కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రియమైన వ్యక్తి యెహోవా సేవను విడిచిపెట్టినప్పుడు

ప్రియమైన వ్యక్తి యెహోవా సేవను విడిచిపెట్టినప్పుడు

ప్రియమైన వ్యక్తి యెహోవా సేవను విడిచిపెట్టినప్పుడు

మార్క్‌, లావెజ్‌లు యెహోవాసాక్షులు. * క్రైస్తవ తల్లిదండ్రులను బైబిలు ప్రోత్సహిస్తున్న విధంగా వారు ప్రేమా శ్రద్ధలతో తమ పిల్లలకు లేఖనాలు నేర్పించారు. (సామెతలు 22:⁠6; 2 తిమోతి 3:​14) బాధాకరంగా, వారి పిల్లల్లో కొందరు పెద్దవారైన తర్వాత యెహోవా సేవను కొనసాగించలేదు. “యెహోవా సేవను విడిచిపెట్టిన పిల్లల విషయంలో నాకు హృదయవేదన కలుగుతుంది. అది నన్ను అంతగా బాధించడంలేదని నేనెలా ప్రతీరోజు నటించగలను? ఇతరులు తమ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు నా గొంతు బొంగురుపోతుంది, కన్నీళ్లను ఆపుకోవాల్సివస్తుంది.”

అవును, ఒక వ్యక్తి యెహోవా సేవను, లేఖనాల్లో చెప్పబడిన జీవన విధానాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నమ్మకమైన కుటుంబ సభ్యులు సాధారణంగా ఎంతో హృదయవేదనను అనుభవిస్తారు. “నేను మా అక్కను ఎంతో ప్రేమిస్తున్నాను. ఆమె తిరిగి యెహోవాను సేవించేందుకు తిరిగివచ్చేలా సహాయం చేసేందుకు నేను ఏమి చేయడానికైనా సిద్ధమే!” అని ఐరీన్‌ అంటోంది. మారియా తమ్ముడు లైంగిక దుర్నీతికి పాల్పడి యెహోవా సేవను విడిచిపెట్టాడు, ఆమె ఇలా అంటోంది: “ఆ బాధను తట్టుకోవడం నాకు ఎంతో కష్టమైంది, ఎందుకంటే వేరే విషయాల్లో వాడు నాకు మంచి తమ్ముడిగానే ఉన్నాడు. కుటుంబమంతా సంతోషంగా కలుసుకున్న సందర్భాల్లో వాడుంటే ఎంతో బాగుండేదని నాకు అనిపిస్తుంది.”

ఎందుకు అంత కష్టం?

పిల్లవాణ్ణి లేక వేరే ప్రియమైన వ్యక్తిని ఆధ్యాత్మికంగా కోల్పోవడం క్రైస్తవ బంధువులకు ఎందుకంత బాధ కలిగిస్తుంది? ఎందుకంటే, యెహోవాకు యథార్థంగా ఉండేవారు పరదైసు భూమ్మీద నిత్యజీవాన్ని అనుభవిస్తారని లేఖనాలు వాగ్దానం చేస్తున్నాయని వారికి తెలుసు. (కీర్తన 37:​29; 2 పేతురు 3:​13; ప్రకటన 21:​3-5) వారు ఆ ఆశీర్వాదాలను తమ భాగస్వామితో, పిల్లలతో, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, మనవలు, మనవరాళ్లతో పంచుకోవాలని కోరుకుంటారు. యెహోవా సేవను విడిచిపెట్టిన తమ ప్రియమైనవారు ఆ ఆశీర్వాదాలను అనుభవించలేకపోవచ్చనే ఆలోచన వారిని ఎంతగా బాధిస్తుందో కదా! యెహోవా నియమాలు, సూత్రాలు ప్రస్తుత జీవితంలో కూడా తమకు ప్రయోజనం చేకూరుస్తాయని క్రైస్తవులకు తెలుసు. అందుకే, తమ ప్రియమైనవారు బాధాకరమైన పంటను కోసే విధంగా విత్తడాన్ని చూడడం క్రైస్తవులకు ఎంతో హృదయవేదన కలిగిస్తుంది.​—⁠యెషయా 48:​17, 18; గలతీయులు 6:​7, 8.

