కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము”

“నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము”

“నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము”

“నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. . . . నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు?”​—⁠సామెతలు 5:​18, 20.

బైబిలు లైంగిక సంబంధ విషయాలను దాచిపెట్టడం లేదు. సామెతలు 5:​18, 19లో మనమిలా చదువుతాం: “నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.”

2 ఇక్కడ “ఊట” అనేమాట లైంగిక సంతృప్తినిచ్చే ముఖ్యాధారాన్ని సూచిస్తోంది. అది దీవెననొందును అంటే దంపతుల మధ్యవుండే ప్రణయాత్మక ప్రేమ, వారికి లభించే పారవశ్యం దేవుని బహుమానమని అర్థం. అయితే ఈ సన్నిహితత్వాన్ని కేవలం వివాహ ఏర్పాటులోనే ఆస్వాదించాలి. అందుకే సామెతల రచయిత, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అలంకారికంగా ఇలా ప్రశ్నిస్తున్నాడు: “నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?”​—⁠సామెతలు 5:​20.

3 స్త్రీపురుషులు తమ పెళ్లిరోజున పరస్పరం ప్రేమించుకుంటామనే, నమ్మకంగా ఉంటామనే పవిత్రమైన ఒప్పందం చేసుకుంటారు. అయినప్పటికీ, చాలా వివాహాలు వ్యభిచారంవల్ల ఛిన్నాభిన్నమౌతున్నాయి. నిజానికి రెండు డజన్లకన్నా ఎక్కువ అధ్యయనాల్ని విశ్లేషించిన తర్వాత, ఒక పరిశోధకురాలు “భార్యల్లో 25 శాతంమందికి భర్తల్లో 44 శాతంమందికి వివాహేతర సంబంధాలు” ఉన్నట్లు చెప్పింది. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:​9, 10) కాబట్టి విషయం స్పష్టం. వ్యభిచారమనేది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం, సత్యారాధకులు వివాహ ద్రోహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ‘వివాహాన్ని ఘనమైనదిగా, పానుపును నిష్కల్మషమైనదిగా ఉంచుకునేందుకు’ మనకేది సహాయం చేస్తుంది?​—⁠హెబ్రీయులు 13:⁠4.

విశ్వాసఘాతక హృదయం విషయంలో జాగ్రత్తగా ఉండండి

4 నేటి దిగజారిన నైతిక వాతావరణంలో చాలామంది “వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవా[రిగా]” ఉన్నారు. (2 పేతురు 2:​14) వారు వివాహేతర ప్రణయాత్మక సంబంధాలను ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తారు. కొన్ని దేశాల్లో అధికసంఖ్యలో స్త్రీలు ఉద్యోగాలు చేయడం ఆరంభించారు, అందువల్ల స్త్రీపురుషులు కలిసి పనిచేయడం అనుచిత కార్యాలయ ప్రణయం వృద్ధిచెందే వాతావరణాన్ని సృష్టించింది. అంతేకాక, ఇంటర్నెట్‌ ఛాట్‌రూమ్స్‌ బిడియస్థులు సహితం ఆన్‌లైన్‌లో సన్నిహిత స్నేహాలు మొదలుపెట్టడాన్ని మరింత సులభం చేశాయి. చాలామంది వివాహితులు తమకేమి జరుగుతోందో గ్రహించకుండానే అలాంటి ఉరుల్లో చిక్కుకుంటున్నారు.

