కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతం దానివల్ల మీకు ప్రయోజనమేదైనా ఉందా?

మతం దానివల్ల మీకు ప్రయోజనమేదైనా ఉందా?

మతం దానివల్ల మీకు ప్రయోజనమేదైనా ఉందా?

“దైవభక్తి లేకపోయినా నేను మంచి వ్యక్తిగానే ఉండగలను” అని అనేకమంది అనుకుంటారు. నిజాయితీ, సానుభూతి ఉన్న, బాధ్యతాయుతులైన అనేకులు మతంవైపు ఆకర్షించబడరు. ఉదాహరణకు, ఉత్తర ఐరోపాలో అనేకమంది తమకు దేవునిపై నమ్మకముందని చెప్పినా, కొద్దిమందే క్రమంగా చర్చికి వెళ్తారు. * లాటిన్‌ అమెరికాలో కూడా, క్యాథలిక్కుల్లో కేవలం 15 నుండి 20 శాతం మంది మాత్రమే క్రమంగా చర్చీకి వెళ్తారు.

అనేకమందిలాగే మీరుకూడా బహుశా మెరుగైన జీవితానికి మతం ప్రాముఖ్యం కాదని భావిస్తుండవచ్చు. అయితే, దశాబ్దాల క్రితం మీ తాతముత్తాతల కాలంలో అనేకులు ఇప్పటికన్నా ఎక్కువ దైవభక్తితో ఉండేవారని బహుశా మీకు తెలిసే ఉంటుంది. మరి నేడు మతం ప్రజల్ని ఎందుకు ఆకర్షించలేకపోతోంది? ఒక వ్యక్తికి మతాసక్తి లేకపోయినా అతను మంచి వ్యక్తిగానే ఉండగలడా? మీకు ప్రయోజనాన్నివ్వగల మతమేదైనా ఉందా?

అనేకులు మతాన్ని ఎందుకు తిరస్కరించారు?

శతాబ్దాల వరకు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకులు దేవుడు విధేయతను కోరుతున్నాడని నమ్మారు. ఫాదిరీల మతాచారాల ద్వారా లేదా మతనాయకుల నిర్దేశం ద్వారా దేవుని అనుగ్రహం పొందడానికే వారు చర్చీకి వెళ్ళేవారు. నిజానికి, వారిలో అనేకులకు మతంలో ఉన్న వేషధారణ గురించి తెలుసు. యుద్ధాల్లో మతాల పాత్ర, కొందరు ఫాదిరీల అనైతిక ప్రవర్తన అందరికి తెలిసిందే. కానీ, స్వతహాగా మతంలో తప్పేమీ లేదని చాలామంది భావించారు. ఇతరులు, మతంలోని భక్తిపూర్వక వాతావరణాన్ని, సాంప్రదాయాల్ని, సంగీతాన్ని ఇష్టపడతారు; మరికొందరు, నిత్య నరకాగ్ని దండన అనే బెదిరింపు మంచిదని భావిస్తారు, కానీ ఈ బోధ లేఖనాల్లో కనిపించదు. ఆ తర్వాతి కాలాల్లో, చోటుచేసుకున్న అనేక పరిణామాలు చర్చీలపై ప్రజలకున్న అభిప్రాయాన్నే మార్చేశాయి.

పరిణామ సిద్ధాంతం వ్యాప్తి చెందింది. దేవుని ప్రమేయం లేకుండా ప్రాణం యాదృచ్ఛికంగానే ఆవిర్భవించిందని కొందరు నమ్మారు. దేవుడే జీవానికి మూలం అని నిరూపించేందుకు తగిన ఆధారాలను చూపించడంలో అనేక మతాలు విఫలమయ్యాయి. (కీర్తన 36:⁠9) అంతేకాక, సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో గమనార్హమైన పురోగతి జరగడంవల్ల ప్రజలు విజ్ఞానశాస్త్ర సహాయంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చనే ముగింపుకు వచ్చారు. చర్చీలకన్నా సామాజిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలే మెరుగైన నడిపింపును ఇస్తున్నారని ప్రజలు తలంచారు. దేవుని నియమాల ప్రకారం జీవించడమే శ్రేష్ఠమైన జీవితమనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించడంలో చర్చీలు విఫలమయ్యాయి.​—⁠యాకోబు 1:​25.

పర్యవసానంగా, ఎన్నో చర్చీలు తమ సందేశాన్ని మార్చుకున్నాయి. ఫాదిరీలు, సువార్తికులు దేవుడు విధేయతను కోరుతున్నాడని బోధించడం మానేశారు. బదులుగా, మంచేదో చెడేదో ప్రతీ వ్యక్తి స్వయంగా నిర్ణయించుకోవాలని అనేకులు బోధించారు. జనాదరణ పొందేందుకు కొందరు మత నాయకులు, ప్రజలు ఎలా జీవించినా దేవుడు వారిని అంగీకరిస్తాడని వాదించారు. అలాంటి బోధలు బైబిలు ప్రవచించినదాన్ని మనకు గుర్తుచేస్తాయి: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొనిరి.”​—⁠2 తిమోతి 4:⁠3.

