కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎల్లకాలం జీవించేందుకు మానవుని ప్రయత్నం

ఎల్లకాలం జీవించేందుకు మానవుని ప్రయత్నం

ఎల్లకాలం జీవించేందుకు మానవుని ప్రయత్నం

అనాదిగా మానవులు ఎల్లకాలం జీవించి ఉండాలని కలలుకన్నారు. అయినా ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఎవరూ మరణాన్ని జయించడానికి మార్గాన్ని కనుగొనలేకపోయారు. అయితే ఇటీవలి కాలంలో వైద్య పరిశోధన, మానవుల ఆయుష్షును గణనీయంగా పెంచడం నిజంగా సాధ్యమవ్వచ్చనే ఆశను తిరిగి చిగురింపజేసింది. వైజ్ఞానిక అధ్యయనానికి సంబంధించిన వివిధ రంగాల్లో ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయో పరిశీలించండి.

జీవకణాల పునర్విభజనను అధికం చేయాలనే ప్రయత్నంలో జీవశాస్త్రజ్ఞులు టెలోమెరేస్‌ అనే సేంద్రియ పదార్థంతో ప్రయోగాలు చేస్తున్నారు. చచ్చుబడి, క్షీణించిపోయే జీవకణాల స్థానాన్ని క్రొత్త జీవకణాలు ఆక్రమిస్తాయని శాస్త్రజ్ఞులకు తెలుసు. వాస్తవానికి, ఒక వ్యక్తి జీవితకాలంలో శరీరంలోని చాలా జీవకణాలు అనేకసార్లు పునర్నూతనం చేయబడతాయి. ఈ ప్రక్రియను అలాగే కొనసాగించగల్గితే, “మానవ శరీరం దీర్ఘకాలంపాటు, నిజానికి ఎల్లకాలం తనను తాను పునరుజ్జీవింపజేసుకోగలదు” అని పరిశోధకులు సిద్ధాంతీకరిస్తున్నారు.

వివాదాస్పద పరిశోధనా రంగమైన థెరప్యూటిక్‌ క్లోనింగ్‌, రోగులకు మార్పిడి చేయడానికి శరీరంలో ఇమిడిపోగల కాలేయం, మూత్రపిండం లేక గుండె వంటి క్రొత్త అవయవాలను సూత్రబద్ధంగా అందజేయగలదు. రోగుల సొంత మూల జీవకణాలనే ఉపయోగించి అలాంటి అవయవాలను తయారుచేయవచ్చు.

వైద్యులు క్యాన్సర్‌ కణాలను, హానికరమైన సూక్ష్మజీవులను కనిపెట్టి వాటిని నాశనం చేయడానికి జీవకణ పరిమాణంలో ఉండే రోబోట్లను రక్తప్రవాహంలోకి ప్రవేశపెట్టే కాలం వస్తుందని నానొటెక్నాలజీ పరిశోధకులు నమ్ముతున్నారు. జన్యు చికిత్సలతోపాటు ఈ వైజ్ఞానిక రంగం, మానవ శరీరం తననుతాను ఎల్లకాలం పోషించుకొనేలా చేయగల అవకాశముందని కొందరు విశ్వసిస్తున్నారు.

క్రయోనిక్స్‌ను సమర్థించేవారు చనిపోయినవారి శరీరాలను ఘనీభవింపజేస్తారు. ఎందుకంటే, వైద్యరంగంలో జరిగే అభివృద్ధి మూలంగా వైద్యులు రోగాలను బాగుచేయగలిగి, వృద్ధాప్య ప్రభావాలను త్రిప్పికొట్టి, మృతులకు తిరిగి జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేవరకు వాటిని భద్రపరచాలన్నదే దాని వెనకున్న ఉద్దేశం. అలా చేయడాన్ని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ గెర్యాట్రిక్‌ సైక్యాట్రి, “ప్రాచీన ఐగుప్తీయులు శవాలను భద్రపర్చేందుకు ఉపయోగించిన ప్రక్రియకు ప్రస్తుతదిన నకలు” అని పిలిచింది.

అమర్త్యత కోసం మానవుడు చేస్తున్న ఈ తీవ్ర ప్రయత్నాన్నిబట్టి చూస్తే, మరణించడమనే తలంపును అంగీకరించడం ఎంత కష్టమో అర్థమౌతుంది. మానవులు ఎల్లకాలం జీవించి ఉండడం నిజంగా సాధ్యమా? ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతోంది? తర్వాతి ఆర్టికల్‌ వీటికి సమాధానాలు ఇస్తుంది.