5 మనం మేరీ అని పిలిచే ఒక క్రైస్తవురాలు లైంగిక దుర్నీతిలో చిక్కుకునే ప్రమాదపుటంచుకు వెళ్లిన పరిస్థితిని పరిశీలించండి. యెహోవాసాక్షికాని ఆమె భర్త తన కుటుంబంపట్ల ఏ మాత్రం ప్రేమ కనబర్చడం లేదు. మేరీ కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్త తోటి ఉద్యోగుల్లో ఒకరిని కలిసిన సమయాన్ని గుర్తు తెచ్చుకుంటోంది. ఆ వ్యక్తి మర్యాదస్థుడే కాక, ఆ తర్వాత మేరీ మత నమ్మకాలపట్ల ఆసక్తిని కూడా కనబర్చాడు. “అతను చాలామంచివాడు, అతను నా భర్తకు ఎంతో భిన్నంగా ఉన్నాడు” అని ఆమె చెబుతోంది. త్వరలోనే మేరీ, ఆమె భర్త తోటి ఉద్యోగి పరస్పరం ప్రణయాత్మక భావాలు పెంచుకున్నారు. “నేను వ్యభిచారానికి పాల్పడలేదు, అతనికి బైబిలుపట్ల ఆసక్తివుంది. బహుశా నేనతనికి సహాయం చేయగలనేమో” అని ఆమె తర్కించుకుంది.

6 మేరీ, ఆ ప్రణయాత్మక భావాలు వ్యభిచారానికి దారితీయకముందే పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించింది. (గలతీయులు 5:​19-21; ఎఫెసీయులు 4:​19) ఆమె మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించడంతో, ఆమె పరిస్థితిని చక్కబెట్టడం ఆరంభించింది. మేరీ అనుభవం “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని ఉదాహరిస్తోంది. (యిర్మీయా 17:⁠9) బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:​23) దానిని మనమెలా కాపాడుకోవచ్చు?

‘బుద్ధిమంతుడు దాగుకొనును’

7 “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 10:​12) సామెతలు 22:3 ఇలా చెబుతోంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” ‘నాకేం కాదు’ అని అతివిశ్వాసంతో ఆలోచించే బదులు, సమస్యలకు దారితీసే పరిస్థితులు రావచ్చనుకోవడం జ్ఞానయుక్తం. ఉదాహరణకు, వివాహంలో కలవర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న భిన్నలింగ వ్యక్తి మీకు మాత్రమే చెప్పుకోగల ఆప్తునిగా(రాలిగా) ఉండే పరిస్థితికి దూరంగా ఉండండి. (సామెతలు 11:​14) తన జతతో, తన వివాహం విజయవంతమవాలని అభిలషించే పరిణతిగల సలింగ క్రైస్తవ వ్యక్తితో లేదా పెద్దలతో వివాహ సమస్యల్ని చర్చించడం మంచిదని ఆ వ్యక్తికి చెప్పండి. (తీతు 2:​3, 4) యెహోవాసాక్షుల సంఘాల్లోని పెద్దలు ఈ విషయంలో చక్కని మాదిరి ఉంచుతారు. ఒక పెద్ద క్రైస్తవ సహోదరితో ఒంటరిగా మాట్లాడవలసివచ్చినప్పుడు ఆయన అందరూవున్న స్థలంలో అంటే రాజ్యమందిరంలో ఆమెతో మాట్లాడతాడు.

8 ఉద్యోగస్థలంలో లేదా మరెక్కడైనా సన్నిహితత్వాన్ని పెంచగల పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణకు, భిన్నలింగ వ్యక్తితో ఎక్కువ గంటలు సన్నిహితంగా కలిసి పనిచేయడం శోధనకు దారితీయవచ్చు. వివాహిత పురుషునిగా లేదా స్త్రీగా మీరు మీ మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ప్రణయాత్మక ప్రవర్తనకు చోటివ్వరని స్పష్టం చేయాలి. దైవభక్తిగల వ్యక్తిగా మీరు, పరులతో సరసాలాడరు లేదా ఎబ్బెట్టైన వస్త్రధారణ, కనబడే తీరుతో అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకోరు. (1 తిమోతి 4:⁠8; 6:​11; 1 పేతురు 3:​3, 4) మీ పనిస్థలంలో మీ జత, పిల్లల ఫోటోలను ఉంచుకుంటే అవి మీకూ, ఇతరులకూ మీ కుటుంబ ప్రాముఖ్యతను గుర్తుచేసే దృశ్య ఉపకరణాలుగా పనిచేస్తాయి. వేరొకరి ప్రణయాత్మక భావాల్ని ప్రోత్సహించకుండా ఉండడమే కాక, అలాంటి భావాలను సహించకుండా ఉండేందుకూ గట్టిగా తీర్మానించుకోండి.​—⁠యోబు 31:⁠1.

“నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము”

9 హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడంలో ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండడం మాత్రమే సరిపోదు. భార్య లేదా భర్త కాని వ్యక్తిపట్ల ప్రణయాత్మకంగా ఆకర్షించబడడం భార్యాభర్తలు పరస్పర అవసరాలపట్ల శ్రద్ధ చూపించడం లేదని సూచించవచ్చు. బహుశా భార్యను ఏ మాత్రం పట్టించుకోకపోవడం లేదా భర్తను తరచూ విమర్శించడం జరుగుతూ ఉండవచ్చు. అకస్మాత్తుగా ఉద్యోగస్థలంలోని లేదా క్రైస్తవ సంఘంలోనే మరో వ్యక్తిలో తన జతలో కనిపించని లక్షణాలు ఉన్నట్లు అనిపించవచ్చు. ఎక్కువ సమయం గడవకుండానే భావానుబంధం ఏర్పడడమే కాక, ఆ క్రొత్త బంధం నివారించలేని ఆకర్షణగా మారవచ్చు. ఈ సున్నిత సంఘటనల పరంపర బైబిలు మాటల ఈ సత్యత్వాన్ని ధృవీకరిస్తున్నాయి: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.”​—⁠యాకోబు 1:​14.

10 భార్యాభర్తలు తమ కోరికలను తీర్చుకోవడం కోసం అంటే ప్రేమ కోసం, స్నేహం కోసం లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మద్దతు కోసం తన భర్త లేదా భార్య కాని వ్యక్తులవైపు చూసే బదులు, తమ జతతో ప్రేమపూర్వక సంబంధాన్ని దృఢపర్చుకునేందుకు కృషిచేయాలి. కాబట్టి కలిసి సమయం గడుపుతూ పరస్పరం సన్నిహితమవండి. మీరు ప్రేమలో పడేందుకు ఏది కారణమైందో గుర్తుచేసుకోండి. మీ జతగా మారిన వ్యక్తిపట్ల మీకు కలిగిన ఆప్యాయతను తిరిగి పొందేందుకు ప్రయత్నించండి. మీరు కలిసి ఆనందించిన మధురక్షణాల గురించి ఆలోచించండి. విషయం గురించి దేవునికి ప్రార్థించండి. కీర్తనకర్త దావీదు యెహోవాను ఇలా వేడుకున్నాడు: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” (కీర్తన 51:​10) ‘దేవుడు మీకు దయచేసిన మీ ఆయుష్కాలమంతటిలో మీరు ప్రేమించే మీ భార్యతో సుఖించేందుకు’ గట్టిగా నిర్ణయించుకోండి.​—⁠ప్రసంగి 9:⁠9.

11 వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో తెలివికి, జ్ఞానానికి, వివేచనకు ఉన్న విలువను అలక్ష్యం చేయకూడదు. సామెతలు 24:​3, 4 ఇలా చెబుతోంది: “జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.” సంతోషభరితమైన కుటుంబంలో నిండుగా కనబడే ఇతర ప్రశస్తమైన లక్షణాల్లో ప్రేమ, యథార్థత, దైవభయం, విశ్వాసం అనేవి కూడా ఉన్నాయి. ఈ లక్షణాలను అలవర్చుకునేందుకు దేవుని జ్ఞానం అవసరం. అందువల్ల దంపతులు ప్రధానంగా బైబిలు విద్యార్థులై ఉండాలి. జ్ఞానము, వివేచన ఎంత ప్రాముఖ్యం? దైనందిన సమస్యలతో విజయవంతంగా వ్యవహరించేందుకు జ్ఞానం అంటే లేఖన పరిజ్ఞానాన్ని అన్వయించుకునే సామర్థ్యం అవసరం. వివేచనగల వ్యక్తికి తన జత ఆలోచనలను, భావాలను అర్థం చేసుకోగల సామర్థ్యముంటుంది. (సామెతలు 20:⁠5) “నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము” అని సొలొమోను ద్వారా యెహోవా చెబుతున్నాడు.​—⁠సామెతలు 5:⁠1.

