కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ జీవన విధానం ద్వారా మీ విశ్వాసాన్ని నిరూపించుకోండి

మీ జీవన విధానం ద్వారా మీ విశ్వాసాన్ని నిరూపించుకోండి

మీ జీవన విధానం ద్వారా మీ విశ్వాసాన్ని నిరూపించుకోండి

“విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.”​—⁠యాకోబు 2:​17.

తొలి క్రైస్తవులు చాలావరకు తమ జీవన విధానం ద్వారా తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. యాకోబు క్రైస్తవులందరికీ ఇలా ఉద్బోధించాడు: ‘మీరు వినువారు మాత్రమై ఉండక వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.’ ఆయనింకా ఇలా అన్నాడు: “ప్రాణము లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.” (యాకోబు 1:​22; 2:​26) ఆయనలా వ్రాసిన దాదాపు 35 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు సరైన క్రియలద్వారా తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటూ ఉన్నారు. విచారకరంగా కొందరలా నిరూపించుకోలేదు. యేసు స్ముర్నలోని సంఘాన్ని మెచ్చుకున్నాడు, అయితే, సార్దీస్‌లోవున్న సంఘంలోని అనేకులకు ఆయనిలా చెప్పాడు: “నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే.”​—⁠ప్రకటన 2:​8-11; 3:⁠1.

2 అలా యేసు సార్దీస్‌లో ఉన్నవారినీ, విస్తృతార్థంలో ఆ తర్వాత తన మాటలు చదివేవారినీ క్రైస్తవ సత్యంపట్ల తమకున్న మొదటి ప్రేమను నిరూపించుకుంటూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండమని ప్రోత్సహించాడు. (ప్రకటన 3:​2, 3) మనలో ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా క్రియలు ఎలా ఉన్నాయి? ప్రకటనాపనికి లేదా సంఘ కూటాలకు నేరుగా సంబంధంలేని రంగాల్లో సహితం నా పనులన్నింటి ద్వారా నా విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నానని నా క్రియలు స్పష్టంగా చూపిస్తున్నాయా?’ (లూకా 16:​10) జీవితంలోని అనేక రంగాల్ని పరిశీలించవచ్చు, అయితే మనం తరచూ క్రైస్తవ వివాహాల తర్వాత ఏర్పాటు చేయబడే పార్టీలతోపాటు విందులు అనే ఒకే విషయాన్ని పరిశీలిద్దాం.

చిన్న పార్టీలు

3 సంతోషభరిత క్రైస్తవుల విందుకు ఆహ్వానించబడడాన్ని మనలో చాలామంది ఆనందిస్తాం. తన సేవకులు ఆనందంగా ఉండాలని కోరుకునే యెహోవా “సంతోషంగా ఉండే దేవుడు.” (1 తిమోతి 1:​11, NW) ఆయన ఈ వాస్తవాన్ని బైబిల్లో సొలొమోను చేత వ్రాయించాడు: “అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటె మనుష్యులకు లాభకరమైన దొకటియులేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడవలెనని . . . ఇదియే వారికి తోడుగానున్నది.” (ప్రసంగి 3:​1, 4, 13; 8:​15) కుటుంబ సమేతంగా భోజనం చేస్తున్నప్పుడు లేదా చిన్నగావుండే సత్యారాధకుల పార్టీల్లో అలా సంతోషించవచ్చు.​—⁠యోబు 1:​4, 5, 18; లూకా 10:​38-42; 14:​12-14.

4 మీరు అలాంటి విందును ఏర్పాటుచేస్తూ దానికి బాధ్యత వహిస్తున్నట్లయితే, భోజనం చేయడానికి సరదాగా మాట్లాడుకోవడానికి కొద్దిమంది విశ్వాసులను మాత్రమే ఆహ్వానిస్తున్నా, మీ ప్రణాళిక ఏమిటో జాగ్రత్తగా ఆలోచించాలి. (రోమీయులు 12:​13) “పైనుండివచ్చు జ్ఞానము”తో నిర్దేశించబడుతూ “సమస్తమును మర్యాదగా” జరగాలని మీరు కోరుకుంటారు. (1 కొరింథీయులు 14:​39; యాకోబు 3:​17) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. అభ్యంతరము కలుగజేయకుడి.” (1 కొరింథీయులు 10:​31, 32) ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాల్సిన కొన్ని విషయాలేమిటి? అలాంటి వాటి గురించి ముందే ఆలోచించడం మీరు, మీ అతిథులు మీ విశ్వాసాన్ని కనబరిచే క్రియలు చేసేందుకు సహాయం చేయగలదు.​—⁠రోమీయులు 12:⁠2.

