కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గినియాలో ఆధ్యాత్మిక నిధులను కనుగొనడం

గినియాలో ఆధ్యాత్మిక నిధులను కనుగొనడం

గినియాలో ఆధ్యాత్మిక నిధులను కనుగొనడం

అనేక శతాబ్దాలుగా అన్వేషకులు ప్రాణాలకు తెగించి, నిధులు, ఐశ్వర్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు. పశ్చిమ ఆఫ్రికాలోని గినియాకు చేరుకున్న అలాంటి సాహసవంతులు భౌతిక, ఆధ్యాత్మిక నిధులనే రెండు వేర్వేరు నిధులను కనుగొన్నారు. వజ్రాలు, బంగారం, ముడి ఇనుము, మేలిరకపు బాక్సైట్‌ (దీనినుండి అల్యూమినియమ్‌ సేకరించబడుతుంది) సమృద్ధిగా ఉన్న ఈ దేశంలో 90 లక్షలకన్నా ఎక్కువమంది నివసిస్తున్నారు.

ఆ దేశంలో క్రైస్తవమత సామ్రాజ్యపు మతాల ప్రభావం అంతగాలేకున్నా, అక్కడి ప్రజల్లో అనేకమంది ఆరాధనకు ప్రముఖ స్థానమివ్వడమే కాక, ఆధ్యాత్మిక నిధులను ఎంతో అమూల్యమైనవిగా ఎంచుతున్నారు. ఆ నిధులు వాస్తవానికి ఎవరిని సూచిస్తున్నాయి? హగ్గయి 2:7లో “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” అని వర్ణించబడిన యెహోవా నమ్మకమైన సేవకులను ఆ నిధులు సూచిస్తున్నాయి.

ఆధ్యాత్మిక నిధులు

దాచబడిన నిధుల కోసం నేలను లోతుగా త్రవ్వడానికి ఎంతో కృషి అవసరం. అలాగే క్రైస్తవ పరిచర్యలో ఆధ్యాత్మిక నిధులను కనుగొనడానికి ఎంతో కృషి అవసరం. గినియా మారుమూల ప్రాంతంలో రాజ్య ప్రకటనాపని 1950ల పడి తొలిభాగంలో ప్రారంభమైనా, 1960ల పడి తొలిభాగం వరకు అది రాజధాని అయిన కొనాక్రీకు చేరుకోలేదు. ఇప్పుడు అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న 21 సంఘాల్లో, గుంపుల్లో దాదాపు 900 మంది యెహోవాసాక్షులు ఉన్నారు.

ఈ దేశానికి 1987లో మిషనరీలు వచ్చారు, వారు కొనాక్రీలో ఉన్న ఏకైక సంఘంతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ రాజధానితోపాటు మారుమూల ప్రాంతాల్లో 20 కన్నా ఎక్కువమంది మిషనరీలు ఉన్నారు. వారు ఉత్సాహంగా సంఘాలను బలపరుస్తూ, స్థానికంగా ఉన్న సహోదరులతో కలిసి పరిచర్యలో పాల్గొంటున్నారు.

కొనాక్రీవాసి అయిన లూయిక్‌, ఆల్బర్ట్‌ అనే యువ వైద్యునితో బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు ఎంతో ఆనందించాడు. ఆల్బర్ట్‌ వివిధ చర్చీల్లో మత సంబంధమైన సత్యం కోసం వెదికాడు, అభిచార క్రియల్లో పాల్గొన్నాడు. తనను అదృష్టం వరిస్తుందనే హామీతో కర్ణపిశాచిగల వ్యక్తి ఇచ్చిన ఉంగరాన్ని ఆయన ధరించాడు. సత్య మతం కోసం తాను చేస్తున్న అన్వేషణలో ఎంతో నిరాశకు గురైన తర్వాత, ఆయన తన ఉంగరాన్ని పారేసి ఇలా ప్రార్థించాడు: “దేవుడా, నీవేగాని ఉనికిలో ఉంటే, నిన్ను తెలుసుకుని, నీ సేవచేసేందుకు నాకు అవకాశం కల్పించు. లేదా, నేను నా జీవితాన్ని నా ఇష్టానుసారంగానే గడుపుతాను.” ఆ తర్వాత కొద్దిరోజులకే, ఆల్బర్ట్‌ తన అక్క ఇంటికి వెళ్లాడు, అక్కడ ఒక యెహోవాసాక్షి తన అక్క కూతురితో బైబిలు అధ్యయనాన్ని చేస్తున్నప్పుడు వారి సంభాషణను విన్నాడు. లూయిక్‌ ఆల్బర్ట్‌తో బైబిలు అధ్యయనం చేయడానికి త్వరలోనే ఏర్పాట్లు చేయబడ్డాయి.

