“నిపుణుల” ఉత్థాన, పతనాలు
“నిపుణుల” ఉత్థాన, పతనాలు
ఇంటర్నెట్‌లో ఒక ప్రఖ్యాత కంప్యూటర్ సర్చ్ ప్రోగ్రాంలో “పేరెంటింగ్” (పిల్లలను పెంచడం), “అడ్వైస్” (సలహా) అనే పదాలను టైప్ చేస్తే, ఆ పదాలకు సంబంధించి రెండు కోట్ల అరవై లక్షలకన్నా ఎక్కువ రెఫరెన్సులు వెంటనే కనిపిస్తాయి. మీరు వాటిలో ప్రతీ రెఫరెన్సును చూసి, దానిని చదవడానికి కేవలం ఒక నిమిషం తీసుకున్నా, మీరు వాటన్నిటినీ చదవడం ముగించేలోపు మీ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి.
పిల్లల డాక్టర్లు, మనోవిజ్ఞానశాస్త్రజ్ఞులు, ఇంటర్నెట్‌లు లేనికాలంలో తల్లిదండ్రులు ఎవరి సలహా తీసుకొనేవారు? సాధారణంగా వారు తమ ఉమ్మడి కుటుంబంలోని సభ్యుల సలహా తీసుకొనేవారు. నిర్దేశమివ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి, పిల్లలను చూసుకోవడానికి అమ్మానాన్నలు, సన్నిహిత బంధువులు సిద్ధంగా ఉండేవారు. అయితే అనేక దేశాల్లో, ప్రజలు అధికసంఖ్యలో పల్లెటూళ్ల నుండి నగరాలకు వలసవెళ్తున్న కారణంగా అలాంటి సన్నిహిత కుటుంబ బంధాలు దాదాపు తెగిపోయాయి. నేడు చాలావరకు తల్లిదండ్రులు ఎవరి సహాయం లేకుండానే పిల్లలను పెంచే బాధ్యతలను నిర్వర్తించాల్సివస్తోంది.
ఆధునిక పిల్లల సంరక్షణ పరిశ్రమ ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి అది ఖచ్చితంగా ఒక కారణం. మరో కారణం, విజ్ఞానశాస్త్రం చక్కని సలహా ఇస్తుందని వ్యాప్తిలో ఉన్న నమ్మకం. విజ్ఞానశాస్త్రం మానవజీవితంలోని ప్రతీ అంశాన్ని మెరుగుపరచగలదని 19వ శతాబ్దపు చివరిభాగానికల్లా అమెరికా ప్రజలు నమ్మడం ప్రారంభించారు. అది పిల్లలను పెంచడానికి ఉపయోగించే పద్ధతులను కూడా మెరుగుపరచగలదని వారనుకున్నారు. కాబట్టి, 1899లో పిల్లలను పెంచే విషయంలో “తల్లిదండ్రుల అసమర్థత” గురించి అమెరికన్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మదర్స్ బహిరంగంగా విచారం వ్యక్తం చేసినప్పుడు, ఎంతోమంది “వైజ్ఞానిక నిపుణులు” వేగంగా తెరమీదకు వచ్చారు. పిల్లలను పెంచేందుకు కష్టపడుతున్న తల్లిదండ్రులకు సహాయం చేస్తామని వారు వాగ్దానం చేశారు.
సలహా కోసం పుస్తకాలను చూడడం
అయినా, ఈ నిపుణులు ఏమి సాధించారు? పిల్లలను పెంచే విషయంలో నేటి తల్లిదండ్రుల చింతలు ముందరికాలాల వారికన్నా తక్కువగా ఉన్నాయా, వారు ముందరికాలాల వారికన్నా ఎక్కువగా నైపుణ్యాలు సంపాదించారా? లేదని ఇటీవల బ్రిటన్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వెల్లడిచేసింది. చిన్నపిల్లలున్న దాదాపు 35 శాతంమంది తల్లిదండ్రులు నమ్మదగిన సలహా కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారని అది వెల్లడిచేసింది. తమకున్న సహజ జ్ఞానాన్ని పాటించడం తప్ప తమకు మరో మార్గంలేదని ఇతరులు భావిస్తున్నారు.
రెయిజింగ్ అమెరికా: ఎక్స్‌పర్ట్స్, పేరెంట్స్, అండ్ ఎ సెంచరీ ఆఫ్ అడ్వైస్ అబౌట్ చిల్డ్రన్ అనే తన పుస్తకంలో యాన్ హాల్బర్ట్, పిల్లలను పెంచడం గురించి నిపుణులు ప్రచురించిన సాహిత్యాలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేసింది. స్వయంగా ఇద్దరి పిల్లలకు తల్లిగావున్న హాల్బర్ట్, కేవలం కొద్దిమంది నిపుణుల నిర్ధారణలే నిరూపించబడిన విజ్ఞానశాస్త్రం మీద ఆధారపడివున్నాయని చెబుతోంది. నిజానికి, వారి సలహా వాస్తవ సమాచారాన్నిబట్టి కాక, తమ సొంత జీవితానుభవాన్నిబట్టి ప్రభావితం చెందినట్లు కనిపిస్తోంది. ఒక్కసారి సింహావలోకనం చేస్తే, వారు రాసిన అనేక విషయాలు వేలంవెర్రిగా, పరస్పర విరుద్ధమైనవిగా, కొన్నిసార్లు ఎంతో వింతగా అనిపిస్తాయి.
కాబట్టి, నేడు తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? నిజం చెప్పాలంటే, గతానికన్నా ఇప్పుడు అనేక సలహాలు, అభిప్రాయాలు, వివాదాలు తమ ముందు ఉన్నాయి కాబట్టి, చాలామంది గందరగోళంలో ఉన్నారు. అయితే, తమకు మార్గనిర్దేశంలేదని తల్లిదండ్రులందరూ అనుకోవడంలేదు. తర్వాతి ఆర్టికల్ చూపిస్తున్నట్లుగా, నమ్మదగిన సలహాకు మూలంగా ఇప్పటికీ నిరూపించబడుతున్న జ్ఞానాన్ని అందించే ప్రాచీన గ్రంథం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ప్రయోజనం పొందుతున్నారు.