కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ నాలుకను అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రేమను, గౌరవాన్ని చూపించండి

మీ నాలుకను అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రేమను, గౌరవాన్ని చూపించండి

మీ నాలుకను అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రేమను, గౌరవాన్ని చూపించండి

“మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.”​—⁠ఎఫెసీయులు 5:​33.

“జాగ్రత్తగా పట్టుకోండి” అని వ్రాసివున్న బహుమతి ప్యాకెట్‌ను మీరు అందుకున్నారనుకోండి. మీరు ఆ ప్యాకెట్‌ను ఎలా పట్టుకుంటారు? ఆ ప్యాకెట్టుకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు మీరు నిశ్చయంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. మరి వివాహమనే బహుమానం విషయమేమిటి?

2 ఇశ్రాయేలీయురాలైన నయోమి అనే విధవరాలు ఓర్పా, రూతు అనే యౌవన స్త్రీలతో ఇలా అంది: “మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక.” (రూతు 1:​3-9) గుణవతియైన భార్య గురించి బైబిలు ఇలా చెబుతోంది: “గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.” (సామెతలు 19:​14) మీరు వివాహితులైతే, మీ జతను దేవుడిచ్చిన బహుమానంగా దృష్టించాలి. దేవుడు మీకిచ్చిన బహుమానాన్ని మీరెలా చూసుకుంటున్నారు?

3 మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము [‘ప్రగాఢ గౌరవము,’ NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:​33) భార్యాభర్తలు తమ సంభాషణ విషయంలో ఈ ఉపదేశాన్ని ఎలా లక్ష్యపెట్టవచ్చో పరిశీలించండి.

‘అదుపులేని దుష్టత్వం’ విషయంలో జాగ్రత్త

4 నాలుక “మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన [‘అదుపులేని,’ NW] దుష్టత్వమే” అని బైబిలు రచయితయైన యాకోబు చెబుతున్నాడు. (యాకోబు 3:⁠8) అదుపులేని నాలుక వినాశకరమనే ప్రాముఖ్యమైన సత్యం యాకోబుకు తెలుసు. అలాగే అనాలోచిత మాటల్ని ‘కత్తిపోట్లతో’ పోల్చిన బైబిలు సామెత కూడా ఆయనకు తెలుసు. అయితే అలాంటి మాటలకు భిన్నంగా అదే సామెత ఇలా చెబుతోంది: “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:​18) అవును, మాటలు బలమైన ప్రభావం చూపించగలవు. అవి గాయపర్చవచ్చు లేదా నయం చేయవచ్చు. మీ మాటలు మీ జతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈ ప్రశ్న మీ జతను అడిగితే అతను లేదా ఆమె ఏమని జవాబిస్తారు?

5 గాయపర్చే మాటలు మీ వివాహబంధంలో భాగమైతే, మీరు పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చు. అయితే దానికి ప్రయత్నం అవసరం. ఎందుకు? ఎందుకంటే, మనం అపరిపూర్ణ శరీరంతో పోరాడాలి. మన ఆలోచనా విధానంపై, పరస్పరం మాట్లాడుకునే విధానంపై వారసత్వ పాపం హానికర ప్రభావం చూపిస్తుంది. “ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును” అని యాకోబు వ్రాశాడు.​—⁠యాకోబు 3:⁠2.

6 నాలుకను చెడుగా ఉపయోగించడంలో, మానవ అపరిపూర్ణతతోపాటు కుటుంబ పరిస్థితులూ కీలకపాత్ర పోషిస్తాయి. తమ తల్లిదండ్రులు ‘అతిద్వేషాన్ని, అజితేంద్రియతను, క్రూరత్వాన్ని’ కనబరిచిన గృహాల్లో కొందరు పెరిగారు. (2 తిమోతి 3:​1-3) అలాంటి పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు తరచూ తాము పెద్దవారైనప్పుడు అలాంటి లక్షణాల్నే కనబరుస్తారు. అలాగని, అపరిపూర్ణత లేదా పెంపకపు లోపం హానికరంగా మాట్లాడేందుకు సాకుగా ఉండనేరవు. అయితే, గాయపర్చే విధంగా మాట్లాడకుండా నాలుకను అదుపులో ఉంచుకోవడం కొందరికి ప్రత్యేకంగా ఎందుకు కష్టంగా ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఈ వాస్తవాలు తెలిసివుండడం మనకు సహాయం చేస్తుంది.

