కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా?

దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా?

దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎలా?

తన గురించిన జ్ఞానాన్ని మానవులకు వెల్లడిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే విషయాన్ని కొందరు సందేహించవచ్చు. ఒకవేళ దేవుడు ఇష్టపడుతుంటే, ఎలా వెల్లడిచేస్తాడు?

దేవుడే స్వయంగా తన గురించి వెల్లడిచేస్తే తప్ప మానవులు తమంతట తామే దేవుని గురించి తెలుసుకోలేరని పదహారవ శతాబ్దానికి చెందిన ప్రొటస్టెంట్‌ సంస్కర్త జాన్‌ కాల్విన్‌ సరైన ముగింపుకే వచ్చాడు. అయితే, తన గురించిన జ్ఞానాన్ని వెల్లడిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే విషయాన్ని కొందరు సందేహించవచ్చు. ఒకవేళ దేవుడు ఇష్టపడుతుంటే, ఎలా వెల్లడిచేస్తాడు?

“సృష్టికర్త” అయిన యెహోవా చేసే ప్రతీ పనికి కారణం ఉంటుంది. అంతేకాక, “సర్వశక్తిగల దేవు[నిగా]” ఆయన తన సంకల్పాలను నెరవేర్చగల సమర్థుడు. (ప్రసంగి 12:⁠2; నిర్గమకాండము 6:⁠3) ఆయన తన సంకల్పాలను తెలియజేయడానికి సుముఖంగా ఉన్నాడనే విషయాన్ని మనం నమ్మవచ్చు ఎందుకంటే ప్రవక్తయైన ఆమోసు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” అయితే, దేవుడు కేవలం తన సేవకులకు, తనను యథార్థంగా ప్రేమించేవారికే తన సంకల్పాలను బయల్పరుస్తాడనే విషయాన్ని గమనించండి. ఆ విషయం సమంజసమైనది కాదా? మీరు మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి చెబుతారు? ఎవరికిపడితే వారికి చెబుతారా లేక మీ సన్నిహిత స్నేహితులకే చెబుతారా?​—⁠ఆమోసు 3:⁠7; యెషయా 40:​13, 25, 26.

దేవుని బుద్ధి, జ్ఞానం సరైనవిధంగానే వినయంగా ఉండేవారిలో భక్తిపూర్వక భయాన్ని నింపుతుంది. కానీ, మనం ఆ దైవిక బుద్ధి, జ్ఞానం నుండి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలంటే, కేవలం భక్తిపూర్వక భయం మాత్రమే సరిపోదు. దేవుని ఆలోచనలను తెలుసుకోవడానికి మనం వినయంగా ఉండాలని బైబిలు ఇలా నొక్కిచెబుతోంది: ‘నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనుము. జ్ఞానమునకు నీ చెవియొగ్గుము. హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించుము. తెలివి కోసం మొఱ్ఱపెట్టుము వివేచనకై మనవి చేయుము. వెండిని వెదకినట్లు దానిని వెదకుము.’​—⁠సామెతలు 2:​1-4.

ఆ విధంగా కృషి చేసే వినయస్థులు దేవుని గురించి నిజంగా తెలుసుకోగలుగుతారు. సామెతల పుస్తకంలోని ఆ మాటలు ఇంకా ఇలా చెబుతున్నాయి: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.” అవును, సత్యాన్ని యథార్థంగా వెదికేవారు “నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును” కనుగొంటారు.​—⁠సామెతలు 2:​6-9.

సత్యం కోసం అన్వేషించడం

ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రెలీజియన్‌ ఇలా అంటోంది: “మానవ జీవితంలో వాస్తవానికి అవాస్తవానికి, బలమైనదానికి బలహీనమైనదానికి, నిజమైనదానికి మోసకరమైనదానికి, స్వచ్ఛమైనదానికి కలుషితమైనదానికి, స్పష్టమైనదానికి అస్పష్టమైనదానికి, అలాగే నైతికత అనైతికతకు మధ్య తేడా గ్రహించాల్సిన అవసరతే ప్రాముఖ్యమైన అంశంగా ఉంది.” ఆ అవసరం తీర్చుకునేందుకు ప్రజలు ఎంతోకాలంగా సత్యాన్ని అన్వేషిస్తున్నారు. కీర్తనకర్త “సత్యదేవా” అని పిలిచిన యెహోవా గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంతగా ప్రయత్నించారో, అంతగా వారు దేవుణ్ణి గురించి తెలుసుకోగలిగారు.​—⁠కీర్తన 31:⁠5.

