కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకొరకు నిరీక్షిస్తూ ధైర్యంగా ఉండండి

యెహోవాకొరకు నిరీక్షిస్తూ ధైర్యంగా ఉండండి

యెహోవాకొరకు నిరీక్షిస్తూ ధైర్యంగా ఉండండి

“యెహోవాకొరకు కనిపెట్టుకొని [‘నిరీక్షిస్తూ,’ NW] యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవాకొరకు కనిపెట్టుకొని [‘నిరీక్షిస్తూ,’ NW] యుండుము.”​—⁠కీర్తన 27:​14.

ని జమైన నిరీక్షణ ప్రకాశవంతమైన దీపంలాంటిది. అది ప్రస్తుత పరీక్షలను మించి చూస్తూ, భవిష్యత్తును ధైర్యంగా, ఆనందంగా ఎదుర్కొనేందుకు మనకు సహాయం చేస్తుంది. యెహోవా మాత్రమే మనకలాంటి ఖచ్చితమైన నిరీక్షణను ఇవ్వగలడు, ఆయన దానిని తన ప్రేరేపిత వాక్యం ద్వారా మనకందిస్తున్నాడు. (2 తిమోతి 3:​16) వాస్తవానికి “నిరీక్షణ,” ‘నిరీక్షించిన,’ ‘నిరీక్షించుట’ అని బైబిల్లో చాలాసార్లు కనబడే ఈ పదాలు మేలైన దానికోసం ఆతురతతో, నమ్మకంతో నిరీక్షించడాన్నే కాక, ఆ నిరీక్షణ యొక్క ఉద్దేశాన్ని కూడా సూచిస్తాయి. * అలాంటి నిరీక్షణ, నెరవేరే ఎలాంటి ఆధారం లేదా సాధ్యతలేని అభిలాషకన్నా మరెంతో ఉన్నతమైనది.

2 యేసుకు పరీక్షలు, కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన ప్రస్తుత పరిస్థితిని మించిచూస్తూ యెహోవాకొరకు నిరీక్షించాడు. “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:​1-2) యేసు, యెహోవా సర్వాధిపత్యం సత్యమని నిరూపిస్తూ, ఆయన నామాన్ని పరిశుద్ధపర్చే ఉత్తరాపేక్షపై నిశితంగా దృష్టి కేంద్రీకరిస్తూ, తనకెలాంటి పర్యవసానాలు ఎదురైనా దేవునిపట్ల విధేయత చూపించే తన వైఖరినుండి ఎన్నడూ వైదొలగలేదు.

3 రాజైన దావీదు నిరీక్షణకు, ధైర్యానికి మధ్యగల సంబంధాన్ని ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు: “యెహోవాకొరకు కనిపెట్టుకొని [‘నిరీక్షిస్తూ,’ NW] యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవాకొరకు కనిపెట్టుకొని [‘నిరీక్షిస్తూ,’ NW] యుండుము.” (కీర్తన 27:​14) మన హృదయం నిబ్బరంగా ఉండాలని మనం కోరుకుంటే, మన నిరీక్షణ అస్పష్టంగా తయారయ్యేందుకు ఎప్పటికీ అనుమతించకూడదు, బదులుగా దానిని ఎల్లప్పుడూ స్పష్టంగా గుర్తుంచుకుంటూ, హృదయంలో భద్రంగా దాచుకోవాలి. అలాచేయడం, తన శిష్యులకు యేసు ఆజ్ఞాపించిన పనిని చేస్తుండగా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కనబర్చడంలో ఆయనను అనుకరించేందుకు మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 24:​14; 28:​19, 20) నిజానికి బైబిల్లో నిరీక్షణ అనేది దేవుని సేవకుల జీవితాల్లో హెచ్చుగా కనబడే విశ్వాసప్రేమలంత ప్రాముఖ్యమైనదిగా పేర్కొనబడింది.​—⁠1 కొరింథీయులు 13:​13.

