కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రోమన్‌ రహదారులు ప్రాచీన ఇంజనీరింగ్‌ స్మారకచిహ్నాలు

రోమన్‌ రహదారులు ప్రాచీన ఇంజనీరింగ్‌ స్మారకచిహ్నాలు

రోమన్‌ రహదారులు ప్రాచీన ఇంజనీరింగ్‌ స్మారకచిహ్నాలు

రోమన్‌ స్మారకచిహ్నాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి? రోములోని శిథిలావస్థలో ఉన్న కొలొస్సియమ్‌ అని మీరు జవాబిస్తారా? అత్యధిక కాలంగా నిలిచివున్న లేక చరిత్రను మలిచేందుకు దోహదపడిన రోమన్‌ నిర్మాణాలను మనం పరిగణలోకి తీసుకోవాలనుకుంటే మనం దాని రహదారుల గురించి ఆలోచించాలి.

రోమన్‌ రహదారుల మీద కేవలం సరుకుల రవాణా, సైన్యాల ప్రయాణం మాత్రమే జరగలేదు. క్రైస్తవ సిద్ధాంతాలతోపాటు, “మత సంబంధమైన, తత్త్వ సంబంధమైన సిద్ధాంతాలు, నమ్మకాలు, కళాత్మక ప్రభావాలు వ్యాపించడానికి” ఆ రహదారులు దోహదపడ్డాయని శిలాలేఖ విద్యలో నిపుణుడైన రొమోలో ఏ. స్టాకోలీ చెబుతున్నాడు.

ప్రాచీన కాలాల్లో రోమన్‌ రహదారులు స్మారకచిహ్నాలుగా పరిగణించబడేవి. అనేకానేక సంవత్సరాల కాలంలో రోమన్లు, నేడు 30 కన్నా ఎక్కువ దేశాలకు చెందిన 80,000 కిలోమీటర్లకన్నా అధికంగా విస్తరించి ఉన్న సమర్థమైన రహదారి వ్యవస్థను నిర్మించారు.

అలా నిర్మించబడిన మొదటి ప్రాముఖ్యమైన వియా పబ్లీకా, లేక నేడు ప్రధాన రహదారి అని పిలవబడేవాటిలో వియా అప్పీయా లేక అప్పీయా రహదారి ఉంది. అత్యుత్తమ రహదారిగా పేరుపొందిన ఆ రహదారి, తూర్పు దేశాలకు ముఖద్వారంగా ఉన్న ఓడరేవు నగరమైన బ్రున్డీసియమ్‌తో (ఇప్పుడు బ్రిన్డీసీగా పిలవబడుతోంది) రోమును అనుసంధానం చేసింది. దాదాపు సా.శ.పూ. 312లో ఈ రహదారి నిర్మాణం చేపట్టిన అప్పీయస్‌ క్లాడియస్‌ అనే రోమా అధికారి పేరునుబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఏడ్రియాటిక్‌ సముద్రం వైపుగా తూర్పు దిశలో సాగే వియా సాలారియా, వియా ఫ్లామీనియా అనే రెండు రహదారులు కూడా రోములో ఉన్నాయి, అవి బాల్కన్‌ రాష్ట్రాలనేకాక రైన్‌, డాన్యూబ్‌ ప్రాంతాలను కూడా రోముతో అనుసంధానం చేశాయి. ఉత్తరాన ఉన్న గాల్‌, ఐబీరియన్‌ ద్వీపకల్పం దిశలో వియా ఆరేలియా అనే రహదారి ఉండేది. ఆస్టీయా ఓడరేవు పట్టణం ఉన్న దిశలో వియా ఆస్టెన్సిస్‌ అనే రహదారి ఉండేది, ఆఫ్రికాకు సముద్రయానం చేయడానికి రోమా సామ్రాజ్యం ఆ ఓడరేవు పట్టణాన్నే ఎక్కువగా ఉపయోగించేది.

