మహాసముద్రంలో దారి కనుక్కోవడం
మహాసముద్రంలో దారి కనుక్కోవడం
మార్షల్ దీవుల్లో 1,200 పైచిలుకు చిన్నా, పెద్దా దీవులు ఉన్నాయి. వాటిలో అనేకం సముద్ర మట్టానికి కేవలం కొన్ని అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. సముద్రంలో వాటినుండి కాస్త దూరం వెళ్ళగానే అవి కనుమరుగౌతాయి. అయినా, ప్రాచీన మార్షల్ దీవుల నావికులు వారి చిన్న పడవల్లో పెద్ద దీవులనుండి అతి చిన్న దీవులకు ప్రయాణిస్తూ, పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 6,50,000 చదరపు కిలోమీటర్లకన్నా ఎక్కువ విస్తీర్ణంలో తమ దారిని కనుగొనేవారు. అది వారికెలా సాధ్యమైంది? వారు, సాధారణమైనవైనా, అత్యంత సమర్థవంతమైన “పటాలను” అంటే చిన్న కర్రలతో చేసిన చట్రాలను ఉపయోగిస్తూ ప్రయాణించేవారు.
ఒక దీవి దగ్గర్లో ఉందనేందుకు రుజువుగా సముద్రంలో దాని చుట్టూ దాదాపు 30 కిలోమీటర్లవరకు ఒక ప్రత్యేక తరహా తరంగాలు ఏర్పడతాయని మార్షల్ దీవులకు చెందిన నావికులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అలా ప్రత్యేక తరహా తరంగాల నమూనాలు చాలావుంటాయి కాబట్టి, వాటిని గుర్తుపెట్టుకోవడానికి కర్రలతో చేయబడిన చట్రాలు వారికి తోడ్పడేవి. కర్రలతో చేసిన ఆ చట్రాలు ఎలా ఉండేవి? ఈ క్రింది చిత్రంలో, ఆ ప్రత్యేక తరహా తరంగాల్ని సూచించే పాండానూస్ వేరులతో లేదా కొబ్బరి ఈనలతో కట్టబడిన కర్రల చట్రాన్ని మీరు చూడవచ్చు. ద్వీపాల స్థానాన్ని సూచించడానికి అక్కడక్కడా ఆ కర్రలకు చిన్న చిన్న గవ్వలు కూడా కట్టబడ్డాయి.
చాలా సంవత్సరాలవరకు కర్రలతో చేసిన ఆ చట్రాలు రహస్యంగా ఉంచబడ్డాయి, కేవలం కొద్దిమందికే అవి చూపించబడేవి. ఒక యౌవనుడు ఆ చట్రాన్ని ఉపయోగించడం నేర్చుకునేందుకు, ఆయన తప్పనిసరిగా మరొకరి నుండి తర్ఫీదు పొంది, అభ్యసించాలి. ప్రవీణుడైన ఒక నావికుడు ఆ యౌవన నావికుణ్ణి బహుశా సమీపానున్న కొన్ని ద్వీపాలకు తీసుకువెళ్లడం ద్వారా ప్రత్యేకంగా శిక్షణనిస్తాడు. అలా శిక్షణ పొందుతున్న ఆ యౌవనుడు వివిధ రకాల అలల్ని గుర్తించడం నేర్చుకుంటుండగా కర్రలతో చేసిన ఆ చట్రాన్ని ఉపయోగించడంలో ఆయనకు ధైర్యం వస్తుంది. కొంతకాలానికి ఆయన ఒంటరిగా కూడా మహాసముద్రంలో ప్రయాణించగలడు.
అదేవిధంగా, మన జీవన పయనంలో దేవుని వాక్యమైన బైబిలు మనకు మార్గనిర్దేశకంగా ఉండగలదు. లేఖనాల్లోని ప్రాథమిక సత్యాలను తెలుసుకోవడానికి మొదట్లో మనకు ఇతరులు సహాయం చేయవచ్చు. కానీ, మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంలో కొనసాగుతూ, దానిలోని సూత్రాలను అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది చెప్పేదానిపై మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఇశ్రాయేలీయులకు నాయకుడైన యెహోషువ దేవుని వాక్యంలో ‘వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్తపడునట్లు’ దాన్ని చదువుతూ ఉండమని ఆజ్ఞాపించబడ్డాడు. అప్పుడు “నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు” అని దేవుడు యెహోషువతో చెప్పాడు. (యెహోషువ 1:8) అవును, మనం జీవితంలో సరైన మార్గంలో విజయవంతంగా ప్రయాణించడానికి బైబిలు దారి చూపించగలదు.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Greg Vaughn