మీరు ‘విస్తారమైన నిరీక్షణగలవారేనా’?

4 దేవుని ప్రజల ఎదుట అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో క్రీస్తుతోపాటు సేవ చేసేందుకు ఆతురతగా వేచి చూస్తుండగా, “వేరే గొఱ్ఱెల”కు చెందినవారు “దేవుని [భూసంబంధ] పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదు[మని]” నిరీక్షిస్తున్నారు. (యోహాను 10:​16; రోమీయులు 8:​19-21; ఫిలిప్పీయులు 3:​20) ఆ “మహిమగల స్వాతంత్ర్యము”లో పాపంనుండి భయంకరమైన దాని పర్యవసానాలనుండి విడుదల పొందడం ఇమిడివుంది. “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చే యెహోవా తన భక్తులకు శ్రేష్ఠమైనదే అనుగ్రహిస్తాడు.​—⁠యాకోబు 1:​17; యెషయా 25:⁠8.

5 క్రైస్తవ నిరీక్షణ మన జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర పోషించాలి? రోమీయులు 15:⁠13లో మనమిలా చదువుతాం: “మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.” అవును, నిరీక్షణను చీకటి గదిలోని క్రొవ్వొత్తితో కాదుగానీ, ఒక వ్యక్తి జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని, సంకల్పాన్ని, ధైర్యాన్ని నింపే తేజోవంతమైన సూర్యకిరణాలతో పోల్చవచ్చు. మనం దేవుని లిఖిత వాక్యాన్ని నమ్మి, ఆయన పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనం ‘విస్తారమైన నిరీక్షణగల’ వారమౌతామని గమనించండి. రోమీయులు 15:⁠4 ఇలా చెబుతోంది: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” కాబట్టి మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘మంచి బైబిలు విద్యార్థిగా దానిని ప్రతీరోజు చదువుతూ నా నిరీక్షణను నేను తేజోవంతంగా ఉంచుకుంటున్నానా? దేవుని పరిశుద్ధాత్మ కోసం నేనెల్లప్పుడూ ప్రార్థిస్తున్నానా?’​—⁠లూకా 11:​13.

6 మన మాదిరికర్తయైన యేసు, దేవుని వాక్యం మూలంగా బలం పుంజుకున్నాడు. మనం ఆయనను తలంచుకున్నప్పుడు మనం ‘అలసిపోము, మన ప్రాణాలు విసుగక’ ఉంటాయి. (హెబ్రీయులు 12:⁠3) దేవుడు మనకిచ్చిన నిరీక్షణ మన మనసుల్లో, హృదయాల్లో మందగిస్తే లేదా మన దృష్టి మరి వేటిమీదో అంటే వస్తుపరమైన లేదా లౌకికపరమైన లక్ష్యాలపై కేంద్రీకరించబడితే, మనం త్వరలోనే ఆధ్యాత్మికంగా అలసిపోవడమే కాక, చివరికది నైతిక బలాన్ని, ధైర్యాన్ని కోల్పోయేందుకు దారి తీస్తుందనేది స్పష్టం. ఆ మానసిక వైఖరితో మనం మన “విశ్వాసవిషయమైన ఓడ బద్దలై” పోవడాన్ని కూడా అనుభవించవచ్చు. (1 తిమోతి 1:​19) దానికి భిన్నంగా, నిజమైన నిరీక్షణ మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.