“శ్రమలు” వచ్చినప్పుడు

12 ఏ వివాహం పరిపూర్ణం కాదు. భార్యాభర్తలకు “శరీరసంబంధమైన శ్రమలు కలుగును” అని కూడా బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 7:​28) చింతలు, వ్యాధి, హింస, తదితర విషయాలు వివాహంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే సమస్యలు తలెత్తినప్పుడు, యథార్థ దంపతులుగా యెహోవాను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తూ సమిష్టిగా పరిష్కారం కోసం వెదకాలి.

13 దంపతుల పరస్పర ప్రవర్తనా విధానంవల్ల వివాహంలో ఒత్తిడివస్తే అప్పుడేమిటి? పరిష్కార అన్వేషణకు ప్రయత్నం అవసరం. ఉదాహరణకు, నిర్దయగా మాట్లాడే పద్ధతి క్రమేపీ వారి వివాహంలోకి జొరబడి, ఇప్పుడది రివాజుగా మారివుండవచ్చు. (సామెతలు 12:​18) ముందరి ఆర్టికల్‌లో చర్చించినట్లుగా, అది వినాశకర ప్రభావాలు చూపించవచ్చు. ఒక బైబిలు సామెత ఇలా చెబుతోంది: “ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.” (సామెతలు 21:​19) అలాంటి వివాహంలో మీరు భార్యగా ఉంటే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నా స్వభావం నా భర్త నాతో సమయం గడపడాన్ని కష్టభరితం చేస్తోందా?’ బైబిలు భర్తలకిలా చెబుతోంది: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.” (కొలొస్సయులు 3:​19) మీరు భర్తగా ఉంటే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నా ప్రవర్తన నిర్దయగా ఉంటూ, నా భార్య మరెక్కడో ఓదార్పును వెతుక్కునేలా ఆమెను శోధిస్తోందా?’ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే లైంగిక దుర్నీతి నిందారహితమైనది కాదు. అలాంటి విషాదం చోటుచేసుకునే ప్రమాదమున్న దృష్ట్యా సమస్యల్ని నిర్మొహమాటంగా చర్చించుకోవడం మంచిది.

14 వివాహం వెలుపల ప్రణయంలో సాంత్వనను వెదకడం వివాహ సమస్యలకు పరిష్కారం కాదు. అలాంటి సంబంధం ఎక్కడికి నడిపిస్తుంది? మెరుగైన క్రొత్త వివాహానికా? కొందరు అలాగే అనుకోవచ్చు. ‘జతగా ఉండే వ్యక్తిలో నేను కోరుకున్న లక్షణాలు ఈ వ్యక్తిలో ఉన్నాయి’ అని వారు వాదించవచ్చు. అయితే అలాంటి తర్కం మోసకరం, ఎందుకంటే తన జతను విడిచిపెట్టే లేదా మీ జతను విడిచిపెట్టేందుకు మిమ్మల్ని ప్రోత్సహించే ఏ వ్యక్తికైనా వివాహ పవిత్రతపట్ల ఏ మాత్రం గౌరవం లేదు. కాబట్టి ఆ సంబంధం మెరుగైన వివాహాన్ని తీసుకొస్తుందని ఆశించడం సహేతుకం కాదు.

