కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి స్తుతించేందుకు సమైక్యంగా ఆరాధనా స్థలాలను నిర్మించడం

దేవుణ్ణి స్తుతించేందుకు సమైక్యంగా ఆరాధనా స్థలాలను నిర్మించడం

దేవుణ్ణి స్తుతించేందుకు సమైక్యంగా ఆరాధనా స్థలాలను నిర్మించడం

సాలమన్‌ దీవుల్లోని ఒక దీవి ప్రజలు యెహోవాసాక్షుల కొత్త రాజ్యమందిరం నిర్మించబడడాన్ని చూస్తున్నారు. ఒక స్త్రీ సాక్షితో మాట్లాడుతూ, “నిధులను సేకరించడానికి మా చర్చీలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మేము మా సభ్యుల్ని డబ్బివ్వమని అడుగుతాము, అయినా కొత్త చర్చీ కట్టేంత డబ్బు మా దగ్గర లేదు. సాక్షులైన మీరు నిధులు ఎలా సేకరిస్తారు” అని అడిగింది. ఆ సాక్షి ఆమెకిలా జవాబిచ్చింది: “మేము ఒక అంతర్జాతీయ కుటుంబంగా యెహోవాను ఆరాధిస్తాం. కొత్త రాజ్యమందిరాన్ని నిర్మించడానికి అవసరమైన డబ్బును మా సంఘస్థులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సహోదరులు విరాళంగా ఇచ్చారు. అన్ని విషయాల్లోనూ సమైక్యంగా ఉండాలని యెహోవా మాకు ఉపదేశించాడు.”

యెహోవాసాక్షులు చేసే ప్రతీపనిలో, చివరకు వేలసంఖ్యలో రాజ్యమందిరాలను నిర్మించడంలో కూడా వారు సమైక్యంగా ఉండడాన్ని మీరు చూస్తారు. అలాంటి నిర్మాణ పథకాలు కార్యరూపం దాల్చడంలో వారు చూపించే ఐక్యత కొత్తేమీ కాదు. దేవుని ప్రజల్లో అలాంటి ఐక్యత వేల సంవత్సరాలుగా ఉంది. అలా అని ఎందుకు చెప్పవచ్చు?

ఆలయ గుడారాన్ని, దేవాలయాన్ని నిర్మించడం

యెహోవా 3,500కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం మోషేతో మాట్లాడినప్పుడు, ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని మనసులో ఉంచుకుని ఇలా అన్నాడు: “వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.” (నిర్గమకాండము 25:⁠8) ఆ నిర్మాణ పథకానికి సంబంధించిన వివరాలను ఇస్తూ యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “నేను నీకు కనుపరచువిధముగా [మోషేను మాత్రమే ప్రస్తావిస్తూ] మీరు [ఇశ్రాయేలు జనాంగాల్ని సమూలంగా ప్రస్తావిస్తూ] మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.” (నిర్గమకాండము 25:⁠9, NW) ఆ తర్వాత యెహోవా మందిర నిర్మాణం, ఉపకరణాలు, ఇతర వస్తువుల గురించిన వివరాలన్నింటినీ స్థూలంగా వర్ణించాడు. (నిర్గమకాండము 25:⁠10-27:​19) ఆ “మందిరము” లేక గుడారము ఇశ్రాయేలీయులందరికీ సత్యారాధనకు కేంద్రస్థానంగా ఉండాల్సింది.

ఆ నిర్మాణపనిలో ఎంతమంది పాల్గొన్నారో మనకు తెలియదు కానీ, ఇశ్రాయేలీయులందరూ ఆ పనికి మద్దతునివ్వాలని ప్రోత్సహించబడ్డారు. మోషే వారితో, “మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము” అర్పణము తీసుకొని రమ్మని చెప్పాడు. (నిర్గమకాండము 35:​4-9) ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు? “ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్దనుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి” అని నిర్గమకాండము 36:⁠3 చెబుతోంది.

త్వరలోనే విరాళంగా ఇవ్వబడిన వస్తువులు భారీగా సమకూర్చబడ్డాయి, అయినా ప్రజలు వాటినింకా తెస్తూనే ఉన్నారు. నిర్మాణపని చేపట్టిన ప్రజ్ఞావంతులు చివరకు మోషేతో ఇలా చెప్పారు: “చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారు.” దాంతో మోషే ఇలా చాటింపజేశాడు: “పరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దు.” చివరకు ఏమైంది? “ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది.”​—⁠నిర్గమకాండము 36:​4-7.

