కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు మేలు చేసే ఆరాధన

మీకు మేలు చేసే ఆరాధన

మీకు మేలు చేసే ఆరాధన

“నాకైతే దేవుని పొందు ధన్యకరము” అని కీర్తనకర్తయైన ఆసాపు అన్నాడు. సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు దేవుణ్ణి విడిచిపెట్టినవారిని అనుకరించాలని ఆయన ఒకప్పుడు అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఆసాపు దేవునికి సన్నిహితమవడంలో ఉన్న ప్రయోజనాల గురించి ఆలోచించి, అలా చేయడమే తనకు ధన్యకరమనే లేదా మేలు చేస్తుందనే ముగింపుకు వచ్చాడు. (కీర్తన 73:​2, 3, 12, 28) సత్యారాధన నేడు మీకు మేలు చేస్తుందా? అది మీకెలా మేలు చేస్తుంది?

సత్య దేవుణ్ణి ఆరాధించడం వల్ల, మీరు మీ స్వంత విషయాల గురించేకాక ఇతరుల గురించి కూడా ఆలోచించేలా మీ ఆలోచనా సరళి మెరుగౌతుంది. ‘ప్రేమకు కర్తయగు దేవుడు’ మనల్ని అలా సృష్టించిన విధానాన్నిబట్టి తమ స్వంత విషయాలపట్లే శ్రద్ధ ఉన్నవారు ఎప్పటికీ సంతోషించలేరు. (2 కొరింథీయులు 13:​11) మానవ ప్రవృత్తి గురించిన ఒక ప్రాథమిక సూత్రాన్ని బోధిస్తూ యేసు ఇలా అన్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) అందుకే మనం మన స్నేహితుల కోసం, కుటుంబీకుల కోసం పనులు చేయడానికి సంతోషిస్తాం. కానీ, దేవుని సేవ చేయడంలోనే అత్యంత గొప్ప సంతోషం ఉంది. ఇతరులకన్నా ఆయనే మన ప్రేమకు అర్హుడు. వివిధ నేపథ్యాలకు చెందిన లక్షలాదిమంది దేవుడు కోరుతున్నదాన్ని చేస్తూ ఆయనను ఆరాధించడంలోనే నిజమైన సంతృప్తి ఉందని కనుగొన్నారు.​—⁠1 యోహాను 5:⁠3.

జీవితానికి ఒక సంకల్పాన్నిస్తుంది

సత్యారాధనవల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే, అది మన జీవితానికి ఒక సంకల్పాన్నిస్తుంది. అనేక సందర్భాల్లో, మనం ప్రయోజనకరమైనది చేస్తున్నామనే భావన మనకు సంతోషాన్నిస్తుందనే విషయాన్ని మీరు గమనించారా? చాలామంది జీవితాల్లో కుటుంబానికి, స్నేహితులకు, వ్యాపారానికి లేదా మనోల్లాసానికి సంబంధించిన లక్ష్యాలుంటాయి. కానీ జీవితపు అనిశ్చిత పరిస్థితులనుబట్టి తరచూ ఆ బాంధవ్యాలు, వస్తువులు వారిని సంతోషపెట్టవు. (ప్రసంగి 9:​11) అయితే, జీవితంలోని ఇతర విషయాలు మిమ్మల్ని నిరాశపరిచినా ఎల్లకాలం మీకు సంతృప్తినిచ్చే మరింత ఉన్నతమైన సంకల్పాన్ని కనుగొనడానికి సత్యారాధన మీకు సహాయం చేస్తుంది.

సత్యారాధనలో యెహోవాను తెలుసుకోవడం, ఆయనను విశ్వసనీయంగా సేవించడం ఇమిడివున్నాయి. సత్యారాధకులు దేవునికి ఎంతో సన్నిహితమౌతారు. (ప్రసంగి 12:⁠13; యోహాను 4:⁠23; యాకోబు 4:⁠8) దేవుడు మీకు స్నేహితుడయ్యేంతగా ఆయన గురించి తెలుసుకోవడాన్ని ఊహించడం మీకు కష్టమనిపించవచ్చు. కానీ, ఆయన తన ప్రజలతో వ్యవహరించిన వృత్తాంతాల గురించి, ఆయన సృష్టిని గురించి ధ్యానించినప్పుడు నిజంగా మీరు ఆయన వ్యక్తిత్వంలోని వివిధ అంశాలను తెలుసుకోగలుగుతారు. (రోమీయులు 1:​20) అంతేకాదు, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, దేవుడు బాధనెందుకు అనుమతిస్తున్నాడు, ఆయన బాధనెలా తీసివేస్తాడనే కాక, దేవుడు చేసే పనిలో మీకు ఎలాంటి ప్రాముఖ్యమైన పాత్ర ఉందనే అద్భుతమైన విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. (యెషయా 43:⁠10; 1 కొరింథీయులు 3:⁠9) అలాంటి గ్రహింపు మీ జీవితానికొక కొత్త సంకల్పాన్నివ్వగలదు!