15 ముందు ప్రస్తావించబడిన మేరీ, తాను లేదా వేరొకరు దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేలా చేయగల అవకాశంతోపాటు తన చర్యల పర్యవసానాల గురించి తీవ్రంగా ఆలోచించింది. (గలతీయులు 6:⁠7) “నా భర్తతో పనిచేసే ఉద్యోగిపట్ల నా భావాలను నేను పరిశీలించుకోవడం ఆరంభించినప్పుడు, ఆ వ్యక్తి ఎప్పటికైనా సత్యం తెలుసుకోగల అవకాశానికి నేను అడ్డుపడుతున్నానని గ్రహించాను. తప్పుచేయడం, ఇమిడివున్న ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపిస్తూ, ఇతరులు అభ్యంతరపడేలా చేస్తుంది.”​—⁠2 కొరింథీయులు 6:⁠3.

అత్యంత బలమైన ప్రేరణ

16 బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “జార స్త్రీ పెదవులనుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు; అది రెండంచులుగల కత్తియంత పదునుగలది.” (సామెతలు 5:​3, 4) నైతిక అశుభ్రతవల్ల కలిగే ఫలితాలు బాధాకరంగా, ప్రాణాపాయకరంగా ఉండగలవు. వాటిలో కలతచెందిన మనస్సాక్షి, సుఖవ్యాధులు, నమ్మకద్రోహానికి పాల్పడిన జత కారణంగా కలిగే మానసికోద్వేగ వినాశనం ఉంటాయి. ఇవి వివాహ ద్రోహానికి దారితీయగల మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు ఖచ్చితమైన కారణాలు.

17 వివాహ నమ్మకద్రోహం తప్పు అనేందుకు ప్రాథమిక కారణమేమిటంటే, వివాహ మూలకర్త, లైంగిక సామర్థ్య దాతయైన యెహోవా దానిని ఖండిస్తున్నాడు. ప్రవక్తయైన మలాకీ ద్వారా ఆయనిలా చెబుతున్నాడు: ‘తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు వచ్చి వ్యభిచారులమీద దృఢముగా సాక్ష్యము పలుకుదును.’ (మలాకీ 3:⁠5) యెహోవా ఏమి చూస్తాడనేదాని గురించి సామెతలు 5:⁠21 ఇలా చెబుతోంది: “నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.” అవును, “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:​13) కాబట్టి, వివాహ ద్రోహమనేది ఎంత రహస్యంగావున్నా, దాని శారీరక లేదా సామాజిక పర్యవసానాలు ఎంత అల్పంగా కనిపించినా, లైంగిక అపవిత్రత యెహోవాతో మన సంబంధాన్ని పాడుచేస్తుందన్న గ్రహింపే వివాహ యథార్థతను కాపాడుకునేందుకు అత్యంత బలమైన ప్రేరణగా ఉండగలదు.

18 దేవునితో సమాధానంగా ఉండాలనే కోరిక బలమైన ప్రేరణగా ఉంటుందని, పితరుడైన యాకోబు కుమారుడైన యోసేపు మాదిరి చూపిస్తోంది. ఫరో రాజసభ అధికారిగావున్న పోతీఫరు కటాక్షం పొందిన యోసేపు పోతీఫరు ఇంటిమీద పైవిచారణకర్తగా నియమించబడ్డాడు. అంతేకాక, “యోసేపు రూపవంతుడును సుందరుడనై” ఉండడంతో పోతీఫరు భార్య కన్ను ఆయనమీద పడింది. ప్రతీరోజు ఆమె యోసేపును వలలో వేసుకునేందుకు ప్రయత్నించింది, కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె ప్రయత్నాలన్నింటినీ త్రిప్పికొట్టేందుకు యోసేపుకు ఏది సహాయం చేసింది? బైబిలు ఇలా చెబుతోంది: “అతడు ఒప్పక​—⁠నా యజమానుడు . . . నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.”​—⁠ఆదికాండము 39:​1-12.