‘దూషణ మాటలను మానుకోండి’

7 కారణమేదైనప్పటికీ, వివాహంలో హానికరంగా మాట్లాడడం జతపట్ల ప్రేమాగౌరవాలు లేకపోవడాన్ని సూచించగలదు. మంచి కారణంతోనే పేతురు “సమస్తమైన . . . దూషణ మాటలను మాను[కొండని]” క్రైస్తవులను హెచ్చరించాడు. (1 పేతురు 2:⁠1) “దూషణ మాటలు” అని అనువదించబడిన గ్రీకు పదానికి “అవమానకరమైన భాష” అనే అర్థముంది. అది ‘ప్రజల్ని మాటల్తో పొడవడం’ అనే భావాన్నిస్తుంది. అదుపులేని నాలుక ప్రభావాన్ని అది ఎంత చక్కగా వర్ణిస్తుందో కదా!

8 అవమానకరంగా మాట్లాడడం అంత ప్రమాదకరంగా కనిపించకపోవచ్చు, అయితే భర్త లేదా భార్య అలా మాట్లాడినప్పుడు ఏమి జరుగుతుందో ఆలోచించండి. జతను మూఢవ్యక్తని, సోమరిపోతని లేదా స్వార్థపూరిత వ్యక్తని మాట్లాడడం అతను లేదా ఆమె ప్రవర్తననంతా ఒక్కమాటలో చెప్పవచ్చనే భావమిస్తుంది​—⁠అది నిజంగా అవమానకరం. అది నిశ్చయంగా క్రూరత్వం. అలాగే జత చేసే తప్పుల్ని అతిశయోక్తిగా ఎత్తిచూపే మాటల విషయమేమిటి? “నువ్వు ఎప్పుడూ ఆలస్యంగా వస్తావు” లేదా “నేను చెప్పేది నువ్వు ఎప్పుడూ వినవు” వంటి మాటలు అతిశయోక్తిగా చెప్పేవిగా ఉండవా? అవి ఆత్మరక్షణార్థ స్పందనను రేకెత్తిస్తాయి. అది చివరకు తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తుంది.​—⁠యాకోబు 3:⁠5.

9 అవమానకరమైన మాటలతో కూడుకున్న సంభాషణ వివాహబంధంపై ఒత్తిడిని పెంచడమే కాక, తీవ్ర పరిణామాలకూ దారితీయగలదు. సామెతలు 25:⁠24 ఇలా చెబుతోంది: “గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.” తగవులమారి భర్త గురించి కూడా అలాగే చెప్పవచ్చు. జతలోని ఒకరు మాట్లాడే కత్తిపోటువంటి మాటలు చివరకు వారి సంబంధాన్ని పాడుచేసి భర్త లేదా భార్య తాను ప్రేమకు నోచుకోవడం లేదని, ప్రేమకు పనికిరానివారమని భావించేలా చేయవచ్చు. కాబట్టి, నాలుకను అదుపులో ఉంచుకోవడం ప్రాముఖ్యం. నాలుకను ఎలా అదుపులో ఉంచుకోవచ్చు?

‘నోటికి కళ్లెము పెట్టుకోండి’

10 “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు” అని యాకోబు 3:8 చెబుతోంది. అయితే, గుర్రపు రౌతు దాని పరుగును నియంత్రించేందుకు దాని నోటికి కళ్లెము పెట్టినట్లే, మనం కూడా మన నాలుకకు కళ్లెము పెట్టుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. “ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.” (యాకోబు 1:​26; 3:​2, 3) ఈ మాటలు మీ నాలుకను ఎలా ఉపయోగిస్తారనేది ముఖ్యమైన విషయమని చూపిస్తున్నాయి. అది కేవలం మీ జతతో మీకున్న సంబంధం మీదే కాక, యెహోవా దేవునితో మీకున్న సంబంధం మీద ప్రభావం చూపిస్తుంది.​—⁠1 పేతురు 3:⁠7.

