర్వాత కొద్దికాలానికి బాప్తిస్మం తీసుకున్న ఆమె కొడుకైన హెన్రీ మ్యూర్డాల్ అనే యౌవనస్థుడు, యథార్థవంతుల పక్షాన చేరారు. హెన్రీ, 1924లో కల్‌పోర్చర్ అయ్యాడు, యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులను అప్పట్లో అలా పిలిచేవారు. ఆ తర్వాతి ఐదు సంవత్సరాలు ఆయన దక్షిణ ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో ప్రకటించాడు. హెన్రీ, ఎదత్‌లు 1930లో పెళ్లి చేసుకున్నారు, మూడు సంవత్సరాల తర్వాత నేను పుట్టాను.
పెరిగిన కుటుంబం
మేము కొంతకాలం మొజాంబిక్‌లో ఉన్నాం, అయితే 1939లో మేము జోహన్నస్‌బర్గ్‌లో ఉన్న మా తాతయ్య, అమ్మమ్మల ఇంటికి వెళ్లాం. తాతయ్యకు బైబిలు సత్యంపట్ల ఆసక్తిలేదు, కొన్నిసార్లు అమ్మమ్మను వ్యతిరేకించేవాడు, అయితే ఆయనకు ఆతిథ్యమివ్వడమంటే చాలా
ఇష్టం. నా చెల్లెలు థెల్మా 1940లో పుట్టింది, మేమిద్దరం వృద్ధుల అవసరాలు ఎలా చూసుకోవాలో నేర్చుకున్నాం. చాలా సందర్భాల్లో, సాయంకాల భోజనాలు ముగించడానికి ఎక్కువసేపు పట్టేది, ఎందుకంటే మేము ఆ రోజు జరిగిన విశేషాల గురించి మాట్లాడుకునేవాళ్లం లేక గతాన్ని నెమరువేసుకునేవాళ్లం.మా ఇంట్లో బసచేసే సాక్షుల సహచర్యాన్ని, ప్రత్యేకంగా పూర్తికాల సేవకుల సహచర్యాన్ని మా కుటుంబం ఆస్వాదించింది. వారు ఆ రోజు జరిగిన విశేషాల గురించి సాయంకాల భోజన సమయంలో మాకు చెప్పేవారు, వారి మాటలు మాకు లభించిన ఆధ్యాత్మిక వారసత్వంపట్ల మా కృతజ్ఞతను పెంచాయి. అది వారిలాగే మేము కూడా పయినీర్లుగా కావాలనే కోరికను మాలో పెంచింది.
చదవడంవల్ల కలిగే ఆనందాన్ని ఎలా పొందాలో చిన్నతనం నుండే మాకు నేర్పించబడింది. అమ్మమ్మతోపాటు అమ్మానాన్నలు, మా కోసం మంచి కథల పుస్తకాలు చదివేవారు లేక బైబిలు చదివేవారు. మనం సజీవంగా ఉండడానికి గాలిపీల్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో మా జీవితాల్లో క్రైస్తవ కూటాలు, పరిచర్య అంత ప్రాముఖ్యంగా ఉండేవి. నాన్న జోహన్నస్‌బర్గ్ సంఘ కంపెనీ సేవకునిగా (ఇప్పుడు సంఘ పైవిచారణకర్త అని పిలవబడే) సేవచేసేవారు కాబట్టి, మేమందరం కూటాలకు త్వరగా వెళ్లాల్సివచ్చేది. మాకు సమావేశం ఉన్నప్పుడు దానిని పర్యవేక్షించడంలో నాన్న తీరికలేకుండా పనిచేస్తుంటే, ఆ సమయంలో వసతుల విషయంలో సమావేశ ప్రతినిధులకు అమ్మ సహాయం చేసేది.
మాకు ప్రత్యేక సమావేశం
జోహన్నస్‌బర్గ్‌లో మేము 1948లో హాజరైన సమావేశం మాకు ప్రత్యేకమైనది. మొదటిసారిగా, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయానికి చెందిన సభ్యులు ఆ సమావేశానికి వచ్చారు. నేథన్ నార్, మిల్టన్ హెన్షెల్‌లు జోహన్నస్‌బర్గ్‌లో ఉన్నన్ని రోజులూ వారిని తన కార్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత నాన్నకు అప్పగించబడింది. ఆ సమావేశంలోనే నేను బాప్తిస్మం తీసుకున్నాను.