ప్రియమైనవారిని ఆధ్యాత్మికంగా అలా ఎన్నడూ కోల్పోని కొందరికి, ఆ పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. వారి జీవితంలోని ప్రతీ రంగం ప్రభావితం చెందుతుంది. లావెజ్‌ ఇలా అంటోంది: “క్రైస్తవ కూటాల్లో కూర్చొని, తల్లిదండ్రులు తమ పిల్లలతో నవ్వుతూ మాట్లాడడాన్ని చూడడం అంతకంతకూ కష్టమైంది. సంతోషకరమైన సందర్భాల్లో కూడా ప్రియమైన వ్యక్తిలేని కారణంగా శూన్య భావం ఆవరించేది.” ఒక క్రైస్తవ పెద్ద తమ సవతికూతురు తమతో సహవసించడం మానేసిన నాలుగు సంవత్సరాలు ఎలా గడిచాయో గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “సాధారణంగా, ‘సంతోషకరమైన సందర్భాలు’ కూడా హృదయవేదన కలిగించేవి. నేను మా ఆవిడకు ఒక చక్కని బహుమానం ఇచ్చినా లేక వారాంతంలో ఆమెను ఒక చక్కని ప్రదేశానికి తీసుకువెళ్లినా తన అమ్మాయి మా సంతోషంలో భాగం వహించడంలేదని గుర్తుచేసుకుంటూ ఆమె ఏడ్వడం ప్రారంభించేది.”

అలాంటి క్రైస్తవులు అతిగా స్పందిస్తున్నారా? అలా కానక్కర్లేదు. నిజానికి, మానవులు ఎవరి స్వరూపంలో సృష్టించబడ్డారో ఆయన గుణాలను అంటే యెహోవా గుణాలను వారు కొంతమేరకు ప్రతిబింబిస్తుండవచ్చు. (ఆదికాండము 1:​26, 27) దీనర్థం ఏమిటి? తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు యెహోవాకు ఎలా అనిపించింది? కీర్తన 78:38-41 ప్రకారం, యెహోవాకు దుఃఖం, బాధ కలిగాయని మనం తెలుసుకుంటాం. అయినా, ఆయన వారిని ఓర్పుతో హెచ్చరించి క్రమశిక్షణలో పెట్టాడు, వారు పశ్చాత్తాపం చూపించిన ప్రతీసారీ ఆయన వారిని క్షమించాడు. ‘తన హస్తకృత్యాలైన’ తన ప్రాణులపట్ల యెహోవాకు ఎంతో ఆప్యాయత ఉందని, వారిని ఊరకే విడిచిపెట్టడని దీన్నిబట్టి స్పష్టమౌతుంది. (యోబు 14:​15; యోనా 4:​10, 11) అలాంటి యథార్థమైన సంబంధాలు ఏర్పరచుకునే సామర్థ్యం ఆయన మానవుల్లో నాటాడు, అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధం ప్రత్యేకంగా బలంగా ఉండవచ్చు. కాబట్టే, ఒక ప్రియమైన బంధువును ఆధ్యాత్మికంగా కోల్పోయినప్పుడు మానవులు బాధపడడంలో ఆశ్చర్యంలేదు.

సత్యారాధకులకు కలిగే అతి కఠినమైన పరీక్షల్లో ప్రియమైనవారిని ఆధ్యాత్మికంగా కోల్పోవడం ఒకటి. (అపొస్తలుల కార్యములు 14:​22) తన సందేశాన్ని స్వీకరించడం కొన్ని కుటుంబాల్లో విభేదాలు కలిగించవచ్చని యేసు చెప్పాడు. (మత్తయి 10:​34-38) అంటే బైబిలు సందేశమే కుటుంబంలో విభేదాలు ఏర్పడేందుకు కారణమౌతుందని దానర్థం కాదు. బదులుగా, క్రైస్తవ మార్గాన్ని తిరస్కరిస్తూనో, విడిచిపెడుతూనో లేక చివరికి దానిని వ్యతిరేకిస్తూనో అవిశ్వాసులైన కుటుంబ సభ్యులు కుటుంబంలో విభేదాలు సృష్టిస్తారు. అయితే, యెహోవా తన నమ్మకమైనవారు ఎదుర్కొంటున్న పరీక్షలను సహించడానికి అవసరమైన సహాయాన్ని తప్పక అందిస్తాడని తెలుసుకొని మనం కృతజ్ఞతతో ఉండవచ్చు. మీరు ప్రస్తుతం ఒక ప్రియమైన వ్యక్తిని ఆధ్యాత్మికంగా కోల్పోవడంవల్ల కలిగే బాధను అనుభవిస్తున్నట్లయితే, మీరు ఆ బాధను సహిస్తూ ఆనందాన్ని, సంతృప్తిని పొందేందుకు ఏ బైబిలు సూత్రాలు మీకు సహాయం చేయవచ్చు?