విశ్వాసానికి నిరీక్షణ ఆవశ్యకం

7 “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:⁠1) కాబట్టి, నిరీక్షణ, విశ్వాసంకన్నా అప్రధానమైనదేమీ కాదు; అది విశ్వాసానికి అత్యంత ఆవశ్యకం. అబ్రాహాము విషయమే పరిశీలించండి. మానవ దృక్కోణం నుండి చూస్తే, యెహోవా వారికొక వారసుణ్ణి వాగ్దానం చేసినప్పుడు ఆయనకు ఆయన భార్య శారాకు పిల్లల్ని కనే వయసు దాటిపోయింది. (ఆదికాండము 17:​15-17) అబ్రాహాము ఎలా స్పందించాడు? “తాననేక జనములకు తండ్రియగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.” (రోమీయులు 4:​18) అవును, అబ్రాహాముకు దేవుడిచ్చిన నిరీక్షణ ఆయనకు సంతానం కలుగుతుందనే విశ్వాసానికి పునాదివేసింది. ఆ విశ్వాసం తిరిగి ఆయన నిరీక్షణను తేజోవంతంచేసి బలపర్చింది. అంతేకాక, అబ్రాహాము శారాలు ధైర్యంగా తమ ఇంటిని, బంధువుల్ని విడిచిపెట్టి పరాయి దేశంలో గుడారాల్లో నివసించారు!

8 కష్టమైనా యెహోవాకు పూర్తిగా లోబడడం ద్వారా అబ్రాహాము తన నిరీక్షణను బలంగా ఉంచుకున్నాడు. (ఆదికాండము 22:​2, 12) అదేవిధంగా, యెహోవా సేవలో విధేయతను, సహనాన్ని చూపించడం ద్వారా మన బహుమానం విషయంలో నమ్మకంగా ఉండవచ్చు. “ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని” ఆ “నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 5:​3-5) అందుకే పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.” (హెబ్రీయులు 6:​11) యెహోవాతోవున్న సన్నిహిత సంబంధంపై ఆధారపడిన అలాంటి ఆశావహ దృక్కోణం ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా, ఆనందంగా ఎదుర్కొనేందుకు మనకు సహాయం చేయగలదు.

‘నిరీక్షణగలవారై సంతోషించండి’

9 దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఈ లోకమందించే వేటికన్నా సర్వోత్తమమైనది. కీర్తన 37:⁠34 ఇలా చెబుతోంది: “యెహోవాకొరకు కనిపెట్టుకొని [‘నిరీక్షిస్తూ,’ NW] యుండుము ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.” అవును, ‘నిరీక్షణగలవారమై సంతోషించేందుకు’ మనకు ప్రతీ కారణముంది. (రోమీయులు 12:​12) అయితే అలా సంతోషించేందుకు మనం మన నిరీక్షణ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆ నిరీక్షణను మీరు క్రమంగా ధ్యానిస్తుంటారా? చక్కని ఆరోగ్యంతో, ఏ చీకూచింతా లేకుండా, మీరు ప్రేమించే ప్రజలు మీ చుట్టూవున్నప్పుడు, నిజంగా సంతృప్తికరమైన పనిలో భాగంవహిస్తూ మీరు పరదైసులో ఉండడాన్ని ఊహించుకోగలరా? మన ప్రచురణల్లో చిత్రించబడిన పరదైసు దృశ్యాలను మీరు ధ్యానిస్తారా? అలా క్రమంగా ధ్యానించడాన్ని, సుందరమైన దృశ్యాలను చూసేందుకు మనం ఉపయోగించే కిటికీని పరిశుభ్రం చేయడంతో పోల్చవచ్చు. కిటికీ అద్దాన్ని మనం శుభ్రం చేయకపోతే, అది దుమ్ముపట్టి మనకు దృశ్యం స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపించకుండా చేస్తుంది. అలాంటప్పుడు మన దృష్టి వేరే విషయాల మీదికి వెళ్తుంది. అలా జరిగేందుకు మనమెన్నటికీ అనుమతించకుందము గాక!