రోమా సామ్రాజ్యపు అతిపెద్ద నిర్మాణ పథకం

రోమ్‌ నివాసులు క్రొత్తగా రహదారుల నిర్మాణం ప్రారంభించక ముందే రోము నగరానికి రహదారులు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉండేవి. టైబర్‌ నదికి దిగువన ఏకైక పాటిరేవు సమీపంలో ప్రాచీన రహదారులన్నీ కలుసుకునే కూడలిలో రోము నగరం ఉనికిలోకి వచ్చింది. ప్రాచీన దస్తావేజుల ప్రకారం, రోమన్లు తాము కనుగొన్న రహదారుల్ని మెరుగుపరచడానికి కార్తీజియన్లను అనుకరించారు. అయితే నిజానికి రోమన్లకన్నా ముందు ఇట్రేస్కన్లు రహదారుల నిర్మాణ నైపుణ్యాన్ని మెరుగుపరచివుండవచ్చు. వారు నిర్మించిన రోడ్ల ఆనవాళ్లను మనం ఇప్పటికీ చూడవచ్చు. అంతేకాక, రోమన్‌ కాలాలకన్నా ముందు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగించబడిన మార్గాలు చాలా ఉన్నాయి. పశువులను ఒక పచ్చిక బయలు నుండి మరొకదానికి తీసుకువెళ్లేందుకు అవి ఉపయోగించబడి ఉండవచ్చు. అయితే, వేసవికాలంలో ఆ మార్గాల్లో దుమ్మురేగేది, వర్షాకాలంలో అవి బురదమయంగా తయారయ్యేవి, అందువల్ల ఆ మార్గాల్లో ప్రయాణించడం కష్టంగా ఉండేది. రోమన్లు సాధారణంగా అలాంటి మార్గాల మీదే తమ రహదారుల్ని నిర్మించారు.

రోమన్‌ రహదారులు జాగ్రత్తగా రూపొందించబడి, దృఢంగా, ప్రయోజనకరంగా, అందంగా ఉండేలా నిర్మించబడ్డాయి. సాధారణంగా ఆ రహదారులు ఆరంభ స్థలాన్ని గమ్యస్థానంతో సాధ్యమైనంత అతి సమీప మార్గాల ద్వారా కలిపేవి, దీనినిబట్టి అనేక రహదారులు వంపులు లేకుండా సూటిగా ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, తరచూ ఆ రహదారులను నైసర్గిక పరిస్థితులకు అనువుగా వేయాల్సివచ్చేది. పర్వత ప్రాంతాల్లో వీలైన చోట రోమన్‌ ఇంజనీర్లు పర్వతానికి సగం ఎత్తులో సూర్యకాంతి పడే వైపుగా తమ రహదార్లను నిర్మించారు. అంత ఎత్తులో రహదారులు ఉండడం వాటిలో ప్రయాణించేవారు తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితులవల్ల కలిగే అసౌకర్యాలకు ఎక్కువగా గురికాకుండా ఉండేందుకు దోహదపడేది.

అసలు రోమన్లు తమ రహదార్లను ఎలా నిర్మించుకున్నారు? వారు విభిన్న పద్ధతులను ఉపయోగించారు, అయితే పురావస్తుశాస్త్రజ్ఞుల త్రవ్వకాలు ప్రాథమికంగా ఈ క్రింది అంశాలను వెల్లడిచేశాయి.

మొదటిగా, రహదారి ఎటువేయాలో ప్రణాళిక వేయబడేది. ఆ కాలానికి చెందిన సర్వేయర్లకు ఆ పని అప్పగించబడేది. ఆ తర్వాత శ్రమతో కూడిన త్రవ్వే పనిని రోమన్‌ సైనికులకు, కూలీలకు, లేక బానిసలకు ఇవ్వబడేది. రెండు గోతులను సమాంతరంగా త్రవ్వేవారు. ఆ గోతుల మధ్య కనిష్ఠ వెడల్పు దాదాపు 2.4 మీటర్లు ఉండేది, అయితే సాధారణంగా వాటి మధ్య 4 మీటర్ల వెడల్పు ఉండేది, రహదారి వంపులు ఉన్న చోట వాటి మధ్య వెడల్పు మరింత ఎక్కువగా ఉండేది. రెండు వైపుల ఉన్న కాలిబాటలు కలుపుకొని పూర్తైన రహదారి వెడల్పు దాదాపు 10 మీటర్లు ఉండేది. ఆ తర్వాత ఆ రెండు గోతుల మధ్యలోని మట్టిని త్రవ్వి తొలగిస్తారు. అలా త్రవ్విన ఖాళీలో వివిధ రకాల రాళ్లతో మూడు నాలుగు పొరలు వేస్తారు. మొదటిగా, పెద్ద రాళ్లు లేదా చిన్నరాళ్లు, ఆ తర్వాత గులకరాళ్లు లేక చదునైన రాళ్లు, బహుశా కంకర మిశ్రమంతో కలిపి ఆ ఖాళీని నింపుతారు. దానిమీద కంకర లేక చిన్నని రాళ్లువేసి చదునుచేస్తారు.

