కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి యెహోవా నాకు సహాయం చేశాడు

జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి యెహోవా నాకు సహాయం చేశాడు

జీవిత కథ

జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి యెహోవా నాకు సహాయం చేశాడు

డేల్‌ ఎర్వెన్‌ చెప్పినది

“బాబోయ్‌ ఎనిమిదిమంది పిల్లలే! ఆ నలుగురు పిల్లలు నాలుగింతల కష్టాలు తెచ్చారు.” అప్పటికే నలుగురు ఆడపిల్లలున్న మా కుటుంబంలో ఒకే కాన్పులో జన్మించిన మరో నలుగురు పిల్లలు తోడవడం గురించి స్థానిక వార్తాపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పిల్లల మాట అటుంచి, యౌవనస్థునిగా ఉన్నప్పుడు నేను అసలు వివాహమే చేసుకోవాలనుకోలేదు. అయినా, ఇదిగో నేనిప్పుడు ఎనిమిదిమంది పిల్లల తండ్రిని!

నే ను 1934లో ఆస్ట్రేలియాలోని మెరీబా పట్టణంలో జన్మించాను. ముగ్గురు పిల్లల్లో నేనే ఆఖరివాణ్ణి. ఆ తర్వాత మా కుటుంబం బ్రిస్బేన్‌కు తరలివెళ్లింది, అక్కడ మెథడిస్ట్‌ చర్చిలో మా అమ్మ సండే స్కూలు పాఠాలు చెప్పేది.

యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం నుండి వచ్చే జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఆస్ట్రేలియాకు రావడానికి అనుమతి లభించకపోవచ్చు అని 1938 ఆరంభంలో స్థానిక వార్తాపత్రికలు నివేదించాయి. “ఆయన విషయంలో వారలా ఎందుకు చేస్తున్నారు?” అని మా ఇంటికి వచ్చిన సాక్షిని అమ్మ అడిగింది. అందుకు ఆ సాక్షి “ప్రజలు తన అనుచరులను హింసిస్తారని యేసు చెప్పలేదా” అని జవాబిచ్చింది. ఆ తర్వాత అమ్మ ఆమె ఇచ్చిన స్వస్థత (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని తీసుకుంది, ఆ చిన్న పుస్తకం అబద్ధమతానికి, నిజమైన మతానికి మధ్యవున్న చాలా తేడాలను వివరించింది. * ఆ చిన్న పుస్తకం చదివి ముగ్ధురాలైన అమ్మ మరుసటి ఆదివారం మమ్మల్ని యెహోవాసాక్షుల కూటాలకు తీసుకెళ్ళింది. మా నాన్న మొదట్లో గట్టిగా వ్యతిరేకించినా, ఆయన అప్పుడప్పుడూ ప్రశ్నలు వ్రాసి ఒక సహోదరునికిమ్మని అమ్మకిచ్చి పంపించేవాడు. ఆ సహోదరుడు లేఖనాధార జవాబులను వ్రాసి తిరిగి నాన్నకిమ్మని అమ్మచేత పంపించేవాడు.

యెహోవాసాక్షులపట్ల తన అసంతృప్తిని వ్యక్తపర్చే ఉద్దేశంతో ఒక ఆదివారం నాన్న మాతోపాటు కూటానికి వచ్చాడు. అయితే, ఆ సమయంలో సంఘాన్ని సందర్శిస్తున్న ప్రయాణ పైవిచారణకర్తతో మాట్లాడిన తర్వాత, నాన్న తన దృక్పథాన్ని మార్చుకోవడమే కాక, మా ప్రాంతంలోని ఆసక్తిపరులు హాజరయ్యేలా వారపు బైబిలు అధ్యయన కేంద్రంగా మా ఇంటిని ఉపయోగించడానికి కూడా అనుమతించాడు.