10 అవును, యెహోవాపట్ల మనకున్న ప్రేమే ఆయనను సేవించేందుకు మనకున్న ముఖ్య కారణం. (మార్కు 12:​30) అయినప్పటికీ మనం బహుమానం కోసం ఆతురతతో ఎదురుచూడాలి. వాస్తవానికి మనమలా ఎదురుచూడాలని యెహోవా ఆశిస్తున్నాడు. హెబ్రీయులు 11:6 ఇలా చెబుతోంది: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” యెహోవా మనం తనను ఫలము దయచేయు వ్యక్తిగా దృష్టించాలని ఎందుకు కోరుతున్నాడు? ఎందుకంటే, మనమలా దృష్టించినప్పుడు, మన పరలోకపు తండ్రి మనకు బాగా తెలుసని మనం చూపిస్తాం. ఆయన ఉదారుడు, అంతేకాక ఆయన తన పిల్లలను ప్రేమిస్తాడు. మనకు ‘రాబోవుకాలపు నిరీక్షణ’ లేకపోతే మనమెంత అసంతోషంగా ఉంటామో, ఎంత సులభంగా నిరుత్సాహపడతామో ఆలోచించండి.​—⁠యిర్మీయా 29:​11.

11 దేవుడు తనకిచ్చిన నిరీక్షణపై దృష్టి కేంద్రీకరించిన అసాధారణ ఉదాహరణ మోషే. ‘ఫరో కుమార్తెయొక్క కుమారునిగా’ మోషేకు అధికారం, హోదా, ఐగుప్తు సంపద అందుబాటులో ఉన్నాయి. ఆయన వాటిని అనుసరిస్తాడా లేక యెహోవాను సేవిస్తాడా? మోషే ధైర్యంగా యెహోవాను సేవించేందుకే నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే, ఆయన “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచాడు.” (హెబ్రీయులు 11:​24-26) మోషే, యెహోవా తన ముందుంచిన నిరీక్షణ విషయంలో ఏ మాత్రం ఉదాసీనత ప్రదర్శించలేదు.

12 అపొస్తలుడైన పౌలు నిరీక్షణను శిరస్త్రాణంతో పోల్చాడు. మన అలంకారార్థ శిరస్త్రాణం మన మానసిక శక్తులను కాపాడుతూ, మనం జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు, సరైన ప్రాధమ్యాలు ఏర్పరచుకునేందుకు, యథార్థతను కాపాడుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:⁠8) మీరు మీ అలంకారార్థ శిరస్త్రాణాన్ని ఎల్లప్పుడూ ధరించుకుంటారా? అలాగైతే, మోషే, పౌలులాగే మీరు కూడా, ‘అస్థిరమైన ధనమునందు కాక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే’ మీ నిరీక్షణను ఉంచుతారు. నిజమే, స్వార్థపూరిత విషయాలను త్యజిస్తూ, జనసమ్మత పోకడలకు వ్యతిరేకంగా వెళ్లేందుకు ధైర్యం అవసరం, అయితే ఆ ప్రయత్నమెంతో ప్రయోజనకరం! నిజానికి, యెహోవాకొరకు నిరీక్షిస్తూ ఆయనను ప్రేమించేవారికోసం వేచివున్న “వాస్తవమైన జీవము”కన్నా తక్కువైనదానిని అంగీకరించడమెందుకు?​—⁠1 తిమోతి 6:​17, 18.

“నిన్ను ఏమాత్రమును విడువను”

13 ప్రస్తుత విధానంపై ఆశలు పెంచుకునే ప్రజలు, లోకంలో పెరుగుతున్న “వేదనలను”బట్టి రేపటి గురించి గంభీరంగా ఆలోచించాలి. (మత్తయి 24:⁠8) కానీ యెహోవాకొరకు నిరీక్షించేవారికి అలాంటి భయాలేమీ ఉండవు. వారు ‘సురక్షితముగా నివసిస్తూ, కీడు వస్తుందన్న భయంలేక నెమ్మదిగా ఉంటారు.’ (సామెతలు 1:​33) వారి నిరీక్షణ ఈ విధానంమీద కాదు కాబట్టి, వారు పౌలు ఇచ్చిన ఈ హితవును ఆనందంగా లక్ష్యపెడతారు: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.​—⁠నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.”​—⁠హెబ్రీయులు 13:⁠5.