ఆల్బర్ట్‌తో అధ్యయనం చేయడానికి లూయిక్‌ ప్రతీవారం రానూ పోనూ దాదాపు పదికన్నా ఎక్కువ కిలోమీటర్లు ఆనందంగా నడిచివెళ్లేవాడు. లూయిక్‌ అంతగా చదువుకోకపోయినా, లేఖనాలపై ఆయనకున్న గట్టి విశ్వాసాన్నిబట్టి, బైబిలు జ్ఞానాన్ని అనుదిన జీవితానికి అన్వయించే పద్ధతినిబట్టి విశ్వవిద్యాలయ పట్టభద్రుడైన ఆల్బర్ట్‌ ఎంతో ముగ్ధుడయ్యాడు. మానవజాతి బాధలకు దేవుడు బాధ్యుడు కాడనీ, బదులుగా బాధలన్నిటినీ తొలగించి, భూమిని పరదైసుగా మార్చాలని యెహోవా సంకల్పించాడని తెలుసుకుని ఆల్బర్ట్‌ ఎంతో సంతోషించాడు. (కీర్తన 37:​9-11) బైబిలు సత్యాలతోపాటు సంఘ సభ్యుల్లో తాను చూసిన చక్కని ప్రవర్తన ఆల్బర్ట్‌ హృదయాన్ని స్పృశించింది.

అయితే, ముడివజ్రంలో మెరుపురావడానికి ఎలాగైతే దానిని నైపుణ్యవంతుడైన ఒక పనివాడు జాగ్రత్తగా సానపట్టాల్సివుంటుందో అలాగే దేవుని నీతియుక్త ప్రమాణాలకు అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆల్బర్ట్‌ లోకసంబంధమైన అనేక చెడు వైఖరులను విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన కర్ణపిశాచిగల వ్యక్తులను సంప్రదించడం ఆపేశాడు, తాగుడు మానేశాడు, జూదాన్ని వదిలేశాడు. పొగత్రాగడాన్ని మానేయడం ఆల్బర్ట్‌కు ఎంతో కష్టమనిపించింది. చివరకు ఆయన సహాయం కోసం యెహోవాకు తీవ్రంగా ప్రార్థించిన తర్వాత దానిని మానగలిగాడు. ఆరు నెలల తర్వాత ఆయన తన వివాహాన్ని చట్టబద్ధం చేసుకున్నాడు. ఆయన భార్య బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇప్పుడు వారిద్దరూ బాప్తిస్మం తీసుకున్న యెహోవా సేవకులుగా ఉన్నారు.

మార్టిన్‌ మరో ఆధ్యాత్మిక వజ్రం. ఆయనకు 15 ఏళ్లున్నప్పుడు గెకాడు పట్టణంలో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు. ఆయన యెహోవాసాక్షుల కూటాలకు హాజరుకావడాన్ని క్యాథలిక్కులైన ఆయన తల్లిదండ్రులు వ్యతిరేకించారు. వారు మార్టిన్‌ బైబిలు సాహిత్యాలను నాశనం చేసి, ఆయనను కొట్టి ఇంటినుండి వెళ్లగొట్టారు. కర్బనాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసినప్పుడు వజ్రమెలా ఏర్పడుతుందో, అలాగే వ్యతిరేకత కారణంగా బైబిలు సత్యంపట్ల మార్టిన్‌ ప్రేమ కూడా పెరిగింది. కొన్నాళ్లకు, ఆయన తల్లిదండ్రుల వైఖరి మెత్తబడి, ఆయనను తిరిగి ఇంటికి రానిచ్చారు. ఆయన తల్లిదండ్రుల వైఖరి ఎందుకు మారింది? వారు మార్టిన్‌ ప్రవర్తనకూ, చిన్నవారైన ఆయన తోబుట్టువుల ప్రవర్తనకూ మధ్య ఉన్న గొప్ప భేదాన్ని గమనించారు, ఆయన తోబుట్టువులు తిరుగుబాటు ధోరణిని అలవర్చుకొని, లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు. మార్టిన్‌ క్రొత్త విశ్వాసం ఆయనకు మేలు చేస్తుందని నమ్మకం కలిగిన తర్వాత ఆయన తండ్రి సంఘ సభ్యులను ఇంటికి ఆహ్వానించాడు. తమ అబ్బాయికి సహాయం చేయడానికి వారు చేసిన కృషికి ఆయన తల్లి సహోదరులకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలిపింది. మార్టిన్‌ 18 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకుని, కొన్నాళ్ల తర్వాత పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యాడు, ఆయన ఇప్పుడు ప్రత్యేక పయినీరు పరిచారకునిగా సేవచేస్తున్నాడు.