ఆ తర్వాత కొద్దిరోజులకే, సహోదరుడు రస్సెల్ మరణించిన తర్వాత బైబిలు విద్యార్థులను విడిచివెళ్లినవారి ప్రభావానికి గురైనందుకు తానెంతో బాధపడుతున్నానని మా తాతయ్య (నాన్న తండ్రి), నాన్నకు చెప్పి ఆయనను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆయన కొన్నినెలల తర్వాత మరణించాడు. కానీ, మా నాయనమ్మ 1955లో తన భూజీవితాన్ని చాలించేంతవరకు యథార్థంగా ఉంది.
నా జీవితాన్ని మలిచిన సంఘటనలు
నేను ఫిబ్రవరి 1, 1949 నుండి క్రమ పయినీరుగా సేవచేయడం ప్రారంభించాను. ఆ తర్వాతి సంవత్సరం న్యూయార్క్ నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశం జరుగనుందనే ప్రకటన విన్న వెంటనే మాలో ఉత్సాహం పెరగడం మొదలైంది. మేము ఆ సమావేశానికి హాజరుకావాలని ఎంతో ఆశపడ్డాం, అయితే వాటికయ్యే ఖర్చులు భరించే స్థితిలో మేము లేము. అయితే, 1950 ఫిబ్రవరిలో థామ్సన్ తాతయ్య మరణించాడు, అమ్మమ్మ తనకు అందిన డబ్బును మా ఐదుగురి ప్రయాణ ఖర్చుల కోసం ఉపయోగించింది.
మేము బయలుదేరే కొన్నివారాల ముందు, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి మాకొక ఉత్తరం అందింది. గిలియడ్ మిషనరీ స్కూల్‌కు చెందిన 16వ తరగతికి హాజరవ్వమని ఇచ్చిన ఆహ్వానం ఆ ఉత్తరంలో ఉంది. నేనెంత పులకరించిపోయానో, ఎందుకంటే నాకప్పటికింకా 17 ఏళ్లు కూడా నిండలేదు! తరగతి ప్రారంభమైనప్పుడు,
దక్షిణాఫ్రికాకు చెందిన మిగతా తొమ్మిదిమంది విద్యార్థులతో కలిసి నేను ఆ ప్రత్యేక ఆధిక్యతను ఆనందించాను!1951 ఫిబ్రవరిలో మా గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత, మాలో ఎనిమిదిమందిమి దక్షిణాఫ్రికాలో మిషనరీలుగా సేవచేసేందుకు తిరిగివచ్చాం. ఆ తర్వాతి కొన్ని సంవత్సరాలు, నేను మరో మిషనరీ సహోదరీతో కలిసి ఆఫ్రికాన్స్ భాష మాట్లాడబడే చిన్న పట్టణాల్లో ఎక్కువగా ప్రకటించాను. మొదట్లో, ఆ భాషలో మాట్లాడడం కష్టంగా ఉండేది, పరిచర్యలో నేను సమర్థంగా పాల్గొనలేకపోతున్నాననే బాధతో ఏడుస్తూ సైకిల్‌లో ఇంటికి చేరుకున్న ఒక సందర్భం నాకు గుర్తుంది. అయితే, కొన్నాళ్లకు నేను ఆ భాషలో మాట్లాడడం నేర్చుకున్నాను, యెహోవా నా కృషిని ఆశీర్వదించాడు.
వివాహం, ప్రయాణ సేవ
1955లో నాకు జాన్ కూక్‌తో పరిచయమేర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముందు, ఆ తర్వాత, ప్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్‌లలో ప్రకటనా పనిని ప్రారంభించడానికి ఆయన సహాయం చేశాడు. ఆయన ఆఫ్రికాకు మిషనరీగా వచ్చిన ఏడాది నేను ఆయనను కలుసుకున్నాను. కొన్నాళ్ల తర్వాత, ఆయన ఇలా రాశాడు: “ఒకే వారంలో నాకు మూడు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యాయి . . . ఎంతో ఉదారగుణమున్న ఒక సహోదరుడు నాకొక చిన్న కారును బహుకరించాడు; నేను జిల్లా సేవకునిగా నియమించబడ్డాను; నేను ప్రేమలో పడ్డాను.” * మేము 1957 డిసెంబరులో పెళ్లి చేసుకున్నాం.