ఆ విందు ఎలావుండాలి?

5 చాలామంది అతిథేయులు మద్యాన్ని అందించాలా వద్దా అనే మీమాంసను ఎదుర్కొన్నారు. విందును ఆహ్లాదకరంగా ఉంచాలంటే దాని అవసరం లేదు. యేసు తనవద్దకు వచ్చిన అనేకమందికి ఆహారం పెట్టాడు, ఆయన తమదగ్గర ఉన్న రొట్టెలను చేపలను ఎక్కువచేశాడు. ద్రాక్షారసమెలా అద్భుతంగా ఇవ్వాలో ఆయనకు తెలిసినప్పటికీ, ఆయన దానిని అలా అందించాడని ఆ వృత్తాంతం చెప్పడం లేదు. (మత్తయి 14:​14-21) విందులో మద్యం అందించాలని మీరనుకుంటే, అది మితంగా ఉండేలా జాగ్రత్త వహించడమేకాక, ఇష్టపడేవారి కోసం సాదా పానీయాల్లాంటివి కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలి. (1 తిమోతి 3:​2, 3, 8; 5:​23; 1 పేతురు 4:⁠3) “సర్పమువలె” కరిచే పానీయం సేవించమని ఎవరినీ బలవంతం చేయకూడదు. (సామెతలు 23:​29-32) మరి సంగీతం లేదా పాటలు పాడే విషయమేమిటి? విందులో సంగీతం కూడావుంటే, మీరు నిస్సందేహంగా రాగాన్ని, సాహిత్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ పాటలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. (కొలొస్సయులు 3:⁠8; యాకోబు 1:​21) కింగ్‌డం మెలొడీస్‌ ప్లే చేయడం లేదా అలాంటి పాటలు కలిసి పాడడం చక్కని వాతావరణానికి దోహదపడుతుందని చాలామంది క్రైస్తవులు కనుగొన్నారు. (ఎఫెసీయులు 5:​19, 20) అలాగే సంగీతం చక్కని సంభాషణకు అడ్డురాకుండా లేదా పొరుగువారిని చికాకుపెట్టకుండా ఉండేందుకు వాల్యుమ్‌ను క్రమంగా పరిశీలిస్తూ ఉండాలి.​—⁠మత్తయి 7:​12.

6 విందు సమయంలో క్రైస్తవులు వివిధ విషయాల గురించి మాట్లాడవచ్చు, దేన్నైనా బిగ్గరగా చదవచ్చు లేదా ఆసక్తికరమైన అనుభవాలు వివరించవచ్చు. సంభాషణ దారిమళ్లితే అతిథేయి దానిని యుక్తిగా దారిలోకి తీసుకురావచ్చు. ఒక్కరే కాక అందరూ సంభాషించేలా ఆయన చూడాలి. ఇతరులకు అవకాశమివ్వకుండా ఒక్కరే మాట్లాడుతున్నారని ఆయన గమనిస్తే, యుక్తిగా ఇతరులు కూడా మాట్లాడేలా చేయాలి, బహుశా యౌవనుల్ని మాట్లాడమని ప్రోత్సహించడం ద్వారా లేదా ఇతరులు మాట్లాడేందుకు పురికొల్పే విషయం గురించి నేర్పుగా ప్రస్తావించడం ద్వారా ఇతరులు కూడా మాట్లాడేలా చేయాలి. విందుకు వచ్చినప్పుడు యౌవనులు, వృద్ధులు అలా మాట్లాడేందుకు ఆనందిస్తారు. విందు ఏర్పాటు చేసిన వ్యక్తిగా మీరు పరిస్థితిని జ్ఞానయుక్తంగా, నేర్పుగా నిర్దేశిస్తే, వచ్చినవారికి మీ వివేచన లేదా ‘సహనం’ తెలుస్తుంది. (ఫిలిప్పీయులు 4:⁠5) మీ విశ్వాసం క్రియాపూర్వకంగా ఉన్నట్లు, మీ జీవితంలోని అన్ని రంగాల్ని అది ప్రభావితం చేస్తున్నట్లు వారు గ్రహిస్తారు.