దిగుమతి చేసుకున్న ఆధ్యాత్మిక నిధులు

గినియా దాని ప్రకృతి వనరుల్లో అధికభాగం ఎగుమతి చేస్తుంది, అయితే దాని ఆధ్యాత్మిక నిధిలో కొంతభాగం మాత్రం “దిగుమతి చేసుకోబడింది.” సాధారణంగా అనేకమంది ఆర్థిక కారణాలనుబట్టి ఇతర ఆఫ్రికా దేశాల నుండి ఇక్కడికి వలసవచ్చారు. ఇతరులు ఎంతోకాలంగా కొనసాగుతున్న క్రూరమైన యుద్ధాల బారినుండి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చారు.

కామెరూన్‌కు చెందిన ఆర్నస్టెన్‌ 12 ఏళ్ల క్రితం గినియాకు వచ్చింది. ఆమె యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసి, ఎన్నో సంవత్సరాలు కూటాలకు హాజరైంది కానీ బాప్తిస్మం తీసుకోలేదు. అయితే 2003వ సంవత్సరంలో జరిగిన యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశంలో ఇతరులకు బాప్తిస్మం ఇవ్వబడుతుండడాన్ని చూసినప్పుడు ఆమె కళ్లు చెమర్చాయి. అపరాధ భావాలతో ఆమె యెహోవాకు ఇలా ప్రార్థించింది: “నాకిప్పుడు 51 ఏళ్లు, నేను నీ విషయంలో ఏ మంచిపనీ చేయలేదు. నేను నిన్ను సేవించాలనుకుంటున్నాను.” ఆ తర్వాత, ఆర్నస్టెన్‌ తాను వినయంగా చేసిన ప్రార్థనకు అనుగుణంగా చర్యతీసుకుంది. చట్టబద్ధంగా వివాహం చేసుకుంటేనే తాము కలిసి జీవించగలమని తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆమె వివరించింది. ఆయన దానికి అంగీకరించాడు, ఆ తర్వాత 2004 నవంబరులో బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆమె ఆనందభాష్పాలు రాల్చింది.

1990ల తొలిభాగం నుండి లైబీరియా, సియర్రాలియోన్‌ నుండి వందలాదిమంది యెహోవా సేవకులతోపాటు వేలాదిమంది శరణార్థులను గినియా ఆహ్వానిస్తోంది. శరణార్థులు శిబిరానికి చేరుకున్న వెంటనే క్రమంగా కూటాలు జరిగేలా సహోదరులు ఏర్పాటు చేసి, ప్రకటనా పనిని వ్యవస్థీకరించి, రాజ్యమందిరాన్ని నిర్మించారు. ఆ శరణార్థ శిబిరాల్లో కొంతమంది యెహోవా సేవకులయ్యారు. వారిలో ఐజక్‌ ఒకడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత తాను గతంలో పనిచేసిన పెద్ద లైబీరియన్‌ కంపెనీలో మళ్లీ పనిచేసే అవకాశం దొరికింది. అయితే, ఆయన లీనా శరణార్థుల శిబిరంలో క్రమ పయినీరుగా కొనసాగాలనే నిర్ణయించుకున్నాడు. ఆయన ఇలా వివరిస్తున్నాడు: “కూటాలకు లేక సమావేశానికి హాజరుకావడానికి నేనిప్పుడు నా యజమాని అనుమతి తీసుకోనవసరంలేదు. నేను స్వేచ్ఛగా యెహోవాను సేవించగలను.” ఈ మారుమూల శిబిరంలో 30,000 మంది శరణార్థులతోపాటు జీవిస్తున్న 150 మంది సాక్షుల కోసం 2003 డిసెంబరులో ఒక జిల్లా సమావేశం నిర్వహించబడింది. సంతోషకరంగా, దానికి 591 మంది హాజరయ్యారు, వారిలో సంజ్ఞా భాషా కార్యక్రమానికి హాజరైన 9 మంది బధిరులు కూడా ఉన్నారు. పన్నెండుమంది బాప్తిస్మం తీసుకున్నారు. తమకోసం ఆధ్యాత్మిక విందును ఏర్పాటుచేసే ప్రయత్నాల విషయంలో సహోదరులు ఎంతో కృతజ్ఞతలు చెల్లించారు.

