కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు విపరీతమైన హద్దులు పెడుతోందా?

బైబిలు విపరీతమైన హద్దులు పెడుతోందా?

బైబిలు విపరీతమైన హద్దులు పెడుతోందా?

“నాకు బాల్యంలో ఏ బైబిలు ప్రమాణాలూ బోధించబడలేదు. దేవుని గురించైతే అసలు ప్రస్తావించబడనేలేదు” అని ఫిన్‌లాండ్‌కు చెందిన ఒక యౌవనస్థుడు అంటున్నాడు. అలాంటి పెంపకం నేడు క్రొత్త కాదు. చాలామంది, ముఖ్యంగా యౌవనస్థులు, బైబిలు పాతకాలానిదని, దానిలోని సలహా మరీ నిర్బంధించేదిగా ఉందని భావిస్తారు. బైబిలు ప్రకారం జీవించాలనుకునేవారిని ఇతరులు నిర్బంధాలతో, కట్టడలతో జీవితాలు భారంగా చేయబడిన, అణచివేయబడిన ప్రజలుగా చూస్తారు. కాబట్టి, బైబిలును ప్రక్కనబెట్టి నడిపింపు కోసం మరెక్కడైనా చూడడం మంచిదని చాలామంది అనుకుంటారు.

బైబిలుపట్ల ప్రజలకు అలాంటి దృక్పథం ఏర్పడేందుకు చాలామేరకు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల అణచివేత ధోరణికి సంబంధించిన సుదీర్ఘమైన చరిత్రే కారణం. ఉదాహరణకు, కొంతమంది చరిత్రకారులు అంధకార యుగాలని పిలిచిన కాలంలో యూరప్‌లోని క్యాథలిక్‌ చర్చి ప్రజల జీవితాల్లోని దాదాపు ప్రతీ అంశంపై పెత్తనం చెలాయించింది. చర్చిని వ్యతిరేకించడానికి ధైర్యం చేసినవారు హింసించబడేవారు, చివరికి మరణదండనకు గురయ్యేవారు. ఆ తర్వాత ఉనికిలోకివచ్చిన ప్రొటస్టెంట్‌ చర్చీలు కూడా వ్యక్తిగత స్వేచ్ఛను నిర్బంధించాయి. నేడు, “కాల్వనిస్ట్‌” లేక “ప్యూరిటన్‌” అనే పదాలు, కొన్ని నమ్మకాలను అనుసరించేవారినే గాక అలాంటి గుంపులతో ముడిపడివున్న కఠినమైన క్రమశిక్షణను కూడా గుర్తుచేస్తాయి. అంతేగాక చర్చీలు అణచివేసేవిగా ఉన్నాయి కాబట్టి, బైబిలు బోధలు కూడా అణచివేసేవిగానే ఉంటాయని ప్రజలు అపార్థం చేసుకుంటారు.

ఇటీవలి శతాబ్దాల్లో, కనీసం కొన్ని దేశాల్లో, చర్చీలు ప్రజల జీవితాలపై చాలామేరకు తమ పట్టును కోల్పోయాయి. సాంప్రదాయక మతనమ్మకాలు నిరాకరించబడడంతో, తప్పొప్పులను స్వయంగా నిర్ణయించుకునే హక్కు ప్రజలకే ఉందనే తలంపు వ్యాప్తిచెందింది. దాని ఫలితమేమిటి? నేరశాస్త్ర, న్యాయసంబంధ సమాజశాస్త్ర పండితుడైన అహ్తీ లైటినన్‌ ఇలా వివరిస్తున్నాడు: “అధికారంపట్ల గౌరవం తగ్గిపోయింది, ఏది అంగీకారమైనది ఏది అనంగీకారమైనది అనే విషయంలో ప్రజల అవగాహన మరింత అస్పష్టంగా తయారవుతోంది.” ఆశ్చర్యకరంగా, చర్చి నాయకులు సహితం అలాంటి ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నారు. ఒక ప్రముఖ లూథరన్‌ బిషప్‌ ఇలా అన్నాడు: “నైతికపరమైన సమస్యలకు బైబిలు వైపు లేక ఏదైనా మతాధికారం వైపు తిరగడం ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయాన్ని నేను తిరస్కరిస్తాను.”

అపరిమితమైన స్వేచ్ఛ ప్రయోజనకరమైనదేనా?

