కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యూదుల ఆచారబద్ధమైన స్నానం బాప్తిస్మానికి ముంగుర్తుగా ఉందా?

యూదుల ఆచారబద్ధమైన స్నానం బాప్తిస్మానికి ముంగుర్తుగా ఉందా?

యూదుల ఆచారబద్ధమైన స్నానం బాప్తిస్మానికి ముంగుర్తుగా ఉందా?

బా ప్తిస్మమిచ్చు యోహాను “మారుమనస్సు విషయమైన బాప్తిస్మము” గురించి ప్రకటించాడు. శిష్యులను చేసి వారికి బాప్తిస్మం ఇవ్వమని యేసు కూడా తన అనుచరులకు ఆజ్ఞాపించాడు.​—⁠మార్కు 1:⁠4; మత్తయి 28:​19.

క్రైస్తవ బాప్తిస్మం తీసుకోవాలంటే ఒక వ్యక్తి నీటిలో పూర్తిగా ముంచబడాలని బైబిలు సూచిస్తోంది. “అలాంటి మతకర్మలు గతంలోనేకాక, నేడు కూడా అనేక దేశాల్లోని, సంస్కృతుల్లోని చాలా మతాల్లో కనిపిస్తాయి” అని జీసస్‌ అండ్‌ హిజ్‌ వరల్డ్‌ అనే పుస్తకం పేర్కొంటోంది. “క్రైస్తవ బాప్తిస్మానికున్న మూలాలు . . . యూదా మతంలో కనిపిస్తాయి” అని ఆ పుస్తకం వాదిస్తోంది. ఆ వాదన ఎంతవరకు సరైనది?

యూదుల ఆచార సంబంధమైన స్నానపు కొలనులు

యెరూషలేము ఆలయ పర్వతానికి సమీపంలో త్రవ్వకాలు జరిపిన పురావస్తుశాస్త్రజ్ఞులు, దాదాపు 100 ఆచార సంబంధమైన స్నానపు గదులను లేక స్నానపు కొలనులను కనుగొన్నారు, అవి సా.శ.పూ. మొదటి శతాబ్దానికి, సా.శ. మొదటి శతాబ్దానికి చెందినవి. “వాటి అవసరం ఉన్న సందర్శకుల” కోసం అలాంటి స్నానపు కొలనులు అందుబాటులో ఉండేవని రెండవ లేక మూడవ శతాబ్దానికి చెందిన ఒక సమాజమందిరపు స్మారకచిహ్నం మీదున్న మాటలు వివరిస్తున్నాయి. యెరూషలేములో ధనిక, యాజక కుటుంబాలు నివసించిన ప్రాంతంలో మరిన్ని స్నానపు కొలనులు కనిపించాయి, దాదాపు ప్రతీ ఇంటికీ ఆచార సంబంధమైన ఒక స్నానపు కొలను ఉంది.

ఆ స్నానపు కొలనులు దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి, వాటిని రాతినుండి తొలిపించేవారు లేక నేలను త్రవ్వి లోపల ఇటుకలను లేక రాళ్లను పేర్చి నిర్మించేవారు. నీళ్లు బయటికి వెళ్లకుండా వాటికి పూతపూసేవారు. అనేక కొలనులు దాదాపు 1.8 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వెడల్పు ఉండేవి. వర్షపు నీరు తూముల ద్వారా ఆ కొలనుల్లోకి చేరుకునేది. స్నానం చేసే వ్యక్తి ముందుకు వంగినప్పుడు నీటిలో పూర్తిగా మునిగేలా నీరు కనీసం 1.2 మీటర్ల లోతు ఉండేది. నీళ్లలోకి దారితీసే మెట్ల మధ్యలో కొన్నిసార్లు చిన్న అడ్డుగోడ నిర్మించబడేది. దానికి ఒకవైపు ఉన్న మెట్లు స్నానం చేసే వ్యక్తి అపవిత్రంగా ఉన్నప్పుడు పవిత్రపరిచే స్నానం కోసం నీళ్లలోకి ప్రవేశించేందుకు ఉపయోగించబడేవని, రెండవవైపు ఉన్న మెట్లు, ఎలాంటి కల్మషం అంటకుండా బయటకు వెళ్ళేందుకు ఉపయోగించబడేవని భావించబడుతోంది.