“యిష్టవస్తువులు”గా ఉన్నవారు అవసరమైన మార్పులు చేసుకున్నారు

బంగారం, వజ్రాల కోసం అన్వేషించేవారికి ఏదీ పెద్ద ఆటంకంగా అనిపించదు. అయితే, యెహోవాను సేవించడంలో ఎదురయ్యే ఆటంకాలన్నిటినీ అధిగమించేందుకు క్రొత్తవారు చేసే ప్రయత్నాలను చూడడం సంతోషాన్నిస్తుంది. జాయినాబ్‌ విషయమే తీసుకోండి.

ఆమె 13 ఏళ్ల వయసులో నిర్బంధ బాలదాసిగా చేయబడింది. మరో పశ్చిమాఫ్రికా దేశంలో ఉన్న తన ఇంటి నుండి ఆమె గినియాకు తీసుకురాబడింది. ఆమె తన 20 ఏళ్ల వయసులో బైబిలు సందేశం విన్నది. తాను నేర్చుకుంటున్న విషయాలను అన్వయించుకునేందుకు ఆమె ఇష్టపడింది.

ఆరాధన కోసం జరిగే క్రైస్తవ కూటాలకు హాజరుకావడం జాయినాబ్‌కు కష్టమైంది. అయితే ఆమె కూటాలను ఎంతో విలువైనవిగా ఎంచి వాటికి తప్పకుండా హాజరుకావాలని నిశ్చయించుకుంది. (హెబ్రీయులు 10:​24, 25) కూటాలకు వెళ్తున్నప్పుడు తనతోపాటు తీసుకెళ్లేందుకు వీలుగా ఆమె తన పుస్తకాలను ఇంటి బయట దాచిపెట్టేది. ఆ ఆధ్యాత్మిక కూటాలకు హాజరవుతున్నందుకు ఆమె “యజమానులు” ఆమెను అనేక సందర్భాల్లో క్రూరంగా కొట్టారు.

ఆ తర్వాత పరిస్థితులు మారాయి, జాయినాబ్‌ దాసత్వం నుండి విడుదల చేయబడింది. ఆమె వెంటనే కూటాలన్నిటికీ హాజరవడం మొదలుపెట్టింది, త్వరితగతిన ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు అవి ఆమెకు సహాయం చేశాయి. క్రైస్తవ ఉపదేశాలను అందించే కూటాలకు హాజరుకావడానికి ఆటంకంగా మారగల అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆమె నిరాకరించింది. ఆమె దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరింది, బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలిగా తయారైంది, ఆ తర్వాత నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు సమర్పించుకుంది. అలా బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆమె సహాయ పయినీరు సేవచేసింది. ఆరు నెలల తర్వాత, క్రమ పయినీరు ప్రచారకురాలిగా సేవచేసేందుకు దరఖాస్తు పెట్టింది.

ఆసక్తిగల ఒక వ్యక్తి కొన్ని కూటాలు హాజరైన తర్వాత ఇలా చెప్పాడు: “నేనిక్కడ ఉన్నప్పుడు బీదవాణ్ణనే భావన నాలో కలుగదు.” అనేకమందికి గినియాలోని భౌతిక నిధులపట్ల మాత్రమే ఆసక్తివున్నా, యెహోవాను ప్రేమించేవారు మాత్రం ఆధ్యాత్మిక నిధుల కోసం ఉత్సాహంగా అన్వేషిస్తున్నారు. అవును, నేడు “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు”గా ఉన్నవారు యెహోవా స్వచ్ఛ ఆరాధనలోకి వస్తున్నారు!

[8వ పేజీలోని బాక్సు]

గినియా-2005

సాక్షుల శిఖరాగ్ర సంఖ్య: 883

బైబిలు అధ్యయనాలు: 1,710

జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారి సంఖ్య: 3,255

[8వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

గినియా

కొనాక్రీ

సియర్రా లియోన్‌

లైబీరియా

[9వ పేజీలోని చిత్రం]

ఆల్బర్ట్‌, లూయిక్‌

[9వ పేజీలోని చిత్రం]

కొనాక్రీలో ఉన్న రాజ్యమందిరం

[10వ పేజీలోని చిత్రం]

ఆర్నస్టెన్‌

[10వ పేజీలోని చిత్రం]

మార్టిన్‌

[10వ పేజీలోని చిత్రం]

జాయినాబ్‌

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

USAID