కొన్ని రోమన్‌ రహదారుల పైభాగంలో కేవలం దిమ్మెసకొట్టిన కంకర మాత్రమే ఉండేది. అయినా, అలా చదునుచేయబడిన ఆ రహదారులే ఆ కాలంలోని ప్రజల మన్ననను పొందాయి. అలాంటి రహదారుల ఉపరితలం సాధారణంగా స్థానికంగా దొరికే రాళ్లతో చేయబడ్డ పెద్ద రాతిపలకలతో నిర్మించబడేది. ఆ రహదారులపై నీళ్లు నిలవకుండా ఇరుప్రక్కల ఉన్న మురుగుకాలువల్లోకి పారే విధంగా అవి మధ్యలో కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండేవి. అలా నిర్మించడం ఆ స్మారకచిహ్నాలు దృఢంగా ఉండేందుకు, వాటిలో కొన్ని మన కాలంవరకు నిలిచివుండేందుకు దోహదపడింది.

అప్పీయా రహదారి నిర్మించబడిన దాదాపు 900 సంవత్సరాల తర్వాత, బైజాంటియమ్‌ చరిత్రకారుడు ప్రకోపియస్‌ దానిని ఒక “అద్భుత” నిర్మాణంగా వర్ణించాడు. దానిమీద పేర్చబడిన రాతిపలకల గురించి ఆయన ఇలా రాశాడు: “ఎంతో కాలం గడిచిపోయినప్పటికీ, ప్రతీరోజు ఎన్నో రథాలు దానిమీదుగా ప్రయాణించినప్పటికీ, అవి ఏ విధంగానూ చెక్కుచెదరలేదు, వాటిమీది నునుపు ఏ మాత్రం పాడుకాలేదు.”

ఈ రహదారులు నదులవంటి ప్రకృతి అడ్డంకులను ఎలా దాటగలిగాయి? వంతెనలే దానికి పరిష్కారం, వాటిలో కొన్ని ఇప్పటికీ స్థిరంగా నిలిచివుండి, ప్రాచీన రోమన్ల గొప్ప సాంకేతిక సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. రోమన్‌ రహదారి వ్యవస్థలో నిర్మితమైన సొరంగాలు అంతగా పేరుగాంచి ఉండకపోవచ్చు, అయితే ఆ కాలంనాటి సాంకేతిక నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటే, వాటి నిర్మాణం ఎంతో కష్టమైందని చెప్పవచ్చు. ఒక గ్రంథం ఇలా చెబుతోంది: “ఎన్నో శతాబ్దాలవరకు అసమానమైనవిగా నిలిచివుండగల నిర్మాణాలను . . . రోమన్‌ ఇంజనీరింగు అందించింది.” వాటిలో ఒక ఉదాహరణ, వియా ఫ్లామీనియా రహదారిలో ఫర్లో పాస్‌ దగ్గర ఉన్న సొరంగం. సా.శ. 78లో ఇంజనీర్లు జాగ్రత్తగా ప్రణాళిక వేసిన తర్వాత, బలమైన రాతి గుండా 5 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల ఎత్తు ఉన్న 40 మీటర్ల పొడవైన సొరంగం తొలిపించబడింది. ఆ కాలంలో అందుబాటులో ఉన్న పనిముట్లను పరిగణలోకి తీసుకుంటే అది నిజంగా ఒక అసాధారణమైన కార్యం అని చెప్పవచ్చు. అలాంటి రహదార్ల నిర్మాణం అతి గొప్ప మానవ ప్రయత్నాల్లో ఒకటి.