ఇశ్రాయేలీయుల విస్తారమైన ఉదారత చూపించిన కారణంగా, ఆ మందిరము ఒక సంవత్సరంలోనే పూర్తిచేయబడింది. (నిర్గమకాండము 19:⁠1; 40:​1, 2) సత్యారాధనకు మద్దతివ్వడం ద్వారా దేవుని ప్రజలు యెహోవాను ఘనపరిచారు. (సామెతలు 3:⁠9) భవిష్యత్తులో వారు మరింత పెద్ద నిర్మాణ పథకాన్ని చేపట్టబోతున్నారు. ఆ సమయంలో కూడా నైపుణ్యాలతో నిమిత్తం లేకుండా నిర్మాణపనిలో పాల్గొనాలని ఇష్టపడేవారందరూ దానిలో భాగం వహించవచ్చు.

ఆలయ గుడారాన్ని నిర్మించిన దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఆలయం నిర్మించడం ప్రారంభించారు. (1 రాజులు 6:⁠1) అది రాళ్ళతో, కలపతో నిర్మించబడి వైభవోపేతంగా, చిరకాలం నిలిచే ఆలయంగా ఉంటుంది. (1 రాజులు 5:​17, 18) యెహోవా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దావీదుకు ఆ ఆలయానికి సంబంధించిన నమూనాను ఇచ్చాడు. (1 దినవృత్తాంతములు 28:​11-19) కానీ ఆ నిర్మాణ పనిని చేయడానికి ఆయన దావీదు కుమారుడైన సొలొమోనును ఎన్నుకున్నాడు. (1 దినవృత్తాంతములు 22:​6-10) దావీదు ఆ నిర్మాణపనికి హృదయపూర్వక మద్దతిచ్చాడు. ఆయన దానికి కావల్సిన రాళ్ళను, కలపను, ఇతర సామగ్రిని తెప్పించి, తన స్వంత బంగారం, వెండిలోనుండి భారీ ఎత్తున విరాళంగా ఇచ్చాడు. ఆయన తన తోటి ఇశ్రాయేలీయులు కూడా ఉదారంగా ఉండాలని ప్రోత్సహిస్తూ, వారినిలా అడిగాడు: “ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?” దానికి ప్రజలెలా స్పందించారు?​—⁠1 దినవృత్తాంతములు 29:​1-5.

సొలొమోను ఆలయం నిర్మాణం ప్రారంభించేసరికి ఆయన దగ్గర వేలాది టన్నుల బంగారం, వెండి ఉంది. ఇత్తడి, ఇనుము ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వాటిని తూకం వేయడం అసాధ్యమైంది. (1 దినవృత్తాంతములు 22:​14-16) యెహోవా నడిపింపు, సమస్త ఇశ్రాయేలీయుల సహకారంతో ఆ నిర్మాణపని కేవలం ఏడున్నర సంవత్సరాలలోనే పూర్తైంది.​—⁠1 రాజులు 6:​1, 37, 38.

“దేవుని మందిరము”

ఆలయ గుడారము, దేవాలయము రెండూ “దేవుని మందిరము” అని పిలువబడ్డాయి. (న్యాయాధిపతులు 18:⁠31; 2 దినవృత్తాంతములు 24:⁠7) యెహోవాకు అసలు ఒక ఆశ్రయస్థలం అవసరమే లేదు. (యెషయా 66:⁠1) మానవుల ప్రయోజనార్థమే ఆయన వాటిని కట్టించాడు. దేవాలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను ఇలా అన్నాడు: “నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?”​—⁠1 రాజులు 8:​27.

యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఇలా చెప్పాడు: “నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.” (యెషయా 56:⁠7) దేవాలయంలో అర్పించబడే బలులు, ప్రార్థనలు, అక్కడ నిర్వహించబడే మతాచారాలు దైవభక్తిగల ప్రజలు అంటే యూదులు, యూదులు కానివారు సత్య దేవునికి చేరువయ్యేందుకు తోడ్పడేవి. ఆయన మందిరంలో ఆరాధించడం ద్వారా వారు యెహోవా సాన్నిహిత్యాన్ని, సంరక్షణను పొందారు. దేవాలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను చేసిన ప్రార్థన ఆ సత్యాన్ని నొక్కిచెప్పింది. ఆయన నిండు హృదయంతో దేవునికి చేసిన ఆ ప్రార్థనను మీరు 1 రాజులు 8:​22-53 మరియు 2 దినవృత్తాంతములు 6:​12-42లో చదవవచ్చు.