మా తల్లిదండ్రులు సెప్టెంబరు 1938లో బాప్తిస్మం తీసుకున్నారు. నేనూ నా తోబుట్టువులు, 1941 డిసెంబరులో న్యూ సౌత్‌వేల్స్‌లోని సిడ్నీలోవున్న హార్‌గ్రేవ్‌ పార్కులో జరిగిన జాతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాం. నాకప్పుడు ఏడేళ్ళు. అప్పటినుండీ, నేను మా తల్లిదండ్రులతో కలిసి క్షేత్ర పరిచర్యకు క్రమంగా వెళ్ళేవాణ్ణి. అప్పట్లో, సాక్షులు పోర్టబుల్‌ ఫోనోగ్రాఫ్‌లను ఇంటింటికి తీసుకువెళ్ళి గృహస్థులకు రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలను వినిపించేవారు.

నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఒక ప్రత్యేకమైన సాక్షి బెర్ట్‌ హార్టన్‌. ఆయనకు సౌండ్‌ కారుండేది అంటే ఆ కారులో శక్తివంతమైన ఆంప్లిఫైర్‌, దాని టాపుమీద పెద్ద స్పీకర్‌ బిగించబడి ఉండేది. ప్రత్యేకంగా నా వయసు పిల్లలకు బెర్ట్‌తో పనిచేయడం ఉత్తేజకరంగా ఉంటుంది. ఉదాహరణకు, కొండ మీదనుండి బైబిలు ప్రసంగాన్ని ప్రసారం చేసేటప్పుడు, మేము తరచూ పోలీసుకారు మావైపు రావడం చూసేవాళ్లం. బెర్ట్‌ హుటాహుటిన ఆ ప్రసారాన్ని ఆపుజేసి, చాలా కిలోమీటర్ల దూరంలోవున్న మరో కొండకు వెళ్లి అక్కడ మరో రికార్డింగ్‌ని వినిపించేవాడు. బెర్ట్‌, ఆయనలాంటి ధైర్యవంతులైన మరితర యథార్థవంతులైన సహోదరుల నుండి యెహోవామీద నమ్మకముంచడం గురించి, ధైర్యంగా ఉండడం గురించి నేనెంతో నేర్చుకున్నాను.​—⁠మత్తయి 10:​16.

నాకు పన్నెండేళ్లప్పుడు, పాఠశాల అయిపోయిన తర్వాత నా అంతట నేనే క్రమంగా సాక్ష్యమివ్వడానికి వెళ్ళేవాణ్ణి. అలా ఒకరోజు, అడ్షెడ్‌వాళ్ళ కుటుంబాన్ని కలిశాను. అనతికాలంలోనే, తల్లిదండ్రులిద్దరూ, వారి ఎనిమిదిమంది పిల్లలు, ఇంకా చాలామంది మనవళ్ళు, మనవరాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. ఇంత చక్కని కుటుంబానికి బైబిలు సత్యాన్ని పరిచయం చేయడానికి కేవలం బాలుడిగా ఉన్న నన్ను అనుమతించినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.​—⁠మత్తయి 21:​16.

యౌవనంలోనే సేవాధిక్యతలు

నాకు పద్దెనిమిదేళ్లున్నప్పుడు నేను పూర్తికాల పయినీరు పరిచారకుడయ్యాను, నేను న్యూ సౌత్‌వేల్స్‌లోని మేట్‌ల్యాండ్‌కు నియమించబడ్డాను. నేను 1956లో ఆస్ట్రేలియాలోని బ్రాంచి కార్యాలయంలో సేవచేయడానికి ఆహ్వానించబడ్డాను. అక్కడ పనిచేస్తున్న 20 మందిలో, మూడొంతులమంది క్రీస్తుతోపాటు పరలోక రాజ్యంలో పరిపాలించే నిరీక్షణ ఉన్న అభిషిక్తులే. వారితో కలిసి పనిచేయడం నిజంగా ఎంతో గొప్ప ఆధిక్యత!​—⁠లూకా 12:​32; ప్రకటన 1:⁠6; 5:​10.