పరిస్థితిని సహించడం

“మిమ్మును మీరు కట్టుకొనుచు . . . దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20, 21) మీరు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన పరిస్థితులనుబట్టి, యెహోవా సేవను విడిచిపెట్టిన ఒక కుటుంబ సభ్యునికి సహాయం చేయడానికి మీరు ఏమీ చేయలేకపోవచ్చు. అయినా, మిమ్మల్ని మీరు బలపర్చుకోవడంతోపాటు మిగతా నమ్మకమైన కుటుంబ సభ్యులను కూడా బలపర్చవచ్చు, అలా బలపర్చాలి కూడా. తన ముగ్గురు అబ్బాయిల్లో, ఇద్దరు సత్యాన్ని విడిచిపెట్టడం చూసిన వెరోనికా ఇలా అంటోంది: “మేము బలమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే, మా అబ్బాయిలు తమ తప్పులను తెలుసుకుని తిరిగివచ్చినప్పుడు వారిని ఆహ్వానించేందుకు వీలుగా మేము చక్కని ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామనే ప్రేమపూర్వకమైన సలహా నాకూ, మావారికీ లభించింది. తప్పిపోయిన కూమారుని తండ్రి ఆయనను ఆహ్వానించే స్థితిలో లేనట్లయితే ఆ కుమారుని పరిస్థితి ఎలా ఉండేది?”

మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమవండి. ఆ కార్యకలాపాల్లో, లోతైన బైబిలు అధ్యయనానికి, క్రైస్తవ కూటాలకు హాజరుకావడానికి సమయపట్టికను కలిగివుండడం ఇమిడివుంది. మీ పరిస్థితులు అనుమతించినంతవరకు సంఘంలోని ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. నిజమే, అలాంటి కార్యకలాపాలు ప్రారంభంలో మీకు కష్టమనిపించవచ్చు. వెరోనికా ఇలా గుర్తుచేసుకుంటోంది: “గాయపడిన జంతువులాగే అందరికీ దూరంగా ఉండేందుకు నేను మొదట ప్రయత్నించాను. కానీ మంచి ఆధ్యాత్మిక దినచర్య మాకెంతో అవసరమని మావారు నొక్కిచెప్పారు. మేము కూటాలకు హాజరయ్యేలా చూశారు. సమావేశానికి హాజరవుతున్నప్పుడు ప్రజలను కలుసుకోవడానికి నేను ఎంతో ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చేది. అయినా, ఆ కార్యక్రమం మమ్మల్ని యెహోవాకు సన్నిహితులుగా చేసేది. నమ్మకంగా ఉన్న మా అబ్బాయి ఆ సమావేశంవల్ల ప్రత్యేకంగా బలపర్చబడేవాడు.”

పైన పేర్కొనబడిన మారియా, క్షేత్రపరిచర్యలో నిమగ్నమై ఉండడం ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటుందని గ్రహించింది, ఆమె ఇప్పుడు, బైబిలు గురించి తెలుసుకునేందుకు నలుగురికి సహాయం చేస్తోంది. అదేవిధంగా లారా కూడా ఇలా అంటోంది: “నేనిప్పటికీ ప్రతీరోజు కన్నీళ్లు విడుస్తున్నా, పిల్లలను పెంచడంలో కొంతమంది తల్లిదండ్రుల్లా నేను విజయం సాధించలేకపోయినప్పటికీ, ఈ అంత్యదినాల్లో కుటుంబాలకు సహాయం చేయగలుగుతున్న బైబిలు పరిపూర్ణ సందేశం నా దగ్గర ఉన్నందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.” కెన్‌, ఎలానార్‌ దంపతుల ఎదిగిన పిల్లలు సంఘాన్ని విడిచిపెట్టారు, అయితే ఆ దంపతులు రాజ్య ప్రచారకుల అవసరం అధికంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి పూర్తికాల పరిచర్యను చేపట్టడానికి అవసరమైన సర్దుబాట్లు చేసుకున్నారు. అలా చేయడం వారు పరిస్థితులను సరైన దృక్పథంతో చూడడానికి, వారు దుఃఖంలో మునిగిపోకుండా ఉండడానికి సహాయం చేసింది.

