“మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”
“మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”
“ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”—ఫిలిప్పీయులు 4:6.
మీ దేశ పరిపాలకుణ్ణి కలుసుకోవాలని మీరు చేసుకునే విన్నపానికి మీకెలాంటి జవాబు లభిస్తుంది? మీకు ఆయన కార్యాలయం నుండి మర్యాదపూర్వక ఉత్తరం అందవచ్చేమో గానీ, స్వయంగా ఆయనతో మాట్లాడే అవకాశం మాత్రం మీకు లభించకపోవచ్చు. అయితే, సర్వోన్నత విశ్వ పరిపాలకుడైన యెహోవా దేవుని విషయంలో అలా జరగదు. మనమెక్కడ ఉన్నా, మనమే సమయం ఎంచుకున్నా మనమాయనను సమీపించవచ్చు. అంగీకృత ప్రార్థనలను ఆయనెల్లప్పుడూ వింటాడు. (సామెతలు 15:29) అది నిజంగా అద్భుతం! ఆ ఆధిక్యతపట్ల మనకున్న కృతజ్ఞత, ‘ప్రార్థన ఆలకించువాడు’ అని న్యాయంగా పిలవబడిన దేవునికి క్రమంగా ప్రార్థించేలా మనల్ని ప్రేరేపించవద్దా?—కీర్తన 65:2.
2 అయితే కొందరిలా అడగవచ్చు, ‘ఎలాంటి ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు?’ ప్రార్థనలు అంగీకరించబడేందుకు అవసరమైన ఒక విషయాన్ని బైబిలు ఇలా వివరిస్తోంది: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” (హెబ్రీయులు 11:6) ముందరి ఆర్టికల్‌లో వివరించబడినట్లుగా, దేవుణ్ణి సమీపించడానికి కీలకం విశ్వాసం. దేవుడు తనను సమీపించేవారి ప్రార్థనలను అంగీకరించేందుకు ఇష్టపడతాడు, అయితే వాటిని నిజాయితీగా, సరైన హృదయ దృక్పథంతో సత్క్రియలతో కూడుకున్న విశ్వాసంతో చేయాలి.
3 అపొస్తలుడైన పౌలు తన కాలంలోని క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలిప్పీయులు 4:6, 7) దేవునికి తమ భయాందోళనలు చెప్పుకున్న వారి ఉదాహరణలు బైబిల్లో చాలావున్నాయి. అలాంటివారిలో హన్నా, ఏలీయా, హిజ్కియా, దానియేలు ఉన్నారు. (1 సమూయేలు 2:1-10; 1 రాజులు 18:36, 37; 2 రాజులు 19:15-19; దానియేలు 9:3-21) మనం వారి మాదిరిని అనుకరించాలి. మన ప్రార్థనలు వివిధ రూపాల్లో ఉండవచ్చని పౌలు మాటలు వివరించడాన్ని గమనించండి. ఆయన కృతజ్ఞత గురించి పేర్కొన్నాడు, అది దేవుడు మనకోసం చేస్తున్నవాటిపట్ల కృతజ్ఞతలు చెల్లించే ప్రార్థన. వీటితోపాటు స్తుతులు కూడా చెల్లించవచ్చు. విజ్ఞాపన వినయంగా మనఃపూర్వకంగా వేడుకోవడాన్ని సూచిస్తుంది. ఏదైనా ప్రత్యేక విషయానికి సంబంధించి మనం విన్నపాలను లేదా అభ్యర్థనలను వ్యక్తపర్చవచ్చు. (లూకా 11:2, 3) వీటిలో మనం ఏ విధంగా సమీపించినా మన పరలోకపు తండ్రి వాటిని అంగీకరించడానికి సంతోషిస్తాడు.