సత్య దేవుని ప్రాచీన ఆలయం చాలాకాలం క్రితమే నాశనం చేయబడింది, అయితే, అన్ని జనాంగాల ప్రజలు యెహోవాను ఆరాధించడానికి దానికన్నా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక దేవాలయానికి సమకూర్చబడే సమయం గురించి దేవుని వాక్యం చెప్పింది. (యెషయా 2:⁠2) దేవాలయంలో అర్పించబడిన జంతు బలులు సూచించిన దేవుని అద్వితీయ కుమారుని ఏకైక పరిపూర్ణ బలి ద్వారా మాత్రమే ఒకరు యెహోవాను సమీపించవచ్చు. (యోహాను 14:⁠6; హెబ్రీయులు 7:⁠27; 9:​12) యెహోవాసాక్షులు నేడు కూడా అదే సర్వోత్తమ మార్గంలో దేవుణ్ణి ఆరాధిస్తూ, అనేకులైన ఇతరులు కూడా తమలాగే చేసేందుకు సహాయం చేస్తున్నారు.

ఆధునిక నిర్మాణ పథకాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులందరూ సత్య దేవుణ్ణి సేవిస్తారు. వారందరూ నిత్యం అధికమౌతున్న “బలమైన జనము”గా ఉన్నారు. (యెషయా 60:​22) యెహోవాసాక్షులు ప్రధానంగా కూడుకొనే స్థలం రాజ్యమందిరం. * ఇప్పటికే వేవేల రాజ్యమందిరాలు ఉపయోగించబడుతున్నాయి, ఇంకా వేలకొలది రాజ్యమందిరాలు అవసరం.

అవసరమైన రాజ్యమందిరాలు నిర్మించడానికి యెహోవాసాక్షులు “ఇష్టపూర్వకముగా” ముందుకువస్తారు. (కీర్తన 110:⁠3) అయితే, తరచూ స్థానికంగా ఉన్న సాక్షుల్లో అవసరమైన నిర్మాణ నైపుణ్యాలుండవు మరియు అభివృద్ధి జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో కడు బీదరికం తాండవిస్తోంది. అలాంటి అడ్డంకులను అధిగమించడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభ 1999లో రాజ్యమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా రాజ్యమందిరాలను నిర్మించడానికి తమ సహోదర సహోదరీలకు తర్ఫీదునివ్వడానికి నిర్మాణపనిలో నైపుణ్యవంతులైన సాక్షులు సుదూర ప్రాంతాలకు వెళ్ళారు. అలా తర్ఫీదు పొందినవారు ఆ ప్రాంతంలో నిర్మాణపనిని కొనసాగించారు. అలా ప్రత్యేకంగా చేసిన కృషికి ఫలితమేమిటి?

వనరులు మితంగావున్న దేశాల్లో 2006 ఫిబ్రవరికల్లా 13,000కన్నా ఎక్కువ రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి. ఆ కొత్త రాజ్యమందిరాల్ని ఉపయోగిస్తున్న కొందరు వ్యక్తపరచిన ఈ మాటల్ని చదవండి.

“సంఘంలో సగటున 160 మంది హాజరవుతున్నారు. రాజ్యమందిరం నిర్మించబడిన తర్వాత మొదటి కూటానికి 200 మంది హాజరయ్యారు. అది కట్టి ఆరు నెలలు గడిచాయి, ఇప్పుడు 230 మంది హాజరవుతున్నారు. చిన్నవైనా చాలా ఉపయోగకరమైన ఈ రాజ్యమందిరాల నిర్మాణంపై యెహోవా ఆశీర్వాదాలున్నాయని స్పష్టంగా కనబడుతోంది.”​—⁠ఈక్వెడార్‌లోని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త.

“అనేక సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని, ‘మీ ప్రచురణల్లో చూసినటువంటి రాజ్యమందిరం మీరెప్పుడు కట్టుకుంటారు’ అని అడిగేవారు. చివరికి ఇప్పుడు యెహోవా కృపవల్ల మాకు ఆరాధన కోసం మంచి రాజ్యమందిరం ఉంది. మేము అంతకుముందు ఒక సహోదరుని దుకాణంలో కూటాలను నిర్వహించేవాళ్ళం, వాటికి సగటున 30 మంది హాజరయ్యేవారు. మా కొత్త రాజ్యమందిరంలో మొదటి కూటానికి 110 మంది హాజరయ్యారు.”​—⁠ఉగాండాలోని ఒక సంఘం.