జాన్, మా కోర్ట్‌షిప్ సమయంలో, తనతో జీవితం ఎల్లప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుందనే హామీ నాకిచ్చాడు, అది నిజమే. దక్షిణాఫ్రికాలో, నల్లజాతివారు అధికంగా నివసించే ప్రాంతాల్లోని సంఘాలను మేము ఎక్కువగా సందర్శించాం. అలాంటి ప్రాంతాల్లో, రాత్రి బస చేయడం అటుంచితే, అసలు ప్రవేశించడానికి అనుమతి సంపాదించడమే మాకు సవాలుగా తయారైంది. దార్లో వెళ్తున్నవారు గమనించకూడదని ప్రక్కనే ఉన్న శ్వేతజాతీయుల ప్రాంతంలో, ఖాళీగా ఉన్న షాపులో నేలమీద నిద్రపోయిన అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము సాధారణంగా దగర్లో ఉన్న శ్వేత సాక్షులతో బసచేయాల్సివచ్చేది, వారు తరచూ ఎన్నో కిలోమీటర్ల దూరంలో నివసించేవారు.
అడవి మధ్యలో నిర్మించబడిన నిరాడంబరమైన సమావేశ స్థలాలు ఏర్పాటుచేసే విషయంలో కూడా మేము సవాలును ఎదుర్కొన్నాం. మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం
విషయంలో ప్రజల్లో కృతజ్ఞతను పెంచేందుకు సహాయం చేసిన యెహోవాసాక్షులు నిర్మించిన చిత్రాలను మేము ప్రదర్శించాం. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కరెంటు ఉండేది కాదు కాబట్టి, మా సొంత జనరేటర్‌ను తీసుకువెళ్లేవాళ్ళం. బ్రిటీష్ రక్షణాధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా మేము సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చింది, ఎందుకంటే అక్కడ మన సాహిత్యాలపై నిషేధం ఉండడంతోపాటు, జూలూ భాష నేర్చుకునే సవాలు కూడా ఎదురైంది. అయినా, మన సహోదరులకు సేవచేయగలిగినందుకు మేము సంతోషించాం.1961 ఆగస్టులో, దక్షిణాఫ్రికాలోని సంఘ పైవిచారణకర్తలకు సహాయం చేయడానికి రూపొందించబడిన నాలుగు వారాల రాజ్య పరిచర్య పాఠశాల కోర్సుకు జాన్ మొదటి ఉపదేశకుడు అయ్యాడు. ఆయనకు బోధించే నైపుణ్యం ఉంది, సులభమైన తర్కంతో, స్పష్టమైన ఉపమానాలతో ఆయన తన విద్యార్థులను ప్రభావితం చేసేవాడు. ఆంగ్ల భాష బోధనా తరగతులను నిర్వహించేందుకు దాదాపు ఏడాదిన్నరపాటు మేము ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించాం. జాన్ బోధిస్తున్నప్పుడు నేను స్థానిక సాక్షులతో కలిసి ప్రకటనా పనిలో భాగం వహించేదాన్ని. అప్పుడు మాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఉత్తరం అందింది, జూలై 1, 1964 నుండి జోహన్నస్‌బర్గ్ దగ్గర ఉన్న దక్షిణాఫ్రికా బ్రాంచి కార్యాలయంలో సేవచేయమనే ఆహ్వానం ఆ ఉత్తరంలో ఉంది.
అయితే, అప్పటికి జాన్ ఆరోగ్యం మమ్మల్ని కలవరపెట్టడం మొదలుపెట్టింది. 1948లో ఆయనకు క్షయవ్యాధి సోకి బాధపడ్డాడు, ఆ తర్వాత ఆయన అడపాదడపా బలహీనంగా తయారయ్యేవాడు. ఆయన ఫ్లూలాంటి లక్షణాలతో బాధపడి కొన్నిసార్లు ఎన్నో రోజులు అనారోగ్యంగా ఉండేవాడు, ఆయన ఏ పనీ చేయలేకపోయేవాడు లేక ఎవరినీ కలుసుకోలేకపోయేవాడు. మాకు బ్రాంచి నుండి పిలుపు అందడానికి కొంతకాలం ముందు మేము సంప్రదించిన డాక్టర్, జాన్ మానసిక క్రుంగుదలతో బాధపడుతున్నట్లు నిర్ధారించాడు.