అపరిమితమైన స్వేచ్ఛ అనే తలంపు ప్రాముఖ్యంగా యౌవనస్థులకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఇతరులు తమను ఎల్లప్పుడూ ఇది చేయకూడదు అది చేయకూడదు అని నిర్బంధించడం చాలామందికి ఇష్టం ఉండదు. అయితే, తాము ఏమి చేయాలనుకుంటే అది చేయడానికి స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికి ఉండాలా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒక ఉదాహరణ పరిశీలించండి. ట్రాఫిక్‌ నియమాలేవీ లేని నగరాన్ని ఊహించుకోండి. డ్రైవర్‌ లైసెన్స్‌ గానీ డ్రైవింగ్‌ పరీక్ష గానీ అవసరం లేదు. ప్రజలు ఎలా కావాలంటే అలా వాహనం నడపవచ్చు, త్రాగిన మత్తులో కూడా డ్రైవింగ్‌ చేయవచ్చు, వేగపరిమితులు, ఆగండి అనే చిహ్నాలు, ట్రాఫిక్‌ లైట్లు, వన్‌వే వీధులు, జీబ్రా క్రాసింగ్‌లు వంటివేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి “స్వేచ్ఛ” ప్రయోజనకరమైనదేనా? ఎంతమాత్రం కాదు! దాని ఫలితంగా గజిబిజి, గందరగోళం, విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ట్రాఫిక్‌ నియమాలు ప్రజల స్వేచ్ఛను పరిమితం చేసినా, ఈ నియమాలు డ్రైవర్లను, పాదచారులను కాపాడతాయని మనం అర్థంచేసుకోవచ్చు.

అలాగే, మనం ఎలా జీవించాలో యెహోవా నిర్దేశిస్తున్నాడు. ఇది మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాంటి నిర్దేశమే లేకపోతే మనం వివిధ ప్రయోగాలు చేయడం ద్వారా సరైనది నేర్చుకోవాల్సి వస్తుంది, మనం అలా చేస్తే మనకూ, ఇతరులకూ హాని జరిగే అవకాశం ఉంది. నైతిక అరాచకత్వం ఏర్పడిన అలాంటి వాతావరణం, ట్రాఫిక్‌ నియమాలు లేని నగరంలో డ్రైవింగ్‌ చేయడమంత అవాంఛితమైనదిగా, ప్రమాదకరమైనదిగా ఉంటుంది. వాస్తవమేమిటంటే, మనకు ఏదో ఒక విధమైన నియమాలు, కట్టడలు అవసరం, ఈ వాస్తవాన్ని చాలామంది వెంటనే అంగీకరిస్తారు.

‘నా భారము తేలికగా ఉన్నది’

ట్రాఫిక్‌ నియమాలు అనేకం, అవి ఎంతో వివరణాత్మకంగా ఉండవచ్చు, కొన్ని స్థలాల్లో పార్కింగ్‌ నియమాలే చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి భిన్నంగా, బైబిలు నియమావళికి సంబంధించిన పెద్దపట్టికను ఇవ్వడంలేదు. బదులుగా, అది ప్రాథమిక సూత్రాలను ఇస్తుంది, అవి భారమైనవిగా లేక అణచివేసేవిగా లేవు. యేసుక్రీస్తు తన సమకాలీనులకు సాంత్వనదాయకమైన ఈ ఆహ్వానాన్ని ఇచ్చాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:​28, 30) కొరింథులోవున్న క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఒక లేఖలో ఇలా వ్రాశాడు: “ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.”​—⁠2 కొరింథీయులు 3:​17.

అయితే, ఆ స్వేచ్ఛ అపరిమితమైనది కాదు. దేవుడు కోరేవాటిలో కొన్ని సరళమైన ఆజ్ఞలున్నాయని యేసు స్పష్టంగా చెప్పాడు. ఉదాహరణకు, యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ.” (యోహాను 15:​12) ప్రతి ఒక్కరూ ఆ ఆజ్ఞను అనుసరిస్తే జీవితం ఎలా ఉంటుందో ఊహించండి! కాబట్టి, క్రైస్తవులకున్న స్వేచ్ఛ పరిమితులు లేనిది కాదు. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.”​—⁠1 పేతురు 2:​16.

క్రైస్తవులు వివరణాత్మక నియమాల పట్టికచేత నిర్బంధించబడకపోయినా, తప్పొప్పుల విషయంలో వారు తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తించరు. మానవులకు దేవుడు మాత్రమే ఇవ్వగల నిర్దేశం అవసరం. బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:​23) మనం దేవుని నిర్దేశం ప్రకారం నడుచుకుంటే మెండుగా ఆశీర్వదించబడతాము.​—⁠కీర్తన 19:​11.