“రాజ్యమందిరం నిర్మించబడిన దగ్గరనుండి క్షేత్రంలో ప్రకటనాపని చేయడం మరింత ఆనందదాయకంగా ఉందని ఇద్దరు క్రమ పయినీరు సహోదరీలు చెప్పారు. ఇంటింటి పరిచర్యలో, అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు ప్రజలు వినడానికి ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మరింత సుముఖంగా ఉన్నారు. ఆ సహోదరీలు ఇప్పుడు 17 బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు, వారిలో చాలామంది విద్యార్థులు కూటాలకు హాజరవుతున్నారు.”​—⁠సాలమన్‌ దీవుల బ్రాంచి కార్యాలయం.

“రాజ్యమందిరం ఈ ప్రాంతానికే వన్నె తెచ్చిందనీ, స్థానిక ప్రజలు దాని గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారని దానికి దగ్గరలో నివసిస్తున్న ఒక పాస్టరు చెప్పాడు. దాని ప్రక్కగా వెళ్ళేవారందరూ అదెంతో చక్కగా ఉందని వ్యాఖ్యానిస్తారు. అవి సాక్ష్యమిచ్చేందుకు సహోదరులకు మంచి అవకాశాలనిస్తున్నాయి. అంతకంతకు ఎక్కువమంది మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా కూటాలకు హాజరవ్వనివారు తిరిగి క్రమంగా సంఘంతో సహవసించేందుకు పురికొల్పబడుతున్నారు.”​—⁠మియన్మార్‌ బ్రాంచి కార్యాలయం.

“ఒక వ్యక్తి ఇంటి పొరుగున కట్టబడుతున్న రాజ్యమందిర నిర్మాణాన్ని చూసేందుకు రమ్మని ఆయనను ఒక సహోదరి ఆహ్వానించింది. ఆ వ్యక్తి తర్వాత ఇలా అన్నాడు: ‘అక్కడ పనిచేసేవారు నన్ను లోపలికి రానివ్వరని అనుకున్నాను. కానీ నేను ఆశ్చర్యపోయేలా సాక్షులు నన్ను సాదరంగా ఆహ్వానించారు. పురుషులు, స్త్రీలు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి పనిచేస్తున్నారు. వారిలో ఐక్యత, ఉత్సాహం ఉన్నాయి.’ ఆ వ్యక్తి బైబిలు అధ్యయనానికి అంగీకరించి కూటాలకు హాజరవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయనిలా చెప్పాడు: ‘నా ఆలోచనా విధానం మారిపోయింది. నేను దేవుణ్ణి కనుగొన్నాను, ఇక నేనాయనను విడువను.’”​—⁠కొలంబియా బ్రాంచి కార్యాలయం.

మన మద్దతు ప్రాముఖ్యం

రాజ్యమందిరాలను నిర్మించడం మన స్వచ్ఛారాధనలో ప్రాముఖ్యమైన అంశం. ఆర్థికంగానూ ఇతర విధాలుగానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఈ పనికి ఇచ్చిన మద్దతు నిజంగా హర్షణీయం. కానీ, స్వచ్ఛారాధనలోని ఇతర అంశాలు కూడా అంతే ప్రాముఖ్యమైనవని మనం మరచిపోకూడదు. ఆయా సందర్భాల్లో ప్రకృతి విపత్తులకు బలైన క్రైస్తవులకు మన సహాయం అవసరమౌతుంది. స్వచ్ఛారాధనకు మద్దతునివ్వడంలో బైబిలు సాహిత్యాలను ప్రచురించడం కూడా ప్రాముఖ్యమే. సరైన మనోవైఖరిగల వ్యక్తికి ఇవ్వబడిన బైబిలు సంబంధిత పత్రిక లేదా పుస్తకం ఎంతటి ప్రభావాన్ని చూపగలదో మనలో చాలామంది చూసే ఉంటాము. అదనంగా, మిషనరీలకు పూర్తికాల సేవలో ఉన్న ఇతరులకు మద్దతునివ్వడం కూడా అంతే ప్రాముఖ్యం. అలాంటి స్వయంత్యాగపూరిత క్రైస్తవులు ఈ అంత్యదినాల్లో ప్రకటనాపనిని విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేవాలయ నిర్మాణానికి విరాళాలిచ్చినవారు చాలా సంతోషించారు. (1 దినవృత్తాంతములు 29:⁠9) నేడు, సత్యారాధనకు మనం విరాళాలతో మద్దతునివ్వడం మనకు కూడా అలాగే సంతోషాన్నిస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:​35) కింగ్‌డమ్‌ హాల్‌ ఫండ్‌ కోసం నిర్దేశించబడిన బాక్సులో మనం విరాళాలను వేసి, ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు వేసి రాజ్య సువార్త ప్రకటించడానికి సంబంధించిన ఇతర పనులకు మద్దతునివ్వడం ద్వారా మనం ఆ సంతోషాన్ని చవిచూస్తాం. అద్భుతమైన రీతిలో యెహోవాసాక్షులు నేడు సత్యారాధనలో ఐక్యంగా ఉన్నారు. ఆ ఆరాధనకు మద్దతునివ్వడంలో లభించే సంతోషాన్ని మనమందరం చవిచూచుదుము గాక!