అవివాహితునిగా ఉండిపోవాలన్న నా నిర్ణయం జూడీ హెల్‌బెర్గ్‌ను కలిసిన తర్వాత నీరుగారిపోయింది, రూపవతియైన ఆ పయినీరు సహోదరి సమావేశానికి సంబంధించిన పెద్ద ప్రణాళికలో తాత్కాలికంగా నాకు సహాయం చేసేందుకు బ్రాంచి కార్యాలయానికి ఆహ్వానించబడింది. జూడీ నేను ప్రేమలోపడి, రెండేండ్ల తర్వాత వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత, మేము ప్రతీ వారం యెహోవాసాక్షుల ఒక్కో సంఘాన్ని దర్శించి సహోదరసహోదరీలను ప్రోత్సహించే ప్రాంతీయ సేవను ఆరంభించాం.

జూడీ 1960లో మా మొదటి కూతురైన కిమ్‌కు జన్మనిచ్చింది. ఇప్పుడైతే, పిల్లలు ఉన్నారంటే, ప్రాంతీయ సేవను విడిచిపెట్టి, ఏదోక స్థలంలో స్థిరపడాల్సిందే. అయితే మాకెంతో ఆశ్చర్యం కలిగిస్తూ, సంఘాలను సందర్శించాలనే ఆహ్వానం అందుకున్నాం. ఎంతో ప్రార్థించిన తర్వాత, ఆ ఆహ్వానాన్ని మేమంగీకరించాం, ఆ తర్వాతి ఏడు నెలల్లో క్వీన్స్‌లాండ్‌, ఉత్తరప్రాంత క్షేత్రంలో సుదూర సంఘాలను సందర్శిస్తుండగా కిమ్‌ మాతోపాటు 13,000 కిలోమీటర్లు బస్సులో, విమానంలో, రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో మాకు కారు లేదు.

మేము అన్నిసమయాల్లో సహోదరసహోదరీల ఇళ్ళలోనే బస చేసేవాళ్ళం. ఉష్ణప్రాంత వాతావరణం కారణంగా పడక గదులకు తలుపులకు బదులు తెరలుండేవి, రాత్రిపూట కిమ్‌ ఏడ్చినప్పుడు మేము మరింతగా కంగారుపడేవాళ్లం. పాప ఆలనాపాలనా చూసుకుంటూ, అదే సమయంలో మా నియామకంపట్ల శ్రద్ధ చూపించడం చివరకు చాలా కష్టంగా తయారైంది. అందువల్ల మేము బ్రిస్‌బేన్‌లో స్థిరపడ్డాం, కాగా నేను వాణిజ్య కళ అనబడే సైన్‌ పెయింటింగ్‌ వేయడం ప్రారంభించాను. కిమ్‌ పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత మరో పాప పెటీనా పుట్టింది.

విషాదాన్ని తాళుకోవడం

మా పిల్లలిద్దరికీ 12, 10 ఏళ్ళున్నప్పుడు, జూడీకి హాడ్జికిన్స్‌ వ్యాధి సోకి మరణించింది. మా కుటుంబానికి అది తీరని లోటు. అయితే, జూడీ అనారోగ్యంగా ఉన్నప్పుడు, మరణించిన తర్వాత యెహోవా తన వాక్యం, తన పరిశుద్ధాత్మ, సహోదరత్వం ద్వారా మమ్మల్ని ఆదరించాడు. ఆ విషాదం జరిగిన వెంటనే మేమందుకున్న కావలికోట (ఆంగ్లం) పత్రిక నుండి కూడా మేము బలాన్ని పొందాం. ఆ పత్రికలోని ఒక ఆర్టికల్‌ వ్యక్తిగత పరీక్షలకు, వియోగానికి సంబంధించిన అంశాలను చర్చించడమే కాక, పరీక్షలు మనం సహనం, విశ్వాసం, యథార్థత వంటి దైవిక లక్షణాలను వృద్ధి చేసుకునేందుకు ఎలా సహాయం చేస్తాయో కూడా వివరించింది. *​—⁠యాకోబు 1:​2-4.