అలాంటి బోధలు ప్రజల్ని ఆకర్షించే బదులు, అవి వారిని మతం నుండి దూరం చేశాయి. ప్రజలు సహజంగానే ఇలా అనుకున్నారు: ‘సృష్టించడానికి దేవునికున్న శక్తిని, నియమాలు చేయడానికి దేవునికున్న జ్ఞానాన్ని ఒకవేళ చర్చీలే శంకిస్తే మనం అక్కడికి వెళ్లడంలో ప్రయోజనమేముంది? నేను నా పిల్లలకు మతం గురించి ఎందుకు బోధించాలి?’ మంచిగా జీవించాలని తాపత్రయపడే వ్యక్తులు మతం అవసరం లేదని భావించడం మొదలుపెట్టారు. వారు చర్చీలకు వెళ్లడం మానేశారు, వారికి మతం ఇక ఏమాత్రం ప్రాముఖ్యం కాదు. ప్రయోజనకరమైనదిగా ఉండాల్సిన మతంలో ఎక్కడ తప్పు జరిగింది? బైబిలే మనకు న్యాయసమ్మతమైన వివరణనిస్తోంది.

చెడు ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మతం ఉపయోగించబడింది

కొందరు తమ చెడు ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి క్రైస్తవత్వాన్ని ఉపయోగిస్తారని అపొస్తలుడైన పౌలు తొలి క్రైస్తవులను హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: “క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొస్తలుల కార్యములు 20:​29, 30) అలా “వంకర మాటలు” మాట్లాడినవారిలో ఒక వ్యక్తి, రోమన్‌ క్యాథలిక్‌ వేదాంతి అగస్టీన్‌. లేఖనాలనుండి తర్కిస్తూ ఇతరుల్లో ఎలా విశ్వాసం కలిగించవచ్చో యేసు తన అనుచరులకు నేర్పించాడు. కానీ అగస్టీన్‌, లూకా 14:⁠23లో వ్రాయబడినట్లుగా “లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము” అని పలికిన యేసు మాటల అర్థాన్ని వంకరచేసి, ప్రజల్ని బలవంతంగా మత మార్పిడి చేయడంలో తప్పేమీ లేదని చెప్పాడు. (మత్తయి 28:​19, 20; అపొస్తలుల కార్యములు 28:​23, 24) ప్రజల్ని నియంత్రించేందుకు అగస్టీన్‌ మతాన్ని ఉపయోగించాడు.

మతంలోని భ్రష్టత్వం, మతాన్ని దుర్వినియోగం చేయడం వెనుక తిరుగుబాటు చేసిన దేవదూత అయిన సాతాను ఉన్నాడు. క్రైస్తవ సంఘాలను భ్రష్టుపట్టించేందుకు అతడు మొదటి శతాబ్దంలోని మతాసక్తిపరులను రెచ్చగొట్టాడు. వారి గురించి బైబిలు ఇలా అంటోంది: “అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పని వారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు.”​—⁠2 కొరింథీయులు 11:​13-15.

సాతాను నేడు కూడా క్రైస్తవ మతమని, నీతిగలదని, జ్ఞానయుక్తమని చెప్పుకునే కపటమైన నామకార్థ మతాన్ని ఉపయోగిస్తూ, ప్రజలు దేవుని కట్టడల ప్రకారం కాక, తన కట్టడల ప్రకారం జీవించేలా చేస్తున్నాడు. (లూకా 4:​5-7) పెద్ద పెద్ద బిరుదులు తగిలించుకుని తమను తాము హెచ్చించుకుంటూ, తమ సభ్యుల నుండి దండిగా డబ్బులు వసూలుచేసేందుకు మతాన్ని ఉపయోగించే మతనాయకులను అనేకమందిని మీరు బహుశా చూసివుండవచ్చు. యుద్ధాల్లో తమను తాము బలి చేసుకునేలా పౌరుల్ని పురికొల్పేందుకు ప్రభుత్వాలు కూడా మతాన్ని ఉపయోగించుకున్నాయి.