యాత్రికుల సంచారం, నమ్మకాలు వ్యాప్తి చెందడం

సైనికులు, వ్యాపారస్థులు, బోధకులు, పర్యటకులు, నటులు, గ్లాడియేటర్లు, ఇలా అందరూ ఆ రహదారులను ఉపయోగించారు. కాలినడకన వెళ్లేవారు వాటిపై రోజుకు 25 నుండి 30 కిలోమీటర్లు నడవగలిగేవారు. మైలురాళ్లను చూడడం ద్వారా యాత్రికులు దూరాల గురించిన సమాచారం తెలుసుకోగలిగేవారు. వివిధ ఆకారాల్లో, సాధారణంగా స్తూపాకారంలో ఉండే ఆ రాళ్లు, ప్రతీ 1,480 మీటర్లకు ఒకటి ఉండేది, అది ఒక రోమన్‌ మైలు దూరం. ఆ రహదార్ల వెంబడి అక్కడక్కడ విశ్రాంతి స్థలాలు కూడా ఉండేవి, అక్కడ యాత్రికులు గుర్రాలను మార్చుకోగలిగేవారు, భోజనం చేయడానికి ఏదైనా కొనుక్కోగలిగేవారు, కొన్ని సందర్భాల్లో రాత్రి బసచేయగలిగేవారు. అలాంటి సేవలు అందించే కొన్ని స్థలాలు ఆ తర్వాత చిన్న పట్టణాలుగా అభివృద్ధి చెందాయి.

క్రైస్తవత్వం ఆవిర్భవించడానికి కొంతకాలం ముందు, కైసరు ఔగుస్తు రహదారి నిర్వహణా కార్యక్రమం ప్రారంభించాడు. ఒకటి లేక అంతకన్నా ఎక్కువ రహదార్లను చూసుకునేందుకు ఆయన అధికారులను నియమించాడు. ఆయన రోమన్‌ ఫోరమ్‌ దగ్గర మెల్యార్యుమ్‌ ఆర్యుమ్‌గా పిలువబడిన బంగారు మైలురాయిని స్థాపించాడు. కంచుతో పూతవేయబడిన అక్షరాలుగల ఆ మైలురాయి, ఇటలీలోని రోమన్‌ రహదారులన్నీ కలిసే సరైన గమ్యస్థానం. అది ఈ సామెత వాడుకలోకి వచ్చేందుకు కారణమైంది: “ఆల్‌ రోడ్స్‌ లీడ్‌ టు రోమ్‌ (రహదారులన్నీ చివరకు రోముకు చేరుకుంటాయి).” ఔగుస్తు, ఆ సామ్రాజ్య రహదారి వ్యవస్థకు సంబంధించిన రేఖాపటాలను ప్రదర్శించాడు. ఆ కాలంనాటి అవసరాలను, ప్రమాణాలను తీర్చేందుకు ఆ వ్యవస్థ చక్కని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

కొంతమంది ప్రాచీన యాత్రికులు సాఫీగా ప్రయాణించేందుకు త్రోవల గురించిన వివరాలు ఉన్న పుస్తకాలను, లేక యాత్రామార్గాలను సూచించే పుస్తకాలను ఉపయోగించేవారు. ఆ పుస్తకాల్లో, ప్రయాణ మార్గంలో ఆగేందుకున్న అనువైన వివిధ స్థలాల మధ్య ఉన్న దూరాలు, అలాంటి స్థలాల్లో అందించబడే సేవలు వంటి సమాచారం ఉండేది. అయితే, ఆ పుస్తకాలు చాలా ఖరీదైనవి కాబట్టి, అవి అందరికీ అందుబాటులో ఉండేవి కావు.