డాక్టర్ సలహా ప్రకారం మా సేవను తగ్గించుకోవాలనే విషయాన్ని ఊహించలేకపోయాం. బ్రాంచి కార్యాలయంలో జాన్ సేవా విభాగానికి నియమించబడ్డాడు, ప్రూఫ్‌రీడింగ్ చేసే బాధ్యత నాకు అప్పగించబడింది. మాకొక సొంతగది ఉండడం ఎంతటి ఆశీర్వాదమో! జోహన్నస్‌బర్గ్ చుట్టుప్రక్కలపెద్ద పోర్చుగీస్ సమాజం ఉండేది. మా వివాహానికి ముందు, జాన్ పోర్చుగీస్ క్షేత్రంలో సేవచేశాడు కాబట్టి, ఆ సమాజానికి ప్రకటించేందుకు స్థానికంగా ఉన్న ఒకే ఒక పోర్చుగీస్ సాక్షి కుటుంబానికి సహాయం చేయాల్సిందిగా 1967లో మేము కోరబడ్డాం. దానివల్ల నేను మళ్లీ మరో భాష నేర్చుకోవాల్సివచ్చింది.
పోర్చుగీస్ సమాజంలోనివారు విస్తారమైన ప్రాంతంలో చెదిరివున్నారు కాబట్టి, మేము ఎంతో ప్రయాణం చేసేవాళ్లం, కొన్నిసార్లు యోగ్యులైనవారిని కలుసుకోవడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించేవాళ్లం. ఆ సమయానికి, మొజాంబిక్‌కు చెందిన పోర్చుగీస్ భాష మాట్లాడే సాక్షులు సమావేశాలకోసం వచ్చినప్పుడు మమ్మల్ని కలుసుకోవడం ప్రారంభించారు, అది క్రొత్తవారికి ఎంతో సహాయకరంగా ఉండేది. పోర్చుగీస్ క్షేత్రంలో మేము పనిచేసిన 11 సంవత్సరాల్లో, 30 మంది ఉన్న మా చిన్న గుంపు నాలుగు సంఘాలుగా అభివృద్ధి చెందింది.
ఇంట్లో పరిస్థితుల మార్పులు
ఆ సమయంలో మా తల్లిదండ్రుల ఇంట్లోని పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. 1960లో నా చెల్లెలు థెల్మా అమెరికాకు చెందిన జాన్ అర్బన్ అనే పయినీరును పెళ్లిచేసుకుంది. 1965లో వారు గిలియడ్ 40వ తరగతికి హాజరయ్యారు, ఆ తర్వాతి 25 సంవత్సరాలు వారు బ్రెజిల్‌లో మిషనరీలుగా యథార్థంగా సేవచేశారు. 1990లో వారు అనారోగ్యంతో ఉన్న జాన్ తల్లిదండ్రులను చూసుకోవడానికి అమెరికాలోని ఒహాయోకు తిరిగివెళ్లారు. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమే అయినా, వారు ఇప్పటికీ పూర్తికాల పరిచర్యలో ఉన్నారు.
మా అమ్మమ్మ 1965లో తన భూజీవితాన్ని చాలించింది, ఆమె తన 98 ఏళ్ల వయసులో కూడా దేవునిపట్ల యథార్థంగా ఉంది. ఆ ఏడాదే మా నాన్న ఉద్యోగవిరమణ చేశాడు. కాబట్టి, స్థానిక పోర్చుగీస్ క్షేత్రంలో సహాయం చేయమని సొసైటీ మా ఇద్దరినీ కోరినప్పుడు, అమ్మానాన్నలు మాతోపాటు సేవచేయడానికి ముందుకొచ్చారు. వారు ఆ గుంపును బలపర్చారు, కొన్ని నెలల తర్వాత అక్కడ మొట్టమొదటి సంఘం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత, మా అమ్మ క్యాన్సర్ బారినపడింది, అది 1971లో ఆమెను పొట్టనబెట్టుకుంది. నాన్న ఏడేళ్ల తర్వాత మరణించాడు.