వివాహ ఆచరణలు, వివాహ విందులు

7 క్రైస్తవ వివాహం ఆనందించేందుకు ఒక ప్రత్యేక సందర్భాన్నిస్తుంది. యేసు, ఆయన శిష్యులతోపాటు దేవుని ప్రాచీన సేవకులు విందుకూడా ఉన్న అలాంటి ఆనందకర సందర్భాలకు ఇష్టపూర్వకంగా హాజరయ్యారు. (ఆదికాండము 29:​21, 22; యోహాను 2:​1, 2) అయితే, వివాహాలకు సంబంధించిన విందులకోసం చేసే ఏర్పాట్లలో మంచి వివేచన, క్రైస్తవ సమతుల్యత ప్రతిబింబించాలంటే ప్రత్యేక కృషి అవసరమని ఇటీవల సంవత్సరాల్లోని అనుభవం స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఇలాంటి విందులు జీవితంలో సామాన్య అంశాలుగావుండి, ఒక క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తాయి.

8 దైవిక సూత్రాలు తెలియని లేదా వాటిని పట్టించుకోని చాలామంది వివాహ వేడుకను అన్నింటినీ అతిగా చేయగల సందర్భమన్నట్లుగా దృష్టిస్తారు లేదా అలాంటి సందర్భంలో అతిగా చేయడాన్ని మన్నిస్తారు. ఒక యురోపియన్‌ పత్రికలో, ఒక నవవధువు “అత్యంత ఆడంబరంగా” జరిగిన తన వివాహాన్ని గురించి ఇలా చెప్పింది: ‘వరుసగా పన్నెండు గుర్రపు బండ్లు, ఒక బండిలో బ్యాండు మేళం వెంటరాగా మేము నాలుగు గుర్రాల బండిలో ఊరేగింపుగా వెళ్లాం. ఆ తర్వాత అనేక రకాల వంటకాలను ఆరగిస్తూ, అద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదించాం; అది అత్యంత మనోహరం. నేను కోరుకున్న విధంగా, ఆ రోజుకు నేనే రాణిని.’

9 ఆయా దేశాల్లో ఆచారాలు వివిధ రకాలుగావున్నప్పటికీ, ప్రజల మనోభావాలు మాత్రం అపొస్తలుడైన యోహాను వ్రాసిన ఈ మాటల్నే స్పష్టంగా రుజువు చేస్తున్నాయి: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:​16, 17) పరిణతిచెందిన క్రైస్తవ జంట అద్భుత కథల్లో వర్ణించినలాంటి రిసెప్షన్‌తో “అత్యంత ఆడంబరంగా” పెళ్లి చేసుకోవాలని కోరుకోవడాన్ని మీరు ఊహించుకోగలరా? బదులుగా వారి దృక్కోణం “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అనే మాటల్ని పరిగణలోకి తీసుకునేదిగా ఉండాలి.​—⁠1 యోహాను 2:​16, 17.