అయినా, క్రైస్తవ సువార్తికులు ప్రణాళికలు వేసుకుని అనేక సుదూర ప్రయాణాలు చేశారు. అపొస్తలుడైన పౌలు తన సమకాలీనుల్లాగే, తూర్పు దిశలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ దిశలో సాధారణంగా వీచే గాలుల నుండి ప్రయోజనం పొందడానికి సముద్రయానం చేయడానికి ఇష్టపడేవాడు. (అపొస్తలుల కార్యములు 14:​25, 26; 20:⁠3; 21:​1-3) మధ్యధరా సముద్రంలో ఈ గాలులు వేసవి నెలల్లో పశ్చిమ దిశనుండి వీస్తాయి. అయితే, పౌలు పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా రోమన్‌ రహదారి వ్యవస్థను ఉపయోగించి భూమార్గాన ప్రయాణించేవాడు. ఈ నమూనాను అనుసరించి పౌలు తన రెండవ, మూడవ మిషనరీ యాత్రలను వ్యవస్థీకరించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 15:​36-41; 16:​6-8; 17:​1, 10; 18:​22, 23; 19:⁠1) * దాదాపు సా.శ. 59లో, పౌలు అప్పీయా రహదారిపై రోముకు బయలుదేరాడు, రోముకు ఆగ్నేయంగా 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న రద్దీగా ఉండే అప్పీ ఫోరమ్‌, లేక అప్పీయా సంతపేట దగ్గర ఆయన తన తోటి విశ్వాసులను కలుసుకున్నాడు. ఇతరులు ఆయన కోసం రోముకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్రాంతి స్థలమైన త్రిసత్రముల దగ్గర వేచివున్నారు. (అపొస్తలుల కార్యములు 28:​13-15) దాదాపు సా.శ. 60లో పౌలు, ఆ కాలంలో అందరికి తెలిసిన “సర్వలోకములో” సువార్త ప్రకటించబడిందని చెప్పగలిగాడు. (కొలొస్సయులు 1:​6, 23) అలా ప్రకటించబడడంలో రోమన్‌ రహదారి వ్యవస్థ దోహదపడింది.

కాబట్టి, రోమన్‌ రహదారులు దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చెందడానికి దోహదపడిన అసాధారణమైన, చిరకాలంగా నిలిచివున్న స్మారకచిహ్నాలుగా నిరూపించబడ్డాయి.​—⁠మత్తయి 24:​14.

[అధస్సూచి]

^ పేరా 18 యెహోవాసాక్షులు ప్రచురించిన ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్‌లోని 33వ పేజీలోవున్న మ్యాప్‌ చూడండి.

[14వ పేజీలోని చిత్రం]

రోమన్‌ మైలురాయి

[15వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఆస్టీయా ఓడరేవు పట్టణంలో ఉన్న రహదారి, ఇటలీ

[15వ పేజీలోని చిత్రం]

ప్రాచీన రథాలు చేసిన బాటలు, ఆస్ట్రియా

[15వ పేజీలోని చిత్రం]

మైలురాళ్లున్న రోమన్‌ రహదారిలో కొంతభాగం, జోర్డాన్‌

[15వ పేజీలోని చిత్రం]

రోము శివార్లలో ఉన్న వియా అప్పీయా రహదారి

[16వ పేజీలోని చిత్రం]

రోము శివార్లలో ఉన్న వియా అప్పీయా రహదారి ప్రక్కన ఉన్న సమాధుల శిథిలాలు

[16వ పేజీలోని చిత్రం]

మార్షె ప్రాంతంలోని వియా ఫ్లామీనియా రహదారిలో ఉన్న ఫర్లో సొరంగం

[16, 17వ పేజీలోని చిత్రం]

రిమనీలో వియా ఎమీల్యా రహదారిపై ఉన్న టైబీరియస్‌ వంతెన, ఇటలీ

[17వ పేజీలోని చిత్రం]

పౌలు తోటి విశ్వాసులను రద్దీగా ఉండే అప్పీ ఫోరమ్‌, లేక అప్పీయా సంతపేట దగ్గర కలుసుకున్నాడు

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఎడమవైపు చివర్లో, ఆస్టీయా ఓడరేవు పట్టణం: ©danilo donadoni/Marka/age fotostock; కుడివైపు చివర్లో, మైలురాళ్లు ఉన్న రహదారి: Pictorial Archive (Near Eastern History) Est.