4 ‘మన అవసరాలన్నీ యెహోవాకు ముందే తెలియవా’ అని కొందరు అడగవచ్చు. ఆయనకు తెలుసు. (మత్తయి 6:8, 32) అలాంటప్పుడు, మన విన్నపాలతో ఆయనను సమీపించాలని ఆయనెందుకు కోరుతున్నాడు? ఈ ఉదాహరణ పరిశీలించండి: ఒక దుకాణదారుడు తన ఖాతాదారులకు ఒక బహుమానం అందించవచ్చు. అయితే ఆ బహుమానాన్ని తీసుకునేందుకు, ఆ ఖాతాదారులు దుకాణాదారుని దగ్గరకు వచ్చి తీసుకోవాలి. అలా వచ్చేందుకు ఇష్టపడనివారు ఆ బహుమానాన్ని విలువైనదిగా పరిగణించడం లేదని చూపిస్తారు. అదేవిధంగా, మన విన్నపాల్ని ప్రార్థనలో ప్రస్తావించేందుకు అశ్రద్ధ చేయడం యెహోవా దయచేసేవాటిపట్ల కృతజ్ఞతలేదని చూపిస్తుంది. యేసు ఇలా అన్నాడు: “అడుగుడి, మీకు దొరకును.” (యోహాను 16:24) అలా చేస్తే మనం దేవునిపై ఆధారపడుతున్నామని చూపిస్తాం.
మనం దేవుణ్ణి ఎలా సమీపించాలి?
5 ఎలా ప్రార్థించాలో వివరించేందుకు యెహోవా ఎన్నో కఠినమైన నియమాలు విధించడం లేదు. అయినప్పటికీ, మనం బైబిల్లో వివరించబడినట్లు దేవుణ్ణి సరైన రీతిలో సమీపించడాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకు, యేసు తన అనుచరులకిలా బోధించాడు: “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.” (యోహాను 16:23) కాబట్టి, సర్వ మానవాళికి దేవుని ఆశీర్వాదాలు లభించగల ఏకైక మార్గం యేసు అని గుర్తిస్తూ, మనం యేసు పేరట ప్రార్థించాలి.
6 ఏ శరీర భంగిమతో మనం ప్రార్థించాలి? మన ప్రార్థనలు ఆలకించబడేందుకు ఏ ప్రత్యేక శరీర భంగిమనూ బైబిలు వివరించడం లేదు. (1 రాజులు 8:22; నెహెమ్యా 8:6; మార్కు 11:25; లూకా 22:41) నిజాయితీగా, సరైన హృదయ దృక్పథంతో దేవుణ్ణి ప్రార్థించడమే ప్రాముఖ్యం.—యోవేలు 2:12, 13.
7 మరి “ఆమేన్” అనే మాటను ఉపయోగించే విషయమేమిటి? మనం ప్రత్యేకంగా బహిరంగంగా ప్రార్థించేటప్పుడు, మన ప్రార్థనల ముగింపులో ఈ పదాన్ని ఉపయోగించడం సముచితమని లేఖనాలు సూచిస్తున్నాయి. (కీర్తన 72:19; 89:52) ఆమేన్ అనే హీబ్రూ పదానికి ప్రాథమికంగా “నిశ్చయంగా” అనే అర్థముంది. మనం “అంతకుముందు పలికిన మాటలను ధృవీకరిస్తూ అవి నెరవేరాలని అర్థించడానికి” ప్రార్థన ముగింపులో “ఆమేన్” అని చెబుతామని మెక్లిన్‌టాక్ అండ్ స్ట్రాంగ్స్ సైక్లోపీడియా వివరిస్తోంది. కాబట్టి, నిజాయితీగా “ఆమేన్” అని చెబుతూ ముగించడం ద్వారా ప్రార్థించే వ్యక్తి అంతకుముందు తాను పలికిన మాటల విషయంలో తన నిష్కపట భావాలను సూచిస్తాడు. సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రార్థించిన ఒక క్రైస్తవుడు ఆ మాటతో ముగించినప్పుడు, వినేవారు కూడా ఆ ప్రార్థనను తాము గట్టిగా ఆమోదిస్తున్నామని సూచించేందుకు నిశ్శబ్దంగా లేదా బిగ్గరగా “ఆమేన్” అని చెప్పవచ్చు.—1 కొరింథీయులు 14:16.
8 మనం ప్రార్థించే విషయాలపట్ల మనకెంత శ్రద్ధ ఉందో ప్రదర్శించేందుకు దేవుడు మనల్ని కొన్నిసార్లు అనుమతించవచ్చు. ఆశీర్వాదం పొందేందుకు ఒక రాత్రంతా దేవదూతతో పెనుగులాడిన పూర్వకాల యాకోబులా మనం మారవలసి రావచ్చు. (ఆదికాండము 32:24-26) లేదా మన పరిస్థితులు కొన్ని, మనం పదేపదే యెహోవాను వేడుకున్న అబ్రాహాములా ఉండడాన్ని కోరవచ్చు. ఆయన లోతు, సొదొమలో ఉండవచ్చనుకున్న మరితర నీతిమంతుల కోసం యెహోవాను పదేపదే వేడుకున్నాడు. (ఆదికాండము 18:22-33) అదేవిధంగా మనం కూడా యెహోవా న్యాయం, కృపాకనికరాల ఆధారంగా మనం అమూల్యంగా ఎంచే విషయాల కోసం వేడుకోవచ్చు.