14 “ఏమాత్రమును,” “ఎన్నడును” అనే ప్రస్ఫుటమైన ఈ పదాలు దేవుడు మనపట్ల శ్రద్ధ చూపిస్తాడని స్పష్టంగా చూపిస్తున్నాయి. దేవుని ప్రేమపూర్వక శ్రద్ధను గురించి మనకు హామీ ఇస్తూ యేసు కూడా ఇలా అన్నాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [జీవితానికవసరమైనవి] మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును.” (మత్తయి 6:​33, 34) తన రాజ్యం కోసం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అదే సమయంలో మన భౌతికావసరాలు తీర్చుకునే పూర్తి బాధ్యతను మోయడం కష్టమని యెహోవాకు తెలుసు. కాబట్టి ఆయన సామర్థ్యంపై, మన అవసరాలు తీర్చాలనే ఆయన కోరికపై పూర్తి నమ్మకముంచుదాం.​—⁠మత్తయి 6:​25-32; 11:​28-30.

15 మనం ‘కంటిని తేటగా’ ఉంచుకున్నప్పుడు, మనం యెహోవాపై ఆధారపడ్డామని చూపిస్తాం. (మత్తయి 6:​22, 23) కంటిని తేటగా ఉంచుకోవడంలో, దురాశ, స్వార్థపూరిత కోరికలు లేకుండా నిజాయితీగా, స్వచ్ఛమైన ఉద్దేశం కలిగివుండడం ఇమిడివుంది. కంటిని తేటగా ఉంచుకోవడమంటే, కడు బీదరికంలో జీవించడమనో లేక మన భౌతికావసరాలపట్ల శ్రద్ధ చూపించవలసిన మన క్రైస్తవ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయడమనో కాదు. బదులుగా, యెహోవా సేవకు ప్రథమస్థానమిస్తూ “ఇంద్రియ నిగ్రహమును” ప్రదర్శించడమని దానర్థం.​—⁠2 తిమోతి 1:⁠7.

16 కంటిని తేటగా ఉంచుకోవాలంటే విశ్వాసం, ధైర్యం అవసరం. ఉదాహరణకు, క్రైస్తవ కూటాలకు నియమించబడిన సమయాల్లో మీరు క్రమంగా పనిచేయాలని యజమాని బలవంతపెట్టినప్పుడు, మీ ఆధ్యాత్మిక ప్రాధాన్యతలకు ధైర్యంగా అంటిపెట్టుకుంటారా? యెహోవా తన సేవకులపట్ల శ్రద్ధ చూపిస్తాననే తన మాటను నెరవేరుస్తాడో లేదో అని ఒక వ్యక్తి అనుమానించినప్పుడు, సాతాను ఆ ఒత్తిడిని ఇంకా ఎక్కువ చేస్తాడు, ఫలితంగా అలాంటి వ్యక్తి కూటాలకు హాజరవడమే మానేయవచ్చు. అవును, మన విశ్వాసలేమి మన ప్రాధమ్యాలను నియంత్రించే అధికారాన్ని యెహోవాకు కాదుగానీ సాతానుకు ఇవ్వగలదు. అదెంత విషాదకరమో కదా!​—⁠2 కొరింథీయులు 13:⁠5.