నిరీక్షణను కోల్పోవద్దు. ప్రేమ “అన్నిటిని నిరీక్షించును.” (1 కొరింథీయులు 13:⁠7) పైన పేర్కొనబడిన కెన్‌ ఇలా అంటున్నాడు: “మా పిల్లలు సత్యమార్గాన్ని విడిచివెళ్లినప్పుడు అది వారి మరణంతో సమానమని నాకు అనిపించింది. అయితే నా సహోదరి మరణించిన తర్వాత నా అభిప్రాయం మారింది. మా పిల్లలు అక్షరార్థంగా మరణించనందుకు, వారు తన దగ్గరికి తిరిగివచ్చేందుకు యెహోవా ఇంకా ద్వారాన్ని తెరిచి ఉంచినందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి.” వాస్తవానికి, సత్యాన్ని వదిలేసిన చాలామంది చివరకు తిరిగివస్తారని అనుభవాలు నిరూపిస్తున్నాయి.​—⁠లూకా 15:​11-24.

స్వీయనిందకు పాల్పడవద్దు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు గతాన్ని నెమరువేసుకొని, కొన్ని పరిస్థితుల్లో తాము భిన్నంగా వ్యవహరించివుంటే బాగుండేదని విచారిస్తారు. అయితే, యెహెజ్కేలు 18:​20లో ఉన్న ముఖ్యాంశం ఏమిటంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు యెహోవా పాపం చేసిన వ్యక్తినే దోషిగా ఎంచుతాడు కానీ తల్లిదండ్రులను కాదు. ఆసక్తికరంగా, సామెతల గ్రంథం, పిల్లలను సరైన విధంగా పెంచే విషయంలో తల్లిదండ్రుల బాధ్యత గురించి అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ, యౌవనులు తమ తల్లిదండ్రుల మాటలను విని వారికి విధేయులుగా ఉండమనే హితబోధ దానిలో దాదాపు నాలుగుకన్నా ఎక్కువసార్లు ఉంది. అవును, అపరిపూర్ణ తల్లిదండ్రుల బైబిలు ఆధారిత శిక్షణకు లోబడే బాధ్యత పిల్లలకుంది. మీరు ఆ సమయంలో చేయగలిగింది చేసివుండవచ్చు. అయినా, మీరే కొన్ని తప్పులు చేశారని, వాటికి మీరే బాధ్యులని మీకనిపించినా, మీ తప్పుల కారణంగానే మీ ప్రియమైనవారు సత్యాన్ని విడిచివెళ్లి ఉండకపోవచ్చు. ఏదేమైనా, “అలా చేసివుంటే లేక చేయకుంటే బాగుండేది” వంటి ఆలోచనలవల్ల మీరేమీ సాధించలేరు. మీరు చేసిన తప్పుల నుండి నేర్చుకోండి, వాటిని మళ్లీ చేయకూడదని నిర్ణయించుకొని క్షమాపణ కోసం యెహోవాకు ప్రార్థించండి. (కీర్తన 103:​8-14; యెషయా 55:⁠7) ఆ తర్వాత, గతం గురించి కాక భవిష్యత్తు గురించి ఆలోచించండి.

ఇతరులతో ఓర్పు వహించండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఎలా ప్రోత్సహించాలో లేక ఓదార్చాలో తెలుసుకోవడం కొందరికి కష్టంగా ఉండవచ్చు, ప్రత్యేకంగా మీలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోనివారికి అది కష్టంగా ఉండవచ్చు. అంతేకాక, ఏది ప్రోత్సహకరమైనది, ఏది ఓదార్పుకరమైనది అనే విషయంలో ప్రజల అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని బాధపెట్టేలా ఎవరైనా మాట్లాడితే, కొలొస్సయులు 3:​13లో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను అన్వయించుకోండి: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”