10 క్రైస్తవ దంపతులు ఇటు వాస్తవిక దృక్పథంతో అటు వివేచనతో ఉండాలని కోరుకుంటారు, అయితే బైబిలు వారికి సహాయం చేయగలదు. పెళ్లిరోజు విశేష సందర్భమే అయినా, అది నిత్యజీవ ఉత్తరాపేక్షగల ఇద్దరు క్రైస్తవుల వివాహ జీవితానికి ఆరంభం మాత్రమే అని వారికి తెలుసు. భారీయెత్తున వివాహ విందు ఏర్పాటు చేయాల్సిన అవసరం వారికి లేదు. వారొకవేళ విందు ఏర్పాటు చేయాలనుకుంటే, ఆ విందుకయ్యే ఖర్చును లెక్కచూసుకొని, అది ఏ విధంగా ఉండాలో వారు ముందే ఆలోచిస్తారు. (లూకా 14:​28) వారి క్రైస్తవ జీవితంలో భర్త లేఖనాధార శిరస్సుగా ఉంటాడు. (1 కొరింథీయులు 11:⁠3; ఎఫెసీయులు 5:​22, 23) కాబట్టి వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ప్రాథమిక బాధ్యత పెళ్లికుమారునిదే. అయితే, వివాహ విందుకు ఎవరిని పిలవాలి, ఎంతమందిని పిలవవచ్చు వంటి విషయాల గురించి ఆయన ప్రేమపూర్వకంగా తన కాబోయే భార్యను సంప్రదిస్తాడు. బహుశా వారి స్నేహితులను, బంధువులను అందరినీ ఆహ్వానించడం సాధ్యంకాకపోవచ్చు లేదా ఆచరణయోగ్యంగా ఉండకపోవచ్చు; కాబట్టి జాగ్రత్తగా కొన్ని నిర్ణయాల్ని తీసుకోవాల్సివుంటుంది. తోటి క్రైస్తవుల్ని కొందరిని ఆహ్వానించలేకపోతే వారు పరిస్థితిని అర్థం చేసుకుంటారనే, బాధపడరనే నమ్మకంతో ఆ జంట ఉండాలి.​—⁠ప్రసంగి 7:⁠9.

“విందు ప్రధాని”

11 ఒక జంట వివాహ విందును ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆ సందర్భం గౌరవనీయంగా ఉండేలా వారు ఎలా చూసుకోవచ్చు? యెహోవాసాక్షులు కొన్ని దశాబ్దాలుగా, కానాలో యేసు హాజరైన విందుకు సంబంధించి పేర్కొనబడిన ఒక అంశాన్ని చేర్చడంలోని వివేకాన్ని గుర్తించారు. అక్కడ బాధ్యతగల తోటి విశ్వాసి ‘విందు ప్రధానిగా’ ఉన్నాడు. (యోహాను 2:​9, 10) అదేవిధంగా, జ్ఞానవంతుడైన పెళ్లికుమారుడు ఆధ్యాత్మికంగా పరిణతిచెందిన సహోదరుణ్ణి ఆ కీలకమైన పాత్ర పోషించేందుకు ఎంచుకుంటాడు. పెళ్లికుమారుని ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకున్న ఆ ప్రధాని విందుకు ముందు విందు సమయంలో వాటిని జాగ్రత్తగా అనుసరిస్తాడు.

12 ఐదవ పేరాలో చర్చించిన విషయాలకు అనుగుణంగా కొందరు దంపతులు మద్యపానీయాల దుర్వినియోగం వివాహ సందర్భ విజయాన్ని, ఆనందాన్ని పాడుచేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని అందించకూడదని నిర్ణయించుకోవచ్చు. (రోమీయులు 13:​13; 1 కొరింథీయులు 5:​11) ఒకవేళ మద్యం అందించాలనుకుంటే, పెళ్లికుమారుడు అది కేవలం మితంగా అందించబడేలా లేదా అందుబాటులో ఉండేలా చూడాలి. కానాలో యేసు హాజరైన విందులో ఆయన మంచి ద్రాక్షారసాన్ని సరఫరా చేశాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ విందు ప్రధాని ఇలా వ్యాఖ్యానించాడు: “ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావు.” (యోహాను 2:​10) యేసు త్రాగుబోతుతనాన్ని ఆమోదయోగ్యం కానిదిగా భావించాడు కాబట్టి, ఆయన దానిని ప్రోత్సహించలేదు. (లూకా 12:​45, 46) ద్రాక్షారసపు నాణ్యతపట్ల తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఆ ప్రధాని వివాహానికి వచ్చిన అతిథులు కొందరు మత్తుగా త్రాగిన సందర్భాలను తాను గమనించినట్లు స్పష్టం చేశాడు. (అపొస్తలుల కార్యములు 2:​15; 1 థెస్సలొనీకయులు 5:⁠7) కాబట్టి పెళ్లికుమారుడు, ఆయన విందు ప్రధానిగా నియమించే నమ్మకమైన క్రైస్తవుడు స్పష్టమైన ఈ నిర్దేశాన్ని హాజరైనవారందరూ అనుసరించేలా చూడాలి: “మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు.”​—⁠ఎఫెసీయులు 5:​18; సామెతలు 20:⁠1; హోషేయ 4:​11.