జూడీ మరణించిన తర్వాత నేను, పిల్లలు మరింత సన్నిహితులమయ్యాం. అయితే ఇటు తండ్రి పాత్రను, అటు తల్లి పాత్రను పోషించడం ఒక పోరాటమే అని నేను ఒప్పుకోవాలి. కానీ నా ముద్దుల కూతుర్లిద్దరూ, నా పనిని చాలా తేలిక చేశారు.

మళ్ళీ వివాహం, విస్తరించిన కుటుంబం

కొద్దికాలం తర్వాత నేను మళ్ళీ వివాహం చేసుకున్నాను. నా రెండవ భార్య మారీకి నాకు చాలా విషయాల్లో పోలికలున్నాయి. ఆమె కూడా తన భర్తను హాడ్జికిన్స్‌ వ్యాధి కారణంగా పోగొట్టుకుంది. ఆమెకు కూడా కాలీన్‌, జెనిఫర్‌ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. కాలీన్‌ పెటీనాకన్నా మూడేళ్ళు చిన్నది. దానితో ఇప్పుడు మా ఇంట్లో 14, 12, 9, 7 ఏళ్ల నలుగురు ఆడపిల్లలున్నారు.

మారుటి తల్లి/తండ్రి ఇచ్చే నిర్దేశాన్ని ఇతర పిల్లలు సులభంగా అంగీకరించే సమయం వరకు ఎవరి పిల్లలకు వారే శిక్షణ ఇవ్వాలని నేనూ మారీ మొదట నిర్ణయించుకున్నాం. భార్యాభర్తలుగా నేనూ మారీ మా కోసం రెండు ప్రాముఖ్యమైన నియమాలు పెట్టుకున్నాం. మొదటిది, మా అభిప్రాయభేదాల్ని పిల్లలముందు ఎప్పుడూ వెల్లడించుకునేవాళ్లం కాదు, రెండవది, ఎఫెసీయులు 4:26లో వ్రాయబడిన బైబిలు సూత్రానికి అనుగుణంగా పరిస్థితి చక్కబడేవరకు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం!

విస్మయం కలిగించేలా సవతి కుటుంబంలోని ప్రతీఒక్కరూ చక్కగా సర్దుకుపోయారు, అయితే మేము కోల్పోయినవారి జ్ఞాపకాలు అంత త్వరగా సమసిపోలేదు. ఉదాహరణకు, సోమవారం రాత్రి మారీకి “దుఃఖ రాత్రే” అయ్యేది. మా కుటుంబ అధ్యయనం ముగిసి, పిల్లలు నిద్రపోయిన తర్వాత, మారీలో బలవంతంగా దాగివున్న భావావేశాలు పెల్లుబికి వచ్చేసేవి.

మాకంటూ ఓ బిడ్డ ఉండాలని మారీ కోరుకుంది. విచారకరంగా, ఆమెకు గర్భస్రావం అయ్యింది. మారీ మళ్ళీ గర్భవతి అయినప్పుడు ఓ పెద్ద ఆశ్చర్యమే మాకోసం వేచివుంది. అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఆమె గర్భంలో ఒక్క బిడ్డ కాదు నలుగురు బిడ్డలున్నారని వెల్లడించింది! నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను. నాకిప్పుడు 47 ఏళ్ళు, కొద్దినెలల్లో నేను ఎనిమిదిమంది పిల్లలకు తండ్రిని కాబోతున్నాను! ముప్పైరెండు వారాలు గడిచి నెలలు నిండిన తర్వాత 1982 ఫిబ్రవరి 14న సిజేరియన్‌ చేసి నలుగురు పిల్లలను బయటకు తీశారు. వరుస క్రమంలో ఆ పిల్లలు క్లింట్‌, 1.6 కేజీలు; సిండీ, 1.9 కేజీలు; జెరెమీ, 1.4 కేజీలు; డానెట్‌, 1.7 కేజీలు ఉన్నారు. ఆ నలుగురి పోలికలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

పిల్లలు పుట్టిన వెంటనే, మారీకి ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ వచ్చి నా ప్రక్కన కూర్చొని,

“పిల్లల్ని పోషించడమెలా అని ఆందోళనపడుతున్నారా?” అని అడిగాడు.