19 యోసేపు మరొకరి భార్యతో సంబంధం పెట్టకునేందుకు నిరాకరిస్తూ తన నైతిక పవిత్రతను కాపాడుకున్నాడు. “నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము” అని సామెతలు 5:⁠15 భర్తలకు చెబుతోంది. అనుకోకుండా కూడా వివాహం వెలుపల ప్రణయాత్మక సంబంధాలవైపు మొగ్గుచూపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వివాహంలో ప్రేమబంధాన్ని బలపర్చుకునేందుకు బలంగా ప్రయత్నిస్తూ, మీకెలాంటి వైవాహిక చిక్కులెదురైనా వాటిని పరిష్కరించుకునేందుకు గట్టిగా కృషిచేయండి. తప్పక “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.”​—⁠సామెతలు 5:​18.

మీరేమి నేర్చుకున్నారు?

• క్రైస్తవ వ్యక్తి ఎలా అనుకోకుండానే ప్రణయాత్మక బంధంలో చిక్కుకోవచ్చు?

• వివాహేతర ప్రణయాత్మక సంబంధాలవైపు మొగ్గుచూపకుండా ఉండేలా ఎలాంటి ముందు జాగ్రత్తలు ఒక వ్యక్తికి సహాయం చేయగలవు?

• సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, దంపతులు ఏమిచేయాలి?

• వివాహ యథార్థతను కాపాడుకునేందుకు అత్యంత బలమైన ప్రేరణ ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. భార్యాభర్తల మధ్యగల ప్రణయాత్మక ప్రేమ దీవెననొందుతుందని ఎందుకు చెప్పవచ్చు?

3. (ఎ) విచారకరంగా అనేక వివాహాల్లో ఏమి జరుగుతోంది? (బి) వ్యభిచారాన్ని దేవుడెలా దృష్టిస్తున్నాడు?

4. వివాహిత క్రైస్తవుడు అనుకోకుండానే వివాహేతర ప్రణయాత్మక సంబంధంలో పడిపోగల కొన్ని మార్గాలు ఏమిటి?

5, 6. ఒక క్రైస్తవ స్త్రీ ప్రమాదకరమైన పరిస్థితిలో ఎలా చిక్కుకుంది, దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు?

7. వివాహ సమస్యలున్న వ్యక్తికి సహాయం చేసేటప్పుడు, ఏ లేఖన సలహాను అనుసరించడం సురక్షితంగా ఉంటుంది?

8. ఉద్యోగస్థలంలో ఎలాంటి జాగ్రత్త ఆవశ్యకం?

9. ఏ సంఘటనల పరంపర క్రొత్త ప్రణయాత్మక బంధాన్ని ఆకర్షణీయంగా చేయవచ్చు?

10. భార్యాభర్తలు తమ సంబంధాన్ని ఎలా దృఢపర్చుకోవచ్చు?

11. వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో తెలివి, జ్ఞానము, వివేచన ఏ పాత్ర పోషిస్తాయి?

12. దంపతులకు సమస్యలు ఎదురవడం ఎందుకు ఆశ్చర్యం కాదు?

13. భార్యాభర్తలు ఏ రంగాల్లో తమనుతాము విశ్లేషించుకోవాలి?

14, 15. వివాహ సమస్యలకు, వివాహం వెలుపల సమాధానం కోసం వెదకడం ఎందుకు పరిష్కారం కాదు?

16. నైతిక అశుభ్రతవల్ల కలిగే కొన్ని ఫలితాలేమిటి?

17. వివాహ యథార్థతను కాపాడుకునేందుకు అత్యంత బలమైన ప్రేరణ ఏమిటి?

18, 19. పోతీఫరు భార్యకు సంబంధించిన యోసేపు అనుభవం నుండి మనమేమి నేర్చుకుంటాం?

[26వ పేజీలోని చిత్రం]

ఉద్యోగస్థలం అనుచిత కార్యాలయ ప్రణయం వృద్ధిచెందే వాతావరణాన్ని సృష్టించడం శోచనీయం

[28వ పేజీలోని చిత్రం]

‘తెలివిచేత గదులు విలువైన సంపదలతో నింపబడతాయి’