స్నానపు కొలనులు యూదా ఆచారబద్ధ శుద్ధతకు సంబంధించి ఉపయోగించబడేవి. ఆ శుద్ధతలో ఏమి ఇమిడివుండేది?

స్నానం విషయంలో ధర్మశాస్త్రం, ఆచారం

దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరాన్ని మోషే ధర్మశాస్త్రం నొక్కిచెప్పింది. వివిధరకాల క్రియలనుబట్టి అపవిత్రులైన ఇశ్రాయేలీయులు స్నానం చేసి, తమ బట్టలను ఉతుక్కొని తమనుతాము పవిత్రపరచుకోవాలి.​—⁠లేవీయకాండము 11:​28; 14:​1-9; 15:​1-31; ద్వితీయోపదేశకాండము 23:​10, 11.

యెహోవా దేవుడు సంపూర్ణంగా పవిత్రుడు, పరిశుద్ధుడు. కాబట్టి యాజకులు, లేవీయులు మరణించకుండా ఉండాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్లేముందు తమ చేతులను కాళ్లను కడుక్కోవాలి.​—⁠నిర్గమకాండము 30:​17-21.

సా.శ. మొదటి శతాబ్దం వచ్చేసరికి, లేవీయులు కానివారు కూడా యాజకుల్లాగే తమనుతాము పవిత్రపరచుకోవాలని యూదా మత వ్యవస్థ నిర్దేశించిందని విద్వాంసులు నమ్ముతున్నారు. అటు ఎస్సెన్‌లు, ఇటు పరిసయ్యులు ఆచారబద్ధంగా నీటితో అనేకసార్లు పవిత్రపరచుకునే ఆచారాన్ని పాటించేవారు. యేసు కాలం గురించి ఒక పుస్తకం ఇలా నివేదిస్తోంది: “ఒక యూదుడు ఆలయంలోకి ప్రవేశించేముందు, బలి అర్పించేముందు, యాజకుల అర్పణలనుండి ప్రయోజనం పొందే ముందు, అలాంటి ఇతర పనులు చేసే ముందు ఆచారబద్ధంగా తననుతాను పవిత్రపరచుకోవాలి.” స్నానం చేసేవారు నీటిలో పూర్తిగా మునగాలని టాల్ముడ్‌ మూలపాఠాలు పేర్కొంటున్నాయి.

ఆచారబద్ధంగా పవిత్రపరచుకోవాలని పరిసయ్యులు పట్టుబట్టుతున్నందుకు యేసు వారిని విమర్శించాడు. వారు ‘గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలను’ శుభ్రం చేసే విషయంలోనే కాక “నానావిధములైన ప్రక్షాళనములను” కూడా ఆచరించారని స్పష్టమవుతోంది. పరిసయ్యులు తమ సొంత ఆచారాలను విధించడానికి దేవుని ఆజ్ఞలను అతిక్రమించారని యేసు చెప్పాడు. (హెబ్రీయులు 9:​10; మార్కు 7:​1-9; లేవీయకాండము 11:​32, 33; లూకా 11:​38-42) శరీరం నీటిలో పూర్తిగా మునగాలని మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు.

యూదులు పాటించిన ఆచారబద్ధమైన స్నానంలో క్రైస్తవ బాప్తిస్మానికి మూలం కనిపిస్తోందా? లేదు!