జాన్ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం
జాన్ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేదని 1970లలో స్పష్టమైంది. తను ఎంతో ఇష్టపడిన బెతెల్ నియామకాలను ఒక్కొక్కటి క్రమంగా వదులుకోవాల్సివచ్చింది, వాటిలో మన బ్రాంచిలో జరిగే వారపు కుటుంబ కావలికోట అధ్యయనానికి, ఉదయం జరిగే బైబిలు చర్చలకు అధ్యక్షత వహించడం వంటి ఆధిక్యతలు ఉన్నాయి. ఆయన సేవా విభాగం నుండి మెయిల్ విభాగానికి, అక్కడి నుండి తోటకు మార్చబడ్డాడు.
జాన్‌కు పోరాట స్ఫూర్తి ఉండడంవల్ల అలాంటి మార్పులు చేసుకోవడం ఆయనకు కష్టమైంది. తన పనులను మెల్లగా చేసుకోమని ఆయనకు పదేపదే చెప్పినప్పుడు, నేను ఆయన కాళ్లకు బంధంగా తయారయ్యానని నన్ను పరిహసించినా, వెంటనే ప్రేమగా కౌగలించుకునేవాడు. మేము పోర్చుగీస్ క్షేత్రాన్ని వదలిపెట్టి బ్రాంచిలోని రాజ్యమందిరంలో కలుసుకునే సంఘంలో సేవచేయడం మంచిదని కొన్నాళ్ల తర్వాత మాకనిపించింది.
జాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు యెహోవాతో ఆయనకున్న సంబంధాన్ని చూడడం హృదయాన్ని స్పృశించేది. ఎంతో మానసిక కృంగుదలతో ఉన్న స్థితిలో ఆయన మధ్యరాత్రి మేల్కొన్నప్పుడు తాను యెహోవా సహాయం కోసం ప్రార్థించేందుకు వీలుగా ఆయన ప్రశాంతంగా మారేంతవరకు మేము మాట్లాడుకునేవాళ్లం. తనకుతాను బలవంతంగా ఫిలిప్పీయులు 4:6, 7: “దేనినిగూర్చియు చింతపడకుడి . . ” అనే వచనాన్ని మెల్లగా పదేపదే వల్లించడం ద్వారా ఆయన ఆ బాధాకరమైన క్షణాలను ఒంటరిగా ఎదుర్కోగలిగేవాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసుకోగలిగినంత ప్రశాంతంగా అయ్యేవాడు. నేను సాధారణంగా మేల్కొనివుండి, ఆయన యెహోవాకు హృదయపూర్వకంగా విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు ఆయన పెదాలను నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండేదాన్ని.
మా బ్రాంచి కార్యాలయం చాలా ఇరుకుగా తయారవడంతో, జోహన్నస్‌బర్గ్ వెలుపల పెద్దదైన క్రొత్త బ్రాంచి కార్యాలయ నిర్మాణం ప్రారంభమైంది. నగర రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా ఉన్న ఆ ప్రశాంత స్థలానికి మేమిద్దరం తరచూ వెళ్లివచ్చేవాళ్లం. క్రొత్త బ్రాంచి కార్యాలయం పూర్తయ్యేంతవరకు అక్కడున్న తాత్కాలిక వసతుల్లో ఉండేందుకు మాకు అనుమతి లభించడం జాన్‌కు ఎంతో సహాయం చేసింది.
క్రొత్త సవాళ్లు
జాన్ ఆలోచించే, తర్కించే శక్తిసామర్థ్యాలు మరింత మందగించేకొద్దీ, తన నియామకాలు చూసుకోవడం ఆయనకు ఎంతో కష్టమైంది. జాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఇతరులు సహకరించిన విధం నన్నెంతో కదిలించింది. ఉదాహరణకు, ఒక సహోదరుడు పరిశోధన చేయడానికి సార్వజనిక గ్రంథాలయానికి వెళ్తున్నప్పుడు ఆయన జాన్‌ను తనతోపాటు తీసుకువెళ్లేవాడు. అలా వాహ్యాళికి వెళ్తున్నప్పుడు జాన్ తన జేబుల నిండా కరపత్రాలు, పత్రికలు పెట్టుకునేవాడు. దానివల్ల, తాను ఏదో సాధించాననే, తనకు విలువ ఉందనే తలంపు జాన్‌లో కలిగేది.