“అవును, ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ ఎదుర్కోలేదు” అని జవాబిచ్చాను.

ఆ తర్వాత ఆయన పలికిన మాటలు నన్ను నిజంగా ఆశ్చర్యపరచి, ప్రోత్సహించాయి.

“మీ సంఘం మిమ్మల్ని విడిచిపెట్టదు, మీరు తుమ్మితే చాలు వెయ్యి రుమాళ్లు మీ చేతికందించబడతాయి” అని ఆయనన్నాడు.

ఈ ప్రఖ్యాత స్త్రీల వైద్యునికి, అతని వైద్య సిబ్బందికి ఎంతో కృతజ్ఞులం, వారి తోడ్పాటువల్ల కేవలం రెండు నెలల్లోనే ఆరోగ్యంగావున్న నలుగురు పిల్లలతో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగివచ్చాం.

ఆ నలుగురు పిల్లల్ని పెంచడంలో ఎదురైన సవాలు

అన్నింటినీ సక్రమంగా జరిగించేందుకు మారీ, నేను 24 గంటల సమయ పట్టికను తయారుచేశాం. నలుగురు పెద్ద పిల్లలు చంటి పిల్లల్ని చూసుకోవడంలో ఎంతో సహాయపడ్డారు. ఆ వైద్యుడు పలికిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. “తుమ్మితే చాలు” మరుక్షణంలో మాకు సహాయం చేసేందుకు సంఘమంతా వరుసకట్టేది. అంతకుముందు, దీర్ఘకాల స్నేహితుడైన మాక్‌ఆర్థర్‌ మా ఇంటిని కాస్త పెద్దదిగా చేసేందుకు పనివాళ్లైన సాక్షులను సమీకరించాడు. పసిపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు సహోదరీల బృందం పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో సహాయం చేశారు. ఈ ప్రేమపూర్వక చర్యలన్నీ క్రియాశీల క్రైస్తవ ప్రేమకు నిదర్శనంగా నిలిచాయి.​—⁠1 యోహాను 3:​18.

ఒకవిధంగా, ఈ నలుగురు పిల్లలు “సంఘానికి చెందిన పిల్లలే” అయ్యారు. ఇప్పటికీ ఈ నలుగురు పిల్లలు మాకు సహాయం చేసిన ప్రేమగల సహోదరసహోదరీలను సొంత కుటుంబసభ్యుల్లాగే దృష్టిస్తారు. మారీ గురించైతే ఇక చెప్పక్కర్లేదు, తన పిల్లలపట్ల నిస్వార్థంగా శ్రద్ధ తీసుకున్న అసాధారణ తల్లిగా, భార్యగా నిరూపించుకుంది. ఆమె దేవుని వాక్యం నుండి, సంస్థ నుండి నేర్చుకున్నవి నిజంగా అన్వయించుకుంది. అంతకుమించిన మంచి సలహా మరెక్కడా దొరకదు!​—⁠కీర్తన 1:​2, 3; మత్తయి 24:​45.

మా నలుగురు చంటిపిల్లల్ని సంభాళించడం కష్టమైనా క్రైస్తవ కూటాలు, ప్రకటనాపని మా వారపు కార్యక్రమంలో ముఖ్యమైన భాగాలయ్యాయి. ఆ సమయంలో దీవెనకరమైన విషయమేమిటంటే, రెండు జంటలు, దయతో మా ఇంటికే వచ్చి బైబిలు అధ్యయనం చేసేవారు. ఇలా చేయడం మాకు తేలికగా ఉన్నా, మారీ కొన్నిసార్లు ఎంతగా అలసిపోయేదంటే అధ్యయనం జరిగేటప్పుడు నిద్రపోతున్న పాపను చేతుల్లో పెట్టుకునే కునుకుపాట్లుపడేది. కొద్దికాలానికే ఆ రెండు జంటలు మన ఆధ్యాత్మిక సహోదరసహోదరీలయ్యారు.