ఆచారబద్ధమైన స్నానం, క్రైస్తవ బాప్తిస్మం

యూదులు పవిత్రపరచుకునే ఆచారాలను తమంతటతామే నిర్వహించుకునేవారు. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను ఇచ్చిన బాప్తిస్మం యూదులకు పరిచయమున్న ఆచారబద్ధమైన స్నానం లాంటిది కాదు. యోహాను బాప్తిస్మమిచ్చువానిగా పేరుపొందడం, ఆయన వేరే రకమైన బాప్తిస్మమిచ్చాడని సూచిస్తోంది. “నీవు . . . ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావు” అని అడిగేందుకు ఆయన దగ్గరకు ప్రతినిధులను కూడా యూదా మతనాయకులు పంపించారు.​—⁠యోహాను 1:​25.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక ఆరాధకుడు అపవిత్రుడైన ప్రతీసారి తననుతాను పవిత్రపరచుకోవాలి. కానీ యోహాను ఇచ్చిన బాప్తిస్మం విషయంలో, ఆ తర్వాత క్రైస్తవులు ఆచరించిన బాప్తిస్మం విషయంలో అలా చేయనవసరంలేదు. యోహాను బాప్తిస్మం పశ్చాత్తాపాన్ని, గత జీవిత విధానాన్ని తిరస్కరించడాన్ని సూచిస్తుంది. క్రైస్తవ బాప్తిస్మం ఒక వ్యక్తి దేవునికి తననుతాను సమర్పించుకున్నాడనే వాస్తవాన్ని సూచిస్తుంది. ఒక క్రైస్తవుడు ఒకసారే సమర్పించుకుంటాడు గానీ, మళ్లీమళ్లీ సమర్పించుకోడు.

యూదా యాజకుల గృహాల్లో, ఆలయ సమీపంలో ఉన్న సార్వజనిక స్నానగదుల్లో నిర్వహించబడే ఆచారబద్ధమైన స్నానాలకూ క్రైస్తవ బాప్తిస్మానికీ కేవలం పైపై పోలికలే ఉన్నాయి. నీటిలో మునిగే విషయంలో ఈ రెండింటికీ పూర్తి వేర్వేరు అర్థాలున్నాయి. యూదా మతం నుండి అంటే “తన పరిసరాల నుండి ఏదో రకమైన బాప్తిస్మాన్ని [బాప్తిస్మమిచ్చు] యోహాను అరువుతీసుకోలేదు లేక దానిని తనకు అణుగుణంగా మలచుకోలేదు” అని ది ఏంఖర్‌ బైబిల్‌ డిక్షనరీ వ్యాఖ్యానిస్తోంది. క్రైస్తవ సంఘం ఆచరించే బాప్తిస్మం విషయంలో కూడా అదే నిజమని చెప్పవచ్చు.

క్రైస్తవ బాప్తిస్మం ‘నిర్మలమైన మనస్సాక్షి కోసం దేవునికి చేసే’ అభ్యర్థనను సూచిస్తోంది. (1 పేతురు 3:​21) ఒక వ్యక్తి యెహోవా కుమారుని శిష్యునిగా ఆయనను సేవించేందుకు సంపూర్ణంగా సమర్పించుకోవడాన్ని అది సూచిస్తోంది. నీటిలో పూర్తిగా మునగడం అలాంటి సమర్పణకు సరైన సూచనగా ఉంటుంది. ఒక వ్యక్తి నీటిలో పూర్తిగా మునగడం ఆయన తన గత జీవిత విధానం విషయంలో మరణించడాన్ని సూచిస్తోంది. నీటి నుండి బయటికి రావడం దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన బ్రతికించబడడాన్ని సూచిస్తోంది.

అలా సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునేవారికి యెహోవా దేవుడు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు. అందుకే ప్రేరేపించబడిన అపొస్తలుడైన పేతురు తోటి విశ్వాసులకు ఇలా చెప్పగలిగాడు: “బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది.” యూదాలకు సంబంధించిన ఏ ఆచారబద్ధమైన స్నానంవల్ల అలా రక్షించబడడం సాధ్యంకాదు.