13 ఇతర విందుల్లాగే ఒకవేళ సంగీతం ఏర్పాటుచేస్తే, దాని వాల్యూమ్‌ సంభాషణకు ఆటంకం కలిగించని రీతిలో ఉండేలా శ్రద్ధ చూపించాలి. ఒక క్రైస్తవ పెద్ద ఇలా అన్నాడు: “సాయంత్ర సమయం గడిచేకొద్దీ సంభాషణ మరింత ఉత్సాహంగా మారినప్పుడు లేదా డ్యాన్సు చేయడం ఆరంభించినప్పుడు కొన్నిసార్లు సంగీతపు వాల్యూమ్‌ పెరుగుతుంది. మెల్లగా నేపథ్యపు సంగీతంగా ప్రారంభమైన ఆ సంగీతం వాల్యుమ్‌ పెరిగినప్పుడు సంభాషణకు ఆటంకంగా మారవచ్చు. వివాహ విందు ఆహ్లాదకరమైన సహవాసానికి చక్కని అవకాశమిస్తుంది. అయితే అలాంటి అవకాశాన్ని బిగ్గరగావచ్చే సంగీతం పాడుచేయడం ఎంత బాధాకరమో కదా!” ఈ సందర్భంలో కూడా పెళ్లికుమారుడు, విందు ప్రధాని వీరిద్దరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, సంగీతకారులు వృత్తిరీత్యా వచ్చినవారైనా, కాకపోయినా ఎలాంటి సంగీతం ఉండాలి అనేది నిర్ణయించడాన్ని గానీ, వాల్యుమ్‌ను నియంత్రించే బాధ్యతను గానీ వారికి అప్పగించకూడదు. పౌలు ఇలా వ్రాశాడు: ‘మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను సమస్తమును ప్రభువైన యేసు పేరట చేయుడి.’ (కొలొస్సయులు 3:​17) అతిథులు వివాహ విందు (లేదా రిసెప్షన్‌) తర్వాత ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, ఏర్పాటు చేయబడిన సంగీతం ఆ దంపతులు సమస్తాన్ని యేసు పేరట చేయడాన్ని ప్రతిబింబిస్తున్నట్లు గుర్తుచేసుకుంటారా? వారలా గుర్తుచేసుకోవాలి.

14 అవును, చక్కగా ఏర్పాటు చేసిన వివాహ విందు ఆనందంగా గుర్తుచేసుకోబడుతుంది. ముప్పై సంవత్సరాల క్రితం పెళ్లిచేసుకున్న ఆడమ్‌, ఎడీటా ఒక వివాహ విందును గురించి ఇలా వ్యాఖ్యానించారు: “మీరు అక్కడ క్రైస్తవ వాతావరణాన్ని గమనించవచ్చు. యెహోవాను స్తుతించే పాటలే కాక, కొంత చక్కని ఇతర వినోదం కూడా అందించబడింది. డ్యాన్సుకి, సంగీతానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. అది ఆహ్లాదకరంగా, ప్రోత్సాహకరంగా ఉంది, ప్రతీదీ బైబిలు సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడింది.” పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె తమ క్రియల ద్వారా తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటున్నట్లు చూపించేందుకు వారెంతో చేయవచ్చనేది స్పష్టం.