అపవాది అనేకమంది గ్రహించలేని రీతుల్లో మతాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నాడు. సాతాను కేవలం కొంతమంది మతఛాందస తీవ్రవాదుల్ని మాత్రమే ఉపయోగిస్తున్నాడని మీరనుకోవచ్చు. కానీ బైబిలు ప్రకారం, “అపవాదియనియు సాతాననియు పేరుగల” వాడు ‘సర్వలోకమును మోస పుచ్చుచున్నాడు.’ అంతేకాదు, “లోకమంతయు దుష్టుని యందున్నది” అని కూడా బైబిలు చెబుతోంది. (ప్రకటన 12:⁠9; 1 యోహాను 5:​19) ప్రజల్ని తమవైపుకు త్రిప్పుకునేందుకు మత నాయకులు ఉపయోగించే మతాన్ని గురించి దేవుడు ఎలా భావిస్తాడు?

“నాకేల?”

కొన్ని క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల ప్రవర్తననుబట్టి మీరు విభ్రాంతి చెందివుంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా వారినిబట్టి ఏ మాత్రం సంతోషించడం లేదని తెలుసుకోండి. ప్రాచీన ఇశ్రాయేలులాగే క్రైస్తవమత సామ్రాజ్యం కూడా దేవునితో తాము నిబంధన చేసుకున్నామని చెప్పుకుంటోంది. అవి రెండూ నమ్మకద్రోహమైనవని నిరూపించబడ్డాయి. కాబట్టి, ఇశ్రాయేలుపై యెహోవా విధించిన తీర్పు నేడు క్రైస్తవమత సామ్రాజ్యానికి కూడా వర్తిస్తుంది. యెహోవా ఇలా అన్నాడు: “ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. . . . షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? . . . మీ బలులయందు నాకు సంతోషము లేదు.” (యిర్మీయా 6:​19, 20) వేషధారులు చేసే ఆరాధనను దేవుడు గుర్తించడు. వారి ఆచారాలు, ప్రార్థనలపట్ల ఆయనకు ఆసక్తి లేదు. ఆయన ఇశ్రాయేలుతో ఇలా అన్నాడు: “మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు. అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను.”​—⁠యెషయా 1:​14, 15.

క్రైస్తవులమని చర్చీలు చెప్పినా, అబద్ధ దేవుళ్ళను ఘనపరిచేందుకు ఆరంభించబడిన పండగలనుబట్టి యెహోవా సంతోషిస్తాడా? క్రీస్తు బోధలను భ్రష్టుపట్టించే మతనాయకుల ప్రార్థలను ఆయన వింటాడా? ఆయన నియమాన్ని ఉల్లంఘించే మతాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ప్రాచీన ఇశ్రాయేలీయులు అర్పించిన బలులకు ఆయన ఎలా స్పందించాడో, నేటి చర్చీల్లోని ఆచారాలకు కూడా ఆయనలాగే స్పందిస్తాడని మీరు నమ్మవచ్చు. వాటి విషయంలో ఆయనిలా అంటున్నాడు: “నాకేల?”

అయితే, యథార్థవంతులు సత్యంతో చేసే ఆరాధనపట్ల యెహోవాకు ప్రగాఢమైన శ్రద్ధ ఉంది. ఆయననుండి లభించే వాటన్నింటిపట్ల కృతజ్ఞత చూపించే వ్యక్తుల విషయంలో దేవుడు సంతోషిస్తాడు. (మలాకీ 3:​16, 17) మరి మీరు దేవుణ్ణి ఆరాధించకుండానే ఒక మంచి వ్యక్తిగా ఉండగలరా? తనను ప్రేమించే తల్లిదండ్రులకోసం ఏమీ చేయని ఒక వ్యక్తి తాను మంచివాణ్ణని అనుకోవడం న్యాయసమ్మతమైనదేనా? దేవుని కోసం ఏమీ చేయని వ్యక్తి మంచివాడవుతాడా? మనకు జీవాన్నిచ్చిన సత్యదేవునిపట్ల నిజమైన శ్రద్ధ కలిగివుండడం సహేతుకమైనదే. సత్యారాధన దేవుణ్ణి ఘనపర్చడమేకాక మనకెలాంటి ప్రయోజనాల్ని చేకూరుస్తుందో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 2 “అనేక దేశాల్లో మతపరమైన సంస్కృతి పతనమైపోవడానికి . . . 1960వ దశాబ్దం నాంది పలికింది.”​—⁠ద డిక్లైన్‌ ఆఫ్‌ క్రిజన్‌డమ్‌ ఇన్‌ వెస్టర్న్‌ యూరప్‌, 1750-​2000.

[4వ పేజీలోని చిత్రం]

దేవుడే సమస్తాన్ని సృష్టించాడని నిరూపించే ఆధారాలను చర్చీలు చూపిస్తున్నాయా?

[4, 5వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రతినిధి ఈ సన్నివేశంలో భాగంగా ఉండాలా?

[5వ పేజీలోని చిత్రం]

ఇటువంటి పండుగను దేవుడు ఎలా దృష్టిస్తాడు?

[చిత్రసౌజన్యం]

AP Photo/Georgy Abdaladze