‘యెహోవాకొరకు నిరీక్షించండి’

17 యెహోవాకొరకు నిరీక్షిస్తూ ఆయనను నమ్ముకునేవారు ఎప్పటికీ నిరాశ చెందరని లేఖనాలు పదేపదే చూపిస్తున్నాయి. (సామెతలు 3:​5, 6; యిర్మీయా 17:⁠7) అవును, కొన్నిసార్లు వారు తక్కువ సదుపాయాలతో తృప్తిపడాల్సిరావచ్చు, అయితే తమకోసం వేచివున్న ఆశీర్వాదాలతో పోల్చుకుని అదొక చిన్న త్యాగంగా పరిగణిస్తారు. ఆ విధంగా, వారు ‘యెహోవాకొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు’ లేదా నిరీక్షిస్తున్నట్లు ప్రదర్శించడమే కాక, ఆయన చివరకు తన భక్తుల నీతియుక్త హృదయవాంఛలన్నిటినీ తీరుస్తాడనే నమ్మకంతో ఉంటారు. (కీర్తన 37:​4, 34) కాబట్టి వారు ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. “నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.”​—⁠సామెతలు 10:​28.

18 ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చెయ్యిపట్టుకుని నడిచినప్పుడు వాడు సురక్షితంగా, భద్రంగా ఉన్నట్లు భావిస్తాడు. మన పరలోకపు తండ్రితో నడుస్తున్నప్పుడు మనం కూడా సురక్షితంగా, భద్రంగా ఉన్నట్లు భావిస్తాం. “నీకు తోడైయున్నాను భయపడకుము. . . . నీకు సహాయము చేయువాడను నేనే . . . నీ దేవుడనైన యెహోవానగు నేను​—⁠భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను” అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పాడు.​—⁠యెషయా 41:​10, 13.

19 అదెంతటి ప్రేమపూర్వక చిత్రీకరణో కదా​—⁠ఒక వ్యక్తి చేతిని యెహోవా పట్టుకోవడం! “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను” అని దావీదు వ్రాశాడు. (కీర్తన 16:⁠8) యెహోవాను మనమెలా మన “కుడి పార్శ్వమందు” ఉంచుకుంటాం? మనమలా కనీసం రెండు విధాలుగా చేయవచ్చు. మొదటిది, మన జీవితపు ప్రతీ అంశాన్ని ఆయన వాక్యం నిర్దేశించేందుకు అనుమతిస్తాం; రెండవది, యెహోవా మన ఎదుటవుంచిన మహిమగల బహుమానంపై మన దృష్టి కేంద్రీకరిస్తాం. కీర్తనకర్తయైన ఆసాపు ఇలా ఆలపించాడు: “నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను. నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.” (కీర్తన 73:​23, 24) అలాంటి అభయంతో మనం భవిష్యత్తును నమ్మకంతో ఎదుర్కోవచ్చు.

‘మీ విడుదల సమీపిస్తున్నది’

20 రోజులు గడుస్తున్నకొద్దీ, మనం యెహోవాను మన కుడి పార్శ్వమందు ఉంచుకోవడం అత్యవసరం. త్వరలోనే, అబద్ధమత నాశనంతో ప్రారంభమై సాతాను లోకం ఇప్పటివరకు అనుభవించని శ్రమను అనుభవిస్తుంది. (మత్తయి 24:​21) విశ్వాసరహిత మానవాళిని భయం ఆవహిస్తుంది. అయితే, ఆ గందరగోళ సమయంలో, నిర్భయంగావున్న యెహోవా సేవకులు తమ నిరీక్షణయందు ఆనందిస్తారు. “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది” అని యేసు చెప్పాడు.​—⁠లూకా 21:​28.

21 కాబట్టి మనం సాతాను తెలివిగా ప్రయోగించే ఆకర్షణలచేత మోసగించబడకుండా లేదా శోధించబడకుండా దేవుడు మనకిచ్చిన నిరీక్షణలో ఆనందిద్దాం. అదే సమయంలో విశ్వాసాన్ని, ప్రేమను, దైవభయాన్ని అలవర్చుకునేందుకు మనం కృషిచేద్దాం. అలా చేసినప్పుడు, అపవాదిని ఎదిరిస్తూ అన్నిరకాల పరిస్థితుల్లోనూ యెహోవాకు లోబడే ధైర్యం మనకుంటుంది. (యాకోబు 4:​7, 8) “యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.”​—⁠కీర్తన 31:​24.