యెహోవా అనే పేరుకు ఆదిమ హెబ్రీ భాషలో అక్షరార్థంగా “తానే కర్త అవుతాడు” అని అర్థం. (ఆదికాండము 2:⁠4) కాబట్టి, ఆయన పేరుకున్న అర్థమే ఆయన సృష్టికర్త అనే విషయానికి, ఆయన సంకల్పంవైపుకు అవధానాన్ని మళ్ళిస్తుంది. నిజానికి, యెహోవా పేరును తెలుసుకుని దాన్ని ఉపయోగించడమే నిజమైన మతానికి గుర్తింపు చిహ్నమని చెప్పవచ్చు. యేసు ఆ వాస్తవాన్ని స్పష్టంగా గుర్తించాడు. తన శిష్యుల గురించి మాట్లాడుతూ ఆయన దేవునికి ఇలా ప్రార్థించాడు: “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.”​—⁠యోహాను 17:​26.

ప్రాచీన కాలానికి చెందిన హెబ్రీయుడైన యోసేపు కలల భావాన్ని విశదపరచి చెప్పాల్సివచ్చినప్పుడు దేవునితో తనకున్న స్నేహాన్నిబట్టి ఆయన ఎంతో నమ్మకంతో ఇలా చెప్పాడు: “భావములు చెప్పుట దేవుని అధీనమే గదా.”​—⁠ఆదికాండము 40:⁠8; 41:​15, 16.

అనేక శతాబ్దాల తర్వాత, బబులోను రాజైన నెబుకద్నెజరు చూసిన కలను అతని జ్ఞానులు వివరించలేకపోయారు. ప్రవక్తయైన దానియేలు ఆ రాజుతో ఇలా అన్నాడు: “మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను.”​—⁠దానియేలు 2:​28.

యెహోవాను సేవించేవారికే దేవుని బుద్ధి, జ్ఞానము లభిస్తుందని యోసేపు దానియేలుల ఉదాహరణలు చూపిస్తున్నాయి. అయితే దేవుని ఆమోదాన్ని పొందాలంటే మనం ఇదివరకు ఏర్పర్చుకున్న అభిప్రాయాలను విడిచిపెట్టాలన్నది స్పష్టం. మొదటి శతాబ్దంలోని యూదులు క్రైస్తవులుగా మారినప్పుడు వారు కూడా అలాగే చేయాల్సి వచ్చింది. యూదా విధానపు నియమాల్ని గౌరవించి, వాటికి విధేయులయ్యే వాతావరణంలో పెరిగినవారికి యేసును మెస్సీయగా అంగీకరించడానికి సమయం పట్టింది. ఆయన ‘రాబోవుచున్న మేలుల ఛాయగలదైన’ మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. (హెబ్రీయులు 10:⁠1; మత్తయి 5:​17; లూకా 24:​44, 45) ఆ కాలంలో, మోషే ధర్మశాస్త్రానికన్నా ఎంతో ఉన్నతమైన “క్రీస్తు నియమము” ఉనికిలోకి వచ్చింది.​—⁠గలతీయులు 6:⁠2; రోమీయులు 13:​10; యాకోబు 2:⁠8.

మనమందరం దేవునికి దూరమైపోయిన లోకంలో జన్మించాం. మొదటి మానవ దంపతులనుండి సంక్రమించిన పాపంవల్ల మనం దేవునికి శత్రువులుగా, ఆయన సంకల్పాల గురించిన జ్ఞానలేమితో జన్మించాం. అలాగే మనం మోసపూరితమైన హృదయాన్ని కూడా స్వాస్థ్యంగా పొందాం. (యిర్మీయా 17:⁠9; ఎఫెసీయులు 2:⁠12; 4:⁠18; కొలొస్సయులు 1:​21) దేవుని స్నేహాన్ని సంపాదించుకోవాలంటే, మనం మన ఆలోచనాసరళిని దేవుని ఆలోచనా సరళికి అనుగుణంగా మార్చుకోవడాన్ని నేర్చుకోవాలి. అలా చేయడం అంత సులభమేమీ కాదు.

అబద్ధమతానికి సంబంధించిన నమ్మకాల్ని, ఆచారాల్ని విడిచిపెట్టడం మనకు కష్టమనిపించవచ్చు, ప్రత్యేకంగా మనం వాటిని చిన్నప్పటినుండి పాటిస్తున్నట్లైతే మరింత కష్టంగా ఉండవచ్చు. అయితే ఆ మార్గం తప్పని తెలిసినా అందులోనే కొనసాగడం జ్ఞానయుక్తమేనా? ఎంతమాత్రం కాదు! ఒక వ్యక్తి తన ఆలోచనా సరళిని మార్చుకుని దేవుని ఆమోదాన్ని పొందడమే నిశ్చయంగా జ్ఞానయుక్తం.