మనమేమి అడగవచ్చు?
9“ప్రతి విషయములోను . . . మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని పౌలు చెప్పాడని గుర్తుంచుకోండి. (ఫిలిప్పీయులు 4:6) కాబట్టి, వ్యక్తిగత ప్రార్థనల్లో జీవితంలోని అన్ని అంశాల గురించి ప్రార్థించవచ్చు. అయితే, మన ప్రార్థనల్లో యెహోవాకు సంబంధించిన విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలి. ఈ విషయంలో దానియేలు చక్కని మాదిరి ఉంచాడు. తమ పాపాల కారణంగా ఇశ్రాయేలు జనాంగం శిక్షననుభవించినప్పుడు, దానియేలు తమపట్ల కనికరం చూపించమని యెహోవాను ఇలా వేడుకున్నాడు: ‘నా దేవా ఆలస్యము చేయక, నీ పేరునుబట్టి, నీ ఘనతనుబట్టి నా ప్రార్థన వినుము.’ (దానియేలు 9:15-19) అదేవిధంగా యెహోవా పేరు పరిశుద్ధపర్చబడి, ఆయన చిత్తం నెరవేరాలని మనం ప్రధానంగా కోరుకుంటున్నట్లు మన ప్రార్థనలు చూపిస్తున్నాయా?
10 అయితే, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అభ్యర్థనలు కూడా సముచితమే. ఉదాహరణకు, కీర్తనకర్తలాగే, లోతైన ఆధ్యాత్మిక అవగాహన గురించి మనం ప్రార్థించవచ్చు. ఆయనిలా ప్రార్థించాడు: “నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.” (కీర్తన 119:33, 34; కొలొస్సయులు 1:9, 10) యేసు “తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పిం[చాడు].” (హెబ్రీయులు 5:7) అలా చేయడంలో ఆయన, ఒక వ్యక్తి ప్రమాదాన్ని లేదా పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు బలం కోసం ప్రార్థించడం సరైనదే అని ప్రదర్శించాడు. తన శిష్యులకు మాదిరి ప్రార్థనను నేర్పించినప్పుడు, ఆయన పాపాలను క్షమించడం, అనుదినాహారాన్ని పొందడం వంటి వ్యక్తిగత అంశాలను కూడా చేర్చాడు.
11 ఆ మాదిరి ప్రార్థనలో యేసు ఈ అభ్యర్థనను కూడా చేర్చాడు: “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్తయి 6:9-13) ఆ తర్వాత ఆయన ఇలా ఉపదేశించాడు: “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.” (మత్తయి 26:41) మనం శోధనలు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చాలా అవసరం. ఉద్యోగ స్థలంలో లేదా పాఠశాలలో బైబిలు సూత్రాలను ఉపేక్షించాలనే శోధనను మనమెదుర్కోవచ్చు. సాక్షులుకానివారు క్రైస్తవులకు అంగీకారంకాని కార్యకలాపాల్లో తమతో కలిసి పాల్గొనమని మనల్ని ఆహ్వానించవచ్చు. నీతిసూత్రాలను ఉల్లంఘించే పనులు చేయమని మనల్ని అడగవచ్చు. అలాంటి సమయాల్లో, ప్రార్థన గురించి యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించి, మనం శోధనకు ముందు, శోధనను ఎదుర్కొంటున్నప్పుడు దానిలో పడిపోకుండా సహాయం చేయమని మనం దేవుణ్ణి అడగవచ్చు.
12 నేడు దేవుని సేవకులు వివిధ ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. చాలామందికి వ్యాధి, భావోద్రేక ఒత్తిడి ఆందోళనకు ముఖ్యకారణంగా ఉన్నాయి. మన చుట్టూవున్న హింసాత్మక పరిస్థితులు జీవితంపై ఒత్తిడి పెంచవచ్చు. ఆర్థిక ఇబ్బందులు జీవిత కనీసావసరాలు తీర్చుకోవడాన్ని కష్టభరితం చేయవచ్చు. ఈ విషయాలను తనకు చెప్పుకునే తన సేవకుల ప్రార్థనలను యెహోవా ఆలకిస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! యెహోవా గురించి కీర్తన 102:17 ఇలా చెబుతోంది: “ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.”
