పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ద్వితీయోపదేశకాండము 31:2లోని మాటల్ని, ఇతర అనువాదాలు మోషే ఇశ్రాయేలీయులను ఇక నడిపించలేడు అని అనువదించగా, నూతనలోక అనువాదము ఆయన ఇశ్రాయేలీయుల నాయకునిగా ‘వస్తూపోతూ ఉండేందుకు ఇకమీదట అనుమతించబడడు’ అని ఎందుకు అనువదించింది?
ప్రశ్నలో సూచించబడిన లేఖనంలోని హెబ్రీ పదాన్ని రెండు విధాలుగా అనువదించే అవకాశమున్నా, మోషే జీవితపు చివరి దశలో ఆరోగ్యం క్షీణించిన కారణంగా ఆయన భౌతికంగా నాయకత్వపు బాధ్యతలను నిర్వర్తించలేకపోయాడని కొన్ని బైబిలు అనువాదాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, పరిశుద్ధ గ్రంథము మోషే మాటల్ని ఇలా అనువదించింది: “నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను. ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను.” పవిత్ర గ్రంథం (వ్యాఖ్యాన సహితం) కూడా ఇలా అనువదించింది: “ఇకనుంచి రాకపోకలు నేను చేయలేను.”
అయితే, వయసుమళ్ళినా మోషే శారీరకంగా బలంగానే ఉన్నాడని ద్వితీయోపదేశకాండము 34:7 చూపిస్తోంది. అదిలా చెబుతోంది: “మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.” కాబట్టి, ఆ జనాంగాన్ని నడిపించడానికి మోషేకు ఇంకా శారీరక సామర్థ్యం ఉంది, కానీ ఆయనలా నడిపించడం యెహోవా చిత్తం కాదు. మోషే ఆ తర్వాత పలికిన ఈ మాటల్లో అది స్పష్టమౌతుంది: “యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.” నిజానికి యెహోవా, మెరీబా జలము దగ్గర తాను శాసించినదాన్నే ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాడు.—సంఖ్యాకాండము 20:9-12.
మోషే సుదీర్ఘమైన, గమనార్హమైన జీవితాన్ని గడిపాడు, ఆయన జీవితకాలాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఆయన ఐగుప్తులో గడిపిన 40 సంవత్సరాల్లో “ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడైయుండెను.” (అపొస్తలుల కార్యములు 7:20-22) ఆ తర్వాత మరో 40 సంవత్సరాలు ఆయన మిద్యానులో నివసించాడు. అక్కడ ఆయన యెహోవా ప్రజల్ని నడిపించడానికి అవసరమైన ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకున్నాడు. చివరిగా, మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నిర్దేశించి, నడిపించాడు. కానీ, ఇప్పుడు ఆ జనాంగాన్ని మోషేకు బదులుగా యెహోషువ యొర్దాను నదిగుండా వాగ్దత్తదేశంలోకి నడిపించాలని యెహోవా నిర్ణయించాడు.—ద్వితీయోపదేశకాండము 31:3.
కాబట్టి, నూతనలోక అనువాదము ద్వితీయోపదేశకాండము 31:2లోని మాటల్ని సరిగా అనువదిస్తోంది. మోషే ఇకమీదట ఇశ్రాయేలుపై నాయకునిగా కొనసాగడు. ఆయనకు శారీరక సామర్థ్యం లేక కాదు, యెహోవా ఆయనను అనుమతించనందువల్లే ఆయన నాయకునిగా కొనసాగడు.