వివాహ బహుమతులు

15 చాలాదేశాల్లో పెళ్లి చేసుకునేవారికి స్నేహితులు, బంధువులు సాధారణంగా బహుమతులు ఇస్తారు. మీరలా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు, ఏమి గుర్తుంచుకోవాలి? ఈ విషయంలో, అపొస్తలుడైన యోహాను “జీవపుడంబమును” గురించి చేసిన వ్యాఖ్యానాన్ని గుర్తుచేసుకోండి. ఆయన అలాంటి డంబాన్ని క్రియల ద్వారా తమ విశ్వాసాన్ని చూపించే క్రైస్తవులకు ముడిపెట్టలేదుగానీ ‘గతించిపోతున్న లోకానికి’ ముడిపెట్టాడు. (1 యోహాను 2:​16, 17) యోహాను ప్రేరేపిత వ్యాఖ్య దృష్ట్యా బహుమతి ఇచ్చే ప్రతీవ్యక్తి పేరును నవదంపతులు ప్రకటించాలా? మాసిదోనియ, అకయలోని క్రైస్తవులు యెరూషలేములోని సహోదరులకు చందా ఇచ్చారు, అయితే వారి పేర్ల ప్రకటించబడినట్లు ఎలాంటి దాఖలాలు లేదు. (రోమీయులు 15:​26) వివాహ బహుమతి ఇచ్చే చాలామంది క్రైస్తవులు తమకు ప్రత్యేక అవధానం ఇవ్వబడకుండా ఉండేందుకు తమ పేరు గోప్యంగా ఉంచాలని కోరుకుంటారు. దీనికి సంబంధించి మత్తయి 6:​1-4లోని యేసు ఉపదేశాన్ని పరిశీలించండి.

16 బహుమతి ఇచ్చేవారి పేరు ప్రకటించడం, ఏది మంచిది లేదా ఏది చాలా ఖరీదైనది అనే విషయంలో పోటీని లేదా ‘వివాదాన్ని రేపవచ్చు.’ కాబట్టి, జ్ఞానవంతులైన క్రైస్తవ నవదంపతులు బహుమతి ఇచ్చేవారి పేర్లు ప్రకటించరు. బహుమతి ఇచ్చేవారి పేర్లను ప్రకటించడంవల్ల, బహుశా బహుమతి తేలేకపోయినవారికి ఇబ్బంది కలిగించవచ్చు. (గలతీయులు 5:​26; 6:​10) పెళ్లికుమారుడు లేదా పెళ్లికుమార్తె ఫలానా బహుమతి ఎవరు ఇచ్చారో తెలుసుకోవడంలో తప్పులేదు. బహుమతికి అంటించబడిన సరైన కార్డునుబట్టి దానిని ఎవరు ఇచ్చారో వారు తెలుసుకోవచ్చు, అయితే వారి పేరును బహిరంగంగా ప్రకటించకూడదు. బహుమతులు కొనడం, ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యక్తిగత విషయాల్లో కూడా మన విశ్వాసం మన క్రియలతో కూడుకొన్నదని నిరూపించుకునే అవకాశం మనందరికీ లభిస్తుంది. *

17 మన విశ్వాసాన్ని నిరూపించుకోవడంలో నైతికంగా జీవించడం, క్రైస్తవ కూటాలకు హాజరవడం, ప్రకటనాపనిలో భాగం వహించడంకన్నా ఇంకా ఎక్కువేవుంది. మనలో ప్రతీ ఒక్కరం మన పనులన్నింటినీ ప్రభావితంచేసే క్రియాపూర్వక విశ్వాసాన్ని కలిగివుందాం. అవును, మనం పైన చర్చించబడిన జీవితాంశాలతోపాటు, “సంపూర్ణముగా” చేసే మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనబర్చవచ్చు.​—⁠ప్రకటన 3:⁠2.

18 యేసు తన నమ్మకమైన అపొస్తలుల పాదాలు కడగడం అనే అల్పమైన పనిచేయడం ద్వారా వారికి చక్కని మాదిరి ఉంచిన తర్వాత ఆయనిలా అన్నాడు: “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.” (యోహాను 13:​4-17) నేడు మనం నివసించే ప్రాంతంలో మన ఇంటికి వచ్చిన అతిథి వంటి ఇతర వ్యక్తుల పాదాలను కడగాల్సిన అవసరం లేకపోవచ్చు లేక అలా కడగడం సాధారణ విషయం కాకపోవచ్చు. అయితే, మనమీ ఆర్టికల్‌లో పరిశీలించినట్లుగా, విందులకు, క్రైస్తవ వివాహాలకు సంబంధించిన వాటితోపాటు మన ప్రేమపూర్వక, దయాపూర్వక క్రియల మూలంగా మన విశ్వాసాన్ని కనబరిచే జీవితంలోని ఇతర అంశాలు కూడా ఉన్నాయి. తమ విశ్వాసాన్ని క్రియల ద్వారా ప్రదర్శించాలని కోరుకునే క్రైస్తవులుగా మనం పెళ్లి చేసుకుంటున్నా లేక వివాహానికి, ఆ తర్వాత జరిగే విందుకు హాజరయ్యే అతిథులుగావున్నా మనం ప్రేమపూర్వక, దయాపూర్వక క్రియల మూలంగా మన విశ్వాసాన్ని కనబరచాలి.