1 యోహాను 5:14) వివాహం గురించి లేదా ఉద్యోగం గురించి లేదా మీ పరిచర్యను విస్తృతం చేసుకోవడం గురించి మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే, ఆ విషయాల్లో దేవుని నిర్దేశాన్ని అడిగేందుకు సంకోచించకండి. ఉదాహరణకు, ఫిలిప్పీన్స్‌లోని ఒక యౌవనురాలు పూర్తికాల పరిచర్యలో భాగం వహించాలని కోరుకుంది. అయితే, జీవతావసరాలు తీర్చుకోవడానికి తగిన ఉద్యోగం ఆమెకు లేదు. ఆమె ఇలా చెబుతోంది: “ఒక శనివారం నేను ప్రత్యేకంగా పయినీరు సేవగురించే యెహోవాకు ప్రార్థించాను. ఆ తర్వాత అదేరోజు నేను ప్రకటనా పనిలో ఉన్నప్పుడు, ఒక పుస్తకాన్ని నేను ఒక టీనేజరుకు ఇచ్చాను. అనూహ్యంగా ఆ అమ్మాయి నాతో, ‘మీరు మొదట సోమవారం ఉదయమే మా పాఠశాలకు వెళ్లండి’ అని చెప్పింది. ‘ఎందుకు’ అని నేనడిగాను. అక్కడ అత్యవసరంగా ఉద్యోగం చేయడానికి ఎవరోఒకరు కావాలి అని ఆమె వివరించింది. నేను అక్కడికి వెళ్లిన వెంటనే ఉద్యోగంలో చేర్చుకున్నారు. అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి.” ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సాక్షులకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కాబట్టి ప్రార్థనలో దేవునికి హృదయపూర్వక విన్నపాలు చేసేందుకు సంకోచించకండి.
13 నిజానికి, యెహోవాకు మనం చేసే సేవను లేదా ఆయనతో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేసే ఏ విషయమైనా సరైన ప్రార్థనాంశంగా ఉండగలదు. (మనం పాపంచేస్తే అప్పుడేమిటి?
14 పాపం చేసిన వ్యక్తికి, ప్రార్థనెలా సహాయం చేయగలదు? కొందరు అపరాధభావంతో ప్రార్థించడం మానేస్తారు. అయితే అలా మానేయడం జ్ఞానయుక్తం కాదు. ఉదాహరణకు, విమానం నడిపే పైలెట్లకు, తాము దారి తప్పితే, సహాయం కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించవచ్చని తెలుసు. అయితే దారితప్పిన పైలెట్ తాను దారితప్పాననే అపరాధభావంతో కంట్రోలర్లను సంప్రదించడానికి వెనకాడితే అప్పుడేమిటి? అది విపత్తుకు దారితీయవచ్చు! అదేవిధంగా, పాపం చేసిన వ్యక్తి, అపరాధ భావంతో దేవునికి ప్రార్థించకపోతే అతను మరింత హానికి గురికావచ్చు. పాపం చేశాననే అవమానభారం అతను యెహోవాతో మాట్లాడకుండా చేయకూడదు. వాస్తవానికి, గంభీరమైన పాపాలు చేసినవారు తనకు ప్రార్థించాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. యెహోవాకు ప్రార్థించండని ప్రవక్తయైన యెషయా తన కాలంలోని పాపులను ప్రోత్సహించాడు ఎందుకంటే, “ఆయన బహుగా క్షమించును.” (యెషయా 55:6, 7) అయితే, ఆ వ్యక్తి పాపంనుండి వైదొలగి, యథార్థంగా పశ్చాత్తాపపడి అణకువను ప్రదర్శించడం ద్వారా ‘కటాక్షించమని యెహోవాను బతిమాలుకోవాలి.’—కీర్తన 119:58; దానియేలు 9:13.