బాల్యంలోనే ఆధ్యాత్మిక శిక్షణ

ఆ చంటి పిల్లలు తప్పటడుగులు వేయకముందే నేనూ, మారీ, మా పెద్ద పిల్లలు వాళ్లను తీసుకుని క్షేత్ర పరిచర్యకు వెళ్లేవాళ్లం. వారు నడవడం ఆరంభించినప్పుడు మారీ నేను చెరో ఇద్దరిని తీసుకెళ్లేవాళ్లం, వారు మాకు భారంగా ఉండేవారు కాదు. వాస్తవానికి వారు, స్నేహపూర్వక గృహస్థులతో సంభాషణ ఆరంభించేందుకు అనువుగా ఉండేవారు. ఒకరోజు నేనొక వ్యక్తిని కలిశాను, ఆయన ఒక వ్యక్తి ఫలానా రోజున ఫలానా రాశిలో జన్మిస్తే, అతని వ్యక్తిత్వం ఫలానా విధానాన్ని అనుసరిస్తుందని వాదించాడు. ఆయనతో వాదించడానికి బదులు, కొద్దిసేపైన తర్వాత మళ్లీ రావచ్చా అని అడిగాను. దానికాయన ఒప్పుకున్నాడు, ఆ తర్వాత నేను మా నలుగురు చంటిపిల్లలను తీసుకొని ఆయన దగ్గరకెళ్లాను. ఆయన ఆశ్చర్యంతో వారిని చూస్తుండగా, నేను వారు పుట్టిన వరుస క్రమంలో వారిని నిలబెట్టాను. మేము స్నేహపూర్వకంగా ఆ పిల్లల పోలికల్లోని తేడాల గురించే కాక, వారి వ్యక్తిత్వంలోని గమనార్హమైన తేడాల గురించి కూడా మాట్లాడాం, అది ఆయన సిద్ధాంతాన్ని భంగపర్చింది. “ఈ సిద్ధాంతం గురించి మీకు చెప్పి నేను నవ్వులపాలయ్యాను, నేనింకా ఎక్కువ పరిశోధన చేయాలి” అని ఆయన అన్నాడు.

నడక నేర్చిన ఆ నలుగురు అల్లరిచేసినప్పుడు అందరినీ కలిపి గద్దిస్తే ముఖం మాడ్చేవారు, అందుకని వాళ్లను ఒక్కొక్కరిగా సరిదిద్దేవాళ్లం. అయినా, వారు అందరికీ అవే నియమాలు వర్తిస్తాయని తెలుసుకున్నారు. పాఠశాలలో మనస్సాక్షికి సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు బైబిలు సూత్రాల విషయంలో స్థిరంగా నిలబడి, ఒకరికొకరు మద్దతిచ్చుకున్నారు, సిండీ వారికి ప్రతినిధిగా ఉండేది. ఈ నలుగురు పిల్లలు ఒక జట్టుగా బలమైన శక్తిగా ఉన్నారని అందరూ త్వరలోనే గ్రహించారు!

పిల్లలు వారి కౌమారప్రాయంలో యెహోవాకు యథార్థంగా ఉండేలా సహాయం చేయడానికి మారీ, నేను సాధారణ సవాళ్లనే ఎదుర్కొన్నాం. ప్రియమైన సంఘం యొక్క మద్దతు, యెహోవా సంస్థ యొక్క దృశ్య భాగం నుండి మనమందుకునే సమృద్ధియైన ఆధ్యాత్మిక ఆహారమే లేకపోతే మా పని ఎంతో కష్టంగా ఉండేదని మాత్రమే చెప్పగలం. కుటుంబ అధ్యయనాన్ని క్రమంగా నిర్వహించేందుకు, అన్ని సందర్భాల్లో సులభం కాకపోయినా అరమరికల్లేకుండా మాట్లాడుకునేందుకు మేము శాయశక్తులా ప్రయత్నించాం. అయితే మా కష్టం వృథా కాలేదు, మా ఎనిమిదిమంది పిల్లలు యెహోవాను సేవించేందుకే ఎన్నుకున్నారు.