[అధస్సూచీలు]

^ పేరా 23 వివాహ, సంబంధిత రిసెప్షన్‌ల గురించిన అదనపు అంశాలు “మీ పెళ్లిరోజు ఆనందాన్ని, గౌరవాన్ని అధికం చేసుకోండి” అనే తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడ్డాయి.

మీరెలా జవాబిస్తారు?

మీ విశ్వాసాన్ని

• విందును ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎలా నిరూపించుకోవచ్చు?

• వివాహాన్ని లేదా రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎలా నిరూపించుకోవచ్చు?

• వివాహ బహుమతులు ఇస్తున్నప్పుడు లేదా తీసుకుంటున్నప్పుడు ఎలా నిరూపించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. తొలి క్రైస్తవులు విశ్వాసానికీ, క్రియలకూ ఎందుకు అవధానమిచ్చారు?

2. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని గురించి తమనుతాము ఏమని ప్రశ్నించుకోవాలి?

3. పార్టీల్లో పాలుపంచుకోవడం విషయంలో బైబిలు దృక్కోణమేమిటి?

4. పార్టీ ఏర్పాటుచేసే వ్యక్తి దేనిపట్ల శ్రద్ధ కనబరచాలి?

5. మద్యం అందించాలా వద్దా, సంగీతం ఉండాలా వద్దా అనే విషయాల గురించి అతిథేయి ఎందుకు జాగ్రత్తగా ఆలోచించాలి?

6. సంభాషణ లేదా ఇతర కార్యక్రమాల విషయంలో తన విశ్వాసం క్రియాపూర్వకమని అతిథేయి ఎలా చూపించవచ్చు?

7. వివాహాలు, వివాహ విందులకు సంబంధించిన ప్రణాళిక గురించి ఆలోచించడం ఎందుకు మంచిది?

8, 9. అనేక వివాహాల్లోని ఆచారాలు మనం 1 యోహాను 2:​16, 17లో చదివేదానిని ఎలా రుజువు చేస్తున్నాయి?

10. (ఎ) వివేకయుక్తమైన వివాహానికి ప్రణాళిక ఎందుకు అవసరం? (బి) ఆహ్వానించేవారి విషయంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

11. వివాహ సందర్భంగా “విందు ప్రధాని” ఏ పాత్ర పోషించవచ్చు?

12. మద్యపానీయాలు అందించడానికి సంబంధించి పెళ్లికుమారుడు ఏ విషయాన్ని ఆలోచించాలి?

13. వివాహ విందులో సంగీతాన్ని ఏర్పాటు చేస్తే దంపతులు దేనిగురించి ఆలోచించాలి, ఎందుకు?

14. వివాహాన్ని గురించి క్రైస్తవులు దేనిని ఆనందంగా గుర్తుతెచ్చుకోవాలి?

15. వివాహ బహుమతుల విషయంలో ఏ బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవచ్చు?

16. వివాహ బహుమతుల విషయంలో నవదంపతులు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఎలా ఉండవచ్చు?

17. క్రైస్తవులు తమ విశ్వాసం, క్రియలకు సంబంధించి ఏ లక్ష్యాన్ని కలిగివుండాలి?

18. క్రైస్తవ వివాహాలకు, విందులకు యోహాను 13:17లోని మాటలు ఎలా వర్తించవచ్చు?

[24వ పేజీలోని చిత్రం]

కేవలం కొద్దిమందినే ఆహ్వానిస్తున్నా, “పైనుండివచ్చు జ్ఞానము”తో నిర్దేశించబడండి