ఆ ఆశీర్వాదాల్లో ఒకటి సంతోషం. ఉదాహరణకు, ఆరంభంలో పేర్కొన్న యౌవనస్థుడు ఒక దొంగగా, అబద్ధికునిగా ఉండేవాడు. అంతేగాక అతడు లైంగిక విషయాల్లో విచ్చలవిడిగా ఉండేవాడు. బైబిల్లోని ఉన్నత ప్రమాణాల గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన తన జీవిత విధానాన్ని వాటికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “నేను ఒకేసారి బైబిలు ప్రమాణాలన్నిటినీ అనుసరించలేకపోయినా, నేను వాటి విలువను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను పొందుతున్న ఆనందాన్ని నా గత జీవితవిధానం నాకివ్వలేదు. బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడం మీ జీవితాన్ని సరళం చేస్తుంది. మనం ఎటు వెళ్తున్నామో, ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలుస్తుంది.”

చాలామంది అలాంటి అనుభవాన్నే చవిచూశారు. ఇతర విషయాలతోపాటు, బైబిల్లోవున్న నిర్దేశం తోటి మానవులతో మంచి సంబంధం కలిగివుండడానికి, పని విషయంలో సమతూకమైన దృక్కోణం కలిగివుండడానికి, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండడానికి, సంతోషకరమైన జీవితాలను గడపడానికి వారికి సహాయం చేసింది. గతంలో బైబిలు ప్రమాణాలకు వ్యతిరేకంగా, ఆ తర్వాత వాటికి అనుగుణంగా జీవించిన మార్కూస్‌ * అనే యౌవనస్థుడు తన జీవితం గురించి ఇలా చెబుతున్నాడు: “బైబిలు ప్రకారం జీవించడం ద్వారా నా ఆత్మగౌరవాన్ని అధికం చేసుకోగలిగాను.” *

మీరేమి ఎన్నుకుంటారు?

బైబిలు నిర్బంధించేదిగా ఉందా? అవును, అయినా అది మనందరి ప్రయోజనార్థమే. అయితే బైబిలు మరీ నిర్బంధించేదిగా ఉందా? లేదు. అపరిమితమైన స్వేచ్ఛ కష్టాలకే నడిపిస్తుంది. బైబిలు ప్రమాణాలు సమతూకమైనవి, అవి మన సంక్షేమానికి, సంతోషానికి దోహదపడతాయి. మార్కూస్‌ ఇలా చెబుతున్నాడు: “కాలం గడిచేకొద్దీ, దేవుని వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవడం జ్ఞానవంతమైనదని గ్రహించాను. నా జీవితం అనేక విషయాల్లో సాధారణ ప్రజల జీవితాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, నేను జీవితంలో ఏదో ప్రాముఖ్యమైనది కోల్పోయానని ఎన్నడూ నాకనిపించలేదు.”

బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మీరు అనుభవించడం ప్రారంభించినప్పుడు, దేవుని వాక్యంపట్ల మీ మెప్పు అధికమవుతుంది. ఇది మరింత గొప్ప ఆశీర్వాదానికి నడిపిస్తుంది, అదేమిటంటే దాని దైవిక మూలమైన యెహోవా దేవుణ్ణి మీరు ప్రేమించడం ప్రారంభిస్తారు. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”​—⁠1 యోహాను 5:⁠3.

యెహోవా మన సృష్టికర్త, పరలోక తండ్రి. మనకేది మంచిదో ఆయనకు బాగా తెలుసు. ఆయన మనల్ని నిర్బంధించే బదులు, మన మేలు కోసమే మనకు ప్రేమపూర్వక నిర్దేశాన్నిస్తాడు. కావ్యరూపంలో యెహోవా మనల్ని ఇలా కోరుతున్నాడు: “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”​—⁠యెషయా 48:⁠18.

[అధస్సూచీలు]

^ పేరా 13 పేరు మార్చబడింది.

^ పేరా 13 బైబిల్లో పేర్కొనబడిన జీవన విధానం గురించిన మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 12వ అధ్యాయాన్ని చూడండి.

[9వ పేజీలోని చిత్రం]

దేవుని నియమాలు నూతనోత్తేజాన్ని ఇచ్చేవిగా ఉంటాయని యేసు చెప్పాడు

[10వ పేజీలోని చిత్రం]

దేవుని నిర్దేశాన్ని అనుసరించడం సంతోషాన్నిస్తుంది, ఆత్మగౌరవాన్ని అధికం చేస్తుంది