కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం నిజంగా దేవుని గురించి తెలుసుకోగలమా?

మనం నిజంగా దేవుని గురించి తెలుసుకోగలమా?

మనం నిజంగా దేవుని గురించి తెలుసుకోగలమా?

“అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను . . . ఎరుగుటయే నిత్యజీవము.”​—⁠యోహాను 17:⁠3.

“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (రోమీయులు 11:​33) ఆ మాటలనుబట్టి దేవుని బుద్ధిని, జ్ఞానాన్ని గ్రహించడం మానవుల వశంలో లేదనీ, అందువల్ల దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవడం అసాధ్యమనే నిర్ధారణకు రావాలా?

మతాసక్తిపరులైన కొందరు దేవుని గురించి తెలుసుకోవడం అసాధ్యమనే నమ్ముతున్నారు. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రెలీజియన్‌ ఆ తత్వాన్ని గురించి ఇలా చెబుతోంది: “దేవుడు తన గురించిన జ్ఞానాన్ని మానవుల గ్రహింపుకు అతీతంగా ఉంచుతాడు. . . . దేవునికి పేరుపెట్టలేం, ఆయనను నిర్వచించలేం. ఎలాంటి పేరైనా, నిర్వచనమైనా ఆయనకు పరిమితులు విధిస్తాయి, అయితే దేవునికి పరిమితులు లేవు . . . ఆయనను తెలుసుకోలేం, ఆయనను తెలుసుకోవడం అసాధ్యం.”

న్యూస్‌వీక్‌ పత్రిక ప్రకారం, లౌకికవాద సమాజాల్లోని అనేకులు, “ఉన్నదల్లా ఒకటే సత్యం, ఆ సత్యమేమిటంటే అసలు సత్యమనేదే లేదు” అనే “ఓ క్రొత్త నమ్మకం” వైపు మొగ్గుచూపుతున్నారు.

అయినా, అనేకమందికి జీవితంలోని సంకల్పాన్ని గురించిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. పేదరికం, అనారోగ్యం, దౌర్జన్యంవంటి హృదయవిదారక సమస్యలను వారు గమనిస్తున్నారు. అలాంటివారికి జీవితం క్షణప్రాయంగా ఉండడం తీవ్ర ఆందోళనను కలిగించేదిగా ఉండవచ్చు. వారు ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలని ఎంతగానో కోరుకోవచ్చు, అయితే వాటిని కనుగొనలేనప్పుడు అసలు సమాధానాలే లేవనే నిర్ధారణకు వారు చేరుకోవచ్చు. అందుకే, అలాంటి ప్రజల్లో అనేకులు సంస్థీకృత మతానికి దూరంగా ఉంటూ, ఒకవేళ వారికి దేవుడున్నాడనే నమ్మకం ఇంకా ఉంటే తామే స్వయంగా దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

బైబిలు దృక్కోణం

బైబిలుపట్ల సదభిప్రాయం ఉండి, యేసుక్రీస్తును దేవుని ప్రతినిధిగా అంగీకరించేవారు బైబిలు దృక్కోణమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగివుండాలి. యేసు ఒక సందర్భంలో, “నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, . . . జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది” అని చెబుతూ రెండు మార్గాల గురించి మాట్లాడడాన్ని మీరు గుర్తుచేసుకోవచ్చు. ఆ రెండు మార్గాల్లో నడిచేవారిని ఎలా గుర్తుపట్టవచ్చో వివరిస్తూ ఆయనిలా అన్నాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు.” అవి ఎలాంటి ఫలాలు? వారు పలికే మాటల ద్వారా కాదు, వారు చేసే క్రియల ద్వారానే వారిని గుర్తుపట్టవచ్చని యేసు చెప్పిన ఈ మాటల ద్వారా స్పష్టమౌతుంది: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.” దేవునిపై నమ్మకముందని చెప్పుకోవడం మాత్రమే సరిపోదు. మనం ఆయన చిత్తం చేయాలి. కాబట్టి మనం ముందుగా దేవుని చిత్తాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.​—⁠మత్తయి 7:​13-23.

దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం మానవులకు సాధ్యమేనని యేసు స్పష్టంగా చూపించాడు. ఆయనిలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) దేవుడు బయల్పరిచే బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోగలమనేది స్పష్టం, అయితే వాటిని సంపాదించుకునేందుకు కృషి అవసరం. అలా చేసేవారికి దేవుడు నిరంతర జీవితమనే బహుమానాన్ని ఇస్తాడు కాబట్టి, ఆ కృషి ప్రయోజనకరమైనదే.

[4వ పేజీలోని చిత్రం]

ఇరుకు మార్గం జీవానికి నడిపిస్తుందని యేసు చెప్పాడు