అల్జీమర్ వ్యాధివల్ల జాన్ చదివే సామర్థ్యాన్ని మెల్లమెల్లగా కోల్పోయాడు. బైబిలు సాహిత్యాలు, రాజ్య గీతాలు ఆడియోక్యాసెట్ల రూపంలో ఉన్నందుకు మేము కృతజ్ఞులం. మేము వాటిని పదేపదే వినేవాళ్లం. నేను తనతో కూర్చొని వాటిని వినకపోతే జాన్ కలవరపడేవాడు, అందువల్ల ఆయన అలా గంటలతరబడి క్యాసెట్లు వింటుంటే నేను కుట్టుపనిలో నిమగ్నమయ్యేదాన్ని. అలా కుట్టుపనిలో నిమగ్నమవడం మాకు సరిపడా స్వెటర్లను, దుప్పట్లను అందించింది!
రోజులు గడిచేకొద్దీ, జాన్ పరిస్థితి క్షీణిస్తున్న కారణంగా ఆయనపట్ల నేను మరింత ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి వచ్చింది. నేను సాధారణంగా, చదవలేనంతగా లేక అధ్యయనం చేయలేనంతగా అలసిపోయినా, ఆయనను చివరిదాకా చూసుకోవడం నాకు దొరికిన గొప్ప ఆధిక్యతగా భావించాను. చివరికాయన 1998లో, తన 85 ఏళ్ల వయసులో నా ఒడిలో ప్రశాంతంగా కన్నుమూశారు, ఆయన చివరివరకు స్థిరంగా తన యథార్థతను కాపాడుకున్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో, ఆలోచనా సామర్థ్యాలతో పునరుత్థానమవడం చూడాలని నేనెంతో కోరుకుంటున్నాను.
పునరుత్తేజం పొందడం
జాన్ మరణించిన తర్వాత ఒంటరిగా జీవించడం నాకు కష్టమైంది. అందువల్ల నేను మే 1999లో అమెరికాలో ఉన్న నా చెల్లెలు థెల్మాను, ఆమె భర్తను చూడడానికి వెళ్లాను. అనేకమంది ప్రియమైన యథార్థ స్నేహితులను కలుసుకోవడం, ప్రత్యేకంగా న్యూయార్క్‌లోని యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని చూడడానికి వెళ్లినప్పుడు వారిని కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చింది! అది నాకు కావాల్సిన ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్నిచ్చింది.
నాకు ప్రియమైన యథార్థ స్నేహితుల జీవితాలను నెమరువేసుకోవడం నాకు ప్రయోజనకరంగా ఉన్న అనేక విషయాలను గుర్తుచేసింది. వారి ఉపదేశం, మాదిరితోపాటు వారి సహాయం ద్వారా ఇతర దేశాల, జాతుల ప్రజలపట్ల ప్రేమను చూపించేలా నా హృదయాన్ని విశాలపరచుకోవడాన్ని నేను నేర్చుకున్నాను. నేను ఓర్పు, సహనంతోపాటు పరిస్థితికి తగ్గట్లు సర్దుకుపోవడం నేర్చుకున్నాను. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, ప్రార్థన ఆలకించే యెహోవా దేవుని దయను చవిచూశాను. కీర్తనకర్తకున్న భావాలే నాకున్నాయి: “నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.”—కీర్తన 65:4.
[అధస్సూచి]
^ పేరా 18 కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 1, 1959, 468-72 పేజీలు చూడండి.
[8వ పేజీలోని చిత్రం]
అమ్మమ్మ తన కూతుర్లతో
[9వ పేజీలోని చిత్రం]
1948లో నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు నా తల్లిదండ్రులతో
[10వ పేజీలోని చిత్రం]
గిలియడ్ స్కూల్ రిజిస్ట్రార్ అయిన ఆల్‌బర్ట్ ష్రోడర్‌తోపాటు దక్షిణాఫ్రికా నుండి వచ్చిన మరో తొమ్మిదిమంది విద్యార్థులతో
[10వ పేజీలోని చిత్రం]
1984లో జాన్‌తో