కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మేము యేసు గురించి చెప్పకుండా ఉండలేము’

‘మేము యేసు గురించి చెప్పకుండా ఉండలేము’

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”

‘మేము యేసు గురించి చెప్పకుండా ఉండలేము’

అది సా.శ. 33వ సంవత్సరం, అది యెరూషలేములో ఉన్న ప్రఖ్యాత యూదుల జాతీయ న్యాయస్థానం. ఈ సందర్భంలో, యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఆ మహాసభ న్యాయవిచారణ చేయబోతోంది. ఎందుకు? ఎందుకంటే వారు యేసును గురించి ప్రకటిస్తున్నారు. అపొస్తలులైన పేతురు, యోహానులు న్యాయస్థానం ఎదుట నిలబడడం ఇది రెండవసారి. ఇతర అపొస్తలులకైతే ఇది మొదటి న్యాయవిచారణ.

అంతకుముందు ఆ న్యాయస్థానం జారీచేసిన ఆజ్ఞను ప్రస్తావిస్తూ, ప్రధానయాజకుడు ఆ 12 మంది అపొస్తలులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో, యేసును గురించి ప్రకటించకూడదని ఆజ్ఞాపించబడినప్పుడు అపొస్తలులైన పేతురు, యోహానులు ఇలా జవాబిచ్చారు: “దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము.” తగిన ధైర్యం కోసం ప్రార్థించిన తర్వాత, యేసు శిష్యులు సువార్తను ప్రకటించడంలో కొనసాగారు.​—⁠అపొస్తలుల కార్యములు 4:​18-31.

ముందు ఇచ్చిన హెచ్చరికలు ఏ మాత్రం ప్రభావం చూపించలేదని గ్రహించిన ప్రధానయాజకుడు, రెండవ న్యాయవిచారణలో గట్టిగా ఇలా అన్నాడు: “మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారు.”​—⁠అపొస్తలుల కార్యములు 5:​28.

అచంచలమైన పట్టుదల

ధైర్యంగా జవాబిస్తూ పేతురు, అపొస్తలులు ఇలా అన్నారు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” (అపొస్తలుల కార్యములు 5:​29) అవును, మనుష్యులు కోరేది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటే, మనుష్యులకు లోబడే బదులు మనం యెహోవాకే లోబడాలి. *

అపొస్తలులు తాము దేవునికే లోబడతాము అని స్థిరంగా చెప్పినప్పుడు మహాసభకు ఆ విషయం అర్థమై ఉండాల్సింది. దేవుని మాట వినాలా లేక మీ మాట వినాలా అని అపొస్తలులు యూదా సమాజంలోని నాయకుల్ని అడిగినప్పుడు వారందరూ ఏకగ్రీవంగా ‘దేవునికే లోబడండి’ అని చెప్పాల్సింది. దేవుడే ఈ విశ్వానికి సర్వాధికారి అనే విషయాన్ని వారు మాత్రం నమ్మడం లేదా?

తమ పరిచర్య గురించి అపొస్తలులందరి తరఫున మాట్లాడుతూ, తాము మనుష్యులకన్నా దేవునికే లోబడతామని పేతురు చెప్పాడు. కాబట్టి, అపొస్తలులు లోబడడం లేదని వారు చేసిన ఆరోపణలను పేతురు కొట్టిపారేశాడు. వారి దేశ చరిత్ర చూపిస్తున్నట్లుగా, కొన్ని సందర్భాల్లో మనుష్యులకన్నా దేవునికే లోబడి ఉండాలనేది స్పష్టమని ఆ మహాసభలోని సభ్యులకు తెలుసు. ఐగుప్తులోని ఇద్దరు మంత్రసానులు ఫరోకు కాదుకానీ దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగశిశువులను బ్రదుకనిచ్చారు. (నిర్గమకాండము 1:​15-17) రాజైన హిజ్కియా లొంగిపోవడానికి ఒత్తిడి చేయబడినప్పుడు చక్రవర్తియైన సన్హెరీబుకు కాదుగానీ యెహోవాకే విధేయత చూపించాడు. (2 రాజులు 19:​14-37) వారికి సుపరిచితమైన హెబ్రీ లేఖనాలు, యెహోవా తన ప్రజలు తనకే విధేయత చూపించాలని కోరుతున్నాడని ఆ మహాసభలోని సభ్యులకు నొక్కిచూపించాయి.​—⁠1 సమూయేలు 15:​22, 23.

విధేయత చూపించేవారు ఆశీర్వదించబడతారు

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అనే మాటలకు ఆ మహాసభలోని కనీసం ఒక సభ్యుడు కదిలించబడ్డాడని స్పష్టమౌతోంది. మహాసభలో ప్రముఖ న్యాయమూర్తిగా ప్రసిద్ధిచెందిన గమలీయేలు అపొస్తలులను బయటకు పంపించిన తర్వాత, తానిచ్చే సహేతుకమైన ఉపదేశాన్ని వినమని ఆ సభలోనివారికి నచ్చజెప్పాడు. గతంలోని అనుభవాలను పేర్కొనడం ద్వారా అపొస్తలుల పనిలో జోక్యం చేసుకోవడం అవివేకమని గమలీయేలు సూచించాడు. ఆయన ఈ మాటలతో ముగించాడు: “ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. . . . మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.”​—⁠అపొస్తలుల కార్యములు 5:​34-39.

గమలీయేలు జ్ఞానయుక్తంగా పలికిన ఆ మాటలు, ఆ మహాసభ అపొస్తలులను విడిచిపెట్టేలా చేశాయి. అపొస్తలులు కొరడాలతో కొట్టబడినప్పటికీ, వారికి ఎదురైన ఈ అనుభవాన్నిబట్టి వారు ఏమాత్రం బెదిరిపోలేదు. బదులుగా వారు, “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి” అని బైబిలు చెబుతోంది.​—⁠అపొస్తలుల కార్యములు 5:​42.

దేవుని అధికారానికి లోబడినందుకు వారెంతో ఆశీర్వదించబడ్డారు! నిజ క్రైస్తవులు నేడు అదే వైఖరిని కనబరుస్తారు. యెహోవాసాక్షులు నేటికీ యెహోవానే తమ సర్వోన్నతాధికారిగా పరిగణిస్తారు. దేవుని నిర్దేశాలకు విరుద్ధంగా ప్రవర్తించమని ఆజ్ఞాపించబడితే, వారు కూడా అపొస్తలుల్లాగే ఇలా ప్రతిస్పందిస్తారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”

[అధస్సూచి]

^ పేరా 7 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2006 (ఆంగ్లం)లో సెప్టెంబరు/అక్టోబరు చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

మీరెప్పుడైనా ఆలోచించారా?

అపొస్తలులను పంపేసిన తర్వాత మహాసభలో గమలీయేలు ఆంతరంగికంగా చేసిన వ్యాఖ్యల గురించిన సమాచారాన్ని సువార్త రచయిత అయిన లూకా ఎలా సేకరించాడు? గమలీయేలు మాటలను దేవుడే నేరుగా లూకాకు బయల్పర్చివుండవచ్చు. బహుశా, పౌలు (గమలీయేలుకు పూర్వ విద్యార్థి) గమలీయేలు చెప్పిన మాటలను లూకాకు తెలియజేసి ఉండవచ్చు. లేదా లూకా అపొస్తలులపట్ల సానుభూతిగల మహాసభలోని ఒక సభ్యుణ్ణి సంప్రదించి ఉండవచ్చు.