[అధస్సూచి]

^ పేరా 3 క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “నిరీక్షణ” అనే పదం తరచూ అభిషిక్త క్రైస్తవుల పరలోక బహుమానానికి అన్వయించబడినా, ఈ ఆర్టికల్‌లో నిరీక్షణ సాధారణ భావంలో చర్చించబడింది.

మీరు జవాబివ్వగలరా?

•యేసుకున్న నిరీక్షణ ఆయన ధైర్యానికి ఏ విధంగా దోహదపడింది?

•విశ్వాసం, నిరీక్షణ ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగివున్నాయి?

•ఒక క్రైస్తవుడు తన జీవితంలో సరైన ప్రాధమ్యాలు ఏర్పరచుకునేందుకు విశ్వాసంతోపాటు నిరీక్షణ ఎలా ధైర్యాన్నిస్తుంది?

•‘యెహోవాకొరకు నిరీక్షించేవారు’ భవిష్యత్తు గురించి ఎందుకు నమ్మకంతో ఉండగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

1. నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమైనది, లేఖనాల్లో ఆ పదమెలా ఉపయోగించబడింది?

2. యేసు జీవితంలో నిరీక్షణ ఏ పాత్ర పోషించింది?

3. దేవుని సేవకుల జీవితాల్లో నిరీక్షణ ఏ పాత్ర పోషిస్తుంది?

4. అభిషిక్త క్రైస్తవులు వారి “వేరేగొఱ్ఱెల” సహవాసులు దేనికోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు?

5. మనమెలా ‘విస్తారమైన నిరీక్షణగల’ వారమౌతాం?

6. మన నిరీక్షణను తేజోవంతంగా ఉంచుకునేందుకు మనం ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి?

7. నిరీక్షణ ఏ విధంగా విశ్వాసానికి ఆవశ్యకం?

8. నమ్మకంగా సహించడం నిరీక్షణనెలా బలపరుస్తుంది?

9. ‘నిరీక్షణగలవారమై సంతోషించేందుకు’ మనం క్రమంగా ఏమిచేయడం మనకు సహాయం చేస్తుంది?

10. మనం బహుమానంవైపు చూడడం యెహోవాతో మన సంబంధంపై ఎందుకు అనుకూల ప్రభావం చూపిస్తుంది?

11. దేవుడు ఇచ్చిన నిరీక్షణ జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మోషేకు ఎలా సహాయం చేసింది?

12. క్రైస్తవ నిరీక్షణ ఎందుకు శిరస్త్రాణాన్ని పోలివుంది?

13. యెహోవా తన భక్తులకు ఎలాంటి అభయాన్నిస్తున్నాడు?

14. క్రైస్తవులు తమ భౌతికావసరాల గురించి ఎందుకు అధికంగా చింతించాల్సిన అవసరం లేదు?

15. క్రైస్తవులు ‘కంటిని తేటగా’ ఎలా ఉంచుకుంటారు?

16. కంటిని తేటగా ఉంచుకునేందుకు విశ్వాసం, ధైర్యం ఎందుకవసరం?

17. యెహోవాను నమ్ముకొనేవారు ఇప్పుడు కూడా ఎలా ఆశీర్వదించబడుతున్నారు?

18, 19. (ఎ) యెహోవా ఎలాంటి అభయాన్ని మనకిస్తున్నాడు? (బి) యెహోవాను మనమెలా మన “కుడి పార్శ్వమందు” ఉంచుకుంటాం?

20, 21. యెహోవాకొరకు నిరీక్షించేవారికోసం ఎలాంటి భవిష్యత్తు వేచి ఉంది?

[28వ పేజీలోని చిత్రం]

వృద్ధులైనా, యౌవనులైనా మిమ్మల్నిమీరు పరదైసులో చూసుకోగల్గుతున్నారా?