దేవుని ఉపదేశ మాధ్యమాన్ని గుర్తించడం

సత్య వాక్యాన్ని అర్థం చేసుకుని, దాని ప్రకారం జీవించేలా మనకెక్కడ సహాయం లభించగలదు? ప్రాచీన ఇశ్రాయేలులో దేవుడు తన నమ్మకమైన, విశ్వసనీయులైన వ్యక్తుల్ని బాధ్యతాయుత స్థానాల్లో ఉంచి, వారి ద్వారా నడిపింపును అందించాడు. నేడు క్రైస్తవ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు కూడా యథార్థంగా సత్యం కోసం వెదికేవారిని అలాగే నడిపిస్తున్నాడు. నేడు క్రీస్తు నమ్మకస్థులైన, విశ్వసనీయులైన తన అనుచరులను సంస్థీకరించబడిన మాధ్యమంగా ఉపయోగిస్తూ వారి ద్వారా సత్యం కోసం యథార్థంగా వెదికేవారిని సంరక్షిస్తూ నడిపింపునిస్తున్నాడు. (మత్తయి 24:​45-47; కొలొస్సయులు 1:​18) అయితే దేవుని ఉపదేశ మాధ్యమాన్ని మనమెలా గుర్తించవచ్చు?

యేసుక్రీస్తు మానవునిగా ఉన్నప్పుడు ఆయన కనబరిచిన లక్షణాలనే యేసు నిజమైన అనుచరులు కనబరచడానికి కృషి చేస్తారు. దుష్టత్వం పెచ్చరిల్లుతున్న ఈ లోకంలో, యేసు అనుచరులు కనబరిచే అలాంటి ఆధ్యాత్మిక లక్షణాలనుబట్టి వారిని సులభంగా గుర్తించవచ్చు. (6వ పేజీలోని బాక్సును చూడండి.) మీరు అవలంబిస్తున్న మతంలోకాని, మీ పొరుగువారు అవలంబిస్తున్న మతాల్లోగాని ఆ లక్షణాలు కనబడుతున్నాయా? ఈ విషయాన్ని మీరు బైబిలును ఉపయోగిస్తూ పరిశీలించడం మీకు తప్పకుండా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

మా పాఠకులైన మిమ్మల్ని బైబిలు అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని పరిశీలించాలని మేము ఆహ్వానిస్తున్నాం. గత సంవత్సరం 235 దేశాల్లో సగటున 60,00,000 మంది లేదా కుటుంబాలు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ద్వారా ఈ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందాయి. దేవుని బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకునే కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ, సంతృప్తినిస్తూ, ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కాబట్టి దేవుని బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనే ప్రయాణాన్ని మీరు ఎందుకు మొదలుపెట్టకూడదు? ఈ ప్రయాణం మొదలుపెట్టినందుకు మీరు ఎప్పటికీ బాధపడరు. అవును, మీరు నిజంగా దేవుని గురించి తెలుసుకోవచ్చు!

[6వ పేజీలోని బాక్సు]

దేవునికి అంగీకృతంగా జీవించే ప్రజలు వీటిని చేస్తారు

రాజకీయాల్లో ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటారు. ​—⁠యెషయా 2:⁠4.

దేవుని చిత్తం చేయడం ద్వారా మంచి ఫలాలను ఫలిస్తారు.​—⁠మత్తయి 7:​13-23.

తమ మధ్య నిజమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ​—⁠యోహాను 13:​35; 1 యోహాను 4:​20.

ఏ ప్రాంతంలో ఉన్నా ఏక భావంతో మాట్లాడతారు. ​—⁠మీకా 2:​12.

తమ చుట్టూ ఉన్న లోకంలోని ప్రజల చెడు వైఖరులను, ప్రవర్తనను అనుకరించరు.​—⁠యోహాను 17:​16.

సత్యానికి సాక్ష్యమిస్తూ శిష్యులను చేస్తారు. ​—⁠మత్తయి 24:​14; 28:​19, 20.

ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి క్రమంగా సమకూడడంలో ఆనందిస్తారు.​—⁠హెబ్రీయులు 10:​24.

అంతర్జాతీయ గుంపుగా దేవుణ్ణి స్తుతిస్తారు. ​—⁠ప్రకటన 7:​9, 10.

[7వ పేజీలోని చిత్రాలు]

దేవుని జ్ఞానాన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా సంపాదించుకోవాలి