[అధస్సూచి]

^ పేరా 16 “రాజ్యమందిరం” అనే పదం ఎలా ఉనికిలోకి వచ్చిందో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం)లోని 319వ పేజీ చూడండి.

[20, 21వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రపంచవ్యాప్త పనికి విరాళాలను

కొందరు ఈ క్రింది విధాలుగా ఇవ్వాలనుకుంటారు

అనేకులు దానికోసం నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించి, “ప్రపంచవ్యాప్తపని కోసం విరాళాలు​—⁠మత్తయి 24:​14” అని సూచించబడిన బాక్సుల్లో వేస్తారు.

ప్రతీనెలా సంఘాలు ఆ విరాళాల్ని ఆయా దేశాల్లోని పని కొనసాగేందుకు యెహోవాసాక్షుల కార్యాలయాలకు పంపిస్తాయి. స్వచ్ఛందంగా డబ్బు రూపంలో పంపించే విరాళాలు కూడా నేరుగా అక్కడికే పంపించవచ్చు. బ్రాంచి కార్యాలయాల చిరునామాలను మీరు ఈ పత్రికలోని 2వ పేజీలో కనుగొనవచ్చు. చెక్కులను “Watch Tower” పేరున వ్రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను సహితం విరాళంగా పంపించవచ్చు. వాటితోపాటు మీరే వాటిని పూర్తిగా ఇస్తున్నట్లు సంక్షిప్తంగా ఉత్తరంలో వ్రాసి పంపించాలి.

దానధర్మ ప్రణాళిక

రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో డబ్బును పూర్తి కానుకగా ఇవ్వడమేకాక ఇతర పద్ధతుల్లో కూడా ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ ఖాతాలకు లబ్ధిదారుగా Watch Towerను సూచించవచ్చు లేదా మరణానంతరం నగదును Watch Towerకు చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు పూర్తి కానుకగా ఇవ్వవచ్చు.

స్థలాలు: అమ్మదగిన స్థలాలను పూర్తి కానుకగా ఇవ్వవచ్చు లేదా అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించే ఏర్పాటుతో విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన దస్తావేజులను వ్రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటులో ఒక వ్యక్తి డబ్బును లేదా డబ్బు హామీలను వాచ్‌టవర్‌ కార్పోరేషన్‌కు బదిలీ చేస్తాడు. దానికి బదులుగా ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యం పొందుతాడు. దాత వార్షికభత్య విరాళ ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్ట్‌లు: ఆస్తిని లేదా డబ్బును Watch Tower పేరున చట్టబద్ధంగా వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్ట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం Watch Tower లబ్ధిదారుగా సూచించవచ్చు. కొన్ని దేశాల్లో, ఒక మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల కొన్ని పన్ను చెల్లింపు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, భారతదేశంలో మాత్రం అలాంటి ప్రయోజనాలు ఉండవు.

“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వడానికి దాత ముందుగా ప్రణాళిక వేసుకోవలసి ఉంటుంది. ప్రణాళిక వేసుకున్న తర్వాత, ఇవ్వడానికి సంబంధించిన పద్ధతుల్లో ఏదోక దానిని ఉపయోగించి యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళిక * అనే బ్రోషుర్‌ ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషుర్‌ తెలియజేస్తుంది. ఆ బ్రోషుర్‌ను చదివి, తమ స్వంత న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా జరిగే యెహోవాసాక్షుల పనికి మద్దతునివ్వగలిగారు, అదే సమయంలో అలా చేయడం ద్వారా పన్ను చెల్లింపు మినహాయింపును అధికం చేసుకున్నారు.

మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన చిరునామాకు ఫోన్‌ చేయడం లేదా ఉత్తరం వ్రాయడం ద్వారానో యెహోవాసాక్షులను సంప్రదించవచ్చు లేదా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Jehovah’s Witnesses,

Post Box 6440,

Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 28468072

[18వ పేజీలోని చిత్రం]

మన సమైక్య కృషి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అందమైన రాజ్యమందిరాలను నిర్మించగలుగుతున్నాం

[18వ పేజీలోని చిత్రం]

ఘానాలోని కొత్త రాజ్యమందిరం

[అధస్సూచీలు]

^ పేరా 42 భారతదేశంలో లభ్యంకాదు