15 మరో కారణాన్నిబట్టి కూడా పాపం చేసినప్పుడు ప్రార్థన మరింత ప్రాముఖ్యమౌతుంది. ఆధ్యాత్మిక సహాయం అవసరమైన వ్యక్తి గురించి శిష్యుడైన యాకోబు ఇలా చెబుతున్నాడు: “అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు . . . అతని కొరకు ప్రార్థనచేయవలెను. . . . ప్రభువు [యెహోవా] అతనిని లేపును.” (యాకోబు 5:14, 15) ఆయన ప్రార్థనలో వ్యక్తిగతంగా తన తప్పు ఒప్పుకోవడమే కాక, తన కోసం ప్రార్థించమని కూడా ఆయన పెద్దలను అడగవచ్చు. అది ఆధ్యాత్మికంగా కోలుకునేందుకు ఆయనకు సహాయం చేస్తుంది.
ప్రార్థనలకు లభించే జవాబులు
16 ప్రార్థనలకు జవాబు ఎలా దొరుకుతుంది? కొన్నింటికి వెంటనే స్పష్టంగా జవాబు లభిస్తుంది. (2 రాజులు 20:1-6) మరి కొన్నింటికి సమయం పట్టవచ్చు, జవాబులు బహుశా గ్రహించడానికి కష్టంగా ఉండవచ్చు. ఒక విధవరాలు పదేపదే న్యాయాధిపతి దగ్గరకు వెళ్లడం గురించి యేసు చెప్పిన దృష్టాంతంలో చూపించబడినట్లుగా, దేవునికి పదేపదే ప్రార్థించడం అవసరం కావచ్చు. (లూకా ) అయితే, దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థించినప్పుడు, “నన్ను తొందరపెట్టవద్దు” అని యెహోవా మనకెన్నడూ చెప్పడనే నమ్మకంతో మనముండవచ్చు.— 18:1-8లూకా 11:5-9.
17 ప్రార్థనలకు జవాబులు లభించడం యెహోవా ప్రజలకు అనుభవపూర్వకంగా బాగా తెలుసు. ఇది మన బహిరంగ పరిచర్యలో తరచూ స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఫిలిప్పీన్స్‌లో ఇద్దరు సహోదరీలు ఆ దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో బైబిలు సాహిత్యాలను అందిస్తున్నారు. వారొక స్త్రీకి కరపత్రం ఇచ్చినప్పుడు, ఆమె కళ్లు చెమర్చాయి. ఆమె ఇలా అంది: “నాకు బైబిలు బోధించడానికి ఎవరినైనా పంపించమని నేను నిన్న రాత్రి దేవునికి ప్రార్థించాను, ఇది నా ప్రార్థనకు లభించిన జవాబని నేను అనుకుంటున్నాను.” ఆ తర్వాత కొద్దికాలానికే ఆ స్త్రీ రాజ్యమందిరంలో కూటాలకు హాజరవడం ప్రారంభించింది. ఆగ్నేయాసియా ప్రాంతంలోని మరో దేశంలో ఒక క్రైస్తవ సహోదరుడు భద్రత కట్టుదిట్టంగావున్న ఒక నివాస భవన సముదాయంలో ప్రకటించడానికి భయపడ్డాడు. అయితే తనకు ధైర్యమిమ్మని దేవునికి ప్రార్థించి ఆయన ఆ భవన సముదాయంలోకి ప్రవేశించాడు. ఆయన ఒక ఇంటి తలుపు తట్టినప్పుడు, ఒక యువతి బయటకు వచ్చింది. తానెందుకు వచ్చాడో ఆ సహోదరుడు వివరించినప్పుడు, ఆమె కళ్లనీళ్ల పర్యంతమైంది. తాను యెహోవాసాక్షుల కోసం ఎదురుచూస్తున్నానని, వారిని కనుగొనేందుకు సహాయం చేయమని ప్రార్థించినట్లు ఆమె చెప్పింది. ఆ సహోదరుడు స్థానిక యెహోవాసాక్షుల సంఘానికి వెళ్లేందుకు ఆమెకు సంతోషంగా సహాయం చేశాడు.