క్రమశిక్షణ విషయంలో యెహోవా ఏర్పాటును గౌరవించండి. మీ బంధువుకు సంఘం నుండి క్రమశిక్షణ లభిస్తే, అలా క్రమశిక్షణ లభించడం యెహోవా ఏర్పాటులో భాగమని, అది తప్పిదస్థునితోపాటు అందరికీ శ్రేయస్కరమని గుర్తుంచుకోండి. (హెబ్రీయులు 12:​11) కాబట్టి, క్రమశిక్షణ ఇచ్చిన పెద్దలను లేక వారు తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టే వైఖరిని ఎదిరించండి. యెహోవా పద్ధతిలో పనులను చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని, దానికి భిన్నంగా యెహోవా ఏర్పాట్లను వ్యతిరేకిస్తే కేవలం బాధ మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడుదలైన తర్వాత మోషే క్రమంగా వారి న్యాయాధిపతిగా పనిచేశాడు. (నిర్గమకాండము 18:​13-16) ఒక వ్యక్తికి అనుకూలంగా ఇవ్వబడే తీర్పు, మరో వ్యక్తికి వ్యతిరేకంగా ఉండవచ్చు, అందువల్ల కొందరు మోషే నిర్ణయాలనుబట్టి నిరాశ చెందివుంటారని ఊహించడం కష్టమేమీకాదు. మోషే ఇచ్చిన తీర్పులను తప్పుబట్టడం కొన్నిసార్లు ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి దారితీసివుండవచ్చు. అయితే, యెహోవా తన ప్రజలను నడిపించడానికి మోషేను ఉపయోగించాడు, ఆయన మోషేను శిక్షించలేదు గానీ తిరుగుబాటుదారులను, వారిని సమర్థించినవారి కుటుంబాలను శిక్షించాడు. (సంఖ్యాకాండము 16:​31-35) నేడు దైవపరిపాలనా అధికారం ఉన్నవారు తీసుకున్న నిర్ణయాలను గౌరవించి సహకరించడానికి ప్రయత్నించాలని మనం దాని నుండి నేర్చుకోవచ్చు.

ఈ విషయానికి సంబంధించి డలోరాస్‌, తన అమ్మాయికి సంఘం క్రమశిక్షణ ఇచ్చినప్పుడు సమతూకమైన దృక్పథాన్ని కాపాడుకోవడం తనకు ఎంత కష్టమైందో గుర్తుచేసుకుంటోంది? “యెహోవా ఏర్పాట్లు ఎంత హేతుబద్ధమైనవో తెలియజేసే ఆర్టికల్‌లు పదేపదే చదవడం నాకు సహాయం చేసింది. ఆ పరిస్థితిని సహించి యెహోవా సేవను కొనసాగించడానికి సహాయం చేసే ప్రసంగాలను, ఆర్టికల్‌లోని అంశాలను ప్రత్యేకమైన నోటుబుక్‌లో రాసుకున్నాను” అని ఆమె అంటోంది. దీనినుండి పరిస్థితిని సహించడానికి సహాయం చేసే మరో ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవచ్చు.

మీ భావాలను వ్యక్తం చేయండి. మీ పరిస్థితిని సానుభూతిగల నమ్మకమైన ఒకరిద్దరు స్నేహితులతో పంచుకోవడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. అలా చేసేందుకు మీరు సానుకూల వైఖరిని కాపాడుకోవడానికి మీకు సహాయం చేయగల స్నేహితులను ఎంచుకోండి. యెహోవాకు ప్రార్థనలో “మీ హృదయములు కుమ్మరించడం” ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. * (కీర్తన 62:​7, 8) ఎందుకు? ఎందుకంటే, మీ లోతైన భావాలను ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఉదాహరణకు, అంతటి మానసిక క్షోభను మీరు అనుభవించాల్సి రావడం అన్యాయమని మీకనిపించవచ్చు. అదీగాక, మీరు యెహోవా సేవను విడిచిపెట్టలేదు. ప్రార్థనలో మీ భావాలను యెహోవాకు తెలియజేసి, మీరు పరిస్థితిని ఎంతో బాధాకరమైన విధంగా దృష్టించకుండా ఉండేందుకు సహాయం చేయమని ఆయనను వేడుకోండి.​—⁠కీర్తన 37:⁠5.