11 మీ జతతో ఎలా మాట్లాడుతున్నారనేది గమనించడం జ్ఞానయుక్తం. ఒకవేళ ఒత్తిడిగల పరిస్థితి తలెత్తితే, ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నించండి. ఆదికాండము 27:46-28:4లో వ్రాయబడినట్లుగా, ఇస్సాకు ఆయన భార్య రిబ్కా జీవితంలో తలెత్తిన పరిస్థితిని పరిశీలించండి. “రిబ్కా ఇస్సాకుతో​—⁠హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.” అందుకు ఇస్సాకు కఠినంగా స్పందించినట్లు ఏ సూచనా లేదు. బదులుగా, ఆయన రిబ్కాకు బాధ కలిగించని విధంగా వ్యవహరిస్తూ దైవభయంగల భార్యను కనుగొనేందుకు తమ కుమారుడైన యాకోబును దూరంగా పంపించాడు. భార్యాభర్తల మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చిందనుకుందాం. “నువ్వు” అనడానికి బదులు “నేను” అని మాట్లాడడం చిన్న అభిప్రాయ భేదం తీవ్ర వాగ్వివాదంగా మారడాన్ని నివారిస్తుంది. ఉదాహరణకు, “నువ్వెప్పుడూ నాతో సమయం గడపవ్‌!” అనే బదులు, “మనిద్దరం ఇంకా ఎక్కువ సమయం కలిసి గడపాలని నేనిష్టపడుతున్నాను” అని ఎందుకు అనకూడదు? మనిషిపై కాదు సమస్యపై దృష్టి కేంద్రీకరించండి. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది తేల్చుకునేందుకు ప్రయత్నించకండి. “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరిం[చండి]” అని రోమీయులు 14:⁠19 చెబుతోంది.

‘ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని’ విసర్జించండి

12 కేవలం నోటిని అదుపులో ఉంచుకోవడం మాత్రమే సరిపోదు. నిజానికి, మన మాటలు నోటిలో నుండి కాదుగానీ హృదయంలో నుండే వస్తాయి. యేసు ఇలాచెప్పాడు: “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:​45) కాబట్టి, మీ నాలుకను అదుపులో ఉంచుకునేందుకు, మీరు కూడా దావీదులాగే ఇలా ప్రార్థించాలి: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.”​—⁠కీర్తన 51:​10.

13 ఎఫెసీయులు హానికరమైన మాటలనే కాక, వాటి వెనుకున్న ఉద్దేశాన్ని కూడా విసర్జించాలని పౌలు వారిని పురికొల్పాడు. ఆయనిలా వ్రాశాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:​31) “అల్లరి, దూషణ”ను పేర్కొనడానికి ముందు పౌలు “ద్వేషము, కోపము, క్రోధము” అనేవాటిని ప్రస్తావించాడని గమనించండి. ఒక వ్యక్తిలో రగిలే కోపమే హానికరమైన మాటలతో విరుచుకుపడే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను ద్వేషాన్ని, క్రోధాన్ని మనసులో నిలుపుకుంటున్నానా? నేను “ముంగోపి”గా ఉన్నానా?’ (సామెతలు 29:​22) మీ విషయంలో ఇదే నిజమైతే, ఈ లక్షణాలను అధిగమించి, మీ కోపం ఎక్కువకాకుండా ఆశానిగ్రహం పాటించేలా దేవుని సహాయం కోసం ప్రార్థించండి. కీర్తన 4:4 ఇలా చెబుతోంది: “భయమునొంది పాపముచేయకుడి, మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి.” కోపం పెరిగితే, మీలో సహనం లోపిస్తుందని మీరు భయపడితే సామెతలు 17:⁠14లో ఇవ్వబడిన ఈ హెచ్చరికను అనుసరించండి: “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.” ప్రమాదం తప్పిపోయేవరకు ఆ పరిస్థితి నుండి తాత్కాలికంగా తప్పుకోండి.

14 కోపం, క్రోధము అనేవి ప్రత్యేకంగా “ద్వేషము” అని పౌలు పిలిచిన దాని మూలంగా కలిగితే వాటితో వ్యవహరించడం అంత సులభం కాదు. పౌలు ఉపయోగించిన గ్రీకు పదం “సమాధానపడేందుకు ఇష్టపడని ఆగ్రహ స్వభావమని,” ‘తప్పులు గుర్తుపెట్టుకునే పగ’ అని నిర్వచించబడింది. భార్యాభర్తల మధ్య వైరం కొన్నిసార్లు దట్టమైన పొగమంచులా పేరుకుపోవడమే కాక, ఆ పరిస్థితి చాలాకాలం అలాగే నిలిచిపోవచ్చు. బాధ కలిగించే ఆ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దకపోతే తృణీకార స్థితి వృద్ధికావచ్చు. పాత తప్పుల విషయంలో పగ పెంచుకోవడం వ్యర్థం. పాడైన దానిని బాగుచేయలేం. క్షమించిన తప్పును మర్చిపోవాలి. ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.”​—⁠1 కొరింథీయులు 13:​4, 5.