18 ప్రార్థన నిజంగా అద్భుతమైన ఏర్పాటు. మన ప్రార్థనలను విని జవాబిచ్చేందుకు యెహోవా సిద్ధంగా ఉన్నాడు. (యెషయా 30:18, 19) అయితే, యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో మనం గమనించాలి. అది అన్ని సమయాల్లో మనం ఆశించినట్లు ఉండకపోవచ్చు. అయినా, మనమాయన నిర్దేశాన్ని గ్రహించినప్పుడు, ఆయనకు మన కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. (1 థెస్సలొనీకయులు 5:18) అంతేకాక, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” అవును, దేవునితో మాట్లాడే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ విధంగా మీరు, ప్రార్థనలు జవాబివ్వబడే వారి గురించి అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటల సత్యసంధతను ఎల్లప్పుడూ చవిచూస్తారు: “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7.
మీరు జవాబివ్వగలరా?
• మన ప్రార్థనలు ఏయే విధాలుగా ఉండవచ్చు?
• మనమెలా ప్రార్థించాలి?
• మన ప్రార్థనల్లో ఏయే అంశాలను చేర్చవచ్చు?
• ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ప్రార్థన ఏ పాత్ర పోషిస్తుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1. ఎవరితో మాట్లాడే ఆధిక్యత మనకుంది, అది ఎందుకంత ఆశ్చర్యకరమైనది?
2. ప్రార్థనలు దేవుడు అంగీకరించే విధంగా ఉండాలంటే ఏమి అవసరం?
3. (ఎ) ప్రాచీనకాల నమ్మకమైన సేవకుల ప్రార్థనలు చూపిస్తున్నట్లుగా, మన ప్రార్థనల్లో ఎలాంటి మాటలను చేర్చవచ్చు? (బి) మన ప్రార్థనలు ఏయే విధాలుగా ఉండవచ్చు?
4. యెహోవాకు మన అవసరతలు తెలిసినప్పటికీ, మనమెందుకు ఆయనకు విన్నపాలు చేస్తాం?
5. మనం యేసు పేరట ఎందుకు ప్రార్థించాలి?
6. మనం ఏ శరీర భంగిమతో ప్రార్థించాలి?
7. (ఎ) “ఆమేన్” అనే మాటకు అర్థమేమిటి? (బి) ప్రార్థనల్లో దానిని సముచితంగా ఎలా ఉపయోగించవచ్చు?
8. మన ప్రార్థనలు కొన్ని ఎలా యాకోబు లేదా అబ్రాహాము ప్రార్థనల్లా ఉండవచ్చు, అది మన గురించి ఏమి చెబుతుంది?
9. మనం దేని గురించి ప్రధానంగా ప్రార్థించాలి?
10. వ్యక్తిగత విషయాల గురించి ప్రార్థించడం సరైనదే అని మనకెలా తెలుసు?
11. శోధనల్లో పడిపోకుండా ఉండేందుకు ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?
12. ఆందోళన కలిగించే ఏ విషయాలు ప్రార్థించేలా మనల్ని పురికొల్పవచ్చు, యెహోవా నుండి మనమేమి ఆశించవచ్చు?
13. (ఎ) ఎలాంటి వ్యక్తిగత విషయాలు సరైన ప్రార్థనాంశాలుగా ఉంటాయి? (బి) అలాంటి ప్రార్థనకు సంబంధించిన ఒక ఉదాహరణ వివరించండి.
14, 15. (ఎ) ఒక వ్యక్తి పాపం చేసినప్పటికీ ఆయన ఎందుకు ప్రార్థించడం మానేయకూడదు? (బి) వ్యక్తిగత ప్రార్థనలకు తోడుగా, ఒక వ్యక్తి తన పాపం నుండి కోలుకునేందుకు ఇంకా ఏది సహాయం చేస్తుంది?
16, 17. (ఎ) యెహోవా ప్రార్థనలకెలా జవాబిస్తాడు? (బి) ప్రార్థనకు, ప్రకటనాపనికి సన్నిహిత సంబంధముందని ఏ అనుభవాలు ఉదాహరిస్తున్నాయి?
18. (ఎ) మన ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు మనమెలా స్పందించాలి? (బి) అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలో మనం ప్రార్థిస్తే, మనమే విషయంలో నమ్మకంతో ఉండవచ్చు?
[29వ పేజీలోని చిత్రాలు]
హృదయపూర్వక ప్రార్థన శోధనలకు లొంగిపోకుండా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది
[31వ పేజీలోని చిత్రాలు]
ప్రార్థన ద్వారా మనం దేవునికి మన కృతజ్ఞతను, చింతలను, విన్నపాల్ని తెలియజేస్తాం