పైబడుతున్న వయసుతో పోరాటం

గడిచిన అనేక సంవత్సరాల్లో నేను సంఘ పెద్దగా, నగర పైవిచారణకర్తగా, ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా ఎన్నో ఆధ్యాత్మిక ఆధిక్యతల్ని ఆస్వాదించాను. రక్తమార్పిడి ఒక వివాదంగా మారినప్పుడు సాక్షులైన రోగులతో సహకరించేలా వైద్యులకు సహాయం చేసేందుకు ఉపకరించే ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాను. నేను దాదాపు 34 సంవత్సరాలు వివాహ రిజిస్ట్రారుగా పనిచేయడమే కాక, మా ఆరుగురు అమ్మాయిల పెళ్లిళ్లతోపాటు సుమారు 350 వివాహాలు రిజిస్టరుచేసి వివాహ తంతు నిర్వహించే ఆధిక్యత కూడా నాకు లభించింది.

గడిచిన సంవత్సరాల్లో మొదట జూడీ, ఇప్పుడు మారీ ఎడతెగక నాకందిస్తున్న యథార్థమైన మద్దతుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. (సామెతలు 31:​10, 30) సంఘ పెద్దగా నా పనిలో మద్దతివ్వడమే కాక, వారు పరిచర్యలో చక్కని ఆదర్శంగా ఉంటూ, పిల్లల్లో ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించడంలో తోడ్పడ్డారు.

చేతుల్లో వణుకును, నడకలో పట్టుతప్పడాన్ని కలిగించే మెదడుకు సంబంధించిన వ్యాధి నాకు సోకిందని 1996లో వైద్యపరీక్షలో వెల్లడైంది. అందువల్ల నేను సైన్‌ పెయింటింగ్‌ ఇక ఏ మాత్రం వేయలేకపోయాను. నా వేగం తగ్గినా యెహోవా సేవలో నేనింకా ఆనందాన్ని పొందుతున్నాను. ప్రోత్సాహకరమైన విషయమేమిటంటే, నేను ఇతర వృద్ధులపట్ల మరింత తదనుభూతిని చూపించగలుగుతున్నాను.

నా జీవితం గురించి నేను తిరిగి ఆలోచించినప్పుడు, ఆనందంగా అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు నాకు నా కుటుంబానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నందుకు యెహోవాకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. (యెషయా 41:​10) మా ఎనిమిదిమంది పిల్లలతో సహా మారీ, నేను సంఘంలోని అద్భుతమైన, మద్దతునిచ్చే ఆధ్యాత్మిక సహోదరసహోదరీల కుటుంబానికి కూడా కృతజ్ఞులం. అసంఖ్యాక విధాలుగా వారందరూ మా పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు.​—⁠యోహాను 13:​34, 35.

[అధస్సూచీలు]

^ పేరా 6 యెహోవాసాక్షులు ప్రచురించినది కానీ ఇప్పుడది ముద్రించబడడం లేదు.

^ పేరా 17 కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1972, 174-80 పేజీల్లోని ఆర్టికల్‌ను చూడండి.

[12వ పేజీలోని చిత్రం]

సిడ్నీలో 1941 సమావేశానికి ప్రయాణానికి సిద్ధంగావున్న మా అమ్మ, అన్నయ్య గార్త్‌, మా అక్క డాన్‌తో

[13వ పేజీలోని చిత్రం]

క్వీన్స్‌లాండ్‌లో ప్రాంతీయ సేవలో ఉన్నప్పుడు జూడీతో, పాప కిమ్‌తో

[15వ పేజీలోని చిత్రం]

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టినప్పుడు, మా నలుగురు పెద్దపిల్లలు, సంఘం మాకు సహాయం చేయడానికి వరుసకట్టారు