15 మీరు పెరిగిన కుటుంబంలో కఠినంగా మాట్లాడడమే సాధారణంగా ఉండడమే కాక, మీకూ అలా మాట్లాడడమే వాడుకగావుంటే అప్పుడేమిటి? ఈ విషయంలో మీరు మార్పులు చేసుకోవచ్చు. జీవితంలోని అనేక రంగాల్లో మీరిప్పటికే అనేక హద్దులు పెట్టుకోవడమే కాక, ఆ హద్దుల్ని మీరడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నించరు. మరి మీ సంభాషణ విషయానికొస్తే, దానికి ఏ హద్దును మీరు ఎంచుకుంటారు? మీ మాటలు దుర్వినియోగస్థాయికి చేరకముందే వాటిని ఆపేస్తారా? “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి” అని ఎఫెసీయులు 4:⁠29లో వర్ణించబడిన హద్దు విధించుకొనేందుకు మీరిష్టపడతారా? అలా చేసేందుకు “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించు[కోవడం]” అవసరం.​—⁠కొలొస్సయులు 3:​9-10.

‘ఆంతరంగిక సంభాషణ’​—⁠ఖచ్చితంగా అవసరం

16 భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడంవల్ల సాధించగలిగేది ఏమీవుండదు, అంతేగాక అది హానికరం కూడా కాగలదు. ఒకరినొకరు శిక్షించుకోవాలనే ఉద్దేశంతో, పరస్పర కక్షతో మాట్లాడుకోకుండా ఉండడం కాదుగానీ, బహుశా తమలోని నిరాశానిస్పృహల కారణంగానే అలా మాట్లాడుకోకపోవచ్చు. అయితే, ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు నిరాకరించడం ఒత్తిడిని పెంచడమే కాక, సమస్య పరిష్కారానికి ఏమాత్రం దోహదపడదు. ఒక భార్య చెబుతున్నట్లుగా, “మేము తిరిగి మాట్లాడుకోవడం ఆరంభించినా, సమస్య గురించి మాత్రం చర్చించుకోం.”

17 వివాహ ఒత్తిడి కొనసాగినప్పుడు, పరిష్కారానికి దగ్గర దారి ఏదీ లేదు. సామెతలు 15:⁠22 ఇలా చెబుతోంది: “ఆలోచన చెప్పువారు [‘ఆంతరంగిక సంభాషణ,’ NW] లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.” మీ జతతో కూర్చొని విషయాన్ని చర్చించాలి. అన్నివిధాల, మీ జత చెప్పేది విశాల మనసుతో, హృదయంతో వినాలి. అలా చేయడం అసాధ్యమనిపిస్తే, క్రైస్తవ సంఘంలోని పెద్దలను ఎందుకు సంప్రదించకూడదు? వారికి లేఖన జ్ఞానంతోపాటు బైబిలు సూత్రాలను అన్వయించడంలో అనుభవముంది. అలాంటి పురుషులు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను” ఉంటారు.​—⁠యెషయా 32:⁠2.

మీరు పోరాటాన్ని జయించవచ్చు

18 మన నాలుకకు కళ్లెం పెట్టుకోవడం ఒక పోరాటమే. మన క్రియల్ని అదుపులో పెట్టుకోవడం కూడా అలాంటిదే. అపొస్తలుడైన పౌలు తాను ఎదుర్కొన్న సవాలును వర్ణిస్తూ ఇలా వ్రాశాడు: “నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.” మన “అవయవములలోనున్న పాపనియమము” కారణంగా మనం మన నాలుకను, శరీరంలోని ఇతర అవయవాలను దుర్వినియోగం చేసేందుకు మొగ్గుచూపిస్తాం. (రోమీయులు 7:​18-23) అయితే ఆ పోరాటాన్ని జయించాలి, దేవుని సహాయంతో దానిని జయించవచ్చు.

