కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది!”

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది!”

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది!”

కీర్తన 119లో, దేవుని ప్రేరేపిత సందేశంపట్ల, లేక వాక్యంపట్ల దాని రచయితకున్న భావాలు పాటగా కూర్చబడ్డాయి. కీర్తనకర్త ఇలా పాడాడు: “నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను.” “నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను.” “నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశ కలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.” “నీ శాసనములు నాకు సంతోషకరములు.” “నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు.” “నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.” “నీ కట్టడలను నేను ధ్యానించుదును.” “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”​—⁠కీర్తన 119:​11, 16, 20, 24, 40, 47, 48, 97.

దేవుడు వెల్లడిచేసిన వాక్యంపట్ల కీర్తనకర్తకు ఎంత హృదయపూర్వక కృతజ్ఞత ఉందో కదా! దేవుని వాక్యమైన బైబిల్లోని సందేశంపట్ల మీకూ అలాంటి కృతజ్ఞతే ఉందా? దానిపట్ల అలాంటి మక్కువను పెంపొందించుకోవడానికి మీరు ఇష్టపడతారా? అలాగైతే, మొదటిగా మీరు క్రమంగా, వీలైతే ప్రతీరోజూ బైబిలు చదవడం అలవాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:⁠4) రెండవదిగా, మీరు చదివేదాని గురించి ధ్యానించాలి. దేవుని గురించి, ఆయన గుణాల గురించి, ఆయన చిత్తం, సంకల్పం గురించి ధ్యానిస్తే, మీకు బైబిలుపట్ల కృతజ్ఞత పెరుగుతుంది. (కీర్తన 143:⁠5) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, దానిలోని చక్కని సలహాలను అనుదిన జీవితంలో అన్వయించుకోండి.​—⁠లూకా 11:​28; యోహాను 13:​17.

బైబిల్లోని విషయాలపట్ల మక్కువను పెంపొందించుకోవడం మీకెలా ప్రయోజనం చేకూరుస్తుంది? ‘దేవుని శాసనములను గైకొనువారు ధన్యులు’ అని కీర్తన 119:⁠2 పేర్కొంటోంది. బైబిల్లోని శాసనాలు లేక జ్ఞాపికలు మీ జీవితంలోని సమస్యలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు సహాయం చేస్తాయి. (కీర్తన 1:​1-3) ‘దుష్ట మార్గములన్నిటిలోనుండి మీ పాదములు తొలగించుకునేందుకు’ మీకు సహాయం చేసే జ్ఞానాన్ని, విశేషజ్ఞానాన్ని, అవగాహనను మీరు సంపాదించుకుంటారు. (కీర్తన 119:​98-101) దేవుని గురించిన, భూమిపట్ల ఆయన సంకల్పం గురించిన సత్యాన్ని తెలుసుకోవడం అనేది మీ జీవితాన్ని మరింత అర్థవంతం చేయడమే కాక భవిష్యత్తుపట్ల మీ నిరీక్షణను ఉజ్జ్వలం కూడా చేస్తుంది.​—⁠యెషయా 45:​18; యోహాను 17:⁠3; ప్రకటన 21:​3, 4.

బైబిలు గురించి మరింత తెలుసుకొని దానిలో ఉన్న సందేశంపట్ల మక్కువను పెంపొందించుకొనేందుకు ఇతరులకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఎంతో ఆసక్తి కలిగివున్నారు. క్రింద ఇవ్వబడిన ప్రతిపాదనకు ప్రతిస్పందించమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.