కాలం గడిచేకొద్దీ, మీరు మీ భావాలను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అంతవరకు, మీ పరలోక తండ్రిని సంతోషపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను మానేయకండి, అవి వ్యర్థమని ఎన్నడూ అనుకోకండి. (గలతీయులు 6:⁠9) మనం యెహోవాను సేవించడం మానేసినా మనకు ఇంకా సమస్యలు ఎదురౌతాయని గుర్తుంచుకోండి. అయితే, మనం ఆయనపట్ల యథార్థంగా ఉన్నప్పుడు మనం పరీక్షలను ఎదుర్కొనే సమయంలో ఆయన సహాయం మనకుంటుంది. కాబట్టి, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత తీవ్రమైందో యెహోవాకు తెలుసని, ఆయన సరైన సమయంలో మీకు కావాల్సిన బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడనే నమ్మకంతో ఉండండి.​—⁠2 కొరింథీయులు 4:⁠7; ఫిలిప్పీయులు 4:​13; హెబ్రీయులు 4:​16.

[అధస్సూచీలు]

^ పేరా 2 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ పేరా 19 బహిష్కరించబడిన బంధువు కోసం ప్రార్థించడం గురించిన సమాచారం కోసం, కావలికోట, డిసెంబరు 1, 2001, 30-1 పేజీలు చూడండి.

[19వ పేజీలోని బాక్సు]

పరిస్థితిని ఇలా ఎదుర్కోవచ్చు

◆ “మిమ్మును మీరు కట్టుకొనుచు . . . దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.”​—యూదా 20, 21.

◆ నిరీక్షణను కోల్పోవద్దు.​—⁠1 కొరింథీయులు 13:⁠7.

◆ స్వీయనిందకు పాల్పడవద్దు.​—⁠యెహెజ్కేలు 18:​20.

◆ ఇతరులతో ఓర్పు వహించండి.​—⁠కొలొస్సయులు 3:​13.

◆ క్రమశిక్షణ విషయంలో యెహోవా ఏర్పాటును గౌరవించండి.​—⁠హెబ్రీయులు 12:​11.

◆ మీ భావాలను వ్యక్తం చేయండి.​—⁠కీర్తన 62:​7, 8.

[21వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీరు యెహోవా సేవను విడిచిపెట్టారా?

మీరు ఏ కారణాన్నిబట్టి విడిచిపెట్టినా, యెహోవాతో మీ సంబంధం, మీ నిరంతర భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. బహుశా మీరు యెహోవా సేవను తిరిగి ప్రారంభించాలని అనుకుంటుండవచ్చు. మీరు దానికోసం ఇప్పుడు తీవ్రంగా కృషి చేస్తున్నారా? లేక “సరైన సమయం” కోసం దానిని వాయిదావేస్తున్నారా? అర్మగిద్దోను అనే కారు మేఘాలు వేగంగా కమ్ముకొస్తున్నాయని గుర్తుంచుకోండి. అంతేకాక, ఈ విధానంలోని జీవితం ఎంతోకాలం సాగదు, పైగా అది అనిశ్చితమైనది. రేపు మీరు సజీవంగా ఉంటారో లేదో తెలుసుకోలేరు. (కీర్తన 102:⁠3; యాకోబు 4:​13, 14) ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడిన ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “నేను యెహోవాకు పూర్తికాల సేవచేస్తున్నప్పుడు నాకు ఈ వ్యాధి సంక్రమించింది, దాచుకోవాల్సిన అవమానకరమైన రహస్యాలు ఏమీ నా దగ్గర లేవు. ఆ వ్యాధి నాకు ఇప్పుడు సంక్రమించినందుకు నాకు ఓదార్పుకరంగా ఉంది.” అయితే “ఏదో ఒక రోజు నేను యెహోవాను సేవించడం ప్రారంభిస్తాను!” అని అనుకుంటున్నప్పుడు ఆయనకు ఆ వ్యాధి సంక్రమించివుంటే ఆయనకు ఎలా అనిపించివుండేదో ఊహించండి. మీరు యెహోవా సేవను విడిచిపెట్టినట్లయితే, తిరిగి ఆయన సేవను ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం.

[18వ పేజీలోని చిత్రాలు]

ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమైవుండడం పరిస్థితులను సరైన దృక్పథంతో చూడడానికి మీకు సహాయం చేస్తుంది