మన వ్యక్తిత్వం మెరుగౌతుంది

సత్యారాధనవల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, అది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మీరు సత్యారాధనలో పాల్గొంటుండగా, మీరు అలవర్చుకొనే వ్యక్తిత్వం, ఇతరులతో సంతోషకరమైన సంబంధాలను ఏర్పర్చుకొనేందుకు సహాయం చేస్తుంది. నిజాయితీగా ప్రవర్తించడాన్ని, దయతో మాట్లాడడాన్ని, బాధ్యతాయుతంగా జీవించడాన్ని మీరు దేవుని నుండి, ఆయన కుమారుని నుండి నేర్చుకుంటారు. (ఎఫెసీయులు 4:⁠20-5:⁠5) మీరు దేవుణ్ణి ప్రేమించగలిగేంతగా ఆయనను తెలుసుకున్నప్పుడు ఆయనను అనుకరించేందుకు మీరు పురికొల్పబడతారు. “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి” అని బైబిలు చెబుతోంది.​—⁠ఎఫెసీయులు 5:⁠1, 2.

దేవుని ప్రేమను అనుకరించే ప్రజల మధ్య జీవించడం ఆనందాన్నివ్వదా? సంతోషకరంగా, మనం ఒంటరిగానే సత్య దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు. సత్యాన్ని, మంచిని ప్రేమించే ప్రజల్లో మీరు భాగంగా ఉంటారు. వ్యవస్థీకృత మతం అంటే మీకు కాస్త ఇబ్బందిగా అనిపించడం సహజమే. మనం ముందరి ఆర్టికల్‌లో చూసినట్లుగా, చాలా మతాల్లో ఉన్న సమస్య ఏమిటంటే, అవి సరైన ఉద్దేశాల కోసం, సరైన రీతిలో వ్యవస్థీకరించబడిలేవు. అనేక వ్యవస్థీకృత మతాల్లో క్రైస్తవ విరుద్ధ ఉద్దేశాల కోసమే పనిచేస్తున్నాయి. దేవుని ప్రజల్ని యెహోవాయే ఒక మంచి ఉద్దేశం కోసం వ్యవస్థీకరించాడు. బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.” (1 కొరింథీయులు 14:​33) లక్షలాదిమంది ఇతరుల్లాగే వ్యవస్థీకృత క్రైస్తవులతో సహవసించడం మీ ఆలోచనా సరళిపై మంచి ప్రభావం చూపిస్తుందని మీరు గ్రహించవచ్చు.

భవిష్యత్తు నిరీక్షణ

సత్యారాధకులు ఈ విధానాంతాన్ని తప్పించుకొని “నీతి నివసించే” క్రొత్త భూమిని స్వతంత్రించుకొనేలా దేవుడు వారిని వ్యవస్థీకరిస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు చూపిస్తున్నాయి. (2 పేతురు 3:​13; ప్రకటన 7:​9-17) కాబట్టి మీకు మేలుచేసే సత్యారాధన మీకు నిరీక్షణను, అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వాలు స్థిరంగా ఉండడంపై, వ్యాపారాల్లో లాభాలు గడించడంపై, మంచి ఆరోగ్యం కోసం లేదా ఉద్యోగ విరమణ తర్వాత సంతృప్తికరమైన జీవితం కోసం ఎదురుచూడడంలో తమ భవిష్యత్తు ఆధారపడివుందని కొందరు అనుకుంటారు. కానీ వాటిలో ఏవీ సంతోషకరమైన భవిష్యత్తు ఉంటుందని నమ్మేందుకు బలమైన ఆధారాన్నివ్వలేవు. వాటికి భిన్నంగా, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచియున్నాము.”​—⁠1 తిమోతి 4:​10.

మీరు శ్రద్ధగా వెదికితే సత్యారాధకుల్ని మీరు కనుగొనవచ్చు. నేటి విభాగిత లోకంలో, తమ మధ్యగల ప్రేమ ఐక్యతల కారణంగా యెహోవాసాక్షులు భిన్నంగా ఉన్నారు. వారిలో ప్రతీ దేశం నుండి, ప్రతీ నేపథ్యం నుండి వచ్చినవారున్నారు; అయినా, వారందరు యెహోవాపట్ల తమకున్న ప్రేమనుబట్టి ఐక్యపర్చబడ్డారు. (యోహాను 13:​35) వారు చవిచూసినదాన్ని మీరు కూడా ఆస్వాదించాలని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆసాపు ఇలా వ్రాశాడు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము.”​—⁠కీర్తన 73:​28.

[7వ పేజీలోని చిత్రం]

మీరు కూడా దేవుని స్నేహితులుకావచ్చు