19 ప్రేమాగౌరవాలు సహజ లక్షణాలుగావున్న సంబంధంలో అనాలోచితమైన, కఠినమైన మాటలకు తావుండదు. ఈ విషయంలో యేసుక్రీస్తు ఉంచిన మాదిరి గురించి ఆలోచించండి. యేసు ఎన్నడూ తన శిష్యులతో అవమానకరంగా మాట్లాడలేదు. దేవుని కుమారుని భూ జీవితపు చివరి రాత్రి ఆయన అపొస్తలులు తమలో ఎవరు గొప్పవారని వాదులాడుకున్నప్పుడు కూడా ఆయన వారిని తిట్టలేదు. (లూకా 22:​24-27) ‘పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను’ అని బైబిలు ప్రబోధిస్తోంది.​—⁠ఎఫెసీయులు 5:​25.

20 మరి భార్య విషయమేమిటి? ఆమె “తన భర్తయందు భయము [‘ప్రగాఢ గౌరవము,’ NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:​33) తన భర్తను గౌరవించే భార్య ఆయనమీద అరుస్తుందా, చెడ్డమాటలు పలుకుతుందా? “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను” అని పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 11:⁠3) క్రీస్తు ఎలా తన శిరస్సుకు లోబడ్డాడో అదేవిధంగా భార్యలు తమ శిరస్సులకు లోబడాలి. (కొలొస్సయులు 3:​18) అపరిపూర్ణ మానవులు యేసును పరిపూర్ణంగా అనుకరించలేకపోయినా ఆయన “అడుగుజాడలయందు” నడుచుకునేందుకు కృషిచేయడం నాలుకను దుర్వినియోగపర్చేందుకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని జయించేందుకు భార్యాభర్తలకు సహాయం చేస్తుంది.​—⁠1 పేతురు 2:21.

మీరేమి నేర్చుకున్నారు?

• అదుపులేని నాలుక వివాహాన్ని ఎలా పాడుచేయవచ్చు?

• నాలుకకు కళ్లెం పెట్టుకోవడం ఎందుకు కష్టం?

• మన సంభాషణను అదుపులో ఉంచుకొనేందుకు మనకేది సహాయం చేస్తుంది?

• వైవాహిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు మీరేమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. వివాహితులందరూ తమకుతాము ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు?

3. భార్యాభర్తలు, పౌలు ఇచ్చిన ఏ ఉపదేశాన్ని లక్ష్యపెట్టాలి?

4. మంచికి గానీ చెడుకు గానీ నాలుక ఎలాంటి ప్రభావం చూపించగలదు?

5, 6. కొందరు తమ నాలుకను అదుపులో ఉంచుకోవడాన్ని ఏ పరిస్థితులు కష్టభరితం చేస్తాయి?

7. పేతురు “సమస్తమైన . . . దూషణ మాటలను మా[నుకొండని]” క్రైస్తవులను హెచ్చరించినప్పుడు ఆయన భావమేమిటి?

8, 9. అవమానకరమైన సంభాషణవల్ల ఎలాంటి ఫలితం కలగవచ్చు, దంపతులు ఎందుకు అలా సంభాషించకూడదు?

10. నాలుకను అదుపులో ఉంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

11. అభిప్రాయ భేదం తీవ్ర వాగ్వివాదంగా మారకుండా ఎలా నివారించవచ్చు?

12. నాలుకను అదుపులో ఉంచుకునేందుకు మనం దేనికోసం ప్రార్థించాలి, ఎందుకు?

13. ద్వేషము, కోపము, క్రోధము హానికరమైన దూషణకు ఎలా దారితీయగలవు?

14. పగ పెంచుకోవడం వివాహంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

15. కఠినమైన మాటలకు అలవాటుపడ్డవారు తమ మాటతీరును మార్చుకునేలా వారికేది సహాయం చేస్తుంది?

16. మాట్లాడుకోకుండా ఉండడం వివాహానికి ఎందుకు హాని చేస్తుంది?

17. వివాహ ఒత్తిడిని ఎదుర్కొంటున్న క్రైస్తవులు ఏమిచేయాలి?

18. రోమీయులు 7:18-23లో ఏ పోరాటం వర్ణించబడింది?

19, 20. తమ నాలుకకు కళ్లెం పెట్టుకొనేలా యేసు మాదిరి భార్యాభర్తలకు ఎలా సహాయం చేస్తుంది?

[24వ పేజీలోని చిత్రం]

పెద్దలు బైబిలు ఆధారిత సహాయం అందిస్తారు